సాక్షి, అమరావతి: గృహ నిర్మాణ సంస్థలో పలువురికి పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జిల్లాల వారీగా సీనియారిటీ జాబితా ఇప్పటికే రాష్ట్రస్థాయి అధికారులకు చేరింది. జాబితా సిద్ధం చేసినప్పటికీ గతంలో ఏదేని ఆరోపణలతో సస్పెండ్ అయ్యారా, ఏమైనా మెమోలు అందుకున్నారా, విధి నిర్వహణలో ప్రవర్తన వంటి అంశాలపై జిల్లాల వారీగా పూర్తి వివరాలను సేకరించారు. 13 జిల్లాల్లో 212 మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు సంబంధించిన సీనియార్టీ జాబితా తయారు చేసి అర్హులైన వారికి పదోన్నతులు కల్పించనున్నారు. ఈ విషయమై వారంలోగా ఉన్నతాధికారులు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వివిధ ఆరోపణల కారణంగా ఉద్యోగాల నుంచి తొలగించిన ముగ్గురు అసిస్టెంట్ ఇంజనీర్లను తిరిగి చేర్చుకున్నారు.
వీరికి సంబంధించిన వివరాలను కూడా జాబితాలో ప్రత్యేకంగా పొందుపరచారు. గృహ నిర్మాణ సంస్థలో ఖాళీ పోస్టులను గుర్తించి ఏఈలను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగాను, అసిస్టెంట్ మేనేజర్లకు మేనేజర్లుగా పదోన్నతులు లభించనున్నాయి. గత ప్రభుత్వం కొంతమందిని ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించుకుని సంస్థ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించకుండా కాలయాపన చేస్తూ వచ్చింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక సీనియార్టీ జాబితాను పంపాలని జిల్లా ప్రాజెక్టు మేనేజర్లకు ఆదేశాలు వెళ్ళాయి. ఆ మేరకు జిల్లాల వారీగా పూర్తి వివరాలు అందడంతో త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment