global trend
-
గ్లోబల్ ట్రెండ్, ఎఫ్‌పీఐలే కీలకం.. ఈ వారం మార్కెట్ దిశపై నిపుణుల అంచనాలు
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను పలు అంశాలు ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు సెంటిమెంటును ప్రభావితం చేయగలవని తెలియజేశారు. ఇటీవల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ఎఫ్‌పీఐ పెట్టుబడులకూ ప్రాధాన్యమున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసిక(ఏప్రిల్–జూన్) ఫలితాల సీజన్ ముగింపునకు చేరడంతో ఇకపై ఇన్వెస్టర్లు ఇతర అంశాలపై దృష్టి సారించనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ వివరించారు. జియో ఫైనాన్స్ లిస్టింగ్ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ప్రత్యేక కంపెనీగా విడివడిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో నేడు(సోమవారం) లిస్ట్‌కానుంది. దేశీ ఎన్బీఎఫ్సీలలో రెండో పెద్ద కంపెనీగా ఆవిర్భవించిన సంస్థపై పలువురు కన్నేయనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. వెరసి ఈ కౌంటర్లో భారీ ట్రేడింగ్ యాక్టివిటీకి వీలున్నట్లు అంచనా వేశారు. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ కదలికలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టేందుకు కారణంకానున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్ధ్ ఖేమ్కా పేర్కొన్నారు. మార్కెట్ల ట్రెండ్‌లోని ఇన్వెస్టర్ల దృష్టి కొన్ని రంగాల నుంచి మరికొన్ని రంగాలవైపు మళ్లడం సహజమన్నారు. విదేశీ పరిస్థితులు: యూఎస్‌లో గృహ విక్రయాలు, ఉపాధి గణాంకాలకు మార్కెట్లు స్పందించనున్నట్లు మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అర్విందర్ సింగ్ నందా పేర్కొన్నారు. అంతేకాకుండా యూరోజోన్, ఎస్అండ్పీ గ్లోబల్ కాంపోజిట్ పీఎంఐ గణాంకాలూ ప్రభావం చూపనున్నట్లు విశ్లేషించారు. ఈ వారం గ్లోబల్ గణాంకాలకుతోడు యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ ప్రసంగానికి సైతం ప్రాధాన్యత ఉన్నట్లు ప్రస్తావించారు. ఇక దేశీయంగా రిజర్వ్ బ్యాంక్ గత పాలసీ వివరాలు(మినిట్స్) వెలువడనున్నట్లు ప్రస్తావించారు. ఇతర అంశాలపైనా కన్ను అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, రుతుపవన పురోగతి సైతం దేశీ మార్కెట్ల ట్రెండ్‌కు కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇటీవల యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ దూ కుడు చూపుతుండటంతో ఇకపై విదేశీ పెట్టుబడులు పరిమితంకావచ్చని, ఇది మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపే వీలున్నదని జియోజిత్ ఫైనా న్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ అభిప్రాయపడ్డారు. గత వారం పారిశ్రామికోత్పత్తి, టో కు ధరల ద్రవ్యోల్బణం వెనకడుగు, ఇదే సమయంలో రిటైల్ ధరల వేడి వంటి అంశాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచినట్లు పేర్కొన్నారు. కాగా.. యూస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలకుతోడు పటిష్ట రిటైల్ అమ్మకాలు, చైనా కేంద్ర బ్యాంకు అనూహ్య రేట్ల కోత వంటి అంశాలతో గత వారం సెంటిమెంటు బలహీనపడింది. దీంతో మార్కెట్లు ఆటుపోట్ల మధ్య స్వల్ప నష్టాలతో ముగిశాయి. చైనా మందగమనం, అభివృద్ధి చెందిన దేశాల వడ్డీ రేట్ల పెంపు అంచనాలు ఇందుకు కారణమయ్యా యి. సెన్సెక్స్ నికరంగా 374 పాయింట్లు(0.6 %) క్షీణించి 64,949 వద్ద స్థిరపడింది. వెరసి 65,000 స్థాయి దిగువకు చేరగా.. నిఫ్టీ 118 పాయింట్లు(0.6 శాతం) నీరసించి 19,310 వద్ద నిలిచింది. -
భారత్‌కు 64 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు
ఐక్యరాజ్యసమితి: కరోనా ప్రతికూల సవాళ్లలోనూ భారత్ 2020లో 64 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించింది. 2019తో పోల్చితే 25 శాతం పైగా (51 బిలియన్ డాలర్ల నుంచి) పెరిగినట్లు వివరించింది. ఐక్యరాజ్యసమితి (ఐరాస) నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. తద్వారా అత్యధిక ఎఫ్‌డీఐలు ఆకర్షించిన ప్రపంచదేశాల్లో భారత్ ఐదవ స్థానంలో నిలిచినట్లు పేర్కొంది. కోవిడ్–19 సెకండ్ వేవ్ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ, ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నాయని విశ్లేషించింది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఈ పటిష్ట ప్రధాన అంశాలు మధ్యకాలికంగా దేశాన్ని ‘‘ఆశావాదం దృక్పథం’’లో ఉంచుతున్నట్లు ఐక్యరాజ్యసమితి ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (యూఎన్‌సీటీఏడీ) 2021 వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ నివేదిక పేర్కొంది. దేశ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) పరిశ్రమ భారీ ఎఫ్‌డీఐలను ఆకర్షించినట్లు వివరించింది. దేశం ఎఫ్‌డీఐల ఆకర్షణ దీర్ఘకాలిక ధోరణిగా ఉంటుందని విశ్లేషించింది. ప్రత్యేకించి ఐసీటీ పరిశ్రమలో పెట్టుబడులు గణనీయంగా పెరుగుతాయని అంచనావేసింది. భారత్ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రస్తావిస్తూ, తయారీ, ఎగుమతి ఆధారిత పెట్టుబడుల పురోగతికి ఇది ఊతం ఇస్తుందని అభిప్రాయడపింది. ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్ వంటి ప్రాధాన్యతా రంగాల్లో పెట్టుబడులు పెరుగుతాయని అంచనావేసింది. ప్రపంచవ్యాప్తంగా డౌన్... మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎఫ్‌డీఐలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు నివేదిక వివరించింది. 2019తో పోల్చితే 2020లో ప్రపంచంలో ఎఫ్‌డీఐల విలువ 1.5 ట్రిలియన్ డాలర్ల నుంచి ట్రిలియన్ డాలర్లకు పడిపోయినట్లు ఐరాస పేర్కొంది. మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్‌కు మంచి డిమాండ్ ఏర్పడినట్లు తెలిపింది. ఈ పరిశ్రమలో ఎఫ్‌డీఐలు 22% పెరిగి 81 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. ఇక దక్షిణాసియాలో ఎఫ్‌డీఐలు 20% వృద్ధితో 71 బిలియన్ డాలర్లకు చేరినట్లు వివరించింది. కాగా దక్షిణాసియా నుంచి ఎఫ్‌డీఐలు 12 శాతం పడిపోయి 12 బిలియన్ డాలర్లకు పరిమితమయినట్లు తెలిపింది. భారత్‌లో పెట్టుబడులు భారీగా పడిపోవడం దీనికి కారణమని తెలిపింది. అయితే 2021లో భారత్‌లో పెట్టుబడులు స్థిరీకరణ సాధిస్తాయన్న విశ్వాసాన్ని వెలిబుచ్చింది. కాగా చైనాకు ఎఫ్‌డీఐలు 2020లో 6 శాతం పెరిగి 149 బిలియన్లకు చేరినట్లు నివేదిక పేర్కొంది. -
పెట్రోల్, డీజిల్ ధరలపై గుడ్‌న్యూస్..!
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు గత కొన్ని రోజుల నుంచి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో 19 రోజుల పాటు స్తబ్ధుగా ఉన్న అనంతరం వరుసగా 13 రోజుల నుంచి మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ ధరలు పెరుగుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడమేనని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. బ్యారల్‌కు 80 డాలర్ల గరిష్ట స్థాయికి చేరిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు ప్రస్తుతం 2.42 డాలర్లు తగ్గి, 76.37 డాలర్లుగా నమోదైంది. దీంతో ఇక దేశీయంగా కూడా ఇంధన ధరలు తగ్గే అవకాశాలున్నాయని, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రస్తుతం మారుతున్న ధరలు, గ్లోబల్ ట్రెండ్ మాదిరిగా వచ్చే రోజుల్లో తగ్గబోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ఇంధన ధరలు తగ్గితే, వాటి ప్రయోజనాలను వెంటనే వినియోగదారులకు చేరేలా కేంద్రం రోజువారీ ధరల సమీక్ష చేపట్టింది. ఈ రోజువారీ ధరల సమీక్ష చేపట్టినప్పటి నుంచి ఇంధన ధరలు పెరగడమే కానీ, తగ్గుదల మాత్రం చాలా అరుదుగా సంభవించింది. అందుకు కారణం కూడా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడమే. ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నందున్న, దేశీయంగా కూడా వినియోగదారులు గుడ్‌న్యూస్‌ను వినబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాక కాకపుట్టిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ఇటు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నెలకొంటోంది. దీంతో కేంద్రం సైతం పెట్రోల్, డీజిల్ ధరలపై త్వరలోనే ఒక దీర్ఘకాలిక పరిష్కారాన్ని కనుగొనబోతుంది. నేడు పెట్రోల్ ధర లీటరుకు ఢిల్లీలో రూ.77.97గా, కోల్‌కతాలో రూ.80.61గా, ముంబైలో రూ.85.78గా, చెన్నైలో రూ.80.95గా, హైదరాబాద్‌లో రూ.82.60గా ఉంది. డీజిల్ ధర లీటరుకు ఢిల్లీలో రూ.68.90గా, కోల్‌కతాలో రూ.71.45గా, ముంబైలో రూ.73.36గా, చెన్నైలో రూ.72,74గా, హైదరాబాద్‌లో రూ.74.89గా రికార్డైంది. -
జీడీపీ డేటా, గ్లోబల్ ట్రెండ్‌పై దృష్టి
ప్రభావిత అంశాలు * చివరిబ్యాచ్ త్రైమాసిక ఫలితాలు * రుతుపవనాల గమనం * ఆటో కంపెనీల అమ్మకాల గణాంకాలు * రూపాయి కదలికలు ముంబై: త్వరలో విడుదలయ్యే జీడీపీ గణాంకాలు, అంతర్జాతీయ ట్రెండ్‌పై ఈ వారం ఇన్వెస్టర్లు దృష్టిపెడతారని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అలాగే చివరిబ్యాచ్ త్రైమాసిక ఫలితాలు, రుతుపవనాల గమనం తదితర అంశాలు కూడా దేశీయ మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని వారన్నారు. 2016 జనవరి-మార్చి త్రైమాసికానికి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు ఈ మంగళవారం వెలువడతాయి. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) తీరుతెన్నులు, ద్రవ్యలోటు పరిస్థితి, ఎనిమిది మూలధాన పరిశ్రమల డేటా కూడా ఈ వారం ప్రకటితమవుతాయని, ఇవన్నీ కూడా మార్కెట్‌ను హెచ్చుతగ్గులకు గురిచేస్తుందని జియోజిత్ బీఎన్పీ పారిబాస్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ తెలిపారు. జూన్ 1న వెలువడే ఆటోమొబైల్ కంపెనీల మే నెల అమ్మకాల డేటా ఆయా షేర్లను హెచ్చు తగ్గులకు లోనుచేస్తుందని విశ్లేషకులు పేర్కొన్నారు. టాటా మోటార్స్, ఎన్టీపీసీ, మహింద్రా అరబిందో వంటి బ్లూచిప్ కంపెనీల ఫలితాలు ఈ వారమే వెలువడనున్నాయి. చివరిబ్యాచ్ కార్పొరేట్ ఫలితాలు, రూపాయి కదలికలు, ముడిచమురు ధర తదితరాల్ని ఇన్వెస్టర్లు రానున్నరోజుల్లో నిశితంగా గమనిస్తారని అంచనా. ఫెడ్ నిర్ణయం కీలకం... వడ్డీ రేట్లను క్రమేపీ పెంచుతామంటూ అమెరికా కేంద్ర బ్యాంక్ ఛైర్పర్సన్ జెనెట్ యెలెన్ గత శుక్రవారం ఇచ్చిన సంకేతాలకు ఈ సోమవారం ఇన్వెస్టర్ల స్పందనతో మార్కెట్ మొదలవుతుందని ట్రేడ్‌స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. గతవారం మార్కెట్... గతవారం సెన్సెక్స్ 1,351 పాయింట్ల పెరుగుదలతో 26,653 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 407 పాయింట్లు ఎగిసి 8,157 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మార్చి 4 తర్వాత ఒకే వారంలో సూచీలు ఇంత అధికంగా పెరగడం ఇదే తొలిసారి. మే నెలలో ఇప్పటివరకూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత స్టాక్ మార్కెట్లో రూ. 1,495 కోట్ల నికర పెట్టుబడులు చేశారు. అయితే ఇదే సమయంలో డెట్ మార్కెట్ నుంచి రూ. 6,000 కోట్లు ఉపసంహరించుకున్నారు. రూపాయి బలహీనత, ఫెడ్ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలతో డెట్ మార్కెట్లో ఎఫ్‌పీఐలు విక్రయాలు జరిపినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.