![Markets are in turmoil and consolidation this week](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/market-.jpg.webp?itok=pEFCHyy5)
భారీ హెచ్చుతగ్గుల మధ్య గతవారం మార్కెట్లు ముందుకే సాగాయి. ఓపక్క కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో మార్కెట్ వర్గాలకు పెద్దగా ప్రయోజనం కలక్కపోయినా... ఆదాయపు పన్ను పరంగా తీసుకున్న ప్రోత్సాహక చర్యలు సూచీలను ముందుకు నడిపించాయి. మరోపక్క కార్పొరేట్ ఫలితాలు ఇబ్బంది పెట్టినప్పటికీ... చివరకు ఇండెక్స్ లు కొంత తేరుకున్నట్లే కనిపించాయి. అదీగాక కెనడా, మెక్సికోలపై విధించిన సుంకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన ప్రకటన సానుకూల ప్రభావాన్ని చూపించింది. వారం మధ్యలో ఆర్బీఐ పాలసీకి ముందు మార్కెట్లు కొంత ఒత్తిడికి గురయ్యాయి.
అందరూ ఊహించినట్లే... వారాంతాన వడ్డీరేట్లు తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం సంతృప్తికరంగానే ఉన్నా... భవిష్యత్ విధానాల విషయంలో "తటస్థ" ధోరణి (అంటే రాబోయే రోజుల్లోనూ ఇలా కోతలు ఉండొచ్చన్న అంచనాలకు విరుద్ధంగా) కొనసాగించడం మార్కెట్ వర్గాలకు రుచించలేదు. దీంతో అమ్మకాల ఒత్తిడి ఎక్కువైంది. ఇంకోపక్క విదేశీ సంస్థాగత మదుపర్లు యధావిధిగా తమ అమ్మకాలను కొనసాగించారు. అదే సమయంలో రూపాయి బలహీనతలూ మార్కెట్లను వేధించాయి. చమురు ధరలు కాస్త చల్లబడటం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. మొత్తానికి గతవారం సెన్సెక్స్, నిఫ్టీ లు దాదాపు 0.33 శాతం దాకా పెరిగాయి. వారం మొత్తానికి సెన్సెక్స్ 354 పాయింట్లు పెరిగి 77860 వద్ద, నిఫ్టీ 78 పాయింట్లు లాభపడి 23560 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ మిడ్క్యాప్, స్మాల్ క్యాప్, బ్యాంకు నిఫ్టీలు కూడా లాభాల్లోనే సాగాయి.
ఈవారం
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం మార్కెట్లపై కొంత సానుకూల ప్రభావం చూపించొచ్చు. సోమవారం మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావొచ్చు. అయితే ఈ ధోరణి పూర్తిగా కొనసాగుతుందా... అన్నది సందేహమే. మార్కెట్లు మరీ తీవ్ర స్థాయిలో ప్రభావితం చేసే సంఘటనలేవీ ఈవారం లేనప్పటికీ... మనతో పాటు అమెరికా వెలువరించే ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కామెంట్లు, సుంకాల విషయంలో ఎప్పుడు ఏ రీతిన వ్యవహరిస్తాడో తెలియని ట్రంప్ ధోరణి... కొంతమేర శాసించొచ్చు. పెద్ద ప్రభావిత అంశాలు లేకపోవడంతో... మార్కెట్లు ఈవారమంతా స్వల్ప స్థాయుల్లోనే కదలాడుతూ.. కన్సాలిడేట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక కార్పొరేట్ ఫలితాలు చివరి దశకు వచ్చేశాయి. ఈవారంతో మిగిలిన ప్రధాన కంపెనీలు కూడా తమ మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించడం ద్వారా ఈ అంకం కూడా పూర్తవుతుంది. ఇక రంగాలవారీగా ఆయా సెక్టార్లకు సంబంధించి వెలువడే ప్రకటనలు సంబంధిత రంగాల షేర్లను ప్రభావితం చేస్తాయి. అదే సమయంలో మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో ఒడుదొడుకులు కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈమధ్య కాలంలో విదేశీ మదుపర్ల నిరంతర అమ్మకాలు మార్కెట్లకు పెనుశాపంగా మారాయి. ఈ ధోరణి ఈవారం కూడా కొనసాగవచ్చు.
