పోలీస్ పదోన్నతులకు బ్రేక్
► సీనియారిటీ జాబితాను తిప్పిపంపిన సీఎంవో
► అన్ని రేంజ్‌ల ఇన్‌స్పెక్టర్లు సంతకాలు పెడితేనే పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: నేడో రేపో అని ఆశల పల్లకీలో ఊరేగిన పోలీస్ ఇన్‌స్పెక్టర్లకు షాక్ తగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్‌స్పెక్టర్ల సీనియారిటీకి సంబంధించిన జీవో నంబర్ 54ను ఇటీవల పోలీస్ శాఖ పునఃసమీక్షించి హోంశాఖకు పంపించింది. ఆ జాబితా ప్రకారం అడ్‌హక్ పదోన్నతులు ఇచ్చేందుకు అనుమతివ్వాలని హోంశాఖ ముఖ్యమంత్రి కార్యాలయాని(సీఎంవో)కి పంపింది.
ఈ వ్యవహారంపై నాలుగు రోజుల క్రితం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభు త్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది సమావేశమయ్యారు. పోలీస్ శాఖ సవరించిన సీనియారిటీ జాబితాపై సీఎం కార్యాలయం అభ్యంతరం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ జాబితా ప్రకారం పదోన్నతులకు వెళితే ఏదో ఒక రేంజ్ ఇన్‌స్పెక్టర్లు పదోన్నతులపై కోర్టుకెళ్లి సమస్యను మరింత జఠిలంచేసే అవకాశం ఉన్నట్టు సీఎంవో కార్యాలయం అభిప్రాయ పడింది.
ఈ నేపథ్యంలో డీఎస్పీ పదోన్నతి పొందాల్సిన ఇన్‌స్పెక్టర్లందరూ సవరించిన జాబితాను ఒప్పుకుంటూ సంతకాలు చేస్తేనే పదోన్నతులు కల్పించాలని సీఎం కార్యాలయం స్పష్టం చేసినట్టు హోంశాఖ ఉన్నతాధికారులు ‘సాక్షి’కి స్పష్టం చేశారు. ఇన్నాళ్లు హోంమంత్రి, డీజీపీ కార్యాలయం మధ్య చక్కర్లు కొట్టిన పదోన్నతుల వ్యవహారం ఫైలు ఇక మూలన పడ్డట్టే అని సీనియర్ అధికారి ఒకరు అభిప్రాయ పడ్డారు.
సీనియారిటీ జాబితా సవరించ వద్దని ఒక రేంజ్ ఇన్‌స్పెక్టర్లు, సవరించాలని మరో రేంజ్ అధికారులు ఒత్తిడి తెచ్చారని, ఇలాంటి సందర్భంలో అన్ని రేంజ్‌ల ఇన్‌స్పెక్టర్లతో జాబితా సమ్మతమే అన్నట్టు సంతకాలు పెట్టించడం కష్టసాధ్యమని హోంశాఖ ఉన్నతాధికారులు అభిప్రాయ పడుతున్నారు. అయితే తమకు నోషనల్ సీనియారిటీ వచ్చి ఏళ్లు గడుస్తున్నా పోలీస్ శాఖ ప్రమోషన్లు కల్పించకపోవడంపై కొందరు కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.
అడ్‌హక్ పదోన్నతులు కల్పించకుండా మోకాలడ్డటం, ఆ తర్వాత సవరించిన సీనియారిటీ జాబితా ప్రకారం పదోన్నతులు ఇద్దామన్నా ఇన్‌స్పెక్టర్లు ఒప్పుకోకపోవడంతో పోలీస్ శాఖ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తీరా ఇప్పుడు సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో సీనియర్ ఐపీఎస్ అధికారులు మరింత ఒత్తిడిలో మునిగిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ డీజీపీ కార్యాల యం, హోంశాఖ మధ్య అంతర్యుద్ధాన్ని రగిల్చింది. దీనికంతటికీ కారణం ఇద్దరు అధికారులని, వారు చేసిన ఓవర్ యాక్షన్ వల్లే సమస్య మరింత జఠిలమైందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పదోన్నతుల సమస్య ఇప్పట్లో తేలే అవకాశం కనిపించడంలేదు.