గుప్తనిధి, బంగారం అంటూ రూ. 17 లక్షలు స్వాహా చేసిన డీస్పీ సారు! | Kamareddy DSP Madan Lal Suspended | Sakshi
Sakshi News home page

గుప్తనిధి, బంగారం అంటూ రూ. 17 లక్షలు స్వాహా చేసిన డీస్పీ సారు!

Published Wed, Oct 23 2024 1:36 PM | Last Updated on Wed, Oct 23 2024 1:41 PM

Kamareddy DSP Madan Lal Suspended

బంగారం ఆశ చూపి డబ్బులు వసూలు

ఓ వ్యక్తికి రూ.17 లక్షల టోకరా వేసిన డీఎస్పీ

చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు

కామారెడ్డి క్రైం: ఎవరైనా మోసం చేస్తే న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తాం. అయితే బాధితు లకు అండగా ఉండి న్యాయం చేయాల్సిన పోలీసు అధికారే దొంగ బంగారం పేరిట డబ్బులు కాజేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చర్చనీయాంశమైంది. వివరాలిలా ఉన్నాయి. గతంలో వరంగల్‌ జిల్లాలో పనిచేసిన డీఎస్పీ మదన్‌లాల్‌ ఏడు నెలల క్రితం కామారెడ్డి డీసీఆర్‌బీ విభాగానికి బదిలీపై వచ్చాడు. జిల్లా పోలీస్‌ కార్యాలయానికి సమీపంలోని ఓ కాలనీలో ఇల్లు కిరాయికి తీసుకుని నివసిస్తున్నాడు. అదే కాలనీకి చెందిన ఓ వ్యక్తితో కొద్దిరోజుల క్రితం పరిచయం ఏర్పడింది. 

తనకు తెలిసిన వ్యక్తికి తవ్వకాల్లో గుప్త నిధులు లభించాయని, రూ.6 లక్షలకే కిలో చొప్పున బంగారాన్ని ఇప్పిస్తానని నమ్మించాడు. తాను పోలీసునని, అంతా చూసుకుంటానని చెప్పడంతో నమ్మిన సదరు వ్యక్తి.. రూ. 17 లక్షలకుపైగా ఇచ్చినట్లు తెలిసింది. అయితే రోజులు గడుస్తున్నా బంగారం ఇవ్వకపోవడంతో బాధితుడు 15 రోజుల క్రితం జిల్లా పోలీసు ఉన్నతాధికారిని ఆశ్రయించాడు. దీంతో ఈనెల 6న డీఎస్పీ మదన్‌లాల్‌ను ఐజీ కార్యాలయానికి సరెండర్‌ చేశారు. అంతేకాకుండా దేవునిపల్లి ఠాణా లో ఈ వ్యవహారంపై కేసు కూడా నమోదు చేశారు. 

జిల్లా ఉన్నతాధికారులు జరిగిన ఘ టనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి రాష్ట్ర అధికారులకు నివేదిక సమర్పించారు. దీంతో డీఎస్పీ మదన్‌లాల్‌ను సస్పెండ్‌ చేస్తూ రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ అయినట్లు తెలిసింది. ఈ కేసులో డీఎస్పీతో పాటు మరో ఇద్దరు వ్యక్తుల పాత్ర ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా గతంలో సదరు డీఎస్పీ పనిచేసిన ఇతర చోట్ల కూడా ఫిర్యాదులు ఉన్నాయని సమాచారం. జిల్లాకు వచ్చిన తర్వాత కూడా మాయమాటలు చెప్పి చాలామంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement