అమ్మాయిలకు శుభవార్త!
న్యూఢిల్లీ: అమ్మాయిలకు శుభవార్త. వారి చదువులు మరింత నిర్విరామంగా సాగే రోజులు రానున్నాయి. ఆర్థిక భారంతో మధ్యలోనే చదువును ఆపేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే తక్కువ రేట్లకే విద్యకోసం అమ్మాయిలకు రుణాలు అందనున్నాయి. ఈ మేరకు కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖా మంత్రి మేనకాగాంధీ కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. అలాగే, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్టీకి కూడా ఓ లేఖ పంపించారు.
భేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమం కిందట వారికి ఈ రుణాలు అందేలా చూడాలని ఆమె కోరారు. 'తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యకోసం పంపిస్తున్నప్పుడు అమ్మాయిలకన్నా అబ్బాయిలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉన్నత విద్యకోసం ఖర్చులకు వెనుకాడి అమ్మాయిలను పంపించడం లేదు. రుణాల వడ్డీ రేట్లు కూడా అధికంగా ఉండటంతో అమ్మాయిల చదువుకోసం రుణాలు తీసుకునే ప్రయత్నం వారి తల్లిదండ్రులు చేయడం లేదు' అని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన అంగీకరిస్తే అమ్మాయిల చదువులకు ఏ ఢోకా లేదు.