సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : జిల్లా విద్యాశాఖలో పా లన గాడితప్పింది. ప్రతీ నెల పదోన్నతుల ప్రక్రియ అటకెక్కింది. సీనియర్ ఉపాధ్యాయులకు ప్రయోజనం కల్పించే సీనియారిటీ జాబితా ఎంతకీ విడుదల కావడం లేదు. సర్వీసు క్రమబద్ధీకరణ నత్తనడకన సాగుతోంది. మొత్తంగా జిల్లా విద్యాశాఖలో పాలన పూర్తిగా స్తంభించిపోయింది.
ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం తర్వాత జిల్లా విద్యాశాఖపై ఎలాంటి పని ఒత్తిడి లేదు. ఇలాంటి సందర్భాల్లో ఉపాధ్యాయుల సర్వీసు అంశాలపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపాల్సిన విద్యాశాఖ వీటిని అసలే పట్టించుకోవడం లేదు.
పాఠశాలల తనిఖీ సమయంలో చిన్నచిన్న విషయాలకే సస్పెన్షన్ వంటి కఠిన చర్యలు తీసుకునే ఆ శాఖ ఉన్నతాధికారులు... తమ కార్యాలయం పనితీరును మాత్రం బేరీజు వేసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగి పర్సనల్ రికార్డు(పీఆర్) రిజిస్టర్ నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని డీఈవో కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలకు సంబంధించి అన్ని కేటగిరీల్లో కలిపి జిల్లాలో 14,400 మంది టీచర్లు ఉన్నారు. నిబంధనల ప్రకారం ప్రతీనెల పదోన్నతులు ఇవ్వాలి. డిసెంబర్ 2012లో ఈ ప్రక్రియ నిర్వహించిన అనంతరం పక్కనపెట్టారు. ఉపాధ్యాయుల నిరసనతో జిల్లాలో చివరిగా మే 25న పదోన్నతులు కల్పించారు. సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్‌జీటీ) స్కూల్ అసిస్టెంట్లు(ఎస్‌ఏ)లుగా, స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెడ్‌మాస్టర్లుగా పదోన్నతులు కల్పించారు. ఇక నుంచి ప్రతీ నెల కచ్చితంగా ఈ ప్రక్రియ నిర్వహిస్తామని విద్యాశాఖ జిల్లా అధికారి అప్పుడు ప్రకటించారు. మేలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు సంబంధించి ఏప్రిల్ వరకు ఖాళీ అయిన స్థానాలను మాత్రమే భర్తీ చేశారు.
అనంతరం ఆ విషయమే మరిచిపోయారు. మే 31, జూన్ 30, జూలై 31... ఇలా మూడు నెలల్లో రిటైర్మెంట్ అయిన వారి స్థానాల్లో ఎవరినీ నియమించడం లేదు. నెలకోసారి పదోన్నతులు అనే విషయం ప్రకటనలకే పరిమితం కావడంతో ఉపాధ్యాయులు నష్టపోతున్నారు. గడిచిన మూడు నెలల్లో గెజిటెడ్ హెచ్‌ఎం పోస్టులు 12, ఎల్‌ఎఫ్‌ఎల్‌హెచ్‌ఎం పోస్టులు 40 ఖాళీ అయ్యాయి. మరోవైపు 50 మంది ఉపాధ్యాయులు కొత్తగా మొదలైన ఆదర్శ పాఠశాలల్లో పీజీటీ, ప్రిన్సిపాళ్లుగా చేరారు. వీరి స్థానాలు సైతం ఖాళీ అయ్యాయి. ఇలా మొత్తం 120 పోస్టుల వరకు ఖాళీ అయ్యాయని విద్యాశాఖ వర్గాలే చెబుతున్నాయి. అర్హులకు పదోన్నతి కల్పించి ఈ స్థానాల్లో నియమించాల్సి ఉండగా ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
పదోన్నతుల ప్రక్రియ జూలైలోపు జరిగితే పదో వేతన సవరణ సంఘం ప్రకారం ఉపాధ్యాయులకు ప్రయోజనం కలిగేది. చిత్తూరు జిల్లాలో ఉపాధ్యాయులకు పీఆర్‌సీ ప్రయోజనం కోసం పదోన్నతుల కౌన్సెలింగ్ తేదీని ముందుకు జరిపిన సందర్భాలు ఉన్నాయి. మన జిల్లాలో మాత్రం ఆలస్యంగా కూడా ఈ ప్రక్రియ జరగడం లేదు. ఈ విషయంలో విద్యాశాఖ నిర్లక్ష్యంపై పలు ఉపాధ్యాయ సంఘాలు మంగళవారం డీఈవోను కలిసినట్లు తెలిసింది. ఇప్పటికైనా పదోన్నతులు కల్పించకపోతే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినా ఫలితం కనిపించడంలేదని తెలుస్తోంది.
సీనియారిటీకి దిక్కు లేదు
ఉపాధ్యాయులకు వృత్తిపరంగా మేలు చేసే సీనియారిటీ జాబితా విషయంలో జిల్లా విద్యాశాఖ మొదటి నుంచి నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. సీనియారిటీ జాబితా వెల్లడిలో నిర్లక్ష్యంపై గతంలో ఉపాధ్యాయ సంఘాలు నిరసన తెలిపాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో జూన్ 3న తాత్కాలిక జాబితా ప్రకటించారు. జూలై 3లోపు అభ్యంతరాలు స్వీకరిస్తామని, ఆ తర్వాత వారంలోపు తుది జాబితా వెల్లడిస్తామని చెప్పారు. ఈ ప్రకటన కూడా యథావిధిగా అటకెక్కింది. విద్యాశాఖ చెప్పిన గడువు ముగిసి నెల రోజులైనా ఇప్పటికీ సీనియారిటీ తుది జాబితా విడుదల చేయడం లేదు. ఇలా జిల్లా విద్యాశాఖ నిర్లక్ష్యంతో స్టెప్‌అప్, ప్రీపోన్ అవకాశాలు కోల్పోవాల్సి వస్తోందని సీనియర్ ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఈ పక్రియ పూర్తయితే జిల్లాలో దాదాపు మూడు వేల మంది ఉపాధ్యాయులకు మేలు జరుగుందని వీరు చెబుతున్నారు.
సర్వీసు క్రమబద్ధీకరణ అంతే సంగతులు
నియామకమైనప్పటి నుంచి రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారి సర్వీసు క్రమబద్ధీకరణ, ప్రొబెషన్ డిక్లరేషన్ ఉత్తర్వుల జారీలోనూ విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇందుకోసం 2012లోనే 7 వేల మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు మాత్రం కేవలం 400 మంది సర్వీసును మాత్రమే క్రమబద్ధీకరించారు.
నేరుగా నియామకమైన ఉపాధ్యాయులకు సంబంధించి ప్రవర్తన తీరుపై పోలీసుశాఖ నివేదికలు అవసరముంటాయి. వీటిని త్వరగా తెప్పించాల్సిన బాధ్యత నియామక అధికారి అయిన డీఈవోదే. డీఈవో కార్యాయం తీరు వల్లే ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మరోవైపు పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు నేరుగా సర్వీసు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేయవచ్చు. జిల్లాలో మాత్రం ఇది జరగడం లేదు. దీంతో వేల మంది ఉపాధ్యాయులు నష్టపోతున్నారు.
విద్యాశాఖ వింతలు
Published Thu, Aug 8 2013 4:10 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
Advertisement
Advertisement