Behara Sreenivasa Rao
-
ఈవారం మార్కెట్లు ఎలా ఉండబోతాయంటే..
గతవారం సైతం మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. మార్కెట్లలో ఓ రకమైన భయాందోళనలు నెలకొన్నాయి. ఏమాత్రం కొనుగోళ్ల మద్దతు లభిస్తున్నా వెంటనే విదేశీ మదుపర్లు విక్రయాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుత పరిణామాలు గమనిస్తే మదుపర్లు ఇప్పట్లో తేరుకునే పరిస్థితులు కనిపించడం లేదు. అమెరికా వాణిజ్య విధానాల్లో స్పష్టత కొరవడటం, ముఖ్యంగా టారిఫ్‌ల విషయంలో ట్రంప్ ధోరణి అంతుచిక్కకపోవడం మార్కెట్లకు ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నిరుత్సాహకరంగా ఉండటమూ ప్రతికూలంగా మారింది. రూపాయి బలహీనతలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. గతవారం మొత్తానికి సెన్సెక్స్ 0.56%, నిఫ్టీ 0.51% శాతం క్షీణించాయి. సెన్సెక్స్ 425 పాయింట్లు నష్టపోయి పెరిగి 75311 వద్ద, నిఫ్టీ 117 పాయింట్లు కోల్పోయి 22795 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. బ్యాంకు నిఫ్టీ సైతం ఇందుకు మినహాయింపు కాదు. మరోపక్క నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 1.7 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 1.5 శాతం పెరిగాయి.ఈవారంఇప్పటికే మార్కెట్లు భారీ స్థాయిలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సాంకేతిక స్థాయులను పరిశీలిస్తే కచ్చితంగా ఈవారం సాంకేతిక మద్దతు లభించొచ్చు. ఇదే జరిగితే ఉపశమన ర్యాలీ ఖాయం. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఈనెల 28 న గణాంకాలు వెలువడతాయి. అలాగే ఈనెల 27 న అమెరికా జీడీపీ తాలూకు గణాంకాలు వెలువడనున్నాయి. ఇవి మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. నిరుద్యోగ డేటా కూడా ఈవారాంతంలో రానుంది. అమెరికా ఎకనామిక్ డేటా గతవారం అక్కడి మార్కెట్లను బాగా పడేసింది. దీని ప్రభావం సోమవారం వివిధ ఆసియా మార్కెట్లపై పడింది. చైనా, హాంకాంగ్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మన మార్కెట్లు కూడా ఈవారాన్ని నష్టాలతోనే ప్రారంభించొచ్చు. సాధారణంగా మధ్యాహ్నం ఒంటిగంటన్నర తర్వాత రంగంలోకి దిగి విస్తృత స్థాయిలో అమ్మకాలు జరిపే విదేశీ మదుపర్లు ఇప్పుడు రూటు మార్చారు. పొద్దున్న ట్రేడింగ్ ప్రారంభమైన అరగంటలోనే తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఒకసారి మార్కెట్లు పడిపోయాక రోజు మొత్తంలో మళ్లీ తేరుకోవడం చాలా కష్టమవుతోంది. షేర్లలో కదలికలు చాలా తక్కువ స్థాయిలో ఉంటున్నాయి. అదే సమయంలో సూచీల్లో మాత్రం విపరీతమైన ఒడుదొడుకులు కొనసాగుతున్నాయి. దీనివల్ల ట్రేడర్లకు భారీ నష్టాలే మిగులుతున్నాయి. ఈ ట్రెండ్‌ను గమనించి ముందుకెళ్లడం అవసరం.విదేశీ మదుపర్లువిదేశీ మదుపర్లు ఎటువంటి సానుకూల ప్రకటనలనూ పెద్దగా పట్టించుకోవడం లేదు. నిరంతర అమ్మకాలు కొనసాగిస్తూనే ఉన్నారు. చైనా మార్కెట్ వారికిప్పుడు ప్రోత్సాహకరంగా కనిపిస్తోంది. దీంతో వీరు మన మార్కెట్లో అమ్మకాలకు పాల్పడుతూ పెట్టుబడులను అటువైపు తరలిస్తున్నారు. గత జనవరి నెల మొత్తానికి వీరు రూ.87,000 కోట్ల విక్రయాలు జరిపిన విషయం తెల్సిందే. ఫిబ్రవరి నెలలో ఇప్పటివరకు రూ.36,976 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీయ మదుపర్లు మాత్రం యథావిధిగా మార్కెట్‌కు మద్దతుగా నిలిచారు. వీరు ఈ నెలలో ఇప్పటివరకు రూ.42,601 కోట్ల నికర కొనుగోళ్లతో మార్కెట్‌ను ఆదుకునే ప్రయత్నాలు చేశారు.సాంకేతిక స్థాయిలుఅడపాదడపా కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ నిఫ్టీ ఇప్పటికీ బేర్ ఆపరేటర్ల గుప్పిట్లోనే ఉందని చెప్పొచ్చు. సూచీలు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఈవారం కొంత కొనుగోళ్ల మద్దతు లభించే అవకాశాలు లేకపోలేదు. నిఫ్టీకి 23000-200 స్థాయి చాలా కీలకం. దీన్ని దాటి ముందుకెళ్తే మాత్రం తొలుత 23,400, ఆ తర్వాత 23,600 స్థాయి ని చేరే అవకాశం ఉంటుంది. అలాకాక అమ్మకాల ఒత్తిడి కొనసాగితే మాత్రం 22,600 అనేది ప్రధాన స్థాయిగా భావించొచ్చు. దీన్ని బ్రేక్ చేసి కిందకెళ్లిపోతే మాత్రం 22,500 వద్ద తొలి మద్దతు లభించొచ్చు. దీన్ని కూడా ఛేదించి పడిపోతే 22,350, ఆతర్వాత 22,000 స్థాయులను పరీక్షించే అవకాశం ఉంటుంది.రంగాలవారీగాఆయా సెక్టార్లకు సంబంధించి వెలువడే ప్రకటనలు సంబంధిత రంగాల షేర్లను ప్రభావితం చేస్తాయి. అదే సమయంలో మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో ఒడుదొడుకులు కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈమధ్య కాలంలో మార్కెట్లకు పెనుశాపంగా మారిన విదేశీ మదుపర్ల నిరంతర అమ్మకాలు ఈవారమూ కొనసాగవచ్చు. రంగాలవారీగా చూస్తే ఫార్మా, వాహన రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎదురుకావొచ్చు. ట్రంప్ నిర్ణయాల ప్రభావంతో ఐటీ షేర్లు సైతం నష్టాల బాటలో కొనసాగొచ్చు. యంత్ర పరికరాలు, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు ఓ పరిమితికి లోబడి కదలాడొచ్చు. బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవచ్చు. లోహ, సిమెంట్ రంగాల్లో కొనుగోళ్లకు అవకాశం ఉండగా, చమురు, టెలికాం రంగాల్లో పరిమిత స్థాయిలో కదలికలు ఉండొచ్చు. వచ్చే నెల 28వ తేదీ నుంచి బ్రిటానియా, భారత్ పెట్రోలియం స్థానంలో జొమాటో, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు నిఫ్టీ-50లో అడుగుపెట్టబోతున్నాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, హ్యుందాయ్ మోటార్, ఇండియన్ హోటల్స్, బెల్, ఐఆర్సీటీసీ, స్విగ్గీ, అదానీ టోటల్ గ్యాస్, ఎన్‌హెచ్‌పీసీ షేర్లపైనా దృష్టి సారించొచ్చు. ఇక మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ గత వారాంతానికి 3.23 శాతం క్షీణించి 14.53 దగ్గర ఉంది. 14 శాతం దిగువకు వచ్చేవరకు బుల్స్ ఆచితూచి వ్యవహరించాల్సిందే.మహా శివరాత్రి సందర్భంగా బుధవారం మార్కెట్లకు సెలవు.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
బుల్స్ అప్రమత్తంగా ఉండాల్సిందే..
భారీ ఆటుపోట్లు చవిచూసిన మార్కెట్లు గతవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లను ఓ రకమైన నిస్తేజం ఆవరించింది. పెరగడానికి ప్రయత్నిస్తున్న ప్రతిసారీ అమ్మకాల ఒత్తిడి ఎదురవుతూనే ఉంది. ముఖ్యంగా మార్కెట్లలో కొనుగోళ్లు పెరుగుతున్న తరుణంలో వెంటనే విదేశీ మదుపర్లు రంగంలోకి దిగి విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. ఈ ధోరణి మదుపరులకు చుక్కలు చూపిస్తోంది. మరోపక్క యథావిధిగానే కార్పొరేట్ ఫలితాలు ఉసూరుమనిపించాయి. అమెరికా వాణిజ్య విధానాల్లో స్పష్టత లేకపోవడం, ముఖ్యంగా టారిఫ్‌ల విషయంలో ట్రంప్ ధోరణి అంతుచిక్కకపోవడం మార్కెట్లకు ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. అదే సమయంలో అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడంతో రాబోయే రోజుల్లో వడ్డీ రేట్ల కొత్త విషయంలో సందేహం నెలకొంది.పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నిరుత్సాహకారంగా ఉండటమూ ప్రతికూలంగా మారింది. గత వారాంతాన వడ్డీరేట్లు తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్ననిర్ణయం సంతృప్తికరంగానే ఉన్నా మార్కెట్‌కు అది పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి. రూపాయి బలహీనతలు పుండు మీద కారంలా మారాయి. చమురు ధరలు కాస్త ఫర్వాలేదనిపిస్తున్నాయి. గతవారం మొత్తానికి సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 2.5 శాతం క్షీణించాయి. సెన్సెక్స్ 1921 పాయింట్లు నష్టపోయి పెరిగి 75,939 వద్ద, నిఫ్టీ 631 పాయింట్లు కోల్పోయి 22929 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 7.4 శాతం, స్మాల్ క్యాప్ 9.4 శాతం పడిపోయాయి. బ్యాంకు నిఫ్టీ సైతం ఇందుకు మినహాయింపు కాదు.ఈవారం మార్కెట్లు..ఇప్పటికే మార్కెట్లు భారీ స్థాయిలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈతరుణంలో ఈవారం కొంత ఉపశమన ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. అయితే అధిక స్థాయిల వద్ద లాభాల స్వీకరణ రూపంలో విక్రయాలను తోసిపుచ్చలేం. కార్పొరేట్ సంస్థల ఆర్థిక ఫలితాలు ముగిశాయి. దీంతో ట్రెండ్నుబట్టే మార్కెట్లో కదలికలు ఉండొచ్చు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ తాలూకు మినిట్స్, అలాగే మన ఆర్బీఐ వెలువరించిన క్రెడిట్ పాలసీ మినిట్స్‌పై మార్కెట్లు దృష్టి సారిస్తాయి. మరోపక్క రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలు కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. అమెరికా ఆధ్వర్యంలో జరిగే ఈ చర్చలు సానుకూలంగా ముగిస్తే మార్కెట్లకు కొండంత బలాన్ని ఇస్తాయి.అమెరికా జాబ్ డేటా, బ్రిటన్, జపాన్, జర్మనీ తదితర దేశాల పీఎమ్ఐ గణాంకాలపైనా ఓ కన్నేసి ఉంచొచ్చు. ఇంతకు మించి పెద్దగా ప్రభావిత అంశాలేవీ ఈవారం లేవు. రంగాలవారీగా ఆయా సెక్టార్లకు సంబంధించి వెలువడే ప్రకటనలు సంబంధిత రంగాల షేర్లను ప్రభావితం చేస్తాయి. అదే సమయంలో మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో ఒడుదొడుకులు కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈమధ్య కాలంలో మార్కెట్లకు పెనుశాపంగా మారిన విదేశీ మదుపర్ల నిరంతర అమ్మకాలు ఈవారమూ కొనసాగవచ్చు.రూపాయి కదలికలుఅమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి నానాటికీ బలహీనపడుతూనే ఉంది. గతవారం స్థాయికి చేరుకున్న రూపాయి మార్కెట్లకు చుక్కలు చూపిస్తోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.88 చేరడం రిజర్వు బ్యాంకు చేపట్టిన కొన్ని చర్యల కారణంగా గత వారం చివర్లో తేరుకోగలిగింది. దాదాపు 1.15 రూపాయలు పెరిగి 86.58 వద్ద స్థిరపడింది. ఈవారం కూడా రిజర్వ్ బ్యాంకు రంగంలోకి దిగుతుందా... డాలర్లను భారీ స్థాయిలో విక్రయిస్తుండగా... రూపాయిని మరింత పడిపోనివ్వకుండా ఆదుకుంటుందా అనే విషయాలను నిశితంగా పరిశీలించాలి.విదేశీ మదుపర్లుమార్కెట్ వర్గాలకు సంబంధించి కీలక ప్రకటనలేవీ లేకపోయినప్పటికీ సమాజంలోని అన్ని వర్గాలను సంతృప్తి పరిచే స్థాయిలోనే బడ్జెట్ ఉంది. కానీ దీన్ని విదేశీ మదుపర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. అలాగే వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్నీ వీరు పట్టించుకోలేదు. నిరంతర అమ్మకాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం విషయంలో ఓ స్పష్టత రావడం, కార్పొరేట్ సంస్థల ఫలితాలు మెరుగుపడటం జరిగే వరకూ వీరి అమ్మకాల ధోరణిలో మార్పు రాకపోవచ్చని నిపుణులు చెబుతున్నప్పటికీ కొంత ఉపశమనాన్ని కలిగించే విధంగా వీరు వ్యవహరించవచ్చనే చెప్పొచ్చు. గత జనవరి నెల మొత్తానికి వీరు రూ.87,000 కోట్ల విక్రయాలు జరిపిన విషయం తెల్సిందే. ఫిబ్రవరి నెలలో ఇప్పటివరకు రూ.29,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీయ మదుపర్లు మాత్రం యధావిధిగా మార్కెట్ కు మద్దతుగా నిలిచారు. వీరు ఈ నెలలో ఇప్పటివరకు రూ.26,000 కోట్ల నికర కొనుగోళ్లతో మార్కెట్ ను ఆదుకునే ప్రయత్నాలు చేశారు.ఇదీ చదవండి: అంకెలు మారాయి కానీ.. ప్రశ్న మారలేదు..సాంకేతిక స్థాయులుఅడపాదడపా కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ నిఫ్టీ ఇప్పటికీ బేర్ ఆపరేటర్ల గుప్పిట్లోనే ఉందని చెప్పొచ్చు. సూచీలు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఈవారం కొంత కొనుగోళ్ల మద్దతు లభించే అవకాశాలు లేకపోలేదు. నిఫ్టీకి 23250-300 స్థాయి చాలా కీలకం. దీన్ని దాటి ముందుకెళ్తే మాత్రం తొలుత 23,500, ఆ తర్వాత 23,750 స్థాయి ని చేరే అవకాశం ఉంటుంది. అలాకాక అమ్మకాల ఒత్తిడి కొనసాగితే మాత్రం 22,900 అనేది ప్రధాన స్థాయిగా భావించొచ్చు. దీన్ని బ్రేక్ చేసి కిందకెళ్ళిపోతే మాత్రం 22,750 వద్ద తొలి మద్దతు లభించొచ్చు. దీన్ని కూడా ఛేదించి పడిపోతే 22,500, ఆతర్వాత 22,300 స్థాయిలను పరీక్షించే అవకాశం ఉంటుంది. రంగాలవారీగా చూస్తే ఫార్మా షేర్లకు మద్దతు లభించవచ్చు. లోహ, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు ఓ పరిమితికి లోబడి కదలాడొచ్చు. బ్యాంకింగ్ షేర్లు అమ్మక ఒత్తిడి ఎదుర్కోవచ్చు. సిమెంట్ రంగంలో కొనుగోళ్ళకు అవకాశం ఉండగా, కేపిటల్ గూడ్స్, ఆటోమొబైల్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి ఎదురుకావొచ్చు. ఇక మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ గత వారాంతానికి 9.72 శాతం పెరిగి 15.02 దగ్గర ఉంది. బుల్స్ అప్రమత్తంగా ఉండాలి అనేందుకు ఇది సంకేతం.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
ఈవారం మార్కెట్లు ఇలా..
భారీ హెచ్చుతగ్గుల మధ్య గతవారం మార్కెట్లు ముందుకే సాగాయి. ఓపక్క కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో మార్కెట్ వర్గాలకు పెద్దగా ప్రయోజనం కలక్కపోయినా... ఆదాయపు పన్ను పరంగా తీసుకున్న ప్రోత్సాహక చర్యలు సూచీలను ముందుకు నడిపించాయి. మరోపక్క కార్పొరేట్ ఫలితాలు ఇబ్బంది పెట్టినప్పటికీ... చివరకు ఇండెక్స్ లు కొంత తేరుకున్నట్లే కనిపించాయి. అదీగాక కెనడా, మెక్సికోలపై విధించిన సుంకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన ప్రకటన సానుకూల ప్రభావాన్ని చూపించింది. వారం మధ్యలో ఆర్బీఐ పాలసీకి ముందు మార్కెట్లు కొంత ఒత్తిడికి గురయ్యాయి. అందరూ ఊహించినట్లే... వారాంతాన వడ్డీరేట్లు తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం సంతృప్తికరంగానే ఉన్నా... భవిష్యత్ విధానాల విషయంలో "తటస్థ" ధోరణి (అంటే రాబోయే రోజుల్లోనూ ఇలా కోతలు ఉండొచ్చన్న అంచనాలకు విరుద్ధంగా) కొనసాగించడం మార్కెట్ వర్గాలకు రుచించలేదు. దీంతో అమ్మకాల ఒత్తిడి ఎక్కువైంది. ఇంకోపక్క విదేశీ సంస్థాగత మదుపర్లు యధావిధిగా తమ అమ్మకాలను కొనసాగించారు. అదే సమయంలో రూపాయి బలహీనతలూ మార్కెట్లను వేధించాయి. చమురు ధరలు కాస్త చల్లబడటం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. మొత్తానికి గతవారం సెన్సెక్స్, నిఫ్టీ లు దాదాపు 0.33 శాతం దాకా పెరిగాయి. వారం మొత్తానికి సెన్సెక్స్ 354 పాయింట్లు పెరిగి 77860 వద్ద, నిఫ్టీ 78 పాయింట్లు లాభపడి 23560 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్, బ్యాంకు నిఫ్టీలు కూడా లాభాల్లోనే సాగాయి.ఈవారంఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం మార్కెట్లపై కొంత సానుకూల ప్రభావం చూపించొచ్చు. సోమవారం మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావొచ్చు. అయితే ఈ ధోరణి పూర్తిగా కొనసాగుతుందా... అన్నది సందేహమే. మార్కెట్లు మరీ తీవ్ర స్థాయిలో ప్రభావితం చేసే సంఘటనలేవీ ఈవారం లేనప్పటికీ... మనతో పాటు అమెరికా వెలువరించే ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కామెంట్లు, సుంకాల విషయంలో ఎప్పుడు ఏ రీతిన వ్యవహరిస్తాడో తెలియని ట్రంప్ ధోరణి... కొంతమేర శాసించొచ్చు. పెద్ద ప్రభావిత అంశాలు లేకపోవడంతో... మార్కెట్లు ఈవారమంతా స్వల్ప స్థాయుల్లోనే కదలాడుతూ.. కన్సాలిడేట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక కార్పొరేట్ ఫలితాలు చివరి దశకు వచ్చేశాయి. ఈవారంతో మిగిలిన ప్రధాన కంపెనీలు కూడా తమ మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించడం ద్వారా ఈ అంకం కూడా పూర్తవుతుంది. ఇక రంగాలవారీగా ఆయా సెక్టార్లకు సంబంధించి వెలువడే ప్రకటనలు సంబంధిత రంగాల షేర్లను ప్రభావితం చేస్తాయి. అదే సమయంలో మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో ఒడుదొడుకులు కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈమధ్య కాలంలో విదేశీ మదుపర్ల నిరంతర అమ్మకాలు మార్కెట్లకు పెనుశాపంగా మారాయి. ఈ ధోరణి ఈవారం కూడా కొనసాగవచ్చు.ఆర్ధిక ఫలితాల కంపెనీలుదాదాపు 2000 కు పైగా కంపెనీలు ఈవారం ఆర్ధిక ఫలితాలను ప్రకటించబోతున్నాయి. దీంతో ఫలితాల ఘట్టం పూర్తవుతుంది. ఫలితాల ద్వారా ఈవారం మార్కెట్లపై అధిక స్థాయిలో ప్రభావితం చూపగల కంపెనీల్లో అపోలో హాస్పిటల్స్, హిందాల్కొ ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, లుపిన్, సీమెన్స్, ఎస్కార్ట్స్, నేషనల్ అల్యూమినియం, ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్, ఆదిత్య బిర్లా ఫ్యూచర్ రిటైల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నాయి. తర్వాతి స్థానంలో పతంజలి ఫుడ్స్, వరుణ్ బెవరేజెస్, బాటా ఇండియా, ఇంజనీర్స్ ఇండియా, జూబిలెంట్ ఫుడ్స్, దిలీప్ బిల్డకాన్, నారాయణ హృదయాలయ వంటి కంపెనీలు ఉన్నాయి.విదేశీ మదుపర్లు మన మార్కెట్లలో నిరంతర అమ్మకాలు కొనసాగిస్తున్న విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) గత జనవరి నెల మొత్తానికి రూ. 87,000 కోట్ల విక్రయాలు జరిపిన విషయం తెల్సిందే. వీరు ఫిబ్రవరి నెలలో ఇప్పటివరకు రూ. 10,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీయ మదుపర్లు మాత్రం యధావిధిగా మార్కెట్ కు మద్దతుగా నిలిచారు. వీరు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 7,200 కోట్ల నికర కొనుగోళ్లతో మార్కెట్ ను ఆదుకునే ప్రయత్నాలు చేశారు. సాంకేతిక స్థాయిలునిఫ్టీ 23700-800 ని బ్రేక్ చేయనంతవరకు పెద్ద మార్పులేవీ ఉండకపోవచ్చు. ముందుకెళ్లాలన్నా, మరింత పడిపోవాలన్నా ఇది కీలక స్థాయి. ఇదే స్థాయిల్లో చలిస్తున్నంత కాలం.. సూచీలు కన్సాలిడేషన్ లో కొనసాగుతాయి. మార్కెట్లలో ప్రస్తుతానికి సానుకూల సంకేతాలు అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి. 24000 పాయింట్ల వద్ద పెద్ద నిరోధం ఉంది. దీన్ని దాటుకుని ముందుకు వెళ్తేనే... 24200 స్థాయిని టెస్ట్ చేయవచ్చు. అలాకాకుండా నిఫ్టీ 23500 పైన ఉన్నంతవరకు ఫర్వాలేదు కానీ దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం అప్రమత్తమవ్వాల్సిందే. అప్పుడు 23200 వద్ద మార్కెట్ కు సపోర్ట్ లభిస్తుంది. దాన్ని కూడా ఛేదించి పడిపోతే 23000, 22800 వద్ద మార్కెట్ కు మద్దతు లభించొచ్చు. రంగాలవారీగా చూస్తే... బ్యాంకింగ్ షేర్లు బలహీనంగా ట్రేడయ్యే అవకాశముంది. సిమెంట్, ఫార్మా, ఎఫెమ్సీజీ రంగాల్లో కొనుగోళ్ళకు అవకాశం ఉండగా, టెలికాం, కేపిటల్ గూడ్స్, ఆటోమొబైల్, మెటల్స్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి ఎదురుకావొచ్చు. ఇక మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ గత వారాంతానికి 2.91 శాతం క్షీణించి 13.69 దగ్గర ఉంది. ప్రస్తుతానికి మార్కెట్ బుల్స్ కు అనుకూలంగా ఉందనేందుకు ఇది నిదర్శనం.-బెహరా శ్రీనివాస రావు,స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
ట్రంప్, ఆర్బీఐ నిర్ణయాలు కీలకం
కేంద్ర ఆర్థికమంత్రి గత శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఓ రకంగా మార్కెట్‌కు రుచించలేదు. మధ్య తరగతి, వేతన జీవులకు ప్రాధాన్యమిస్తూ సాగిన బడ్జెట్లో మార్కెట్ డిమాండ్లేవీ నెరవేరకపోవడంతో బడ్జెట్‌కు ముందు వచ్చిన ర్యాలీ కొనసాగలేదు. పన్ను స్లాబులు, రేట్లలో చేసిన మార్పుల వల్ల సామాన్యుల ఆదాయం పెరుగుతుందని, తద్వారా కొనుగోలు శక్తి ఇనుమడిస్తుందన్న ఉద్దేశంతో ఆటో మొబైల్, ఎఫ్ఎంసీజీ షేర్లలో మాత్రం హడావుడి కనిపించింది. గతవారం మొత్తం మీద సెన్సెక్స్, నిఫ్టీ లు దాదాపు 1.5 శాతం దాకా పెరిగాయి. ప్రముఖ కంపెనీలు ప్రకటించిన ఆర్ధిక ఫలితాలు యధావిధిగానే నిరాశపరిచాయి. కేవలం బడ్జెట్ మీద దృష్టితోనే గత వారమంతా మార్కెట్ నడిచింది. అందువల్లే ప్రీ-బడ్జెట్ ర్యాలీ వచ్చింది. వారం మొత్తానికి సెన్సెక్స్ 1316 పాయింట్లు పెరిగి 77506 వద్ద, నిఫ్టీ 390 పాయింట్లు లాభపడి 23482 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్, బ్యాంకు నిఫ్టీలు కూడా లాభాల్లోనే సాగాయి.ఈవారంబడ్జెట్ ప్రభావం సోమవారం మార్కెట్లపై స్పష్టంగా కనిపించవచ్చు. మార్కెట్ వర్గాలను మెప్పించే చర్యలు బడ్జెట్లో లేకపోయినప్పటికీ సామాన్యులకు కలిగే ప్రయోజనం వల్ల పెట్టుబడులు పెరగవచ్చని అంచనా. దీని ఫలితాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయి. అదే సమయంలో వారం చివర్లో... అంటే శుక్రవారం రిజర్వు బ్యాంకు ప్రకటించబోయే పాలసీలో వడ్డీ రేట్లు పావు శాతం తగ్గించవచ్చనే అంచనాలున్నాయి. ఇది కొంత సానుకూల అంశం.ట్రంప్ చర్యలుకెనడా, మెక్సికో, చైనాలపై టారిఫ్ లతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడటం ప్రపంచ మార్కెట్లను మళ్లీ వణికిస్తోంది. మన స్టాక్ మార్కెట్లు సైతం ఇందుకు మినహాయింపు కాకపోవచ్చు. ఈవారం మార్కెట్లు భారీ ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి కొన్ని బడా కంపెనీలు ఈవారం ఆర్ధిక ఫలితాలు ప్రకటించబోతున్నాయి. వీటి ప్రభావం ఎటూ ఉండనే ఉంటుంది. ఇక రూపాయి కదలికలు, చమురు ధరల్లో మార్పులపైనా దృష్టి పెట్టాలి. ఏది ఏమైనప్పటికీ ఆర్ధిక ఫలితాలు ప్రోత్సాహకరంగా లేకపోతే మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతినడం సహజం. అదేసమయంలో విదేశీ మదుపర్ల నిరంతర అమ్మకాలు మార్కెట్లను పడదోస్తూనే ఉంటాయి.ఆర్థిక ఫలితాల కంపెనీలుఈవారం మార్కెట్లపై అధిక స్థాయిలో ప్రభావితం చూపగల వాటిలో పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, టైటాన్, భారతి ఎయిర్టెల్, బ్రిటానియా, హీరో మోటో, ఐటీసీ, ఎస్బీఐ, మహీంద్రా & మహీంద్రా ఫలితాలు ఉంటాయి. తర్వాతి స్థానంలో ఎల్ఐసీ, టాటా పవర్పె, ఆరోబిందో ఫార్మా, దివీస్, జైడస్ లైఫ్, టాటా కెమికల్, గోద్రెజ్ ప్రాపర్టీస్, థర్మాక్స్, టొరెంట్ పవర్, కమిన్స్, గుజరాత్ గ్యాస్, అపోలో టైర్స్, ఎన్ఎండీసీల ఫలితాలపైనా ఓ కన్నేసిఉంచాల్సిందే.ఎఫ్ఐఐలుమార్కెట్లో భారీ స్థాయిలో పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్న విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) గత జనవరి నెల మొత్తానికి రూ.87,000 కోట్ల విక్రయాలు జరిపారు. పెట్టుబడులను తరలిస్తున్నారు. గత అక్టోబర్‌లో రూ.1.14 లక్షల కోట్ల షేర్లు విక్రయించిన వీరు మళ్లీ అధిక స్థాయిలో అమ్మకాలకు పాల్పడింది జనవరి నెలలోనే కావడం గమనార్హం. దీని ప్రభావం రూపాయిపై పడుతోంది. అదే సమయంలో దేశీయ మదుపర్లు మార్కెట్‌కు మద్దతుగా నిలిచారు. వీరు నెల మొత్తానికి దాదాపు రూ.76,600 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. తద్వారా మార్కెట్లు భారీ స్థాయిలో పడిపోకుండా వీరు అడ్డుకోగలుగుతున్నారు. గత వారం మొత్తం మీద విదేశీ మదుపర్లు రూ.20,000 కోట్ల నికర అమ్మకాలు జరపగా అదే వారంలో దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.19,000 కోట్ల నికర కొనుగోళ్లు జరిపి మార్కెట్లను నిలబెట్టారు.సాంకేతిక స్థాయిలుమార్కెట్లలో ప్రస్తుతానికి సానుకూల సంకేతాలు అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి. ఒకవేళ నిఫ్టీ 23500 పైన ఉన్నంతవరకు ఫర్వాలేదు. ఈ ధోరణి కొనసాగితే మాత్రం సూచీలు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 23650 ని ప్రధాన నిరోధంగా భావించాలి. ఇది దాటితే 23800, 23920 వద్ద నిరోధాలున్నాయి. మొత్తం మీద 24000 పాయింట్లు అనేది ప్రస్తుతానికి పెద్ద అవరోధంగా భావించొచ్చు. దానికంటే ముందు 23200, 23050, 22850, స్థాయిల వద్ద నిఫ్టీ కి మద్దతు లభించొచ్చు. ఒకవేళ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి విస్తృతమైతే 22500 దాకా పడిపోయినా ఆశర్యపోనక్కర్లేదు. ఆర్ధిక ఫలితాల నేపథ్యంలో షేర్ల వారీ ప్రధాన కదలికలు చోటుచేసుకోవడం సహజమే అయినప్పటికీ ఇవి ఇండెక్స్ లను కచ్చితంగా ప్రభావితం చేస్తాయి. ప్రముఖ కంపెనీల ఆర్ధిక ఫలితాలమెప్పించకపోయినా, ట్రంప్ నిర్ణయాలు మరింత ఇబ్బందికరంగా మారినా సూచీలు ఇంకా ఇంకా పడిపోవడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ సోమవారం నాటికి 15.1 శాతం క్షీణించి 14.1 దగ్గర ఉంది. ప్రస్తుతానికి మార్కెట్ బుల్స్ కు అనుకూలంగా ఉందనేందుకు ఇది నిదర్శనం.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
బడ్జెట్: మేడమ్... మధ్య తరగతిని మర్చిపోకండి
బడ్జెట్ అనగానే ఎదురుచూపులు...భారీ ఆశలు... కోర్కెల చిట్టాలు...చివరకు నిట్టూర్పులు...ప్రతిసారీ మధ్యతరగతి వర్గం పరిస్థితి ఇదే...ఈసారైనా కాస్త మార్పు వస్తుందేమోనన్న ఆశ.2025-26 ఆర్ధిక సంవత్సరానికి కేంద్ర ఆర్ధిక మంత్రి ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కొన్ని విప్లవాత్మక నిర్ణయాలకు వేదికగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల తర్వాత మూడోసారి కొలువు తీరిన మోదీ సర్కారు నుంచి వెలువడే ఈ బడ్జెట్ దేశ ఆర్ధిక వ్యవస్థను పరుగులు తీయించగల కొన్ని కఠిన నిర్ణయాలతో పాటు.. సామాన్యులను ఇరకాటంలో పెట్టని విధంగా సమతౌల్యంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.ఆర్ధిక వృద్ధి రేటు మందగించి.. రూపాయి నానాటికీ క్షీణిస్తూ... స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్న ప్రస్తుత తరుణంలో ఏమాత్రం బ్యాలన్స్ తప్పినా...జరిగే నష్టాన్ని పూడ్చడం అంత తేలిక్కాదు. ఈనేపథ్యంలో వృద్ధికి పట్టుగొమ్మగా నిలిచే మధ్య తరగతి వర్గాలను... మరీ ముఖ్యంగా ఉద్యోగ వర్గాలను మెప్పించడం ప్రధానం.దేశంలో ఆదాయపు పన్ను క్రమం తప్పక చెల్లిస్తున్నది ఉద్యోగ వర్గాలే. వీళ్లకు టీడీఎస్ రూపంలో జీతం ఇచ్చేటప్పుడే పన్ను కోత జరుగుతుంది. మిగతా వర్గాల్లో పన్ను వసూళ్లు ఉన్నప్పటికీ వారికి దక్కే మినహాయింపులు వేరు. ఖర్చులు పెరిగిపోయి... వచ్చే ఆదాయాలు ఏమూలకూ సరిపోని ఈరోజుల్లో... తమను చిన్న చూపు చూడొద్దంటూ అత్యధిక సంఖ్యలో పన్ను చెల్లించే మధ్య తరగతి, ఉద్యోగ వర్గాలు ఆర్ధిక మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాయి.రాబోయే బడ్జెట్ నుంచి వీరు ఏమి ఆశిస్తున్నారో... ఏమి చర్యలు ప్రకటిస్తే బావుంటుందో చూద్దాం.1. సెక్షన్ 80 సీ: ఆదాయపు పన్ను చట్టంలోని ఈ సెక్షన్ రూ.1 .50 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కల్పిస్తోంది. 2014 నుంచి చిన్న చిన్నవి తప్పిస్తే... ఈ సెక్షన్ లో పెద్దగా మార్పులే చోటు చేసుకోలేదు. ఈ పరిమితిని కనీసం రూ.2 లక్షల వరకైనా పెంచాలి అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుత అధిక ధరలు, ఖర్చుల నేపథ్యంలో... ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సంపాదించే ఆదాయం వచ్చింది వచ్చినట్లు ఖర్చు అయిపోతున్న నేపథ్యంలో సగటు జీవులు పొదుపు చేసే పరిస్థితులు సన్నగిల్లాయి. పొదుపు చేసే పరిస్థితులే లేనప్పుడు వారు ఇక పెట్టుబడులు ఎలా పెట్టగలుగుతారు. పెట్టుబడులు రానప్పుడు ఆర్ధిక వ్యవస్థ పరుగులు ఎలా తీస్తుంది? కాబట్టి ఆర్ధిక మంత్రి ఇప్పటికైనా దశాబ్దానికి పైగా పడకేసిన మార్పుల్ని ఈ సెక్షన్ లో చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా ట్యాక్ సేవింగ్ పథకాలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లు వంటి పథకాల్లో పొదుపు పెరుగుతుంది. విస్మరించకూడని సెక్షన్ ఇది.2. సెక్షన్ 80డీ : రానురాను ఆరోగ్య సమస్యలు పెచ్చుమీరుతున్నాయి. చిన్న రోగం వచ్చిందంటే చాలు... వేలల్లో వెచ్చించాల్సి వస్తోంది. ఇక పెద్ద రోగాలయితే చెప్పనక్కర్లేదు... లక్షలు పెట్టాల్సిందే. కొంతవరకు బీమా ప్రయోజనాలు దక్కుతున్నప్పటికీ.. ఇప్పటికీ బీమాకు దూరంగా ఉంటున్న వర్గాలే ఎక్కువ. పన్ను చెల్లింపుదారులకు కొద్దో గొప్పో ప్రయోజనాన్ని కల్పిస్తోందీ సెక్షన్. వైద్య ఖర్చులపై వెచ్చించే మొత్తానికి ప్రస్తుతం వృద్ధులకు రూ.50,000, మిగతా వర్గాలకు రూ.25,000 వరకు పన్ను తగ్గింపు లభిస్తోంది. ఈమొత్తాన్నివృద్ధుల విషయంలో రూ. లక్షకు, మిగతా వారికి రూ.50,000 వరకు పెంచాల్సిన అవసరం ఉంది.3. సీనియర్ సిటిజెన్లు: ప్రభుత్వం ప్రతిసారీ వీరికి ఇతోధిక ప్రయోజనాలను కల్పిస్తూ తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయినా అవి సరిపోవు. వీళ్ళు వయసు పెరిగి.. శ్రమ శక్తి తగ్గి... సంపాదనా సామర్ధ్యం మూలన పడి.. అనారోగ్యాలు పలకరిస్తూ.. కేవలం పెన్షన్ నో, అంతో ఇంతో దాచుకున్న డబ్బులనో.. లేదంటే పిల్లలు పంపే సొమ్ములనో నమ్ముకుని కాలం వెళ్లదీస్తూ ఉంటారు. ఈ వర్గాలకు పన్ను, వడ్డీ మినహాయింపులు అధిక మేలు చేస్తాయి. ప్రభుత్వం తప్పనిసరిగా వీరి విషయంలో ఉదారంగా వ్యవహరించాల్సిందే.4 హెచ్ఆర్ఏ: ఢిల్లీ, కోల్ కతా వంటి మెట్రో నగరాల్లోని ఉద్యోగులు తాము పొందే హెచ్ ఆర్ ఏ పై 50 శాతం వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఇదే విధానాన్ని హైదరాబాద్, బెంగళూరు వంటి టైర్ - 2 నగరాలకు కూడా వర్తింపజేయాలి. ఈ నగరాలు కూడా టైర్-1 సిటీ లతో పోటీపడుతూ పరుగులు తీస్తున్నాయి. ఈ నగరాల్లోనూ జీవన వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. ఈనేపథ్యంలో ఉద్యోగుల ఆదాయ ఉపశమన చర్యల్లో భాగంగా వీరికి కూడా హెచ్ఆర్ఏ లో 50% రిబేటు ప్రయోజనాన్ని కల్పించాలి. 5 . గృహ రుణాల వడ్డీ: మధ్యతరగతి వర్గాల ప్రధాన కల తమకంటూ ఓ సొంత ఇంటిని కట్టుకోవడం. వీరిలో 99% మంది బ్యాంకులు/ఇతర ఆర్ధిక సంస్థల రుణాలపైనే ఆధారపడతారు. వీరు చెల్లించే ఈఎంఐ లో పెను భారం మోపేది వడ్డీలే. గృహ రుణాల వడ్డీపై ఇప్పటిదాకా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24(బి) కింద రూ.2 లక్షల వరకు వడ్డీని ఆదాయం నుంచి మినహాయించి చూపించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల్లో డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనాలంటే కనీసం రూ. 70 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. ఇందులో రూ. 50 లక్షలు బ్యాంకు లోన్ తీసుకున్నా తక్కువలో తక్కువ రూ.4 లక్షల దాకా వార్షిక వడ్డీ లెక్క తేలుతుంది. కాబట్టి వడ్డీ మినహాయింపు పరిమితిని ప్రస్తుత స్థాయి నుంచి కనీసం రూ. 3 లక్షల వరకైనా పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.అన్నిటికంటే ప్రధానమైనది ఆదాయపు పన్ను రేట్లు. ట్యాక్ స్లాబుల్లో మార్పులు. వీటి గురించి తదుపరి ఆర్టికల్ లో చర్చించుకుందాం.-బెహరా శ్రీనివాస రావు ఆర్ధిక విశ్లేషకులు -
మొటిరోజే భారీ నష్టాలు.. మార్కెట్ల దిశా నిర్దేశి బడ్జెట్టే!
కొలంబియాపై టారిఫ్‌లతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలెట్టిన పోరు ప్రపంచ మార్కెట్లను గడగడలాడించింది. మన స్టాక్ మార్కెట్లు సైతం ఇందుకు మినహాయింపు కాలేదు . గతవారం మొత్తం మీద దాదాపు అరశాతం నష్టపోయిన సూచీలు ఈవారం మొదటి రోజునే భారీ నష్టాలను చవిచూశాయి. కిందటి వారంనష్టాలకు వివిధ కారణాలు దోహదం చేశాయి. వాటిలో ప్రధానమైనది విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడం. చమురు ధరలు కొంత శాంతిస్తున్నట్లు కనబడుతున్నా, బంగారం ధరలు కొత్త రికార్డుల దిశగా దూసుకుపోవడం, ప్రముఖ కంపెనీలు ప్రకటించిన ఆర్ధిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉండటం, రూపాయి బలహీనతలు కొనసాగడం మార్కెట్ల క్షీణతలో తమవంతు పాత్ర పోషించాయి.గత వారం మొత్తానికి సెన్సెక్స్ 429 పాయింట్లు కోల్పోయి 76190 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు నష్టపోయి 23092 పాయింట్ల వద్ద స్థిరపడగా.. సోమవారం ఒక్కరోజే సెన్సెక్స్ 824 పాయింట్లు క్షీణించి 75366 వద్ద, నిఫ్టీ 263 పాయింట్ల నష్టంతో 22829 వద్ద ముగిశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్, బ్యాంకు నిఫ్టీలు సైతం భారీ నష్టాల్లోనే సాగాయి. ఈవారంఈవారం మార్కెట్లు భారీ ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉంది. ఇందుకు ఉదాహరణ సోమవారమే కనిపించింది. అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి కొన్ని బడా కంపెనీలు ఈవారం ఆర్ధిక ఫలితాలు ప్రకటించబోతున్నాయి. మరోపక్క టారిఫ్‌ల విషయంలో అమెరికా అధ్యక్షుడు చేయబోయే ప్రకటనలు రాబోయే రోజుల్లో మార్కెట్లను ప్రభావితం చేస్తాయి.దీనికంటే ముందు మన మార్కెట్ల దశ - దిశ మార్చేది మాత్రం బడ్జెట్టే. ఇక రూపాయి కదలికలు, చమురు ధరల్లో మార్పులపైనా దృష్టి పెట్టాలి. ఏది ఏమైనప్పటికీ ఆర్ధిక ఫలితాలు ప్రోత్సాహకరంగా లేకపోతే మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతినడం సహజం. అదేసమయంలో విదేశీ మదుపర్ల నిరంతర అమ్మకాలు మార్కెట్లను కిందకు లాగుతూనే ఉంటాయి.ఈవారం ఆర్ధిక ఫలితాల కంపెనీలుమార్కెట్లపై అధిక స్థాయిలో ప్రభావితం చూపగల వాటిలో కోల్ ఇండియా, కెనరా బ్యాంకు, టాటా స్టీల్, ఏసీసీ, బజాజ్ ఆటో, సిప్లా, టీవీఎస్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ, టాటా మోటార్స్, అంబుజా సిమెంట్, అదానీ పవర్, ఎల్ & టీ, బజాజ్ ఫిన్ సర్వ్, భెల్, అదానీ ఎంటర్ ప్రైజెస్ అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, ఓఎన్జీసి, ఇండస్ ఇండ్ బ్యాంకు, నెస్లే ల ఫలితాలు ఉంటాయి. తర్వాతి స్థానంలో పెట్రోనెట్, హిందుస్థాన్ జింక్, బాష్, జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్స్, ఎస్సారెఫ్ వోల్టాస్, రేమండ్, భారత్ ఎలక్ట్రానిక్స్, గెయిల్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, డాబర్, జిందాల్ స్టీల్, బయోకాన్, డాక్టర్ లాల్ పాత్, అజంతా ఫార్మా, మారికో, బంధన్ బ్యాంకు, ఎల్ఐసి హౌసింగ్, జ్యోతి లాబ్స్ ల ఫలితాలపైనా ఓ కన్నేసి ఉంచాల్సిందే.ఎఫ్ఐఐలువిదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్ఐఐలు) కు భారత్‌లో పెట్టుబడులపై వస్తున్న రిటర్నులు చాలా తక్కువ స్థాయిలో ఉంటున్నాయి. మరోపక్క అమెరికాలో బాండ్ల రాబడి ప్రోత్సాహకారంగా ఉంది. దీంతో వారు మన మార్కెట్లో భారీ స్థాయిలో విక్రయాలకు పాల్పడుతూ, పెట్టుబడులను తరలిస్తున్నారు. ఫలితంగా రూపాయి క్షీణిస్తూ డాలర్ బలపడుతూ వస్తోంది.గత ఏడాది మొత్తం మీద అధిక స్థాయిలో విక్రయాలకు ప్రాధాన్యం ఇచ్చిన విదేశీ మదుపర్లు ఈ ఏడాది మొదటి నెలలోనూ అదే ధోరణిలో సాగుతున్నారు. నెల మొత్తం మీద ఇప్పటిదాకా వీరు దాదాపు రూ.74,000 కోట్ల దాకా షేర్లను విక్రయించారు. అదే సమయంలో దేశీయ మదుపర్లు మార్కెట్‌కు మద్దతుగా నిలిచారు. వీరు దాదాపు రూ.73,600 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. తద్వారా మార్కెట్లు భారీ స్థాయిలో పడిపోకుండా వీరు అడ్డుకోగలుగుతున్నారు. సోమవారం ఒక్కరోజే ఎఫ్ఐఐలు రూ. 5,000 కోట్ల విలువ చేసే షేర్లను అమ్మేయగా, దేశీయ మదుపర్లు రూ. 6,600 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.సాంకేతిక స్థాయిలుమార్కెట్లలో ఎక్కడా సానుకూల సంకేతాలు కనిపించడం లేదు. ఇదే ధోరణి కొనసాగితే సూచీలు మరింత పడిపోవడం ఖాయం. ఆర్ధిక ఫలితాల నేపథ్యంలో షేర్ల వారీ ప్రధాన కదలికలు చోటుచేసుకోవడం సహజమే అయినప్పటికీ ఇవి ఇండెక్స్ లను కచ్చితంగా ప్రభావితం చేస్తాయి. సెన్సెక్స్, నిఫ్టీ లు ఏమాత్రం తేరుకునే ప్రయత్నం చేస్తున్నా వెంటనే బేర్స్ రంగంలోకి దిగి వాటిని పడగొడుతూనే ఉన్నారు. మార్కెట్‌కు 23050 వద్ద మద్దతు లభించాల్సి ఉన్నప్పటికీ, సోమవారం ఉదయమే ఇది బ్రేక్ అయిపొయింది. ఒకవేళ మార్కెట్లు తేరుకుంటే మాత్రం 23350 ప్రధాన నిరోధంగా భావించాలి. దానికంటే ముందు 22950, 23050, 23200, స్థాయిల వద్ద నిఫ్టీ కి నిరోధాలు ఉన్నాయి. పతనాన్ని కొనసాగిస్తే తదుపరి మద్దతు 22750 దగ్గర లభిస్తుంది. దీన్ని కూడా బ్రేక్ చేస్తే 22600, 22500 స్థాయిలను టెస్ట్ చేయవచ్చు. అది కూడా దాటుకుని పడిపోతే... 22200 వరకు భారీ పతనం తప్పదు. ప్రముఖ కంపెనీల ఆర్ధిక ఫలితాల మెప్పించకపోయినా, ట్రంప్ నిర్ణయాలు ఇబ్బందికరంగా ఉన్నా సూచీలు మరింత పడిపోవడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది.వీటన్నిటి సంగతి ఎలా ఉన్నా. మన మార్కెట్‌కు భవిష్యత్ దిశా నిర్దేశి మాత్రం బడ్జెట్టే. ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించబోయే చర్యల కోసం మార్కెట్లు ఎదురుచూస్తున్నాయి. ఏమాత్రం తేడా జరిగినా భారీ పతనం తప్పదు. ప్రోత్సాహకరంగా ఉంటే మాత్రం ఇప్పటి స్థాయిల నుంచి తేరుకోవడమే కాక, సూచీలు పరుగులు పెడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ సోమవారం నాటికి 8.24 శాతంపెరిగి 18.13 దగ్గర ఉంది. భారీ ఒడుదొడుకులను ఇది తెలియజెబుతోంది.- బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు. -
ఆర్ధిక మంత్రి హల్వా.. రుచులే వేరయా!
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) గారి హల్వా (halwa) వంటకం పూర్తయింది. జనాలకి రుచి చూపించడమే తరువాయి. హల్వా అంటేనే తీపి పదార్ధం. కానీ ఆర్ధిక మంత్రి గారి హల్వాకి మాత్రం రకరకాల రుచులుంటాయి. ఒకరికి తీపి, ఇంకొకరికి చేదు, మరొకరికి చప్పగా... మొత్తమ్మీద అందరూ రుచి చూడాల్సిందే... వంటకం మొన్నే పూర్తయినా... రుచి చూపించేది మాత్రం ఫిబ్రవరి 1నే.2025-26 ఆర్ధిక సంవత్సరానికి నరేంద్రం మోదీ నేతృత్వంలో ముచ్చటగా మూడోసారి కేంద్రంలో కొలువు తీరిన ఎన్డీయే ప్రభుత్వం తొలి బడ్జెట్ (budget 2025) ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 న ప్రారంభమవుతాయి. ఆరోజు మొదట ఎకనామిక్ సర్వే ను ప్రభుత్వం విడుదల చేస్తుంది. గత ఆర్ధిక సంవత్సరం తాలూకు వివిధ రంగాల్లో ప్రభుత్వం సాధించిన పురోగతి, లక్ష్యాలు, ఆర్ధిక వనరులు, భవిష్యత్ అవకాశాలతో సమ్మిళితమైన ఈ సర్వే బడ్జెట్ కు ఒక దిక్సూచిగా నిలుస్తుంది.ఆమర్నాడు అంటే ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 8 వ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెడతారు. వాస్తవానికి మనం బడ్జెట్ అని వ్యవహరిస్తున్నప్పటికీ... దీన్ని ఫైనాన్స్ బిల్ గా భావించాలి. సాధారణ పన్ను చెల్లింపుదారులు మొదలుకొని... ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్, ఇన్సూరెన్సు, ఫైనాన్స్, ఆటోమొబైల్, బ్యాంకింగ్... ఇలా వివిధ రంగాలు ఈ బడ్జెట్ కోసం ఎదురుతెన్నులు చూస్తూ ఉంటాయి.ఆర్ధిక మంత్రి ఎలాంటి ప్రకటనలు చేస్తారు? అవి కలగజేసే ప్రయోజనం, చోటుచేసుకోబేయే మార్పులు... ఇత్యాది అంశాలను విశ్లేషిస్తూ భవిష్యత్ మార్పులకు ఆయా రంగాలు సిద్ధమవుతాయి. వాస్తవానికి బడ్జెట్ కసరత్తు ప్రారంభం కావడానికి ముందే ఆర్ధిక మంత్రి ఆయా రంగాల వారితో సమావేశమై వారి విజ్ఞప్తులు, ఆకాంక్షలు, డిమాండ్లను లుసుకున్నారు. కోరికలు, డిమాండ్లు ఎక్కువగానే ఉండటం సహజం, అయితే ఈ బడ్జెట్ లో వాటిలో ఎన్ని నెరవారుతాయో నాన్న ఆసక్తితో పరిశ్రమ వర్గాలు ఎదురుచూస్తూ ఉంటాయి.జనవరి 31 న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల తొలివిడత ఫిబ్రవరి 13 న ముగుస్తుంది. రెండో విడత సమావేశాలు మార్చి 10 న ప్రారంభమై ఏప్రిల్ 4 న ముగుస్తాయి. ఈ రెండు విడతల సమావేశాల్లోనూ పార్లమెంట్లో విస్తృత స్థాయిలో వాదోపవాదాలు జరుగుతాయి. విపక్షాల ఎదురుదాడిని తట్టుకుంటూనే ప్రభుత్వం తన వాదనలు సమర్ధించుకునే యత్నాలు చేస్తుంది. ఒక్కోసారి సాధారణ, కార్పొరేట్, వాణిజ్య, పారిశ్రామిక రంగాల అసంతృప్తుల్ని పరిగణనలోకి తీసుకుంటూ తగిన మార్పులు చేస్తుంది. ఇలా చేసిన బడ్జెట్ (ఫైనాన్స్ బిల్లు) కు లోక్ సభ, రాజ్య సభ ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదానికి వెళ్తుంది. అక్కడ కూడా లాంఛనం పూర్తయ్యాక కొత్త ఆర్ధిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.ఈ బడ్జెట్ పై ఎన్నో వర్గాలు రకరకాల ఆశలు పెట్టుకుంటాయి. ముఖ్యంగా బడ్జెట్ వస్తున్న ప్రతిసారీ ఎన్నో ఆశలతో ఎదురుచూస్తూ... చివరకు నిట్టూర్పులు విడిచే వర్గం ఒకటి ఉంది. వారే పన్ను చెల్లింపుదారులు.ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు చేయాలని, ట్యాక్ రిబేటులు పెంచాలని వీరు ఎదురుచూస్తూ ఉంటారు. అలాగే కార్పొరేట్ వర్గాలు తమ తమ రంగాలకు దక్కే ప్రయోజనాలకోసం డిమాండ్ చేస్తూ ఉంటాయి.స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయ్యే వేళ.. అంటే 2047 నాటికి వికసిత భారత్ (అభివృద్ధి చెందిన భారత దేశం) నినాదంతో నరేంద్ర మోదీ సర్కారు లక్ష్యాలు నిర్దేశించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పుడు భారత్.. యువరక్తంతో ఉరకలేస్తోందని, రాబోయే 30 - 40 ఏళ్ళు మనవేనని, ప్రపంచమంతా మనవైపే ఆతృతగా ఎదురుచూస్తోంది ప్రధాన మంత్రి మోదీ చెబుతూ వస్తున్నారు. మరి ప్రధాని మాటలు కార్యరూపం దాల్చాలంటే అందుకు అనుగుణమైన కసరత్తు ఇప్పటినుంచీ జరగాలి. మోదీ 3.O లో వెలుగు చూడబోయే బడ్జెట్ ఇందుకు వేదికగా నిలవాలి. 2023 - 24 లో 8.2 శాతం వృద్ధి సాధించిన భారత ఆర్ధిక వ్యవస్థ... 2024 -25 లో 6 .5 శాతం వృద్ధికే పరిమితం కావచ్చనే అంచనాలున్నాయి. ఈనేపథ్యంలో జీడీపీ వృద్ధిని పెంచే దిశగా బడ్జెట్లో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం అవసరం. జాతీయ రహదారుల విస్తరణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, తాగు నీరు, పారిశుద్ధ్యం, విద్య, వైద్య, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలి.మోదీ నేతృత్వంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రవేశపెడుతున్న తొలి పూర్తి బడ్జెట్ ఇదే. ఇప్పుడిప్పుడే ఎన్నికలు ఏమీ లేవు, కాబట్టి ఎన్నికల అనుకూల బడ్జెట్ గా ఉదారంగా వ్యవహరించే అవకాశం లేదు కాబట్టి తాజా బడ్జెట్ లో కొంత కరమైన నిర్ణయాలే వెలువడే అవకాశం ఉంది. రాబోయే బడ్జెట్ నుంచి ఏయే వర్గాలు ఏమేమి ఆశిస్తున్నాయో.. రాబోయే కథనాల్లో వివరంగా చర్చిద్దాం.స్టాక్ మార్కెట్ ఈసారి బడ్జెట్ వచ్చేది శనివారం. వాస్తవానికి ఆరోజు స్టాక్ మార్కెట్లు పనిచేయవు. కానీ బడ్జెట్ నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహించాలని స్టాక్ ఎక్స్చేంజిలు నిర్ణయించాయి. ఆరోజు యధావిధిగా స్టాక్ మార్కెట్లు ఉదయం 9.15 కి ప్రారంభమై మధ్యాహ్నం మూడున్నర వరకు కొనసాగుతాయి. బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతాయి. బడ్జెట్ వెలువడే సమయంలోనూ... ముఖ్యంగా ఆర్ధిక మంత్రి రెండో పార్ట్ (ట్యాక్స్‌లకు సంబంధించి) చదివే వేళ మార్కెట్లో ఈ హెచ్చుతగ్గులు తారాస్థాయికి చేరతాయి.ఆ తర్వాత విశ్లేషకులు, ఆర్ధిక నిపుణులు వెలువరించే అభిప్రాయాలను బట్టి మార్పులకు లోనవుతూ ఉంటాయి. కాబట్టి సగటు మదుపర్లు ప్రధానంగా ట్రేడర్లు ఆరోజు ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం. సాధ్యమైనంతవరకు ఆరోజు ట్రేడింగ్ కు దూరంగా ఉండటమే మేలు. అధిక స్థాయిలో లాభాలు రావడానికి ఎంత అవకాశం ఉందో భారీ నష్టాలు కళ్లజూసేందుకు కూడా అంతే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త.-బెహరా శ్రీనివాస రావుస్టాక్ మార్కెట్, ఆర్ధిక విశ్లేషకులు -
కూతురి కోసం మంచి పథకం
ఎందెందు వెదికిన అందందు కలదె మగువా.. అని నేటి రోజుల్లో మహిళలు ప్రవేశించని రంగమంటూ లేదు. అయినా ఏదో తెలియని వెలితి. లింగ వివక్ష, ఆదాయాల్లో వ్యత్యాసాలు ఇప్పటికీ దేశంలో చాలాచోట్ల మహిళల పురోగతికి అవరోధంగానే నిలుస్తున్నాయి. 2022 లెక్కల ప్రకారం.. దేశంలో సుమారు 4.5 కోట్ల మంది పేదరికంతోనే జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికీ దేశంలోని మారుమూల పల్లెల్లో అమ్మాయిల్ని మధ్యలోనే చదువు మాన్పించేయడం, చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేసేయడం వంటి అంశాలు ఈ పేదరికానికి కారణంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల పురోభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వాటిని విజయవంతంగా అమలుచేస్తున్నాయి. ఇలాంటివాటిలో బాలికల ఆర్థిక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక పథకమే ‘సుకన్య సమృద్ధి యోజన’. దేశంలో లక్షలాది బాలికలకు సాధికారత కల్పించే ఈ పథకం సరిగ్గా పదేళ్ల క్రితం బేటీ బచావో, బేటీ పఢావో ప్రచారంలో భాగంగా 2015 జనవరి 22న ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా గత నవంబర్ నాటికి 4.10 కోట్లకు పైగా సుకన్య సమృద్ధి ఖాతాలు ప్రారంభమయ్యాయి.ఇది ఎలా పనిచేస్తుంది?ఇదొక పొదుపు పథకం. ఇంట్లో అమ్మాయి పుట్టిన వెంటనే ఖాతా తెరవచ్చు.అంతేకాదు ఆమెకు పదేళ్లు వచ్చేవరకు ఏ సమయంలోనైనా ఖాతాను ప్రారంభించవచ్చు.కనీసం రూ.250తో ఈ పథకాన్ని అమ్మాయిల పేరిట తల్లిదండ్రులు/ సంరక్షకులు తెరవవచ్చు.ఖాతా తెరిచినప్పటి నుంచి ప్లాన్ మెచ్చూర్ అయ్యేవరకు లేదా ఖాతా మూసివేసే వరకు ఈ పథకం ప్రయోజనాలు అమ్మాయికే చెందుతాయి. ప్రతి అమ్మాయికీ ఒక ఖాతాను మాత్రమే అనుమతిస్తారు.తల్లిదండ్రులు తమ అమ్మాయిల కోసం గరిష్టంగా రెండు ఖాతాలను తెరవవచ్చు.కొన్ని సందర్భాల్లో ప్రత్యేక మినహాయింపు పొందవచ్చు. అదెలాగంటే కవలలుపుట్టినా, ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టినా సంబంధిత ఆధారాలను సమర్పించడంద్వారా ఈ ప్రయోజనాన్ని దక్కించుకోవచ్చు.అవసరమైతే ఈ ఖాతాను దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బదిలీ చేసుకోవచ్చు.ఖాతా తెరవాలంటే ఏదైనా పోస్టాఫీస్ లేదా వాణిజ్య బ్యాంకు శాఖలో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు.ఖాతా తెరవడానికి పుట్టిన అమ్మాయి తాలూకు జనన ధ్రువీకరణ పత్రం, నివాస రుజువు సమర్పించాలి.కనీస డిపాజిట్ రూ.250. ఆపై రూ.50 చొప్పున అంటే 300, 350, 400, 450, 500..ఇలా మన స్థోమతను బట్టి డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఈ డిపాజిట్ పరిమితి రూ.1,50,000 మించకూడదు. ఖాతా తెరిచినప్పటి నుంచి 15 ఏళ్ల వరకు ఇలా డిపాజిట్ చేసుకుంటూ వెళ్లవచ్చు.ఆడపిల్లకు 18 ఏళ్లు వచ్చేవరకు ఈ ఖాతా నిర్వహణ తల్లిదండ్రులు, సంరక్షకులు చేతుల్లోనే ఉంటుంది.ఇది పిల్లల విద్య, భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించినందున ఎప్పుడుపడితే అప్పుడు ఈ పథకం నుంచి సొమ్ములు విత్ డ్రా చేయడానికి వీలుండదు.ఇక 18 ఏళ్లు నిండిన అమ్మాయి, ఆ విషయాన్ని ధ్రువీకరిస్తూ సంబంధిత పత్రాలను సమర్పించడం ద్వారా ఖాతాను తన అజమాయిషీలోకి తీసుకోవచ్చు. నెలవారీ ప్రాతిపదికన వడ్డీ లెక్కిస్తారు. దీన్ని ఆర్థిక సంవత్సరం చివర్లో ఖాతాకు జమ చేస్తారు.ఖాతాదారుకు 21 ఏళ్లు పూర్తి అయ్యాక ఈ పథకం మెచ్యూర్ అవుతుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దీన్ని ముందుగానే మూసివేసే సౌలభ్యం ఉంది. అంటే అమ్మాయికి 18 ఏళ్లు నిండి, 21 ఏళ్ల లోపే పెళ్లి చేయాలనుకుంటే పథకం మెచ్యూర్ కాకముందే క్లోజ్ చేయవచ్చు. దీనికి తగిన ఆధారాలను సమర్పించాలి.ఒకవేళ పైచదువులకు డబ్బు కావాలి అనుకున్నప్పుడు కూడా కొంత సొమ్ము విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఖాతాదారు పదో తరగతి పూర్తి చేసి లేదా 18 ఏళ్లు నిండినా (వీటిలో ఏది ముందయితే అది) అంత క్రితం ఆర్థిక సంవత్సరం చివరి వరకు జమ అయినా మొత్తంలో సగం వెనక్కి తీసుకోవచ్చు. దీనికి కూడా తగిన ఆధారాలను సమర్పించాలి.ఈ విత్‌డ్రాలను ఒకేసారి గానీ, ఏడాదికోసారి చొప్పున అయిదేళ్లపాటు గానీ చేసుకోవచ్చు.ఒకవేళ ఖాతాదారు అకాల మరణం చెందితే డెత్ సర్టిఫికెట్తో దరఖాస్తు సమర్పించి ఖాతా మూసివేయవచ్చు. అప్పటివరకు ఉన్న బ్యాలెన్స్, వడ్డీలను తల్లిదండ్రులు/ సంరక్షకులకు చెల్లిస్తారు.ఒకవేళ దురదృష్టవశాత్తు తల్లిదండ్రులు లేదా సంరక్షుకులు చనిపోయి, ఖాతా నిర్వహించలేని సందర్భాల్లోనూ ముందుగానే ఖాతాను మూసివేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఖాతా తెరిచిన తొలి ఐదేళ్లలో మాత్రం ఇలా మూసివేయడానికి కుదరదు.ఈ పథకం కింద డిపాజిట్ చేసే మొత్తాలపై వచ్చే వడ్డీకి, మెచ్యూర్ అయ్యాక వచ్చే మొత్తాలకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ పథకానికి ప్రభుత్వం నిర్ధారించిన వడ్డీ 8.2 శాతం.ఇదీ చదవండి: భారత్ క్రెడిట్ రేటింగ్‌కు సవాళ్లుకేవలం బాలికల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వాళ్లకు విద్యా విషయంలోనూ, ఆర్థిక స్వతంత్రతలోనూ స్వావలంబన చేకూర్చాలన్న ఉద్దేశంతో ప్రారంభమైందే సుకన్య సమృద్ధి యోజన పథకం. ముఖ్యంగా చిన్న స్థాయి ఆదాయవర్గాల వారికి తమ పిల్లలపై చదువులకు అప్పటికప్పుడు పెద్ద మొత్తాలు అప్పులు చేయాల్సిన అవసరం నుంచి తప్పించుకోవచ్చు. అలాగే తమ అమ్మాయిల పెళ్లిళ్లకు అయ్యే ఖర్చు విషయంలోనూ ఈ సొమ్ములు చాలావరకు ఆదుకోగలుగుతాయి. తల్లిదండ్రులు దీన్నొక మంచి పథకం కింద భావించి ముందడుగు వేయొచ్చు.- బెహరా శ్రీనివాస రావు, ఆర్థిక నిపుణులు -
ట్రంప్ చర్యలు.. ఆర్థిక ఫలితాలే కీలకం!
గతవారం స్టాక్ మార్కెట్లలో ఒడుదొడుకులు కొనసాగాయి. ప్రధాన సూచీలు దాదాపు 1 శాతం పడిపోయాయి. ఇందుకు వివిధ కారణాలు దోహదం చేశాయి. వాటిలో ప్రధానమైనది విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడం. వెంటాడుతున్న చమురు ధరల భయం, ఈరోజు అమెరికా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయబోయే డొనాల్డ్ ట్రంప్ విధానాలపై స్పష్టత కొరవడటం. ఈ మూడు అంశాలు ప్రధానంగా మార్కెట్లను పడగొట్టాయి. మరోపక్క రిలయన్స్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంకు ప్రకటించిన ఆర్థిక ఫలితాలూ మార్కెట్ల క్షీణతలో తమవంతు పాత్ర పోషించాయి. వాస్తవానికి ఫలితాలు ఫర్వాలేదు అనిపించినప్పటికీ మార్కెట్లను బలహీనత ఆవరించింది. ముఖ్యంగా ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంకు ఫలితాలు మదుపర్లను మెప్పించలేకపోయాయి. ఇన్ఫోసిస్ రూ.113, యాక్సిస్ బ్యాంకు రూ.45 దాకా క్షీణించాయి. దాదాపు రూ.35 దాకా పెరిగిన రిలయన్స్ మార్కెట్లని కాస్త ఆదుకోబట్టి సరిపోయింది కానీ, ఈ పతనం మరింత ఎక్కువగా ఉండేది. ఫార్మా, ప్రైవేట్ బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, వాహన, ఐటీ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోగా.. ప్రభుత్వ రంగ బ్యాంకులు, చమురు రంగానికి చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. వారం మొత్తానికి సెన్సెక్స్ 760 పాయింట్లు కోల్పోయి 77619 వద్ద, నిఫ్టీ 228 పాయింట్లు నష్టపోయి 23203 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు సానుకూలంగా ట్రేడ్ అయినప్పటికీ... చివరకు ప్రతికూలంగానే ముగిశాయి. ఈవారం ఇలా..గత వారం మాదిరిగానే ఈవారం కూడా మార్కెట్లు కన్సాలిడేషన్ దిశగానే సాగే అవకాశం ఉంది. మార్కెట్లను ప్రభావితం చేసే ప్రధాన సంఘటనలు తక్కువగా ఉండటం ఇందుకు ఒక కారణం. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన ఆర్ధిక ఫలితాల ప్రభావం ఎటూ ఉండనే ఉంటుంది. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ట్రంప్ చేయబోయే ప్రకటనలపై కూడా మార్కెట్ ఓ కన్నేసి ఉంచుతుంది. ముఖ్యంగా టారిఫ్‌ల విషయంలో అమెరికా అధ్యక్షుడు చేయబోయే ప్రకటనలు రాబోయే రోజుల్లో మార్కెట్లకు దిశానిర్దేశం చేస్తాయి. గతంలో మాదిరి దేశీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ, అంతర్జాతీయ సంస్థలను ఏమైనా ఇరకాటంలో పెడతారా? లేదంటే విధానాలు మార్చుకుని కొంత సరళంగా వ్యవహరిస్తారా? అన్న విషయాన్ని మార్కెట్ సునిశితంగా గమనిస్తుంది. ఇక రూపాయి కదలికలు, చమురు ధరల్లో మార్పులపైనా దృష్టి పెట్టాలి. ఏది ఏమైనప్పటికీ ఆర్ధిక ఫలితాలు ప్రోత్సాహకరంగా లేకపోతే మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతినడం సహజం. అదే సమయంలో విదేశీ మదుపర్ల నిరంతర అమ్మకాలు అగ్గికి ఆజ్యం పోస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.ఆర్థిక ఫలితాలు కీలకంఈవారం హిందుస్థాన్ లీవర్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, అల్ట్రాటెక్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్, హిందూస్థాన్ పెట్రోలియంలు ఫలితాలు ప్రకటించబోయే ప్రధాన కంపెనీలు. డీఎల్ఎఫ్, జొమాటో, ఎల్ & టీ ఫైనాన్స్, డిక్సాన్ టెక్నాలజీస్, పీఎన్బీ హౌసింగ్, ఇండియా మార్ట్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, జేకే సిమెంట్, టొరెంట్ ఫార్మా, జేఎస్ డబ్ల్యు స్టీల్, లారస్ లాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియా, జిందాల్ సా, గోద్రెజ్ సీపీ, ఎంఫసిస్, సియెంట్, అదానీ గ్రీన్, పాలీక్యాబ్, హడ్కో, పెర్సిస్టెంట్, పెడిలైట్, హెరిటేజ్ ఫుడ్స్, కోఫర్జ్లు మరికొన్ని ప్రధాన కంపెనీలు.ఎఫ్ఐఐల సరళిఅమెరికాలో బాండ్ల రాబడి ప్రోత్సాహకారంగా ఉండటం రూపాయి సెంటిమెంటును దెబ్బతీస్తోంది. ఫలితంగా రూపాయి క్షీణిస్తూ డాలర్ బలపడుతూ వస్తోంది. ఇది విదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్ఐఐలు) పెట్టుబడులను ప్రభావితం చేస్తోంది. గత ఏడాది మొత్తం మీద భారీ స్థాయిలో విక్రయాలకు ప్రాధాన్యం ఇచ్చిన విదేశీ మదుపర్లు ఈ ఏడాది మొదటి నెలలోనూ అదే ధోరణిలో సాగుతున్నారు. గత వారం వీరు దాదాపు రూ.25,000 కోట్ల దాకా షేర్లను విక్రయించారు. నెల మొత్తానికి వీరి నికర అమ్మకాలు రూ.46,576 కోట్లకు చేరుకున్నాయి. అదే సమయంలో దేశీయ మదుపర్లు మార్కెట్ కు మద్దతుగా నిలిచారు. వీరు దాదాపు రూ.49367 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.సాంకేతిక స్థాయులుమార్కెట్లు ప్రస్తుతం బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఆర్ధిక ఫలితాల నేపథ్యంలో స్టాక్ ప్రధాన కదలికలు చోటుచేసుకోవడం సహజమే అయినప్పటికీ ఇవి ఇండెక్స్‌లను ప్రభావితం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సెన్సెక్స్, నిఫ్టీల్లో ఒడుదొడుకులు కొంత మేర తగ్గే అవకాశం ఉన్నా ముఖ్యంగా బుల్స్ చేస్తున్న ప్రయత్నాలకు బేర్స్ అడ్డుగానే నిలుస్తున్నారు. మార్కెట్ కు కొనుగోళ్ల మద్దతు లభిస్తే మాత్రం మొదట దృష్టి పెట్టాల్సింది 23350 స్థాయి. దీన్ని అధిగమించనంతవరకు మార్కెట్ కొద్దిగా పెరిగినట్లు కనిపించినా మళ్లీ క్షీణత వైపే అడుగులేయవచ్చు. ఒకవేళ 23350 దాటితే తదుపరి నిరోధ స్థాయి 23500. దీన్ని కూడా దాటి ముందుకెళ్తే 23700, 23900 స్థాయిలను అందుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రముఖ కంపెనీల ఆర్ధిక ఫలితాల మెప్పించకపోయినా, ట్రంప్ నిర్ణయాలు ప్రతికూలంగా ఉన్నా సూచీలు పడిపోవడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రస్తుత స్థాయి నుంచి దిగజారితే మాత్రం మొదటి మద్దతు 23050 వద్ద లభిస్తుంది. దీన్ని కూడా బ్రేక్ చేసుకుని కిందకు పడిపోతే 22850 స్థాయిని టెస్ట్ చేయొచ్చు. ఆ తర్వాతి దశలు 22600, 22400 గా భావించాలి. ఫ్యూచర్స్ & ఆప్షన్స్ డేటాను పరిశీలిస్తే నిఫ్టీ 23000-24000 స్థాయిలోనే చలించవచ్చని తెలుస్తోంది. కాల్స్ డేటా ప్రకారం 24000 వద్ద అత్యధిక స్థాయిలో ఓపెన్ ఇంటరెస్ట్ ఉంది. పుట్స్ వైపు 22200 వద్ద అత్యధిక ఓపెన్ ఇంటరెస్ట్ కేంద్రీకృతమై ఉంది. మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ గత వారం 5.58 శాతం పెరిగి 15.75 దగ్గర ఉంది.రంగాలవారీగా...బ్యాంకింగ్ షేర్లు తమ బలహీనతలను కొనసాగించే అవకాశం ఉంది. టెలికాం సంస్థలు ప్రోత్సాహక ఫలితాలు ప్రకటించవచ్చన్న అంచనాలతో ఈ రంగంలోని షేర్లు సానుకూలంగా కదలాడొచ్చు. వాహన రంగంలోని షేర్లు స్తబ్దుగానే చలించే అవకాశం ఉంది. క్షీణిస్తున్న రూపాయి ఫార్మా షేర్లకు మంచి బూస్ట్ అనే చెప్పాలి. మార్కెట్ ఒడుదొడుకుల్లో మదుపరులకు ఇది ఎప్పటికీ సురక్షిత రంగమే. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ ఫలితాలు నిరుత్సాహపరచడం ఐటీ రంగ షేర్లలో ఒత్తిడిని పెంచుతోంది. సిమెంట్ ధరలు పెరగవచ్చన్న వార్త నేపథ్యంలో ఈ రంగంలోని షేర్లకు మద్దతు లభించే అవకాశం ఉండగా, లోహ షేర్లు ఒత్తిళ్లు ఎదుర్కోవచ్చు. చమురు, ఎఫ్ఎంసీజీ షేర్లలో పెద్దగా దూకుడు ఉండకపోవచ్చు.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
స్కాన్ చేసి ధర్మం చేయండి.. బాబయ్యా..
మొన్నీమధ్యే పంజాగుట్ట వెళదామని ఎల్ బీ నగర్ మెట్రో స్టేషన్ కి వచ్చా.. మెట్లు ఎక్కుతోంటే.. నాలుగో మెట్టు మీద అనుకుంటా... ఒక యాచకుడ్ని చూశా.. యధావిధిగానే అతని ముందో పళ్లెం ఉంది. అందులో కొన్ని చిల్లర పైసలు, 10 రూపాయల నోట్లు ఓ నాలుగు ఉన్నట్లున్నాయి. ఇది కొత్తేమి కాదు కానీ... నన్ను ఆకట్టుకున్నదల్లా... అతని మెళ్ళో ఉన్న ఓ డిజిటల్ కార్డు.అది క్యూఆర్ కోడ్ ఉన్న కార్డు.. పెదాలపై ఓ చిన్న చిరునవ్వు వచ్చింది... ఎస్..మోదీ చెప్పింది కరెక్టే అనిపించింది.. "దేశంలో డిజిటల్ విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది.. ఇప్పుడు అడుగడుగునా డిజిటల్ చెల్లింపులే..రాబోయే రోజుల్లో ఇది మరింత విస్తరించి పల్లెల్లో సైతం వేళ్లూనుకుంటాయి..." అంటూ అప్పుడెప్పుడో ప్రధాని అన్నట్లు వచ్చిన వార్త గుర్తుకొచ్చింది.ఇప్పుడీ సంఘటన చూడగానే... నిజమే కదా అనిపించింది..ఇప్పుడంతా డిజిటల్ మయం అయిపోయిందన్నది వాస్తవం. కూరలు కొనడానికి రైతు బజార్ కి వెళ్లినా.. చివరకు ఛాయ్ తాగుదామని టీ స్టాల్ కు వెళ్లినా... జేబులోంచి ఫోన్ తీయడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, పైసలతో సహా డబ్బులు చెల్లించడం... చాలా సింపుల్ అయిపోయింది..ఎప్పుడైతే ఈ డిజిటల్ చెల్లింపులు విస్తృతమవుతున్నాయో చిల్లరతో పనిలేకుండా పోతోంది.. చిల్లర దాకా ఎందుకు... కనీసం ఒక్క పది రూపాయల నోట్ కూడా జేబులో పెట్టుకోకుండా.. కేవలం సెల్ ఫోన్ తో రోడ్డెక్కేవాళ్ళు ఎంతమందో ఈరోజుల్లో..దీంతో ఎవరైనా చెయ్య చాపి యాచిస్తే... ఓ రూపాయి కూడా విదపలేని పరిస్థితి. మరి వారి ఆదాయం పడిపోక ఏమవుతుంది... అందుకే అనుకుంటా... ఆ యాచకుడు ఈ డిజిటల్ మార్గాన్ని ఎంచుకున్నట్లున్నాడు.. తప్పులేదు.. త్వరలోనే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర యాచించే వాళ్ళు సైతం మెళ్ళో ఓ కార్డు వేసుకుని మీముందు చెయ్యి చాపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బీ ప్రిపేర్..మనం పూర్తి స్థాయిలో నగదురహిత సమాజం వైపు అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పేందుకు ఇదో ప్రబల ఉదాహరణగా భావించొచ్చు. గత డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా యూపీఐ ద్వారా 1673 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆర్ధిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2024, జనవరి నెలలో ఈ లావాదేవీలు 1220 కోట్లు జరగ్గా.. ఏడాది చివరికి వచ్చేసరికి 400 కోట్లకు పైగా పెరిగాయి. డిజిటల్ విప్లవానికి ఇంతకంటే నిదర్శనం వేరే ఏం కావాలి?యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) అనేది రకరకాల బ్యాంకుల్ని ఒకేగూటికి చేర్చి చెల్లింపులు చేసేందుకు దోహదపడే ఒక సాధనం. మీ బ్యాంకు ఏదైనా కావచ్చు.. దాన్ని యూపీఐ కి అనుసంధానం చేయడం ద్వారా ఎలాంటి చెల్లింపులైనా క్షణాల్లో చేసేయొచ్చు. పైగా ప్రతీ చెల్లింపునకూ రికార్డు ఉంటుంది.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజా సమాచారం ప్రకారం... గత నవంబర్ నెలలో 1548 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. వాటి విలువ రూ. 21.55 లక్షల కోట్లు. డిసెంబర్ కి వచ్చేసరికి రూ.23.25 లక్షల కోట్ల విలువ చేసే 1673 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఐఎంపీఎస్ (ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్) ని తాజాగా యూపీఐ వెనక్కి నెట్టేసింది. ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు 24 గంటల్లో ఎప్పుడైనా సరే తక్షణమే చెల్లింపు చేసే విధంగా ఈ ఐఎంపీఎస్ ను ప్రభుత్వం 2010 లో ప్రారంభించింది. వ్యాపార వర్గాలకు, వ్యక్తులకు ఈ ఐఎంపీఎస్ విధానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటోంది. ఐఎంపీఎస్ ద్వారా గత ఏడాది నవంబర్ నెలలో రూ. 5.58 లక్షల కోట్ల విలువ చేసే 40.79 కోట్ల లావాదేవీలు జరగ్గా... డిసెంబర్లో వీటి సంఖ్య 44.1 కోట్లకు పెరిగింది. వీటి విలువ కూడా రూ. 6.01 లక్షల కోట్లకు పెరగడం గమనార్హం. ఇక మీరు హైవేల మీద ప్రయాణం చేసేటప్పుడు టోల్ ప్లాజా ల దగ్గర చెల్లింపులు చేస్తారు కదా... గతంలో క్యాష్ ఇచ్చేవారు. ఆ తర్వాత డెబిట్/క్రెడిట్ కార్డులు, యూపీఐ లు వచ్చాయి. ఇప్పుడు ఫాస్టాగ్ అనేది ఈ చెల్లింపుల్లో కొత్త ఒరవడి సృష్టిస్తోంది. ప్రతి టోల్ ప్లాజా ముందు.. ప్రత్యేకంగా కొంతసేపు ఆగాల్సిన అవసరాన్ని ఈ ఫాస్టాగ్ తప్పించింది. మీరు బయల్దేరేముందే... కొంత మొత్తాన్ని మీ బ్యాంకు అకౌంట్ నుంచి ఫాస్టాగ్ కి మళ్లిస్తారు. టోల్ ప్లాజా రాగానే అక్కడి స్కానర్లు మీ వాహనానికి ఉన్న ట్యాగ్ ని స్కాన్ చేస్తాయి. అమౌంట్ ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. ఇదంతా కొద్ది సెకన్లలోనే జరిగిపోతుంది. తద్వారా వేచి ఉండే వ్యవధి తగ్గడంతో పాటు, చిల్లర నోట్ల బాధ ఉండదు. ఈ ఫాస్టాగ్ లు ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ లో కీలకపాత్ర పోషిస్తున్నాయి. గత నవంబర్ నెలలో 35.89 కోట్ల లావాదేవీలు జరగ్గా.. డిసెంబర్లో ఈ సంఖ్య 38.30 కోట్లకు పెరిగాయి. వీటి విలువ కూడా రూ.6,070 కోట్ల నుంచి రూ.6,642 కోట్లకు పెరిగింది.యూపీఐ, ఐఎంపీఎస్, ఫాస్టాగ్ చెల్లింపులు అనేవి మానవాళి జీవితంలో సరికొత్త మార్పులు తీసుకొచ్చాయి. ఈ చెల్లింపులు చాలా సురక్షితంగా ఉండటమే కాక, వేగవంతంగా పనులు పూర్తయ్యేలా చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఫైనాన్షియల్ లావాదేవీలు మరింత విస్తృతమై డిజిటల్ ఇండియా రూపురేఖలనే మార్చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.-బెహరా శ్రీనివాస రావువిశ్లేషకులు -
కంపెనీకి భారీ నష్టం.. షేరు ధర మాత్రం పైకి... ఎందుకిలా?
ఆర్ధిక ఫలితాల సీజన్ (Q3 Results) మొదలైంది. స్టాక్ మార్కెట్ (Stock market) మదుపర్లు, ట్రేడర్ల కళ్లన్నీ ఇప్పుడు వాటిమీదే ఫోకస్ అయి ఉన్నాయి. గత గురువారం రిలయన్స్, ఇన్ఫోసిస్ (Infosys), యాక్సిస్ బ్యాంకులు ఆర్ధిక ఫలితాలు ప్రకటించాయి. ఈ మూడు కంపెనీలు ప్రకటించిన ఫలితాలు ప్రోత్సాహకరంగానే ఉన్నాయి. అయితే... శుక్రవారం రిలయన్స్ షేరు ధర రూ.35 పెరిగితే యాక్సిస్ బ్యాంకు షేర్ ధర రూ. 47, ఇన్ఫోసిస్ రూ.113 పడిపోయాయి. ఫలితాలు బానే ఉన్నా షేర్ ధర ఎందుకు పడిపోతుందో చాలామందికి తెలియదు. కేవలం ఫలితాలను నమ్ముకుని షేర్ కొంటే చివరకు నష్టపోతారు. ఎందుకిలా జరుగుతుంది?ఈ ప్రశ్నకు అనేకానేక సమాధానాలు. వాటిని విశ్లేషించి చూద్దాం.సాధారణంగా కంపెనీలు ఒక ఏడాది/త్రైమాసికానికి సదరు కాలంలో ఆర్జించిన ఆదాయాలు, లాభాలు/నష్టాలను ప్రకటిస్తూ ఉంటాయి.ఆ మూడు నెలలు, ఏడాది కాలంలో కంపెనీ పనితీరు బావుందా, క్షీణించిందా, కొత్త ప్రాజెక్టులు ఏమి వచ్చాయి, ఉద్యోగులు పెరిగారా/తగ్గారా, ఎంత డివిడెండ్ ప్రకటించాయి, భవిష్యత్ గురించి కంపెనీ ఏం చెబుతోంది? ఇత్యాది ప్రశ్నలు అన్నిటికీ ఈ ఫలితాలు సమాధానం చెబుతాయి.ఒక కంపెనీ ప్రకటించే లాభాలు, డివిడెండ్ లే ఆ కంపెనీ ఎంత ఆరోగ్యకరంగా పనిచేస్తోందో తెలియచెబుతాయి.ఆ కంపెనీ ఏ రంగానికి చెందిందో.. ఆ రంగానికి ప్రస్తుతం, భవిష్యత్ ఎలా ఉండొచ్చు అన్న అంశాన్ని కూడా విశ్లేషకులు అంచనా వేసి ఒక నిర్ణయానికి వస్తారు.కంపెనీ ఆదాయం స్థిరంగా పెరుగుతూ వస్తోందా... రాబోయే రోజుల్లో వేరే కంపెనీలను కొనుగోలు చేసే స్థాయిలో పుష్కలంగా నిధులను సంపాదించగలుగుతోందా అని కూడా చూస్తారు.అలాగే ఈపీఎస్ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్ అని అర్ధం. సింపుల్ గా చెప్పాలంటే ఒక్కో షేర్ పై గిట్టుబాటు అయ్యేది ఎంత అన్నది తెలుస్తుంది. ఈ పై అంశాలన్నీ స్టాక్ మార్కెట్లో ఒక షేర్ ధరను నిర్ధారిస్తాయి. ఒక కంపెనీ మంచి ఆదాయాలు, లాభాలు ఆర్జించినంత మాత్రాన ఆ కంపెనీ షేర్ ధర పెరిగిపోదు. ఒక్కోసారి పడిపోతుంది కూడా. ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దాం.ఇన్ఫోసిస్ నే ఉదాహరణగా తీసుకుందాం. ఈ కంపెనీ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి రూ.41,764 కోట్ల ఆదాయంపై రూ. 6,806 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఆదాయం 8 శాతం, లాభం 11 శాతం పెరిగాయి. పైగా భవిష్యత్‌లో ఆర్జించబోయే ఆదాయాల అంచనాలను కూడా పెంచింది. ఫలితాలు ప్రోత్సాహకరంగానే ఉన్నాయి. అయినా శుక్రవారం ఈ కంపెనీ షేర్ ధర రూ.113 పడిపోయింది. దీనికి అనేక కారణాలు...ఫలితాలు ప్రకటించడానికి ముందే మార్కెట్ కు కొంత సమాచారం ఉంటుంది. దాన్నిబట్టి ప్రస్తుత ఫలితాలు ఉన్నాయా, లేదా అని మార్కెట్ వర్గాలు చూస్తాయి. కంపెనీ మంచి ఫలితాలు ప్రకటించినా, వాళ్ళ అంచనాలు అందుకోలేకపోతే షేర్ ధరను పడగొడతారు. ఈ విషయంపై ఓ కన్నేయాలి.ఫలితాలకు ముందే ఆ షేర్ ధర పెరిగి ఉంటుంది. "వదంతులు వ్యాపించినప్పుడు కొనాలి. అవి నిజమైనప్పుడు అమ్మేయాలి..." అన్నది మార్కెట్లో ఉన్న సామెత. సాధారణంగా మార్కెట్లో బడా వర్గాలకు ముందే కాస్త ఉప్పు అందుతుంది కాబట్టి వాళ్ళు రూమర్ల సమయంలోనే కొనేస్తారు. కొద్ది రోజుల తర్వాత ఆ షేర్ అమ్మేసి మంచి లాభాలు సంపాదిస్తారు. ఇలా ఎందుకు జరుగుతోందో చాలామంది చిన్న ఇన్వెస్టర్లకు తెలియదు. ఈలోపు సదరు కంపెనీ ఆ రూమర్లను నిజం చేస్తూ ప్రకటన చేస్తుంది. అది చూసి రిటైల్ ఇన్వెస్టర్లు కొనడం మొదలెడతారు. సరిగ్గా ఈ సమయంలోనే అంతకుముందే కొనుగోలు చేసిన పెద్ద ఇన్వెస్టర్లు మెల్లగా బయటకు వచ్చేయడం మొదలెడతారు. దీంతో షేర్ ధర పడటం మొదలవుతుంది. అలా ఎందుకు జరుగుతోందో వీళ్లకు అర్ధం కాదు. మంచి పాజిటివ్ న్యూస్ కదా.. ఇప్పుడు పడినా కానీ మళ్ళీ పెరుగుతుందిలే అని ఎదురుచూస్తూ ఉంటారు. కానీ ఆ షేర్ ఇంకా పడుతూనే ఉంటుంది. చివరకు నష్టాన్ని బుక్ చేసి బయటకు రావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇలా జరక్కూడదంటే మార్కెట్ తో పాటు నడవడం నేర్చుకోవాలి.ఒక్కోసారి కంపెనీ చాలా చెత్త ఫలితాలు ప్రకటిస్తుంది. అయినా షేర్ ధర భారీగా పెరుగుతుంది. నష్టాలు వచ్చాయి కదా.. షేర్ ధర పడుతుంది అని షార్ట్ సెల్ చేసిన చిన్న ఇన్వెస్టర్లు లాస్ భరించాల్సి వస్తుంది. దీనికి కారణం ఏమిటంటే.. కంపెనీ పరిస్థితి బాలేదని, నష్టాలు ప్రకటించబోతోందని ముందే పసిగట్టిన మార్కెట్... అవే మాదిరి ఫలితాలు రాగానే పెద్దగా ఆందోళన చెందదు. అంచేత షేర్ ధర పెరుగుతుంది. ఇదే సమయంలో ఈ విషయం ఊహించని చిన్న ఇన్వెస్టర్ మాత్రం నష్టపోతాడు. ఇలా ప్రతిసారీ జరక్కపోవచ్చు కానీ, ఈ ప్రమాదాన్ని పసిగట్టగలగాలి.కొన్ని కంపెనీలు ఆర్ధిక ఫలితాల విషయంలో తిమ్మిని బమ్మి చేసి చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. సెబీ నిబంధనలకు ఇది విరుద్ధం. ఇలా మదుపర్లను మోసం చేయాలని చూసే ఆయా కంపెనీలపై సెబీ తగిన చర్యలు తీసుకుంటుంది. సత్యం రామలింగరాజు జైలు పాలవడం, ఆ కంపెనీని మహీంద్రా గ్రూప్ హస్తగతం చేసుకోవడం గుర్తుండే ఉంటుంది. వాస్తవానికి లాభాలు తగిన స్థాయిలో రాకపోయినా, అధిక లాభాలు వచ్చినట్లు చూపిస్తూ మభ్యపెట్టడం ద్వారా మదుపర్లను నిట్టనిలువునా ముంచేయడమే రామలింగరాజు చేసిన పని. అంచేత కంపెనీ పనితీరు, ఫండమెంటల్స్ పై అవగాహన లేకుండా ఇష్టమొచ్చినట్లు షేర్లు కొనేయకూడదు.కంపెనీ పనితీరు అద్భుతంగా ఉన్నా షేర్ ధర పడటం అనేది తాత్కాలికమే కావచ్చు. పైగా అదే రంగంలోని మరో కంపెనీ అంతకుముందే ప్రకటించిన ఆర్ధిక ఫలితాలతో బేరీజు వేసుకుని చూడటం వల్ల కూడా ఒక్కోసారి షేర్ ధర పడుతుంది. కాబట్టి ఈ విషయంపైనా కూడా మదుపర్లు అవగాహన కలిగి ఉండటం అవసరం.మార్కెట్లో ట్రేడ్/ఇన్వెస్ట్ చేసే వ్యక్తులు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానాంశం... ఆ ఫలితాలను విశ్లేషించే కొన్ని ప్రాథమిక విషయాలు తెలిసి ఉండటం. లేదంటే నిండా మునిగిపోతారు. ఫలితాల సందర్భంగా కంపెనీ ఎలాంటి ప్రకటన చేసింది? విశ్లేషకులు ఏం చెబుతున్నారు? ఆరోజు మార్కెట్లో షేర్ కదలికలు ఎలా ఉన్నాయి? వంటి విషయాలు తెలుసుకోకుండా గుడ్డిగా షేర్లు కొనేస్తే... తగిన ఫలితం అనుభవించక తప్పదు. తస్మాత్ జాగ్రత్త.-బెహరా శ్రీనివాస రావుస్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
ఇల్లు, సంసారం మనకొద్దు.. ఆఫీసే ముద్దు
*ఇంట్లో కూర్చుని ఎంతసేపని భార్యని చూస్తూ ఉంటారు? ఇంట్లో కంటే ఆఫీస్ లో(Office Working Hours) ఎక్కువ సమయం ఉంటామని మీ భార్యకు చెప్పండి. వారానికి 90 గంటలు పనిచేయండి... నేను ఆదివారాలు కూడా పనిచేస్తున్నా.. ఆరోజు మీతో పని చేయించలేక పోతున్నందుకు బాధపడుతున్నా. అలా చేయించగలిగితే నాకు చాలా హ్యాపీ"ది గ్రేట్ ఎల్ & టీ చైర్మన్ ఎస్. ఎన్. సుబ్రహ్మణ్యన్ తన ఉద్యోగులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య ఇది.గతంలో ఇన్ఫోసిస్ మెంటార్ నారాయణ మూర్తి(Narayana Murthy) కూడా ఇదే మాదిరి మాట్లాడారు. కాకపోతే మరీ సుబ్రహ్మణ్యన్ లా కాదులెండి. "మన దేశంలో ఉత్పాదకత చాలా తక్కువ. ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ.. పురోభివృద్ధి దిశగా దూసుకుపోవాలంటే మరింత కష్టించి పనిచేయాలి. ఇండియాలో అపారమైన నైపుణ్యాలున్నాయి. అవసరాలూ ఉన్నాయి. వారానికి 70 గంటలు పనిచేస్తే మనం లక్ష్యాల వైపు వెళ్లగలుగుతాం"ఇవీ అప్పట్లో ఆయన అన్న మాటలు.ఇద్దరి ఉద్దేశమూ ఒకటే..మూర్తి గారు రోజుకు 10 గంటలు పనిచేయమంటే..సుబ్రహ్మణ్యన్ గారు ఓ నాలుగాకులు ఎక్కువే చదివి.. రోజుకు 13 గంటల సూత్రం బయటకు తెచ్చారు.వీళ్ళిద్దరూ సింపుల్ గా చెబుతున్నది ఏమిటంటే.. అన్నీ వదిలేసుకొని గొడ్డు చాకిరీ చేయండి అని..వీళ్ళు పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్న వ్యక్తులు. ఆయా కంపెనీలకు అధిపతులు.. 70, 90 ఏం ఖర్మ. 120 గంటలైనా పనిచేస్తారు..నేను ఇన్ని గంటలు పనిచేశా/చేస్తున్నా... మీరూ అలాగే చేయండి అని ఉద్యోగులను అనడమే వివాదాన్ని రాజేస్తోంది...ఉద్యోగులు అంటే జీతం తీసుకుని పనిచేసే శ్రామికులు. ఎన్నో వ్యక్తిగత బరువులు, బాధ్యతల మధ్య నలిగిపోతూ..నెట్టుకొచ్చే సగటు జీవులు.వాళ్ళను అనునిత్యం సమస్యలు పలకరిస్తూనే ఉంటాయి. ఓపక్క వాటితో పోరాడుతూనే.. మరోపక్క వృత్తి ఉద్యోగాల్లో అనుక్షణం టెన్షన్ తో సహజీవనం చేసే అభాగ్యులు. పేరుకు ఎనిమిది గంటల మాటే కానీ.. చాలా కంపెనీల్లో తీసుకునే జీతం కంటే చాకిరీ ఎక్కువ చేసే ఉదంతాలే ఎక్కువ. ఏసీ కార్లు, చుట్టూ పనివాళ్లు, పెద్ద బంగళాలు, మానవ సంబంధాలకు అతీతంగా విశాలమైన ఛాంబర్లలో కాలం గడుపుతూ ఇలాంటి స్టేట్మెంట్లు పాస్ చేసే సుబ్రహ్మణ్యన్లను ఒక్కసారి సగటు ఉద్యోగి ఇంట్లో ఓ నాలుగు రోజుల పాటు కూర్చోపెడితే తెలుస్తుంది... రోజుకు ఎన్ని గంటలు పనిచేయాలో...?? సుబ్రహ్మణ్యన్ సార్ చేసిన ప్రతిపాదనకే వద్దాం...రోజుకు 24 గంటల చొప్పున... వారానికి 168 గంటలు.ఇందులో ఆయన చెప్పినట్లు 90 పని గంటలను తీసేద్దాం.ఇక మిగిలేవి 78 గంటలు. సగటు ఆరోగ్యవంతుడు రోజుకు 8 గంటలు నిద్రకు కేటాయించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట. అంటే మిగిలేవి 22 గంటలు (78 - 7x8 = 56 గంటలు). పోనీ... 8 గంటలు కాకుండా 6 గంటలు చొప్పునే లెక్కేద్దాం. అప్పుడు మిగిలేవి 36 గంటలు (78 - 7x6 = 42 గంటలు)అంటే రోజుకు 5 గంటలు.సాధారణంగా కార్పొరేట్ ఉద్యోగులు ఉండేది నగరాలు, పట్టణాల్లోనే...ఇంటి నుంచి ఆఫీస్ కు వెళ్ళడానికి, ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి... నిత్యట్రాఫిక్ రద్దీ కి కనీసం మూడు గంటలు కేటాయించక తప్పదు.ఇక మిగిలేవి రెండు గంటలు. కాలకృత్యాలు, బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్లకు తక్కువలో తక్కువ గంటన్నర వేసుకుందాం...ఇక మిగిలేది అరగంట...ఇంటికి వచ్చాక కనీసం రిలాక్స్ అవ్వకూడదు...టీవీ చూడకూడదు.పిల్లల బాగోగులు పట్టించుకోనక్కర్లేదు..సరే.. ఇక భార్యను చూస్తూ కూర్చొద్దని సదరు సుబ్రహ్మణ్యన్ సారే చెప్పారు. సంసారంలో ఏం జరుగుతోందో... బంధువు ఎవడో.. ఫ్రెండ్ ఎవడో...పక్కన పెట్టేయాలి.కూరలు, కిరాణా మార్కెట్లకు వెళ్ళకూడదు. పండగలు, పబ్బాలు చేసుకోకూడదు...టూర్ల సంగతి పూర్తిగా మర్చిపోవాలి. అనారోగ్యంగా ఉన్నా సరే... టాబ్లెట్ వేసుకుని ఆఫీస్ కు వచ్చేయాలి. సెలవు తీసుకోకూడదు. విసుగు పుట్టినా.. చూడాలి అనిపించినా... సినిమా ఊసే ఎత్తకూడదు. టైం ఏదీ ??ఇలా చెప్పుకుంటూ పోతే... చాలానే ఉంటాయి...పెద్ద స్థాయిల్లో ఉన్న వ్యక్తులు... మహా మేధావులు, తెల్లారి లేస్తే కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరిపే ఈ ప్రముఖులు.. కనీస మానవతా కోణాన్ని పక్కన పెట్టేసి ఇలా ఎలా మాట్లాడతారో అర్ధం కానీ ప్రశ్న.ఎక్కువ గంటలు పనిచేస్తే ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి పెరిగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే పని మీద దృష్టి పెట్టగలుగుతాడు. జీవితానికి, పనికి మధ్య సమతౌల్యం పాటించాలి. అది ఎప్పుడైతే ఉండదో... మానసిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. అటువంటి వ్యక్తి ఎక్కువ గంటలు పనిచేయడం మాట అటుంచి... పని వాతావరణాన్నే దెబ్బ తీస్తాడు.పైగా గంటల కొద్దీ పని చేసుకుంటూ పోతే... ఒకరకమైన జడత్వం ఆవరిస్తుంది. చేసే పని మీద ఆసక్తి పోతుంది.. అశ్రద్ధ పెరుగుతుంది. తప్పులు జరుగుతాయి. వేల కోట్ల ప్రాజెక్టులను హేండిల్ చేసే కంపెనీల్లో జరిగే తప్పులు ఆ కంపెనీ కొంప ముంచుతాయి. కొండకచో.. కంపెనీలు మూత పడే పరిస్థితి తీసుకొస్తాయి.కాబట్టి సుబ్రహ్మణ్యన్ సారూ...అతి సర్వత్రా వర్జయేత్... అన్న మాట ఊరికే రాలేదు. అది తినే తిండి అయినా.. చేసే పని అయినా...మీలాంటి దిగ్గజాలు మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడటం మంచిది అనుకుంటా... మీ సహచర పారిశ్రామికవేత్తే మీ ఆలోచనల్ని తప్పుబట్టారు... "గంటలు గంటలు పనిచేయనక్కర్లేదు.. చేసే పనిలో క్వాలిటీ ఉంటే.. 10 గంటలు పని చేసినా చాలు..."అంటూ మహీంద్రా & మహీంద్రా అధిపతి ఆనంద్ మహీంద్రా చెప్పిన మాటలు అక్షర సత్యం.ఇప్పటికే అందర్లోనూ అభాసు పాలయ్యారు. మహీంద్రా మాటలనైనా కాస్త చెవికెక్కుంచుకుని తప్పు దిద్దుకునే ప్రయత్నం చేస్తే మంచిదే.. లేదంటే.. మరింత చులకన అవుతారు... తస్మాత్ జాగ్రత్త.పొరపాటు దిద్దుకునే ప్రయత్నాల్లో భాగంగా ఎల్ & టీ ప్రతినిధి వివరణ ఇచ్చినప్పటికీ ఆ వివరణ సంతృప్తికరంగా లేకపోవడం,స్టేట్మెంట్ ఇచ్చిన సుబ్రహ్మణ్యన్ సార్ ఇప్పటికీ నోరు మెదపకపోవడంతో ఈ వ్యాఖ్యలు వివాదం రేపుతూనే ఉన్నాయి)-బెహరా శ్రీనివాస రావువిశ్లేషకులు -
స్టాక్ మార్కెట్లోకి రావాలా?.. పోవాలా?
స్టాక్ మార్కెట్లను నియంత్రించే సెబీ (సెక్యూరిటీస్ ఎక్స్చేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా) ఆమధ్య కొన్ని చర్యలు తీసుకుంది. అవి నవంబర్ 20 నుంచి అమల్లోకి వచ్చాయి కూడా. కొన్ని ఇండెక్స్‌లలో వారాంతపు ట్రేడింగ్‌లు నిలిపివేయడం, లాట్ సైజులను పెంచడం వీటిలో ప్రధానమైనది. ఇలా చేయడం ద్వారా రిటైల్ ట్రేడర్లు భారీ స్థాయిలో నష్టపోకుండా చూడవచ్చన్నది సెబీ ఉద్దేశం. నిజంగా సెబీ లక్ష్యం నెరవేరిందా / నెరవేరుతుందా.. అంటే ఎన్నో ప్రశ్నలు. ఆ చర్యలను ఒకసారి విశ్లేషిస్తే...గత నవంబర్ దాకా మిడ్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీ, నిఫ్టీ, సెన్సెక్స్‌లలో వారాంతపు కాంట్రాక్టులు ఉండేవి. ప్రతి వారం.. సోమవారం మిడ్ నిఫ్టీ, మంగళ వారం ఫిన్ నిఫ్టీ, బుధవారం బ్యాంకు నిఫ్టీ, గురువారం నిఫ్టీ, శుక్రవారం సెన్సెక్స్ ఎక్సపైరీలు జరిగేవి. తదనుగుణంగా ట్రేడర్లు పొజిషన్స్ తీసుకుని ట్రేడ్ చేసుకునేవారు. ఇప్పుడు కేవలం నిఫ్టీ, సెన్సెక్స్‌లలో మాత్రమే వారాంతపు కాంట్రాక్టులు అమలు చేస్తున్నారు.మిడ్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీలలో ట్రేడ్ చేయాలి అనుకునేవారు.. తప్పనిసరిగా నెలవారీ కాంట్రాక్టులు మాత్రమే తీసుకోవాల్సి వస్తోంది. పైన పేర్కొన్న అయిదు సూచీల్లో మీకు నచ్చిన ఏదో ఒక సూచీని వారాంతపు ఎక్సపైరీ సూచీలుగా కొనసాగించుకోవచ్చని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి, బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీలకు సెబీ సూచించింది. ఈ రెండు ఎక్స్చేంజీలు సహజంగానే వాటి ప్రామాణిక సూచీలైన నిఫ్టీ, సెన్సెక్స్‌లలో వారాంతపు కాంట్రాక్టులు నిర్వహిస్తామని సెబీకి చెప్పాయి. దీంతో నిఫ్టీ, సెన్సెక్స్‌లలో మాత్రమే ఇప్పుడు వారాంతపు కాంట్రాక్టులు నడుస్తూండగా.. మిగిలిన మూడూ నెలవారీ కాంట్రాక్టులుగా కొనసాగుతున్నాయి. అలాగే మిడ్ నిఫ్టీ లాట్ సైజు ఇప్పటిదాకా 50 ఉంటే.. ఫిబ్రవరి నుంచి 120కి పెరిగింది. ఫిన్ నిఫ్టీ లాట్ సైజు 25 నుంచి 65కి, బ్యాంకు నిఫ్టీ 15 నుంచి 30కి, నిఫ్టీ 25 నుంచి 75కి, సెన్సెక్స్ 10 నుంచి 20కి పెరిగాయి.వారాంతపు కాంట్రాక్టులు ఇప్పటికే నెలవారీ కాంట్రాక్టులుగా మారిపోగా.. లాట్ సైజుల్లో మార్పులు త్వరలోనే అమల్లోకి రానున్నాయి. ఇంతవరకూ బాగానే ఉంది. అన్ని అలవాట్లకు లోనైన వ్యక్తి తొందరగా వాటిని ఎలా మానుకోలేడో.. ట్రేడింగ్ కూడా అలాంటిదే. పైగా ఇది ఆర్ధిక పరమైన అంశం. స్టాక్ మార్కెట్లో ఉండే బలహీనత ఏమిటంటే.. పోగొట్టుకున్న వ్యక్తి అంతటితో ఊరుకోడు. ఎలాగైనా ఆ పోగొట్టుకున్నది రాబట్టుకోవాలన్న తాపత్రయంతో ఇంకా ఇంకా డబ్బులు తెచ్చి ట్రేడింగ్‌లో పెడుతూనే ఉంటాడు. వీక్లీ కాంట్రాక్టులు తీసేయడం వల్ల వారం వారం డబ్బులు పోగొట్టుకునే ట్రేడర్లు తగ్గిపోతారని.. తద్వారా సగటు ట్రేడర్లను కాపాడినట్లు అవుతుందన్నది సెబీ సదుద్దేశం. కానీ అలా జరిగిందా..??సగటు ట్రేడర్.. ట్రేడింగ్ ఆపేయలేదు. నెలవారీ కాంట్రాక్టులు కొనడం మొదలుపెట్టాడు. ఇవి రేటు ఎక్కువ ఉంటాయి. పైగా లాట్ సైజు పెరిగింది కూడా.. దీనికి ఒక ఉదాహరణ పరిశీలిద్దాం..బ్యాంకు నిఫ్టీ లాట్ ప్రస్తుతం15 షేర్స్. ఈ సూచీ 51000 దగ్గర ఉంది అనుకుందాం. దాని కాల్ ప్రీమియం రూ. 200 ఉంది అనుకుంటే రూ. 3,000 చేతిలో ఉంటే చాలు. 1 లాట్ వస్తుంది. ఇప్పుడు మంత్లీ కాంట్రాక్టు మాత్రమే కొనాలి. మంత్లీ కాంట్రాక్ట్స్ రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇదే 51000 కాల్ మంత్లీలో రూ. 1000 దరిదాపుల్లో ఉంది. కనీసం ఒక లాట్ కొనాలంటే రూ. 15,000 కావాలి. అదే ఫిబ్రవరి నుంచి అయితే లాట్ సైజు 30కి పెరుగుతుంది. అప్పుడు 30,000 అవసరమవుతాయి. దీంతో అంత పెట్టుబడి పెట్టలేక చాలామంది రిటైల్ ట్రేడర్లు మార్కెట్‌కి దూరమవుతారని, తద్వారా ఇలాంటి చిన్న ట్రేడర్లను నష్టాల నుంచి కాపాడవచ్చు అన్నది సెబీ ఉద్దేశం.ఇది జరగొచ్చు.. జరక్కపోవచ్చు కూడా.. అదెలాగంటే... 1. అంత డబ్బులు పెట్టలేని వ్యక్తి ట్రేడింగ్‌కు దూరమవుతాడు. సెబీ కోరుకున్నది ఇదే.2. ట్రేడింగ్‌కు అలవాటు పడ్డ వ్యక్తి, డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి అంత తొందరగా ట్రేడింగ్ మానేయడు. అప్పు చేసో, పొదుపు మొత్తాలు ఖాళీ చేసో.. మరిన్ని డబ్బులు తెచ్చి పెడతాడు. ఇది సెబీ ఉద్దేశాన్ని నెరవేర్చకపోగా రిటైల్ ట్రేడర్లను మరిన్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది.కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఫిన్ నిఫ్టీ, మిడ్ నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీల్లో వారాంతపు కాంట్రాక్టుల్లో ట్రేడ్ చేసే వ్యక్తులు ఇప్పుడు మంత్లీ వైపు మళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత డిసెంబర్లో (అంతక్రితం 11 నెలలతో పోలిస్తే) బ్యాంకు నిఫ్టీ మంత్లీ కాంట్రాక్టుల్లో రోజువారీ ప్రీమియం టర్నోవర్ 377 శాతం పెరిగి రూ.12,200 కోట్లుగా నమోదైంది. అదే మిడ్ నిఫ్టీలో 819 శాతం పెరిగి 512 కోట్లకు చేరగా, ఫిన్ నిఫ్టీ లో 575 శాతం పెరిగి రూ. 398 కోట్లకు చేరింది.దీన్నిబట్టి చూస్తే ట్రేడర్లు ఎక్కడా తగ్గడం లేదని తెలుస్తోంది. వ్యాపార పరిమాణం మందగించవచ్చేమో కానీ వ్యాపారం మాత్రం తగ్గట్లేదు. దీనివల్ల పోగొట్టుకునే వ్యక్తులు మరింత పోగొట్టుకోవడానికి, లబ్ది పొందేవాళ్ళు మరింత ప్రయోజనం పొందడానికి తలుపులు తెరిచినట్లే అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. పోగొట్టుకునేది చిన్న ట్రేడర్లే కానీ.. ప్రయోజనం పొందేది మాత్రం భారీ స్థాయిలో లావాదేవీలు నిర్వహించే విదేశీ మదుపర్లు, హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్సే.సెబీ నిర్ణయాలు అమల్లోకి వచ్చి ఇంచుమించు రెండు నెలలే కావస్తోంది. కాబట్టి మరికొన్ని నెలల పరిశీలన తర్వాత సెబీ తన నిర్ణయాలను ఏవైనా మార్చుకుంటుందా.. కొత్త పద్ధతినే కొనసాగిస్తుందా.. ఏవైనా మార్పులు చేస్తుందా.. ఇవన్నీ వేచి చూడాల్సిన ప్రశ్నలే.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
సంకేతాలు ప్రతికూలం.. కన్సాలిడేషన్‌కే అవకాశం!
గతవారం స్టాక్ మార్కెట్లు బాగా కుదేలయ్యాయి. ప్రధాన సూచీలు దాదాపు 2 శాతం పడిపోయాయి. ఇందుకు మూడు ప్రధాన కారణాలను చెప్పుకోవచ్చు. విదేశీ ఇన్వెస్టర్ల నిరంతర అమ్మకాలు, పెరిగిన చమురు ధరలు, పూర్తి ఆర్ధిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించడం.. ఈ మూడూ మార్కెట్లను కిందకు నడిపించాయి. టీసీఎస్ ఆర్ధిక ఫలితాలు మార్కెట్లను మెప్పించి ఐటీ కంపెనీలపై కాస్త భరోసా ఇచ్చినప్పటికీ.. ఈ డోస్ సరిపోలేదు. అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికా ప్రెసిడెంట్‌గా వచ్చే వారం బాధ్యతలు స్వీకరించబోతున్న 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) అనుసరించబోయే విధానాలపై పూర్తి క్లారిటీ లేకపోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసిందని చెప్పవచ్చు. ఇక వారం మొత్తానికి సెన్సెక్స్ 1845 పాయింట్లు కోల్పోయి 77378 వద్ద, నిఫ్టీ 573 పాయింట్లు నష్టపోయి 23432 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి.ఈవారంఅక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన ఆర్ధిక ఫలితాల సందడి మొదలయ్యింది. ఈవారం మార్కెట్లను పెద్దగా ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడం వళ్ళ ఆయా కంపెనీలు ప్రకటించబోయే త్రైమాసిక ఫలితాలే రాబోయే రోజుల్లో మార్కెట్లకు దిశానిర్దేశం చేయబోతున్నాయి.రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, విప్రో, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, ఎల్టీటీఈఎస్, ఎల్టీఐఎమ్, ఇండియన్ హోటల్స్, సియట్, ఐసీఐసీఐ లొంబార్డ్ తదితర ప్రముఖ సంస్థలు ఈవారం ఆర్ధిక ఫలితాలను ప్రకటించబోయే జాబితాలో ఉన్నాయి.ఇక క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల తర్వాత మళ్ళీ మార్కెట్లో విదేశీ మదుపర్ల సందడి మొదలైందని గతవారం మార్కెట్ ట్రెండ్‌ను బట్టే తెలుస్తోంది. గతవారం క్షీణత తర్వాత ఈవారం మార్కెట్లు కొంత మేర కన్సాలిడేషన్ దిశగా సాగే అవకాశం ఉంది. అదే సమయంలో కాస్త ప్రతికూల వార్తలొచ్చినా.. అది మరింత కిందకు లాగేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ద్రవ్యోల్బణ గణాంకాలు, రూపాయి కదలికలు, చమురు ధరల్లో మార్పులపైనా మదుపర్లు ఓ కన్నేసి ఉంచాలి.ఎఫ్ఐఐలువిదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) గత డిసెంబర్ నెల మొత్తం మీద రూ.16982 కోట్ల నికర విక్రయాలు జరపగా.. దేశీయ మదుపర్లు రూ. 34194 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. ఇక ఈ ఏడాది ఇప్పటిదాకా విదేశీ మదుపర్లు రూ.21,357 కోట్ల నికర అమ్మకాలు చేశారు. అదే సమయంలో దేశీయ మదుపర్లు మాత్రం రూ. 24,215 కోట్ల నికర కొనుగోళ్లతో మార్కెట్‌కు అండగా నిలిచారు.సాంకేతిక స్థాయిలుమార్కెట్లో ప్రస్తుతం బేరిష్ సెంటిమెంట్ ఉంది. గత ఏడాది జూన్ తర్వాత నిఫ్టీ మళ్ళీ ప్రస్తుతం ఆ స్థాయిలకు వచ్చింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో ఒడుదొడుకులు కొంత మేర తగ్గి మార్కెట్లు కన్సాలిడేషన్ దిశగా సాగుతాయని భావించవచ్చు. ముఖ్యంగా బుల్స్ చేస్తున్న ప్రయత్నాలను ఎప్పటికప్పుడు బేర్స్ అడ్డుకుంటూ మార్కెట్లను కిందకు లాగడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.కొనుగోళ్ల సహకారం లభిస్తే మాత్రం 23700 పాయింట్ల వద్ద నిరోధం ఎదురుకావొచ్చు. అదికూడా అధిగమిస్తే తదుపరి నిరోధక స్థాయి 23830 దగ్గర ఉంది. ప్రముఖ కంపెనీల ఆర్ధిక ఫలితాల మెప్పించకపోయినా, ద్రవ్యోల్బణ గణాంకాలు మరింత నీరసంగా ఉన్నా, సూచీలు పడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అదే జరిగితే మొదట 23270 వద్ద మద్దతు దొరుకుతుంది. దీన్ని కూడా ఛేదించి కిందకు జారితే మాత్రం తదుపరి నిరోధం 23000 వద్ద, ఆపైన 22800 స్థాయి వద్ద సహకారం లభించవచ్చు.ఫ్యూచర్స్ & ఆప్షన్స్ డేటాను పరిశీలిస్తే నిఫ్టీ 23000 - 24000 స్థాయిలోనే చలించవచ్చని తెలుస్తోంది. కాల్స్ డేటా ప్రకారం 24500 వద్ద అత్యధిక స్థాయిలో ఓపెన్ ఇంటరెస్ట్ ఉంది. పుట్స్ వైపు 22500 వద్ద అత్యధిక ఓపెన్ ఇంటరెస్ట్ కేంద్రీకృతమై ఉంది. మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ గత వారం 10 శాతం పెరిగి 14.9 దగ్గర ఉంది.రంగాలవారీగా..గత వారమంతా చాలా బలహీనంగా సాగిన బ్యాంకింగ్ షేర్లు.. ఈవారం కొద్దిగా పుంజుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా షార్ట్ కవరింగ్ లావాదేవీలు ఈ రంగం సెంటిమెంట్ ను పెంచుతాయి. టెలికాం రంగంలోని సంస్థలు ప్రోత్సాహక ఫలితాలు ప్రకటించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ రంగంలోని షేర్లు సానుకూలంగా కదలాడొచ్చు.వాహన రంగంలోని షేర్లు స్తబ్దుగా చలించే అవకాశం ఉంది. ముఖ్యంగా మారుతీ, అశోక్ లేలాండ్, బజాజ్ ఆటో షేర్లు ప్రతికూలతలను చూడొచ్చు. అదే సమయంలో హీరో, టీవీఎస్ కొంతమేర ప్రోత్సాహకరంగా ఉండొచ్చు. క్షీణిస్తున్న రూపాయి.. ఫార్మా షేర్లకు మంచి బూస్ట్ అనే చెప్పాలి. గత త్రైమాసికానికి సంబంధించి రూపాయి క్షీణత వాటి ఆర్ధిక ఫలితాలను ప్రభావితం చేస్తుంది. ఇది ఒకింత ప్రోత్ససహకమే.మార్కెట్ ఒడుదొడుకుల్లో మదుపరులకు ఇది ఎప్పటికీ సురక్షిత రంగమే. ఇక టీసీఎస్ ప్రకటించిన ఆర్ధిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించాయి. ఈవారం ఫలితాల ప్రకటించబోయే ఐటీ కంపెనీల్లో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ వంటివి ఉన్నాయి. వీటి ఫలితాల మార్కెట్లకు.. ముఖ్యంగా ఐటీ రంగానికి దిశానిర్దేశం చేస్తాయి. సిమెంట్ షేర్లకు మద్దతు లభించే అవకాశం ఉండగా, లోహ షేర్లు ఒత్తిళ్లు ఎదుర్కోవచ్చు. చమురు, ఎఫ్ఎంసీజీ షేర్లలో పెద్దగా దూకుడుvఉండకపోవచ్చు.- బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు. -
ఆప్షన్స్ ట్రేడింగ్‌లో సక్సెస్ కావాలంటే....
ఆప్షన్స్ ట్రేడింగ్ (options trading)లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించడానికి ఎంత అవకాశం ఉందో... ఉన్న డబ్బులు ఊడ్చిపెట్టుకుని పోవడానికీ అంతే అవకాశం ఉంటుంది. ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ లో ఎట్ ది మనీ (ఏటీఎం), ఇన్ ది మనీ (ఐటీఎం), అవుట్ ఆఫ్ ది మనీ (ఓటీఎం) లది ప్రధాన పాత్ర అని గత ఆర్టికల్ లో చెప్పుకున్నాం. అలాగే ఏటీఎం కాల్స్, పుట్స్ ఎలాంటి ప్రయోజనం కలగజేస్తాయో కూడా చర్చించుకున్నాం.ఇప్పుడు ఐటీఎం, ఓటీఎం ల గురించి మాట్లాడుకుందాం. ఆప్షన్స్ ట్రేడింగ్ లో స్మార్ట్ ట్రేడర్లు అనుసరించే పద్ధతి ఐటీఎం. మళ్ళీ ఎస్బీఐ షేరు నే ఉదాహరణగా తీసుకుందాం.ప్రస్తుతం ఎస్బీఐ షేరు ధర రూ.744 దగ్గర ఉంది. స్ట్రైక్ ప్రైస్ 10 రూపాయల తేడాలో 730, 740, 750... ఇలా ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. ఇపుడు 730 రూపాయల కాల్ తీసుకుంటే.. అది ఐటీఎం కాల్ అవుతుంది. అంటే అండర్ లయింగ్ అసెట్ (ఈక్విటీ షేరు ధర) కంటే షేరు ధర తక్కువగా ఉన్నట్లయితే దాన్ని ఐటీఎం కాల్ గా వ్యవహరిస్తారు. ఇంకా తక్కువ ధరలు ఉండే 720, 710, 700 రూపాయల కాల్స్ కొనుగోలు చేస్తే అవి డీప్ ఐటీఎం కాల్స్ అవుతాయి. ఇవి రేటు ఎక్కువ ఉంటాయి. ధరల్లో ఊగిసలాటలు కూడా ఎక్కువే ఉంటాయి. అంటే పెరగడం ఎంత వేగంగా పెరుగుతాయో పడటమూ అంతే వేగంగా ఉంటాయి. కాబట్టి సగటు ట్రేడరు కొంచెం ఎక్కువ రిస్క్ భరించాల్సి ఉంటుంది.ఇప్పుడు ఎస్బీఐ షేరు ధరను దృష్టిలో పెట్టుకుని 730 రూపాయల కాల్ సెలెక్ట్ చేసుకుందాం. దీని ధర ప్రస్తుతం రూ. 28 వద్ద ఉంది. షేరు పెరుగుతున్న కొద్దీ ఇది పెరిగే వేగం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే షేరు 730 దిగువకు రానంత సేపూ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఒకవేళ కాల్ ధర తగ్గినప్పటికీ మళ్ళీ పుంజుకోవడానికి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. కానీ జోరు తగ్గుతుంది. అదెలాగంటే... షేరు ధర 730 నుంచి 780 కి వెళ్ళేటప్పటికి మీరు కొన్న కాల్ 28 రూపాయల నుంచి 70 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. షేరు ధర 750 కి పడినప్పుడు 30 -35 కి వచ్చేస్తుంది. మళ్ళీ షేరు పెరగడం మొదలై 780 కి వెళ్లినా ఈసారి కాల్ ధర 60 దాటకపోవచ్చు. అంటే మొదట పెరిగినంత వేగంగా రెండోసారి పెరగదన్న మాట. దీనికి కారణం ఆప్షన్ గ్రీక్స్. ఇవే ఇక్కడ కీలక పాత్ర పోషిస్తాయి. ఇక పుట్స్ విషయానికొస్తే... కాల్స్ కి ఇది రివర్స్. షేరు ధర 744 దగ్గర ఉంది కాబట్టి మనం 760 పుట్ కొంటే.... అది ఎంత పడితే పుట్ ధర అంత పెరుగుతూ వెళ్తుంది. ట్రేడర్లు సరిగా సద్వినియోగం చేసుకోగలిగితే... ఐటీఎం కాల్స్, పుట్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయన్నది నిర్వివాదం.ఇదీ చదవండి: Stock Market: ఎన్నాళ్లు ఆగితే.. అన్ని లాభాలు!ఇక ఓటీఎంల విషయానికొద్దాం. ఆప్షన్స్ ట్రేడింగ్ లో అత్యంత ప్రమాదకరమైనవే ఈ ఓటీఎం కాల్స్, పుట్స్. కానీ నూటికి 90 మంది ఈ ఓటీఎం ల్లోనే ట్రేడింగ్ చేస్తారు. సంపాదించేది తక్కువే అయినా.. పోగొట్టుకునేది మాత్రం వీటిలో ఎక్కువే. మరి డబ్బులు పోతాయి అని తెల్సినా... ఈ ఓటీఎంల్లోనే ఎందుకు ట్రేడింగ్ చేస్తారంటే దానికి రెండు కారణాలు చెప్పుకోవచ్చు.1. ప్రీమియం రేట్లు చాలా చౌకగా ఉండటం. 2. తక్కువ పెట్టుబడి తో భారీ లాభాలు సంపాదించడానికి ఎక్కువ అవకాశాలు ఉండటం.ఎస్బీఐ షేరు 744 దగ్గర ఉంది కదా... చాలామంది 760, 770, 780 కాల్స్ కొంటారు. ఇంకా చెప్పాలంటే 800 కాల్స్ కూడా తీసుకుంటారు. వీటి రేట్లు వరుసగా 11, 8, 6, 3 స్థాయిలో ఉన్నాయి. అంటే 760 కాల్ ఒక లాట్ కొనడానికి 8250 పెట్టుబడి అవసరమైతే... 770 కాల్ కు 6000, 780 కాల్ కు 4500, 800 కాల్ కు 2250 పెట్టుబడి సరిపోతుంది. అంటే కేవలం ఓ 3000 నుంచి 10000 చేతిలో ఉన్న వ్యక్తి కూడా చాలా సులువుగా ఎస్బీఐ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేసేయగలడు. రిటైల్ ట్రేడర్లని ఆకర్షించేవి ఈ రేట్లే. 6 రూపాయలు పెట్టి 780 కాల్ కొన్న వ్యక్తికి గిట్టుబాటు కావాలంటే... షేర్ ధర 780 దాటి పెరగాలి. అది కూడా కంటిన్యూ గా పెరుగుతూ రావాలి. ఒకసారి పెరిగి, ఇంకోసారి పడి... ఇలా ముందుకెళ్తే కుదరదు. వీటిలో ఉన్న దుర్లక్షణం ఏమిటంటే.... పెరిగినప్పుడు చాలా స్వల్పంగా పెరిగితే.. షేరు ధర పడేటప్పుడు చాలా ఎక్కువగా పడిపోతూ ఉంటాయి. కాంట్రాక్టు ఎక్సపైరీ టైం కి మొత్తం పెట్టుబడి కాస్తా సున్నా అయిపోతుంది. కానీ సగటు ట్రేడరు మాత్రం మళ్ళీ పెరగొచ్చులే... అని చివరి దాకా ఎదురుచూస్తూనే ఉంటాడు. చివరకు నష్టంతోనే బయటకొస్తాడు. మార్కెట్ ను తిట్టుకుంటాడు.. మళ్ళీ పోగుట్టుకున్న డబ్బులు సంపాదించేయాలన్న ఆతృతతో విఫల యత్నాలు చేస్తూనే ఉంటాడు.ఇప్పుడు అర్ధం అయింది కదా... ఆప్షన్స్ ట్రేడింగ్ చిన్న ట్రేడర్లకు ఎంత ప్రమాదకరమో... ఆ తప్పులు చేయకూడదంటే.... ఆప్షన్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మార్కెట్ పరిస్థితులపై అవగాహన కల్పించుకోవాలి. తగిన క్యాపిటల్ చేతిలో ఉండాలి. ఎప్పటికప్పుడు వచ్చే న్యూస్ ఫాలో అవుతూ ఉండాలి. ప్రత్యేకించి ఒక షేరు కు సంబంధించి.. ఆప్షన్స్ కొంటున్నప్పుడు టైం కి ప్రాధాన్యమివ్వాలి.ఆప్షన్ గ్రీక్స్ అర్ధం చేసుకోవాలి. ఆప్షన్స్ చైన్ అనలైజ్ చేయడం రావాలి. టెక్నికల్ తెలిసి ఉండాలి. ఇవేవీ తెలియకుండా... చేతిలో కాసిన్ని డబ్బులు పెట్టుకుని... లక్షలు, కోట్లు సంపాదించేయొచ్చు అని వేషాలేస్తే... ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోవడం ఖాయం. అంచేత... పొరపాట్లకు తావివ్వక ముందుకు సాగే ట్రేడర్లు మాత్రమే ఆప్షన్స్ ట్రేడింగ్ లో సక్సెస్ అవుతారనేది తోసిపుచ్చలేని వాస్తవం.-బెహరా శ్రీనివాస రావుస్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
ఏది కొంటే ఎంత లాభం..?
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్(Trading) అనేది ఇప్పుడు సర్వ సాధారణమైపోయింది. గత సెప్టెంబర్ నాటికి దేశంలో 17.5 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉన్నాయి. ఇక 2023-24 గణాంకాల ప్రకారం 96 లక్షల మంది ట్రేడింగ్ పైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. దానికి ముందు ఆర్థిక సంవత్సరంలో ట్రేడర్లు 51 లక్షల మందే. 96 లక్షల మందిలో 86 లక్షల మంది కేవలం ఆప్షన్స్(Options)లోనే ట్రేడింగ్ చేస్తున్నారు. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఆప్షన్స్ ట్రేడర్ల సంఖ్య 42 లక్షలు ఉంది. అంటే ఏడాది వ్యవధిలోనే ఆప్షన్స్ ట్రేడింగ్‌లోకి అడుగుపెట్టిన వారి సంఖ్య రెట్టింపుపైనే పెరిగిందన్న మాట.తొందరగా లాభాలు సంపాదించాలని..స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడం, టెక్నాలజీ విస్తృతం కావడం, ఆన్లైన్లో వివిధ మార్కెట్ సమాచారం అందుబాటులో ఉండటం, తొందరగా లాభాలు సంపాదించేయవచ్చన్న అభిప్రాయం జనాల్లో పెరిగిపోవడం, ఆర్థిక సంబంధమైన అంశాల్లో గతంతో పోలిస్తే ప్రజల్లో అవగాహన పెరగడం వంటివి స్టాక్ మార్కెట్ వైపు అడుగులు వేయడానికి కారణాలుగా ఉన్నాయి. గత ఆర్టికల్‌లో మనం ఆప్షన్స్‌కు సంబంధించి ప్రాథమిక అంశాలను తెలుసుకున్నాం. ఇప్పుడు ట్రేడింగ్‌లో వాటికి ఎంత ప్రాధాన్యం ఉంది.. అవి ఎలాంటి పాత్ర పోషిస్తాయో తెలుసుకుందాం.కాల్, పుట్ తీసుకోవడం తెలియాలి..తాజా నిబంధనల ప్రకారం ఇకపై సెన్సెక్స్, నిఫ్టీ(Nifty)లకు మాత్రమే వారాంతపు ఎక్సపైరీలు ఉంటాయి. బ్యాంకు నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ నిఫ్టీలకు నెలవారీ ఎక్సపైరీలు ఉంటాయి. ఈ ఎక్సపైరీల్లో ఆప్షన్స్ గ్రీక్స్ (డెల్టా, గామా, తీటా, వెగాలు) కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని బట్టే ఒక ఆప్షన్ ధర ఏ స్థాయిలో పెరుగుతుంది.. ఏ స్థాయిలో పడిపోతుంది అన్న విషయం తెలుస్తుంది. వీటి కంటే ముందు అసలు ఆప్షన్స్‌లో ట్రేడ్ చేయాలంటే ఏ కాల్ కొనాలి, ఏ పుట్ తీసుకోవాలో తెలిసి ఉండాలి. ఆప్షన్స్‌లో మనం నేరుగా షేర్లు కొనం. ఆ షేర్ల తాలూకు కాల్స్, పుట్స్(Puts) మాత్రమే తీసుకుంటాం. వాటిని సెలెక్ట్ చేసుకోవడానికి మూడు మార్గాలు ఉంటాయి.ఎట్ ది మనీ (ఏటీఎం)ఇన్ ది మనీ (ఐటీఎమ్)అవుట్ ఆఫ్ ది మనీ (ఓటీఎం)ఎస్బీఐ షేరును ఉదాహరణగా తీసుకొని ఈ మూడింటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఎస్బీఐ షేరు ధర రూ.744 వద్ద ఉంది. దీని స్ట్రైక్ ప్రైస్‌లు రూ 700, 710, 720, 730, 740, 750, 760, 770, 780, 790, 800.. ఇలా ఉంటాయి. ఎస్బీఐ షేర్ ధర ప్రస్తుతం ఎంత ఉందో దానికి దరిదాపుల్లో ఉండే స్ట్రైక్ ప్రైస్(Strike Price)ను తీసుకుంటే అది ఏటీఎం అవుతుంది. అంటే రూ.740 అన్న మాట. ఆ షేరు భవిష్యత్‌లో పెరుగుతుందనుకుంటే 740 రూపాయల కాల్, పడుతుంది అనుకుంటే 740 రూపాయల పుట్ కొనుగోలు చేయాలి. ఇవి ఏటీఎం కాంట్రాక్టులు అవుతాయి.షేర్లలో నెలవారీ కాంట్రాక్టులు మాత్రమే ఉంటాయి. దీని లాట్ సైజు 750. రూ.740 కాల్ ధర ప్రస్తుతం రూ.21గా ఉంది. పుట్ ధర రూ.14 ఉంది. షేర్ పెరుగుతుంది అని భావించిన A అనే వ్యక్తి జనవరి నెలకు సంబంధించి 740 కాల్‌ను రూ.21 పెట్టి కొన్నాడు. అంటే అతని పెట్టుబడి (21X750 లాట్) = రూ.15,750 అన్నమాట.B అనే వ్యక్తి షేరు పడిపోవచ్చు అన్న ఉద్దేశంతో జనవరి నెల 740 పుట్ కొన్నాడు. దీని ధర రూ.14గా ఉంది. అంటే అతను పెట్టిన పెట్టుబడి (14X750) = రూ.10,500.షేరు ధర నెల మధ్యలో ఎప్పుడైనా అటూ ఇటూ ఊగిసలాడుతూ మొత్తం మీద జనవరి నెలాఖరుకు రూ.780 దరిదాపుల్లోకి వెళ్లింది అనుకుందాం. అప్పుడు 740 కాల్ సుమారు 45-50 దాకా పెరగొచ్చు. అంటే 15,750 పెట్టుబడి రెట్టింపు అవుతుంది. లాట్ పెరిగి సుమారు రూ.18,000 నుంచి రూ.22,000 దాకా ప్రాఫిట్ వస్తుంది. అదే సమయంలో పుట్ కొన్న వ్యక్తి మొత్తం పోగొట్టుకుంటాడు. అతను కొన్న స్ట్రైక్ ప్రైస్ తాలూకు పుట్ నెలాఖరుకు సున్నా అయిపోతుంది.ఇదీ చదవండి: సందర్శకులను ఆకర్శించేలా మహా ‘బ్రాండ్’ మేళా!పైన తెలిపిన దానికి రివర్స్‌లో జరిగితే.. పుట్ పెరుగుతుంది. కాల్ పడిపోతుంది. పుట్ కొన్న వ్యక్తి మంచి లాభం సంపాదిస్తే, కాల్ కొన్న వ్యక్తి మొత్తం పోగొట్టుకుంటాడు. అలాకాకుండా వచ్చిన ప్రాఫిట్ చాలు అనుకునే వ్యక్తి నెలాఖరు దాకానే వేచి ఉండక్కర్లేదు. మధ్యలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసి బయటకు రావొచ్చు. సగటు ట్రేడర్ ఈ మార్గాన్ని అనుసరిస్తూ, ఎప్పటికప్పుడు లాభాలు బుక్ చేసుకుంటూ ఉంటే అతని ప్రయాణం సవ్యంగా సాగుతుంది. లేదంటే నష్టాలు తప్పవు.పైన తెలిపిన ఉదాహరణ బేసిక్ వివరాలు తెలిపేందుకే. టెక్నికల్‌గా ఒక షేరుకు ఎక్కడ సపోర్ట్ దొరుకుతోంది.. ఎక్కడ రెసిస్టన్స్ ఎదురవుతోంది.. ఆప్షన్ గ్రీక్స్ వల్ల ఏం తెలుసుకోవచ్చు.. టైం డికే ప్రాధాన్యం ఏమిటో.. ఐటీఎమ్, ఓటీఎంల గురించి తదుపరి ఆర్టికల్‌లో తెలుసుకుందాం.- బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
‘ఆప్షన్స్’తో గేమ్లొద్దు!
కరోనా ఎంతోమంది జీవితాల్ని తలకిందులు చేసేసింది. బయటకు వెళ్లలేని పరిస్థితి. ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయి. ఆదాయ మార్గాలు అడుగంటాయి. ఈ తరుణంలో ఉన్నకొద్ది డబ్బులతో ఇంట్లో కూర్చుని ఎలాగోలా నాలుగు రూపాయలు సంపాదించడానికి చాలామంది ఎంచుకున్న ఆదాయ మార్గం స్టాక్ మార్కెట్. అది కూడా ఆప్షన్స్ ట్రేడింగ్(Option Trading). మార్కెట్‌పై సరైన నాలెడ్జ్ లేకపోవడం, అరాకొరా పరిజ్ఞానంతో అడుగుపెట్టడం వంటి కారణాలతో ఎంతోమంది ట్రేడర్లు మునిగిపోయారు. ముఖ్యంగా తక్కువ డబ్బులతోనే ఎక్కువ సంపాదించవచ్చనే దురాశ, చేసిన తప్పులే చేస్తూండడం, డబ్బు పోగొట్టుకున్నా మళ్లీ సంపాదించవచ్చులే అనే ఉద్దేశంతో అప్పు చేసి మరిన్ని డబ్బులు పెట్టడం.. అవి కూడా పోగొట్టుకోవడం..జీవితంలో కోలుకోలేని దెబ్బ తినడం.. చాలామంది ఎదుర్కొన్న, ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే. ఇలా డబ్బులు పోగొట్టుకున్న వాళ్లలో అధిక శాతం ఆప్షన్స్ ట్రేడర్లే.నిజంగా అంత ప్రమాదమా..?నిజంగా ఆప్షన్స్ అంత ప్రమాదకరమా..? పెట్టే డబ్బులన్నీ పోవాల్సిందేనా..? ఈ ప్రశ్నలకు ఒకటే సమాధానం. ఆప్షన్స్ తో గేమ్ లాడొద్దు. ఆదమరిస్తే మునిగిపోతారు. మీరు ఆప్షన్స్‌లో ట్రేడ్ చేయాలి అనుకుంటే కనీస పరిజ్ఞానం ఉండి తీరాలి. ఈక్విటీ(Equity)ల్లో అయితే లాట్ కొనుగోలు చేసి లాభం వచ్చేంత వరకు కొన్ని రోజులపాటు హోల్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఆప్షన్స్ అలా కాదు. ఏమాత్ర ఏమరపాటుగా ఉన్నా క్యాపిటల్ అంతా పోగొట్టుకోవాల్సిందే. అసలు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయాలి అనుకునే ముందు ఏయే అంశాలు తెలిసి ఉండాలో చూద్దాం.అండర్ లయింగ్ అసెట్కాల్స్పుట్స్స్ట్రైక్ ప్రైస్ఆప్షన్స్ చైన్ఓపెన్ ఇంటరెస్ట్చేంజ్ ఇన్ ఓపెన్ ఇంటరెస్ట్వాల్యూమ్ఇంటరెన్సిక్ వేల్యూడెల్టా, గామా, తీటా, వెగా, ఆర్హెచ్ఓఅండర్ లయింగ్ అసెట్ అంటే మనం కొనాలనుకుంటున్న షేర్ విలువ. దీన్ని ఆధారం చేసుకునే ఆప్షన్స్ ట్రేడింగ్‌కు ప్రీమియంలు నిర్ధారితమవుతాయి. ఎఫ్ అండ్ ఓలో ఏది కొన్నా లాట్ల్లోనూ కొనుగోలు చేయాలి. ఫ్యూచర్స్(Futures)లో కూడా ఇంచుమించు షేర్ ధర అదే స్థాయిలో ఉంటుంది. ఉదాహరణకు మీరు రిలయన్స్ షేర్ కొనాలి అనుకున్నారు. ప్రస్తుత షేర్ ధర రూ.1240 దగ్గర ఉంది. ఇది అండర్ లయింగ్ అసెట్ అవుతుంది. ఫ్యూచర్స్ & ఆప్షన్స్‌లో మనం లాట్స్ రూపంలోనే షేర్లు కొనాలి అని చెప్పుకున్నాం కదా. ఒక లాట్ కొనాలి అంటే కనీసం 500 షేర్లు తీసుకోవాలి. ఈక్విటీల్లో కొనాలి అంటే దాదాపు రూ.6,20,000 పెట్టుబడి పెట్టాలి. ఇదే ఫ్యూచర్స్‌లో అయితే రూ.1,10,000 ఉంటే సరిపోతుంది. అదే ఆప్షన్స్‌లో అయితే రూ.1240 కాల్ కొనాలి. ఇది రూ.27 లో ఉంది. అంటే రూ.13,500 (రూ.27X500)ఉంటే చాలు కొనేయగలం. పెట్టుబడి తక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ ఈ మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు.అసలు సమస్య ఇదే..తక్కువకు వస్తుందని పరిస్థితులు తెలుసుకోకుండా ఆప్షన్స్ ఎంచుకుంటే షేర్ ధర రూ.1240 దాటి పెరుగుతున్నంత సేపూ ఈ కాల్ కూడా పెరుగుతూ ఉంటుంది. తద్వారా లాభాలు సంపాదించొచ్చు. అదే షేర్ ధర పడిపోతూ ఉంటే కాల్ కూడా పడిపోతూ ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆప్షన్స్ కాల పరిమితి కేవలం నెల రోజులే. ఈ నెల రోజుల్లో షేర్ ధర పెరగకపోయినా, అక్కడక్కడే కదలాడుతూ ఉన్నా నెలాఖరుకి మన పెట్టుబడి సున్నా అయిపోతుంది. అంటే మొత్తం రూ.13,500 పోతాయి. షేర్ ధర కంటిన్యూగా పెరుగుతూ ఉంటే వచ్చే లాభం మాత్రం అపరిమితంగా ఉంటుంది. ఇక్కడ టైం డికే (కాల వ్యవధి తగ్గిపోతూ ఉండటం) చాలా కీలకం.ఇప్పుడేం చేయాలి..షేర్ ధర పడిపోతుంది అనుకున్నప్పుడు పుట్స్ కొనాలి. పైన తెలిపిన ఉదాహరణనే తీసుకుంటే.. రిలయన్స్ షేర్ ధర రూ.1240 కంటే పడిపోతుంది అని భావిస్తే రూ.1240 ఫుట్ కొనాలి. ఇది రూ.22 లో ఉంది. (500X22 = 11000) షేర్ ధర పడిపోతున్న కొద్దీ మనకొచ్చే లాభం పెరుగుతూనే ఉంటుంది. అలా కాకుండా షేర్ రూ.1240 దాటి పెరుగుతూ వెళ్లినా, అక్కడక్కడే కదలాడిన నెలాఖరుకి మన ప్రీమియం హరించుకుపోయి చివరికు జీరో అవుతుంది. నెల రోజులకు మించి ఈ ఆప్షన్స్‌ను కొనసాగించే అవకాశం ఉండదు. కాబట్టి సాధ్యమైనంత తొందరగా తగిన లాభాల్ని ఎప్పటికప్పుడు బుక్ చేసుకుంటూ బయటకు వచ్చేయడం ఉత్తమం.ఇదీ చదవండి: ఆర్థిక మోసాలకు చెక్ పెట్టేలా పరిష్కారాలుగుర్తు పెట్టుకోవాల్సినవి..షేర్ ధర పెరిగేటప్పుడు పెరిగేవి కాల్స్షేర్ ధర పడిపోయేటప్పుడు పెరిగేవి పుట్స్ఒక కంపెనీ షేర్ ధర మనం కొనాలనుకునే ఆప్షన్స్‌కు అండర్ లయింగ్ అసెట్ అవుతుంది.షేర్ ధరకు అనుగుణంగా మనం తీసుకునే కాల్/పుట్ (ఉదా: రూ.1230, 1240, 1250, 1260... ఇలా)నే స్ట్రైక్ ప్రైస్ అంటారు.వీటికి తోడు ఆప్షన్స్ చైన్, అందులో ఓపెన్ ఇంటరెస్ట్, ఓపెన్ ఇంటరెస్ట్‌లో చోటు చేసుకునే మార్పులు, వాల్యూమ్, ఇంటరెన్సిక్ వ్యాల్యూ వంటివి ఆప్షన్స్ ట్రేడింగ్‌లో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవేగాక ఇన్ ది మనీ (ఐటీఎమ్), ఎట్ ది మనీ (ATM), అవుట్ అఫ్ ది మనీ (ఓటీఎం) ఆప్షన్స్ ట్రేడింగ్‌లో ఈ మూడింటి గురించి తదుపరి ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం.- బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
ఆర్థిక ఫలితాలతో దిశా నిర్దేశం!
గత వారం మార్కెట్లో బుల్స్(Market Bulls) హడావుడి కనిపించింది. వాస్తవానికి అంతక్రితం వారం రావాల్సిన షార్ట్ కవరింగ్ కిందటి వారం రావడం ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా గత గురువారం సెన్సెక్స్ 1400 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 400 పాయింట్ల దాకా పెరిగాయి. మళ్లీ శుక్రవారం కొంతమేర నష్టాల్లో నడిచినప్పటికీ పెద్దగా ప్రభావం చూపించలేదు. డిసెంబర్ నెలకు సంబంధించి వాహన విక్రయాలు సానుకూలంగా ఉండటం... మరీ ముఖ్యంగా మారుతీ షేర్ల దూకుడు, ఐటీరంగం(IT Sector)లో మళ్లీ కొనుగోళ్లు పుంజుకోవడం, జీఎస్టీ వసూళ్లు బావుండటం..వంటి కారణాలు మార్కెట్‌ను ముందుకు నడిపాయి. వారం మొత్తానికి సెన్సెక్స్ 79223, నిఫ్టీ 24004 పాయింట్ల వద్ద ముగిశాయి. అంత క్రితం వారంతో పోలిస్తే గత వారం మొత్తం మీద సెన్సెక్స్ దాదాపు 525 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ సుమారు 191 పాయింట్లు పెరిగింది.ఈవారం ఇలా..తెలుగు వాళ్లకు సంక్రాంతి ఎంత పెద్ద పండుగో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. స్టాక్ మార్కెట్‌కు సంబంధించి అలాంటి పండగే రాబోతోంది. అదే ఆర్థిక ఫలితాలు. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలు ఈవారం నుంచే మొదలు కాబోతున్నాయి. ఈ నెల 9న టీసీఎస్ ఫలితాలతో సందడి మొదలవుతుంది. ఇక ఈ ఫలితాలు మార్కెట్లకు రాబోయే రోజుల్లో దిశానిర్దేశం చేయబోతున్నాయి. ఈసారి ఫలితాలు కొంత ప్రొత్సాహకారంగా ఉండొచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది సానుకూల సంకేతం. మరోపక్క క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో పలచబడ్డ విదేశీ మదుపర్ల లావాదేవీలు మళ్లీ జోరు అందుకుంటాయి. అయితే గత వారం చివర్లో కనిపించిన కొనుగోళ్ల ఉద్ధృతి కొనసాగడం అనేది ఆర్థిక ఫలితాలు, విదేశీ మదుపర్ల చర్య పైనే పూర్తిగా ఆధారపడి ఉంది. ఎఫ్ఐఐల తీరువిదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) గత డిసెంబర్ నెల మొత్తం మీద రూ.16,982 కోట్ల నికర విక్రయాలు జరపగా, దేశీయ మదుపర్లు రూ.34,194 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. ఇక ఈ ఏడాది తొలి మూడు రోజుల్లోనూ విదేశీ మదుపర్లు రూ.4500 కోట్ల నికర విక్రయాలు చేశారు. అదే సమయంలో దేశీయ మదుపర్లు మాత్రం రూ.2500 కోట్ల నికర కొనుగోళ్లతో మార్కెట్‌కు అండగా నిలిచారు. సాంకేతిక స్థాయులుసెన్సెక్స్, నిఫ్టీల్లో ఒడుదొడుకులు కొంత మేర తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా బుల్స్ పుంజుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే ఇందుకు కారణం. కొనుగోళ్ల జోరు కొనసాగితే నిఫ్టీ 24250 పాయింట్ల వరకు పరుగులు తీయొచ్చు. ఈ స్థాయిని కూడా అధిగమిస్తే 24600 వరకు పెద్దగా ఇబ్బంది ఎదురుకాకపోవచ్చు. ఒకవేళ అమ్మకాలు పెరిగితే 23800 కీలక స్థాయిని మార్కెట్ చూసే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా బ్రేక్ చేస్తే పతనం మరింత పెరిగి గతంలోని కనిష్టస్థాయులను టచ్ చేసే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే గత మద్దతు స్థాయి అయిన 23300 మార్కెకు పడిపోవచ్చు. ఆ స్థాయికి క్షీణించడానికి ముందు కొద్దిపాటి రికవరీకి ఆస్కారం ఉంటుంది.ఇదీ చదవండి: మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమారంగాలవారీగా...ఆటోమొబైల్ రంగంలో జోరు కొనసాగే అవకాశం ఉంది. డిసెంబర్ నెలకు ఈ కంపెనీలు ప్రకటించిన విక్రయ గణాంకాలు చాలావరకు మదుపర్లను మెప్పించాయి. మారుతీ షేర్లలో దూకుడు కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ ప్రాఫిట్ బుకింగ్‌కు అవకాశం ఉంటుంది. గత కొద్దివారాలుగా లాభాల్లో సాగుతున్న ఫార్మా రంగం ర్యాలీ ఈవారం కూడా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా మార్కెట్లో ఒడుదొడుకులు ఎదురవుతున్నప్పుడు మదుపర్లు ముందుగా సురక్షితంగా భావించి కొనుగోళ్లు జరిపేది ఈ రంగంలోని షేర్లనే. ఇక టీసీఎస్ ఆర్థిక ఫలితాలు రాబోయే రోజుల్లో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ వంటి ఐటీ కంపెనీల షేర్లను ప్రభావితం చేస్తాయి. అల్ట్రాటెక్, అంబుజా షేర్లకు మద్దతు దొరికే అవకాశం ఉన్నప్పటికీ సిమెంట్ షేర్లలో పెద్దగా దూకుడు ఉండకపోవచ్చు. అలాగే ఎఫ్ఎంసిజీ, యంత్ర పరికరాల రంగానికి చెందిన షేర్లు సైతం ఒత్తిళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది. టెలికం, ఆయిల్ రంగాల షేర్లలో స్థిరీకరణ జరగొచ్చు.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
Stock Market Trading: ఇండెక్స్‌ల్లో ట్రేడ్ చేస్తున్నారా...!
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారికి ఈక్విటీలు, ఫ్యూచర్స్ & ఆప్షన్స్ అనే మార్గాలు ఉంటాయని గత ఆర్టికల్ లో చెప్పుకున్నాం కదా...ఇందులో ఫ్యూచర్స్ & ఆప్షన్స్... దానిలో ఇండెక్స్ ట్రేడ్ ల గురించి ఇప్పుడు చూద్దాం.వాస్తవానికి ఫ్యూచర్స్ కి, ఈక్విటీల్లో ట్రేడింగ్ కి పెద్దగా తేడా ఉండదు. ఈక్విటీ ల్లో షేర్లు గా వ్యవహరిస్తే... ఫ్యూచర్స్ & ఆప్షన్స్ (ఎఫ్ & ఓ ) లో కాంట్రాక్టులు గా పేర్కొంటారు. ఈక్విటీల్లో మనం కొనే షేర్లు ఎన్ని సంవత్సరాలైనా అట్టేపెట్టుకోవచ్చు. షేర్లు అనేవి మన ఆస్తిగా భావించవచ్చు. కాంట్రాక్టులను మాత్రం ఆవిధంగా పరిగణించలేం. ఎఫ్ & ఓ లో కాంట్రాక్టులు కొన్నప్పుడు కేవలం ఒక నెల రోజుల వ్యవధికే పరిమితమవుతాయి.ఒకవేళ మనం కొన్న కాంట్రాక్టు మంచి లాభాల్లో ఉంటే ఆ నెల రోజుల్లో ఎప్పుడైనా ఆ లాభాన్ని బుక్ చేసుకుని బయటకు వచ్చేయొచ్చు. అదే నష్టాల్లో ఉంటే నెల రోజుల వరకు ఆగొచ్చు. అప్పటికీ నష్టాల్లోంచి బయట పడకపోతే కచ్చితంగా నెలాఖరున బయటకు వచ్చేయాల్సి ఉంటుంది. ఆ కాట్రాక్టు రాబోయే రోజుల్లో పెరుగుతుందనే నమ్మకం ఉంటే... ప్రస్తుతం చేతిలో ఉన్న కాంట్రాక్టు ను నెలాఖరున అమ్మేసి తదుపరి నెల కాంట్రాక్టు ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.ఈక్విటీల్లో ఒక్క షేర్ మొదలుకొని మన చేతిలో ఉన్న డబ్బుల్ని బట్టి ఎన్ని షేర్లు అయినా కొనుక్కోవచ్చు. ఎఫ్ & ఓ లో తప్పనిసరిగా లాట్స్ లో మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. షేరును బట్టి, ఇండెక్స్ ను బట్టి లాట్ సైజు ను నిర్ణయిస్తారు.ఉదా: రిలయన్స్ షేర్ ధర రూ. 1250 ఉంది. దీన్ని ఎఫ్ & ఓ లో కొనుగోలు చేయాలంటే 500 షేర్లు (1 లాట్) తీసుకోవాలి. అదే జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్స్ 5625 (ఒక లాట్) షేర్లు కొనాలి. ఐటీసీ అయితే.. 1600 (ఒక లాట్) తీసుకోవాలి.ఎఫ్ & ఓ లో ట్రేడ్ చేయాలంటే కేవలం లాట్స్ లో అది కూడా పరిమిత కాలానికి మాత్రమే కొనగలం అన్న విషయం అర్ధం అయింది కదా... ఇప్పుడు ఇండెక్స్ ల గురించి మాట్లాడుకుందాం. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి కి సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి కి నిఫ్టీ ప్రాతినిధ్యం వహిస్తాయి అన్న విషయం మనకు తెలుసు కదా...ఈ సెన్సెక్స్, నిఫ్టీ లతో పాటు నిఫ్టీ నెక్స్ట్ 50, బీఎస్ఈ బ్యాంకెక్స్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఫిన్ నిఫ్టీ. బ్యాంకు నిఫ్టీ ల్లో కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇవి కాక ఆటో, ఫార్మా, ఐటీ.... ఇలా వివిధ రంగాలకు కూడా ఆయా ఇండెక్స్ లు ఉంటాయి. కానీ వీటిలో ట్రేడింగ్ చేయలేం.గత నవంబర్ 20 వ తేదీ వరకు మిడ్ నిఫ్టీ కి సోమవారం, ఫిన్ నిఫ్టీ కి మంగళవారం, బ్యాంకు నిఫ్టీ కి బుధవారం, నిఫ్టీ కి గురువారం, సెన్సెక్స్ కు శుక్రవారం... ఇలా వీక్లీ కాంట్రాక్టు లు ఉండేవి. అంటే ఆ వారాంతానికి ముగిసిపోయే కాంట్రాక్టు లన్న మాట. ఇలా ట్రేడింగ్ జరిగే ప్రతి రోజూ ఏదో ఒక ఎక్సపైరీ ఉండటం వల్ల రిటైల్ ట్రేడర్లు భారీగా నష్టపోతున్నారన్న ఉద్దేశంతో సెబీ... సెన్సెక్స్, నిఫ్టీ లకు తప్ప మిగతా ఇండెక్స్ లకు వీక్లీ కాంట్రాక్టు లు తీసేసింది.బీ ఎస్ ఈ కి సెన్సెక్స్, ఎన్ ఎస్ ఈ కి నిఫ్టీ లు ప్రామాణిక సూచీలు కాబట్టి వీటిలో మాత్రం వీక్లీ, మంత్లీ కాంట్రాక్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా సెన్సెక్స్ వీక్లీ, మంత్లీ ఎక్సపైరీ శుక్రవారం ఉండగా వచ్చే వారం నుంచి మంగళవారం (జనవరి 7,14, 21, 28... ఇలా ) కి మారబోతోంది. నిఫ్టీ కి మాత్రం గురువారమే కొనసాగుతుంది. అలాగే లాట్ సైజు లను కూడా సెబీ మార్చింది. వాటి వివరాలు.ఇండెక్స్లాట్ సైజు ప్రస్తుతంమార్చాకఅమల్లోకి వచ్చే/వచ్చిన తేదీ నిఫ్టీ2575జనవరి 2, 2025బ్యాంకు నిఫ్టీ1530ఫిబ్రవరి 2025ఫిన్ నిఫ్టీ2565 ఫిబ్రవరి 2025మిడ్ నిఫ్టీ50120 ఫిబ్రవరి 2025సెన్సెక్స్ 10 20 జనవరి 7, 2025 నిఫ్టీ నెక్స్ట్ 50 10 25 నవంబర్ 20, 2024 బీఎస్ఈ బ్యాంకెక్స్ 15 30 నవంబర్ 20, 2024మిడ్, ఫిన్, బ్యాంకు నిఫ్టీ ల్లో ట్రేడ్ చేయాలంటే తప్పనిసరిగా నెలవారీ కాంట్రాక్టులు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇవి చాల ఖరీదు ఉంటాయి. అదే సమయంలో లాట్ సైజు లను కూడా పెంచడం వల్ల రిటైల్ ట్రేడర్లు గతంతో పోలిస్తే ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల వారి ప్రమేయం తగ్గుతుందని, తద్వారా వారి నష్టాల స్థాయిని తగ్గించవచ్చనేది సెబీ ఉద్దేశం.ఉదా: గతంలో ఒక ట్రేడర్ రూ. 100 ఖరీదు చేసే నిఫ్టీ 50 ఆప్షన్ ఒక లాట్ కొనడానికి రూ. 100 X 25 (లాట్ సైజు) = రూ.2,500 వెచ్చిస్తే సరిపోయేది. మారిన నిబంధనల ప్రకారం ఇప్పుడు అదే లాట్ కొనాలంటే రూ. 7,500 పెట్టాలి. అంటే చేతిలో రూ.25,000 ఉన్న వ్యక్తి 10 లాట్లు కొనగలిగేవాడు కాస్తా తాజాగా రూ.75,000 పెట్టాల్సి ఉంటుంది కాబట్టి... ట్రేడింగ్ లో రిటైలర్ల ప్రమేయం తగ్గిపోతుంది. తద్వారా వారికొచ్చే నష్టాలు కూడా పరిమితం గానే ఉంట్టాయన్న ఉద్దేశంతో సెబీ ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇండెక్స్ ల్లో ట్రేడ్ చేసేవారు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.-బెహరా శ్రీనివాస రావుస్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
ట్రేడింగ్‌లో ఫ్యూచర్స్ & ఆప్షన్స్: ఏది బెస్ట్ అంటే..
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో ఈమధ్య ఎక్కువ మంది అనుసరిస్తున్న మార్గం ఫ్యూచర్స్ & ఆప్షన్స్ (ఎఫ్ & ఓ). వీటినే డెరివేటివ్స్ అంటారు. ఈక్విటీలకు మరో ప్రత్యామ్నాయ రూపమే ఈ డెరివేటివ్స్ అన్నమాట. ఈ రెండిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ఫ్యూచర్స్ ట్రేడింగ్▸ఈక్విటీల్లో షేర్లు ఎలా కొంటామో ఫ్యూచర్స్‌లోనూ అదే మాదిరి కొనుక్కోవచ్చు. ▸ఈక్విటీల్లో ఒక్క షేర్ సైతం కొనుక్కునే వెసులుబాటు ఉంటే ఫ్యూచర్స్‌లో మాత్రం తప్పనిసరిగా ఒక లాట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ▸ఆయా కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయ్యే ధరలను బట్టి లాట్ పరిమాణం నిర్ణయమవుతుంది.▸గతంలో ఫ్యూచర్స్‌లో షేర్లు కొనేటప్పుడు అతి తక్కువ పెట్టుబడి అవసరమయ్యేది. కానీ నిబంధనలు మారిన తర్వాత కొంచెం ఎక్కువ పెట్టుబడి అవసరమవుతోంది.ఉదా: రిలయన్స్ షేర్లు ఫ్యూచర్స్‌లో కొనాలని అనుకున్నాం. లాట్ సైజు 500. ఇంతే మొత్తం షేర్లను ఈక్విటీల్లో కొనాలంటే రూ. 6,25,000 కావాలి. అదే ఫ్యూచర్స్‌లో అయితే రూ.1,10,836 సరిపోతుంది.▸ఈక్విటీలు, ఫ్యూచర్స్కి తేడా ఏమిటంటే.. ఈక్విటీల రూపంలో కొన్న షేర్లు మనం ఎన్నాళ్లయినా మన దగ్గర ఉంచుకోవచ్చు. ▸అవి ఒక రకంగా పెట్టుబడి. షేర్ ధర పడిపోయినా ఆందోళన చెందనక్కర్లేదు.▸డబ్బులు అవసరమైనప్పుడు అమ్ముకోవచ్చు, డబ్బులు ఉన్నప్పుడు ధర పడినా/పెరిగినా మరిన్ని షేర్లు కొనుక్కుంటూ మన పోర్ట్‌ఫోలియోను పెంచుకోవచ్చు. మంచి లాభాలు వచ్చేవరకూ ఎన్నాళ్లయినా ఎదురుచూడొచ్చు.▸ఫ్యూచర్స్‌లో ఈ వెసులుబాటు ఉండదు. ఫ్యూచర్స్‌లో కొనే షేర్లను కాంట్రాక్టులుగా పరిగణిస్తారు. ఆ కాంట్రాక్టు నెల రోజుల వ్యవధికే పరిమితమవుతుంది. ▸దీన్ని పెట్టుబడిగా కాక స్వల్పకాలిక ట్రేడింగ్ వనరుగా మాత్రమే పరిగణించాలి.▸నెల రోజుల వ్యవధిలో కాంట్రాక్టు ధర ఎప్పుడు పెరిగినా తగిన ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేయాలి.▸కాంట్రాక్టు ధర పడిపోతే మళ్ళీ పెరిగే వరకు అంటే ఆ నెల చివరిదాకా కూడా ఆగొచ్చు. అప్పటికీ పెరక్కపోతే అమ్ముకుని నష్టాన్ని బుక్ చేయాల్సిందే.▸ప్రస్తుతానికి పడినా.. మళ్ళీ పెరుగుతుందనే నమ్మకం ఉంటే నెలాఖరులో ప్రస్తుత కాంట్రాక్టు వదిలించుకుని తరువాతి నెల కాంట్రాక్టు తీసుకోవచ్చు. ఆ నెలలో కూడా కొన్న రేటు రాక ఇంకా పడిపోతే.. మరింత నష్టాన్ని భరించక తప్పదు. లేదంటే ఆ తరవాతి నెలకు షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది.▸ఇది కాంట్రాక్టు కాబట్టి మొత్తం డబ్బులు పెట్టక్కర్లేకుండా నాలుగో వంతు ధరకే కొనుక్కునే అవకాశం ఉంటుంది. పైన చెప్పుకున్న రిలయన్స్ ఉదాహరణ చూడండి. ఎక్కువమంది స్వల్పకాలిక అవసరాలు, తక్కువ పెట్టుబడిని దృష్టిలో ఉంచుకుని ఈ మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు.ఆప్షన్స్ ట్రేడింగ్ఈక్విటీలకు మరో డెరివేటివ్ రూపమే ఆప్షన్స్. ఫ్యూచర్స్‌తో పోలిస్తే చాలా చాలా తక్కువ పెట్టుబడికి ట్రేడింగ్ చేసుకునే సౌలభ్యం ఇందులో ఉంది. అందుకే ట్రేడర్లలో నూటికి 90 మంది ఈ మార్గాన్ని అనుసరిస్తారు. ఈ 90లో 85 మంది నష్టపోయేవాళ్లే. డబ్బుల సంపాదనకు చాలా సులువైన మార్గంగా కనిపించే ఈ ఆప్షన్స్ అనేవి రిటైల్ ట్రేడర్ల కోట్ల సొమ్ము మింగేస్తున్నాయి. అదెలాగో తర్వాత తెలుసుకుందాం.➜ఆప్షన్స్‌లోనూ ఫ్యూచర్స్ మాదిరిగానే, అదే పరిమాణంలో లాట్లలోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అది కూడా నెలవారీ కాంట్రాక్టుల్లోనే చేయాలి. ఆప్షన్స్‌లో కొనేవాటికి ప్రీమియం ఉంటుంది. ఆ రేటు పెట్టి కొనుక్కోవచ్చు.దీనికి కూడా పై ఉదాహరణనే పరిశీలిద్దాం.రిలయన్స్ షేర్లు (500) ఈక్విటీల్లో కొంటే.. రూ. 6,25,000 అవసరమవుతాయి. ఫ్యూచర్స్‌లో కొంటే రూ. 1,10,000 కావాలి. ఆప్షన్స్‌లో రూ.1250 కాల్ రూ. 27 ఉంది. పెట్టుబడి 27X500 = 13,500 ఉంటే చాలు.అందరూ ఎగబడేది ఇందుకోసమే. ఇంత తక్కువ పెట్టుబడితో కూడా ట్రేడ్ చేసుకునే సదుపాయం ఆప్షన్స్‌లో ఉంటుంది. షేర్ ధర మారే దాన్ని బట్టి ఈ ప్రీమియం లోనూ మార్పులు జరుగుతాయి.రిలయన్స్ షేర్ ధర ప్రస్తుతం రూ.1,250 వద్ద ఉంది. కాబట్టి రూ.1,250 కాంట్రాక్టు కొన్నాం అనుకుందాం. షేర్ ధర కేవలం 2,3 రోజుల వ్యవధిలోనే రూ. 1,300 కి వెళ్తే ప్రీమియం కూడా దాదాపు రూ. 40 దాకా పెరుగుతుంది. అంటే అదంతా మీకొచ్చే లాభమేనన్న మాట. రూ.40X500 = రూ.20,000. కేవలం రూ. 13,500 పెట్టుబడితో రెండే రెండు రోజుల్లో రూ.20,000 సంపాదించినట్లు అవుతుంది. ఈ షేర్ ధర ఎంత పెరుగుతూ ఉంటే ప్రీమియం కూడా అంత పెరుగుతూ ఆమేరకు లాభాలను అందిస్తూ ఉంటుంది. అదే షేర్ ధర 50 రూపాయలు పెరిగినప్పటికీ... అలా పెరగడానికి పట్టే కాలం ఎక్కువగా ఉంటే... వచ్చే లాభం తక్కువగా ఉంటుంది. ఒక్కోసారి ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకుంటాం.➜ట్రేడర్లలో అత్యధికులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాల్ని.. అది కూడా కేవలం స్వల్ప వ్యవధిలోనే సంపాదించేయాలనే ఉద్దేశంతో ఈ ఆప్షన్స్ మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు.➜మార్కెట్ పడుతున్నా.. షేర్ ధర క్షీణిస్తున్నా కూడా ఆప్షన్స్‌లో లాభాలు సంపాదించవచ్చు. ➜ఆప్షన్స్‌లో మనకొచ్చే లాభాలు అపరిమితం. ఒక్కోసారి కేవలం రూ. 5,000 పెట్టుబడి కూడా ఒక్క నెల రోజుల వ్యవధిలోనే రూ.5 లక్షలు అయిపోవచ్చు. నష్టం వస్తే మాత్రం పోయేది ఆ రూ. 5,000 మాత్రమే. ఇదేదో బానే ఉంది.. బాగా సంపాదించేయవచ్చు అనుకుంటున్నారు కదూ. లక్షలు లక్షలు ఊరికే వచ్చేయవు. ఇందులో వచ్చే దానికంటే పోయేదే ఎక్కువ ఉంటుంది.ఎందుకలా జరుగుతుంది.. షేర్ ధర పెరిగినా ఆప్షన్స్ ఎందుకు పడిపోతాయి. మన పెట్టుబడి ఎందుకు సున్నా అయిపోతుంది... ఆప్షన్స్‌లో కాల్స్, పుట్స్ పాత్ర ఏమిటి.. ఆప్షన్స్‌లో ఉండే 'ఆప్షన్స్' ఏమిటి.. వంటి విషయాలను కూలంకషంగా తదుపరి కథనంలో తెలుసుకుందాం. -బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు. -
Stock Market: ఎన్నాళ్లు ఆగితే.. అన్ని లాభాలు!
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి విభిన్న మార్గాలున్నాయి. అందులో ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడం ఒకటి. పరోక్షంగా పెట్టుబడి పెట్టడం రెండోది. అంటే ఈక్విటీ మార్కెట్లో రిస్క్ చేయలేని వ్యక్తులు మ్యూచువల్ ఫండ్స్ మార్గాన్ని ఎంచుకోవడమన్న మాట.అదే ట్రేడింగ్ విషయానికొస్తే... మూడు రకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. 1. ఈక్విటీలు 2. ఫ్యూచర్స్ ట్రేడింగ్3. ఆప్షన్స్ ట్రేడింగ్ ఇందులో మొదటిదాని గురించి వివరంగా మాట్లాడుకుందాం.సాధారణంగా మన దగ్గర డబ్బులున్నపుడు వాటిని బ్యాంకుల్లోనో, పోస్ట్ ఆఫీసుల్లోనో దాచుకుంటాం. ఈమధ్య స్టాక్ మార్కెట్ కల్చర్ బాగా పెరిగింది. అయితే చాలామంది ఇన్స్టంట్ లాభాల కోసం ఎగబడుతున్నారు. దీంతో వాళ్ళు ట్రేడింగ్ వైపు చూస్తున్నారే తప్ప భవిష్యత్ భరోసా గురించి ఆలోచించడం లేదు. ట్రేడింగ్ వైపు వెళ్లే వ్యక్తుల్లో నూటికి 95 మంది నష్టాల్లో కూరుకుపోయి లబోదిబో మంటున్నారు. అలాకాకుండా దీర్ఘకాలిక దృక్పథం మార్కెట్లోకి అడుగుపెడితే కచ్చితంగా మంచి ప్రయోజనాలే దక్కుతాయి.ఇందులో కూడా మూడు రకాల మార్గాలు అనుసరించవచ్చు. 1. స్వల్ప కాలిక పెట్టుబడి2. మధ్య కాలిక పెట్టుబడి 3. దీర్ఘకాలిక పెట్టుబడిపెట్టుబడులు పెట్టడానికి బాండ్లు, డిబెంచర్లు, రుణ పత్రాలు వంటి వివిధ మార్గాలు ఉన్నప్పటికీ మనం కేవలం స్టాక్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకునే పై మూడింటి గురించి వివరంగా చర్చించుకుందాం.స్వల్ప కాలిక పెట్టుబడిసాధారణంగా మూడు నెలల వ్యవధి నుంచి 12 నెలల వ్యవధితో చేసే పెట్టుబడుల్ని స్వల్ప కాలిక పెట్టుబడులుగా పరిగణించవచ్చు. అంటే మన దగ్గర డబ్బులు ఉంటాయి. కానీ వెంటనే వాటి అవసరం ఉండకపోవచ్చు. వాటిని మార్కెట్లోకి తరలిస్తే... మన అవసరానికి అనుగుణంగా మంచి ఫండమెంటల్స్ ఉన్న షేర్లను ఎంచుకుని స్వల్ప కాలానికి పెట్టుబడి పెట్టవచ్చు.ఇలాంటి సందర్భాల్లో మూడు పరిణామాలు చోటు చేసుకోవచ్చు. 1. మన పెట్టుబడి అమాంతం పెరిగిపోయి (మనం ఎంచుకునే షేర్లను బట్టి) మంచి లాభాలు కళ్ళచూడొచ్చు. మనం పెట్టుబడి పెట్టిన కంపెనీలకు సంబంధించి వచ్చే సానుకూల వార్తలు ఇందుకు కారణమవుతాయి. ఉదా: సదరు కంపెనీ రేటింగ్ ను అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు పెంచడం, ప్రభుత్వపరంగా సంబంధిత రంగానికి అనుకూలంగా ప్రకటనలు రావడం, ఆర్ధిక ఫలితాలు అద్భుతంగా ఉండటం.... వంటివి ఇందుకు దోహదం చేస్తాయి.2. మన పెట్టుబడి నష్టాల్లోకి జారిపోవడం. ఒక ఆరు నెలల పాటు మనకు డబ్బులతో పని లేదని వాటిని తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేస్తాం. ఆలోపు వివిధ ప్రతికూల అంశాలు మన పెట్టుబడిని హరించి వేస్తాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ప్రభుత్వాలు పడిపోవడం, ఆర్ధిక అనిశ్చిత పరిణామాలు, సంస్కరణలు పక్కదారి పట్టడం... వంటి అంశాలు మార్కెట్లను పడదోస్తాయి. ఇలాంటి సందర్భాల్లో సదరు షేర్లు కూడా ఎప్పటికప్పుడు పడిపోతూ ఉంటాయి.మీరు పెట్టుకున్న కాల వ్యవధి దగ్గర పడుతూ ఉంటుంది. షేర్లు మాత్రం కోలుకోవు.అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో బతుకు జీవుడా... అనుకుంటూ ఆ కాస్త సొమ్ముతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు మన అవసరాలు తీరడానికి అప్పు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఆర్జించడం మాట పక్కన పెట్టి అదనపు భారాన్ని మోయాల్సి ఉంటుందన్న మాట.3. పెట్టిన పెట్టుబడి లో పెద్దగా మార్పులు లేకపోవడం. ఆరు నెలలు గడిచినా మనం కొన్న షేర్లు అనుకున్నట్లుగా పెరగకపోవడమో, లేదంటే స్వల్ప నష్టాల్లో ఉండటమే జరుగుతుంది. దీనివల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు.మధ్య కాలిక పెట్టుబడి ఇది సాధారణంగా ఏడాది వ్యవధి మొదలుకొని 5 ఏళ్ల వరకు కాలవ్యవధి తో చేసే పెట్టుబడులు ఈ విభాగంలోకి వస్తాయి. స్వల్ప కాలిక పెట్టుబడులతో పోలిస్తే ఇవి ఒకింత మెరుగైన ప్రతిఫలాన్నే ఇస్తాయి. వ్యవధి ఎక్కువ ఉంటుంది కాబట్టి... ఒక ఏడాది రెండేళ్లపాటు మార్కెట్లో ఒడుదొడుకులు ఎదురైనా.. ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఆ తర్వాత షేర్లు కోలుకోవడానికి అవకాశం ఉంటుంది.అదే సమయంలో మన దగ్గర సొమ్ములున్నప్పుడల్లా మనం కొన్న షేర్లనో, వేరే షేర్లనో కొనుగోలు చేయడానికి అవకాశం ఉన్నందువల్ల రాబడి పెరగడానికి కూడా కచ్చితంగా వీలుంటుంది. మనమంతా మిడిల్ క్లాస్ మనుషులం అవడం వల్ల మన అవసరాలు ఎక్కువగానే ఉంటాయి. అందువాళ్ళ మధ్య కాలిక పెట్టుబడి మార్గాన్ని ఎంచుకుంటే తక్కువ రిస్క్ తోనే గణనీయ ప్రయోజనాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది.దీర్ఘ కాలిక పెట్టుబడి ఇది అన్ని విధాలా శ్రేయోదాయకం. అదెలాగంటే...1. మార్కెట్లు ఏళ్ల తరబడి పడిపోతూ ఉండవు. పడ్డ మార్కెట్ పెరగాల్సిందే. 2. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా పెట్టుబడి పెట్టుకుంటూ పోతాం. 3. వివిధ కంపెనీల షేర్లు కొనుగోలు చేయడం వల్ల ఒకట్రెండు నష్టాల్లో ఉన్నా... మిగతావి లాభాల్లో ఉండటం వల్ల మన పెట్టుబడి దెబ్బతినదు.4 . ఒకేసారి లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టేయాల్సిన అవసరం ఉండదు. 5. మన షేర్లపై సదరు కంపెనీలు డివిడెండ్లు ఇస్తాయి. ఇదో అదనపు ప్రయోజనం. 6. ఆయా కంపెనీలు షేర్లను విభజించడం, బోనస్ షేర్లు ఇవ్వడం వల్ల మన పోర్ట్ ఫోలియో లో షేర్ల సంఖ్యా పెరుగుతుంది. 7. మన అవసరాలు దీర్ఘకాలానికి ఉంటాయి కాబట్టి... భవిష్యత్‌లో అవసరమైనప్పుడో, లేదంటే ఆ షేరు బాగా పెరిగిందని భావించినప్పుడో మనం కొన్ని ప్రాఫిట్స్ ను వెనక్కి తీసుకోవచ్చు లేదా వేరే పెట్టుబడుల్లోకి మళ్లించవచ్చు. 8. పిల్లల చదువులు, పెళ్లిళ్లు... ఇత్యాది సందర్భాల్లో అప్పులు చేయాల్సిన దుస్థితి రాకుండా ఉపయోగపడతాయి.సంప్రదాయ డిపాజిట్లు పొదుపులతో పోలిస్తే... స్టాక్ మార్కెట్ పెట్టుబడులు అనేవి అధిక రాబడి ఇవ్వడానికి ఆస్కారం ఉందన్న విషయం అర్ధమయింది కదూ...అయితే మీరు తీసుకునే నిర్ణయమే... మీ భవిష్యత్ కు దిక్సూచిగా నిలుస్తుంది. మీ అవసరాలు స్వల్ప కాలికమా... మధ్య కాలికమా... దీర్ఘ కాలికమా... అన్నది మీరే నిర్ణయించుకోండి. తదనుగుణమా నిర్ణయాలు తీసుకుంటూ ముందడుగు వేయండి. ఒక్క మాట మాత్రం స్పష్టంగా చెప్పగలను.ఎప్పటికప్పుడు మీ పోర్టు ఫోలియో మీద కన్నేసి.. తగిన లాభాలు రాగానే బయటపడటం అనేదే స్వల్ప, మధ్య కాలాలకు ఉపయుక్తంగా ఉంటుంది. దీర్ఘ కాలిక దృక్పథం తో కొంటారు కాబట్టి... లాంగ్ టర్మ్ పెట్టుబడులు ఎప్పటికీ మంచి ఫలితాలే ఇస్తాయి. అయితే దీర్ఘ కాలానికి కొంటున్నాం కదా అని ఎవరో చెప్పారనో... తక్కువకు దొరుకుతున్నాయనో.. వ్యవధి ఎక్కువ ఉంటుంది కదా.. కచ్చితంగా పెరక్కపోవులే అనో... పనికిమాలిన పెన్నీ స్టాక్స్ జోలికి మాత్రం పోకండి.-బెహరా శ్రీనివాస రావుస్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
స్వల్ప స్థాయిలోనే కదలికలు
విదేశీ మదుపర్లు గతవారం పెద్దగా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కార్యకలాపాలు చేయనందున సూచీలు నత్తనడకన సాగాయి. బీఎస్ఈ(BSE) వారం మొత్తానికి దాదాపు 650 పాయింట్లు లాభపడి 78700 పాయింట్ల స్థాయిలో స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ(Nifty) ఇంచుమించు 200 పాయింట్లు పెరిగి 23813 పాయింట్ల దరిదాపుల్లో క్లోజయింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఒకవారం రోజుల వ్యవధిలో కేవలం 0.8 శాతం లాభపడ్డాయన్నమాట.విదేశీ మదుపర్లుడిసెంబర్ చివరి వారంలో విదేశీమదుపర్ల(FII) లావాదేవీలు పరిమిత సంఖ్యలోనే ఉంటాయి. ముఖ్యంగా క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల కోసం వీరు అధికశాతం ట్రేడింగ్‌పై పెద్దగా ఆసక్తి చూపరు. ఇప్పటికే మన మార్కెట్లో వీరి కొనుగోళ్లు బాగా పడిపోయాయి. ఒకరకంగా చెప్పాలంటే మన ఈక్విటీల్లో వీరి అమ్మకాలు 82 శాతానికి చేరాయి. నికర కొనుగోళ్లు కేవలం 18 శాతం స్థాయిలోనే ఉన్నాయి. ఈ తరుణంలో వాస్తవానికి గతవారం షార్ట్‌కవరింగ్ లావాదేవీల రూపంలో కొనుగోళ్ల మద్దతు లభించాల్సి ఉంది. కానీ అలాంటిదేమీ చోటుచేసుకోలేదు. పైగా గత శుక్రవారం ఆప్షన్స్ ట్రేడింగ్‌ను పరిశీలిస్తే భారీగా అమ్మకాలు ఒత్తిళ్లు ఉన్నాయి. ఎఫ్ఐఐలు మళ్లీ పూర్తి స్థాయిలో మార్కెట్లోకి అడుగుపెట్టేవరకు జోష్ తక్కువగానే ఉంటుంది. గత వారం విదేశీ మదుపర్లు దాదాపు రూ.11,000 కోట్ల షేర్లను నికరంగా కొనుగోలు చేశారు.ఈవారం అంచనాలుఈవారం మార్కెట్లు స్తబ్దుగానే సాగే అవకాశం ఉంది. మార్కెట్లను ఉత్తేజపరిచే సంఘటనలు ఏవీ లేకపోవడం, విదేశీ మదుపర్ల నిరాసక్తత ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. మరోపక్క రూపాయి బలహీనపడటం, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి త్వరలో వెలువడబోయే త్రైమాసిక ఫలితాలపై అంచనాలు అంతంతమాత్రంగా ఉండటం కూడా సెంటిమెంట్‌ను ప్రభావితం చేయవచ్చు. అలాగే ఒకటో తేదీన వెలువడే, జీఎస్టీ వసూళ్ల గణాంకాలు, వాహన విక్రయాల వివరాలు మార్కెట్ ను ప్రభావితం చేస్తాయి. ఈ వారం నిఫ్టీకి 23650 పాయింట్లు తక్షణ మద్దతుగా కనిపిస్తోంది. ఆ స్థాయిని బ్రేక్ చేసిన పక్షంలో మాత్రమే 23500 దిగువకు వెళ్తుంది. అక్కడ మార్కెట్‌కు మద్దతు దొరికి సూచీలు బలంగా పుంజుకునే సూచనలు ఉన్నప్పటికీ అమ్మకాలు వెల్లువెత్తితే మాత్రం 23350 -23000 వరకు పతనం కొనసాగవచ్చు. అలాకాక ముందుకు కదిలితే 23940 వద్ద మొదటి నిరోధం ఎదురవుతుంది. దాన్ని అధిగమిస్తే తదుపరి నిరోధం 24000 వద్ద ఉంది. దీన్నీదాటుకుని ముందుకెళ్తే 24200 వరకు ఎలాంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు. ఇప్పటికే మార్కెట్లు ఓవర్ సోల్డ్ జోన్లో ఉన్నాయన్నది వాస్తవం. ముఖ్యంగా సూచీల్లో ఎక్కువస్థాయిలో షార్ట్స్ బిల్డ్ అయి ఉన్నాయి. షార్ట్ కవరింగ్ లావాదేవీలకు అవకాశం ఉన్నప్పటికీ అంత సులువుగా కనిపించడం లేదు. ఇక బ్యాంకు నిఫ్టీ విషయానికొస్తే.. 51300 దిగువన కొనసాగితే మాత్రం 50500-50250 వరకు క్షీణించే అవకాశం ఉంది. అలా కాకుండా మార్కెట్లు ముందుకెళ్తే మొదటి దశలో 52000 వరకు సూచీ దూసుకెళ్ళవచ్చు. ఆపై 52500-52800 వరకు పరుగులు తీయొచ్చు.ఇదీ చదవండి: తప్పుల మీద తప్పులు... అప్పుల మీద అప్పులుసెక్టార్ల విషయానికొస్తే..మిగతా రంగాలతో పోలిస్తే ఈవారం ఫార్మా రంగం లాభాల బాటలో పయనించే అవకాశం ఉంది. రూపాయి క్షీణత ఈ రంగానికి కలిసొచ్చే ప్రధానాంశంగా చెప్పవచ్చు. అలాగే ఐటీ షేర్లకూ రూపాయి క్షీణత సానుకూలమే అయినప్పటికీ, వచ్చే నెలారంభంలో వెలువడే టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ కంపెనీల ఫలితాలు ఈ రంగంలోని షేర్ల దూకుడుకు అడ్డుకట్ట వేయొచ్చు. యంత్ర పరికరాల రంగానికి సాధారణ స్థాయిలోనే మద్దతు లభిస్తుంది. ఈ షేర్లు పెరిగేది తక్కువే. బ్యాంకింగ్ రంగంలో ప్రైవేటు బ్యాంకుల జోరు కొనసాగుతుంది. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకులపై ఇన్వెస్టర్లు ఓ కన్నేయవచ్చు. టెలికాం, ఎఫ్ఎంసీజీ, లోహ , సిమెంట్ రంగాలకు చెందిన షేర్లలో కదలికలు స్వల్ప స్థాయికి పరిమితమవుతాయి. ఆటో మొబైల్, చమురు షేర్లు నష్టాల్లోనే కొనసాగే అవకాశం ఉంది.-బెహరా శ్రీనివాస రావు స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
తప్పుల మీద తప్పులు... అప్పుల మీద అప్పులు
సంపాదించని వ్యక్తిని సమాజమే కాదు... ఇంట్లో వాళ్ళు కూడా లోకువగా చూస్తారన్నది ఒక నానుడి. సంపాదిస్తేనే సరిపోదు... అది సద్వినియోగం అయితేనే సార్ధకత. గత ఆర్టికల్ లో ఆర్ధిక క్రమశిక్షణ (Financial discipline) పాటించే వ్యక్తి జీవితం పూలపానుపు గా ఎలా మారుతుందో విశ్లేషించుకున్నాం..గాడి తప్పితే ఏమవుతుందో ఇప్పుడు సోదాహరణంగా చూద్దాం.శివకుమార్ చిన్నప్పటినుంచి ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చిన వ్యక్తి. చదువు పూర్తి కాగానే బతుకు తెరువు వెతుక్కుంటూ హైదరాబాద్ లో అడుగు పెట్టాడు. చిన్న ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు. తన ఖర్చులు పోగా కొంత మొత్తం ఇంటికి కూడా పంపేవాడు. కొన్నాళ్ళకు కొత్త జాబ్ ఆఫర్ వచ్చింది. గతంలో 20000 వచ్చే జీతం ఇప్పుడు 50000 అయింది. ఇంతకుముందు ఆర్టికల్ లో చెప్పుకున్న రాహుల్ మాదిరిగానే కుమార్ కు కూడా పాతికేళ్ల వయసులోనే 50000 ఉద్యోగం దొరికింది.అంతలోనే పెళ్లి కుదిరి ఓ ఇంటివాడయ్యాడు కూడా. భార్య రాకతో సింగిల్ రూమ్ ఖాళీ చేసి.. సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. అప్పటిదాకా కడుతున్న 3000 రెంట్ కాస్తా 8000 కు పెరిగింది. తప్పదుగా.. కొత్త కాపురం కావడంతో తను దాచుకున్న డబ్బులు ఖర్చు పెట్టి ఇంటికి అవసరమైన ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, బీరువా, ఓ పెద్ద టీవీ కొన్నాడు. పెళ్ళికి ముందే లక్షన్నర పెట్టి కొన్న బైక్ కి ఈఎంఐ (EMI) కడుతున్నాడు. అతనికున్న భారం ఏదైనా ఉందంటే ఇదొక్కటే. మరోపక్క అతనికున్న పెద్ద భరోసా క్రెడిట్ కార్డులు (Credit card) ... జీతం పెరిగాక పడి ఉంటాయిలే అని ఓ నాలుగైదు బ్యాంకుల క్రెడిట్ కార్డులు తీసుకున్నాడు. వాటి లిమిట్ కూడా దాదాపు 3 లక్షల దాకా ఉంది. క్రెడిట్ కార్డు మీద 30000 ఖర్చు పెట్టి ఓ మొబైల్ కొనుక్కున్నాడు. పెళ్లి అయ్యి ఏడాది కావడంతో వివాహ వార్షికోత్సవానికి భార్యకు లక్ష రూపాయలు పెట్టి ఓ నెక్లెస్ కొన్నాడు. రోజులు గడుస్తున్నాయి. ఇద్దరు పిల్లలు పుట్టుకు రావడమే కాదు, వాళ్ళను స్కూల్లో చేర్పించాల్సిన టైం కూడా వచ్చింది. ఫీజులు కాస్త ఎక్కువైనా వెనకాడక కొంచెం 'ఖరీదైన' స్కూల్లోనే చేర్పించాడు.మరోపక్క జీతం 80000 కు పెరగడం, బైక్ బాకీ తీరిపోవడంతో పెద్దగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులేవీ రాలేదు. ఒకవేళ వచ్చినా క్రెడిట్ కార్డులు వాడుతూ.. నెలనెలా కనీస మొత్తం కడుతూ వస్తున్నాడు. ఈనేపథ్యంలోనే సొంత ఇల్లు ప్లాన్ చేసి.. దాదాపు 70 లక్షలు పెట్టి ఓ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొన్నాడు. నెలకు 40000 రూపాయలు ఈఎంఐ పడుతోంది. ఇది పోను జీతంలో ఇంకో 40000 మిగులుతున్నా... ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులు, క్రెడిట్ కార్డు వాయిదాలు, ఊళ్ళో తల్లిదండ్రులకు పంపాల్సి ఉండటం.. ఇలా మొత్తం మీద వచ్చిన జీతం బొటాబొటీగా సరిపోతోంది. అయినా క్రెడిట్ కార్డులు ఉన్నాయన్న ధైర్యం అతన్ని పెద్దగా ఆందోళన పరచలేదు. ఇంతలో ఊహించని సంఘటన...ఓరోజు ఆఫీస్ నుంచి వస్తూండగా.. దారిలో ఆక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయ్యింది. హాస్పిటల్ లో వారం రోజులు ఉండి ఇంటికొచ్చాడు. హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ తీసుకోకపోవడంతో హాస్పిటల్ బిల్లు రెండున్నర లక్షలు అప్పోసొప్పో చేసి కట్టక తప్పలేదు. మరోపక్క నాలుగు నెలల పాటు బెడ్ రెస్ట్. ఎర్న్డ్ లీవ్ లు ఓ రెండు నెలల పాటు ఆదుకున్నా... మిగతా రెండు నెలలపాటు లాస్ అఫ్ పే తప్పలేదు. చేతికి రూపాయి వచ్చే మార్గం లేదు. క్రెడిట్ కార్డుల్లో బాలన్స్ కూడా వాడేశాడు.4 నెలల తర్వాత జాబ్ లో తిరిగి జాయిన్ అయ్యాడు. ఐదో నెల నుంచి శాలరీ రావడం మొదలయింది. కానీ జీవితం ఇదివరకటిలా లేదు. వచ్చే శాలరీ కి మించి కమిట్మెంట్స్ ఉండనే ఉన్నాయి. ఇప్పుడు అదనంగా క్రెడిట్ కార్డు బాకీల రూపంలో (మూడు లక్షలూ వాడేయడం వల్ల) నెలకు 15000 భారం (కనీస మొత్తమే కడుతున్నాడు అనుకుంటే) పడింది. మరోపక్క గోటి చుట్టు మీద రోకటి పోటులా ఇద్దరు పిల్లలకూ తలో 50000 చొప్పున ట్యూషన్ ఫీజు కట్టాల్సి వచ్చింది గతంలో చేసిన అప్పుకు ఇది మరింత ఆజ్యం పోసింది. అప్పులు.. వడ్డీలు.. ఖర్చులు.. రానురాను భారం పెరిగిపోతూ వచ్చింది.తట్టుకునే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించడం లేదు. బ్యాంకుల్లో పర్సనల్ లోన్ కోసం ప్రయత్నించాడు. అప్పటికే ఇంటి లోన్, క్రెడిట్ కార్డు బకాయిలు ఎక్కువగా ఉండటం వల్ల లోన్ రాలేదు. అయితే తన ఇంటి మీద టాప్ అప్ లోన్ వచ్చే అవకాశం ఉండటం తో దాన్ని ఆశ్రయించాడు. ఓ రెండు లక్షలు వచ్చాయి. దాంతో చిన్న చిన్న అప్పులు తీర్చేశాడు. అయినా భారం తగ్గకపోగా... కొత్త లోన్ తో ఈఎంఐ మరింత పెరిగింది. కష్టాలు కూడబలుక్కుని వస్తాయి అన్నట్లు తండ్రి ఆరోగ్యం దెబ్బతిని హాస్పిటల్ లో జాయిన్ చేయడంతో మరో 2 లక్షల దాకా ఖర్చయ్యాయి. ఇది కూడా అప్పే.ఇక పిల్లలు క్లాస్ మారడంతో పెరిగిన ఫీజు తట్టుకోలేక.. అలాగని వాళ్ళని ఆ స్కూల్ మాన్పించలేక (ప్రెస్టేజ్ ఇష్యూ) అప్పుల మీద అప్పులు చేస్తూ పోయాడు. బాకీలు తీర్చే పరిస్థితి లేకపోవడంతో మెల్లగా క్రెడిట్ కార్డులు డిఫాల్ట్ అవ్వడం మొదలైంది. ఇది అక్కడితో ఆగలేదు. ఇంటి లోన్ కూడా బకాయి పడే దుస్థితి ఎదురైంది. మొదట భార్య నెక్లెస్ కుదువ పెట్టాడు. తర్వాత బండి అమ్మేశాడు. ఆనక ఇల్లు అమ్ముకునే పరిస్థితి దాపురించింది.ఎన్నో కష్టాలుపడి జీవితంలో ఎదిగిన శివ కుమార్ చేసిన తప్పల్లా... ఆర్ధిక క్రమశిక్షణ పాటించకపోవడమే. దీనికి దారి తీసిన కారణాల గురించి విశ్లేషించుకుంటే...* ముందుచూపుతో వ్యవహరించకపోవడం * సరైన ఆర్ధిక ప్రణాళిక లేకపోవడం * తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోవడం* పెట్టుబడులపై దృష్టి పెట్టకపోవడం* ఆరోగ్య, జీవిత బీమా ల గురించి ఆలోచించకపోవడం * జీవితంలో పూర్తిగా స్థిరపడక మునుపే వివాహ బంధంలోకి అడుగుపెట్టడం * పిల్లల చదువుల విషయంలో స్థాయికి మించి పరుగులు తీయడం * చేతిలో కాసిని డబ్బులు కనబడగానే తనకు లోటు లేదనుకునే భ్రమలో బతికేయడం * ఎక్కువగా క్రెడిట్ కార్డు ల మీద ఆధారపడటం* క్రెడిట్ కార్డుల విషయంలో కనీస మొత్తాలు మాత్రమే చెల్లిస్తూ రావడం వల్ల బాకీ ఎప్పటికీ తీరకపోవడం* అప్పుల మీద అప్పులు చేస్తూ అధిక వడ్డీలు చెల్లించాల్సి రావడం... లోన్ ల కోసం ఎగబడటం * భవిష్యత్‌లో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకునే విధంగా పొదుపుపై దృష్టి పెట్టకపోవడం * స్థాయికి మించి ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడం...కష్టాలన్నవి చెప్పి చెప్పి రావు. అవి ఎప్పుడొచ్చినా తట్టుకునే విధంగా జీవితంలో ఆర్ధిక క్రమశిక్షణ అలవరచుకుంటేనే ఎలాంటి ఒడుదొడుకులనైనా తట్టుకునే సామర్ధ్యం కలుగుతుంది. మొదట్లో కాస్త కష్టపడ్డా... పక్కా ప్లానింగ్ తో ముందుకు సాగితే రాహుల్ మాదిరిగా చీకూ చింతా లేని జీవితం గడపగలుగుతాడు. లేదంటే శివకుమార్ లా అప్పుల ఊబిలో చిక్కుకుపోయి విలవిలలాడుతాడు.రాహుల్ లాంటి సుఖమయ జీవితం కావాలా.. శివకుమార్ లాంటి కష్టాల ప్రవాహం కావాలా... అన్నది మన చేతుల్లోనే ఉంది.-బెహరా శ్రీనివాస రావుపర్సనల్ ఫైనాన్స్ విశ్లేషకులు -
ఇది కదా ఇప్పుడు కావాల్సింది: ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తే..
జీవితానికి క్రమశిక్షణ ఎంత ముఖ్యమో.. ఆర్ధిక అంశాల్లోనూ అంతే పద్ధతిగా ఉండకపోతే కొంపలారిపోతాయి, అన్నది తోసిపుచ్చలేని వాస్తవం. మన జీవితంలో ఆర్ధికం, ఆరోగ్యం.. అత్యంత ప్రాధాన్యాంశాలు. డబ్బుండి ఆరోగ్యం లేకపోయినా.. ఆరోగ్యం ఉండి డబ్బు లేకపోయినా ఆ వ్యక్తి జీవితం లేదా కుటుంబం అష్టకష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంచేత ప్రతి వ్యక్తికీ ఆర్ధిక క్రమశిక్షణ అనేది అత్యంత ముఖ్యం. చాలామంది చేతులు కాలాక మేలుకుంటారు. అప్పటికి వారి జీవితం నిండా మునిగిపోయి ఉంటుంది.. ఈ పరిస్థితి రాకుండా మొదటినుంచీ మెలకువతో వ్యవహరిస్తే వారి జీవితాలు బాగుపడతాయి. కానీ ఇలా చేసేవాళ్లు చాలా తక్కువమంది ఉంటారు.22 -24 ఏళ్ల వయసులో సంపాదనలో పడేటప్పుడే మనం భవిష్యత్ అవసరాలను మదింపు చేయగలగాలి. గతంలో మన పూర్వీకులకు ఆర్ధిక అంశాలపై అంత అవగాహన లేకపోవడం, పెద్ద పెద్ద కుటుంబాల వల్ల వచ్చింది వచ్చినట్లుగా ఖర్చుపెట్టేయడం, పెట్టుబడి మార్గాలు పెద్దగా లేకపోవడం.. ఇత్యాది అంశాలన్నీ ఆర్ధిక క్రమశిక్షణ విషయంలో అవరోధాలుగా నిలిచేవి. ఇప్పుడలా కాదు. రకరకాల ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత సమాచారం అందుబాటులోకి ఉంటోంది. అదే సమయంలో విభిన్న పెట్టుబడి మార్గాలు మన కళ్ల ముందు ఉంటున్నాయి. ఇది ఒక రకంగా వరమనే చెప్పొచ్చు. కానీ ఎంతమంది వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారన్నదే ప్రధాన ప్రశ్న.ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తే ఏమవుతుంది.. అన్న విషయాన్ని ఉదాహరణ పూర్వకంగా వివరిస్తాను.రాహుల్ వయసు 24 ఏళ్ళు. అతనో ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. నెల జీతం రూ. 50,000. అందులోంచి రూ. 10,000 ఊళ్ళో ఉండే తల్లిదండ్రులకు పంపిస్తూ ఉంటాడు. అతనుండే సిటీలో రూము అద్దె, కరెంటు బిల్, తిండి ఖర్చులు, సాదరు, రవాణా ఖర్చులకు దాదాపు రూ. 20,000 దాకా అవుతుంది. మిగిలిన సొమ్ములో రూ. 10,000 వరకు హెల్త్ ఇన్సూరెన్సు(తనకు, తల్లిదండ్రులకు), డిపాజిట్లు, పెట్టుబడుల కోసం కేటాయించాడు. మిగతా రూ.10,000 ను పొదుపు చేస్తాడు. ఇదీ అతని నెలవారీ ప్రణాళిక.పొదుపు ద్వారా ఏడాదికి రూ.1,20,000 దాచుకోగలిగాడు. మరోపక్క డిపాజిట్లు, పెట్టుబడుల ద్వారా రూ. ఏడాదికి 1,50,000 దాకా కూడబెట్టాడు. ఏడాది మొత్తానికి అతను రూ.2,70,000 వెనకేయగలిగాడు. ఇందులోంచి అత్యవసర ఖర్చులు, అనుకోని ఖర్చుల కోసం ఏడాది మొత్తం మీద ఇంకో 70,000 ఖర్చు చేశాడు అనుకుందాం. నికరంగా అతని దగ్గర ఏడాది తిరిగేసరికి కనీసం రూ. 2 లక్షలు ఉంటాయి. ఇప్పుడతను కాస్త పర్వాలేదు అనుకునే స్థాయికి వచ్చాడు.ఈ మొత్తాన్ని అనుభవజ్ఞుల సలహా, సాధకబాధకాలు అన్నీ పరిగణనలోకి తీసుకుని రిస్కు తక్కువగా ఉండేలా చూసుకుంటూ కొంత షేర్లలోకి మరికొంత బాండ్లలోకి మళ్ళించాడు. దీనిపై వచ్చే రాబడి తక్కువగా ఉన్నప్పటికీ తన క్యాపిటల్‌కు నష్టం రాకుండా ప్లాన్ చేసుకున్నాడు. తద్వారా ఏడాది తిరిగేసరికి ఆ రూ. 2 లక్షల మీద అతనికి రూ. 1.50 లక్షలు వచ్చాయి. ఇప్పుడతని పెట్టుబడుల్లో సొమ్ము రూ. 3.5 లక్షలు అయింది. మరోపక్క ఈ రెండేళ్లలో అతని శాలరీ ఇంకో రూ.10,000 పెరిగింది. అయితే ఖర్చులు కూడా పెరగడం వల్ల ఆ పెరిగింది కాస్తా వాటికే సరిపోయేది. కాబట్టి అతని చేతికి కొత్తగా రూపాయి వచ్చిందీ లేదు, పోయిందీ లేదు. కానీ పెట్టుబడులు, పొదుపు మాత్రం క్రమం తప్పక కొనసాగిస్తూనే వచ్చాడు. ఇలా నాలుగేళ్లు గడిచాయి.శాలరీ పెరుగుతూ వస్తున్నా పెరిగే ఖర్చులు, పుట్టుకొచ్చే కొత్త అవసరాలతో అది అక్కడికి అయిపోతుంది. కానీ ఈ నాలుగేళ్లలో అతని పొదుపు 4X120000 = 4,80,000 + వడ్డీ కలిపి దాదాపు రూ.5 లక్షల దాకా జమ అయింది. అదే సమయంలో పెట్టుబడులను ఎప్పటికప్పుడు తిరగేస్తూ రిస్క్ డోస్‌ను కొద్దికొద్దిగా పెంచుతూ వచ్చాడు. అంటే బాండ్లలో పెట్టుబడులు తగ్గిస్తూ.. షేర్లలో ఫ్రంట్ లైన్ స్టాక్స్‌ను ఎంచుకుంటూ.. వాటి రేట్లు దిగివచ్చిన ప్రతిసారీ కొనుగోలు చేస్తూ వచ్చాడు. తద్వారా మంచి లాభాలు కళ్లజూడగలిగాడు. ఇలా మూడో ఏడాది తిరిగేసరికి తన పెట్టుబడులు రూ.6 లక్షల దాకా అయ్యాయి. మరో ఏడాది పూర్తయ్యేసరికి అవి కాస్తా రూ.12,00,000 అయ్యాయి.పొదుపు ద్వారా సమకూర్చుకున్న రూ.5 లక్షలు కలిపితే ఇప్పుడు అతని చేతిలో దాదాపు రూ.17 లక్షల దాకా ఉన్నాయి. వయసు 28 ఏళ్ళు వచ్చాయి. మళ్ళీ అన్ని లెక్కలు బేరీజు వేసుకుని రూ. 50 లక్షల రేటులో సిటీకి కాస్త దూరమే అయినప్పటికీ ఒక డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొన్నాడు. తన దగ్గరున్న 17 లక్షల్లో 10 లక్షలు ఇంటికోసం కేటాయించాడు. 7 లక్షలు చేతిలో ఉంచుకున్నాడు. 40 లక్షలు లోన్ తీసుకున్నాడు. దీనిపై కాల పరిమితి ఎక్కువ పెట్టుకుని ఈఎంఐ రూ. 25,000 మించకుండా చూసుకున్నాడు.తర్వాత అతను కంపెనీ మారడంతో (ఇది కూడా ప్లాన్ ప్రకారమే చేశాడు. మార్కెట్లో తనకున్న పొటెన్షియాలిటీ, ఉద్యోగంలో సంపాదించిన అనుభవం) శాలరీ పెరిగి దాదాపు రూ.లక్షకు చేరుకుంది. కొత్త ఉద్యోగంలో చేరితే (జాబ్ మారినప్పుడు కొన్ని బ్యాంకుల్లో లోన్ తీసుకోవడానికి కొంత ఇబ్బంది అవుతుంది. కొన్ని బ్యాంకులు మొత్తం అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని లోన్ ఇస్తాయి) లోన్‌కు ఇబ్బంది కావొచ్చన్న అంచనాతో జాబ్ మారడానికి ముందే చాలా తెలివిగా ఇంటి కొనుగోలుకు సిద్ధమయ్యాడు.ఇల్లు కొనడం, కొన్నాళ్లకే జాబ్ మారడం జరిగిపోయాయి. పెట్టుబడులు కొనసాగిస్తూనే ఉన్నాడు ఎక్కడా 'అతి' కి పోకుండా ప్లాన్‌కు తగ్గట్లే సాగుతూ వచ్చాడు. ఇంతలోనే పెళ్లి కుదిరింది. తన దగ్గరున్న సొమ్ముల్లోనే ఓ 2 లక్షలు వెచ్చించి ఇంటికి అవసరమైన సామాన్లు కొనుక్కున్నాడు. పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్‌లోకి అడుగుపెట్టాడు.ఒక రూ.50,000 ఉద్యోగి.. కేవలం నాలుగేళ్ల వ్యవధిలో జీవితాన్ని స్థిరపరుచుకునే స్థాయికి ఎదిగాడు. ఇదంతా జరగడానికి అతను చేసిందల్లా...1. ఆర్ధిక క్రమశిక్షణ ఎక్కడా తప్పలేదు. 2. అత్యాశకు పోలేదు.3. తనకు ఉన్న దానితోనే సరిపెట్టుకున్నాడు. 4. పక్కవాళ్ళను చూసో, స్నేహితులను బట్టో అక్కర్లేని వస్తువులు కొనేయలేదు.5. లాభాలు వస్తున్నాయి కదా అని మొత్తం డబ్బులు తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లో పెట్టేయలేదు.6. రిస్క్ స్థాయిని పెంచుకుంటూ వెళ్ళాడే తప్ప నూటికి నూరు శాతం రిస్క్ తీసుకోలేదు.7. ఆడంబరాలకు పోలేదు. మార్కెట్లో 50,000 ఖరీదు చేసే ఫోన్లు దొరుకుతున్నా తన స్థాయికి మించి 10,000-15,000 ఫోన్‌తోనే సరిపెట్టుకున్నాడు. 8. లోన్ పెట్టుకుంటే కారు కొనుక్కునే అవకాశం ఉన్నప్పటికీ కొనేయాలని ఉబలాటపడలేదు. 9. స్థిరపడేవరకు టూర్లు, విందులు, వినోదాలు, విలాసాల జోలికి పోకూడనే నిర్ణయం తీసుకుని కచ్చితంగా పాటిస్తూ వచ్చాడు. 10. వేలకు వేలు పోసి ఖరీదైన బట్టలని కొనేయలేదు.ఇలా చెప్పుకుంటూ పోతే... చాలానే ఉన్నా అతను పాటించింది మాత్రం పూర్తిగా ఆర్ధిక క్రమశిక్షణ. అదే అతని జీవితాన్ని ఇప్పుడు చాలా హుందాగా నిలబెట్టింది. కొత్త జీవితంలోకి అడుగు పెట్టేలా చేసింది. అతను త్వరలోనే కారూ కొనుక్కోగలడు, అవసరమైతే ఖరీదైన ఫోనూ కొనగలడు. చిన్న వయసులోనే ఇంత ఆర్ధిక క్రమశిక్షణ పాటించిన వ్యక్తి భవిష్యత్తులో గాడి తప్పకుండా ముందుకు సాగుతాడనే భావిద్దాం. మీరూ ఇలా చేసి చూడండి. మీ జీవితం కచ్చితంగా పూలమయం అవుతుంది. అలా కాదు.. నాకు తాత్కాలిక ప్రయోజనాలే ముఖ్యం.. అంటూ అర్ధం పర్ధం లేకుండా విచ్చలవిడిగా ఖర్చు చేసుకుంటూ పోతే ఏం జరుగుతుందో తదుపరి కథనంలో చూద్దాం. -బెహరా శ్రీనివాస రావు, పర్సనల్ ఫైనాన్స్ విశ్లేషకులు. -
క్రెడిట్ కార్డు మీ శ్రేయోభిలాషి.. శత్రువు!
జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎప్పుడు ఏ అవసరాలు పుట్టుకొస్తాయో ఎవరమూ చెప్పలేం. అప్పటిదాకా సజావుగా సాగిపోతున్న జీవితాల్లో ఒక్క కుదుపు చాలు మొత్తం తిరగబడిపోవడానికి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఉపద్రవాలు తలెత్తితే కుటుంబాలే కుదేలయిపోతాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తగిన ఆర్థిక భద్రత ఉండేలా చూసుకోవాలి. ఒడుదొడుకులు ఎదురైనప్పుడు తట్టుకునే విధంగా ఆర్ధిక పరిపుష్టి సాధించాలి. లేదంటే ప్రమాదమే. ఖర్చులు పెరిగిపోయి అరాకొరా జీతాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. సాధారణంగా ఇలాంటి వ్యక్తులు ఈమధ్యన ఎక్కువగా ఆశ్రయిస్తున్న సాధనం క్రెడిట్ కార్డులు. సగటున నెలకు రూ.25000-రూ.30000 ఆర్జించే వ్యక్తులు క్రెడిట్ కార్డులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. కొందరు ఆర్ధికంగా మంచి స్థితిలోనే ఉన్నప్పటికీ క్రెడిట్ కార్డులను స్టేటస్ సింబల్ కోసమో, సరదాకో వాడటం కూడా చూస్తూనే ఉన్నాం.ఏదైనా మోతాదు మించకూడదు..అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు అతి ఎప్పటికే ప్రమాదమే. ఎక్కువగా క్రెడిట్ కార్డులను వాడినా సమస్యలు తప్పవు. ఆ తర్వాత బిల్లులు కట్టలేక నిండా మునిగిపోయే పరిస్థితి ఎదురవుతుంది.ఇలాంటి పరిస్థితులు తలెత్తకూడదంటే మొదటే జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆయా బ్యాంకులు, ఇతరత్రా ప్రైవేట్ సంస్థలు ఇస్తున్నాయి కదా అని కొంతమంది 4, 5 క్రెడిట్ కార్డులు కూడా తీసుకుంటున్నారు. ఇది మరింత ప్రమాదకరం.కార్డులిస్తున్న సంస్థలివే..దేశంలోని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. అలాగే కొన్ని అన్ రిజిస్టర్డ్ సంస్థలు కూడా వివిధ కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని కార్డులు ఇస్తున్నాయి.క్రెడిట్‌కార్డు పొందాలంటే..క్రెడిట్ కార్డు పొందాలంటే ముఖ్యంగా క్రెడిట్ స్కోర్ బావుండాలి. సాధారణంగా 750 -900 మధ్యలో క్రెడిట్ స్కోర్ ఉంటే కార్డు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి తోడు మన ఆదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని క్రెడిట్ లిమిట్ ఆధారంగా కార్డులు జారీ చేస్తారు. నెలకు రూ.20000 ఆదాయం పొందే వ్యక్తికి కూడా క్రెడిట్ కార్డులను ఆయా బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి. అదే ప్రీమియం కార్డుల విషయానికొస్తే రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని కార్డులు జారీ చేస్తున్నాయి.కార్డు జారీకి ఇవి చాలా ముఖ్యంకార్డు జారీ చేయాలంటే క్రెడిట్ హిస్టరీ బావుండాలి. అంటే గతంలో ఏవైనా లోన్లు తీసుకుని ఉంటే అవి సక్రమంగా చెల్లిస్తున్నారా లేదా లోన్లు ఎంత ఉన్నాయి ఎప్పటికి క్లోజ్ అవుతాయనే వివరాలు పరిగణలోకి తీసుకుంటారు. కార్డు జారీలో మీరు పని చేస్తున్న కంపెనీ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మీరు ఎలాంటి కంపెనీలో పనిచేస్తున్నారు? ఎన్నాళ్లుగా పనిచేస్తున్నారు? ఆ కంపెనీ స్థాపించి ఎన్నాళ్లయింది? అది స్థిరమైన కంపెనీ యేనా? వంటి అంశాలు కూడా కార్డుల జారీలో బ్యాంకులు దృష్టిలో పెట్టుకుంటాయి.మెరుగైన సిబిల్ ఉంటేనే..కార్డుకు దరఖాస్తు చేసే ముందే మీ క్రెడిట్ స్కోర్ (దీన్నే సిబిల్ స్కోర్ అని కూడా అంటారు) ఎంతుందో తెలుసుకోవాలి. క్రెడిట్ కార్డు పొందడానికి 18 ఏళ్లు పైబడిన వారు మాత్రమే అర్హులు. కార్డు దరఖాస్తుకు అవసరమైన పత్రాలన్నీ మీరు అప్లై చేసే బ్యాంకులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు(Payslips) సమర్పించాలి. దీంతోపాటు ఫోటో ఐడీ, అడ్రస్ ప్రూఫ్, బ్యాంకు స్టేట్మెంట్ తదితర డాక్యుమెంట్లను ఇవ్వాలి. నేరుగా బ్యాంకులోగానీ ఆన్లైన్ ద్వారాగానీ దరఖాస్తు సమర్పించవచ్చు. ఆయా బ్యాంకులు లేదా కార్డు జారీ చేసే సంస్థల నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. సదరు బ్యాంకు లేదా సంస్థ మీరిచ్చిన పత్రాలన్నిటినీ సమగ్రంగా పరిశీలించి మీ అర్హతను బట్టి కార్డు జారీ చేస్తుంది.ఇదీ చదవండి: త్వరలో టీజీ రెరా యాప్..ఇష్టారాజ్యంగా వాడితే అంతే..కార్డు చేతికొచ్చాక మీరు దాన్ని సరిగా వాడుకుంటే అది మీకు చాలా మేలు చేస్తుంది. అలాకాక చేతిలో కార్డు ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వాడితే అదే మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది. కార్డు బిల్లు వచ్చాక చాలామంది సాధారణంగా ఒక పొరపాటు చేస్తూంటారు. కనీస మొత్తం చెల్లిస్తూ గడిపేస్తూ ఉంటారు. దీనివల్ల బాకీ ఎప్పటికీ తీరకపోగా తీసుకున్న మొత్తానికి మించి చెల్లిస్తారు. కట్టేది తక్కువేకదా అనే భ్రమ కలిగించేలా ఉన్న ఈ మినిమం పేమెంట్ ఊబిలో పడితే చాలా నష్టపోవాల్సి ఉంటుంది.ఉదా: ఒక వ్యక్తికి రూ.1 లక్ష విలువ చేసే క్రెడిట్ కార్డు వచ్చింది అనుకుందాం. అతను తన అవసరాల కోసం రూ.25,000 కార్డు నుంచి వాడేశాడు. దాని మీద అతను నెలకు కట్టాల్సిన కనీస మొత్తం రూ.1,250 మాత్రమే. కట్టేది తక్కువేగా అని ఆ మొత్తమే కట్టుకుంటూ పోతాడు. దీనివల్ల 6 నెలలు గడిచినా అతను అప్పటికి రూ.7,500 కట్టి ఉన్నా తీరేది అతి స్వల్ప మొత్తమే. ప్రతి నెలా చార్జీలు జత కలుస్తూనే ఉంటాయి. కార్డు వాడేవాళ్లలో నూటికి 95 మంది చేసే తప్పే ఇది.ఏం చేయాలంటే.. క్రెడిట్ కార్డు పేమెంట్ బిల్లు డేట్ జనరేట్ అయిన తర్వాత మళ్లీ బిల్లు వచ్చి దాన్ని చెల్లించేందుకు 45 రోజుల వడ్డీ రహిత సదుపాయం ఉంటుంది. దీన్ని ఉపయోగించుకుని మొత్తం బాకీ ఒకేసారి తీర్చేసి మళ్లీ కార్డును వాడుకుంటే మీకు వడ్డీల భారం తగ్గుతుంది. మీరు కట్టాల్సిన మొత్తం తీరిపోతుంది. అదే సమయంలో మీ క్రెడిట్ రికార్డూ పదిలంగా ఉంటుంది. సంస్థకు లేదా సంబంధిత బ్యాంకుకు మీపై విశ్వాసం పెరిగి మీ లిమిట్ మొత్తాన్ని పెంచడానికి ఆస్కారం ఉంటుంది. అర్ధమయింది కదా క్రెడిట్ కార్డును మీరు ఎలా వాడుతున్నారన్నది మీ చేతుల్లోనే ఉంటుంది. సద్వినియోగం చేసుకుంటే లబ్ది పొందుతారు. లేదంటే మునిగిపోతారు. ఆలోచించుకుని అడుగేయండి.-బెహరా శ్రీనివాస రావు,పర్సనల్ ఫైనాన్స్ విశ్లేషకులు -
రూపాయి విలువ పడిపోవడం అంటే ఏమిటి? దీని వల్ల లాభ నష్టాలు ఇవే..
చరిత్రను తిరగేస్తే.. పోరాటాలన్నీ.. డబ్బు కోసమో, పదవి కోసమో, మగువ కోసమో.. జరిగిన దృష్టాంతాలు కన్పిస్తాయి. కాసేపు పదవి, మగువలను పక్కన పెట్టేద్దాం. డబ్బు విషయానికొస్తే.. ఇది ప్రపంచాన్ని శాసిస్తోందన్నది అక్షర సత్యం. ఒక్కో దేశానికి ఒక్కో కరెన్సీ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది.మన దేశానికి రూపాయి.. అమెరికాకు డాలర్, రష్యాకు రూబుల్, బ్రిటన్‌కు పౌండ్, జపాన్‌కు యెన్.. ఇలా యూరో, ఫ్రాంక్, దీనార్, దిర్హామ్ వంటివి ఆయా దేశాలకు ప్రధాన కరెన్సీ లుగా ఉన్నాయి. వివిధ దేశాల కరెన్సీలతో పోల్చి చూసినప్పుడు ఒక్కో దేశపు కరెన్సీకి ఒక్కో వాల్యూ ఉంటుంది.సాధారణంగా ప్రపంచ మార్కెట్లకు పెద్దన్న అమెరికాయే కాబట్టి డాలర్‌తో పోల్చి ఆయా దేశాల కరెన్సీ ల విలువను నిర్ధారిస్తూ ఉంటారు. నాలుగు ప్రధాన ప్రపంచ కరెన్సీలతో పోల్చి చూసినప్పుడు మన రూపాయి విలువ ఇలా ఉంది (సుమారుగా).1 అమెరికా డాలర్ = రూ. 851 బ్రిటన్ పౌండ్ = రూ. 1091 జపాన్ యెన్ = రూ. 0.541 యూరో = రూ. 88సాధారణంగా మనం వినే ఒకే ఒక్క మాట... రూపాయి విలువ పడిపోతోంది అని. అసలీ రూపాయి విలువ పడిపోవడం ఏమిటి..? దానివల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం.ఆయా కరెన్సీలకు ప్రపంచవ్యాప్తంగా ఉండే డిమాండ్ ను బట్టి దాని వాల్యూ నిర్ధారితమవుతుంది. ఏడాది క్రితం ఒక డాలర్ విలువ 80 రూపాయలు ఉండేది. మరిప్పుడో 85 రూపాయలు అయ్యింది. అంటే డాలర్ విలువ 5 రూపాయలు పెరిగింది. మన కరెన్సీ విలువ 5 రూపాయలు పడిపోయింది. దీని వల్ల అమెరికాతో జరిపే లావాదేవీలు మరో 5 రూపాయలు భారం అవుతాయి అన్న మాట.ఉదా: ఏడాది క్రితం మీ అబ్బాయినో, అమ్మాయినో చదువు కోసం అమెరికా పంపించారు. కట్టాల్సిన ఫీజు 1200 డాలర్లు. అంటే అప్పటి మారకపు రేటు (ఒక డాలర్ = 80 రూపాయలు) ప్రకారం... మీరు చెల్లించాల్సింది రూ. 96000. ఇప్పుడు కూడా కట్టాల్సిన ఫీజు 1200 డాలర్లే. కానీ ఇప్పుడు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరో 5 రూపాయలు పడిపోయి 85కు వచ్చేసింది. దీనివల్ల రూ.85 చొప్పున మీరు 1200 డాలర్లు చెల్లించాల్సి వచ్చినప్పుడు మీపై పడే అదనపు భారం మరో రూ.6000 అన్న మాట.1200X80 = 960001200X85 = 102000102000 - 96000 = 6000ఇప్పుడు అర్ధమయ్యిందా విలువ పడిపోతే ఏం జరుగుతుందో..ఏమవుతుందంటే..➤మన దేశం చేసుకునే దిగుమతుల్లో 87 శాతం ముడి చమురు దిగుమతులే. ఇవి భారంగా మారిపోతాయి. 2023 - 24 ఆర్ధిక సంవత్సరంలో మన దేశం చమురు దిగుమతులపై 134 బిలియన్ డాలర్లు వెచ్చించింది. అంటే దాదాపు రూ. 11 లక్షల కోట్లు.➤పెరిగే దిగుమతుల బిల్లు ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. ద్రవ్యోల్బణం పెరగడమంటే నిత్యావసరాల ధరలు చుక్కలు చూడటమే. దీంతో సామాన్యుడి జీవితం మరింత కష్టప్రాయంగా మారిపోతుంది. ద్రవ్యోల్బణం పెరిగి, విదేశీ పెట్టుబడులు మందగించడం వల్ల ఆర్ధిక పురోగతి కుంటుపడుతుంది.➤డాలర్లలో అప్పులు తెచ్చుకునే భారత కంపెనీలు ఎక్కువ మొత్తాల్లో చెల్లించాల్సి వస్తుంది. ఆ భారాన్ని తమ ఉత్పత్తుల ధరలు పెంచడం ద్వారా వినియోగదారులపై వేస్తాయి. ఇక్కడ నలిగిపోయేది కూడా సగటు వ్యక్తే.➤ఆటోమొబైల్ కంపెనీలపై రూపాయి క్షీణత ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే అవి ఎక్కువగా తమకు అవసరమైన ముడి సరుకు కోసం దిగుమతులపైనే ఆధారపడతాయి. భారాన్ని తట్టుకోవడానికి అవి తమ తుది ఉత్పత్తుల ధరలను పెంచాల్సి వస్తుంది. దీనివల్ల వాటి మార్జిన్లు తగ్గిపోతాయి.నష్టాలేనా.. ప్రయోజనాలేవీ లేవా..? అంటే ఎందుకు లేవు.. ఉన్నాయి.➜ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కువ లబ్ది పొందుతాయి. అవి తమ సర్వీసులను ఎగుమతి చేస్తాయి కాబట్టి.➜అలాగే ఫార్మా, టెక్స్టైల్ కంపెనీలు కూడా..➜అధిక శాతం భారత ఔషధ కంపెనీలు తమ మందులను అమెరికా, ఐరోపా మార్కెట్లకు ఎగుమతి చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటికి ఎక్కువ ఆదాయం సమకూరుతుంది.➜చైనాతో పోలిస్తే భారత్ నుంచి జౌళి ఎగుమతులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వీళ్లకూ మంచి ప్రయోజనమే దక్కుతుంది.➜రూపాయి క్షీణత వల్ల రెమిటెన్సెస్ (అంటే విదేశాల్లో నివసిస్తున్నా భారతీయులు స్వదేశంలోని తమ వారికి పంపే సొమ్ములు) విషయంలో మాత్రం సానుకూల ప్రభావమే ఉంటుంది. అంటే.. అమెరికాలోని ఒక భారతీయుడు భారత్‌లోని తమ కుటుంబీకులకు 100 డాలర్లు పంపాడనుకుందాం. కిందటేడాది రూ. 8,000 వచ్చి ఉండేవి. ఇప్పుడు రూపాయి 85కి పడిపోవడం వల్ల రూ. 8,500 వస్తాయన్న మాట. అంటే రూ.500 ఎక్కువ వస్తాయి. ఇది ఆర్ధిక వ్యవస్థకు మేలు చేసే అంశం.విదేశీ మదుపర్ల మాటేమిటి?విదేశీ మదుపరులకు డాలర్ తో పోలిస్తే ఎక్కువ రూపాయలు వస్తాయి కాబట్టి వాళ్ళు కుప్పలుతెప్పలుగా మన మార్కెట్లో నిధులు కుమ్మరిస్తారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెరిగి షేర్ల ధరలు అమాంతం పైకెగుస్తాయి. ఇది చూడటానికి బాగానే ఉంటుంది. వాళ్లకు కోపమొచ్చిందో (మన మార్కెట్‌తో పోలిస్తే వేరే చోట మరింత రాబడి వచ్చే అవకాశం ఉండటం) మన పని అయిపోయినట్లే. దానికి ప్రత్యక్ష ఉదాహరణే... గత అక్టోబర్, నవంబర్ నెలలు.ఇదీ చదవండి: ఇలా చేస్తే.. స్టాక్ మార్కెట్లో మీరే 'రాజా ది గ్రేట్'అమాంతం వారి పెట్టుబడులు ఉపసంహరించుకోవడం మొదలెడతారు. భారతదేశంలో వాళ్లకున్న ఆస్తులు అమ్ముకోవడం మొదలెడతారు. తద్వారా మన రూపాయల్ని డాలర్లుగా మార్చుకుంటారు. ఫలితంగా డాలర్ విలువ పెరిగి రూపాయి విలువ పడిపోతుంది. గత రెండు నెలల్లో స్టాక్ మార్కెట్లో జరిగింది ఇదే. విదేశీ సంస్థాగత మదుపర్లు గత అక్టోబర్ నెలలో రూ.1.14 లక్షల కోట్లు వెనక్కి తీసుకోగా, నవంబర్ నెలలో రూ. 47,000 కోట్లు పట్టుకెళ్ళిపోయారు. దీంతో స్టాక్ మార్కెట్లు కుదేలయిపోయాయి. దీని ప్రభావం ఆర్ధిక వ్య్వవస్థ పైనా ప్రతికూలత చూపింది. - బెహరా శ్రీనివాసరావు, ఆర్ధిక విశ్లేషకులు -
షార్ట్ కవరింగ్ లావాదేవీలకు అవకాశం
గత వారం స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు, ట్రేడర్లకు చుక్కలు చూపించాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ దాదాపు 3700 పాయింట్లు నష్టపోయి 78000 పాయింట్ల స్థాయిలో స్థిరపడగా.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 1200 పాయింట్లు కోల్పోయి 23600 దరిదాపుల్లో ముగిసింది. అంటే సెన్సెక్స్, నిఫ్టీలు ఒకవారం రోజుల వ్యవధిలో 5 శాతం నష్టపోయాయన్నమాట.ప్రధాన సూచీలు ఈస్థాయిలో పడిపోవడం మామూలు విషయమేమీ కాదు. పైగా కేవలం గత గురు, శుక్రవారాల్లో భారీగా నష్టపోయాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా. కిందటి బుధవారం రాత్రి (మన కాలమానం ప్రకారం) అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ వడ్డీ రేట్లను పావు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఇంత వరకూ బాగానే ఉంది.. కానీ వచ్చే ఏడాది వడ్డీ రేట్ల కోతలు చాలా పరిమిత సంఖ్యలో ఉంటాయన్న ప్రకటన మార్కెట్లకు నచ్చలేదు. దీంతో అక్కడి డోజోన్స్, నాస్డాక్స్ సూచీలు భారీగా నష్టపోయాయి. దీని ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడింది. ఆసియా, ఐరోపా మార్కెట్లూ ఊచకోతకు గురయ్యాయి. ఇందుకు మన మార్కెట్లూ మినహాయింపు కాలేదు.విదేశీ మదుపర్లుడిసెంబర్ చివరి వారానికి వచ్చేశాం. సాధారణంగా డిసెంబర్లో విదేశీ మదుపర్ల లావాదేవీలు మందగిస్తాయి. ముఖ్యంగా క్రిస్మస్ వారంలో వీరి కొనుగోళ్ల స్థాయి పడిపోతుంది. దీంతో సూచీలు చాలా స్తబ్దుగా కొనసాగుతాయి. ఇప్పటికే వీరి విధ్వంసాన్ని మార్కెట్లు కళ్లజూశాయి. మళ్ళీ వీళ్ళు జనవరి రెండో వారంలో మార్కెట్లోకి పూర్తి స్థాయిలో అడుగుపెడతారు. అప్పటి దాకా దూకుడు కొంత తగ్గవచ్చు.గత వారం విదేశీ మదుపర్లు దాదాపు రూ. 20,000 కోట్ల షేర్లను నికరంగా విక్రయించారు. ఈ నెల మొత్తానికి మాత్రం వీరి నికర విక్రయాలు సుమారు రూ.4,100 కోట్లుగా ఉన్నాయి. దీనికి కారణం అంత క్రితం రెండు వారాల్లో వీళ్ళు నికర కొనుగోళ్లు జరపడమే.ఈ వారం అంచనాలుఈ వారం కూడా మార్కెట్లలో జోరు ఉండకపోవచ్చు. కొన్నాళ్ల పాటు నష్టాల బాటలోనే కొనసాగవచ్చనే అంచనాలున్నాయి. నిఫ్టీకి 23500 వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు. ఒకవేళ ఆ స్థాయిని కూడా బ్రేక్ చేసి దిగజారితే 23370 వరకు పడిపోవచ్చు. ఒకవేళ అక్కడి దాకా చేరితే.. మార్కెట్‌కు మద్దతు దొరికి మళ్ళీ సూచీలు బలంగా పుంజుకునే అవకాశం ఉంటుంది. అదీ కాని పక్షంలో 23000 వరకు పతనం కొనసాగవచ్చు. ఒకవేళ సూచీలు ముందుకు కదిలితే 23700 వద్ద మొదటి నిరోధం ఎదురవుతుంది. దాన్ని అధిగమిస్తే తదుపరి నిరోధం 23800 వద్దఎదురవుతుంది. దీన్నీ దాటుకుని ముందుకెళ్తే 24000 వరకు ఎలాంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు.ఇప్పటికే మార్కెట్లు ఓవర్ సోల్డ్ జోన్లో ఉన్నాయి. ముఖ్యంగా సూచీల్లో ఎక్కువ స్థాయిలో షార్ట్స్ బిల్డ్ అయి ఉన్నాయి. గత వారమంతా అమ్మకాలు కొనసాగడం, డిసెంబర్ నెల కాంట్రాక్టులకు సంబంధించి ఇదే చివరి వారం కావడం వంటి కారణాల వల్ల వారంలో ఏ సమయంలోనైనా షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక బ్యాంకు నిఫ్టీ విషయాని కొస్తే.. 50500 దిగువన కొనసాగితే మాత్రం 49000 వరకు క్షీణించే అవకాశం ఉంది. అలా కాకుండా మార్కెట్లు ముందుకెళ్తే 52000 వరకు సూచీ దూసుకెళ్ళవచ్చు. షార్ట్ కవరింగ్ లావేదేవీలు సహకరిస్తే 53000 వరకు పరుగులు తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.జీఎస్టీ మండలి నిర్ణయాల్లో అత్యంత ప్రధానమైనది జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై విధిస్తున్న పన్ను రేట్ల తగ్గింపు. గత సమావేశంలో దీనికి సంబంధించి నిర్ణయం వెలువడవచ్చని భావించినప్పటికీ.. ఇది వాయిదా పడటం ఒక రకంగా ఇన్సూరెన్సు కంపెనీల షేర్లపై స్వల్ప స్థాయిలోనే అయినా ప్రతికూల ప్రభావం చూపించడానికి ఆస్కారంఉంది. ఆటోమొబైల్, చమురు షేర్లు నష్టాల్లోనే కొనసాగే అవకాశం ఉంది. అదే సమయంలో ఎలాటి ప్రభావిత వార్తలు లేకపోవడంతో సిమెంట్ షేర్స్ మందకొడిగా కొనసాగవచ్చు.ఇక ఎఫ్ఎంసీజీ, టెలికాం రంగాల షేర్లలోనూ స్తబ్దత తప్పదు. యంత్ర పరికరాల రంగానికి సంబంధించిన షేర్లకు నష్టాల బాట తప్పక పోవచ్చు. సాధారణంగా మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పుడు సురక్షిత రంగంగా ఫార్మాను భావిస్తూ ఉంటారు. గతవారం లాభాల్లో నడిచిన ఫార్మా షేర్లు ఈ వారం కూడా అదేస్థాయిలో జోరు కొనసాగించవచ్చు. క్రిస్మస్ సందర్భంగా స్టాక్ మార్కెట్లకు బుధవారం సెలవు.- బెహరా శ్రీనివాసరావు, పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు -
మనం లేకపోయినా మన వాళ్లతో ఉన్నట్లే!
జీవితం క్షణ భంగురం. ఈ విషయం అందరికీ తెలుసు. అయినా పెద్దగా పట్టించుకోం. అప్పటిదాకా వస్తే చూసుకుందాంలే అనుకుంటాం. పరిస్థితులు సహకరించకో, ఉదాసీనతో, నిర్లక్ష్యమో..కారణం ఏదైనా కావొచ్చు. భవిష్యత్ ప్రణాలికల్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం. ‘పోయినవాడు బాగానే పోయాడు.. మాకు ఏం మిగిల్చాడు గనుక..’ అని ఉన్నవాళ్లు తిట్టుకోకూడదంటే కొంచెం ముందుచూపుతో వ్యవహరిస్తే చాలు. కుటుంబ పెద్దని దురదృష్టం పలకరించినా..ఆ కుటుంబం మాత్రం సురక్షితంగా ఉండాలంటే ఒక టర్మ్ పాలసీని తీసుకోవాలి. ఈ పాలసీ చేసే మేలు అంతాఇంతా కాదు. అదెలాగో తెలుసుకుందాం.చిన్న వయసులోనే ఈ పాలసీ తీసుకుంటే తక్కువ ప్రీమియంతో అధిక ప్రయోజనాన్ని పొందవచ్చు. నెలవారీ లేదా ఏడాదికోసారి ప్రీమియం చెల్లించవచ్చు.టర్మ్ ఇన్సూరెన్సు పరమార్థం ఏమిటంటే సాధారణంగా ఏ వ్యక్తి అయితే ప్రీమియం కడతాడో ఆ వ్యక్తి మరణానంతరం ఆర్థిక భరోసానిస్తుంది. ఒకేసారి బీమా మొత్తాన్ని సదరు కుటుంబం అందుకోవచ్చు లేదంటే..దఫాలవారీగా కూడా తీసుకోవచ్చు.సాధారణంగా 18 ఏళ్లు నిండిన వ్యక్తులు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. అప్పటి నుంచి మొదలుకొని 99 ఏళ్ల వరకు పాలసీలను తీసుకునే అవకాశం ఉంటుంది.ఒకేసారి బీమా మొత్తంపాలసీ చేసిన వ్యక్తి మరణానంతరం వారి నామినీ/ ప్రయోజనదారుకు ఒకేసారి బీమా మొత్తం (సమ్అష్యుర్డ్) చెల్లిస్తారు. ఇందుకు ఏడాదికోసారి ప్రీమియం చెల్లించే ఆప్షన్ ఎంచుకోవాలి.ఉదా: x అనే వ్యక్తి రూ.ఒక కోటి టర్మ్ పాలసీ తీసుకున్నాడు అనుకుందాం. నెలకు రూ.10,000 దాకా ప్రీమియం చెల్లిస్తున్నాడు. పాలసీ కాలవ్యవధి 35 ఏళ్లుగా భావిద్దాం. ఈ వ్యవధిలోనే పాలసీ తీసుకున్న వ్యక్తి దురదృష్టవశాత్తు కన్నుమూస్తే అతని కుటుంబం ఒకేసారి రూ.కోటి పొందగలుగుతుంది.దఫాల వారీగా కావాలంటే...ఆర్థిక పరమైన అంశాలపై పూర్తి అవగాహన ఉండే కుటుంబాలు తక్కువే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విషయానికొస్తే ఇది మరింత తక్కువ ఉంటుంది. కోటి రూపాయలకు ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోయినప్పుడు ఒకేసారి ఆ మొత్తం అందుకునే కుటుంబాలు అంత పెద్ద మొత్తాన్ని ఏం చేయాలో సరైన అవగాహన ఉండదు. ఒక్కోసారి ఆ సొమ్ము పక్కదారి పట్టే ప్రమాదం కూడా ఉంటుంది. లేదా విచ్చలవిడిగా ఆ సొమ్ముని ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇలాంటి టర్మ్ పాలసీ తీసుకున్న ప్రయోజనం నెరవేరదు. అలా జరగకుండా ఉండాలంటే దఫాలవారీ చెల్లింపు పద్ధతిని ఆశ్రయించడం మేలు. ఈ పద్ధతిలో సదరు నామినీకి ఇన్సూరెన్సు కంపెనీ విడతల వారీగా సొమ్ము చెల్లిస్తుంది. అయితే పాలసీ తీసుకునే వ్యక్తికి తన కుటుంబం గురించి పూర్తి అవగాహన ఉంటుంది. తన భార్య, పిల్లలు, వారి చదువులు, పెద్దవాళ్ల అవసరాలు.. ఇలా ప్రతి అంశాన్నీ దృష్టిలో ఉంచుకుని ముందుగానే ఈ ఆప్షన్ ఎంచుకోవాలి. తన పిల్లలు పెద్ద చదువుల్లోకి వచ్చే సరికి ఇంతకావాలి.. తన పిల్లల పెళ్లిళ్ల ఖర్చుకు ఇంత అవసరమవుతుంది.. అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని తదనుగుణంగా నామినీకి ఏయే సమయాల్లో ఎంతెంత చెల్లించాలో పేర్కొనవచ్చు.నెలవారీ చెల్లింపులుపాలసీదారు నెలవారీ చెల్లింపుల ఆప్షన్ ఎంచుకుంటే తదనుగుణంగానే నెలకింత చొప్పున నామినీకి బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఒకేసారి రూ.ఒక కోటి మొత్తం వద్దనుకుంటే నెలకు కొంత వచ్చేటట్లు ఆప్షన్ ఎంచుకోవాలి. దాంతో సదరు బీమా కంపెనీ ఆ మొత్తాన్ని నెలకు రూ.50,000 చొప్పున 15 ఏళ్లపాటు చెల్లిస్తుంది.ఏడాదికోసారి చెల్లించేలా..నెలకోసారి కాకుండా ఏడాదికోసారి ప్రయోజనాన్ని పొందే అవకాశం కూడా ఉంది. దీని ప్రకారం ఏడాదికి రూ.6 లక్షలచొప్పున 15 ఏళ్లపాటు నామినీకి చెల్లిస్తారు.మరో పద్ధతిఈ పద్ధతి ప్రకారం నామినీకి సమ్ అష్యుర్డ్ (రూ.కోటి అనుకుందాం) మొత్తంలో 50-70% పాలసీదారు చనిపోయిన వెంటనే చెల్లిస్తారు. మిగతా మొత్తాన్ని కుటుంబ అవసరాలకు ఉపయోగపడే విధంగా నెలకింత చొప్పున చెల్లిస్తూ వస్తారు.అధిక ప్రయోజనం ఇచ్చే మరో విధానంఈ ఆప్షన్లో ముందుగా నామినీకి కొంత మొత్తం చెల్లిస్తారు. మిగిలిన మొత్తాన్ని 10-20 శాతం వార్షిక వృద్ధిని లెక్కగట్టి నెలవారీ చెల్లింపుల్లో అందిస్తారు. పెరిగే ఖర్చులను తట్టుకోవడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది.ఇదీ చదవండి: బీమా పాలసీతో ఆరోగ్యం కొనుక్కోవచ్చు!టర్మ్ ఇన్సూరెన్సు అనేది ప్రతి కుటుంబానికి కచ్చితంగా అవసరమయ్యే ఒక సురక్ష సాధనమని చెప్పొచ్చు. కానీ దీన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని జీవితాలకు ఈ పాలసీ భరోసాను ఇస్తుందని మాత్రం ఎవరూ గ్రహించరు. మీ కుటుంబంలో ఆర్థిక పరమైన అవగాహన ఉండి, వచ్చే సొమ్ములు సరైన మార్గంలోనే సద్వినియోగం అవుతాయన్న నమ్మకం ఉన్నప్పుడు ఏకమొత్తం (లమ్సమ్) పొందే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. లేదంటే నెలవారీ, వార్షిక ప్రాతిపదికన చెల్లింపులను సెలక్ట్ చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికి తదనంతరం కుటుంబం ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడకూడదంటే మాత్రం కచ్చితంగా టర్మ్ పాలసీ వెంటనే తీసుకోవాలి.- బెహరా శ్రీనివాసరావు, పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు -
బీమా పాలసీతో ఆరోగ్యం కొనుక్కోవచ్చు!
ఆరోగ్యం, సంపద... ఏ మనిషి జీవితంలోనైనా ప్రధాన పాత్ర పోషించే అంశాలివి. ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం సరిగా లేకపోతే... ఏమీ ప్రయోజనం ఉండదు. అదే... సంపద లేకపోయినా ఆరోగ్యం బాగుంటే చాలు... ఎలాగైనా సంపాదించుకోవచ్చు. కాబట్టి ఆరోగ్యం అత్యంత ప్రధానం అన్న విషయం దీన్నిబట్టి మనకు స్పష్టంగా తెలుస్తోంది.ఇవాళ్టి రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత తేలిక్కాదు. కోవిడ్ మన జీవితాల్ని ఎంత ప్రభావితం చేసిందో ఎరుకే.. అదీగాక... మారిన కాలమాన పరిస్థితుల్లో... ఎప్పుడు ఎలాంటి రోగాలు పుట్టుకొస్తాయి ఎవ్వరం చెప్పలేం. అప్పటిదాకా ఎంతో హాయిగా.. ఎలాంటి చీకూ చింతా లేకుండా సాగిపోతున్న జీవితాల్లో ఒక్క అనారోగ్యం వాళ్ళ ఆర్ధిక పరిస్థితుల్ని తల్లకిందులు చేసేస్తోంది. అప్పటికప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తే... లక్షలు సిద్ధం చేసుకోవాల్సిందే.. చూస్తూ చూస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడలేం కదా... అంచేత అప్పో సొప్పో చేసి అయినా వైద్యం చేయిస్తాం.పల్లెలు పట్టణాలుగా, పట్నాలు నగరాలుగా మారిపోతూ ట్రాఫిక్ విచ్చలవిడిగా పెరిగిపోయి.. ఎప్పుడు ఏ ఆక్సిడెంట్ అవుతుందో... బయటకు వెళ్లిన మనిషి సురక్షితంగా వస్తాడో రాడో అంతుచిక్కని రోజులివి. ఇలా ఆకస్మికంగా తలెత్తే అనివార్య ఖర్చుల్ని తలెత్తుకోవడం అందరికీ సాధ్యం కాదు. ఇలాంటప్పుడే... మన చేతిలో ఆరోగ్య బీమా కార్డు ఉంటే... కొండంత ధైర్యాన్ని చేతిలో పెట్టుకున్నట్లే. పైగా నేటి రోజుల్లో కుటుంబానికంతటికీ జీవిత బీమా తో పాటు, ఆరోగ్య బీమా ఉండటం అత్యవసరంగా మారిపోయింది. ఈనేపథ్యంలో ఆరోగ్య బీమా స్థితిగతులను ఓసారి పరిశీలిద్దాం.మనదేశంలో ఆరోగ్య బీమాను అందించే ప్రముఖ కంపెనీలు ఇవి.స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్కేర్ హెల్త్ ఇన్సూరెన్స్హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ తదవనివా భూపా హెల్త్ ఇన్సూరెన్స్ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్మణిపాల్ సిగ్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీఅకో జనరల్ ఇన్సూరెన్స్టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్వైద్యం ఖరీదైన అంశంగా మారిపోయిన ఈరోజుల్లో మీరు తీసుకునే ఆరోగ్య బీమా పాలసీ మిమ్మల్ని వైద్య ఖర్చులనుంచి గట్టెక్కిస్తుంది.కనీసం రూ. 2 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు పాలసీ తీసుకోవచ్చు.వయోపరిమితిని బట్టి ప్రీమియం రేట్లు ఉంటాయి. చిన్న వయసులో తక్కువ ప్రీమియం కే పెద్ద పాలసీ తీసుకోవచ్చు.ఏదైనా ఒక రోగంతో హాస్పిటల్ పాలైనప్పుడు ఆ వైద్యానికయ్యే ఖర్చుల్ని మనం ఎలాంటి నగదు చెల్లించనక్కర్లేకుండా పొందవచ్చు. మనం పాలసీ తీసుకునే ముందు కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి.వీటిలో అత్యంత ప్రధానమైంది మనం బీమా తీసుకునే సంస్థ ఏయే హాస్పిటల్స్ తో అనుసంధానం అయివుందో తెలుసుకోవడం.అంటే దేశవ్యాప్తంగా ప్రముఖ హాస్పిటల్స్ తో పాటు, స్థానిక హాస్పిటల్స్ లో కూడా వైద్యం చేయించుకోవడానికి వీలుగా కవరేజ్ కలిగి ఉండాలి.ఒక రోగానికి సంబంధించి హాస్పిటల్ లో జాయిన్ కావడానికి ముందు 30 రోజులు, డిశ్చార్జ్ అయ్యాక 30 రోజుల పాటు వైద్య ఖర్చులు పొందే సౌలభ్యాన్ని వివిధ బీమా సంస్థలు కల్పిస్తున్నాయి. పాలసీ తీసుకునే ముందు వాటి వివరాలు తెలుసుకోవాలి.మనం తీసుకునే పాలసీ కి చెల్లించే ప్రీమియానికి కొంచెం అదనంగా చెల్లించడం ద్వారా పర్సనల్ ఆక్సిడెంట్ కవర్, క్రిటికల్ ఇల్నెస్ కవర్ వంటి వాటిని కూడా ఎంచుకోవాలి.యాక్సిడెంట్ అయ్యి... ప్రాణాపాయం తప్పి శాశ్వత అంగ వైకల్యానికి లోనైతే... అడిషనల్ రైడర్స్ తీసుకోవడం వల్ల పెన్షన్ మాదిరి నెలనెలా (మన సమ్ అష్యురెడ్ ని బట్టి) సొమ్ములు పొందవచ్చు. సాధారణంగా వృద్ధాప్యానికి మరోపేరే అనారోగ్యం. కాబట్టి కచ్చితంగా ఆరోగ్య బీమా ఉండి తీరాల్సిందే. ఇప్పుడు వయోపరిమితితో సంబంధం లేకుండా.. ఎంత వయసువారైనా బీమా పాలసీ లు తీసుకోవడానికి ఐఆర్డీఏ వెసులుబాటు కల్పించింది. ఇది సీనియర్ సిటిజెన్లకు వరమనే చెప్పాలి. అలాగే ఒకే ప్రీమియం తో మొత్తం కుటుంబానికి ఆరోగ్య బీమా రక్షణ కల్పించే విధంగా పాలసీలు అందుబాటులో ఉన్నాయి.పాలసీ తీసుకునే టైం కే రోగాలు ఉన్నా కూడా వాటిని కవర్ చేస్తూ బీమా సదుపాయాన్ని పొందే అవకాశం కూడా ఉంది. అయితే వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. పాలసీ తీసుకునే సమయంలో ఏయే బీమా సంస్థలు ఎంతెంత వెయిటింగ్ పీరియడ్ ను పేర్కొంటున్నాయో తెలుసుకోవాలి.ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 డ్ కింద మనం కట్టే ప్రీమియానికి (షరతులకు లోబడి) రూ. 25,000 నుంచి రూ.75,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.సాధారణంగా 24 గంటలు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటేనే పాలసీ వర్తిస్తుంది. ఇప్పుడు కొన్ని సంస్థలు అవుట్ పేషెంట్ గా చేయించుకునే వైద్యానికయ్యే ఖర్చులను కూడా బీమా కవరేజ్ లోకి తీసుకుంటున్నాయి. అంతేకాదు... ప్రత్యేకించి ఓపీ చికిత్సల కోసమే ఉపయోగపడే విధంగా పాలసీలు అందుబాటులోకి వచ్చాయి.ఎలాంటి ఆరోగ్య సేవలు పొందవచ్చు, ప్రీమియంలు ఎలా ఉంటాయి ఇత్యాది అంశాలను మరోసారి చర్చించుకుందాం.-బెహరా శ్రీనివాస రావు, పర్సనల్ ఫైనాన్స్ విశ్లేషకులు -
ఐపీఓ గురించి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి రెండు రకాల మార్గాలు అందుబాటులో ఉంటాయి. ఒకటి..కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వచ్చినప్పుడు వాటికి దరఖాస్తు చేయడం ద్వారా షేర్లను కొనుగోలు చేయడం. అలాకాకుండా మార్కెట్లో నేరుగా షేర్లను కొనుగోలు చేయడం రెండోది.పబ్లిక్ ఇష్యూ విషయానికొస్తే...పబ్లిక్ ఇష్యూనే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) అని కూడా వ్యవహరిస్తారు. సాధారణంగా కంపెనీలు తమ ఎదుగుదల క్రమంలో నిధులు అవసరమై ప్రజల నుంచి వాటిని సమీకరించాలనే ఉద్దేశంతో షేర్లను జారీ చేయడం ద్వారా మొట్టమొదటిసారి ఐపీఓకు వస్తాయి. ఇలా ఐపీఓకి వచ్చే కంపెనీలు ముందుగా లీడ్ మేనేజర్లను నియమించుకుంటాయి. వీరు ఆ కంపెనీ ఐపీఓ వ్యవహారాలు సజావుగా పూర్తయ్యేలా చూస్తారు. కంపెనీలు ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను కంపెనీలు విస్తరణ, మూలధన అవసరాలు, అప్పులు తీర్చడం కోసం వాడుకుంటాయి. ఐపీఓ తర్వాత సంస్థలు వాటాదారులకు జవాబుదారీగా నిలవాల్సి ఉంటుంది.పబ్లిక్ ఇష్యూకి వచ్చే కంపెనీలు తమ షేర్లకు ఒక ముఖవిలువ (ఫేస్‌వాల్యూ) నిర్ధారిస్తాయి. అప్పటికి ఆ కంపెనీస్థాయి, అది చేస్తున్న వ్యాపారం, మార్కెట్లో దాని ఉత్పత్తులకు ఉండే డిమాండ్ వంటి విభిన్న అంశాలను దృష్టిలో ఉంచుకుని సంస్థకు ఒక విలువను నిర్ధారిస్తాయి. కంపెనీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎన్ని షేర్లు జారీ చేయాలో (కంపెనీలో ఎంత వాటా అమ్మకానికి పెట్టాలో) నిర్ణయించుకుంటాయి. దానికి అనుగుణంగా సెబీని సంప్రదించి తమ ప్రతిపాదనలు సమర్పిస్తాయి. ఒకసారి సెబీ ఇష్యూకి క్లియరెన్స్ ఇచ్చి, ఎక్స్ఛేంజీల ఆమోదం పొందిన తర్వాత మార్కెట్లోకి ప్రవేశిస్తాయి. సాధారణంగా 3-5 రోజులపాటు ఇష్యూ అందుబాటులో ఉంటుంది. వివిధ సందర్భాలు, ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 10 రోజులలోపు ఇష్యూ పూర్తి చేయవచ్చు.ఇన్వెస్టర్లు పరిగణించాల్సిన విషయాలు..1. ఇష్యూ లాట్ సైజ్ 2. ఇష్యూధర.. అంటే కంపెనీ ఒక్కో లాట్‌కు ఎన్ని షేర్లు ఆఫర్ చేస్తుంది.. ఎంత ధరకు ఆఫర్ చేస్తుంది అనే వివరాలు. ఒక్కో రిటైల్ ఇన్వెస్టర్ (సాధారణ ఇన్వెస్టర్లు) ఒక్కొక్కరు రూ.2 లక్షల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఉదా: x అనే కంపెనీ రూ.100-120 ధరల శ్రేణితో ఇష్యూకి వచ్చింది అనుకుందాం. సాధారణంగా గరిష్ట ధరకే షేర్ల కేటాయింపు జరుగుతూ ఉంటుంది కాబట్టి రూ.120 పరిగణనలోకి తీసుకుందాం. అలాగే 100 షేర్లను ఒక లాట్‌గా నిర్ధారించి జారీ చేస్తుంది అనుకుంటే మనం రిటైల్ ఇన్వెస్టర్లం కాబట్టి రూ.120 గరిష్ట ధరకు మనకు షేర్లు అలాట్ అవ్వాలంటే గరిష్టంగా 16 లాట్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మార్కెట్లో ఆ ఇష్యూకి ఉండే డిమాండ్, దానికి అనుగుణంగా సబ్స్క్రిప్షన్ ఏ స్థాయిలో జరిగింది అనే దాన్ని దృష్టిలో ఉంచుకుని మనకు షేర్ల అలాట్మెంట్ జరుగుతుంది. 10 రెట్లు, 20 రెట్లు.. ఇలా సబ్‌స్రైబ్ అయితే మనకు కేటాయించే లాట్ల సంఖ్య తగ్గిపోతుంది. ఒక్కోసారి ఒకటే లాట్ అలాట్ కావొచ్చు. ఒక్కోసారి అది కూడా కాకపోవచ్చు.షేర్లు అలాంట్ అవ్వాలంటే..మీరు దరఖాస్తు చేసుకోవాలనుకునే కంపెనీ ఇష్యూకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని తెలిసి, ఎలాగైనా కొన్ని షేర్లు మీకు అలాట్ అవ్వాలంటే మీ కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు ప్యాన్ వివరాలతో ఇలా వివిధ అకౌంట్లతో దరఖాస్తు చేసుకోవచ్చు. దాంతో షేర్లు అలాట్ అయ్యే అవకాశం పెరుగుతుంది. అంతే తప్పా మీపేరుపైనే ఒకటి కంటే ఎక్కవ లాట్ల కోసం దరఖాస్తు చేసుకోకూడదు. అలా చేస్తే మొదటికే మోసం జరుగుతుంది. అధికమొత్తంలో షేర్లు అలాట్ అవ్వకపోగా, కనీసం ఒక లాట్కూడా వచ్చే అవకాశం ఉండదని గుర్తుంచుకోవాలి.రిస్కులులేవా..?ఇష్యూ పూర్తయిన మూడు రోజుల తర్వాత బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో సదరు కంపెనీ షేర్లు లిస్ట్ అవుతాయి. ఐపీఓకి దరఖాస్తు చేయడం వల్ల రిస్కులు, ప్రయోజనాలూ ఉంటాయి. ఐపీఓలో అలాట్ అయినా షేర్లు లిస్టింగ్ రోజున పడిపోతే ఆ నష్టాన్ని భరించడంకానీ, వాటిని కొనసాగించడంగానీ చేయాల్సి ఉంటుంది. అదే లాభాల్లో ట్రేడ్ అవుతుంటే మంచి ప్రయోజనం పొందవచ్చు.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్.. గీత దాటొద్దు..!త్వరలో ఐపీఓకి రానున్న కంపెనీలు..వెంటివ్ హాస్పిటాలిటీ లిమిటెడ్ఇష్యూ ప్రారంభం 20 డిసెంబర్ఇష్యూ ముగింపు 24 డిసెంబర్ మమతా మెషినరీ లిమిటెడ్ఇష్యూ ప్రారంభం 19 డిసెంబర్ఇష్యూ ముగింపు 23 డిసెంబర్ట్రాన్స్రైల్ లైటింగ్ లిమిటెట్ఇష్యూ ప్రారంభం 19 డిసెంబర్ఇష్యూ ముగింపు 23 డిసెంబర్-బెహరా శ్రీనివాసరావుస్టాక్ మార్కెట్, నిపుణులు -
పెట్టుబడులకు మరోమార్గం... మ్యూచువల్ ఫండ్స్
విత్తనాలు నాటితే మొక్కలు వస్తాయి. చెట్లుగా.. ఆపై వృక్షాలుగా ఎదుగుతాయి. పూలు, పళ్ళు ఇస్తాయి. ఇదంతా ఒక్క రోజులో జరిగిపోదు.డబ్బులకూ అదే సూత్రం వర్తిస్తుంది. డబ్బులు నాటితే డబ్బులు మొలకెత్తుతాయి. ఆపై అవి లక్షలు, కోట్లుగా రూపాంతరం చెందుతాయి. ఇది కూడా ఒక్ కరోజులో జరిగే పని కాదు. మన కష్టార్జితాన్ని ఇంతలింతలు చేసుకోవడానికి ఎలాంటి సాధనాలు ఎంచుకోవాలి అన్నదే ప్రధాన ప్రశ్న.మీరు అధ్యయనం చేసి... నిపుణుల సలహా తీసుకుని..తెలివి తేటలతో వ్యవహరించి పెట్టుబడులు పెట్టగలిగితే.. దీర్ఘకాలంలో మంచి రాబడి పొందుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా మన సొమ్ములు తగిన ప్రతిఫలాన్ని ఇచ్చే సాధనాలు ఏవో తెలిసి ఉండాలి. దాని కంటే ముందే మీదగ్గరున్న డబ్బుల నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారో కూడా మీకు తెలిసి ఉండాలి. లేదంటే ఏళ్ళుగడిచినా.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న మాదిరి మీ జీవితం ఎదుగూ బొదుగూ ఉండదు.తాము చేసే పొదుపు బాగా పెరగాలని, రెట్టింపు అవ్వాలని ఎవరు అనుకోరు చెప్పండి. మీరూ ఇందుకు మినహాయింపు కాదంటే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే... కాస్త రిస్క్ తీసుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉండటం. కొద్దిగా రిస్క్ తీసుకోగలిగి... దీర్ఘకాలంపాటు వేచిఉండేవాళ్ళకు అనువైన పెట్టుబడి సాధనంగా మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పొచ్చు.స్టాక్ మార్కెట్లో 100% రిస్క్ తీసుకోలేనివాళ్లకు ఉపయుక్తమైన పెట్టుబడి మార్గం మ్యూచువల్ ఫండ్స్. మనం ఈ ఫండ్స్‌లో సరైన వాటిని ఎంచుకుని పెట్టుబడి పెడితే కొన్నాళ్ళకు అవి మంచి రాబడి అందిస్తాయి. ఇందులో రెండు రకాలు ఉంటాయి.1. సిప్స్2. పెద్దమొత్తంలో ఒకేసారి పెట్టుబడిమీరు ఒక మ్యూచువల్ ఫండ్ స్కీను ఎంచుకుని నెలకు కొంత మొత్తం చొప్పున పెట్టుబడి పెడుతూ వెళ్లొచ్చు. ఇదే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్). అధిక మొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టలేని వాళ్లకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది. ఇక మీచేతిలో తగినంత మొత్తం ఉండి పెద్దమొత్తంలో పెట్టి దీర్ఘకాలం వేచి ఉంటే మంచి రాబడి పొందడం రెండో మార్గం.ఎలాంటి ఫండ్స్ ఎంచుకోవాలి?మ్యూచువల్ ఫండ్స్‌ను వివిధ టాటా, బిర్లా, రిలయన్స్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ వంటి ప్రముఖ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. అయితే మనపెట్టుబడికి తగ్గట్టు, స్థిరంగా రాబడి అందివ్వగల ఫండ్స్‌ను ఎంచుకోవాలి. యాంఫి (AMFI) వెబ్సైటులో ఫండ్స్ కు సంబంధించిన యావత సమాచారం దొరుకుతుంది.ప్రస్తుతం దేశంలో వివిధ మ్యూచువల్ ఫండ్ సంస్థలు అందిస్తున్న స్కీంల్లో ప్రధానమైనవాటిగా ఈకింది వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. » ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్» ఆదిత్య బిర్లా సన్ లైఫ్ స్మాల్ & మిడ్ క్యాప్ ఫండ్» టాటా ఈక్విటీ పీఈ ఫండ్» హెచ్డీఎఫ్సీ మంత్లీ ఇన్కమ్ ప్లాన్» ఎల్&టీ టాక్స్ అడ్వాంటేజ్ ఫండ్» ఎస్బీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్» కోటక్ కార్పొరేట్ బాండ్ ఫండ్» కెనరా రోబెకో గిల్టీ పీజీఎస్» డీఎస్పీ బ్లాక్‌రాక్ బ్యాలెన్స్డ్ ఫండ్» యాక్సిస్ లిక్విడ్ ఫండ్వీటికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా పరిశీలించి ఎంతెంత రాబడి అందిస్తున్నాయి, రిస్క్ ఏ స్థాయిలో ఉంటుంది, పెట్టుబడి ఎలా పెట్టాలి, కాలావధి, వివిధ రేటింగ్ సంస్థలు ఇచ్చిన రేటింగ్, గతకాలపు పనితీరు.... ఇత్యాది అంశాలు సంపూర్ణంగా విశ్లేషించుకుని పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి.ఇక అధిక రిస్క్‌తోపాటు అధికరాబడి ఇస్తున్న ఫండ్స్ విషయానికొస్తే... » హెచ్ఎస్బీసీ మిడ్ క్యాప్ ఫండ్» కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్» ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ స్మాల్ క్యాప్ ఫండ్» యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్» ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్» మిరే అసెట్ మిడ్ క్యాప్ ఫండ్» టాటా మిడ్ క్యాప్ గ్రోత్ ఫండ్‌పై వాటిని ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు, ఇక మహీంద్రా మేన్యూ లైఫ్ మిడ్ క్యాప్ ఫండ్, సుందరం మిడ్ క్యాప్ ఫండ్ లు 30 శాతంపైగా వార్షిక రిటర్న్ లు అందిస్తున్నాయి. సిప్ పెట్టుబడుల విషయానికొస్తే... గత అయిదేళ్లుగా ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ 30 శాతంపైగా రాబడి ఇస్తోంది.మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయి?మ్యూచువల్ ఫండ్స్ మీ దగ్గర సమీకరించిన సొమ్ముల్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అలాచేయడానికి ముందే మీ రిస్క్ కెపాసిటీ, మీ ఆలోచనలు, రాబడి అంచనాలు... వంటి సమాచారాన్ని మీ దగ్గర నుంచి సేకరిస్తాయి. తదనుగుణంగా మీ సొమ్ముల్ని వివిధ పెట్టుబడి మార్గాల్లోకి మళ్లిస్తాయి.» సెక్టోరియల్ ఫండ్స్» టాక్స్ సేవింగ్ ఫండ్స్» ఇండెక్స్ ఫండ్స్» డెట్ ఫండ్స్» స్మాల్ క్యాప్ ఫండ్స్» మిడ్ క్యాప్ ఫండ్స్» లార్జ్ క్యాప్ ఫండ్స్ఇలా భిన్నమైన మార్గాల్లో మీ సొమ్ములను ఇన్వెస్ట్ చేస్తాయి. తద్వారా వచ్చే రాబడిని మీకు బదిలీ చేస్తాయి (ట్యాక్స్‌లు, కమీషన్లు, చార్జీలు వసూలు చేసుకుని).స్టాక్ మార్కెట్‌తో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే వారికి రిస్క్ తక్కువే ఉంటుంది. కానీ రాబడి కూడా అదేస్థాయిలో ఉంటుంది. కాబట్టి పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తిగా ఫండ్ స్కీంలకు సంబంధించిన సమాచారాన్ని మదింపు చేసిన తర్వాతే ముందడుగు వేయడం మంచిది. వివిధ ఫండ్లకు సంబంధించి విశ్లేషణాత్మక సమాచారాన్ని రాబోయే రోజుల్లో తెలుసుకుందాం.-బెహరా శ్రీనివాసరావు, స్టాక్ మార్కెట్ నిపుణులు -
షేర్లు.. ఉరితాళ్లు కాకూడదంటే..!
షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి నష్టాలపాలై చివరకు ప్రాణాలు వదులుతున్న ఘటనలు చూస్తున్నాం. స్టాక్ మార్కెట్ నిజంగానే అంత ప్రమాదకరమా? మార్కెట్లో అడుగుపెట్టిన వారికి ఈ పరిస్థితి రావాల్సిందేనా? మార్కెట్ ముంచేస్తుందా? మరి లాభాలు ఎవరికి వస్తున్నాయి? నష్టాలు వస్తున్నవారు అనుసరిస్తున్న విధానాలు ఏమిటి? అనే చాలా ప్రశ్నలొస్తాయి. వీటిని విశ్లేషించి సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం.స్టాక్ మార్కెట్ అద్భుత సాధనంస్టాక్ మార్కెట్ ఎప్పటికీ ప్రమాదకరం కాదు. పైగా మంచి రాబడి ఇవ్వడానికి మనకు అందుబాటులో ఉన్న ఒక అద్భుత సాధనం. ఓ పక్క కుటుంబం ప్రాణాలు వదులున్న ఘటనలున్నాయని చెప్పారు కదా. మరి స్టాక్ మార్కెట్ బెటర్ అని ఎలా చెబుతారు? అని ప్రశ్నించొచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి వెంటనే రాబడి రావాలంటే చాలా కష్టం. మార్కెట్ తీవ్ర ఒడిదొడుకుల్లో ఉంటుంది. కాబట్టి సరైన సమయం ఇచ్చి రాబడి ఆశించాలి. లార్జ్ క్యాప్ స్టాక్ల్లో దీర్ఘకాలం పెట్టుబడి పెడితే దాదాపు నష్టాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అదే స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు తొందరగానే రావొచ్చు. నష్టాలు కూడా తీవ్రంగానే ఉండొచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.పెన్నీ స్టాక్స్‌తో జాగ్రత్తకొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్సైడర్ ట్రేడింగ్(అంతర్గత సమాచారంతో చేసే ట్రేడింగ్) జరుగుతుంటుంది. అది నిబంధనలకు విరుద్ధం. అది సాధారణ ఇన్వెస్టర్లకు తెలియక పోవచ్చు. దాంతో పెన్నీ స్టాక్ బాగా ర్యాలీ అవుతుందనే ఉద్దేశంతో అందులో పెట్టుబడి పెట్టి చివరకు నష్టాలతో ముగించాల్సి ఉంటుంది. కాబట్టి పెన్నీ స్టాక్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వారు వాటి వైపు చూడకపోవడం ఉత్తమం.ఎవరో చెప్పారని..చాలామంది స్టాక్ మార్కెట్ అనగానే వెంటనే లాభాలు వచ్చేయాలి.. తక్కువ మొత్తం పెట్టుబడితో అధికంగా లాభాలు ఆర్జించాలనే ఆశతో మార్కెట్లోకి అడుగుపెడుతుంటారు. అలాంటి వారు తొందరగానే నష్టాలు మూటగట్టుకుంటారు. కాసింత లాభం కళ్ల చూడగానే మార్కెట్ అంటే ఏంటో పూర్తిగా అర్థమైందని అనుకుంటారు. కానీ చాలామందికి స్టాక్స్‌కు సంబంధించి సరైన అవగాహన ఉండడం లేదు. ఎవరో చెప్పారని, ఏదో ఆన్లైన్లో వీడియో చూశారని, వాట్సప్, టెలిగ్రామ్.. వంటి ఛానల్లో ఎవరో సజెస్ట్ చేశారని పెట్టుబడి పెడుతున్నవారు చాలా మంది ఉన్నారు.ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర ఒత్తిడిస్టాక్ మార్కెట్లో తాము ఇన్వెస్ట్ చేసిన స్టాక్ ఎందుకు పెరుగుతోందో చాలామందికి తెలియదు. అది ఇంకెంత పెరుగుతుందో అవగాహన ఉండదు. ఎప్పుడు పడుతుందో తెలియదు. నిన్నపెరిగింది కదా.. ఈరోజు పడుతుందిలే.. లేదంటే.. నిన్న పడింది కదా.. ఈరోజు పెరుగుతుందిలే..అని సాగిపోతుంటారు. దాంతో భారీగా క్యాపిటల్ కోల్పోవాల్సి వస్తుంది. అప్పటికీ తేరుకోకపోగా ఫర్వాలేదు.. పూడ్చేద్దాం అనుకుంటారు. ఆ నష్టం పూడకపోగా.. మరింత పెరుగుతుంది. అప్పు చేస్తారు. ఎలాగైనా సంపాదించి తీర్చేద్దాం అనుకుంటారు. అదీ జరగదు. క్రమంగా అప్పులు పెరిగిపోతాయి. మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఇది కుటుంబం మీద ప్రభావం చూపిస్తుంది. ఆ కుటుంబం ఆర్ధికంగా చితికిపోతుంది. చివరకు ప్రాణాలు తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది.ఇదీ చదవండి: బీమా ప్రీమియం వసూళ్లు ఎలా ఉన్నాయంటే..దీర్ఘకాలిక దృక్పథం అవసరంట్రేడింగ్ విషయంలో ఆచితూచి అడుగేయాలి. స్టాక్మార్కెట్లో డబ్బులు సంపాదించవచ్చు అనేది నిజం. కానీ నిమిషాల్లో సంపాదించేయలేం. ఓపిక ఉండాలి. దీర్ఘకాలిక దృక్పథం అవసరం. అప్పుడే ఎవరైనా మార్కెట్లో రాణించగలుగుతారు. లేదంటే ఆషేర్లే మెడకు ఉరితాళ్ళుగా మారి కుటుంబాల్ని విషాదాల్లో నింపేస్తాయి.డబ్బు ఎవరు సంపాదిస్తున్నారంటే..మార్కెట్ తీరుతెన్నులను ఓపిగ్గా గమనిస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నేరుగా డబ్బు పెట్టి ట్రేడింగ్ చేయడం కంటే కనీస ఆరు నెలలపాటు పేపర్ ట్రేడింగ్ చేయాలి. దాంతో అవగాహన వస్తుంది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో చాలా కంపెనీలు కాన్కాల్ ఏర్పాటు చేస్తాయి. అందులో పాల్గొనాలి. ఒకవేళ అవకాశం లేకపోతే తర్వాత రెగ్యులేటర్లకు ఆయా వివరాలను అప్డేట్ చేస్తాయి. ఆ డాక్యుమెంట్లు చదవాలి. కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి..రెవెన్యూ అంశాలు ఎలా ఉన్నాయి.. క్యాష్‌ఫ్లోలు ఎలా ఉన్నాయి.. అనుబంధ సంస్థలతో జరిపే రిలేటెడ్ పార్టీ లావాదేవీలు ఎలా ఉన్నాయి.. కంపెనీ సేల్స్ పెంచుకోవడానికి అనుసరిస్తున్న విధానాలు.. పోటీలో ఉన్న కంపెనీలు, వాటి విధానం.. కాలానుగుణంగా సరైన సెక్టార్‌లోని స్టాక్‌లనే ఎంచుకున్నామా.. వంటి చాలా అంశాలను పరిగణించి పెట్టుబడి పెట్టాలి. అలా చేసిన తర్వాత దీర్ఘకాలంపాటు వేచిచూస్తేనే మంచి రాబడులు అందుకోవచ్చు.- బెహరా శ్రీనివాసరావుస్టాక్ మార్కెట్ నిపుణులు -
Stock market: ఈ ట్రాప్‌లో పడకండి
స్టాక్ మార్కెట్లో ఏమాత్రం అనుభవం లేకుండా డబ్బులు సంపాదించేయాలి అనుకుంటే అంతకుమించిన బుద్ధి పొరపాటు మరోటి ఉండదు. మిమ్మల్ని ఎలా ట్రాప్ లో ఇరికించి పబ్బం గడుపుకొంటారో మీకు అర్ధమయ్యేలా చెబుతా.. దయచేసి ఇలాంటి పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు. నాకు తెల్సిన ఒక మిత్రుని కథ అనుకోండి... వ్యథ అనుకోండి... అదెలాగో చెబుతా...నాకు బాగా కావాల్సిన మిత్రుడే... అతనికి అంతో ఇంతో స్టాక్ మార్కెట్ నాలెడ్జి ఉంది.. తన దగ్గరున్న డబ్బులతో కాస్తో కూస్తో బాగానే సంపాదించుకుంటున్నాడు. ఎప్పటినుంచో సొంత ఇల్లు కట్టుకోవాలని కోరిక.అందుకు తగ్గట్టే నాలుగు రూపాయలు రెడీ చేసుకుని... బ్యాంకు లోన్ కూడా తీసుకుని ఇంటి పనులు మొదలెట్టాడు. అవి చివరి దశకు వచ్చాయి. ఓ 3 లక్షలు ఎక్సట్రా కావాల్సి వస్తే ఓ మిత్రుడి దగ్గర 3 రూపాయల వడ్డీకి చేబదులు తీసుకున్నాడు. అంటే నెలకు రూ.9,000 వడ్డీ.కూలీల సమస్యో, తగిన మెటీరియల్ దొరక్కో మధ్యలో పనులు ఓ 15 రోజులు ఆగిపోయాయి. ఇదే అతని కొంప ముంచింది... ఇప్పుడతను... రూ. 4 వడ్డీకి (అంటే నెలకు రూ. 12,000) అప్పు తెచ్చి ఆ పాత బాకీ తీర్చి కొత్త బాకీ నెత్తికెత్తుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో తెలుసుకోవాలంటే...అసలేం జరిగి ఉంటుందో తెలియాలి. ముందే చెప్పానుగా...మనవాడికి స్టాక్ మార్కెట్ గురించి కాస్తో కూస్తో పరిజ్ఞానం ఉందని. ఇంటి పనులకు 15 రోజులు గ్యాప్ రావడం కూడా అతని బుర్రని ఖరాబు చేసింది. ఆ 3 లక్షలు తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లో పెట్టాడు. కనీసం ఓ పాతిక వేలు అయినా సంపాదించుకుందామని. అతని ప్లాన్ బాగానే పనిచేసింది.కేవలం పది రోజుల్లోనే పాతిక కాదు... 50 వేలు పైనే సంపాదించాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇంతలో... ఓ ఫోన్ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేశాడు. అవతలివైపు నుంచి...హలో సర్..చెప్పండి..మేము xyz ట్రేడింగ్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామండీ ... మీరు మార్కెట్లో ట్రేడింగ్ చేస్తారా...? అవతలి వ్యక్తి ప్రశ్న. మనవాడు కూడా మార్కెట్ పండితుడిగా... వాళ్ళేం చెబుతారో విందామని...అవునండీ చేస్తున్నా...ఎందులో చేస్తారు... ఇండెక్స్ లోనా... స్టాక్స్ లోనా...రెండూ..మీ క్యాపిటల్ ఎంతో తెలుసుకోవచ్చా...3 లక్షలు..ట్రేడింగ్ లో రోజుకెంత సంపాదిస్తారు...?4000 -5000 దాకా...అంత తక్కువా...? మీదగ్గరున్న క్యాపిటల్ కి రోజుకు పాతిక వేలు అయినా సంపాదించొచ్చు... మీరు మంచి అవకాశం వదులుకుంటున్నారన్న మాట...(అవతలి వ్యక్తి అన్న మాటకి మనవాడిలో ఎక్కడో అహం దెబ్బతింది. మరోపక్క రోజుకు పాతిక వేలు సంపాదించొచ్చు అన్న మాట ఎక్కడో సూటిగా గుచ్చుకుంది. ఆ క్షణం లోనే అతని మనసు రకరకాల ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది. అసలే ఫ్రెండ్ దగ్గర అప్పుచేసి ఉన్నాడు.. రోజుకు పాతిక వేలు అంటే 15 రోజులు తిరిగేసరికి అప్పు మొత్తం తీర్చేయొచ్చు. ఇప్పుడు చేతిలో ఉన్న మూడు లక్షలు ఎటూ ఉండనే ఉంటాయి... ఇలా ఆనుకుంటూనే...అంత ఆశ లేదులెండి... నాకు వచ్చేది చాలు అని చెప్పబోయాడు..అదేంటి సర్... అలా అంటారు.. మార్కెట్ గురించి మీకు నేను చెప్పాలా...? రోజుకి కనీసం పాతిక వేలు దాకా సంపాదించొచ్చు... మీరు సరేనంటే అదెలాగో చెబుతా..(మనవాడిలో ఆశ బలపడింది.) అయితే చెప్పండి..మీరు ఏ బ్రోకరేజ్ సంస్థలో ట్రేడింగ్ చేస్తారు...?ఫలానా దాంట్లో...మీరు మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తే చాలు... మేము ఇక్కడ మా సిస్టం నుంచి లాగిన్ అవుతాం. మీ తరపున మేం ట్రేడ్ చేస్తాం. మీ సిస్టం లో లాగిన్ అయ్యి ట్రేడింగ్ ను మీరు కూడా గమనించొచ్చు. వచ్చే లాభాల్లో 30% మాకు, 70% మీకు.. ఏమంటారు?ఇలా అనేసరికి కాస్త ఆలోచనలో పడ్డాడు. యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇమ్మంటున్నారు... దానివల్ల ప్రమాదం ఏమీ లేదులే... ఎందుకంటే మన ఫండ్స్ మన అకౌంట్ లోనే ఉంటాయి. ఒకవేళ వాడు విత్ డ్రా పెట్టినా... పడేది నా అకౌంట్ లోనే... వాడు చేసే మోసమేమీ లేదు.. పైగా ఇక్కడ నేను కూడా చూసుకుంటూనే ఉంటానుగా.. అని అనుకుంటూనే... ఎందుకైనా మంచిదని... మీ ఆఫీస్ ఎక్కడ ? అని అడిగాడు...హైదరాబాద్ లో సర్.. కూకట్ పల్లి.అడ్రస్ చెబుతారా...? అని అడిగితే అతను అడ్రస్ కూడా చెప్పాడు.అన్నీ బాగానే ఉన్నాయి కదా అనుకుంటూ... అవతలి వ్యక్తి ఇచ్చిన బంపర్ ఆఫర్ కు ఒప్పుకున్నాడు. వెంటనే ఆ డీటెయిల్స్ అవతలివాని చేతిలో పెట్టాడు. అప్పటికి అతని డీమ్యాట్ అకౌంట్ లో ఉన్న మొత్తం రూ.. 3,55,000. ఫోన్ కట్ అయింది.. ట్రేడింగ్ మొదలైంది. ఆరోజు రూ. 10,000 దాకా ప్రాఫిట్ వచ్చింది. బాగానే ఉంది అనిపించింది. సాయంత్రం అవతలి వ్యక్తి మళ్ళీ ఫోన్ చేశాడు.చూశారుగా మా ట్రేడింగ్... మొదటిరోజు కదా ఎక్కువ చేయలేదు.. రేపటి నుంచి మనం టార్గెట్ తో పనిచేద్దాం సర్... అని చెప్పేసరికి.. మనవాడు ఆనందం తో సరే అంటూ ఫోన్ పెట్టేశాడు.తెల్లారింది.. ట్రేడింగ్ మొదలైంది. కొన్న షేర్లలో లాభాలు వస్తున్నట్లే కనిపించింది.. అంతలోనే నష్టాల్లోకి జారుతున్నట్లు అనిపించింది. ఫర్వాలేదులే అనుకున్నాడు. అలా... అలా... 30,000... 40,000 .... నష్టాల్లోకి కూరుకుపోతున్నట్లే ఉంది.. అవతలివాళ్ళకు ఫోన్ చేస్తే... కంగారుపడకండి సర్... మేమున్నాముగా.. అని చెప్పేసరికి కాస్త ధైర్యం వచ్చింది...ఆ షేర్ కాస్త కోలుకున్నట్లు అనిపించినా.. మళ్ళీ అంతలోనే భారీగా పడిపోయింది. కట్ చేస్తే... సాయంత్రానికి మొత్తం అకౌంట్ ఖాళీ అయిపోయింది.. మధ్యమధ్యలో ఫోన్ చేస్తున్నా... కంగారు పడకండి అన్న సమాధానమే...పోనీ అకౌంట్ తన చేతిలోనే ఉందిగా.. ఇక్కడితో లాస్ బుక్ చేసేసి బయటకు వచ్చేద్దామన్న సాహసం చేయలేకపోయాడు. పైగా అవతలివాళ్ళు ఎక్స్పర్ట్స్. వాళ్లకు తెలుసులే... అని చూస్తూ ఉండిపోయాడు. ఇక ఆ తర్వాత ఎన్ని ఫోన్లు చేసినా అవతలినుంచి సమాధానమే లేదు.. మర్నాడు కూకట్ పల్లి లో వాడి అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తే అలాంటి సంస్థే లేదు. పిచ్చెక్కి పోయింది. ఈ షాక్ నుంచి తేరుకునేసరికి దాదాపు ఆరు నెళ్ళు పట్టింది. మరిన్ని వివరాల్లోకి వెళ్లట్లేదు కానీ... ఇదీ మావాడి విషాదాధ్యాయం.పొరపాటున కూడా ఇలాంటి ట్రాప్ లో చిక్కుకోకండి..మిమ్మల్ని మీరు నమ్ముకోండి... ీకు తెలిస్తే ట్రేడింగ్ చేయండి... లేదంటే నేర్చుకునే ప్రయత్నం చేయండి.. అంతవరకు మంచి షేర్లు సెలెక్ట్ చేసుకుని దీర్ఘకాలానికి పెట్టుబడులపై దృష్టి పెట్టండి. ఇవే మీకు భవిష్యత్ లో లాభాలు పూయిస్తాయి.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ నిపుణులు -
డిపాజిట్లా.. స్టాక్మార్కెట్టా.. మన కష్టార్జితం ఎటువైపు..?
చినుకు చినుకు కలిస్తే జడివాన అవుతుందన్నది ఎంత వాస్తవమో... రూపాయి రూపాయి కూడబెడితేనే రేప్పొద్దున్న అవి వేలు, లక్షలుగా మారతాయి అన్నది కూడా అంతే వాస్తవం. ఇలా కూడబెట్టడానికి, సంపద పెంచుకోవడానికి రకరకాల అవకాశాలు ఉన్నాయి. అయితే కష్టార్జితంతో చెలగాటం ఆడలేం కాబట్టి... ముందు చూపుతో తెలివిగా వ్యవహరించడం అత్యంత ప్రధానం. ఇదివరకటి రోజుల్లో మన ఖర్చులు పోగా మిగిలే డబ్బుల్ని బ్యాంకుల్లోనో, పోస్టాఫీసుల్లోనో డిపాజిట్ చేసుకునేవారు. లేదంటే ఏ బంగారమో కొనుక్కునే వారు. ఇప్పుడు రోజులు మారాయి. సంప్రదాయ మార్గాలు కొత్త రూటు వెతుక్కున్నాయి. అలా ఈమధ్య కాలంలో నలుగురూ కొత్తగా దృష్టి పెడుతున్నదే షేర్లలో పెట్టుబడులు. మన డబ్బులు స్వల్ప వ్యవధిలోనే ఇంతలింతలు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే క్రమశిక్షణ పాటించాలి సుమా.... మన దగ్గరున్న డబ్బులు ఏయే మార్గాల్లో దాచుకుంటే/పెట్టుబడి పెడితే ఎంత అవ్వడానికి అవకాశం ఉంటుందో ఉదాహరణ పూర్వకంగా పరిశీలిద్దాం. ఉదాహరణకు... మన దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి అనుకుందాం. వాటిని ఏయే మార్గాలకు మళ్లిస్తే ఎంత గిట్టుబాటు అవుతుందో పరిశీలిద్దాం.1. పోస్ట్ఆఫీస్వడ్డీరేట్లు 7-7.5 స్థాయిలోఉన్నాయి. అయిదేళ్లకాలవ్యవధికి ఈ రూ. లక్ష డిపాజిట్ చేస్ తేదానిపై వచ్చే వడ్డీ ఏడాదికి రూ. 7,000-7,500. ఐదేళ్లకురూ.35,000 -37,500.* ఎలాంటి రిస్క్ ఉండదు.* ఒకసారి పెట్టుబడి పెట్టి అయిదేళ్లపాటు వదిలేయడమే. * చాలా తక్కువ రాబడి. * పెట్టుబడి సురక్షితం. * అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే భార్య/భర్త, పిల్లలు, బంధువులు, స్నేహితులు... ఎవరినైనా నామినేట్ చేసుకోవచ్చు. * అయితే పెట్టుబడిని పూర్తికాలం కొనసాగించ లేకపోతే చేతికొచ్చే ప్రతిఫలం తగ్గిపోతుంది. * డిపాజిట్ ను ఐదేళ్లూ కొనసాగించలేకపోయినా, మధ్యలో అవసరానికి వెనక్కి తీసుకున్నా చార్జీలు వసూలు చేస్తారు. * డిపాజిట్ చేసిన ఆరు నెలలలోపు విత్‌డ్రా చేసుకునే అవకాశం లేదు. * ఆరు నెలల నుంచి ఏడాదిలోపు ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. కాకపోతే ఎఫ్డీ వడ్డీ రేటు కాకుండా సేవింగ్స్ వడ్డీరేటు చెల్లిస్తారు. * ఏడాది పైబడితే.. వాస్తవానికి నిర్ధారించిన ఎఫ్డీ రేటు కంటే 2% తక్కువగా అప్పటికి ఎన్నినెలలు పూర్తయితే ఆనెలలకు లెక్కగడతారు. మిగతా కాలానికి సేవింగ్స్ రేటుని పరిగణనలోకి తీసుకుంటారు.2. బ్యాంకు డిపాజిట్వడ్డీ రేట్లు గరిష్టంగా 7 శాతం దాకా ఉన్నాయి. అయిదేళ్ల కాలవ్యవధికి ఈ రూ. లక్ష డిపాజిట్ చేస్ తేదానిపై వచ్చే వడ్ డీఏడాదికి రూ. 7,000. అయిదేళ్లకు రూ.35,000.* ఇంచుమించు పోస్ట్ఆఫీస్ మాదిరిగానే ప్రతిఫలాలు ఉంటాయి. * ఎలాంటి రిస్క్ ఉండదు.* ఒకసారి పెట్టుబడి పెట్టి మెచ్యూర్ అయ్యే వరకు ఆగొచ్చు. * తక్కువ రాబడి కానీ పెట్టుబడి సురక్షితం. * అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే భార్య/భర్త, పిల్లలు, బంధువులు, స్నేహితులు... ఎవరినైనా నామినేట్ చేసుకోవచ్చు. * పెట్టుబడిని పూర్తికాలం కొనసాగించ లేకపోతే చేతికొచ్చే ప్రతిఫలం తగ్గిపోతుంది. * డిపాజిట్ ను ఐదేళ్లూ కొనసాగించకపోతే అరశాతం నుంచి 1% దాకా (బ్యాంకునుబట్టి) చార్జీలు వసూలు చేస్తారు.* నిర్ణీత వ్యవధిలోపు డిపాజిట్‌ను ఉపసంహరించుకుంటే అప్పటిదాకా జమకూడిన వడ్డీ నుంచి గాని, అసలు మొత్తం నుంచి గాని ఈ చార్జీలను మినహాయించుకుంటారు. * మధ్యలోనే వెనక్ కితీసుకుంటే డిపాజిట్ మెచ్యూర్ అయినప్పుడు వచ్చే పూర్తి వడ్డీ మొత్తం కోల్పోతారు.3. స్టాక్ మార్కెట్కరోనా తర్వాతి కాలంలో చాలా మందిని ఆకర్షించిన పెట్టుబడి మార్గం ఏదైనా ఉందంటే అది స్టాక్ మార్కెట్టేనని చెప్పుకోవచ్చు. కుప్పలు తెప్పలుగా డీమ్యాట్ అకౌంట్లు పుట్టుకొచ్చేశాయి. అయితే ఇలా ఖాతాలు తెరిచినవారిలో ఎక్కువ మంది పెట్టుబడుల కంటే ట్రేడింగ్ పైనే ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. అలా కాకుండా దీన్నో పెట్టుబడి మార్గంగా ఎంచుకుంటే కచ్చితంగా అధిక ప్రతిఫలాన్ నిపొందుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్నిట్లో ఉన్నట్లే ఇందులోనూ ప్రయోజనాలు లోటుపాట్లు ఉండటం సహజం. అవేమిటంటే...* నిర్ణీత పెట్టుబడితోనూ అధిక రాబడి పొందొచ్చు. * డిపాజిట్లతో పోలిస్తే వచ్చే ప్రయోజనం ఎక్కువ. అదేసమయంలో రిస్క్ కూడా ఎక్కువే. * పెట్టుబడుల విషయంలో దీర్ఘకాలిక దృక్పథంతో వ్యవహరిస్తే గ్యారంటీ ప్రతిఫలాన్ని పొందవచ్చు. * పై ఉదాహరణనే పరిశీలిస్తే లక్ష రూపాయల పెట్టుబడిని ఏడాది కాలవ్యవధితో పెట్టుబడి పెట్టారనుకుందాం. ఉదా: ఈ రూ. లక్షతో రూ. 2000 విలువ చేసే షేర్లు కొంటే 50 వస్తాయి. ఇంత విలువ ఉన్న షేర్లు ఏడాది వ్యవధిలో కనీసం రూ.200 పెరిగే అవకాశం ఉంటుంది (మార్కెట్ పరిస్థితులను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. మార్కెట్ బాగోకపోతే షేర్ పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మార్కెట్లోకి అడుగు పెట్టేటప్పుడే మనం ఎంత వరకు రిస్క్ భరించగలమో చూసుకుని దిగాలి. అయితే దీర్ఘకాలిక పెట్టుబడులు ఎప్పుడూ మంచి ప్రతిఫలాలనే ఇస్తాయని చరిత్ర చెబుతున్న వాస్తవం). * మన 50 షేర్ల మీద రూ. 10,000 రిటర్న్ వచ్చినట్లన్నామాట. దీన్ని అయిదేళ్లకు లెక్కగడితే రూ. 50,000 ప్రతిఫలం ముట్టినట్లు. * బ్యాంకు డిపాజిట్లు, పోస్ట్ఆఫీస్ డిపాజిట్లతో పోలిస్తే అధిక రాబడి సాధించినట్లే అవుతుంది. ఇక్కడ నేను చెప్పింది కనీస స్థాయిలో లెక్కగట్టి మాత్రమే అన్న విషయాన్ని గ్రహించాలి. ఇంతకంటే ఎక్కువ కూడా... అంటే లక్షకు లక్ష, రెండు లక్షలు... అంతకుమించి కూడా సంపాదించిపెట్టే అవకాశం స్టాక్ మార్కెట్‌కు మాత్రమే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. * చెప్పానుగా..రిస్క్ కూడా ఎక్కువే... ఒక్కోసారి ప్రతికూల పరిస్థితులు షేర్ ధరను పడగొడితే సంపాదించడం మాట అటుంచి పోగొట్టుకునే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అయితే మనం కొనే షేర్/షేర్ల నుబట్టి కూడా ఇది ఆధారపడి ఉంటుంది. ఏ చెత్తపడితే ఆచెత్త షేర్ ను కొనేయకూడదన్న ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోకూడదు. దీనికి సంబంధించి మళ్ళీ మరోసారి విడమర్చి చెబుతా..డిపాజిట్లు, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో మనం ఏది ఎంచుకుంటే ఎలాంటి ప్రయోజనం దక్కుతుందో అర్ధం అయిందనుకుంటా... బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మీచేతుల్లోనే ఉంది.-బెహరా శ్రీనివాసరావు, స్టాక్ మార్కెట్ నిపుణులు -
ఇలా చేస్తే.. స్టాక్ మార్కెట్లో మీరే 'రాజా ది గ్రేట్'
వీటి గురించి లోతుపాతుల్లోకి వెళ్లేముందు డీమ్యాట్ ఖాతాల గురించి తెలుసుకోవాలి. కోవిడ్‌కు ముందు వరకూ.. అంటే 2020 మార్చి వరకు దేశంలో దాదాపు 4 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉంటే.. కేవలం నాలుగున్నరేళ్ల వ్యవధిలో అవి 17 కోట్లు దాటేశాయి. సుమారు నాలుగు రెట్లు పెరిగాయన్న మాట.ఇలా ఖాతాలు తెరిచినవాళ్లు ఊరకనే ఉంటారా.. ఉండరు కదా.. కొంత డబ్బులు పట్టుకెళ్లి డీమ్యాట్ ఖాతాకు మళ్లించడం.. ఆ తరువాత ట్రేడ్ చేయడం మొదలెట్టారు. వీళ్లల్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు తక్కువే.. 100 కి 95 మంది తమ కష్టార్జితాన్ని ట్రేడింగ్ వైపే మళ్లిస్తున్నారు. దీనికి కారణం చాలా తక్కువ టైంలోనే ఎక్కువ సంపాదించేయవచ్చన్న అత్యాశ.సంపాదించొచ్చు.. తప్పు లేదు. మనం డిగ్రీ దాకా వచ్చామంటే ముందు అ, ఆ లు నేర్చుకుని, ఆ తర్వాత ఒక్కో తరగతి పాస్ అవుతూ వచ్చాం కదా.. మరి ఇదే సూత్రం మార్కెట్‌కి కూడా వర్తిస్తుందన్న ప్రాథమిక సూత్రాన్ని మరిచిపోయి.. చేతిలో డబ్బులున్నాయి కదా అని, ఒకేసారి భారీగా సంపాదించేయాలని ఉబలాటపడిపోతారు.వెంటనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తారు. స్కాల్పింగ్ స్ట్రాటజీ తో నిమిషాల్లో అధిక లాభాలు వస్తాయనే ఓ థంబ్‌నెయిల్ కనిపిస్తుంది. అది బాగా అట్ట్రాక్ట్ చేస్తుంది. వెంటనే అది చూసి ట్రేడింగ్ మొదలెట్టేస్తారు. నిమిషాల్లో లాభాలు కళ్ళచూడొచ్చని ఆ పెద్ద మనిషి చెప్పింది వాస్తవమే.. కానీ అక్కడ మనం పాటించాల్సిన కొన్ని సూత్రాలు చెబుతాడు ఆ వీడియో పెద్ద మనిషి. కానీ మనోడు అవేవీ తలకెక్కించుకోడు. ఫలితం నిమిషాల్లో సంపాదించడం మాట అటుంచి.. ఉన్నది మొత్తం నిమిషాల్లో పోగొట్టుకుంటాడు.ఈతరహా వ్యక్తుల్లో రెండు రకాలు ఉంటారు.. ఒకళ్ళు పోగొట్టుకున్న దానితో కళ్ళు తెరిచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని భవిష్యత్తులో ఆచితూచి వ్యవహరిస్తారు. అంటే.. అన్నీ తెలుసుకున్నాకే మళ్ళీ మార్కెట్లోకి అడుగుపెడతారు.ఇక రెండోరకం... వీళ్ళు సబ్జెక్టు నేర్చుకోవడం మాట అటుంచి.. పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ ఎలాగైనా సంపాదించేయాలని ఈసారి గతంలో కంటే ఇంకొంచెం ఎక్కువ డబ్బులు తెచ్చి మార్కెట్లో పెడతారు. ఈసారి సక్సెస్ కారు. అది కూడా పోగొట్టుకుంటారు. అటు బయటకు చెప్పుకోలేక, ఇటు దుఃఖాన్ని దిగమింగుకోలేక వేదన అనుభవిస్తూ ఉంటారు. వీళ్ళు చేసిన ఒక చిన్న తప్పుకి వీళ్ళ ఆర్ధిక జీవితం అతలాకుతలం అయిపోయినట్లే.ఇలా తప్పుల మీద తప్పులు చేసేవాళ్లను ఎవరూ మార్చలేరు. వారి ఖర్మకి వారినే వదిలేయడం తప్ప. ఇప్పుడు మనం పైన ప్రశ్నించుకున్న పాయింట్లకొద్దాం.మీరు ఏ సంప్రదాయ పెట్టుబడులు పరిగణనలోకి తీసుకున్నా వాటికి మించి రెండింతలు, మూడింతలు, అంతకుమించి ఇవ్వగల సామర్ధ్యం స్టాక్ మార్కెట్‌కు ఉంది. మీరు చేయాల్సిందల్లా.. సరైన స్టాక్నుసెలెక్ట్ చేసుకోవడం. ముందు మీ దగ్గర పెట్టుబడి పెట్టదగ్గ సొమ్ములు ఎన్ని ఉన్నాయో చూసుకోండి. ఆ తర్వాత అందులో సగం డబ్బుల్ని మాత్రమే పెట్టుబడుల వైపు మళ్లించండి.ఉదా: మీదగ్గర ఓ రూ. 2 లక్షలు ఉన్నాయి అనుకుందాం. అందులో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టండి. అయితే ఆ లక్షతో ఏ షేర్లు కొనాలనే సందేహం రావొచ్చు. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సెన్సెక్స్‌లో 30 షేర్లు ఉంటాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి విషయానికొస్తే దీని ప్రామాణిక సూచీ నిఫ్టీ. దీంట్లో 50 షేర్లు ఉంటాయి. పెట్టుబడులకు వీటిని ఎంచుకోవచ్చు.ఈ షేర్లు మార్కెట్ పడినా పెద్దగా పడిపోవు. మళ్ళీ మార్కెట్లో రికవరీ రాగానే ఇవి పెరగడం మొదలెడతాయి. కాబట్టి మీరు కొన్న తర్వాత ప్రతికూల పరిస్థితుల్లో షేర్ ధర క్షీణించినా... ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అలాకాక తక్కువ రేటుకు వస్తున్నాయి అనో, ఎక్కువ పరిమాణంలో కొనేయొచ్చనో డబ్బులతో ప్రయోగాలు చేయకండి.ఉదా: మీదగ్గరున్న లక్షతో 10 రూపాయల లోపు ఉండే షేర్లు 10,000 రావొచ్చు. అయితే అవి ఒక రూపాయి పెరగడానికి ఒక్కోసారి ఒక సంవత్సరం కూడా పట్టొచ్చు. పైగా వాటిలో లిక్విడిటీ చాలా తక్కువ ఉంటుంది. అంటే.. మనకు డబ్బులు అవసరమైనప్పుడు వాటిని అమ్ముకుందామంటే కొనే నాథుడు ఉండదు. అలా ఇరుక్కుపోతారు.అదే మంచి లిక్విడిటీ ఉండే నిఫ్టీ, సెన్సెక్స్ షేర్లలో పెట్టుబడి పెడితే ఒకవేళ మార్కెట్ పడినా.. తర్వాత రికవరీ లో మంచి ప్రాఫిట్స్ అందిస్తాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మి సొమ్ములు చేసుకోవచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా.. మంచి స్టాక్‌ను ఎంచుకోవడం. అదెలా అన్నది మరోసారి విశ్లేషించుకుందాం.ఇతర మార్గాలతో పోలిస్తే స్టాక్ మార్కెట్లో కచ్చితంగా మంచి డబ్బులే సంపాదించవచ్చన్నది నా మాట. నాలెడ్జి లేకుండా ఇష్టమొచ్చినట్లు చేస్తేనే అసలు ముప్పంతా. అంచేత ముందు సబ్జెక్టు తెలుసుకోండి. అధిక రాబడి ఇవ్వగల సామర్ధ్యం మార్కెట్‌కు ఉంది. దాన్ని సరిగా ఉపయోగించుకోవడమే మీ చేతుల్లో ఉంది. ఇదొక రెండో ఆదాయ మార్గపు వనరుగా భావించి ఒక క్రమ పద్ధతిలో, అత్యాశకు పోకుండా పెట్టుబడి మార్గంగా వినియోగించుకొంటే మీరు భవిష్యత్‌లో 'రాజా ది గ్రేట్' అవుతారనడంలో సందేహం లేదు.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ నిపుణులు. -
స్టాక్ మార్కెట్లో చేయాల్సినవి.. చేయకూడనివి!
స్టాక్ మార్కెట్‌ను ఎలాంటి కష్టం లేకుండా డబ్బు సంపాదించే మార్గంగా చాలా మంది భావిస్తుంటారు. ఇందులో కొంతవరకు వాస్తవం లేకపోలేదు. కానీ, ఫ్రీగా డబ్బులు రావన్న విషయాన్ని మాత్రం విస్మరించకూడదు. గతంలో స్టాక్ మార్కెట్ లావాదేవీలన్నీ కాగితాల మీదే జరిగేవి. ఒక షేర్ కొనాలన్నా, అమ్మలన్నా పెద్ద తతంగమే ఉండేది. పైగా ఆ షేర్లు మన అకౌంట్లో జమ అయ్యేందుకు రోజులే పట్టేది. కానీ ప్రస్తుతం టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దాంతో ట్రేడింగ్ చాలా సులువైంది. అరచేతిలో క్షణాల్లో స్టాక్స్ అమ్మడం, కొనడం జరిగిపోతుంది. కానీ గతంలో స్టాక్ మార్కెట్లోకి వచ్చిన వ్యక్తులు డబ్బు పోగుట్టుకున్నా అనుభవం గడించేవారు. ప్రస్తుతం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్..?ఎవరో చెప్పారని, యూట్యూబ్‌లో ఏదో వీడియోలు చూశామని స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టి భారీగా నష్టపోతున్నారు. దాంతో మార్కెట్‌పై నిందలేస్తూ, ఇదో జూదమని, గ్యాంబ్లింగని స్టాక్ మార్కెట్ నుంచి విరమించుకుంటున్నారు. సరైన అవగాహన పెంపొందించుకోకుండా మార్కెట్లోకి ప్రవేశించి చేతులు కాల్చుకుని మార్కెట్‌ను నిందించడం సరికాదు. మార్కెట్లోకి రావాలనుకునేవారు, ఇప్పటికే వచ్చినవారు ముందుగా అవగాహన పెంచుకోవాలి. కేవలం స్టాక్స్‌లోనే కాకుండా ఇండెక్స్‌లు, మ్యుచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు వంటి ఎన్నో మార్గాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. స్టాక్స్ కొనాలంటే ఎలాంటి సమయంలో తీసుకోవాలి.. ఎందుకు వాటినే ఎంచుకోవాలి.. వాల్యుయేషన్ల మాటేంటి.. త్రైమాసిక ఫలితాలు ఎలా ఉన్నాయి.. కంపెనీ కాన్ఫరెన్స్‌కాల్‌లో ఏం చెబుతున్నారు.. భవిష్యత్తు ప్రణాళికలేంటి.. వంటి ఎన్నో అంశాలను పరిగణించాలి. మార్కెట్లో ఉన్నవారు చేయాల్సిన, చేయకూడని కొన్ని అంశాలను పరిశీలిద్దాం.ఇలా చేయొద్దుఅవగాహన లేనప్పుడు ట్రేడింగ్‌కు దూరంగా ఉండండి.ఇన్స్టంట్ మనీ కోసం తాపత్రయపడకండి.పెట్టిన గంటలోనో, ఒక రోజులోనో లాభాలు వచ్చేయాలని ఆశించకండి.ట్రేడింగ్‌లో లాభాలతో పోలిస్తే నష్టపోయేది ఎక్కువ. కాబట్టి దానిపై పూర్తి పరిజ్ఞానం లేకుండా డబ్బులతో ప్రయోగాలు చేయకండి.సామాజిక మాధ్యమాల్లో రకరకాల వ్యక్తులు ఊదరగొట్టే సిఫారసులు చూసి మీ కష్టార్జితంతో చెలగాటమాడుతారు. వారి మాటలు నమ్మకండి.‘మీరు ట్రేడింగ్ చేస్తున్నారా..’ అంటూ ఫోన్ కాల్స్ చేసి మీకు సిఫారసులు అందిస్తాం.. అనేవాళ్లను నమ్మకూడదు.ఏ పని చేసిన మీపై ఆధారపడి కుటుంబం ఉందనే విషయాన్ని మరవకూడదు.ఇదీ చదవండి: ‘వాతావరణ మార్పునకు ఈవీలు పరిష్కారం కాదు’ఇలా చేయండిముందు స్టాక్ మార్కెట్ మీద ఉన్న అపోహలు, భయాలను వదిలేయండి.స్టాక్ మార్కెట్ అంటే నష్టాలు తెచ్చిపెట్టే ఓ జటిల పదార్ధంగా భావించకుండా సిరులు కురిపించే సాధనంగా చూడటం నేర్చుకోండి.మార్కెట్‌పై అవగాహన పెంచుకోండి.రియల్‌టైమ్‌లో పేపర్ట్రేడ్ చేస్తూ క్రమంగా పట్టు సాధించండి.మీ దగ్గర ఎంత డబ్బున్నా ప్రారంభంలో ట్రేడింగ్‌కు దూరంగా ఉండండి. ఇన్వెస్ట్‌మెంట్‌పై దృష్టి పెట్టండి.ట్రేడింగ్ వేరు.. ఇన్వెస్ట్మెంట్ వేరనే విషయాన్ని నిత్యం గుర్తుంచుకోండి.మీ పెట్టుబడును దీర్ఘకాలం కొనసాగించేలా ప్రయత్నించండి.బ్యాంకులో ఎఫ్డీ చేసినపుడు ఏడాది, రెండేళ్లు, ఐదేళ్లు ఎలా వేచిస్తున్నారో..అలాగే మార్కెట్లోనూ ఓపిగ్గా ఉండండి.స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఫండమెంటల్స్ బాగున్నా షేర్లను ఎంచుకోండి.తాత్కాలిక ఒడిదొడుకులు ఎదురైనప్పుడు ఈ షేర్లు పడినట్లు కనిపించినా, భవిష్యత్‌లో ఇవి మంచి రాబడులు అందిస్తాయి.మార్కెట్ పడిన ప్రతిసారీ కొంత మొత్తంలో షేర్స్ కొనేలా ప్లాన్ చేసుకోండి. దానివల్ల మీకంటూ ఒక పోర్ట్‌ఫోలియో క్రియేట్ అవుతుంది.డిపాజిట్లు వంటి సంప్రదాయ పెట్టుబడులతో పోలిస్తే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు అధిక రాబడులనే ఇస్తాయి. కానీ సరైన అవగాహనతో ఇన్వెస్ట్ చేయడం ముఖ్యం.- బెహరా శ్రీనివాసరావు, మార్కెట్ విశ్లేషకులు -
PM Modi: టార్గెట్ 400.. అసలు సాధ్యమేనా??
డబ్బులు ఊరికే రావు.... తళతళా మెరిసే గుండుతో టీవిలో కనబడినప్పుడల్లా ఊదరగొడుతూ ఉంటాడు ఓ పెద్దాయన... వాస్తవమే కదా మరి.. దీన్నే రాజకీయ భాషలో చెప్పాల్సి వస్తే... అధికార పీఠం కూడా ఊరికే దక్కదు.. దశాబ్ద కాలంగా దేశాన్నిఏలుతున్న ఎన్డీయే కూటమికి మాత్రం ఈ సూత్రం వర్తించదనే చెప్పొచ్చు. మరో రెండు నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి అధికారం అవలీలగానే దక్కబోతోంది కాబట్టి! విపక్షాల బలహీనతే ఎన్డీయే కు ఇప్పుడు పెద్ద బలం. అదే అధికారాన్ని మరోమారు బంగారు పళ్లెంలో పెట్టి అప్పగించబోతోంది. 2014 కు ముందు పదేళ్లు నిరాటంకంగా పాలించిన యూపీఏ కూటమి స్వయంకృత చేష్టలు ఆ పార్టీని అప్పట్లో అధికారానికి దూరం చేశాయి. ఫలితంగా ఎన్డీయే కూటమి కేంద్రంలో కొలువు తీరింది.. ఆనాటి నుంచీ నానాటికీ బలపడుతూ.. విపక్ష పార్టీలకు అందనంత ఎత్తుకు ఎదిగి పోయింది. . రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించడం ద్వారా మరోమారు హస్తినలో పాగా వేసేందుకు సిద్ధమవుతోంది. ఎన్డీయే కూటమికి ఈసారి విజయం నల్లేరుపై నడకే కావొచ్చు కానీ... తన ప్రాబల్యాన్ని ఈమేరకు పెంచుకుంటుంది అన్నదే ప్రధాన ప్రశ్న. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తాను పార్టీ అధ్యక్షునిగా ఉన్న కాలంలో, 400 పైచిలుకు సీట్లు 50 శాతం ఓటు బ్యాంకు లక్ష్యంగా ముందుకు సాగాలని పార్టీ శ్రేణులతో తరచూ అంటూ ఉండేవారు. ప్రస్తుత పరిణామాలు గమనిస్తే... ఈసారి ఎన్నికల్లో ఆ లక్ష్య సాధన కష్టమేమీ కాబోదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ మధ్య ఇండియా టీవీ సిఎన్ఎక్స్ చేపట్టిన ఒక సర్వే ప్రకారం 61 శాతం ప్రజానీకం మళ్ళీ మోదీ నే ప్రధానిగా చూడాలి అనుకుంటున్నామని చెప్పగా.. రాహుల్ గాంధీ వైపు మొగ్గు చూపింది మాత్రం కేవలం 21 శాతం మందే కావడం గమనార్హం. . బ్రిటన్ కు చెందిన ‘ది గార్డియన్‘ పత్రిక తాజాగా ఒక విశ్లేషణ వెలువరిస్తూ.. కేంద్రంలో ఉన్నబలహీన ప్రతిపక్షమే ప్రస్తుత అధికార పక్షాన్ని హ్యాట్రిక్ దిశగా నడిపించడం ఖాయమని అంచనా వేసింది. తదనుగుణంగానే ఇటీవలి రెండు సంఘటనలు ఈ అంచనాల్ని మరింత పెంచాయి.అందులో ఒకటి అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ఠాపన కాగా... రెండోది మిత్రునిగా మారిన ’ప్రియమైన శత్రువు’ నితీష్ కుమార్ ఎన్డీయే తీర్థం పుచ్చుకోవడం. మోదీ హవా ప్రధాని మోదీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి ఆ రాష్ట్రం భూకంపం తాకిడికి అతలాకుతలమై ఆర్ధిక వ్యవస్థ చితికిపోయి ఉంది. దీని తాలూకు దుష్పరిణామాల నుంచి ఆ రాష్ట్రాన్ని కేవలం మూడేళ్ళలో బయట పడేయడమే కాదు.. గుజరాత్ ను ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్ది దేశ విదేశాల్లో ఆ రాష్ట్ర కీర్తి ఇనుమడిల్లేలా చేశారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు. పెచ్చుమీరిన ద్రవ్యోల్బణం, వేళ్లూనుకున్న అవినీతి, నిరుద్యోగ భూతం, మౌలిక వసతుల లేమి, ఉగ్రవాదం, జాతీయ భద్రతా సవాళ్లు, ఆర్ధిక తిరోగమనం, కరెంటు ఖాతా లోటు రికార్డు స్థాయికి పెరిగిపోవడం, రూపాయి విలువ పడిపోవడం.. ఇలా ఎన్నో సమస్యలు దిగ్బంధం చేసిన ఆ తరుణంలో 2014 ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 31 శాతం ఓట్లతో 335 సీట్లు చేజిక్కించుకోవడం ద్వారా తొలిసారి ప్రధాని పగ్గాలు చేపట్టి తన సత్తా ఏమిటో నిరూపించుకోవడం చరిత్ర చెబుతున్న సత్యమే. బలాలు ఎన్ని ఉన్నప్పటికీ హిందీ బెల్ట్ సహకరించినట్లుగా తూర్పు, దక్షిణ భారతాల్లో బీజేపీ ఇప్పటికీ తగిన పట్టు మాత్రం సంపాదించలేక పోతోంది. అక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా. ఇప్పటికిప్పుడు ఈ రాష్ట్రాల నుంచి ప్రమాదకర సంకేతాలేవీ లేనప్పటికీ ఈ రాష్ట్రాలపై ఫోకస్ పెడితే ఇక ఇప్పట్లో మోదీ టీం కు తిరుగే ఉండదు. రాబోయే ఎన్నికల్లో విజయ భేరి మోగించడం ద్వారా ముచ్చటగా మూడోమారూ అధికార దండాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధమవుతున్న ఎన్డీయే కూటమి ప్రగతికి దోహదం చేసిన పరిణామాలు, సంస్కరించాల్సిన అంశాలను పరిశీలిద్దాం. అయోధ్య రామాలయం: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి 2019 లో బీజం పడింది. కోట్లాది హిందూ ఓటర్ల మనసులు గెలుచుకునేలా ఎప్పటికప్పుడు పావులు కదుపుతూ వచ్చిన బీజేపీ... తాజా ఎన్నికల వేళకు తనదైన శైలిలో అడుగులు వేయగలిగింది. ఆగమేఘాల మీద పనులు ప్రారంభించి మొన్న జనవరి లో బాల రాముని విగ్రహ ప్రతిష్ఠాపన తో తన లక్ష్యాన్ని చేరుకోవడంలో కృతకృత్యమైంది. ఓటు బ్యాంకును పెంచే వాటిలో ఇదొక తాజా పరిణామం. పెట్టుబడులు స్టాక్ మార్కెట్లు: ఆర్ధిక, సామాజిక, ఆరోగ్య రంగాలతో పాటు విదేశీ పొర్టుఫోలియో మదుపర్లపై విధిస్తున్న సర్ చార్జీని రద్దు చేయడం వంటి విదేశీ విధానాల్లోనూ అనుసరించిన విప్లవాత్మక విధానాలు మోదీ సర్కారు కీర్తి ప్రతిష్టలను దేశ విదేశాల్లో ఇనుమడింప జేశాయి. కేంద్రంలో స్థిరమైన సర్కారు ఏర్పడిందన్న భరోసా, మోదీ పై ఉన్న అచంచల విశ్వాసం.. విదేశీ మదుపరులకు స్థైర్యాన్నిచ్చాయి. దీంతో పెట్టుబడుల వరద మొదలైంది. మార్కెట్ సూచీలు దూసుకెళ్లాయి. స్టాక్ మార్కెట్లు పరుగులు తీశాయి. మధ్యలో కొవిడ్ పరిణామాలు వెనక్కి లాగినా.. అవన్నీ తాత్కాలికమేనని నిరూపిస్తూ ప్రస్తుతం స్టాక్ మార్కెట్ సూచీలు రికార్డు స్థాయిల్లో దూసుకెళ్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా పేరిట దేశాన్ని గ్లోబల్ డిజైనింగ్ హబ్ గా తీర్చిదిద్దడం. శిశు మరణాలను తగ్గించేందుకు, లింగ వివక్షని రూపు మాపేందుకు భేటీ బచావో, భేటీ పడావో కార్యక్రమం. యువతలో నైపుణ్యాలను వెలికితీసే స్కిల్ ఇండియా, ఆర్ధిక సంస్కరణల్లో భాగంగా డిజిటల్ ఇండియాలపై దృష్టి. మురికివాడల సంస్కృతికి చర్మ గీతం పాడే రీతిలో అర్హులైన పేద ప్రజానీకానికి ఇల్లు దక్కేలా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన. యువ భారతంలో వ్యాపార నైపుణ్యాలను వెలికి తీసేందుకు, వారిని భవిష్యత్ వ్యాపారవేత్తలుగా తీర్చి దిద్ధేందుకు దోహదం చేసేలా అంకుర సంస్థల ఏర్పాటుకు ప్రోత్సహించడం. తద్వారా నైపుణ్యాలకు కొదువ లేక నిధుల లేమితో సతమతమయ్యే ఎంతోమంది నిరుద్యోగ యువతకు మేలు చేకూర్చడం. నల్లధనంపై పోరాటం లో భాగంగా డీమోనిటైజేషన్ పేరిట పెద్ద నోట్ల ఉపసంహరణ ముస్లిం మహిళలకు షాదీ షాగున్ యోజనతో పాటు సౌభాగ్య, ప్రధాన మంత్రి ధన్ యోజన, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన, ప్రధాన మంత్రి యువ యోజన, సంకల్ప్ సే సిద్ది, ఉడాన్, ఈశ్రమ పోర్టల్ ఆవిష్కరణ వంటి పథకాలు. ఆరోగ్య రంగంలో పేదలకు ఉపకరించేలా రూ. 10 లక్షల వరకు ఆరోగ్య బీమా విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ జాతీయ విద్యా విధానాన్ని 2026 నాటికి దేశమంతటా అందుబాటులోకి తెచ్చేలా చేయడం. గత దశాబ్ద కాలంలో వివిధ ఎక్సప్రెస్ వే ల నిర్మాణం, రవాణా సదుపాయాలకు దూరంగా ఉండే గ్రామాలకు సైతం రైల్వే సదుపాయాలను కల్పించడం, వందే భారత్ రైళ్లు, చిన్నపట్టణాలు, నగరాల్లో విమానాశ్రయాల నిర్మాణం. విద్యుత్ వెలుగులకు నోచుకోని గ్రామాలకు కరెంట్ సదుపాయాలూ అందించడం. సమాజంలోని బడుగు, బలహీన వర్గాల ఖాతాల్లో నేరుగా సొమ్ములను బదిలీ చేసే జన్ ధన్ యోజన పథకం. చిన్న వర్తకులు, వ్యాపారస్థులకు ప్రయోజనం చేకూరేలా డిజిటల్ పేమెంట్ వ్యవస్థకు శ్రీకారం చుడుతూ యూపీఐ పేమెంట్ విధానాన్ని ప్రవేశపెట్టడం. సమస్యలూ ఉన్నాయి.. అవినీతి నల్లధనం: కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అవినీతి, లంచగొండితనం వేళ్ళూనుకుపోయాయి. ఇది అంత తేలిగ్గా పరిష్కారం అయ్యేది కానే కాదు. అవినీతి, కుంభకోణాలకు ఆమడదూరం ఉంటామని చెప్పే పార్టీ లో వాటితో నేరుగానో, పరోక్షంగానో ప్రమేయం ఉన్న కొందరు రాజకీయ వేత్తలు ఉండటం ఓ పెద్ద మచ్చ. నల్ల ధనం నిరోధం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న మాదిరిగానే ఉంది. బ్లాక్ మనీ నిరోధం దిశగా పెద్ద నోట్ల రద్దు వంటి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం వేసిన అడుగులు నామమాత్రమే. ధరలు రైతులు: ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉందంటూ రిజర్వు బ్యాంకు చెబుతున్నప్పటికీ ధరలు మాత్రం దిగివచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. సామాన్యుడి నడ్డి విరుగుతూనే ఉంది. దళారీ వ్యవస్థ నిర్మూలనలోనూ చర్యలు నామమాత్రమే. పంజాబ్, హర్యానా రైతులు దేశ రాజధానిలో లబోదిబో మంటూ నిరసనలకు దిగుతున్నా వారి సమస్యల పరిష్కారం దిశగా సరైన అడుగులు పడటం లేదు. ►డిజిటల్ పేమెంట్ వ్యవస్థకు సంబంధించి ఇప్పటికీ పరిష్కారం కాని విషయాలు చాలానే ఉన్నాయి. చెల్లింపులు చేసినప్పుడు ఎదురయ్యే అవాంఛనీయ పరిణామాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉంది. ►వందే భారత్ రైళ్లు ఓ గొప్ప విజయమని చెప్పుకునే దేశంలో.. ఇప్పటికీ గబ్బుకొట్టే రైళ్లు, అక్కరకు రాని స్టేషన్లు, సరైన పహారా వ్యవస్థ లేని రైల్వే క్రాసింగ్ లు వంటి సమస్యలతో రైల్వే రంగం కొట్టుమిట్టాడుతోంది. ►జనాభా విస్తరణతో నగరాలుగా మారుతున్న పట్టణాలు, పట్టణాలుగా రూపు సంతరించుకుంటున్న మండల స్థాయి గ్రామాల్లో మౌలిక వసతుల లేమి ప్రధాన సమస్యగా నిలుస్తోంది. ఈనేపథ్యంలో స్మార్ట్ నగరాల నిర్మాణం ఎప్పటికి, ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. పాలకులు మారొచ్చు గాక.. ప్రభుత్వాలు కొత్త రూపు సంతరించుకోవచ్చు గాక.. కాలానుగుణ మార్పుల్లో భాగంగా కొత్త విధానాలతో ప్రజలకు ఉపయుక్తమయ్యే రీతిలో కార్యాచరణ ఉన్నప్పడే అసలైన అడుగు పడినట్లు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థల్లో మూడో స్థానం దిశగా భారతావని అడుగులు వేస్తోందని మోదీ సర్కారు చెబుతోంది. వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమేననే సంకేతాలు ఇప్పటికే వెలువడుతున్నాయి. కొలువు దీరబోయే కొత్త ప్రభుత్వం అఖండ భారతంలో వెలుగులు విరబూయించాలంటే ప్రజల తలరాతలు మార్చగలగాలి. లేకుంటే అంకెలన్నీ హంగూ ఆర్భాటాలతో కాగితాలపై కనిపించే మెరుపు తీగలు గానే మిగిలిపోతాయి. అలా జరగదనే భావిద్దాం. ఈసారి బృహత్తర లక్ష్యాలతో ఎన్డీయే సర్కారు ముందుకు సాగాలని, స్వర్ణ భారతం ఆవిష్కృతమవ్వాలని ఆశిద్దాం. ✍️బెహరా శ్రీనివాస రావు సీనియర్ పాత్రికేయులు -
నాథుడు లేని పార్టీకి అందలమెలా..
అది ఎంత మహా వృక్షమైనా కావొచ్చు. ఎన్నిఆటుపోట్లనైనా తట్టుకుని ఉండొచ్చు. చివరికి ఓ చిన్నపాటి గాలివాన చాలు.. కూకటి వేళ్ళతో కూలిపోవడానికి.. దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఈ దృష్టాంతం అతికినట్లు సరిపోతుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చకచకా పావులు కదుపుతూ ప్రత్యర్థి పార్టీలకు సవాలు విసరాల్సింది పోయి అంతర్గత సమస్యలహో అల్లాడుతూ పఠనం దిశగా సాగుతోంది. మరోపక్క ప్రస్తుత ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మాత్రం అందనంత ఎత్తులో మూడోమారు అందాలన్నీ దక్కించుకునే రేసులో దూసుకుపోతోంది. ఒక జాతీయ పార్టీగా రాజకీయాలను శాసించి.. దిగ్గజాలకు ఆలవాలమై దుర్బేధ్యమైన కోటను నిర్మించుకున్న కాంగ్రెస్ ఇప్పుడు దిక్కులేని స్థాయికి ఎందుకు దిగజారింది?? ఎందుకీ దుర్గతి పట్టింది..?? ఎన్నికల వేళ పార్టీ ని సరైన పంథాలో నడిపించే నాథుడు లేక ఎందుకు విలాలలాడుతోంది..?? రాబోయే రోజుల్లో ఇది ఒక ప్రాంతీయ పార్టీగానైనా నిలబడుతుందా..?? నాలుగు దశాబ్దాల కిందట 400 పై చిలుకు స్థానాలతో ప్రత్యర్థులను గడగడ లాడించిన పార్టీ నేడు కనీస సీట్లు అయినా సాధించుకోలేని పరిస్థితికి ఎందుకు వచ్చింది?? ఇవన్నీ సమాధానం వెతకాల్సిన ప్రశ్నలే.. పతనం దిశగా.. వాస్తవాలు ఎప్పుడూ కఠినంగానే ఉంటాయి. కాంగ్రెస్ పఠనం వెనుక కఠోర సత్యాలు కూడా దాచిపెట్టేవి ఏమీ కాదు. పార్టీ ప్రస్తుత దుర్భర పరిస్థితికి ప్రధాన కారణం స్వయంకృతమేనని చెప్పుకోవాలి. నెహ్రు, ఇందిర, రాజీవ్‌ల హయాం తర్వాత పార్టీ మసకబారడం మొదలైంది. రాజీవ్ మరణానంతరం సోనియా అధికార విముఖతతో ప్రధాని పదవిని చేపట్టిన పీవీ.. మన్మోహన్ సాయంతో దేశాన్ని సంస్కరణల బాట అయితే పట్టించగలిగారు కానీ పార్టీకి అవసరమైన శక్తియుక్తులు నింపడంలో మాత్రం తన చాణక్య నీతిని ప్రదర్శించలేక పొయారనే చెప్పొచ్చు. కారణం పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు. అదీగాక పీవీ హయాంలోనే వెలుగు చూసిన హర్షద్ మెహతా కుంభకోణం పార్టీకి తీరని నష్టాన్ని మిగిల్చింది. ఫలితంగా తొలిసారి వాజపేయి దేశ ప్రధాని అయ్యారు. ఇక 2004 ఎన్నికల్లో ‘ఇండియా షైనింగ్‘ నినాదంతో ఎన్డీయే కూటమి బలమైన ప్రభావాన్నే చూపినప్పటికీ గుజరాత్ మత కల్లోలాలు ఆ కూటమిని కాదని యూపీఏ (ఇప్పటి ఇండియా కూటమి) కూటమికి అధికార పగ్గాలు అప్పగించాయి. మన్మోహన్ ప్రధాని అయ్యారు. దశాబ్ద కాలం పాటు రెండు విడతల్లోనూ ప్రధాని అయితే కాగలిగారు కానీ.. మౌన మునిగా ముద్రపడటం.. కర్త, కర్మ, క్రియ అంతా సోనియారాహుల్ లే అయ్యి ముందుకు నడిపించడం ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తికి ఆస్కారం కలిగించింది. దీంతో రానురానూ పార్టీ ప్రాభవం అడుగంటుతూ వచ్చింది. మన్మోహన్ రెండో విడతలో రకరకాల స్కాములు వెలుగు చూడటం, ధరల నియంత్రణ లేకపోవడం, నిరుద్యోగిత రేటు పెచ్చుమీరడం, పార్టీ నాయకుల్లో పొరపొచ్చాలు ప్రతిస్థను అథఃపాతాళానికి దిగజార్చేశాయి. ఎన్డీయే కూటమి ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంది. మోదీని తెరపైకి తెచ్చింది.. పగ్గాలు దక్కించుకుంది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎదురేలేకుండా దూసుకుపోతోంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ సొంతంగా 51 సీట్లు గెలుచుకోగా.. యూపీఏ కూటమి కేవలం 91 సీట్లతో, అది కూడా కేవలం 20 శాతం ఓటు బ్యాంకు తో సరిపెట్టుకోవాల్సి వచ్చిందంటే పార్టీ ఏ స్థాయికి పడిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. అక్కరకు రాని అన్నా చెల్లెల్లు మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతోనే యూపీఏకు నూకలు చెల్లడం మొదలైనట్లేనని భావించొచ్చు. ఇంటి పెద్దగా సోనియా పైపైన పెద్దరికం వహిస్తున్నా.. మోదీ, అమిత్ షాల ద్వయాన్ని ఎదుర్కొనే దీటైన నాయకుడ్ని తీర్చిదిద్ద లేకపోవడం కాంగ్రెస్ పార్టీని వేధిస్తున్న ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. ఇందుకు రాహుల్, ప్రియాంకల ఉదంతాలే ఓ పెద్ద ఉదాహరణ. పదేళ్ల కిందట ప్రజల్లోని అసంతృప్తి సెగలతో అధికార పీఠాన్ని వదులుకున్న కాంగ్రెస్ కూటమి తర్వాతి తరుణంలోనూ కోలుకునే ప్రయత్నం చేయలేక పోయింది. పార్టీకి రాహుల్, ప్రియాంకల రూపంలో యువ నాయకత్వం అందుబాటులో ఉన్నప్పటికీ సద్వినియోగం చేసుకోవడంలో పార్టీ విఫలమైంది. యువ నాయకునిగా చాకచక్యంగా వ్యవహరిస్తూ పార్టీకి మనోధైర్యాన్ని నింపి ముందుకు నడిపించలేకపోయాడు రాహుల్.. అంచెలంచెలుగా నాయకునిగా ఎదగాల్సిన చోట తనవల్ల కాదంటూ పార్టీ అధికార బాధ్యతలకు ఆమడ దూరం వెళ్లిపోయాడు ఆయన.. ఒక నెహ్రు, ఇందిరా, రాజీవ్‌ల వంశీకుడైనా ఆ లక్షణాలు పుణికిపుచ్చుకోలేక పోవడం రాహుల్ ప్రధాన వైఫల్యంగా భావించొచ్చు. ఇక అప్పట్లో ఇందిరమ్మ డైనమిజంతో పోలుస్తూ ప్రియాంకను రంగంలోకి దింపేందుకు శతవిధాలా ప్రయత్నించింది కాంగ్రెస్ కోటరీ. వ్యక్తిగత సమస్యలో, అనుకోని అవాంతారాలో కానీ ఆ యత్నాలేవీ ఫలించలేదు. ఆమె తన ప్రాబల్యాన్ని చూపించి ఉంటే ప్రస్తుత రాజకీయ సమీకరణాలు మరింత రసవత్తరంగా మారేవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అడపాదడపా ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలప్పుడు అక్కడకు వెళ్లి ప్రచార సభల్లో మొహం చూపించి పోవడం తప్ప ప్రజల్లో బలమైన ముద్ర వేయలేకపోయింది ప్రియాంక. కాంగ్రెస్ అంటేనే నెహ్రు వారసులుగా భావించే ప్రజానీకంలో అన్నా చెల్లెళ్ళ వెనకడుగు ఆ పార్టీని మరింత బలహీనంగా మార్చేస్తోంది. పార్టీ బాధ్యతలు ఖర్గే చేతుల్లో పెట్టినా.. ఈయన పాత్ర మరో మన్మోహన్ మాదిరిగానే ఉండొచ్చన్న అభిప్రాయం ప్రజల్లో గూడు కట్టుకుపోవడం పెద్ద మైనస్‌గా భావించొచ్చు. ఈ నేపథ్యంలో ప్రజలు యే ధీమాతో ఇండియా కూటమికి ఓటు వేస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న మిత్రులే కానీ.... తలో దారి.. ఎన్నికలు కూతవేటు దూరంలో ఉన్న ప్రస్తుత తరుణంలో విబేధాలను పరిష్కరించుకుని కలిసికట్టుగా సాగాల్సింది పోయి కాంగ్రెస్ మిత్ర గణం చెరో దారీ వెతుక్కుంటూంటే ఇదే అదనుగా ఎన్డీయే పక్షం బలం పెంచుకుంటూ పోతోంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇటీవలి బీహార్ పరిణామాల గురించే. కాంగ్రెస్ సాయంతో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న జనతాదళ్ (యూ) అధినేత నితీష్ కుమార్ తాజాగా ఇచ్చిన ఝలక్ బీహార్ రాజకీయాల్లో పెను సంచలనమే అయింది. ఈ విషయాన్ని ముందస్తు పసిగట్టడంలో కాంగ్రెస్ అధిష్ఠానం విఫలమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోపక్క పంజాబ్‌లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్‌లు రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించేశాయి. ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో మొన్నీ మధ్యే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తిష్ఠ వేసుకుని కూర్చుంది. హిమాచల్ ప్రదేశ్, అస్సాం, హర్యానా, గుజరాత్‌లలో పెత్తనం ఎటూ బీజేపీదే, కర్ణాటకలో తమ పార్టీయే అధికారంలో ఉన్నప్పటికీ, హామీల విషయంలో అక్కడి ప్రభుత్వ వైఖరి అయోమయంలో పడేస్తోంది. ఇక ఉత్తరప్రదేశ్‌లో ఎన్డీయే ముందు నోరు మెదిపి పరిస్థితి ఎటూ లేదు. కళ్లు తెరవకపోతే.. 2019 ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటిదాకా పార్టీ పునరుజ్జీవం దిశగా అడుగులు పడిన దాఖలాలు కనిపించడం లేదు. ఖర్గే పేరుతో తెచ్చిన దళిత కార్డు ప్రభావం నామమాత్రమేనని చెప్పొచ్చు. ఇక పార్టీకి ఏకైక ఆశాకిరణం రాహుల్ గాంధీయే. ఆయన నేతృత్వం తక్షణ అవసరం.. పరిస్థితి తీవ్రత గమనించి దిద్దుబాటు చర్యలు చేపట్టడం ద్వారా ఓటర్లలో ఓ కొత్త నమ్మకాన్ని, ప్రశ్నిచే గళం ఒకటి ఉండనే ధీమాను కలిగించాలి. సరైన రీతిలో పావులు కదిపి మోదీ సర్కారుకు సవాలు విసిరేలా పార్టీ రూపురేఖలు మార్చే ప్రయత్నం చేయగలగాలి. సహజంగా అధికార పార్టీలపై ఉండే అసంతృప్తి సెగల్ని సొమ్ము చేసుకుని తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోఎలాగైతే అధికారాన్ని అందిపుచ్చుకోగలిగారో.. అదే మాదిరి ప్రయత్నాలు అన్నిచోట్లా చేయాలి. 70 ఏళ్లు పైబడిన వృద్ధ నాయకులను గౌరవ పదవులకు పరిమితం చేస్తూ.. వాళ్ళ సలహాలు, సూచనలతో యువ రక్తాన్ని రంగంలోకి దింపి ఫలితాన్ని రాబట్టాలి. మొహమాటాలకు పోకుండా గెలుపు గుర్రాలను వెతికి పట్టుకుని ఎన్నికల పోరుకు సిద్ధమవ్వాలి. అప్పుడే సార్వత్రిక రణం హోరాహోరీగా సాగే అవకాశం ఉంటుంది. బహుశా ప్రస్తుతానికి సమయం మించిపోయిందనే చెప్పొచ్చు. రాబోయే రోజుల్లోనైనా ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకునే చర్యల ద్వారా ఆయా రాష్ట్రాల్లో బలం పుంజుకుంటూ ఒక్కో అడుగు ముందుకు వేస్తే 2029లోనైనా మళ్లీ కేంద్రంలో కొలువుదీరే అవకాశాన్ని దక్కించుకోవచ్చు. ప్రజలకు భరోసా కల్పించనంత వరకు ఎన్ని జోడో యాత్రలు చేపట్టినా అవన్నీ కంటితుడుపు చర్యలుగా మిగిలిపోతాయే తప్ప అధికారాన్ని మాత్రం అందించవు. ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే సరే... లేదంటే ముందే చెప్పినట్లు ఒక చిన్న గాలివాన చాలు.. కాంగ్రెస్ అనే మహావృక్షం కూకటివేళ్లతో సహా కూలిపోవడానికి. తెలంగాణను చూసి మురిసిపోతే.. రెండు నెలల కిందటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పటికీ అది సంబరపడేటంత మురిపెమేమీ కాదు. అదే సమయంలో జరిగిన రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఓడిపోయింది అన్న విషయాన్ని విస్మరించలేం. జోడో యాత్రలో, కాంగ్రెస్‌పై పెరిగిన మమకారమే తెలంగాణాలో ఆధికారాన్ని తెచ్చిపెట్టలేదు. స్థానిక పరిస్థితులు, కేసీఆర్ సర్కారుపై పెల్లుబికిన అసంతృప్తి అధికార మార్పు జరిగేలా చేశాయి. సాధారణంగా రెండు దఫాలు అధికారంలో కూర్చున్న ఏ పార్టీకైనా ప్రజల్లో కొంతమేర అసంతృప్తి ఉండటం సహజం. దీనికి నిదర్శనం ఉభయ పక్షాల మధ్య ఉన్న గెలుపు ఓటముల అంతరాలే. భారాసా స్వయంకృత చేష్టలు ఆ పార్టీని 39 సీట్లకే పరిమితం చేస్తే కాంగ్రెస్ పార్టీకి కేవలం 64 సీట్ల బొటాబొటీ మెజార్టీతో అధికార పీఠాన్ని అప్పగించాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి లాంటి వాళ్ళ ప్రయత్నాలు, 6 గ్యారంటీల పథకాలు తమవంతు సాయం అందించాయి. మరోపక్క కాంగ్రెస్ గ్యారంటీలు అమలులో ఎంత ఇబ్బందికరమో అనుభవైక వేద్యమవుతోంది. ఇలాంటి హామీలు, యాత్రలను నమ్ముకుని కేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకుందాం అనుకోవడం కల్లే అవుతుంది. అదే సమయంలో పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్‌లో అన్నపై చెల్లెలి అస్త్రాన్ని ప్రయోగించినా ప్రయోజనం శూన్యమే. ఇటీవల ఇండియాటుడే సమ్మిట్‌లో ఆంధ్ర ముఖ్యమంతి జగన్మోహన్రెడ్డి రాబోయే ఎన్నికల్లో పోటీ వైస్సార్సీపీ, టీడీపీ, జనసేనల మధ్యే ఉంటుందని, తన చెల్లెలి చేరిక తమ పార్టీపై ఏమాత్రం ప్రభావం చూపబోదని తేల్చిపడేశారు కూడా.. వాస్తవానికి ఆయన చెప్పింది అసెంబ్లీ ఎన్నికల గురించే అయినప్పటికీ పార్లమెంట్ ఎన్నికలకూ ఇది వర్తిస్తుందని చెప్పొచ్చు. -బెహరా శ్రీనివాస రావు సీనియర్ పాత్రికేయులు ఇదీ చదవండి: కొంప ముంచే డైరీలు..!