నెల రోజుల్లోనే బదిలీలు, పదోన్నతులు | Sabitha Indra Reddy Announces Hikes And Transfers For Teachers | Sakshi
Sakshi News home page

నెల రోజుల్లోనే బదిలీలు, పదోన్నతులు

Published Fri, Sep 1 2023 4:05 AM | Last Updated on Fri, Sep 1 2023 4:05 AM

Sabitha Indra Reddy Announces Hikes And Transfers For Teachers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన అధికారిక కసరత్తు ఊపందుకుంది. విద్యాశాఖ మంత్రి నుంచి ఉన్నతాధికారుల వరకూ అధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. 

బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్‌ శుక్రవారం విడుదల చేయనున్నారు. సెప్టెంబర్‌ 3 నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టే వీలుంది. వెంట వెంటనే ఎడిట్‌ ఆప్షన్లు, జాబితాల తయారీ చేపట్టి, సెప్టెంబర్ నెలాఖరుకు ప్రక్రియను ముగించాలని భావిస్తున్నారు. కొన్నేళ్లుగా బదిలీలు, పదోన్నతులు లేకపోవడంతో టీచర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. 

రాష్ట్రవ్యాప్తంగా 1.05 లక్షల మంది టీచర్లుండగా ఎన్నికల సమయంలో వీరిని ఆకట్టుకోవడానికి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బదిలీలు, పదోన్నతుల ప్రక్రియనే ప్రధాన ఆయుధంగా ప్రభుత్వం భావిస్తోంది. 

డీఈవోలతో డైరెక్టర్‌ టెలీకాన్ఫరెన్స్‌ 
జిల్లా విద్యాశాఖాధికారులతో పాఠశాల విద్య డైరెక్టర్‌ దేవసేన హైదరాబాద్‌ నుంచి టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ సక్రమంగా చేపట్టేందుకు సన్నద్ధమవ్వాలని కోరారు. అవసరమైన సమాచారంతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. బదిలీలకు కటాఫ్‌ డేట్‌ను గతంలో ఫిబ్రవరి 1గా నిర్ణయించారని, ఇప్పుడు ఆ తేదీని సెప్టెంబర్ 1గా నిర్ణయించాలని భావిస్తున్నట్లు తెలిపారు. 

గతంలో బదిలీల కోసం దాదాపు 78 వేల దరఖాస్తులు అందాయి. ఇందులో 58 వేలు అర్హమైనవిగా గుర్తించారు. ఇప్పుడీ సంఖ్య మరింత పెరిగే వీలుందని భావిస్తున్నారు. టీచర్లు 8 ఏళ్ళు, ప్రధానోపాధ్యాయులు 5 ఏళ్ళు ఒకే చోట పనిచేసినట్లయితే బదిలీకి అర్హులవుతారు. కటాఫ్‌ తేదీని పొడిగించడంతో సెప్టెంబర్ 1 నాటికి 8, 5 ఏళ్ళు నిండే వాళ్ళ జాబితాను కొత్తగా రూపొందించాల్సి ఉంటుంది. 

గతంలో దరఖాస్తు చేసిన టీచర్లు సర్వీస్‌ కాలాన్ని ఆన్‌లైన్‌లో పొందు పర్చడమా? డీఈవోలే ఈ డేటాను అప్‌డేట్‌ చేస్తారా? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ఖాళీల విషయంలో సమగ్ర వివరాలను మాత్రం డీఈవోలు అందించాల్సి ఉంటుంది. మూడేళ్లలో పదవీ విరమణ  చేయనున్న టీచర్లకు బదిలీల నుంచి మినహాయింపు ఇస్తారు. కటాఫ్‌ తేదీ పొడిగించడంతో ఇప్పుడు ఖాళీల సంఖ్యలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది.  

చిక్కుముడిగా దివ్యాంగుల వ్యవహారం 
అంగ వైకల్యం ఉన్న వారికి బదిలీల్లో ప్రత్యేక ప్రాధాన్యమిస్తారు. గతంలో రూపొందించిన నిబంధనల ప్రకారం 70 శాతం అంగవైకల్యాన్ని పరిగణలోనికి తీసుకుంటారు. అయితే ఇటీవల న్యాయస్థానం ఈ వ్యవహారాన్ని తప్పుబట్టింది. 40 శాతం అంగవైకల్యాన్ని పరిగణలోనికి తీసుకోవాలని ఓ కేసులో తీర్పు ఇచి్చంది. దీంతో బదిలీల్లోనూ దీన్నే కొలమానంగా తీసుకోవాలని దివ్యాంగ ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై సమగ్ర వివరాలు అందజేయాల్సిందిగా మంత్రి సబిత అధికారులను ఆదేశించినట్టు తెలిసింది.  

317 జీవో ద్వారా బదిలీ అయిన వారికి సర్వీస్ పాయింట్లలో అన్యాయం జరిగిందని, దీన్ని సరిచేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్‌) నేతలు హన్మంతరావు, నవాత్‌ సురేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపకుండా ఏకపక్షంగా షెడ్యూల్‌ విడుదలకు అధికారులు సన్నాహాలు చేయడం అన్యాయమని టీఎస్పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్‌ అలీ విమర్శించారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో అన్ని స్థాయిల నేతల సలహాలు, సూచనలు తీసుకోవాలని పీఆర్‌టీయూటీఎస్‌ నేతలు శ్రీపాల్‌ రెడ్డి, బీరెల్లి కమలాకర్‌ రావు సూచించారు.   

సంఘాల హల్‌చల్‌ 
బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మొదలవ్వడంతో ఉపాధ్యాయ సంఘాల నేతలు అధికారులను, మంత్రి సబితను కలుస్తున్నారు. పలు సలహాలు సూచనలతో వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. సప్టెంబర్ 1ని కటాఫ్‌గా నిర్ణయించాలని కోరుతూ ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్‌ మంత్రి సబితకు వినతి పత్రం సమర్పించారు. ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్ళాలని టీఎస్‌యూటీఎఫ్‌ నేతలు జంగయ్య, చావా రవి అధికారులను కోరారు. 

ఇది కూడా చదవండి: సాగు పరిశోధనలో అమెరికా సహకారం కావాలి.. మంత్రి నిరంజన్‌ రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement