కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) గారి హల్వా (halwa) వంటకం పూర్తయింది. జనాలకి రుచి చూపించడమే తరువాయి. హల్వా అంటేనే తీపి పదార్ధం. కానీ ఆర్ధిక మంత్రి గారి హల్వాకి మాత్రం రకరకాల రుచులుంటాయి. ఒకరికి తీపి, ఇంకొకరికి చేదు, మరొకరికి చప్పగా... మొత్తమ్మీద అందరూ రుచి చూడాల్సిందే... వంటకం మొన్నే పూర్తయినా... రుచి చూపించేది మాత్రం ఫిబ్రవరి 1నే.
2025-26 ఆర్ధిక సంవత్సరానికి నరేంద్రం మోదీ నేతృత్వంలో ముచ్చటగా మూడోసారి కేంద్రంలో కొలువు తీరిన ఎన్డీయే ప్రభుత్వం తొలి బడ్జెట్ (budget 2025) ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 న ప్రారంభమవుతాయి. ఆరోజు మొదట ఎకనామిక్ సర్వే ను ప్రభుత్వం విడుదల చేస్తుంది. గత ఆర్ధిక సంవత్సరం తాలూకు వివిధ రంగాల్లో ప్రభుత్వం సాధించిన పురోగతి, లక్ష్యాలు, ఆర్ధిక వనరులు, భవిష్యత్ అవకాశాలతో సమ్మిళితమైన ఈ సర్వే బడ్జెట్ కు ఒక దిక్సూచిగా నిలుస్తుంది.
ఆమర్నాడు అంటే ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 8 వ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెడతారు. వాస్తవానికి మనం బడ్జెట్ అని వ్యవహరిస్తున్నప్పటికీ... దీన్ని ఫైనాన్స్ బిల్ గా భావించాలి. సాధారణ పన్ను చెల్లింపుదారులు మొదలుకొని... ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్, ఇన్సూరెన్సు, ఫైనాన్స్, ఆటోమొబైల్, బ్యాంకింగ్... ఇలా వివిధ రంగాలు ఈ బడ్జెట్ కోసం ఎదురుతెన్నులు చూస్తూ ఉంటాయి.
ఆర్ధిక మంత్రి ఎలాంటి ప్రకటనలు చేస్తారు? అవి కలగజేసే ప్రయోజనం, చోటుచేసుకోబేయే మార్పులు... ఇత్యాది అంశాలను విశ్లేషిస్తూ భవిష్యత్ మార్పులకు ఆయా రంగాలు సిద్ధమవుతాయి. వాస్తవానికి బడ్జెట్ కసరత్తు ప్రారంభం కావడానికి ముందే ఆర్ధిక మంత్రి ఆయా రంగాల వారితో సమావేశమై వారి విజ్ఞప్తులు, ఆకాంక్షలు, డిమాండ్లను లుసుకున్నారు. కోరికలు, డిమాండ్లు ఎక్కువగానే ఉండటం సహజం, అయితే ఈ బడ్జెట్ లో వాటిలో ఎన్ని నెరవారుతాయో నాన్న ఆసక్తితో పరిశ్రమ వర్గాలు ఎదురుచూస్తూ ఉంటాయి.
జనవరి 31 న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల తొలివిడత ఫిబ్రవరి 13 న ముగుస్తుంది. రెండో విడత సమావేశాలు మార్చి 10 న ప్రారంభమై ఏప్రిల్ 4 న ముగుస్తాయి. ఈ రెండు విడతల సమావేశాల్లోనూ పార్లమెంట్లో విస్తృత స్థాయిలో వాదోపవాదాలు జరుగుతాయి. విపక్షాల ఎదురుదాడిని తట్టుకుంటూనే ప్రభుత్వం తన వాదనలు సమర్ధించుకునే యత్నాలు చేస్తుంది. ఒక్కోసారి సాధారణ, కార్పొరేట్, వాణిజ్య, పారిశ్రామిక రంగాల అసంతృప్తుల్ని పరిగణనలోకి తీసుకుంటూ తగిన మార్పులు చేస్తుంది. ఇలా చేసిన బడ్జెట్ (ఫైనాన్స్ బిల్లు) కు లోక్ సభ, రాజ్య సభ ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదానికి వెళ్తుంది. అక్కడ కూడా లాంఛనం పూర్తయ్యాక కొత్త ఆర్ధిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.
ఈ బడ్జెట్ పై ఎన్నో వర్గాలు రకరకాల ఆశలు పెట్టుకుంటాయి. ముఖ్యంగా బడ్జెట్ వస్తున్న ప్రతిసారీ ఎన్నో ఆశలతో ఎదురుచూస్తూ... చివరకు నిట్టూర్పులు విడిచే వర్గం ఒకటి ఉంది. వారే పన్ను చెల్లింపుదారులు.ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు చేయాలని, ట్యాక్ రిబేటులు పెంచాలని వీరు ఎదురుచూస్తూ ఉంటారు. అలాగే కార్పొరేట్ వర్గాలు తమ తమ రంగాలకు దక్కే ప్రయోజనాలకోసం డిమాండ్ చేస్తూ ఉంటాయి.
స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయ్యే వేళ.. అంటే 2047 నాటికి వికసిత భారత్ (అభివృద్ధి చెందిన భారత దేశం) నినాదంతో నరేంద్ర మోదీ సర్కారు లక్ష్యాలు నిర్దేశించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పుడు భారత్.. యువరక్తంతో ఉరకలేస్తోందని, రాబోయే 30 - 40 ఏళ్ళు మనవేనని, ప్రపంచమంతా మనవైపే ఆతృతగా ఎదురుచూస్తోంది ప్రధాన మంత్రి మోదీ చెబుతూ వస్తున్నారు. మరి ప్రధాని మాటలు కార్యరూపం దాల్చాలంటే అందుకు అనుగుణమైన కసరత్తు ఇప్పటినుంచీ జరగాలి. మోదీ 3.O లో వెలుగు చూడబోయే బడ్జెట్ ఇందుకు వేదికగా నిలవాలి.
2023 - 24 లో 8.2 శాతం వృద్ధి సాధించిన భారత ఆర్ధిక వ్యవస్థ... 2024 -25 లో 6 .5 శాతం వృద్ధికే పరిమితం కావచ్చనే అంచనాలున్నాయి. ఈనేపథ్యంలో జీడీపీ వృద్ధిని పెంచే దిశగా బడ్జెట్లో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం అవసరం. జాతీయ రహదారుల విస్తరణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, తాగు నీరు, పారిశుద్ధ్యం, విద్య, వైద్య, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలి.
మోదీ నేతృత్వంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రవేశపెడుతున్న తొలి పూర్తి బడ్జెట్ ఇదే. ఇప్పుడిప్పుడే ఎన్నికలు ఏమీ లేవు, కాబట్టి ఎన్నికల అనుకూల బడ్జెట్ గా ఉదారంగా వ్యవహరించే అవకాశం లేదు కాబట్టి తాజా బడ్జెట్ లో కొంత కరమైన నిర్ణయాలే వెలువడే అవకాశం ఉంది. రాబోయే బడ్జెట్ నుంచి ఏయే వర్గాలు ఏమేమి ఆశిస్తున్నాయో.. రాబోయే కథనాల్లో వివరంగా చర్చిద్దాం.
స్టాక్ మార్కెట్
ఈసారి బడ్జెట్ వచ్చేది శనివారం. వాస్తవానికి ఆరోజు స్టాక్ మార్కెట్లు పనిచేయవు. కానీ బడ్జెట్ నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహించాలని స్టాక్ ఎక్స్చేంజిలు నిర్ణయించాయి. ఆరోజు యధావిధిగా స్టాక్ మార్కెట్లు ఉదయం 9.15 కి ప్రారంభమై మధ్యాహ్నం మూడున్నర వరకు కొనసాగుతాయి. బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతాయి. బడ్జెట్ వెలువడే సమయంలోనూ... ముఖ్యంగా ఆర్ధిక మంత్రి రెండో పార్ట్ (ట్యాక్స్‌లకు సంబంధించి) చదివే వేళ మార్కెట్లో ఈ హెచ్చుతగ్గులు తారాస్థాయికి చేరతాయి.
ఆ తర్వాత విశ్లేషకులు, ఆర్ధిక నిపుణులు వెలువరించే అభిప్రాయాలను బట్టి మార్పులకు లోనవుతూ ఉంటాయి. కాబట్టి సగటు మదుపర్లు ప్రధానంగా ట్రేడర్లు ఆరోజు ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం. సాధ్యమైనంతవరకు ఆరోజు ట్రేడింగ్ కు దూరంగా ఉండటమే మేలు. అధిక స్థాయిలో లాభాలు రావడానికి ఎంత అవకాశం ఉందో భారీ నష్టాలు కళ్లజూసేందుకు కూడా అంతే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త.
-బెహరా శ్రీనివాస రావు
స్టాక్ మార్కెట్, ఆర్ధిక విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment