ఎందెందు వెదికిన అందందు కలదె మగువా.. అని నేటి రోజుల్లో మహిళలు ప్రవేశించని రంగమంటూ లేదు. అయినా ఏదో తెలియని వెలితి. లింగ వివక్ష, ఆదాయాల్లో వ్యత్యాసాలు ఇప్పటికీ దేశంలో చాలాచోట్ల మహిళల పురోగతికి అవరోధంగానే నిలుస్తున్నాయి. 2022 లెక్కల ప్రకారం.. దేశంలో సుమారు 4.5 కోట్ల మంది పేదరికంతోనే జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికీ దేశంలోని మారుమూల పల్లెల్లో అమ్మాయిల్ని మధ్యలోనే చదువు మాన్పించేయడం, చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేసేయడం వంటి అంశాలు ఈ పేదరికానికి కారణంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల పురోభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వాటిని విజయవంతంగా అమలుచేస్తున్నాయి. ఇలాంటివాటిలో బాలికల ఆర్థిక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక పథకమే ‘సుకన్య సమృద్ధి యోజన’. దేశంలో లక్షలాది బాలికలకు సాధికారత కల్పించే ఈ పథకం సరిగ్గా పదేళ్ల క్రితం బేటీ బచావో, బేటీ పఢావో ప్రచారంలో భాగంగా 2015 జనవరి 22న ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా గత నవంబర్ నాటికి 4.10 కోట్లకు పైగా సుకన్య సమృద్ధి ఖాతాలు ప్రారంభమయ్యాయి.
ఇది ఎలా పనిచేస్తుంది?
ఇదొక పొదుపు పథకం. ఇంట్లో అమ్మాయి పుట్టిన వెంటనే ఖాతా తెరవచ్చు.
అంతేకాదు ఆమెకు పదేళ్లు వచ్చేవరకు ఏ సమయంలోనైనా ఖాతాను ప్రారంభించవచ్చు.
కనీసం రూ.250తో ఈ పథకాన్ని అమ్మాయిల పేరిట తల్లిదండ్రులు/ సంరక్షకులు తెరవవచ్చు.
ఖాతా తెరిచినప్పటి నుంచి ప్లాన్ మెచ్చూర్ అయ్యేవరకు లేదా ఖాతా మూసివేసే వరకు ఈ పథకం ప్రయోజనాలు అమ్మాయికే చెందుతాయి.
ప్రతి అమ్మాయికీ ఒక ఖాతాను మాత్రమే అనుమతిస్తారు.తల్లిదండ్రులు తమ అమ్మాయిల కోసం గరిష్టంగా రెండు ఖాతాలను తెరవవచ్చు.
కొన్ని సందర్భాల్లో ప్రత్యేక మినహాయింపు పొందవచ్చు. అదెలాగంటే కవలలు
పుట్టినా, ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టినా సంబంధిత ఆధారాలను సమర్పించడం
ద్వారా ఈ ప్రయోజనాన్ని దక్కించుకోవచ్చు.అవసరమైతే ఈ ఖాతాను దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బదిలీ చేసుకోవచ్చు.
ఖాతా తెరవాలంటే
ఏదైనా పోస్టాఫీస్ లేదా వాణిజ్య బ్యాంకు శాఖలో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు.
ఖాతా తెరవడానికి పుట్టిన అమ్మాయి తాలూకు జనన ధ్రువీకరణ పత్రం, నివాస రుజువు సమర్పించాలి.
కనీస డిపాజిట్ రూ.250. ఆపై రూ.50 చొప్పున అంటే 300, 350, 400, 450, 500..ఇలా మన స్థోమతను బట్టి డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఈ డిపాజిట్ పరిమితి రూ.1,50,000 మించకూడదు.
ఖాతా తెరిచినప్పటి నుంచి 15 ఏళ్ల వరకు ఇలా డిపాజిట్ చేసుకుంటూ వెళ్లవచ్చు.
ఆడపిల్లకు 18 ఏళ్లు వచ్చేవరకు ఈ ఖాతా నిర్వహణ తల్లిదండ్రులు, సంరక్షకులు చేతుల్లోనే ఉంటుంది.
ఇది పిల్లల విద్య, భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించినందున ఎప్పుడుపడితే అప్పుడు ఈ పథకం నుంచి సొమ్ములు విత్ డ్రా చేయడానికి వీలుండదు.
ఇక 18 ఏళ్లు నిండిన అమ్మాయి, ఆ విషయాన్ని ధ్రువీకరిస్తూ సంబంధిత పత్రాలను సమర్పించడం ద్వారా ఖాతాను తన అజమాయిషీలోకి తీసుకోవచ్చు.
నెలవారీ ప్రాతిపదికన వడ్డీ లెక్కిస్తారు. దీన్ని ఆర్థిక సంవత్సరం చివర్లో ఖాతాకు జమ చేస్తారు.
ఖాతాదారుకు 21 ఏళ్లు పూర్తి అయ్యాక ఈ పథకం మెచ్యూర్ అవుతుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దీన్ని ముందుగానే మూసివేసే సౌలభ్యం ఉంది. అంటే అమ్మాయికి 18 ఏళ్లు నిండి, 21 ఏళ్ల లోపే పెళ్లి చేయాలనుకుంటే పథకం మెచ్యూర్ కాకముందే క్లోజ్ చేయవచ్చు. దీనికి తగిన ఆధారాలను సమర్పించాలి.
ఒకవేళ పైచదువులకు డబ్బు కావాలి అనుకున్నప్పుడు కూడా కొంత సొమ్ము విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఖాతాదారు పదో తరగతి పూర్తి చేసి లేదా 18 ఏళ్లు నిండినా (వీటిలో ఏది ముందయితే అది) అంత క్రితం ఆర్థిక సంవత్సరం చివరి వరకు జమ అయినా మొత్తంలో సగం వెనక్కి తీసుకోవచ్చు. దీనికి కూడా తగిన ఆధారాలను సమర్పించాలి.
ఈ విత్‌డ్రాలను ఒకేసారి గానీ, ఏడాదికోసారి చొప్పున అయిదేళ్లపాటు గానీ చేసుకోవచ్చు.
ఒకవేళ ఖాతాదారు అకాల మరణం చెందితే డెత్ సర్టిఫికెట్‌తో దరఖాస్తు సమర్పించి ఖాతా మూసివేయవచ్చు. అప్పటివరకు ఉన్న బ్యాలెన్స్, వడ్డీలను తల్లిదండ్రులు/ సంరక్షకులకు చెల్లిస్తారు.
ఒకవేళ దురదృష్టవశాత్తు తల్లిదండ్రులు లేదా సంరక్షుకులు చనిపోయి, ఖాతా నిర్వహించలేని సందర్భాల్లోనూ ముందుగానే ఖాతాను మూసివేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఖాతా తెరిచిన తొలి ఐదేళ్లలో మాత్రం ఇలా మూసివేయడానికి కుదరదు.
ఈ పథకం కింద డిపాజిట్ చేసే మొత్తాలపై వచ్చే వడ్డీకి, మెచ్యూర్ అయ్యాక వచ్చే మొత్తాలకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ పథకానికి ప్రభుత్వం నిర్ధారించిన వడ్డీ 8.2 శాతం.
ఇదీ చదవండి: భారత్ క్రెడిట్ రేటింగ్‌కు సవాళ్లు
కేవలం బాలికల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వాళ్లకు విద్యా విషయంలోనూ, ఆర్థిక స్వతంత్రతలోనూ స్వావలంబన చేకూర్చాలన్న ఉద్దేశంతో ప్రారంభమైందే సుకన్య సమృద్ధి యోజన పథకం. ముఖ్యంగా చిన్న స్థాయి ఆదాయవర్గాల వారికి తమ పిల్లలపై చదువులకు అప్పటికప్పుడు పెద్ద మొత్తాలు అప్పులు చేయాల్సిన అవసరం నుంచి తప్పించుకోవచ్చు. అలాగే తమ అమ్మాయిల పెళ్లిళ్లకు అయ్యే ఖర్చు విషయంలోనూ ఈ సొమ్ములు చాలావరకు ఆదుకోగలుగుతాయి. తల్లిదండ్రులు దీన్నొక మంచి పథకం కింద భావించి ముందడుగు వేయొచ్చు.
- బెహరా శ్రీనివాస రావు, ఆర్థిక నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment