న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను పలు అంశాలు ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు సెంటిమెంటును ప్రభావితం చేయగలవని తెలియజేశారు. ఇటీవల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ఎఫ్‌పీఐ పెట్టుబడులకూ ప్రాధాన్యమున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసిక(ఏప్రిల్–జూన్) ఫలితాల సీజన్ ముగింపునకు చేరడంతో ఇకపై ఇన్వెస్టర్లు ఇతర అంశాలపై దృష్టి సారించనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ వివరించారు.
జియో ఫైనాన్స్ లిస్టింగ్
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ప్రత్యేక కంపెనీగా విడివడిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో నేడు(సోమవారం) లిస్ట్‌కానుంది. దేశీ ఎన్‌బీఎఫ్‌సీలలో రెండో పెద్ద కంపెనీగా ఆవిర్భవించిన సంస్థపై పలువురు కన్నేయనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. వెరసి ఈ కౌంటర్లో భారీ ట్రేడింగ్ యాక్టివిటీకి వీలున్నట్లు అంచనా వేశారు. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ కదలికలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టేందుకు కారణంకానున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్ధ్ ఖేమ్కా పేర్కొన్నారు. మార్కెట్ల ట్రెండ్‌లోని ఇన్వెస్టర్ల దృష్టి కొన్ని రంగాల నుంచి మరికొన్ని రంగాలవైపు మళ్లడం సహజమన్నారు.
విదేశీ పరిస్థితులు: యూఎస్‌లో గృహ విక్రయాలు, ఉపాధి గణాంకాలకు మార్కెట్లు స్పందించనున్నట్లు మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అర్విందర్ సింగ్ నందా పేర్కొన్నారు. అంతేకాకుండా యూరోజోన్, ఎస్‌అండ్‌పీ గ్లోబల్ కాంపోజిట్ పీఎంఐ గణాంకాలూ ప్రభావం చూపనున్నట్లు విశ్లేషించారు. ఈ వారం గ్లోబల్ గణాంకాలకుతోడు యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ ప్రసంగానికి సైతం ప్రాధాన్యత ఉన్నట్లు ప్రస్తావించారు. ఇక దేశీయంగా రిజర్వ్ బ్యాంక్ గత పాలసీ వివరాలు(మినిట్స్) వెలువడనున్నట్లు ప్రస్తావించారు.
ఇతర అంశాలపైనా కన్ను
అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, రుతుపవన పురోగతి సైతం దేశీ మార్కెట్ల ట్రెండ్‌కు కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇటీవల యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ దూ కుడు చూపుతుండటంతో ఇకపై విదేశీ పెట్టుబడులు పరిమితంకావచ్చని, ఇది మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపే వీలున్నదని జియోజిత్ ఫైనా న్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ అభిప్రాయపడ్డారు. గత వారం పారిశ్రామికోత్పత్తి, టో కు ధరల ద్రవ్యోల్బణం వెనకడుగు, ఇదే సమయంలో రిటైల్ ధరల వేడి వంటి అంశాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచినట్లు పేర్కొన్నారు.
కాగా.. యూస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలకుతోడు పటిష్ట రిటైల్ అమ్మకాలు, చైనా కేంద్ర బ్యాంకు అనూహ్య రేట్ల కోత వంటి అంశాలతో గత వారం సెంటిమెంటు బలహీనపడింది. దీంతో మార్కెట్లు ఆటుపోట్ల మధ్య స్వల్ప నష్టాలతో ముగిశాయి. చైనా మందగమనం, అభివృద్ధి చెందిన దేశాల వడ్డీ రేట్ల పెంపు అంచనాలు ఇందుకు కారణమయ్యా యి. సెన్సెక్స్ నికరంగా 374 పాయింట్లు(0.6 %) క్షీణించి 64,949 వద్ద స్థిరపడింది. వెరసి 65,000 స్థాయి దిగువకు చేరగా.. నిఫ్టీ 118 పాయింట్లు(0.6 శాతం) నీరసించి 19,310 వద్ద నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment