ఐక్యరాజ్యసమితి: కరోనా ప్రతికూల సవాళ్లలోనూ భారత్ 2020లో 64 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించింది. 2019తో పోల్చితే 25 శాతం పైగా (51 బిలియన్ డాలర్ల నుంచి) పెరిగినట్లు వివరించింది. ఐక్యరాజ్యసమితి (ఐరాస) నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. తద్వారా అత్యధిక ఎఫ్‌డీఐలు ఆకర్షించిన ప్రపంచదేశాల్లో భారత్ ఐదవ స్థానంలో నిలిచినట్లు పేర్కొంది. కోవిడ్–19 సెకండ్ వేవ్ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ, ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నాయని విశ్లేషించింది.
ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఈ పటిష్ట ప్రధాన అంశాలు మధ్యకాలికంగా దేశాన్ని ‘‘ఆశావాదం దృక్పథం’’లో ఉంచుతున్నట్లు ఐక్యరాజ్యసమితి ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (యూఎన్‌సీటీఏడీ) 2021 వరల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ నివేదిక పేర్కొంది. దేశ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) పరిశ్రమ భారీ ఎఫ్‌డీఐలను ఆకర్షించినట్లు వివరించింది. దేశం ఎఫ్‌డీఐల ఆకర్షణ దీర్ఘకాలిక ధోరణిగా ఉంటుందని విశ్లేషించింది. ప్రత్యేకించి ఐసీటీ పరిశ్రమలో పెట్టుబడులు గణనీయంగా పెరుగుతాయని అంచనావేసింది. భారత్ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రస్తావిస్తూ, తయారీ, ఎగుమతి ఆధారిత పెట్టుబడుల పురోగతికి ఇది ఊతం ఇస్తుందని అభిప్రాయడపింది. ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్ వంటి ప్రాధాన్యతా రంగాల్లో పెట్టుబడులు పెరుగుతాయని అంచనావేసింది.
ప్రపంచవ్యాప్తంగా డౌన్...
మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎఫ్‌డీఐలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు నివేదిక వివరించింది. 2019తో పోల్చితే 2020లో ప్రపంచంలో ఎఫ్‌డీఐల విలువ 1.5 ట్రిలియన్ డాలర్ల నుంచి ట్రిలియన్ డాలర్లకు పడిపోయినట్లు ఐరాస పేర్కొంది. మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్‌కు మంచి డిమాండ్ ఏర్పడినట్లు తెలిపింది. ఈ పరిశ్రమలో ఎఫ్‌డీఐలు 22% పెరిగి 81 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. ఇక దక్షిణాసియాలో ఎఫ్‌డీఐలు 20% వృద్ధితో 71 బిలియన్ డాలర్లకు చేరినట్లు వివరించింది. కాగా దక్షిణాసియా నుంచి ఎఫ్‌డీఐలు 12 శాతం పడిపోయి 12 బిలియన్ డాలర్లకు పరిమితమయినట్లు తెలిపింది. భారత్‌లో పెట్టుబడులు భారీగా పడిపోవడం దీనికి కారణమని తెలిపింది. అయితే 2021లో భారత్‌లో పెట్టుబడులు స్థిరీకరణ సాధిస్తాయన్న విశ్వాసాన్ని వెలిబుచ్చింది. కాగా చైనాకు ఎఫ్‌డీఐలు 2020లో 6 శాతం పెరిగి 149 బిలియన్‌లకు చేరినట్లు నివేదిక పేర్కొంది.
భారత్‌కు 64 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు
Published Tue, Jun 22 2021 1:41 AM | Last Updated on Tue, Jun 22 2021 2:15 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment