
వచ్చే నెలలో బదిలీల ప్రక్రియ
జిల్లాల్లో సీనియారిటీ జాబితాల విడుదల
అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది జాబితా వెల్లడి
22న పాత స్థానాలకు డిప్యుటేషన్ టీచర్లు, సర్దుబాటు టీచర్లు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది. మే నెల మొదటి వారంలో ఈ ప్రక్రియ చేపట్టేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల రెగ్యులేషన్ చట్టం–2025 నేపథ్యంలో తొలుత జీవో 117ను రద్దుచేసి అనంతరం బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా సీనియారిటీ జాబితాలను విద్యాశాఖ మూడుసార్లు ప్రకటించి, సవరించే అవకాశం కల్పించింది. తాజాగా మూడోసారి ఇచ్చిన అవకాశంలో టీచర్లు మరోసారి తప్పులను సరిచూసుకునే అవకాశాన్ని ఈనెల10 వరకు ఇచ్చింది.
దీనిపై అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం ఈ నెల 20న తుది సీనియారిటీ జాబితాను వెల్లడించనుంది. దీని ప్రకారం మే నెల మొదటి వారంలో షెడ్యూల్ ప్రకటించి, ఆన్‌లైన్ విధానంలో బదిలీలు చేపట్టనున్నారు. ఒకే పాఠశాలలో రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉపాధ్యాయులు ఖాళీల ఆధారంగా ఐచ్ఛికాలను (ఆప్షనల్స్) నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే, తప్పనిసరిగా బదిలీ అయ్యే టీచర్లు తమ పాఠశాలను ఎంపిక చేసుకునే వీలు లేదు. తొలుత ప్రధానోపాధ్యాయుల బదిలీలు పూర్తి చేస్తారు. అనంతరం స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించి బదిలీ చేస్తారు. తర్వాత ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించి బదిలీలు చేపడతారు. ఈ మొత్తం ప్రక్రియను మే 30 నాటికి పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తోంది.
పని సర్దుబాటు ఆదేశాలు రద్దు
2024–25 విద్యా సంవత్సరం ఈ నెల 23న ముగుస్తుంది. బదిలీల నేపథ్యంలో గతంలో పని సర్దుబాటు, డిప్యుటేషన్లపై స్థానికంగా స్థాన చలనం పొందిన ఉపాధ్యాయులకు ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేయాలని డీఈవోలను విద్యాశాఖ కమిషనరేట్ ఆదేశించింది. ఆయా ఉపాధ్యాయులను ఈ నెల 22న రిలీవ్ చేయాలని, వారు విద్యా సంవత్సరం ముగింపు రోజు (ఏప్రిల్ 23) తప్పనిసరిగా తిరిగి పాత స్థానాల్లో చేరాలని ఆదేశించింది.
రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు, వార్డుల్లో ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ చొప్పున దాదాపు 13 వేలకు పైగా స్కూళ్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా 7,500 మోడల్ స్కూళ్లను మాత్రమే ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. 40 మంది విద్యార్థులున్న స్కూళ్లలో 1–5 తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయులను కేటాయించనున్నారు. మిగిలిన స్కూళ్లకు ఉపాధ్యాయులను ఎలా కేటాయిస్తారన్న దానిపై స్పష్టత లేదు.