girl children
-
ఆడపిల్లలు పుట్టారని వేధింపులు
– పోలీసు దర్బార్‌ను ఆశ్రయించిన మహిళ కర్నూలు: ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని తన భర్త వేధిస్తున్నారని, అంతేకాకుండా వారిని వదిలించుకునేందుకు గొంతు నులిమి హత్య చేసే యత్నం కూడా చేస్తున్నారని దేవనకొండ మండలం నల్లచెలిమల గ్రామానికి చెందిన సుంకులమ్మ... ఎస్పీ ఆకె రవికృష్ణకు ఫిర్యాదు చేశారు. సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో పోలీసు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. ఉదయం 9గంటల నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా 94407 95567 సెల్ నెంబరుకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదులను నోట్ చేసుకున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు నేరుగా వచ్చి కలిసిన ప్రజల నుంచి సమస్యలపై వినతులను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నల్లచెలిమల గ్రామానికి చెందిన సుంకులమ్మ తన కష్టాన్ని ఎస్పీకి విన్నవించారు. తన భర్త ప్రతి రోజూ పిల్లలను చిత్రహింసలకు గురి చేస్తూ అడ్డుకోబోయిన తనను కూడా దుర్భాషలాడుతూ భౌతిక దాడులు చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. వేధింపులు భరించలేక కొద్దిరోజులుగా తాను పుట్టినింటిలో ఉంటున్నానని, ఇదే అవకాశంగా తీసుకొని రెండు నెలల క్రితం తన భర్త మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడని తెలిపారు. పిల్లలకు బతుకుతెరువు చూపించి న్యాయం చేయాలని ఎస్పీని వేడుకున్నారు. సంతకాన్ని ఫోర్జరీ చేసి రెండో కుమారుడు తన వ్యవసాయ భూమిని తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆక్రమించుకున్నాడని కృష్ణగిరి మండలం కర్లకుంట గ్రామానికి చెందిన లక్ష్మమ్మ ఫిర్యాదు చేసింది. తన భూమిని తనకు వెనక్కు ఇప్పించాలని వేడుకొంది. భర్త తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, ఆయనకు కౌన్సెలింగ్ ఇచ్చి కాపురం చక్కబెట్టాలని రుద్రవరం గ్రామానికి చెందిన ఓ మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు, ఆడపడచులు కలిసి పెళ్లైనప్పటి నుంచి వేధిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని రుద్రవరం మండలం ఆలమూరు గ్రామానికి చెందిన నీలి వెంకట పుష్పలత ఫిర్యాదు చేశారు. వేధింపులు భరించలేక కొంతకాలంగా పుట్టింటిలో ఉంటున్నానని, అయితే భర్త అతని స్నేహితులతో కలిసి తనను, తల్లిదండ్రులను చంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
అమ్మాయిలకు శుభవార్త!
న్యూఢిల్లీ: అమ్మాయిలకు శుభవార్త. వారి చదువులు మరింత నిర్విరామంగా సాగే రోజులు రానున్నాయి. ఆర్థిక భారంతో మధ్యలోనే చదువును ఆపేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే తక్కువ రేట్లకే విద్యకోసం అమ్మాయిలకు రుణాలు అందనున్నాయి. ఈ మేరకు కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖా మంత్రి మేనకాగాంధీ కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. అలాగే, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్టీకి కూడా ఓ లేఖ పంపించారు. భేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమం కిందట వారికి ఈ రుణాలు అందేలా చూడాలని ఆమె కోరారు. 'తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యకోసం పంపిస్తున్నప్పుడు అమ్మాయిలకన్నా అబ్బాయిలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉన్నత విద్యకోసం ఖర్చులకు వెనుకాడి అమ్మాయిలను పంపించడం లేదు. రుణాల వడ్డీ రేట్లు కూడా అధికంగా ఉండటంతో అమ్మాయిల చదువుకోసం రుణాలు తీసుకునే ప్రయత్నం వారి తల్లిదండ్రులు చేయడం లేదు' అని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన అంగీకరిస్తే అమ్మాయిల చదువులకు ఏ ఢోకా లేదు. -
ఆడబిడ్డలపై చిన్నచూపు
* హైదరాబాద్‌లో అధికంగా లింగవివక్ష * ఆందోళన వ్యక్తంచేస్తున్న కేంద్ర, రాష్ట్రాలు * బాలికల రక్షణ, విద్యాభివృద్ధికి కేంద్రం ప్రత్యేక కార్యక్రమం * మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అవగాహన కు ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: ప్రపంచానికే ఐటీ గమ్యంగా మారిన రాష్ట్ర రాజధానిలో లింగవివక్ష కూడా అధికంగానే ఉందంటే.. ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెంది నప్పటికీ ఇక్కడ బాలికలు, మహిళల పట్ల వివక్ష పెరుగుతూనే ఉందని పలు సంస్థలు చేసిన సర్వేలు, ప్రభుత్వ అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రభుత్వం 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం కూడా.. ఆరేళ్లలోపు చిన్నారుల్లో ప్రతి వెయ్యిమంది మగ పిల్లలకు కేవలం 914 మందే ఆడపిల్లలున్నట్లు తేలింది. 2001లో ఆరేళ్లలోపు మగ, ఆడ పిల్లల నిష్పత్తి 1000: 943 ఉండగా, పదేళ్ల అనంతరం ఆడపిల్లల సంఖ్య మరింతగా దిగజారడం ఆందోళనకర పరిణామంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. తల్లి గర్భం లోని ఆడశిశువు బయటకు రాకుండానే అంతమౌతోం దన్న నిజం.. అధికారుల పరిశీలనలో తేటతెల్లమైంది. ముఖ్యంగా.. రాజధాని శివారు జిల్లాలైన నల్లగొండ, మహబూబ్‌నగర్‌ల నుంచి ఎక్కువమంది నగరానికి వలస వస్తుం డడం, తమకు పుట్టబోయేది ఆడపిల్ల అని స్కానింగ్ పరీక్షల ద్వారా తెలుసుకొని గర్భంలోనే చిదిమేస్తుండడం ఈ పరిస్థితికి కారణమని అధికారవర్గాలే అంగీకరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా.. ఇటువంటి పరిస్థితులున్న 100 జిల్లాలను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం లింగవివక్షను రూపుమాపేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఆడ పిల్లల భద్రత, విద్యాభివృద్ధి కోసం ‘బేటీ బచావో.. బేటీ పడావో’పేరిట ఈ కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేటీ బచావో.. బేటీ పడావో.. కార్యక్రమం అమలు బాధ్యతలను రాష్ట్రంలో మహిళా శిశు సం క్షేమ శాఖ చేపట్టింది. జాతీయ సగటు(1000: 918)కన్నా ఆడపిల్లల సంఖ్య తక్కువగా నమోదైన హైదరాబాద్ జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయంచేసి ఈ కార్యక్రమా లు నిర్వహించేందుకు ఉన్నతాధికారులు ప్రణాళికలు సి ద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ కార్యక్రమం అమలుకు జాయింట్ డెరైక్టర్ స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించింది. బహిర్గతం చేస్తే.. హత్య చేసినట్లే.. ప్రభుత్వపరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా స్కానింగ్ సెంటర్లు, డయాగ్నొస్టిక్ ల్యేబొరేటరీల యాజమాన్యాలు తమ వ్యాపార దృక్పథాన్ని వీడడం లేదు. పుట్టబోయేది ఆడబిడ్డో, మగబిడ్డో ముందుగానే చెప్పడం నేరమని తెలిసినా, డబ్బుకు కక్కుర్తిపడి స్కానింగ్ సమాచారాన్ని బహిర్గతం చేస్తున్నారు. సమాచారం బహిర్గతం చేసినవాళ్లు.. ఆడపిల్లలను హత్య చేసినట్లే. ప్రభుత్వం పరంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలి. - శ్యామ్ సుందరి, బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమ నోడల్ అధికారి -
ఆడపిల్ల.. గుండెల మీద కుంపటి కాదు!
‘‘నేను చాలా అదృష్టవంతురాల్ని’’ అంటున్నారు ప్రియాంక చోప్రా. తన తల్లిదండ్రుల గురించి చెబుతూ ఆమె ఈ మాట అన్నారు. ‘నువ్వు ఆడపిల్లవి. వంచిన తల ఎత్తకు’ అంటూ నియమ నిబంధనలు పెట్టకుండా మా అమ్మానాన్న తగినంత స్వేచ్ఛ ఇచ్చారని చెప్పారు ప్రియాంక. మహిళలకు సంబంధించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారామె. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ -‘‘మా కుటుంబంలో ఆడపిల్లలను ఒకలా, మగపిల్లలను ఒకలా పెంచరు. తేడా శరీరంలోనే కానీ.. మనసులో కాదని, అందుకని లింగ భేదాల గురించి ఆలోచించడం అనవసరం అని అంటారు. ఆ మాటలు నా మనసులో బలంగా నాటుకుపోయాయి. అందుకే ఎవరైనా ఆడపిల్లలను తక్కువ చేసి మాట్లాడితే భరించలేను. నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే.. దాదాపు ఇరవై, పాతికేళ్లు ఆడపిల్లలను గుండెల్లో పెట్టుకుని చూసుకునే తల్లిదండ్రులు ఆమె వైవాహిక జీవితంలో ఏవైనా సమస్యలొస్తే ‘మెట్టినింట్లో సర్దుకుపోవాలి.. పుట్టింటికి రాకూడదు’ అంటారు. ఇక కొంతమందైతే ఆడపిల్ల పుట్టిందని తెలియగానే, తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారో లేదో అడగకుండా, ప్రపంచం తలకిందులైపోయినట్లుగా ఫీలవుతారు. పెళ్లి చేసి పంపేవరకూ ఆడపిల్లను గుండెల మీద కుంపటిలా భావిస్తారు. తమకు జన్మనిచ్చినది ఆడదే అని ఒక్క క్షణం ఆలోచించినా ఆడపిల్లలు వద్దనుకునే మగవాళ్లకు కనువిప్పు కలుగుతుంది’’ అన్నారు ఆవేశంగా. ఆడవాళ్లు ధైర్యంగా ఉండాలని, ఎవరైనా వేధించాలని చూస్తే, భయపడి ఊరుకోకూడదని ప్రియాంక సూచించారు. స్త్రీలపై అత్యాచారాలు చేసేవాళ్లని కఠినంగా శిక్షించాలని, అప్పుడే ఘోరాల సంఖ్య తగ్గుతుందని కూడా అన్నారు.