ఆర్ధిక ఫలితాల కంపెనీలు
దాదాపు 2000 కు పైగా కంపెనీలు ఈవారం ఆర్ధిక ఫలితాలను ప్రకటించబోతున్నాయి. దీంతో ఫలితాల ఘట్టం పూర్తవుతుంది. ఫలితాల ద్వారా ఈవారం మార్కెట్లపై అధిక స్థాయిలో ప్రభావితం చూపగల కంపెనీల్లో అపోలో హాస్పిటల్స్, హిందాల్కొ ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, లుపిన్, సీమెన్స్, ఎస్కార్ట్స్, నేషనల్ అల్యూమినియం, ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్, ఆదిత్య బిర్లా ఫ్యూచర్ రిటైల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నాయి. తర్వాతి స్థానంలో పతంజలి ఫుడ్స్, వరుణ్ బెవరేజెస్, బాటా ఇండియా, ఇంజనీర్స్ ఇండియా, జూబిలెంట్ ఫుడ్స్, దిలీప్ బిల్డకాన్, నారాయణ హృదయాలయ వంటి కంపెనీలు ఉన్నాయి.
విదేశీ మదుపర్లు
మన మార్కెట్లలో నిరంతర అమ్మకాలు కొనసాగిస్తున్న విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) గత జనవరి నెల మొత్తానికి రూ. 87,000 కోట్ల విక్రయాలు జరిపిన విషయం తెల్సిందే. వీరు ఫిబ్రవరి నెలలో ఇప్పటివరకు రూ. 10,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీయ మదుపర్లు మాత్రం యధావిధిగా మార్కెట్ కు మద్దతుగా నిలిచారు. వీరు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 7,200 కోట్ల నికర కొనుగోళ్లతో మార్కెట్ ను ఆదుకునే ప్రయత్నాలు చేశారు.
సాంకేతిక స్థాయిలు
నిఫ్టీ 23700-800 ని బ్రేక్ చేయనంతవరకు పెద్ద మార్పులేవీ ఉండకపోవచ్చు. ముందుకెళ్లాలన్నా, మరింత పడిపోవాలన్నా ఇది కీలక స్థాయి. ఇదే స్థాయిల్లో చలిస్తున్నంత కాలం.. సూచీలు కన్సాలిడేషన్ లో కొనసాగుతాయి. మార్కెట్లలో ప్రస్తుతానికి సానుకూల సంకేతాలు అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి. 24000 పాయింట్ల వద్ద పెద్ద నిరోధం ఉంది. దీన్ని దాటుకుని ముందుకు వెళ్తేనే... 24200 స్థాయిని టెస్ట్ చేయవచ్చు. అలాకాకుండా నిఫ్టీ 23500 పైన ఉన్నంతవరకు ఫర్వాలేదు కానీ దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం అప్రమత్తమవ్వాల్సిందే. అప్పుడు 23200 వద్ద మార్కెట్ కు సపోర్ట్ లభిస్తుంది. దాన్ని కూడా ఛేదించి పడిపోతే 23000, 22800 వద్ద మార్కెట్ కు మద్దతు లభించొచ్చు. రంగాలవారీగా చూస్తే... బ్యాంకింగ్ షేర్లు బలహీనంగా ట్రేడయ్యే అవకాశముంది. సిమెంట్, ఫార్మా, ఎఫెమ్సీజీ రంగాల్లో కొనుగోళ్ళకు అవకాశం ఉండగా, టెలికాం, కేపిటల్ గూడ్స్, ఆటోమొబైల్, మెటల్స్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి ఎదురుకావొచ్చు. ఇక మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ గత వారాంతానికి 2.91 శాతం క్షీణించి 13.69 దగ్గర ఉంది. ప్రస్తుతానికి మార్కెట్ బుల్స్ కు అనుకూలంగా ఉందనేందుకు ఇది నిదర్శనం.
-బెహరా శ్రీనివాస రావు,
స్టాక్ మార్కెట్ విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment