వడివడిగా పసిడి పరుగు | Gold prices rise in the state | Sakshi
Sakshi News home page

వడివడిగా పసిడి పరుగు

Oct 2 2025 6:11 AM | Updated on Oct 2 2025 11:16 AM

Gold prices rise in the state

తానూ తగ్గేది లేదంటున్న రజతం 

నెల రోజుల్లో 10 గ్రాములకు రూ.20 వేల పెరుగుదల

సామాన్య, మధ్య తరగతి ప్రజల్లో ఆందోళన

రాయవరం: ‘ఏవండీ దసరా పండుగకు నెక్లెస్‌ కొంటారా..’ అంటూ గారాలు పోతున్న భార్యల వైపు భర్తలు బేల చూపులు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే బంగారం ధర చూస్తే బేర్‌మనే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు 10 గ్రాముల బంగారం ధర రూ.1.20 లక్షల మార్కుకు చేరుకుంది. బంగారం ధరలు కళ్లెం లేని గుర్రంలా దౌడు తీస్తున్నాయి. కదం తొక్కుతున్న కాంచనానికి ప్రభుత్వాలు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. 

పుత్తడితో పాటుగా తానూ  ఏమీ తక్కువ తినలేదన్నట్లుగా వెండి ధరలు కూడా విర్రవీగుతున్నాయి. స్వర్ణం వైపు చూడాలంటేనే సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం వివాహాల సీజన్‌ తిరిగి ప్రారంభం కావడంతో వివాహాలు నిర్వహించే సామాన్య, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటేనే భయం భయంగా షాపుల వైపు అడుగులు వేయాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇంతింతై వటుడింతై అన్నట్లుగా... 
పసిడి, వెండి ధరలు ఇంతింతై వటుడింతై అన్న చందంగా పెరుగుతున్నాయి. ఒకదానికొకటి పోటీ పడి మరీ పెరుగుతున్నాయి. జనవరి నెలలో 10 గ్రాముల బంగారం రూ.80 వేల వరకు పలకగా, జూలై నాటికి రూ.లక్షకు చేరుకుంది. ఆగస్టు, సెపె్టంబర్‌ నెలల్లో రోజుకు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు పెరుగుతూ ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ.1.20 వేలకు చేరుకుంది. ఆగస్టు, సెపె్టంబరు నెలలో సుమారు 10 గ్రాములకు రూ.20 వేల వరకు పెరిగింది.  

ఇదిలా ఉంటే వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. ఈ ఏడాది జనవరిలో కేజీ వెండి ధర రూ.92 వేలు పలుకగా, జూన్‌లో రూ.1.10 లక్షలు, జూలైలో రూ.1.11 లక్షలు, ఆగస్టులో రూ.1.11 లక్షలు ఉన్న కేజీ వెండి ధర నేడు రూ.1.50 లక్షలకు చేరింది. వెండిపై పెట్టుబడి పెట్టిన వారికి అదే తరహాలో లాభాలు వచ్చాయి. బంగారంతో పాటుగా వెండి ధర కూడా పరుగులు తీస్తూనే ఉంది. త్వరలోనే కేజీ రూ.2 లక్షలకు చేరుతుందన్న ఊహాగానాలున్నాయి.  

మదుపరుల ముందుచూపే కారణమా? 
పసిడి, వెండి ధరలు పెరుగుదలకు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు పలు రకాల కారణాలు పేర్కొంటున్నారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం, ఇజ్రాయిల్, గాజా మధ్య జరుగుతున్న యుద్ధంతో పాటుగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధిస్తున్న సుంకాల ప్రభావంతో పసిడి ధర రోజు రోజుకు పరుగులు తీస్తోంది. దీనికితోడు బంగారంపై పెట్టుబడి సురక్షితంగా భావిస్తున్న మదుపరులు భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడం బంగారం, వెండి ధరల పెరుగుదలకు కారణంగా వర్తకులు భావిస్తున్నారు.  

Gold: 2 లక్షలకు తులం బంగారం

‘తూర్పు’లో పరిస్థితి ఇదీ.. 
కరోనా తర్వాత బంగారం వ్యాపారం బాగా తగ్గిపోయినట్లుగా వ్యాపారులు చెబుతున్నారు. అంతకుముందు వారానికి ఆరు రోజులు వ్యాపారం సాగగా, ఇప్పుడు వారానికి నాలుగు రోజులు మాత్ర­మే వ్యాపారం సాగుతున్నట్లుగా వ్యాపారులు చెబుతున్నారు. పెద్ద షాపుల్లో రోజుకు 500 గ్రాముల వరకు అమ్మకాలు జరుగుతుండగా, చిన్న షాపుల్లో 20 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు అమ్మకాలు సాగుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చిన్నా, పెద్దా కలిపి 2,500 వరకు బంగారం విక్రయాల షాపులున్నాయి. 

ఉమ్మడి జిల్లాలో కరోనాకు ముందు రోజుకు 20 కేజీల చొప్పున బంగారం అమ్మకాలు జరగ్గా, ప్రస్తుతం 15 నుంచి 18 కేజీల వరకు అమ్మకాలు సాగుతున్నాయి. సీజన్‌ బట్టి ఈ అమ్మకాలు అటూఇటూగా ఉంటాయి. బంగారంతో పాటుగా వెండి అమ్మకాలు కూడా తగ్గాయి. ఆరు నెలల క్రితం వెండి కిలో రూ.50వేలు ఉండగా, ఆరు నెలల కాలంలో రూ.1.50 లక్షలకు చేరింది. 

చైనా, జపాన్‌ వంటి దేశాల్లో వెండిని ఎల్రక్టానిక్స్, సాంకేతిక అవసరాలకు ఉపయోగించడం, ప్రపంచ వ్యాప్తంగా బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టడంతో బంగారం, వెండి ధరలు ఊహించని పెరుగుదల కని్పంచి ఆల్‌టైమ్‌ రికార్డుకు వాటి ధరలు చేరుకున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.  

లాభాలు కళ్ల చూస్తున్న బడాబాబులు
బంగారం ధర పెరగడంతో బడా బాబులు లాభాలు కళ్ల జూస్తున్నారు. ధర పెరుగుతుందన్న ముందుచూపు­తో పలువురు మదుపరులు బంగారంపై పెట్టుబడులు పెట్టారు. వడ్డీ వ్యాపా­రం చేసే వారు కూడా బంగారంపై పెట్టుబడి పెట్టేందుకే మొగ్గు చూపారు. దీంతో 100 గ్రాముల వంతున బిస్కెట్లు కొన్నారు. మరికొందరు 50 నుంచి 70 కాసుల మధ్య వడ్డాణం వంటి వస్తువుల్ని తయారు చేయించుకున్నారు. ప్రస్తుతం ధర రూ.లక్ష దాటడంతో వీరందరిలో జోష్‌ నెలకొంది. పెట్టిన పెట్టుబడుల్లో 30 నుంచి 40 శాతం వరకు లాభాలను చూశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement