14వ తేదీ తరవాత పోస్టుల కేటాయింపు
ఇరు రాష్ట్రాలకు సీనియారిటీ జాబితాలు ఖరారు
14వ తేదీన కమలనాథన్ కమిటీ భేటీ
{పతీ శాఖ నోడల్ ఆఫీసర్ల నియామకానికి ఆదేశాలు
నోడల్ ఆఫీసర్లతో రోజువారీ భేటీ
హైదరాబాద్: తెలంగాణ, ఏపీ ఈ నెల 14వ తేదీ తరువాత శాఖల వారీగా పోస్టుల కేటాయింపుపై కమలనాథన్ కమిటీ కసరత్తు ప్రారంభించనుంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అన్ని శాఖ ల్లోని, విభాగాల్లోని పోస్టుల సంఖ్యను, సీనియారిటీ జాబితాలను ఈ నెల 14వ తేదీలోగా సమర్పించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతీ శాఖ నోడల్ ఆఫీసర్లను నియమించుకోవాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పోస్టుల వివరాలు, సీనియారిటీ జాబితాలు పంపడంలో ఏమై నా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేయడానికి మంగళవారం నుంచి నోడల్ అధికారులతో కమలనాధన్ సమావేశం కానున్నారు. ఇలా ఉండగా మరోవైపు ఈ నెల 14వ తేదీన కమలనాథన్ కమిటీ సమావేశం కానుంది.
ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇరు రాష్ట్రాల ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులు, కేంద్ర వ్యక్తిగత సిబ్బంది శిక్షణ విభాగం సంయుక్త కార్యదర్శి అర్చనా వర్మ పాల్గొంటారు. ఈ సమావేశంలో పలు శాఖల నుంచి పోస్టుల వివరాలు, సీనియారిటీ జాబితాలపై వచ్చిన సమాచారంపై చర్చించనున్నారు. అన్ని శాఖల నుంచి సమాచారం వచ్చిన నేపథ్యంలో ఆ వెంటనే ఏ రాష్ట్రానికి ఏ శాఖకు ఎన్ని పోస్టులుండాలో కమలనాథన్ కమిటీ కేటాయింపులు చేయనుంది. అలాగే ఉద్యోగుల పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలకు కేంద్రం ఆమోదం లభించిన వెంటనే రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగులందరి నుంచి ఆప్షన్ల స్వీకరణను ప్రారంభిస్తారు.