Seniority list
-
రివర్షన్లు.. ప్రమోషన్లు.. విద్యుత్ సంస్థల్లో పదోన్నతుల్లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థల్లో సీనియారిటీ జాబితాలు, పదోన్నతుల్లో మార్పులు జరగనున్నాయి. విద్యుత్ సంస్థలు గతంలో ఏపీకి రిలీవ్ చేసిన ఉద్యోగుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపడుతున్నాయి. రాష్ట్ర విభజనకు ఒకరోజు ముందు అంటే 2014 జూన్ 1 నాటికి ఉన్న సీనియారిటీ జాబితాల ఆధారంగా పదోన్నతులను సవరించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల్లో.. తెలంగాణ ఉద్యోగులు, గతంలో రిలీవ్ చేసి తిరిగి చేర్చుకున్న ఏపీ ఉద్యోగులను కలిపి కొత్త సీనియారిటీ జాబితాను సిద్ధం చేశారు. ఈ అంశంపై తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు బుధవారం విద్యుత్ సౌధలో సమీక్షించారు. అయితే ఏపీకి రిలీవ్ చేసి తిరిగి చేర్చుకున్న ఉద్యోగుల్లో చాలా మంది సీని యర్లు ఉన్నారని.. వారు కొత్త జాబితాల్లో పైన ఉంటారని తెలంగాణ విద్యుత్ ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. దీనివల్ల ఇప్పటికే ప్రమోషన్ పొందిన తెలంగాణ ఉద్యోగులు తిరిగి పాత హోదాలకు రివర్షనయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పదోన్నతులు కోల్పోయే వారిలో తెలంగాణ ఇంజనీర్లు, అకౌంట్స్, పీఅండ్‌జీ తదితర విభాగాలకు చెందినవారు 150 మందికిపైగా ఉంటారని పేర్కొంటున్నా యి. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఇప్పటికే పొందిన పదోన్నతులకు రక్షణ కల్పించేందుకు సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించాలని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం విద్యుత్ మంతిజి.జగదీశ్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అయితే సూపర్ న్యూమరరీ పోస్టుల సృష్టికి విద్యుత్ సంస్థలు సుముఖంగా లేనట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇదీ చదవండి: జోహార్ నటశేఖరా! హీరో కృష్ణకు అభిమానుల కన్నీటి వీడ్కోలు -
‘మల్టీజోనల్’లోనూ మడత పేచీ
సాక్షి, హైదరాబాద్: జోనల్ విధానంలో భాగంగా ప్రభుత్వం బుధవారం మల్టీ జోనల్ పరిధిలో ఉన్న ప్రధానోపాధ్యాయుల సీనియారిటీ జాబితాను ప్రకటించింది. దీనిప్రకారం మల్టీజోన్–1 నుంచి జోన్– 2కు 40 మందిని, జోన్–2 నుంచి జోన్–1కి 58 మందిని కేటాయించింది. అయితే జిల్లా కేడర్ కేటాయింపు మాదిరిగానే మల్టీ జోనల్ కేటాయింపు ప్రక్రియ కూడా అత్యంత వివాదాస్పదమైంది. హెచ్ఎంలను రాష్ట్ర స్థాయిలో ఏ స్కూలుకు పంపాలనేది విభజన సందర్భంగానే తేల్చాల్సి ఉంటుంది. కానీ హెచ్ఎంలను కేవలం జోన్లకు మాత్రమే కేటాయించారు. కానీ ఏ జిల్లాలో ఏ స్కూలుకు పంపుతారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఏ జిల్లాకు ఎంతమంది హెచ్ఎంలనేది మాత్రం చెప్పా రు. కానీ ఆయా జిల్లాల్లో ఎక్కడ పోస్టులు ఉన్నా యో వెల్లడించలేదు. పైగా జిల్లా అప్షన్లు ఇవ్వమని అడిగారు. దీంతో పోస్టులెక్కడున్నాయో తెలియకుండా ఆప్షన్లు ఎలా పెట్టుకుంటామని హెచ్ఎంలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమది మల్టీ జోనల్ కేడర్ పోస్టు అయినప్పుడు జిల్లా అధికారులకు తమ పోస్టింగ్ వ్యవహారం ఇవ్వడమేంటని ఈ విషయమై ఉన్నతాధికారులను సంప్రదించే ప్రయత్నాలు చేశామని, కానీ ఎవరి నుంచీ సరైన సమాధానం రాలేదని టీచర్ల యూనియన్లు చెప్పాయి. ఖాళీలను ప్రకటించాలి: టీఎస్ యూటీఎఫ్ నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలకు ఆప్షన్ ఇవ్వమనటాన్ని టీఎస్ యూటీఎఫ్ ఖండించింది. హైస్కూల్ హెచ్ఎం పోస్ట్‌ను మల్టీ జోనల్ పోస్ట్‌గా మార్చిన తర్వాత ఆ మల్టీజోన్‌లోని ఏ పాఠశాలనైనా నేరుగా ఎంచుకునే అవకాశం హెచ్ఎంలకు ఉంటుందని, కానీ జిల్లాను ఎంచుకుంటే ఆ జిల్లాలో పోస్టింగ్ ఇస్తామని అధికారులు చెప్పడం నిబంధనలను ఉల్లంఘించటమేనని సంఘం అధ్యక్షుడు జంగయ్య, కార్యదర్శి చావా రవి చెప్పారు. హెచ్ఎంల సంఖ్యకు సరిపడా ఖాళీలను చూపించిన తర్వాత మాత్రమే ఆప్షన్లు తీసుకోవాలని కోరారు. జిల్లా ఆప్షన్లు ఇవ్వమంటే ఎలా?: పీఆర్బీ ప్రకాశ్ ‘హెచ్ఎంలు మల్టీ జోనల్ కేడర్. అయినాప్రభుత్వం జిల్లా కేడర్‌కు కేటాయించడం దారుణం. పోస్టులు ఎక్కడున్నాయో ప్రకటిస్తే మేం నచ్చిన ఆప్షన్ ఇవ్వొచ్చు. కేవలం జిల్లాల ఆప్షన్లే ఇవ్వమంటే ఎలా?’ అని హెచ్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీఆర్బీ ప్రకాశ్ ప్రశ్నించారు. -
‘ఆప్షన్ల’లో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: సీనియారిటీ జాబితా ప్రకటించకుండా ప్రభుత్వం ఆప్షన్లు కోరడంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఆప్షన్లు ఇచ్చి ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు ఈ ప్రక్రియను లోపభూయిష్టంగా నిర్వహిస్తున్నారని విమర్శిస్తున్నారు. జోనల్ విధానంలో భాగంగా టీచర్ల నుంచి విద్యాశాఖ ఆప్షన్లు కోరింది. దీనికి ఒకరోజు సమయం ఇచ్చింది. ఎన్నికలు జరిగే కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలు మినహా అన్ని జిల్లాల టీచర్లు శుక్రవారం ఆప్షన్లు ఇచ్చారు. అయితే ఆప్షన్ల తీరుపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎవరు సీనియర్? ఏ లెక్కన తాము ఏ ప్రాంతాన్ని స్థానిక జిల్లాగా పేర్కొనాలి? అనేది అర్థంకాని పరిస్థితి ఉందని పలువురు టీచర్లు చెబుతున్నారు. విభజన నిబంధనల ప్రకారం అనారోగ్యం, భార్యభర్తలు ఉద్యోగులయినప్పుడు, వికలాంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఈ వివరాలేవీ ఆప్షన్లలో పేర్కొనలేదని వారు చెబుతున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేయాలనుకుంటున్నట్లు వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు తెలిపారు. మరే ఇతర శాఖలో లేనివిధంగా విద్యాశాఖలో ఎక్కువ మంది ఉపాధ్యాయులున్నారని, అన్ని విషయాలను పరిశీలించి విభజన ప్రక్రియ పూర్తి చేస్తే బాగుంటుందని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు సదానందగౌడ్ అభిప్రాయపడ్డారు. కాగా, తాను ఎవరికీ సమాధానం ఇవ్వనని, ప్రభుత్వ ఆదేశాల మేరకే వ్యవహరిస్తున్నానని పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన ఉపాధ్యాయ సంఘాలతో చెప్పినట్లు తెలిసింది. -
గృహ నిర్మాణ సంస్థలో పదోన్నతులకు రంగం సిద్ధం
సాక్షి, అమరావతి: గృహ నిర్మాణ సంస్థలో పలువురికి పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జిల్లాల వారీగా సీనియారిటీ జాబితా ఇప్పటికే రాష్ట్రస్థాయి అధికారులకు చేరింది. జాబితా సిద్ధం చేసినప్పటికీ గతంలో ఏదేని ఆరోపణలతో సస్పెండ్ అయ్యారా, ఏమైనా మెమోలు అందుకున్నారా, విధి నిర్వహణలో ప్రవర్తన వంటి అంశాలపై జిల్లాల వారీగా పూర్తి వివరాలను సేకరించారు. 13 జిల్లాల్లో 212 మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు సంబంధించిన సీనియార్టీ జాబితా తయారు చేసి అర్హులైన వారికి పదోన్నతులు కల్పించనున్నారు. ఈ విషయమై వారంలోగా ఉన్నతాధికారులు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వివిధ ఆరోపణల కారణంగా ఉద్యోగాల నుంచి తొలగించిన ముగ్గురు అసిస్టెంట్ ఇంజనీర్లను తిరిగి చేర్చుకున్నారు. వీరికి సంబంధించిన వివరాలను కూడా జాబితాలో ప్రత్యేకంగా పొందుపరచారు. గృహ నిర్మాణ సంస్థలో ఖాళీ పోస్టులను గుర్తించి ఏఈలను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగాను, అసిస్టెంట్ మేనేజర్లకు మేనేజర్లుగా పదోన్నతులు లభించనున్నాయి. గత ప్రభుత్వం కొంతమందిని ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించుకుని సంస్థ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించకుండా కాలయాపన చేస్తూ వచ్చింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక సీనియార్టీ జాబితాను పంపాలని జిల్లా ప్రాజెక్టు మేనేజర్లకు ఆదేశాలు వెళ్ళాయి. ఆ మేరకు జిల్లాల వారీగా పూర్తి వివరాలు అందడంతో త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
పోలీస్ పదోన్నతులకు బ్రేక్
► సీనియారిటీ జాబితాను తిప్పిపంపిన సీఎంవో ► అన్ని రేంజ్‌ల ఇన్స్పెక్టర్లు సంతకాలు పెడితేనే పదోన్నతులు సాక్షి, హైదరాబాద్: నేడో రేపో అని ఆశల పల్లకీలో ఊరేగిన పోలీస్ ఇన్స్పెక్టర్లకు షాక్ తగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్స్పెక్టర్ల సీనియారిటీకి సంబంధించిన జీవో నంబర్ 54ను ఇటీవల పోలీస్ శాఖ పునఃసమీక్షించి హోంశాఖకు పంపించింది. ఆ జాబితా ప్రకారం అడ్‌హక్ పదోన్నతులు ఇచ్చేందుకు అనుమతివ్వాలని హోంశాఖ ముఖ్యమంత్రి కార్యాలయాని(సీఎంవో)కి పంపింది. ఈ వ్యవహారంపై నాలుగు రోజుల క్రితం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభు త్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది సమావేశమయ్యారు. పోలీస్ శాఖ సవరించిన సీనియారిటీ జాబితాపై సీఎం కార్యాలయం అభ్యంతరం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ జాబితా ప్రకారం పదోన్నతులకు వెళితే ఏదో ఒక రేంజ్ ఇన్స్పెక్టర్లు పదోన్నతులపై కోర్టుకెళ్లి సమస్యను మరింత జఠిలంచేసే అవకాశం ఉన్నట్టు సీఎంవో కార్యాలయం అభిప్రాయ పడింది. ఈ నేపథ్యంలో డీఎస్పీ పదోన్నతి పొందాల్సిన ఇన్‌స్పెక్టర్లందరూ సవరించిన జాబితాను ఒప్పుకుంటూ సంతకాలు చేస్తేనే పదోన్నతులు కల్పించాలని సీఎం కార్యాలయం స్పష్టం చేసినట్టు హోంశాఖ ఉన్నతాధికారులు ‘సాక్షి’కి స్పష్టం చేశారు. ఇన్నాళ్లు హోంమంత్రి, డీజీపీ కార్యాలయం మధ్య చక్కర్లు కొట్టిన పదోన్నతుల వ్యవహారం ఫైలు ఇక మూలన పడ్డట్టే అని సీనియర్ అధికారి ఒకరు అభిప్రాయ పడ్డారు. సీనియారిటీ జాబితా సవరించ వద్దని ఒక రేంజ్ ఇన్స్పెక్టర్లు, సవరించాలని మరో రేంజ్ అధికారులు ఒత్తిడి తెచ్చారని, ఇలాంటి సందర్భంలో అన్ని రేంజ్‌ల ఇన్స్పెక్టర్లతో జాబితా సమ్మతమే అన్నట్టు సంతకాలు పెట్టించడం కష్టసాధ్యమని హోంశాఖ ఉన్నతాధికారులు అభిప్రాయ పడుతున్నారు. అయితే తమకు నోషనల్ సీనియారిటీ వచ్చి ఏళ్లు గడుస్తున్నా పోలీస్ శాఖ ప్రమోషన్లు కల్పించకపోవడంపై కొందరు కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. అడ్‌హక్ పదోన్నతులు కల్పించకుండా మోకాలడ్డటం, ఆ తర్వాత సవరించిన సీనియారిటీ జాబితా ప్రకారం పదోన్నతులు ఇద్దామన్నా ఇన్స్పెక్టర్లు ఒప్పుకోకపోవడంతో పోలీస్ శాఖ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తీరా ఇప్పుడు సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో సీనియర్ ఐపీఎస్ అధికారులు మరింత ఒత్తిడిలో మునిగిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ డీజీపీ కార్యాల యం, హోంశాఖ మధ్య అంతర్యుద్ధాన్ని రగిల్చింది. దీనికంతటికీ కారణం ఇద్దరు అధికారులని, వారు చేసిన ఓవర్ యాక్షన్ వల్లే సమస్య మరింత జఠిలమైందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పదోన్నతుల సమస్య ఇప్పట్లో తేలే అవకాశం కనిపించడంలేదు. -
డీఎస్పీల వివాదం ధర్మాసనానికి నివేదన
సింగిల్ జడ్జి ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: డీఎస్పీ పదోన్నతుల సీనియారిటీ జాబితా వివాదానికి సంబంధించిన కేసును సింగిల్ జడ్జి గురువారం ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నివేదించారు. ఇదే అంశానికి సంబంధించిన వ్యాజ్యాలు ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉండటంతో ఈ వ్యాజ్యాన్నీ ధర్మాసనానికే నివేదిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు. నేరుగా డీఎస్పీలుగా నియమితులైన వారివి, పదోన్నతుల ద్వారా డీఎస్పీలైన వారి సీనియారిటీ జాబితాను 2015 నాటి మెమో ప్రకారం వెంటనే రూపొందించేలా ఉభయ రాష్ట్రాల డీజీపీలను ఆదేశించాలని కోరుతూ మెదక్ జిల్లాకు చెందిన చిలుకూరి చెన్నయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని గురువారం జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారించారు. సర్వీసు నిబంధనల ప్రకారం సీనియారిటీ జాబితాను రూపొందించడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ సమయంలో ఇదే అంశానికి చెందిన వ్యాజ్యాలు ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉన్నాయని న్యాయమూర్తి దృష్టికి వచ్చింది. దీంతో ఆయన ఈ వ్యాజ్యాన్ని అక్కడికే నివేదిస్తున్నట్లు పేర్కొన్నారు. కేసు వివరాల రికార్డులను సంబంధిత ధర్మాసనం ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. -
‘ఉమ్మడి’ ముడి వీడదా?
ఏళ్లుగా పరిష్కారం కాని టీచర్ల ఉమ్మడి రూల్సు సమస్య నిలిచిన పదోన్నతులు, పోస్టుల భర్తీ 55 డివిజన్లకు ఇన్చార్జి డీవైఈవోలే.. 555 మండలాల విద్యాధికారులు ఇన్‌చార్జీలే.. చొరవ చూపని ప్రభుత్వం సాక్షి, విజయవాడ బ్యూరో: ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు నిబంధనల వ్యవహారం అనేక సంవత్సరాలుగా పాఠశాల విద్యాశాఖను కుంగదీస్తోంది. దీనికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉండడంతో ఈ విషయం గురించి ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఫలితంగా పదోన్నతులు నిలిచిపోయి కీలకమైన డీవైఈవో, ఎంఈవో పోస్టులు భారీ సంఖ్యలో ఖాళీగా ఉంటున్నాయి. గతంలో ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్ల సర్వీసు నిబంధనలు వేర్వేరుగా ఉండేవి. 1998లో రెండు యాజమాన్యాల్లో పనిచేస్తున్న టీచర్లకు ఒకే సీనియారిటీ జాబితా తయారుచేసి ఉమ్మడి సర్వీసు నిబంధనలు అమల్లోకి తెచ్చారు. ఈ నిబంధనల ప్రకారమే ఇద్దరికీ కలిపి పదోన్నతులు ఇచ్చారు. 2005లో దీన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో పంచాయతీరాజ్ టీచర్లు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు పదోన్నతులపై స్టే ఇచ్చింది. కేసు అక్కడే పెండింగ్‌లో ఉంది. ఈ సమస్య పరిష్కారమైతేగానీ పదోన్నతులు ఇచ్చే అవకాశం ఉండదు. మధ్యలో 2009లో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు అనుమతితో తాత్కాలిక పద్ధతిలో టీచర్లకు మాత్రం పదోన్నతులు ఇచ్చింది. ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు లేకపోవడంతో డీవైఈవో, ఎంఈవో పోస్టులు పెద్దసంఖ్యలో ఖాళీగా ఉంటున్నాయి. ఆ తర్వాత దీని గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని ఈ సమస్యను రాష్ట్రం విడిపోయిన తర్వాత సులువుగా పరిష్కరించే అవకాశం ఉందని విద్యావేత్తలు చెబుతున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రభుత్వ టీచర్లు చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో రెండు యాజమాన్యాల్లోని ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి కోర్టులో ఉన్న ఈ సమస్యను పరిష్కరించే అవకాశం ఉందని ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు విద్యాశాఖ ఉన్నతాధికారులకు సూచిం చారు. కానీ ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోవడంలేదు. కేసు కోర్టులో ఉంది కాబట్టి తాము ఏమీ చేయలేమని పాఠశాల విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. 10 డివిజన్లు, 107 మండలాలకే పూర్తి స్థాయి విద్యాధికారులు ఈ సమస్య పరిష్కారమవని కారణంగా అనేక సంవత్సరాల నుంచి డివిజన్, మండల స్థాయిలో విద్యాశాఖాధికారుల పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. జిల్లా స్థాయిలో డీఈవో, డివిజన్ స్థాయిలో డీవైఈవో, మండల స్థాయిలో ఎంఈవో పాఠశాలలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో డీఈవోల నియామకం వరకు చేస్తున్నా ఆ తరువాత స్థాయి నియామకాలు ఏళ్ల తరబడి నిలిచిపోయాయి. రాష్ట్రంలో డివిజన్ల స్థాయిలో 65 మంది డీవైఈవోలు పనిచేయాల్సి ఉండగా పదిమంది మాత్రమే రెగ్యులర్ డీవైఈవోలు పనిచేస్తున్నారు. మిగిలిన 55 డివిజన్లలో సీనియర్ ప్రధానోపాధ్యాయులే ఇన్చార్జి డీవైఈవోలుగా వ్యవహరిస్తున్నారు. 662 మండలాలుంటే 107 మండలాలకు మాత్రమే పూర్తిస్థాయి విద్యాశాఖాధికారులున్నారు. 555 మండలాల్లో ప్రధానోపాధ్యాయులే ఇన్చార్జి ఎంఈవోలుగా వ్యవహరిస్తున్నారు. వీరు అటు స్కూల్లో సరిగా పనిచేయలేక, ఇటు మండల స్థాయిలో అన్ని పాఠశాలల్నీ పర్యవేక్షించలేక సతమతమవుతున్నారు. ప్రధానోపాధ్యాయుల పోస్టులు కూడా పెద్దసంఖ్యలో ఖాళీగా ఉండటంతో రెండు, మూడు పాఠశాలల బాధ్యతలు ఒకరికే అప్పగిస్తున్నారు. దీంతో ఏ స్కూలుకూ న్యాయం జరగడంలేదు. ఉమ్మడి సర్వీసు నిబంధనల వ్యవహారంపై ప్రభుత్వం దృష్టిపెడితేగానీ ఈ పోస్టుల్ని పూర్తిస్థాయిలో భర్తీచేసే అవకాశం కనిపించడంలేదు. ఉమ్మడి రూల్స్‌తోనే న్యాయం మొత్తం ఉపాధ్యాయుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆరుశాతం మందే ఉన్నారు. 94 శాతం మంది పంచాయతీరాజ్, మున్సిపల్ ఉపాధ్యాయులున్నారు. మెజారిటీగా ఉన్న ఉపాధ్యాయులకు న్యాయం జరగాలంటే ఉమ్మడి సర్వీసు నిబంధనలు అమలు చేయాలి. కేసు కోర్టులో ఉన్నా ప్రభుత్వం జోక్యం చేసుకుంటేనే సమస్య పరిష్కారమవుతుంది. ఈ అంశం రాష్ట్ర స్థాయిలో కూడా లేదు. ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో మాట్లాడితే ఉపయోగం ఉంటుంది. - సి.వి.ఎస్.మణి, పీఆర్టీయూ రాష్ట్ర నేత సుప్రీం మేరకు పదోన్నతులు ప్రభుత్వం పంచాయతీరాజ్ టీచర్ల సంఘాలకు అనుకూలంగా వ్యవహరిస్తోంది. వ్యవహారం కోర్టులో ఉందనే సాకు చూపుతూ సమస్యను పరిష్కరించడానికి ముందుకురావడంలేదు. సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి ప్రభుత్వ ఉపాధ్యాయులతోనే డీవైఈవో, ఎంఈవో పోస్టులను భర్తీచేయాలి. - ఎం.సూర్యనారాయణమూర్తి, ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం గౌరవాధ్యక్షుడు -
ప్రాంతీయ వైద్య, ఆరోగ్యశాఖలో సీనియారిటీ లొల్లి
11 రోజులుగా ఓపెన్ కాని ఈ-మెయిల్ జాబితా ఐదో జోన్లో పదోన్నతులు, బదిలీల గందరగోళం {పాంతీయ వైద్య,ఆరోగ్య సిబ్బంది తీరుపై అనుమానాలు పదేళ్ల నుంచి ఇదే గోస.. నా పేరు ఎస్.అమ్మాని. మాది ఖమ్మం జిల్లా కొత్తగూడెం. నేను అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లో పనిచేస్తున్నాను. నేను ఏఎన్ఎం అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలిగా కూడా పనిచేస్తున్నాను. అధికారులు సీనియారిటీ జాబితాను ఆన్లైన్లో పెట్టామని ప్రకటించారు. ఓపెన్ కాకపోవడంతో మంగళవారం ఆర్డీ కార్యాలయానికి వచ్చాను. దాదాపు 150 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాను. డీఎంహెచ్‌వో కార్యాలయానికి వచ్చిన జాబితాకు ఆర్డీ కార్యాలయం విడుదల చేసిన జాబితాకు చాలా వ్యత్యాసం ఉంది. పదేళ్ల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. హన్మకొండ/ఎంజీఎం : వివాదాలకు కేంద్రబిందువైన ప్రాంతీయ వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా సీనియారిటీ జాబితా రూపకల్పన విషయంలోనూ తన తీరును కొనసాగిస్తోంది. ఉద్యోగులకు సీనియారిటీ జాబితాను అందించడంలో ప్రాంతీయ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు, వరంగల్ కార్యాలయ సిబ్బంది అనుసరించిన విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ విభాగం అనుసరించని విధంగా ఉద్యోగుల సీనియారిటీ జాబితాను ఈ-మెయిల్లో పెట్టడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోని వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 28 విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సీనియారిటీ ప్రతిపాదికన త్వరలో పదోన్నతులు, బదిలీలు చేపట్టాల్సి ఉంది. ఇందులో భాగంగా ప్రాంతీయ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు, వరంగల్ కార్యాలయ ఉద్యోగులు సీనియారిటీ జాబితాను రూపొందించా రు. ఈ జాబితాను టఛీఝజిటట్ఛజీౌటజ్టీడజీట్ట ఃడ్చజిౌౌ.ఛిౌఝ పేరుతో క్రియేట్ చేసిన ఈ మెయిల్లో ఉంచారు. ఉద్యోగులు దీన్ని ఓపెన్ చేసేందుకు ట్ఛజీౌటజ్టీడజీటౌ్ట్డ్ఛ5 అనే పాస్‌వర్డ్‌ను టైప్ చేయాలంటూ పేర్కొన్నారు. ఈ మెయిల్లో జాబితాను 2014 అక్టోబరు 19వ తేదీ నుంచి చూసుకోవచ్చని సెలవిచ్చారు. ఈ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే అక్టోబరు 30లోగా తెలపాలని సూచించారు. కానీ.. ఈ మెరుుల్ ఓపెన్ కాకుండా సతారుుస్తుండడంతో వైద్య ఆరోగ్యశాఖ విభాగంలో డాక్టర్లు మొదలుకుని అటెండర్లు, స్వీపర్ల వరకు వేలాదిమంది ఉద్యోగులు సీనియూరిటీ జాబితా కోసం ఎదురు చూస్తున్నారు. వీరందరికీ ఒకే ఈ మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌ను అందుబాటులో ఉంచడమే సమస్యలకు దారితీసినట్లు తెలుస్తోంది. ఈ మెయిల్ లాక్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో చాలామంది పదోన్నతులపై భారీ అంచనాలతో ఉన్నారు. ఐదు జిల్లాలో ఉన్న ఉద్యోగులు సీనియారిటీ జాబితా కోసం ఆన్లైన్ వైపునకు అడుగులేయడంతో సైట్ ఓపెన్ కావడానికి గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. 2014 అక్టోబరు 19వ తేదీ మధ్యాహ్నం నుంచి ఈ మెయిల్ అడ్రస్‌తో పాటు పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేశాక, జిగ్‌జాగ్ పద్ధతిలో ఉండే ఇంగ్లిష్ పదాలు, అంకెల సమాహారం(క్యాప్చా) ఇమేజ్ ఎంటర్ చేయాలని సూచిస్తోంది. క్యాప్చాను ఎంటర్ చేసిన తర్వాత పాస్‌వర్డ్‌ను తప్పుగా ఎంటర్ చేసినందున ఈ మెయిల్ లాక్ అయినట్లుగా కంప్యూటర్‌పై డిస్ప్లే అవుతోంది. సుమారు 11 రోజులుగా ఇదే తంతు నిరాంటకంగా కొనసాగుతోంది. దీంతో సీనియారిటీ జాబితాను చూసుకోలేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదేం పారదర్శకత ఐదో జోన్ పరిధిలో వైద్య, ఆరోగ్యశాఖ విభాగంలో చేపట్టే బదిలీలు, పదోన్నతుల విషయం ప్రతి యేడు వివాదంగా మారుతోంది. నచ్చిన చోటుకి బదిలీలు, చేతులు తడిపిన వారికి పదోన్నతులు ఇప్పిస్తామంటూ ఇక్కడి సిబ్బంది తెరచాటు వ్యవహారాలు నడిపిస్తున్నారంటూ ఉద్యోగులు అనేక సార్లు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గత ఏడాది ఏకంగా ఆర్డీ కార్యాలయం ఎదుట ధర్నాలు సైతం చేపట్టారు. దీంతో ఈ ఏడాది సీనియారిటీ జాబితా విషయంలో పారదర్శకతను పాటిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే సీనియారిటీ జాబితాను అందరికీ ఒకేసారి అందుబాటులో ఉంచేందుకు ఈ మెయిల్ ఐడీ మార్గాన్ని ఎంచుకున్నారు. సైట్తోపాటు పాస్‌వర్డ్‌ను ప్రకటించడం వల్ల కొంత మంది టెక్నాలజీని ఉపయోగించి పాస్‌వర్డ్‌ను మార్చే ఆవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. సీనియారిటీ జాబితాను పీడీఎఫ్ ఫార్మాట్లో రూపొందించి అధికారిక సైట్లో అందుబాటులో ఉంచకుండా.. ఈ మెయిల్ పద్ధతిని ఎంచుకోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో ఇక్కడి సిబ్బంది తమ పట్టు నిలుపుకునేందుకే ఈ ఎత్తుగడ వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు ప్రాంతీయ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సీనియారిటీ జాబితాను ఆన్లైన్లో పెట్టారు. అది ఓపెన్ కాకపోవడంతో ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల ఉద్యోగులు వరంగల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయితే జాబితాలో తప్పులు ఉంటే ఈ నెల 30వ తేదీలోగా తెలుపాలని అధికారులు పేర్కొన్నారు. జాబితా ఆన్లైన్లో ఓపెన్‌కాకపోవడం, సమయం దగ్గర పడుతుండడంతో ఆయా జిల్లాల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు జాబితా చేరకపోవడంతో ఉద్యోగ సంఘాల నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
14వ తేదీ తరవాత పోస్టుల కేటాయింపు
ఇరు రాష్ట్రాలకు సీనియారిటీ జాబితాలు ఖరారు 14వ తేదీన కమలనాథన్ కమిటీ భేటీ {పతీ శాఖ నోడల్ ఆఫీసర్ల నియామకానికి ఆదేశాలు నోడల్ ఆఫీసర్లతో రోజువారీ భేటీ హైదరాబాద్: తెలంగాణ, ఏపీ ఈ నెల 14వ తేదీ తరువాత శాఖల వారీగా పోస్టుల కేటాయింపుపై కమలనాథన్ కమిటీ కసరత్తు ప్రారంభించనుంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అన్ని శాఖ ల్లోని, విభాగాల్లోని పోస్టుల సంఖ్యను, సీనియారిటీ జాబితాలను ఈ నెల 14వ తేదీలోగా సమర్పించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతీ శాఖ నోడల్ ఆఫీసర్లను నియమించుకోవాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పోస్టుల వివరాలు, సీనియారిటీ జాబితాలు పంపడంలో ఏమై నా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేయడానికి మంగళవారం నుంచి నోడల్ అధికారులతో కమలనాధన్ సమావేశం కానున్నారు. ఇలా ఉండగా మరోవైపు ఈ నెల 14వ తేదీన కమలనాథన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇరు రాష్ట్రాల ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులు, కేంద్ర వ్యక్తిగత సిబ్బంది శిక్షణ విభాగం సంయుక్త కార్యదర్శి అర్చనా వర్మ పాల్గొంటారు. ఈ సమావేశంలో పలు శాఖల నుంచి పోస్టుల వివరాలు, సీనియారిటీ జాబితాలపై వచ్చిన సమాచారంపై చర్చించనున్నారు. అన్ని శాఖల నుంచి సమాచారం వచ్చిన నేపథ్యంలో ఆ వెంటనే ఏ రాష్ట్రానికి ఏ శాఖకు ఎన్ని పోస్టులుండాలో కమలనాథన్ కమిటీ కేటాయింపులు చేయనుంది. అలాగే ఉద్యోగుల పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలకు కేంద్రం ఆమోదం లభించిన వెంటనే రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగులందరి నుంచి ఆప్షన్ల స్వీకరణను ప్రారంభిస్తారు. -
‘డీఎస్పీ సీనియారిటీ’ జాబితా వెబ్సైట్లో
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలోని సివిల్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ) పదోన్నతులకు సంబంధించిన సీనియారిటీ జాబితాను అధికారిక వెబ్సైట్ (www.apstatepolice.org)లో ఉంచినట్లు డీజీపీ కార్యాలయం బుధవారం తెలిపింది. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల లోపు శాంతి భద్రతల విభాగం అదనపు డీజీకి(adg_lo@co.appolice.gov.in) ఈ-మెయిల్ ద్వారా తెలపాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోపక్క వెయిటింగ్లో ఉన్న సాయుధ రిజర్వ్ విభాగం డీఎస్పీ ఎం. మహేష్‌కుమార్‌కు ఆక్టోపస్‌లో పోస్టింగ్ ఇస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. -
విద్యాశాఖ వింతలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : జిల్లా విద్యాశాఖలో పా లన గాడితప్పింది. ప్రతీ నెల పదోన్నతుల ప్రక్రియ అటకెక్కింది. సీనియర్ ఉపాధ్యాయులకు ప్రయోజనం కల్పించే సీనియారిటీ జాబితా ఎంతకీ విడుదల కావడం లేదు. సర్వీసు క్రమబద్ధీకరణ నత్తనడకన సాగుతోంది. మొత్తంగా జిల్లా విద్యాశాఖలో పాలన పూర్తిగా స్తంభించిపోయింది. ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం తర్వాత జిల్లా విద్యాశాఖపై ఎలాంటి పని ఒత్తిడి లేదు. ఇలాంటి సందర్భాల్లో ఉపాధ్యాయుల సర్వీసు అంశాలపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపాల్సిన విద్యాశాఖ వీటిని అసలే పట్టించుకోవడం లేదు. పాఠశాలల తనిఖీ సమయంలో చిన్నచిన్న విషయాలకే సస్పెన్షన్ వంటి కఠిన చర్యలు తీసుకునే ఆ శాఖ ఉన్నతాధికారులు... తమ కార్యాలయం పనితీరును మాత్రం బేరీజు వేసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగి పర్సనల్ రికార్డు(పీఆర్) రిజిస్టర్ నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని డీఈవో కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలకు సంబంధించి అన్ని కేటగిరీల్లో కలిపి జిల్లాలో 14,400 మంది టీచర్లు ఉన్నారు. నిబంధనల ప్రకారం ప్రతీనెల పదోన్నతులు ఇవ్వాలి. డిసెంబర్ 2012లో ఈ ప్రక్రియ నిర్వహించిన అనంతరం పక్కనపెట్టారు. ఉపాధ్యాయుల నిరసనతో జిల్లాలో చివరిగా మే 25న పదోన్నతులు కల్పించారు. సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీ) స్కూల్ అసిస్టెంట్లు(ఎస్ఏ)లుగా, స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెడ్మాస్టర్లుగా పదోన్నతులు కల్పించారు. ఇక నుంచి ప్రతీ నెల కచ్చితంగా ఈ ప్రక్రియ నిర్వహిస్తామని విద్యాశాఖ జిల్లా అధికారి అప్పుడు ప్రకటించారు. మేలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు సంబంధించి ఏప్రిల్ వరకు ఖాళీ అయిన స్థానాలను మాత్రమే భర్తీ చేశారు. అనంతరం ఆ విషయమే మరిచిపోయారు. మే 31, జూన్ 30, జూలై 31... ఇలా మూడు నెలల్లో రిటైర్మెంట్ అయిన వారి స్థానాల్లో ఎవరినీ నియమించడం లేదు. నెలకోసారి పదోన్నతులు అనే విషయం ప్రకటనలకే పరిమితం కావడంతో ఉపాధ్యాయులు నష్టపోతున్నారు. గడిచిన మూడు నెలల్లో గెజిటెడ్ హెచ్ఎం పోస్టులు 12, ఎల్‌ఎఫ్‌ఎల్‌హెచ్‌ఎం పోస్టులు 40 ఖాళీ అయ్యాయి. మరోవైపు 50 మంది ఉపాధ్యాయులు కొత్తగా మొదలైన ఆదర్శ పాఠశాలల్లో పీజీటీ, ప్రిన్సిపాళ్లుగా చేరారు. వీరి స్థానాలు సైతం ఖాళీ అయ్యాయి. ఇలా మొత్తం 120 పోస్టుల వరకు ఖాళీ అయ్యాయని విద్యాశాఖ వర్గాలే చెబుతున్నాయి. అర్హులకు పదోన్నతి కల్పించి ఈ స్థానాల్లో నియమించాల్సి ఉండగా ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పదోన్నతుల ప్రక్రియ జూలైలోపు జరిగితే పదో వేతన సవరణ సంఘం ప్రకారం ఉపాధ్యాయులకు ప్రయోజనం కలిగేది. చిత్తూరు జిల్లాలో ఉపాధ్యాయులకు పీఆర్సీ ప్రయోజనం కోసం పదోన్నతుల కౌన్సెలింగ్ తేదీని ముందుకు జరిపిన సందర్భాలు ఉన్నాయి. మన జిల్లాలో మాత్రం ఆలస్యంగా కూడా ఈ ప్రక్రియ జరగడం లేదు. ఈ విషయంలో విద్యాశాఖ నిర్లక్ష్యంపై పలు ఉపాధ్యాయ సంఘాలు మంగళవారం డీఈవోను కలిసినట్లు తెలిసింది. ఇప్పటికైనా పదోన్నతులు కల్పించకపోతే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినా ఫలితం కనిపించడంలేదని తెలుస్తోంది. సీనియారిటీకి దిక్కు లేదు ఉపాధ్యాయులకు వృత్తిపరంగా మేలు చేసే సీనియారిటీ జాబితా విషయంలో జిల్లా విద్యాశాఖ మొదటి నుంచి నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. సీనియారిటీ జాబితా వెల్లడిలో నిర్లక్ష్యంపై గతంలో ఉపాధ్యాయ సంఘాలు నిరసన తెలిపాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో జూన్ 3న తాత్కాలిక జాబితా ప్రకటించారు. జూలై 3లోపు అభ్యంతరాలు స్వీకరిస్తామని, ఆ తర్వాత వారంలోపు తుది జాబితా వెల్లడిస్తామని చెప్పారు. ఈ ప్రకటన కూడా యథావిధిగా అటకెక్కింది. విద్యాశాఖ చెప్పిన గడువు ముగిసి నెల రోజులైనా ఇప్పటికీ సీనియారిటీ తుది జాబితా విడుదల చేయడం లేదు. ఇలా జిల్లా విద్యాశాఖ నిర్లక్ష్యంతో స్టెప్అప్, ప్రీపోన్ అవకాశాలు కోల్పోవాల్సి వస్తోందని సీనియర్ ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఈ పక్రియ పూర్తయితే జిల్లాలో దాదాపు మూడు వేల మంది ఉపాధ్యాయులకు మేలు జరుగుందని వీరు చెబుతున్నారు. సర్వీసు క్రమబద్ధీకరణ అంతే సంగతులు నియామకమైనప్పటి నుంచి రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారి సర్వీసు క్రమబద్ధీకరణ, ప్రొబెషన్ డిక్లరేషన్ ఉత్తర్వుల జారీలోనూ విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇందుకోసం 2012లోనే 7 వేల మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు మాత్రం కేవలం 400 మంది సర్వీసును మాత్రమే క్రమబద్ధీకరించారు. నేరుగా నియామకమైన ఉపాధ్యాయులకు సంబంధించి ప్రవర్తన తీరుపై పోలీసుశాఖ నివేదికలు అవసరముంటాయి. వీటిని త్వరగా తెప్పించాల్సిన బాధ్యత నియామక అధికారి అయిన డీఈవోదే. డీఈవో కార్యాయం తీరు వల్లే ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మరోవైపు పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు నేరుగా సర్వీసు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేయవచ్చు. జిల్లాలో మాత్రం ఇది జరగడం లేదు. దీంతో వేల మంది ఉపాధ్యాయులు నష్టపోతున్నారు.