ఏఈ పేపర్ లీక్.. స్కామ్‌లో తొమ్మిది మంది అరెస్టు.. నిందితుల్లో కానిస్టేబుల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఈ నెల 5న నిర్వహించిన అసిస్టెంట్ ఇంజనీర్స్ (ఏఈ సివిల్) పరీక్ష పేపర్లు లీకైనట్టు పోలీసులు తేల్చారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడైన పి.ప్రవీణ్‌కుమార్ ఈ ప్రశ్నపత్రాలనే టీచర్ రేణుక, ఆమె భర్త లవుడ్యావత్ డాక్యాకు అందించాడని గుర్తించారు.
వీటితోపాటు ప్రవీణ్‌కు చెందిన పెన్‌డ్రైవ్‌లో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్ కూడా ఉందని, దాన్ని విక్రయించేందుకు అతను ఒప్పందం చేసుకున్నాడని ఆధారాలు సేకరించారు. హైదరాబాద్ సౌత్‌వెస్ట్ జోన్ డీసీపీ కిరణ్ సోమవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావుతో కలసి లీకేజీ వ్యవహారం వివరాలను వెల్లడించారు.
కారుణ్య నియామకం కింద వచ్చి..
ఏపీలోని రాజమండ్రికి చెందిన పి.హరిశ్చంద్రరావు కుమారుడు ప్రవీణ్‌కుమార్. హరిశ్చంద్రరావు ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీ కార్యాలయం ప్రెస్‌కు అదనపు ఎస్పీగా పనిచేశారు. ఆయన ఉద్యోగంలో ఉండగానే అనారోగ్యంతో మరణించడంతో కారుణ్య నియామకం కింద ప్రవీణ్‌కుమార్‌కు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. బీటెక్ పూర్తిచేసిన ప్రవీణ్ 2017 నుంచి టీఎస్పీఎస్సీలో పనిచేస్తూ ప్రస్తుతం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ హోదాలో కమిషన్ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరిస్తున్నాడు.
ఇక మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రేణుక 2018లో టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్ష ద్వారా గురుకుల హిందీ టీచర్‌గా ఎంపికై.. ప్రస్తుతం వనపర్తిలో విధులు నిర్వర్తిస్తోంది. ఆమె భర్త లవుడ్యావత్ డాక్యా వికారాబాద్‌లోని డీఆర్డీఏలో పనిచేస్తున్నాడు. టీఎస్పీఎస్సీ పరీక్షకు సిద్ధమైన నాటి నుంచీ రేణుక, ప్రవీణ్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమె తరచూ కమిషన్ కార్యాలయానికి వచ్చి ప్రవీణ్‌ను కలిసేది.
ల్యాన్ ద్వారా యాక్సెస్ చేసి..
టీఎస్పీఎస్సీ ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్ చేసేందుకు రేణుక, లవుడ్యావత్ డాక్యా పథకం వేశారు. పేపర్లను తమకు ఇవ్వాలని ప్రవీణ్‌ను రేణుక కోరింది. టీఎస్‌టీఎస్‌లో ఔట్ సోర్సింగ్ విధానంలో నెట్వర్క్ అడ్మిన్‌గా పనిచేస్తున్న అట్ల రాజశేఖర్‌తో ప్రవీణ్ కలిసి పేపర్ లీకేజ్‌కి మార్గాలు అన్వేషించాడు. పరీక్ష పేపర్లన్నీ కమిషన్ కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లోని కంప్యూటర్లో ఉంటాయి.
ఈ సెక్షన్‌కు నేతృత్వం వహించే కస్టోడియన్ శంకరలక్ష్మి తన కంప్యూటర్ పాస్వర్డ్, యూజర్ ఐడీలను నిత్యం వినియోగించే పుస్తకం చివరి పేజీలో రాసి పెట్టుకున్నారు. ఈ విషయం తెలిసిన ప్రవీణ్ ఆమె కార్యదర్శి పేషీకి వచ్చినప్పుడు.. ఆమె పుస్తకం నుంచి తస్కరించాడు. ప్రవీణ్ కంప్యూటర్ నుంచే శంకరలక్ష్మి కంప్యూటర్ను యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో యాక్సెస్ చేశాడు.
ఇద్దరూ కలిసి ఆ కంప్యూటర్లో నుంచి ఏఈ పరీక్షకు సంబంధించిన జనరల్ స్టడీస్, సివిల్ పేపర్లను, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్‌ను కాపీ చేసుకున్నారు. ప్రవీణ్ వీటిని తన పెన్‌డ్రైవ్‌లో వేసుకున్నాడు. ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలను ప్రింట్ ఔట్ తీసుకున్నాడు.
ఇంట్లోనే చదివించి, దగ్గరుండి పరీక్ష రాయించి..
మరోవైపు టీచర్ రేణుక, లవుడ్యావత్ డాక్యా ఏఈ పరీక్ష పేపర్లు విక్రయించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రేణుక సోదరుడు, మాన్సూర్‌పల్లి తండా సర్పంచ్ కుమారుడైన కేతావత్ రాజేశ్వర్‌నాయక్‌ను.. అతడి ద్వారా మేడ్చల్ ఠాణాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కేతావత్ శ్రీనివాస్ (రాజేశ్వర్ సోదరుడు)ను సంప్రదించి ఏఈ పేపర్ విషయం చెప్పారు.
ఎస్సై పరీక్షకు సిద్ధమవుతున్న శ్రీనివాస్.. తనకు ఏఈ పేపర్ వద్దని చెప్పి, పరిచయస్తులైన కేతావత్ నీలేశ్‌నాయక్, పత్లావత్ గోపాల్‌నాయక్‌ల పేర్లు చెప్పాడు. దీనితో వారిని సంప్రదించిన రేణుక, డాక్యా రూ.13.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్ తీసుకున్నారు. ఏఈ పేపర్లు ప్రింట్ తీసుకున్న ప్రవీణ్.. ఈ నెల 2న రేణుక, డాక్యాలకు ఫోన్ చేసి చెప్పాడు. అప్పుడు మహబూబ్‌నగర్‌లో ఉన్న వారిద్దరూ వెంటనే బాలాపూర్ వరకు వచ్చి ప్రవీణ్‌ను కలిశారు. ఏఈ పరీక్ష పేపర్లు తీసుకుని రూ.5 లక్షలు ఇచ్చారు.
నీలేశ్, గోపాల్‌తోపాటు నీలేశ్ సోదరుడు రాజేంద్రనాయక్‌లను గండీడ్ మండలం పంచగల్ తండాలోని తమ ఇంటికి తీసుకువెళ్లారు. 5న ఉదయం డాక్యా అభ్యర్థులను వెంటపెట్టుకుని సరూర్‌నగర్‌లోని పరీక్ష కేంద్రం వరకు వచ్చి.. పరీక్ష రాయించాక విడిచిపెట్టాడు.
టీఎస్పీఎస్సీ ఉద్యోగులు ఇద్దరిపై వేటు
అసిస్టెంట్ ఇంజనీర్ పేపర్ల లీక్ వ్యవహారంలో ఇద్దరు ఉద్యోగులపై టీఎస్పీఎస్సీ వేటు వేసింది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్‌ను సస్పెండ్ చేయడంతోపాటు శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఔట్సోర్సింగ్ విధానంలో కంప్యూటర్ నెట్వర్క్ ఎక్స్‌పర్ట్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌రెడ్డిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించింది. ఇక ఈ వ్యవహారంలో భాగస్వాములైన గురుకుల టీచర్ రేణుక, పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగి, పోలీస్ కానిస్టేబుల్ ముగ్గురూ ప్రభుత్వ ఉద్యోగులే కావడంతో.. వారిపైనా చర్యలు తీసుకునేందుకు సంబంధిత శాఖలు సిద్ధమయ్యాయి.
మరికొన్ని పేపర్ల లీకేజీపై అనుమానాలు
6న తేదీన మళ్లీ ప్రవీణ్‌ను కలిసిన రేణుక, ఆమె భర్త ప్రశ్నపత్రాల కాపీలతోపాటు మరో రూ.5 లక్షలు ఇచ్చారు. పేపర్ల లీకేజీపై అనుమానం వచ్చిన టీఎస్పీఎస్సీ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రఘునాథ్ నేతృత్వంలోని బృందం.. ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, లవుడ్యావత్ డాక్యా, రాజేశ్వర్, నీలేశ్, గోపాల్, శ్రీనివాస్, రాజేందర్‌లను అరెస్టు చేసింది. వారి నుంచి పెన్‌డ్రైవ్‌లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది.
ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌ను పరిశీలించిన పోలీసులు.. అందులో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్ ఉందని, దాన్ని విక్రయించడానికి ప్రయత్నించాడని గుర్తించారు. ప్రవీణ్ కంప్యూటర్ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఆ నివేదిక అందిన తర్వాత.. అతను, రాజశేఖర్ ఎవరెవరి కంప్యూటర్లను యాక్సస్ చేశారు? ఏమేం పేపర్లు డౌన్లోడ్ చేశారనేది తేలుతుందని డీసీపీ వెల్లడించారు.