సింగిల్ జడ్జి ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: డీఎస్పీ పదోన్నతుల సీనియారిటీ జాబితా వివాదానికి సంబంధించిన కేసును సింగిల్ జడ్జి గురువారం ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నివేదించారు. ఇదే అంశానికి సంబంధించిన వ్యాజ్యాలు ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉండటంతో ఈ వ్యాజ్యాన్నీ ధర్మాసనానికే నివేదిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు. నేరుగా డీఎస్పీలుగా నియమితులైన వారివి, పదోన్నతుల ద్వారా డీఎస్పీలైన వారి సీనియారిటీ జాబితాను 2015 నాటి మెమో ప్రకారం వెంటనే రూపొందించేలా ఉభయ రాష్ట్రాల డీజీపీలను ఆదేశించాలని కోరుతూ మెదక్ జిల్లాకు చెందిన చిలుకూరి చెన్నయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు.
దీన్ని గురువారం జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారించారు. సర్వీసు నిబంధనల ప్రకారం సీనియారిటీ జాబితాను రూపొందించడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ సమయంలో ఇదే అంశానికి చెందిన వ్యాజ్యాలు ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉన్నాయని న్యాయమూర్తి దృష్టికి వచ్చింది. దీంతో ఆయన ఈ వ్యాజ్యాన్ని అక్కడికే నివేదిస్తున్నట్లు పేర్కొన్నారు. కేసు వివరాల రికార్డులను సంబంధిత ధర్మాసనం ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.
డీఎస్పీల వివాదం ధర్మాసనానికి నివేదన
Published Fri, Oct 21 2016 12:44 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
Advertisement