Teacher Transfer
-
బెడిసికొట్టిన టీచర్ల సర్దుబాటు
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖలో సర్దుబాటు పేరిట ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ బెడిసికొట్టింది. పాఠశాలలు తెరిచిన తర్వాత దాదాపు 2 నెలల పాటు కసరత్తు చేసి, ఒక యూనిట్ పరీక్షలు పూర్తయ్యాక ప్రారంభించిన బదిలీలు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. జిల్లా పరిషత్ ఉపాధ్యాయులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన నిబంధనలను మునిసిపల్, ఎయిడెడ్ స్కూళ్లలోనూ అమలు చేయడంతో అక్కడ ఒకటి, రెండు తరగతులకు బోధిస్తున్న జూనియర్ ఉపాధ్యాయులను పదో తరగతి సిలబస్ బోధించేందుకు బదిలీ చేయడం గమనార్హం.సర్దుబాటుకు ముందు ప్రాథమిక పాఠశాలల్లో సీనియర్లు, అర్హత గల ఉపాధ్యాయులను సబ్జెక్టు టీచర్లుగా నియమించడంతో గతేడాది పదో తరగతి ఫలితాల్లో 91 శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే, ఈ సర్దుబాటు ప్రక్రియతో ప్రస్తుతం హైస్కూళ్లలో బోధిస్తున్న సీనియర్ ఎస్జీటీలను తిరిగి ఎలిమెంటరీ స్కూళ్లకు పంపించి, వారి స్థానంలో ఎలిమెంటరీ స్కూళ్లలోని జూనియర్లను హైస్కూళ్లకు పంపించారు. సబ్జెక్టుపై అవగాహన లేనివారిని హైస్కూళ్లకు పంపడంతో పాటు కొన్ని సబ్జెక్టులకు అసలు టీచర్లనే నియమించలేదు. దీంతో ఉత్తమ ఫలితాల సాధన అటుంచి, విద్యార్థులను పాస్ కూడా చేయలేమని మునిసిపల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చేతులెత్తేస్తున్నారు. పదో తరగతి ఫలితాలపై తీవ్ర ప్రభావం ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ లేదా సబ్జెక్టు నిపుణుల కొరత ఉన్నప్పుడు గత ప్రభుత్వం అర్హతలున్న దాదాపు 8 వేల మంది ఎస్జీటీలను సీనియారిటీ ఆధారంగా సబ్జెక్టు టీచర్లు (స్కూల్ అసిస్టెంట్)గా పదోన్నతి కలి్పంచింది. విద్యా సంవత్సరం మధ్యలో ఎవరైనా స్కూల్ అసిస్టెంట్లు రిటైరైతే వారిస్థానంలో అర్హత గల సీనియర్ ఎస్జీటీని డిప్యుటేషన్‌పై నియమించింది. తద్వారా పదో తరగతిలో 91 శాతం ఉత్తీర్ణత సాధ్యమైంది. ప్రభుత్వంలోని అన్ని మేనేజ్మెంట్ స్కూళ్లకు ఇదే విధానం అనుసరించింది.మునిసిపల్ హైస్కూళ్లలో 8 ఏళ్లుగా పోస్టులను భర్తీ చేయకపోవడంతో దాదాపు 2,800 సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడింది. మునిసిపల్ ఉపాధ్యాయ సరీ్వస్ రూల్స్‌పై కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండటంతో సబ్జెక్టు టీచర్ల కొరతను తొలగించేందుకు ప్రాథమిక పాఠశాలల్లోని సీనియర్లు, సబ్జెక్టు నిపుణులను డిప్యుటేషన్‌పై నియమించి పదో తరగతి సిలబస్ బోధించేవారు. కానీ.. ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన “సర్దుబాటు’ ప్రక్రియలో నిబంధనల ప్రకారం విద్యారి్థ, ఉపాధ్యాయ నిష్పత్తి ఆధారంగా అత్యంత జూనియర్ టీచర్లను మిగులుగా చూపి బదిలీ చేశారు. ఇదే నిబంధనను మునిసిపల్ స్కూళ్లకు వర్తింపజేయడంతో ప్రాథమిక పాఠశాలల్లో మిగులు ఉపాధ్యాయుల్లో అత్యంత జూనియర్‌ను హైస్కూళ్లలో సర్దుబాటు చేసి, ప్రస్తుతం ఇక్కడ డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న సీనియర్లను ఎలిమెంటరీ స్కూళ్లకు పంపించారు. మరోపక్క హిందీ, ఇంగ్లిష్ ఉపాధ్యాయుల కొరత ఉండటంతో ఈ ప్రభావం ఈ ఏడాది పదో తరగతి ఫలితాలపై తీవ్రంగా చూపనుంది. -
తగ్గేదే లే! టీచర్ల బదిలీలు, పదోన్నతులపై ముందుకే...
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీల విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గకూడదని విద్యాశాఖ తీర్మానించుకుంది. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో పాఠశాల విద్య కమిషనర్ దేవసేన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా పదోన్నతులు, బదిలీలు చేపట్టకపోవడంతో విద్యాశాఖ నిస్తేజంగా ఉందని ఆమె అనేక సందర్భాల్లో ఉపాధ్యాయ సంఘాల వద్ద అభిప్రాయపడ్డారు. తాజాగా హైకోర్టు డివిజన్ బెంచ్ వద్ద ఈ కేసు విచారణకు రాగా, బదిలీలు, పదోన్నతులపై న్యాయస్థానం అధికారుల తీరును ప్రశ్నించింది. దీంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడుతుందని ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ మొదలైంది. కోర్టు పరిణామాల తర్వాత పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉన్నతాధికారులను కలుస్తున్నారు. దీనిపై పాఠశాల విద్య కమిషనర్ ఓపికగా వారిలో మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు హైకోర్టు అభ్యంతరాలపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు తెలిసింది. ఇప్పటికే మల్టీజోన్–1 పరిధిలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు పూర్తయ్యాయి. మల్టీజోన్–2 పరిధిలో ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అనేక మంది టీచర్లు బదిలీలు, పదోన్నతులు పొందారు. ప్రక్రియను నిలిపివేస్తే ఈ విద్యా సంవత్సరంలో బోధన సాగడం కష్టమని అధికారులు సీఎంకు పంపిన నివేదికలో పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. అంతా పకడ్బందీగానే.. టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల పేరెత్తితే తరచూ కోర్టు వివాదాలు వెంటాడుతుంటాయి. 2023లోనూ విద్యాశాఖ ఇలాంటి అనుభవాలే చూసింది. స్పౌజ్‌లు, పండిట్లు, పీఈటీలు, సీనియారిటీ వ్యవహారం అనేక చిక్కుముడులు వెంటాడాయి. దీంతో గత ఏడాది షెడ్యూల్ ఇచ్చినా ముందుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యాశాఖపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈసారి పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని అధికారులు నిర్ణయించారు. టెట్ అర్హత ఉన్న టీచర్లకు మాత్రమే పదోన్నతి కల్పించాలన్న కేంద్ర నిబంధనలపై గత ఏడాది కొంతమంది కోర్టుకెళ్లారు. దీంతో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయింది. ఈసారి ఇలాంటి చిక్కులు తలెత్తకుండా అధికారులు ముందే న్యాయ సలహాలు తీసుకున్నారు. ఏయే అంశాలపై ఇబ్బందులు వచ్చే వీలుందని, వాటిని ఎలా ఎదుర్కొనాలనే విషయాలపై దేవసేన కసరత్తు చేశారు. అయినప్పటికీ టెట్ అర్హతపై సింగిల్ జడ్జి తీర్పు, డివిజన్ బెంచ్‌కు వెళ్లడం, అక్కడ పాఠశాల విద్య కమిషనర్ సమాధానం చెప్పాల్సి రావడంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన నెలకొంది. అయితే, డివిజన్ బెంచ్ ఇప్పటివరకూ ప్రక్రియను నిలిపివేయాలని ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని అంటున్నారు. దీంతో అనుకున్న ప్రకారం ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. నేటి నుంచి మల్టీ జోన్–2లో... మల్టీజోన్–1 పరిధిలో 10వేల మంది టీచర్లకు పదోన్నతులు దక్కాయి. ఎస్జీటీలు, పీఈటీలు, భాషా పండితులు దాదాపు 10 వేల మంది బదిలీ అయ్యారు. కొన్నిచోట్ల ఎస్జీటీల బదిలీ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. వీటిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు గురువారం నుంచి మల్టీజోన్–2 పరిధిలో బదిలీలు, పదోన్నతులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్‌తో కలుపుకొని మొత్తం 14 జిల్లాలు మల్టీజోన్–2 పరిధిలో ఉన్నాయి. ముందు స్కూల్ అసిస్టెంట్లకు బదిలీలు చేపట్టాక, ఎస్జీటీలకు పదోన్నతి కల్పిస్తారు. ఆ తర్వాత వీళ్లను బదిలీ చేస్తారు. ఈ జోన్ పరిధిలో 10 వేల మంది ప్రమోషన్లు పొందుతారు. ఇదేస్థాయిలో బదిలీలు కూడా జరుగుతాయి. అయితే, రంగారెడ్డి జిల్లా పరిధిలో ప్రక్రియపై కోర్టు వివాదం ఉండటంతో ప్రక్రియ ఆగిపోయింది. ఏదేమైనా కమిషనర్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో బదిలీలు, పదోన్నతులపై టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
నెల రోజుల్లోనే బదిలీలు, పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన అధికారిక కసరత్తు ఊపందుకుంది. విద్యాశాఖ మంత్రి నుంచి ఉన్నతాధికారుల వరకూ అధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ శుక్రవారం విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 3 నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టే వీలుంది. వెంట వెంటనే ఎడిట్ ఆప్షన్లు, జాబితాల తయారీ చేపట్టి, సెప్టెంబర్ నెలాఖరుకు ప్రక్రియను ముగించాలని భావిస్తున్నారు. కొన్నేళ్లుగా బదిలీలు, పదోన్నతులు లేకపోవడంతో టీచర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 లక్షల మంది టీచర్లుండగా ఎన్నికల సమయంలో వీరిని ఆకట్టుకోవడానికి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బదిలీలు, పదోన్నతుల ప్రక్రియనే ప్రధాన ఆయుధంగా ప్రభుత్వం భావిస్తోంది. డీఈవోలతో డైరెక్టర్ టెలీకాన్ఫరెన్స్ జిల్లా విద్యాశాఖాధికారులతో పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన హైదరాబాద్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ సక్రమంగా చేపట్టేందుకు సన్నద్ధమవ్వాలని కోరారు. అవసరమైన సమాచారంతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. బదిలీలకు కటాఫ్ డేట్‌ను గతంలో ఫిబ్రవరి 1గా నిర్ణయించారని, ఇప్పుడు ఆ తేదీని సెప్టెంబర్ 1గా నిర్ణయించాలని భావిస్తున్నట్లు తెలిపారు. గతంలో బదిలీల కోసం దాదాపు 78 వేల దరఖాస్తులు అందాయి. ఇందులో 58 వేలు అర్హమైనవిగా గుర్తించారు. ఇప్పుడీ సంఖ్య మరింత పెరిగే వీలుందని భావిస్తున్నారు. టీచర్లు 8 ఏళ్ళు, ప్రధానోపాధ్యాయులు 5 ఏళ్ళు ఒకే చోట పనిచేసినట్లయితే బదిలీకి అర్హులవుతారు. కటాఫ్ తేదీని పొడిగించడంతో సెప్టెంబర్ 1 నాటికి 8, 5 ఏళ్ళు నిండే వాళ్ళ జాబితాను కొత్తగా రూపొందించాల్సి ఉంటుంది. గతంలో దరఖాస్తు చేసిన టీచర్లు సర్వీస్ కాలాన్ని ఆన్లైన్లో పొందు పర్చడమా? డీఈవోలే ఈ డేటాను అప్డేట్ చేస్తారా? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ఖాళీల విషయంలో సమగ్ర వివరాలను మాత్రం డీఈవోలు అందించాల్సి ఉంటుంది. మూడేళ్లలో పదవీ విరమణ చేయనున్న టీచర్లకు బదిలీల నుంచి మినహాయింపు ఇస్తారు. కటాఫ్ తేదీ పొడిగించడంతో ఇప్పుడు ఖాళీల సంఖ్యలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది. చిక్కుముడిగా దివ్యాంగుల వ్యవహారం అంగ వైకల్యం ఉన్న వారికి బదిలీల్లో ప్రత్యేక ప్రాధాన్యమిస్తారు. గతంలో రూపొందించిన నిబంధనల ప్రకారం 70 శాతం అంగవైకల్యాన్ని పరిగణలోనికి తీసుకుంటారు. అయితే ఇటీవల న్యాయస్థానం ఈ వ్యవహారాన్ని తప్పుబట్టింది. 40 శాతం అంగవైకల్యాన్ని పరిగణలోనికి తీసుకోవాలని ఓ కేసులో తీర్పు ఇచి్చంది. దీంతో బదిలీల్లోనూ దీన్నే కొలమానంగా తీసుకోవాలని దివ్యాంగ ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సమగ్ర వివరాలు అందజేయాల్సిందిగా మంత్రి సబిత అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. 317 జీవో ద్వారా బదిలీ అయిన వారికి సర్వీస్ పాయింట్లలో అన్యాయం జరిగిందని, దీన్ని సరిచేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) నేతలు హన్మంతరావు, నవాత్ సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపకుండా ఏకపక్షంగా షెడ్యూల్ విడుదలకు అధికారులు సన్నాహాలు చేయడం అన్యాయమని టీఎస్పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్ అలీ విమర్శించారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో అన్ని స్థాయిల నేతల సలహాలు, సూచనలు తీసుకోవాలని పీఆర్టీయూటీఎస్ నేతలు శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు సూచించారు. సంఘాల హల్చల్ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మొదలవ్వడంతో ఉపాధ్యాయ సంఘాల నేతలు అధికారులను, మంత్రి సబితను కలుస్తున్నారు. పలు సలహాలు సూచనలతో వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. సప్టెంబర్ 1ని కటాఫ్‌గా నిర్ణయించాలని కోరుతూ ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ మంత్రి సబితకు వినతి పత్రం సమర్పించారు. ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్ళాలని టీఎస్‌యూటీఎఫ్ నేతలు జంగయ్య, చావా రవి అధికారులను కోరారు. ఇది కూడా చదవండి: సాగు పరిశోధనలో అమెరికా సహకారం కావాలి.. మంత్రి నిరంజన్ రెడ్డి -
ఉపాధ్యాయ బదిలీలు.. తొలగని నీలినీడలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ఉపాధ్యాయవర్గాల్లో ఆందోళన నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం జనవరి ప్రారంభంలో బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించి దరఖాస్తులు సైతం స్వీకరించింది. బదిలీల్లో స్పౌజ్ కేసులు ఉన్న వారికి పాయింట్లు ఎక్కువ ఇవ్వడంతో నాన్ స్పౌజ్ వారు అన్యాయం జరుగుతోందని కోర్టును ఆశ్రయించడంతో ప్రక్రియ నిలిచిపోయింది. వేసవి సెలవుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ ఏడాది చివర్లో ఎన్నికలు ఉన్నందున ఇప్పడు చేపట్టకపోతే మరో ఏడాది పాటు వేచి ఉండాల్సి వస్తోందన్న వాదనలున్నాయి. అయిదేళ్ల కిందట ప్రభుత్వం ఉమ్మడి జిల్లా ప్రతిపాదికన బదిలీలు చేపట్టింది. గతేడాది జిల్లాల వారీగా కేడర్ విభజన చేశారు. వీటితో పాటు పండిట్, పీఈటీల సమస్యలు, 317 అన్యాయం జరిగిన వారు, స్పౌజ్ కేసుల సమస్యలు కూడా అలాగే ఉన్నాయి. అక్రమ బదిలీలు.. ఈ ఏడాది జనవరిలో బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే కొందరు ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయిలో పైరవీలు చేసి నేరుగా సచివాలయం నుంచి బదిలీ ఆర్డర్లు తీసుకొచ్చి జిల్లాలోని మంచి స్థానాలను ఎంచుకున్నారు. ఇలాంటి పైరవీలు ఎక్కువగా నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జరిగాయి. ఉమ్మడి జిల్లాలో 60కి పైగా అక్రమ బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఎక్కువ సర్వీస్, ఆరోగ్య సమస్యలు, దివ్యాంగులకు అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. వీటిని రద్దు చేయాలన్న వాదలు వినిపిస్తున్నాయి. ఖాళీలతో సమస్యలు.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో ఒకసారి పదోన్నతులు చేపట్టారు. పదోన్నతులు చేపట్టి చాలాకాలం కావడంతో వివిధ స్థాయిల్లో పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 13 వేల మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తుండగా.. 2,032 ఎస్టీటీ, ఎస్ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 630 ఎస్ఏ పోస్టుల్లో 350 పదోన్నతుల ద్వారా భర్తీ చేసి మిగతావి డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక 68 మండలాలకు ఎంఈఓలను సీనియర్ జీహెచ్‌ఎంల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఏడుగురు ఎంఈఓలు విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే డైట్, బీఈడీ కళాశాలల్లో కూడా సీనియర్ స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు ఇవ్వాల్సి ఉంది. కానీ వాటిని కూడా భర్తీ చేయడం లేదని తెలుస్తోంది. విద్యావ్యవస్థపై ప్రతికూల ప్రభావం.. ప్రభుత్వం వెంటనే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలి. కొంతకాలంగా ఈ ప్రక్రియ చేపట్టకపోవడంతో విద్యావ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. కోర్టు కేసులు ఉన్నందున ప్రమోషన్లు అడహక్ పద్ధతిలో ఇవ్వాలి. కోర్టుకేసుల తర్వాత సీనియర్లకు న్యాయం జరుగుంది. – సునీల్, జిల్లా అధ్యక్షుడు, తపస్ వేసవిలోగా చేపట్టాలి.. 8 ఏళుల్గా పదోన్నతులు.. అయిదేళ్లుగా బదిలీలు లేవు. ప్రమోషన్లు లేకపోవడంతో ఏ క్యాడర్ వారు ఆ క్యాడర్లోనే ఉద్యోగ విరమణ పొందే అవకాశం ఉంది. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మధ్యలో నిలిచిపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. సంవత్సరం చివర్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున వెంటనే షెడ్యూల్ ఇవ్వాలి. – కృష్ణుడు, రాష్ట్ర అధ్యక్షుడు, బీసీ ఉపాధ్యాయ సంఘం -
‘ప్లీజ్ సార్.. మీరు వెళ్లొద్దు’
సాక్షి, బెంగళూరు : అక్షరాభ్యాసం నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు పాఠం చెప్పిన ప్రతి ఒక్కరూ మనకు గురువులే. పోటీ ప్రపచంలో ఉన్నస్థానానికి ఎదగాలంటే మన వెన్నంటి ఉండి తీర్చిదిద్ది ఉత్తమ పౌరునిగా ఎదగడానికి దోహదపడే శక్తియుక్తుల్ని నేర్పేవారే ఆచార్యులు. అటువంటి గురువు మరోచోటకి బదిలీపై వెళ్తుండటంపై అక్కడి విద్యార్థులు వెళ్లొద్దంటూ రోదించిన ఘటన ఇటీవల చిక్కమగళూరు కైమార ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాలు... కైమార పాఠశాలలో దుర్గేశ్ అనే ఉపాధ్యాయుడు 12 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. పాఠశాలలో దుర్గేశ్ సార్ అంటే ప్రతి ఒక్క విద్యార్థికి అభిమానం. వ్యక్తిగత శ్రద్ద, పాఠశాల అభివృద్ధి తదితర విషయాలు విద్యార్థులు, దుర్గేశ్ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఈ క్రమంలో శనివారం దుర్గేశ్‌ను మరో చోటకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు బోరుమంటూ రోదించారు. మిమ్మల్ని వెళ్లనీయమని ఆయనను అడ్డుకుంటూ ప్రతి ఒక్క విద్యార్థి రోదించారు. అవసరమైతే బీఈఓతోనే మాట్లాడుతామని, మీరు ఇక్కడే ఉండాల్సిందేనని పట్టుబట్టారు. వారి అభిమానం చూసి దుర్గేశ్ సైతం కళ్లనీరు పెట్టుకున్నారు. బదిలీ విషయం గోప్యంగా దాచినా ఉపాధ్యాయుడి బదిలీ విషయం గోప్యంగా ఉంచినా ఎలాగో విషయం తెలుసుకున్న విద్యార్థులు దుర్గేశ్‌ను చుట్టుముట్టి కన్నీరు మున్నీరయ్యారు. సార్ వెళ్లొద్దంటూ అంటూ విన్నవించారు. విద్యార్థులు చూపుతున్న అభిమానం చూసి ఉపాధ్యాయుడు సైతం తీవ్రంగా రోదించారు. ఈ దృశ్యాన్ని చూసిన సహచర ఉపాధ్యాయులు కూడా కంటనీరు పెట్టుకున్నారు. -
మమ్ముల్ని విడిచి వెళ్లొద్దు సారూ..
తలమడుగు: ‘ప్లీస్ సార్.. మమ్ముల్ని విడిచి వెళ్లొ ద్దు సారూ..’ అంటూ విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. విద్యార్థులు తనపట్ల చూపిస్తున్న అభిమానానికి భావోద్వేగంతో ఆ ఉపాధ్యాయుడి కళ్లూ చెమ్మగిల్లాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ పాఠశాలలో ఉపాధ్యాయుడు శ్రీకాంత్ ఆరేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. తన ఏకైక కుమార్తె లహస్యను తాను పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలోనే ఐదో తరగతి వరకు చదివించారు. ప్రస్తుతం ఆరో తరగతి కూడా పక్కనే ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిస్తున్నారు. అలాగే శ్రీకాంత్ బోధనలోనూ ఆందరికి అదర్శంగా నిలిచారు. తరగతి పేపర్ల మూల్యాంకనానికి వచ్చే డబ్బులను విద్యార్థులకు, పాఠశాల అభివృద్ధికి ఖర్చు పెట్టారు. తన సొంత డబ్బుతో పేద విద్యార్థులకు బూట్లు, నోట్‌బుక్స్ అందించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి తన వంతు కృషి చేశారు. తాజా బదిలీల్లో ఆయన భీంపూర్ మండలం అంతార్గావ్ పాఠశాలకు బదిలీ అయ్యారు. గురువారం పాఠశాల నుంచి వెళ్తుండగా విద్యార్థులు, గ్రామస్తులు అడ్డుకుని, తమను విడిచి వెళ్లవద్దని వేడుకున్నారు. ఉద్యోగులకు బదిలీ సహజమేనని, మిమ్మల్ని వీడి వెళ్తున్నందుకు తనకూ బాధగా ఉందని పేర్కొనడంతో విద్యార్థులు కంటతడి పెట్టుకోవడం కనిపించింది. మా ఉపాధ్యాయులు మాకు కావాలి జన్నారం(ఖానాపూర్): ‘ఇన్ని రోజులు మాకు చక్కగా చదువు చెప్పిన సార్లను బదిలీ చేశారు. మా ఉపాధ్యాయులను బదిలీ రద్దు చేసి ఇక్కడే కొనసాగించాల’ని కోరుతూ విద్యార్థులు ఏకంగా రోడ్డెక్కి రాస్తారోకో చేశారు. మంచిర్యాల జి ల్లా ఇందన్పల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజునాయక్, తెలుగు ఉపాధ్యాయుడు సుభాష్ ఇటీవల బదిలీ అయ్యారు. మా యోగక్షేమాలు చూసుకోవడమే కాకుండా మం చిగా చదువు నేర్పించిన ఉపాధ్యాయులను బది లీ చేయొద్దని కోరుతూ ప్రధాన రహదారిపై గం టసేపు రాస్తారోకో చేశారు. డీఈవో స్పందించి తమకు న్యాయం చేయాలని విద్యార్థులు కోరారు. మిగతా ఉపాధ్యాయులు వారికి నచ్చజెప్పి ఈ విషయాన్ని డీఈవో దృష్టికి తీసుకెళ్తామని తెలపడంతో రాస్తారోకో విరమించారు. -
మేడమ్.. మాతోనే ఉండాలి
కేసముద్రం(మహబూబాబాద్): ‘మేడమ్ మీరు ఎక్కడికీ పోవద్దు.. మాతోనే ఉండాలి.. మీరే మాకు పాఠాలు చెప్పాలి.. మీరులేని ఈ బడికి మేము రాం’ అంటూ బదిలీపై వెళ్తున్న టీచర్‌ను పట్టుకుని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటన మహబూబా బాద్ జిల్లా కేసముద్రం మండలం అన్నారం గ్రా మంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం జరిగింది. ఈ పాఠశాలలో 54 మంది విద్యార్థులు చదువుతున్నారు. హెచ్ఎం జిలుకర శ్రీనివాస్‌తో పాటు టీచర్లు తేలుకుంట్ల సునీత, శ్రీను, శారద, అనురాధ, ఆరీఫ్, సూర్యప్రకాశ్ పనిచేస్తున్నారు. వీరిలో ఒక్క టీచర్ మినహా అందరూ బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎనిమిదేళ్లుకు పైగా ఇక్కడ పనిచేస్తున్న సునీత టీచర్ నిబంధన ల ప్రకారం బదిలీపై వెళ్లాల్సి ఉంది. అయితే ఎనిమిదేళ్లకు పైగా పాఠశాలలో పనిచేస్తున్న ఆమె పిల్లలు, వారి తల్లిదండ్రులతో ఆప్యాయంగా మెదులుతూ ఉన్నారు. పిల్లలు బడికి రాకుండా మారాంచేస్తుంటే వారి ఇళ్లకు వెళ్లి నచ్చచెప్పి తీసుకువచ్చేది. బడిలో విద్యాబుద్ధులు నేర్పుతూ, మధ్యాహ్న భోజనం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిండంతోపాటు రోజూ ఒక రూపాయి చొప్పు న పొదుపు చేయడం నేర్పి నెలకు జమైన డబ్బులతో విద్యార్థులకు నోట్‌పుస్తకాలు, పెన్నులను కొనిస్తుండేవారు. ఇలా పిల్లలతో మమేకమయ్యా రు. ఈ క్రమంలో మేడమ్ బదిలీ అవుతుందనే విషయాన్ని తోటి ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకున్న పాఠశాల విద్యార్థులంతా ఆమె ఎక్కడుంటే అక్కడికి వెళ్లి మేడమ్ మీరు పోవద్దూ, మీరు వెళ్తే మేము బడికి రాలేమంటూ దుఃఖసాగరంలో మునిగిపోయారు. పిల్లలు తనపై పెంచుకున్న ప్రేమకు మేడమ్ కన్నీళ్లు పెట్టుకుంది. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారంతా బడికి చేరుకున్నారు. పిల్లలు టీచర్‌ను తలుచుకుంటూ రోదిస్తున్న తీరు చూసి తల్లిదండ్రులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. సునీత మేడమ్‌ను ఇక్కడే ఉంచాలంటూ విద్యార్థులందరూ నినాదాలు చేస్తూ పాఠశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అయితే విషయాన్ని గ్రామానికి చెందిన ఎంపీపీ కదిర రాధిక ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా నిబంధనల మేరకు ఎనిమిదేళ్లు పూర్తయ్యిందని, బదిలీ నిలిపివేయలేమని చెప్పినట్లు తెలిసింది. అయితే ఎక్కడైనా బడిలో పనిచేసిన ఉపాధ్యాయులు బదిలీపై వెళ్తే వారికి సన్మానం చేయడం, ఆరోజు వరకు తమ బాధను వెళ్లగక్కడం సహజం గా చూస్తుంటాం. అయితే ఒక ఉపాధ్యాయురాలి కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకోవడం వారి మధ్య ఉన్న అనుబంధం గొప్పతనాన్ని గుర్తుచేసింది. -
సీఎంగారి భార్య సంగతేంటి?
తనకు న్యాయం చేయాలంటూ అడిగిన ఓ ఉపాధ్యాయురాలిపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర రావత్ ఆగ్రహం వెల్లగక్కారు. మీడియా ముఖంగానే ఆమెపై అరిచి.. సస్పెండ్, అరెస్ట్‌కు ఆదేశాలిచ్చారు. సోషల్ మీడియా, జాతీయ ఛానెళ్లలో వీడియో వైరల్ కావటంతో తీవ్ర దుమారం రేగింది. అయితే ఆర్టీఐ చట్టం ద్వారా ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వెలుగు చూసింది. డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర రావత్ భార్య సునీత రావత్ ప్రైమరీ స్కూల్ టీచర్‌గా పని చేశారు. 1992లో పౌదీ గద్వాల్లో ఆమె తొలుత బాధ్యతలు చేపట్టారు. అయితే నాలుగేళ్లకే ఆమెను డెహ్రూడూన్‌కు బదిలీ చేశారు. ఆపై 22 ఏళ్లు ఆమె అక్కడే విధులు నిర్వహించారు. పైగా 2008లో ప్రమోషన్ కూడా దక్కింది. ఓ సామాజిక వేత్త చొరవతో ఆర్టీఐ యాక్ట్ ద్వారా విషయం వెలుగు చూసింది. ఇక సీఎం ఎదుట నిరసన వ్యక్తం చేసిన ఉత్తర బహుగుణ(57) విషయానికొస్తే ఉత్తర కాశీలో 25 ఏళ్లుగా ఆమె టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2015లో భర్త చనిపోవటంతో పిల్లలు దగ్గర ఉండేందుకు డెహ్రాడూన్‌కు బదిలీ చేయాలని ఆమె గత కొన్నేళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ, అధికారులు మాత్రం స్పందించటం లేదు. పైగా ఆమె వంతు వచ్చేందుకు ఇంకా చాలా సమయం ఉందంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో విసిగిపోయిన ఆ పెద్దావిడ ఆ విషయాన్ని ముఖ్యమంత్రికి జనతా దర్బార్‌కు వచ్చింది. అయితే సాయం చేయాల్సిన ముఖ్యమంత్రి కాస్తా ఆ మహిళ మీద కోపంతో విరుచుకుపడ్డారు. దాంతో బహుగుణ ముఖ్యమంత్రిని తిడుతూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ‘సీఎం ముఖ్యమైన సమావేశంలో ఉన్నప్పుడు అంతరాయం కల్గించిందనే నేరం’ కింద పోలీసులు బహుగుణను అరెస్ట్ చేసి, ఆపై బెయిల్ మీద ఆమెను విడుదల చేశారు. అనంతరం మీడియాతో ఆమె తన గోడును వెల్లగక్కారు. ‘న్యాయం చేయమని నేను అక్కడికి వెళ్లాను. నాపై అరిచి ఆధిపత్యం ప్రదర్శించారు. అందుకే బదులుగా నేను అరిచాను. కానీ, కానీ, ఆయన నాపై దొంగ అనే నింద వేశారు. అది మాత్రం తట్టుకోలేకపోయా’ అంటూ బహుగుణ విలపించారు. బహుగుణ వీడియో.. ఆపై ప్రస్తుతం సునీత రావత్ బదిలీ వ్యవహారం వెలుగు చూడటంతో పలువురు సీఎం రావత్ తీరును ఎండగడుతున్నారు. -
అన్ని ప్రాంతాలు ఒక్కటే
సాక్షి, హైదరాబాద్: ఏజెన్సీ పాఠశాలల్లో పనిచేసేం దుకు మైదాన, ఏజెన్సీ ప్రాంతాల టీచర్లు ఒప్పుకున్న తర్వాతే ఏజెన్సీల్లోని ఉపాధ్యాయులను బదిలీ చేస్తామని హైకోర్టుకు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ రెండు ప్రాంతాల టీచర్లను ఏ ప్రాంతానికైనా బదిలీ చేసేందుకు ప్రభుత్వానికి అభ్యంతరం లేదని తెలిపింది. దీంతో కౌన్సెలింగ్ కొనసాగింపునకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉమాదేవిల ధర్మాసనం అనుమతిచ్చింది. గిరిజన, మైదాన ప్రాంతాల్లో పని చేసే టీచర్లు ఎక్కడివారక్కడే పనిచేసేలా ఉన్న నిబంధనను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను మంగళవారం ధర్మాసనం విచారించింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. గిరిజన ప్రాంతంలో టీచర్ల హాజరు తక్కువగా ఉందని, విద్యార్థుల ఉత్తీర్ణత 10% లోపే ఉందన్నారు. ఆయా ప్రాంతాల్లోని టీచర్లను బదిలీ చేసేందుకు ప్రభుత్వానికి అభ్యంతరం లేదన్నారు. ఇతర వ్యాజ్యాలపై నేడు విచారణ ఉపాధ్యాయ బదిలీ నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణను ధర్మాసనం బుధ వారానికి వాయిదా వేసింది. కొత్త జిల్లాల ప్రకారం బదిలీలు చేపట్టాలని, కొత్త జిల్లాలకు విద్యాధికారులు లేకుండా బదిలీ చేయాలనడం చెల్లదంటూ దాఖలైన పరస్పర విరుద్ధ వ్యాజ్యాలపై ఈ నెల 26లోగా నిర్ణయం వెల్లడిస్తామని ప్రకటించింది. -
సమయపాలన తూచ్
►సీఎస్ఈ ఆకస్మిక నిర్ణయాలతో తప్పని అగచాట్లు ►వివాదాస్పదంగా మారిన స్పౌజ్ బదిలీ ►ఫిర్యాదు చేసిన ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘుబాబు ►రాత్రిపూటా తప్పని కౌన్సెలింగ్ వెతలు ఒంగోలు: ఉపాధ్యాయుల బదిలీల్లో సమయపాలనే లేదు. బదిలీ, రేషనలైజేషన్ షెడ్యూల్ విడుదల చేసిన అనంతరం అనేక సవరణలు, జీఓలు ఇస్తూ బదిలీ ప్రక్రియే గందరగోళంగా మారింది. పాఠశాల విద్యాశాఖ తాజా నిర్ణయాలు సైతం ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయి. రాత్రిపూట కౌన్సెలింగ్ నిర్వహించడం ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తిని నింపింది. మంగళవారం మొత్తం మూడు సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులను కౌన్సెలింగ్‌కు పిలిచారు. వారిలో మళ్లీ ప్రభుత్వ పాఠశాలలు, స్థానిక సంస్థల పాఠశాలలు అంటూ విడివిడిగా ఉపా«ధ్యాయులకు కౌన్సెలింగ్ ఉంటుంది. దీని ప్రకారం ప్రతి యాజమాన్య పరిధిలోని స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్, స్కూల్ అసిస్టెంట్ గణితం, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రకటించారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లం 34, గణితం 23, ఫిజికల్ డైరెక్టర్లు 17 స్థానాలు క్లియర్ వేకెన్సీలుగా చూపించారు. దీనికిగాను ఆంగ్లం 43, గణితం 38, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు 10 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలకు సంబంధించి ఆంగ్లం 410, గణితం 509, ఫిజికల్ డైరెక్టర్ 100 పోస్టులు ఖాళీగా ఉండగా వాటికి ఆంగ్లం 483, గణితం 632, ఫిజికల్ డైరెక్టర్ 50 మంది ఉపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ యాజమాన్య పరిధిలో 165 మంది, జిల్లా ప్రజాపరిషత్ యాజమాన్య పరిధిలో 2184 మంది వెరసి మొత్తంగా మంగళవారం బదిలీలకు దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 2349 మంది. ఆలస్యంగా ప్రారంభమైన కౌన్సెలింగ్ విద్యాశాఖ ప్రాథమికంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరాన్ని రెండు భాగాలుగా విభజించి వీఐపీ రెస్ట్ రూములో, సమావేశమందిరంలో రెండు చోట్ల కౌన్సెలింగ్ ప్రక్రియ ఏకకాలంలో ప్రారంభించారు. దీంతో ప్రక్రియ వేగం పుంజుకుంటుందని అందరు భావించినా సీఎస్ఈ నుంచి అనుమతి రావడం, ఆ తరువాత స్థానికంగా ఏర్పడిన సర్వర్ సమస్యలు వెరసి ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రక్రియ 12.30 గంటలకు ప్రారంభమైంది. కేవలం జిల్లా ప్రజాపరిషత్ ఆంగ్లం కౌన్సెలింగ్ సాయంత్రం 6 గంటల సమయానికి మరో 100 మందికి పైగా ఉపాధ్యాయులు కౌన్సెలింగ్ జాబితాలో ఉండడం గమనార్హం. రెండో కౌన్సెలింగ్ సెక్షన్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావడంతో అక్కడ జెడ్పీ పాఠశాలలకు సంబం«ధించి ఫిజికల్ డైరెక్టర్ల కౌన్సెలింగ్ కూడా ముగించారు. అయితే ఈ క్రమంలో ఫిజికల్ డైరెక్టర్లకు సంబంధించిన అడ్‌హక్ ప్రక్రియను మాత్రం చివర్లో నిర్వహిద్దామంటూ సెక్షన్లో ఆంగ్లంకు సమాంతరంగా జెడ్పీ లెక్కలు కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. దీంతో లెక్కలు, ఫిజికల్ డైరెక్టర్ల మొత్తం ప్రక్రియ పూర్తిచేసేందుకే విద్యాశాఖ నిర్ణయం తీసుకోవడంతో రాత్రిపూట అగచాట్లకు తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉపాధ్యాయుల ఆందోళన ఇలా ఇదిలా ఉంటే మంగళవారం భారీగా ఉపాధ్యాయులు హాజరుకావడంతో కనీసం ఆరుబయట కూర్చునేందుకు కుర్చీలు లేని పరిస్థితి. ఇక టెంట్లు కూడా చాలకపోవడంతో మధ్యాహ్నం పూట ఇబ్బందులు తప్పలేదు. సమావేశ మందిరంలో 200 మంది వరకు కూర్చునేందుకు అవకాశం ఉందని, కనీసం వంద మంది చొప్పున కౌన్సెలింగ్‌కు పిలిచినా కనీసం వారన్నా నీడపట్టున ఉండే అవకాశం ఉందని, అలా కాకుండా కేవలం అయిదుగురు చొప్పున మాత్రమే పిలవడంతో ఇబ్బందులు తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ప్రతి మండలానికి కనీసం రెండు చొప్పున వేకెన్సీలను బ్లాక్‌చేశారు. ఇది సీఎస్ఈ నిర్ణయం ప్రకారమే జరిగినప్పటికి బ్లాక్ చేసిన పోస్టుల వివరాలను వెల్లడించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమైంది. వివాదాస్పదంగా మారిన బదిలీ నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో జి.వెంకట్రావు అనే ఉపాధ్యాయుడు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్‌గా పనిచేస్తున్నారు. ఆయన స్పౌజ్ పాయింట్లు కోరుకున్నారు. అయితే ఆయన సతీమణి సంతనూతలపాడు మండలంలోని గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నారు. అయితే ఈయన తన భార్యకు కూడా 8 సంవత్సరాల పీరియడ్ పూర్తయిందని, కనుక తాను జిల్లాలో ఎక్కడైనా కోరుకోవచ్చని పేర్కొంటూ నాగులుప్పలపాడు జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలను ఎంపిక చేసుకున్నారు. దీంతో అతనికి ఆ స్థానాన్ని ఎలాట్ కూడా చేశారు. ఈ విషయం తెలియడంతో ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పౌజ్ పాయింట్లు వాడుకున్న వెంకట్రావు సతీమణికి 8 సంవత్సరాల సర్వీసు పూర్తయినా ఆమె పనిచేసేది జిల్లా విద్యాశాఖ పరిధికాదని, కనుక ఆ సర్వీసు ఎలా పరిగణనలోనికి తీసుకుంటారని జిల్లా పరిషత్ చైర్మన్‌ను ప్రశ్నించారు. అంతే కాకుండా ఆమెకు బదిలీ 8 సంవత్సరాలకే నిర్వహించాలనే నిబంధన కూడా లేదని, ఈ నేపథ్యంలో స్పౌజ్ కేటగిరీలో కోరుకున్నపుడు స్పౌజ్‌కు సమీపంలోని పాఠశాలలో కాకుండా సుదూరంగా ఉన్న మండలంలో పాఠశాలను ఎంపికచేయడం ఏమిటని పేర్కొన్నారు. ఇది పూర్తిగా స్పౌజ్ నిబంధనలకు విరుద్ధం అంటూ వాదించారు. దీంతో ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడతామని జెడ్పీ చైర్మన్ , కౌన్సెలింగ్ కమిటీ చైర్మన్ పేర్కొన్నారు. అయితే తాను కౌన్సెలింగ్‌కు ముందే ఈ ప్రక్రియ జరగబోతుందని తన దృష్టికి రావడంతో జిల్లా విద్యాశాఖ అధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశామని పేర్కొనగా మరో ఫిర్యాదు తనకు ఇవ్వాలని జెడ్పీ చైర్మన్ సూచించారు. దీంతో ఆయన సూచన మేరకు మరో ఫిర్యాదును రాతపూర్వకంగా ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘుబాబు జడ్పీ చైర్మన్‌కు అందించారు. -
బదిలీలలు
►మారని విద్యాశాఖ వైఖరి ► ఉపాధ్యాయ బదిలీలకు నేడు ఆఖరు ►సవరణలతో గందరగోళం ► ఓపెన్‌కాని వెబ్సైట్ ►ఆందోళనలో ఉపాధ్యాయులు మదనపల్లె సిటీ : విద్యాశాఖ వైఖరి మారనంటోంది. ఒక్క బదిలీల్లోనే సవాలక్ష మార్పులు చేసి ఉపాధ్యాయులకు చుక్కలు చూపించడం షరామామూలైపోతోంది. రాష్ట్ర విద్యాశాఖ సంచాలకులు జీవో నెం.190ను గురువారం విడుదల చేశారు. ఇందులో బదిలీలకు సంబంధించి అనేక సవరణలు ఉన్నాయి. వీటిని సరిచేసుకునేందుకు ఉపాధ్యాయులు ముప్పుతిప్పలు పడాల్సి వస్తోంది. వెబ్సైట్ వెతలు బదిలీలకు సంబంధించిన విద్యాశాఖ వెబ్సైట్ ఓపెన్ కావడం లేదు. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 3 నుంచి 7 వరకు ఎన్టైటిల్మెంట్లో రీ జనరేషన్ చేసుకోవాలి. శుక్రవారంతో గడువు ముగియనుండడంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన మొదలైంది. జిల్లాలో 17 వేల మంది ఉ పాధ్యాయులు ఉండగా తప్పనిసరిగా ఆరు వేల మంది, రెండు విద్యా సంవత్సరాలు పూర్తిచేసుకున్నవారు మరో నాలుగు వేల మంది బదిలీలకు అర్హులు. బదిలీలకు సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంతో దాదాపు పదివేల మంది అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. బదిలీల్లో సవరణలు ఇవే ►2015 బదిలీల కౌన్సెలింగ్‌లో కోరుకొని రిలీవ్ కాని వారిని ఈ బదిలీల కౌన్సెలింగ్‌కు అనుమతిస్తారు ►ఒకడీఎస్సీలోఎస్జీటీగా.. మరో డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికైన వారికి ఎస్జీటీ సర్వీస్ పాయింట్లు ఇస్తారు ►వర్క్ ఎడ్జస్ట్మెంట్లో ఎస్ఎస్సీ డీల్ చేసిన వారికి కూడా పాయింట్లు వర్తిస్తాయి. ► బదిలీ ఉపాధ్యాయులకు వారి మొదటి నియామకపు తేదీ నుంచి సర్వీస్ పాయింట్లు ఇస్తారు ► ప్రిఫరెన్షియల్ కేటగిరి 8 అకడమిక్ సంవత్సరాలకు ఒకసారి ఉపయోగించుకోవచ్చు ►2015 బదిలీల్లో కోరుకొని ఇప్పుడు రేషనలైజేషన్ ఎఫెక్ట్ అయిన వారికి పూర్వపు స్టేషన్ పాయింట్లు ఇస్తారు ►సర్ప్లస్ టీచర్లను అవసరమున్న జిల్లా పరిషత్ స్కూళ్లలో సర్దుబాటు చేయవచ్చు. ►కౌన్సెలింగ్ హాలులోకి ఉపాధ్యాయ సంఘాలను అనుమతించాలి ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ హాలు లోకి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల ను అనుమతించాలి. కౌన్సెలింగ్‌లో ఎలాం టి అక్రమాలు జరగకుండా ఉండాలంటే ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు కూడాఉంటే నిజాయితీగా జరిగే అవకాశం ఉంది. –పి.ఢిల్లీప్రసాద్, ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నా చిత్తూరు ఎడ్యుకేషన్ : కలెక్టరేట్ ఎదుట టీచర్ల సమస్యలపై ధర్నా నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్‌నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. బదిలీల్లో సమస్యలు మున్సిపల్ టీచర్ల సమస్యల కోసం ధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
సందిగ్ధంలో టీచర్లు
♦ ఆ బదిలీ జీవోలు అమల్లో ఉన్నట్టా? లేనట్టా...? ♦ ఎటూ తేల్చక ఉపాధ్యాయుల సతమతం ♦ ఏడు వేల మందికి తప్పని నిరీక్షణ ♦ గురువుల చక్కర్లతో చదువులు గాలికి ♦ విద్యార్థుల భవిష్యత్తుపై పడనున్న ప్రభావం ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ మూడడుగులు ముందుకు.. ఆరడుగుల వెనక్కి.. అన్నట్టు మారింది. బదిలీలు... హేతుబద్ధీకణ... ఇలా నెలరోజులుగా రకరకాల జీవోలతో తంతు సాగుతూనే ఉంది. స్పష్టత తేని ప్రభుత్వ విధానాలవల్ల పిల్లల చదువు గాలికిపోతోంది. ఏ పాఠశాలలు విలీనమవుతాయి?... ఏ ఉపాధ్యాయులకు బదిలీలు తప్పనిసరి కానుంది?... అన్నది ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. సందట్లో సడేమియాలా... ఏకీకృతానికి కేంద్రం రాజముద్ర వేయడంతో అసలు బదిలీలకు మళ్లీ కొత్త ఉత్తర్వులు వస్తాయా... ఎన్నాళ్లలో వస్తాయన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేకుండా పోతోంది. విజయనగరం అర్బన్: ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ సందిగ్ధంలో ఉంది. చివరి సారిగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం రెండు రోజుల క్రితమే ఈ ప్రక్రియను ముగించేసి వాటిపై అభ్యంతరాలను కూడా ఇప్పటికే తీసుకోవాల్సి ఉంది. ఉపాధ్యాయుల సీనియార్టీ తుది జాబితాను సైతం ప్రకటించాలి. ఈ నెల 28, 29వ తేదీల్లో బదిలీలకు ఆప్షన్స్ ఇవ్వాలి. ఇటీవల మంత్రి గంటా ఇచ్చిన హామీతో ఆ జీవోలను సవరించాలి. కానీ ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీనివల్ల వాటి అమలు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేప«థ్యంలో బదిలీ షెడ్యూల్ ఆదేశాల జీవోలు అమలులో ఉన్నట్లో... లేన ట్లో కూడా తెలియడం లేదని ఉపాధ్యాయులు కలవరపడుతున్నారు. జిల్లాలో 3,334 పాఠశాలలున్నాయి. వీటిలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న 14,690 మంది ఉపాధ్యాయుల్లో సుమారు 7 వేల మంది బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు.రేషనలైజేషన్‌లో మిగులు పోస్టులుగా ఉన్న వారు, 8 సంవత్సరాల సర్వీసులు పూర్తిచేసుకున్నవారు తప్పనిసరిగా బదిలీ కావాలి. ఇలాంటి వారు రెండువేల మంది వరకు ఉన్నారు. వీరంతా బదిలీలతోనే సతమతం అవుతుంటే ఇక విద్యార్థుల చదువులు ఏరీతిన సాగుతా యన్నది వేరే చెప్పనవసరం లేదు. బదిలీల ప్రక్రియపై వెంటనే నిర్ణయం ప్రకటించని పక్షంలో ఈ విద్యాసంవత్సరం విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. దరఖాస్తులకు మళ్లీ అవకాశం...? వెబ్ కౌన్సెలింగ్ రద్దు, పాయింట్ల కేటాయింపులపై సవరణ తదితర అంశాలపై ఇటీవల చర్చల్లో మంత్రి గంటా సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో గతంలోని చివ రి జీఓలపై సవరణ మార్గదర్శకాలు ఇప్పటికే విడుదల చేయాలి. కానీ అవేవీ పట్టించుకోవడం లేదని, మంగళవారం ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులతో ముఖ్యమంత్రి నిర్వహించిన చర్చలనంతరం ఈ సవరణ మార్గదర్శకాలు విడుదల అయ్యే అవకాశం ఉందని ఉపా« ద్యాయవర్గాలు భావించాయి. ఈ దరిమిలా వెబ్‌కౌన్సెలింగ్‌పై అవగాహనలేమితో దరఖాస్తు చేసుకోలేని వారు, రెండు విద్యాసంవత్సరాల కనీస అర్హతగా సవరించడంతో వారు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా మళ్లీ అవకాశం ఉంటుందన్న ఆశాభావంతో కొందరు ఉన్నారు. చర్చల ఫలితంగా పాయింట్ల కేటాయింపుల్లో సవరణలు అనివార్యమైన కారణంగా ఆన్లైన్లోనే ఆ ప్రక్రియను(ఆప్డేట్ చేయాలని) చేపట్టాలని, పాయింట్లను సవరిస్తూ అందరికీ మళ్లీ దరఖాస్తు చేసుకోమంటే కష్టసాధ్యమవుతుందని మరికొందరు పేర్కొంటున్నారు. బదిలీల పేరుతే స్కూళ్లు ఎగ్గొడితే చర్యలు బదిలీల పేరుతో పాఠశాలకు ఎగనామం పెట్టివస్తే కచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. ఏ సమస్య ఉన్నా సంబంధిత ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓలకు ఇవ్వాలి. ఎవరైనా పాఠశాల వేళల్లో బయట కనిపిస్తే చర్యలు తప్పవు. ఉత్తర్వులు వచ్చే వరకు ఎక్కడి వారు అక్కడే విద్యార్థులకు పాఠాలు చెప్పాలి. బదిలీ సాకుగా చూపి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు. – ఎస్.అరుణకుమారి, డీఈఓ -
9 నుంచి టీచర్ల బదిలీ ప్రక్రియ ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియకు పాఠశాల విద్యాశాఖ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఉత్తర్వులు జారీచేశారు. బదిలీలకు ముందుగా చేపట్టిన స్కూళ్ల రేషన లైజేషన్ ప్రక్రియ ఈనెల 9వ తేదీతో ముగిస్తారు. అదే రోజు నుంచి బదిలీలకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తారు. రేషన లైజేషన్ అనంతరం మిగిలిన ఖాళీ పోస్టు లను జూన్ 11న వెల్లడిస్తారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం 8 ఏళ్లు ఒకేచోట పూర్తిచేసిన టీచర్లకు, 5 ఏళ్లు పూర్తిచేసిన హెడ్మాస్టర్లకు బదిలీ తప్పనిసరి. పదవీ విరమణకు రెండేళ్ల కాల పరిమితి ఉన్న వారిని బదిలీ నుంచి మినహాయిస్తారు. బాలికల హైస్కూళ్లలో మహిళా టీచర్లు, హెచ్ఎంలు అందుబాటులో లేని పక్షంలో మాత్రమే 50 ఏళ్లు పైబడిన పురుష టీచర్, హెచ్ఎంలను నియమిస్తారు. రేషనలైజేష న్ అనంతరం మిగిలిఉన్న టీచర్లను సర్దు బాటు చేసేందుకు తీసుకోవలసిన చర్య లపై కూడా జీవోలో పొందుపర్చారు. -
గురువుల పనితీరు బట్టే బదిలీలు
- ఐదేళ్లు మించితే తప్పనిసరి - అలసత్వానికి మైనస్ పాయింట్లు నెల్లూరు (టౌన్): ఉపాధ్యాయ బదిలీలపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. వేసవిలో బదిలీల ప్రక్రియను పూర్తి చేసి కొత్త విద్యాసంవత్సరంలో అడుగుపెట్టాలని భావిస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఒకే పాఠశాలలో ఐదేళ్లు పనిచేసిన ఉపాధ్యాయులు బదిలీ కావాల్సిందే. గతంలో ఈ నిబంధన ఎనిమిదేళ్లు ఉండేది. రెండేళ్ల సర్వీస్‌ను పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు బదిలీకి అర్హులు. ప్రస్తుతం ఉపాధ్యాయుల పనితీరును ప్రాతిపదికగా తీసుకొని బదిలీల ప్రక్రియను చేపట్టనున్నారు. విధుల్లో అలసత్వం, విద్యార్థుల ప్రగతిని ప్రాతిపదికగా తీసుకొని తగ్గింపు పాయింట్లను కేటాయించనున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రేషనలైజేషన్ అంశాన్ని మార్గదర్శకాల్లో పొందుపర్చారు. ఆన్లైన్ ద్వారా వెబ్ ఆప్షన్ల నమోదు విధానంగా బదిలీలు చేయనున్నారు. పనితీరుకు సూచికలు ► విద్యార్థుల నమోదు పెంపునకు రెండు మార్కులు, విద్యార్థుల హాజరు 95 శాతం కంటే ఎక్కువగా ఉంటే రెండు మార్కులు, 92 నుంచి 95 వరకు ఉంటే ఒక మార్కును ఇవ్వనున్నారు. ► ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థుల్లో నిలకడ నూరు శాతం ఉంటే రెండు మార్కులు, శ్లాస్, త్రీ ఆర్, ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షల్లో విద్యార్థుల ప్రగతి 80 శాతం కంటే ఎక్కువ ఉంటే మూడు మా ర్కులు, 70 నుంచి 80 శాతం ఉంటే రెండు మార్కులు, 50 నుంచి 70 శాతం ఉంటే ఒక మార్కును కేటాయించనున్నారు. ► పాఠశాలలో ఉత్తీర్ణత శాతం 95 శాతం నుంచి 100 ఉంటే మూడు మార్కులు, 90 నుంచి 95 ఉంటే రెండు మార్కులు, 85 నుంచి 90 ఉంటే ఒక మార్కును ఇవ్వాలని నిర్ణయించారు. ► విద్యార్థులు ప్రతిభ పురస్కారాలను పొందితే రెండు మార్కులు, విద్యార్థుల తల్లిదండ్రులు, కమిటీలతో 11 నెలల్లో పది సమావేశాలను నిర్వహిస్తే రెండు మార్కులు, ఆరు నుంచి 10 మధ్య నిర్వహిస్తే ఒక మార్కును ఇవ్వనున్నారు. ► పాఠశాలలో క్రీడా మైదానాన్ని వినియోగించి ఆటలు, క్రీడా సామగ్రి కొనుగోలు, తదితర అంశాలపై రెండు పాయింట్లు, ఆరోగ్య కార్డుల నిర్వహణకు రెండు పాయింట్లు, మధ్యాహ్న భోజన హాజరు 95 శాతం మించితే రెండు పాయింట్లు, బడికి రుణం తీర్చుకుందాం కార్యక్రమంలో భాగంగా పాఠశాల అభివృద్ధికి రూ.రెండు లక్షలకు మించి విరాళం ఉంటే రెండు పాయింట్లు, రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు ఒక పాయింట్‌ను కేటాయించనున్నారు. మైనస్ పాయింట్లు పాఠశాలల్లో విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే ఈ ఏడాది బదిలీల్లో కొన్ని పాయింట్లను నష్టపోవాల్సి వస్తుంది. పాఠశాలలో విధి నిర్వహణలో అలసత్వం, పాఠాలను సరైన సమయంలో పూర్తి చేయకపోవడం, క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడటం, రెండేళ్లకు మేజర్ పెనాల్టీ విధించి ఉంటే మూడు పాయింట్లు, మైనర్ పెనాల్టీకి రెండు పాయింట్లు, బోధిస్తున్న సబ్జెక్టుల్లో పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత 50 శాతం తక్కువగా ఉంటే ఐదు పాయింట్లు వేయనున్నారు. గతేడాది ఎస్ఏ – 3 పరీక్షలు, ఈ ఏడాది ఎఫ్ఏ, ఎస్ఏ, త్రీఆర్, శ్లాస్ పరీక్షల్లో డీ 1, డీ 2 గ్రేడ్ విద్యార్థులు 10 నుంచి 20 శాతం ఉంటే ఐదు పాయింట్లు, 26 నుంచి 50 శాతం ఉంటే మూడు పాయిం ట్లను నష్టపోవాల్సి ఉంటుంది. వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని రద్దు చేయాలి బదిలీలకు సంబంధించిన ఆన్లైన్ అమలు విధానంలో లోపాలు ఉన్నాయి. మార్కులు, సీనియార్టీ వరకు ఇబ్బంది లేదు. పాయింట్ల ఆధారంగా ప్రాధాన్యమిస్తే ఎక్కడ పోస్టింగ్ వస్తుందో తెలియదు. ప్రత్యక్ష కౌన్సెలింగ్ ద్వారా అయితే ఖాళీలు తెలుస్తాయి. - సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీటీఎఫ్ ప్రతిభ పాయింట్లను ఎత్తేయాలి ప్రతిభ ఆధారంగా పాయింట్ల విధానాన్ని ఎత్తేయాలి. దీని వల్ల ఉపాధ్యాయులు అడ్డదారులు తొక్కే ప్రమాదం ఉంది. నిజాయతీగా ఉన్నవారికి అన్యాయం జరుగుతుంది. కొత్తగా తెరపైకి తీసుకొచ్చిన మైనస్ పాయింట్లను రద్దు చేయాలి. స్పౌజ్ పాయింట్లను విడివిడిగా కేటాయించాలి. - నవకోటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ -
ఉపాధ్యాయ బదిలీలపై ఉత్కంఠ
ఉపాధ్యాయ బదిలీలపై ఉత్కంఠ నెలకొంది. దాదాపు అన్ని శాఖల్లో జూన్‌లోనే బదిలీలు చేపట్టారు. విద్యాశాఖలో మాత్రమే ఇప్పటివరకు బదిలీల ప్రక్రియ మొదలు కాలేదు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. అన్ని శాఖలతో పాటే బదిలీలు చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నాయి. జూలై చివరి వారంలో బదిలీల ప్రక్రియ మొదలు కావొచ్చని తెలుస్తోంది. పాఠశాలలు ప్రారంభం అయిన తరువాత బదిలీలు జరిగితే పిల్లల చదువులకు ఇబ్బందులు ఎదురవుతాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి జోక్యం చేసుకునే వరకు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బదిలీలపై నిర్లక్ష్యం వహించారనే విమర్శలున్నాయి. ‘మీ శాఖలో ఏం జరుగుతోంది’ అని చంద్రబాబు ప్రశ్నించడంతో బదిలీలపై కదలిక వచ్చిందని తెలిసింది. దీంతో హడావుడిగా జీవో నెం.63కి కొన్ని మార్పులు చేర్పులు చేసి బదిలీలపై ప్రతిపాదనలు పంపారని సమాచారం. చిత్తూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి గంటా శ్రీనివాసరావు విదేశీ పర్యటనలో ఉండడంతో ఉపాధ్యాయ బదిలీలపై సందిగ్ధత నెలకొంది. బదిలీలు ఉంటాయా.. ఉండవా.. తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవేళ బదిలీలు చేపట్టదలిస్తే.. ముఖ్యమంత్రి, మంత్రి పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత అనుమతులు తీసుకుని బదిలీలపై ఉత్తర్వులు వచ్చేసరికి నెల రోజులు గడుస్తాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇప్పటికే తమ పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించామని.. ఇప్పుడు బదిలీలు నిర్వహిస్తే తాము ఆర్థికంగా నష్టపోతామని చె బుతున్నారు. ఇళ్లకు దూరంగా ఉండాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. 45 రోజుల సెలవులను వృథా చేసి ఇప్పుడు ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రభుత్వం చెప్పడంపై మండిపడుతున్నారు. కీలక తరుణంలో విద్యాశాఖ కమిషనర్ సిసోడియాను బదిలీ చేయడం ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆయన స్థానంలో విద్యాశాఖపై ఏమాత్రం అవగాహన లేని ఆదిత్యనాథ్ గుప్తాను కమిషనర్‌గా, ఇండియన్ పోస్టల్ సర్వీస్‌కు చెందిన సంధ్యారాణిని, డెరైక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నియమించారంటున్నారు. ఈ గందరగోళంలోనే 45 రోజుల వేసవి సెలవులు వృథా అయ్యాయని చెబుతున్నారు. మంత్రికి సొంత వ్యాపారాలపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వ విద్యపై లేదని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. వృత్యంతర పనులు అప్పజె ప్పుతూ విలువైన సమయాన్ని వృథా చేయిస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. టీచర్ డేటా అప్లోడ్, ఆధార్ అనుసంధానం వంటి పనులకు రోజుకు కనీసం 3 గంటల సమయం పడుతోందని చెబుతున్నారు. ఈ పనుల వల్ల ఇప్పటివరకు పాఠాలు మొదలే పెట్టలేకపోతున్నామని వాపోతున్నారు. వృత్తేతర పనులను ఉపాధ్యాయులకు అప్పజెప్పడం వల్ల సమయానికి పాఠాలు పూర్తి చేయలేకపోతున్నామని అంటున్నారు. అమ్మో పాయింట్ల విధానం! పాయింట్ల విధానం అంటేనే ఉపాధ్యాయులు భయపడిపోతున్నారు. గత సంవత్సరం జరిగిన బదిలీల్లో పాయింట్ల విధానం అనుసరించడంతో అవకతవకలు జరిగాయని.. ఈ విధానంలో లోపాలు సరిదిద్దాలని డిమాండ్ చేస్తున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు, వ్యక్తిగతంగా స్కూల్‌కు మంచి పేరు తెచ్చిన వారికి అధిక పాయింట్లు కేటాయించాలని కోరుతున్నారు. బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించడం ఉపాధ్యాయుడిది ప్రాథమిక బాధ్యత అయినప్పటికీ.. ఎక్కువ మంది పిల్లలను బడిలో చేర్పించిన వారికి పాయింట్లు కేటాయించే విధానంలో మార్పులు చేస్తే ఉన్నతంగా ఉంటుందని చెబుతున్నారు. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేరు అని చెబుతాం కానీ.. కచ్చితంగా చేరు అని ఒత్తిడి చేయలేమని వారు వాపోతున్నారు. ఇప్పుడు బదిలీలా ? వేసవి సెలవులను వృథా చేసి విద్యా సంవత్సరంలో బదిలీలలు ప్రారంభించడం మంచి పద్ధతి కాదు. దీనివల్ల ఉపాధ్యాయ కుటుంబాలకు నష్టం జరుగుతుంది. పది నెలలు కాక మునుపే బదిలీలు చేపడుతున్నారు. మానసికంగా ఉపాధ్యాయులు బదిలీలను కోరుకోవడం లేదు. ట్రాన్స్ఫర్లు చేయాలనుకుంటే వేసవి సెలవుల్లోనే నిర్వహించి ఉండాల్సింది. - రెడ్డి శేఖర్ రెడ్డి, వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర అసోసియేషన్.. చిత్తూరు గందరగోళంపై స్పష్టత ఇవ్వాలి వేసవి సెలవుల్లోనే బదిలీలు, పదోన్నతులు, రేషనలైజేషన్ వంటి పనులను పూర్తిచేసి ఉండాల్సింది. పాఠశాలలు ప్రారంభం అయిన వెంటే బోధనలో నిమగ్నం అయ్యే వాతావరణాన్ని కల్పించాలని పలుసార్లు విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులను కోరినా ఫలితం లేకుండా పోయింది. గతంలో బదిలీ ఉత్తర్వులు పొందిన టీచర్లే ఇంకా రిలీవ్ కాని దుస్థితి నెలకొంది. కావున విద్యా సంవత్సరం ప్రారంభం అయిన నేపథ్యంలో బదిలీలు, రేషనలైజేషన్‌కు సంబంధించి స్పష్టత ఇవ్వాలి. - గంటా మోహన్, రాష్ట్ర కార్యదర్శి, ఎస్టీయూ. -
నేడు ఉపాధ్యాయ ఖాళీల ప్రకటన
నల్లగొండ : ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ప్రస్తుతం జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సోమవారం ప్రకటించనున్నారు.షెడ్యూల్ ప్రకారం పాఠశాలల్లో 1,2,3,4 కేటగిరీల వారీగా తాత్కాలిక ఖాళీల వివరాలను కలెక్టర్ ఆమోదంతో సోమవారం డీఈఓ వెబ్సైట్లో పొందుపరుస్తారు. పోస్టుల ఖాళీల వివరాలు ప్రకటించిన నాటి నుంచి 27 తేదీ వరకు బదిలీల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమవుతుంది. విద్యాశాఖ నుంచి అందిన ప్రాథమిక సమాచారం మేరకు...అన్ని కేటగిరీల్లో కలిపి 1800 ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. దీంట్లో ఎస్జీటీ 12 వందలు పోస్టులు కాగా...స్కూల్ అసిస్టెంట్లు, పండిట్లు కలిపి 8 వందల వరకు ఉన్నాయి. అలాగే కౌన్సెలింగ్ నిబంధనల మేరకు ఒకే చోట ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న హెచ్ఎంలు 233, ఎనిమిదేళ్ల సర్వీసు దాటిన వారు 322 మంది ఉన్నారు. వారిని తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంటుంది. ఆ ఖాళీల వివరాలు కూడా ప్రకటించడం జరుగుతుంది. ఇదిలావుంటే రేషనలైజేషన్ ద్వారా గుర్తించిన రెండు వేల మిగులు పోస్టులను ఏ విధంగా సర్దుబాటు చేయాలనే దానిపై డైరక్టర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదు. 30 మంది ఉపాధ్యాయులకు ఒక్కరే ఉపాధ్యాయుడు అనే నిబంధనపై ఉపాధ్యాయ సంఘాల నుంచి విమర్శలు రావడంతో ఉన్నతస్థాయి అధికారులు పునరాలోచలనో పడ్డా రు. శనివారం డీఈఓలతో డైరక్టర్ స్థాయిలో సమావేశం జరిగింది. సోమవారం అక్కడి నుంచి వచ్చే ఆదేశాల ప్రకా రం రేషనలైజేషన్ పోస్టులను సర్దుబాటు చేస్తారు. ఎన్నికల కోడ్ అడ్డంకి...? స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన పక్షంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నందున కౌన్సెలింగ్‌కు బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయని విద్యాశాఖ భావిస్తోంది. శనివారం డైరక్టర్ స్థాయిలో జరిగిన సమావేశంలో ఇదే అంశంపై చర్చకు వచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వం కూడా ఇదే అంశాన్ని పరిశీలిస్తుంది. దీంతో కౌన్సెలింగ్ జరుగుతుందా..?లేదా..? అనేదానిపై ఉపాధ్యాయ సంఘాలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. -
ప-పైరవీ... బ-బదిలీ
►స్థాన చలనం కోసం ఉపాధ్యాయుల అడ్డదారులు ► అధికార పార్టీ ఎమ్మెల్యేల అండతో ప్రయత్నాలు ►మంత్రులతో సీఎం పేషీకి సిఫార్సులు కోరుకున్న చోటకు బదిలీ చేయిస్తే నజరానా ► హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు గిరాకీ ► జిల్లా కేంద్రంతో పాటు పట్టణ ప్రాంత పాఠశాలలపై కన్ను గుంటూరు ఎడ్యుకేషన్: బదిలీ మార్గదర్శకాలను స్వయంగా ప్రభుత్వమే తుంగలో తొక్కితే....నిబంధనలను అమలు పరిచి, బదిలీలు చేపట్టాల్సిన అధికార యంత్రాంగం రాజకీయ ఒత్తిళ్లకు తలొంచితే...ఏమనాలి.. ఏంచేయాలి.. ప్రస్తుతం జిల్లాలో ఉపాధ్యాయ బదిలీల విషయమై ఈ తరహా పరిస్థితు లే నెలకొన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను దిగువస్థాయి టీచర్లకు ఉద్యోగోన్నతి కల్పించి భర్తీ చేయాల్సి ఉన్నా, అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమ బదిలీలకు తెర తీశారు. ఉపాధ్యాయుల సీనియారిటీ ప్రాతిపదికన వారు కోరుకున్న పాఠశాలకు బదిలీ చేసేందుకు ఏటా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తూ రాజకీయ పలుకుబడి కలిగిన ఉపాధ్యాయులు జిల్లా కేంద్రంతో పాటు పట్టణ ప్రాంతాలకు నేరుగా బదిలీ పొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ►రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి బదిలీ అవకాశం కల్పించాలని, ఒకే స్థానంలో ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ►ప్రతి ఏటా వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పునఃప్రారంభానికి ముందుగా ఉపాధ్యాయ సాధారణ బదిలీల ప్రక్రియ చేపడుతున్నారు. ►గత ఏడాది నిర్వహించిన బదిలీల అనంతరం తిరిగి ఇప్పటి వరకూ కౌన్సెలింగ్ జరగలేదు. అధికారికంగా బదిలీలు నిర్వహించని సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సు లేఖలతో సీఎం పేషీకి నేరుగా రికమండేషన్ చేయించుకుని బదిలీ పొందిన సంఘటనలు గతంలో ఉన్నాయి. ► సమైక్యాంధ్ర ఉద్యమం, సార్వత్రిక ఎన్నికల కోలాహలం, కొత్త ప్రభుత్వ ఏర్పాటు తదితర కారణాలతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం ఇటీవలే ఎత్తివేసింది. బదిలీకి విశ్వ ప్రయత్నాలు ►ప్రభుత్వం నుంచి నేరుగా బదిలీ పొందేందుకు ఉపాధ్యాయులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో జిల్లా కేంద్రానికి చేరువలోని మండలాలు, పట్టణ ప్రాంతాల్లోని ఖాళీగా ఉన్న పోస్టులకు డిమాండ్ ఏర్పడింది. ►వివిధ ప్రాంతాల్లోని ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల పోస్టులు 53, స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్టులు-50, ఎస్జీటీ పోస్టులు 600 వరకూ ఉన్నాయి. ►వాస్తవానికి ఆయా పోస్టులను సీనియారిటీ ప్రాతిపదికన ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతి కల్పించడం ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. అయితే కౌన్సెలింగ్ చేపడితే కీలక స్థానా లు భర్తీ అయ్యే అవకాశమున్న దృష్ట్యా దానికి ముందుగానే సీఎం పేషీ నుంచి నేరుగా బదిలీ పొందడం ద్వారా జిల్లా కేంద్రానికి దగ్గరలోని ప్రాంతాల్లోని పాఠశాలలు వెళ్లవచ్చనే ఆశతో ఉపాధ్యాయులు పైరవీలు చేస్తున్నారు. ►ఎమ్మెల్యేల ద్వారా మంత్రులకు చెప్పించి అక్కడి నుంచి సిఫార్సు లేఖలతో నేరుగా సీఎం పేషీకి వెళ్లేందుకు ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. ►పెదపలకలూరు, ప్రత్తిపాడు, పెదకాకాని తదితర మం డలాల్లోని ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయుల పోస్టులకు పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కోరుకున్న చోట కు బదిలీ చేయిస్తే నజరానా ముట్ట జెప్పేందుకు సైతం ఉపాధ్యాయులు వెనుకాడటం లేదని తెలుస్తోంది. అర్హులైన వారికి అన్యాయం ►నిబంధనలు పక్కనపెట్టి ప్రభుత్వం చేపడుతున్న అక్రమ బదిలీల కారణంగా సంవత్సరాల తరబడి ఒకే స్థానంలో పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.