Teacher transfer process
-
నెల రోజుల్లోనే బదిలీలు, పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన అధికారిక కసరత్తు ఊపందుకుంది. విద్యాశాఖ మంత్రి నుంచి ఉన్నతాధికారుల వరకూ అధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ శుక్రవారం విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 3 నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టే వీలుంది. వెంట వెంటనే ఎడిట్ ఆప్షన్లు, జాబితాల తయారీ చేపట్టి, సెప్టెంబర్ నెలాఖరుకు ప్రక్రియను ముగించాలని భావిస్తున్నారు. కొన్నేళ్లుగా బదిలీలు, పదోన్నతులు లేకపోవడంతో టీచర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 లక్షల మంది టీచర్లుండగా ఎన్నికల సమయంలో వీరిని ఆకట్టుకోవడానికి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బదిలీలు, పదోన్నతుల ప్రక్రియనే ప్రధాన ఆయుధంగా ప్రభుత్వం భావిస్తోంది. డీఈవోలతో డైరెక్టర్ టెలీకాన్ఫరెన్స్ జిల్లా విద్యాశాఖాధికారులతో పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన హైదరాబాద్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ సక్రమంగా చేపట్టేందుకు సన్నద్ధమవ్వాలని కోరారు. అవసరమైన సమాచారంతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. బదిలీలకు కటాఫ్ డేట్‌ను గతంలో ఫిబ్రవరి 1గా నిర్ణయించారని, ఇప్పుడు ఆ తేదీని సెప్టెంబర్ 1గా నిర్ణయించాలని భావిస్తున్నట్లు తెలిపారు. గతంలో బదిలీల కోసం దాదాపు 78 వేల దరఖాస్తులు అందాయి. ఇందులో 58 వేలు అర్హమైనవిగా గుర్తించారు. ఇప్పుడీ సంఖ్య మరింత పెరిగే వీలుందని భావిస్తున్నారు. టీచర్లు 8 ఏళ్ళు, ప్రధానోపాధ్యాయులు 5 ఏళ్ళు ఒకే చోట పనిచేసినట్లయితే బదిలీకి అర్హులవుతారు. కటాఫ్ తేదీని పొడిగించడంతో సెప్టెంబర్ 1 నాటికి 8, 5 ఏళ్ళు నిండే వాళ్ళ జాబితాను కొత్తగా రూపొందించాల్సి ఉంటుంది. గతంలో దరఖాస్తు చేసిన టీచర్లు సర్వీస్ కాలాన్ని ఆన్లైన్లో పొందు పర్చడమా? డీఈవోలే ఈ డేటాను అప్డేట్ చేస్తారా? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ఖాళీల విషయంలో సమగ్ర వివరాలను మాత్రం డీఈవోలు అందించాల్సి ఉంటుంది. మూడేళ్లలో పదవీ విరమణ చేయనున్న టీచర్లకు బదిలీల నుంచి మినహాయింపు ఇస్తారు. కటాఫ్ తేదీ పొడిగించడంతో ఇప్పుడు ఖాళీల సంఖ్యలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది. చిక్కుముడిగా దివ్యాంగుల వ్యవహారం అంగ వైకల్యం ఉన్న వారికి బదిలీల్లో ప్రత్యేక ప్రాధాన్యమిస్తారు. గతంలో రూపొందించిన నిబంధనల ప్రకారం 70 శాతం అంగవైకల్యాన్ని పరిగణలోనికి తీసుకుంటారు. అయితే ఇటీవల న్యాయస్థానం ఈ వ్యవహారాన్ని తప్పుబట్టింది. 40 శాతం అంగవైకల్యాన్ని పరిగణలోనికి తీసుకోవాలని ఓ కేసులో తీర్పు ఇచి్చంది. దీంతో బదిలీల్లోనూ దీన్నే కొలమానంగా తీసుకోవాలని దివ్యాంగ ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సమగ్ర వివరాలు అందజేయాల్సిందిగా మంత్రి సబిత అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. 317 జీవో ద్వారా బదిలీ అయిన వారికి సర్వీస్ పాయింట్లలో అన్యాయం జరిగిందని, దీన్ని సరిచేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) నేతలు హన్మంతరావు, నవాత్ సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపకుండా ఏకపక్షంగా షెడ్యూల్ విడుదలకు అధికారులు సన్నాహాలు చేయడం అన్యాయమని టీఎస్పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్ అలీ విమర్శించారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో అన్ని స్థాయిల నేతల సలహాలు, సూచనలు తీసుకోవాలని పీఆర్టీయూటీఎస్ నేతలు శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు సూచించారు. సంఘాల హల్చల్ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మొదలవ్వడంతో ఉపాధ్యాయ సంఘాల నేతలు అధికారులను, మంత్రి సబితను కలుస్తున్నారు. పలు సలహాలు సూచనలతో వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. సప్టెంబర్ 1ని కటాఫ్‌గా నిర్ణయించాలని కోరుతూ ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ మంత్రి సబితకు వినతి పత్రం సమర్పించారు. ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్ళాలని టీఎస్‌యూటీఎఫ్ నేతలు జంగయ్య, చావా రవి అధికారులను కోరారు. ఇది కూడా చదవండి: సాగు పరిశోధనలో అమెరికా సహకారం కావాలి.. మంత్రి నిరంజన్ రెడ్డి -
‘పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు’
సాక్షి, ప్రకాశం జిల్లా: ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌ను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వివిధ కేటగిరీలలో కొన్ని స్థానాలు బ్లాక్ చేయడం గతం నుంచి వస్తున్న విధానమేనని.. అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఆయన వివరించారు. (చదవండి: జనవరి 9న జగనన్న అమ్మఒడి సాయం) ‘‘కేటగిరీ 4లో కూడా కొన్ని స్థానాలు బ్లాక్ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేటగిరీలలో బదిలీలకు 48 వేల 897 ఖాళీలను గుర్తించాం. వెబ్ కౌన్సిలింగ్లో సర్వర్ల సమస్యను దృష్టిలో ఉంచుకుని రేపటి వరకూ ఆప్షన్ల నమోదుకు గడువు ఇచ్చాం. బదిలీలకు సంబంధించి పూర్తి వివరాలు ట్రాన్స్ ఫర్ పోర్టల్‌లో ఉంచాం. బ్లాక్ చేసిన స్థానాలను డీఎస్సీ నియామకాల సమయంలో భర్తీ చేస్తాం. అప్పుడు మళ్లీ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని’’ మంత్రి పేర్కొన్నారు. బదిలీల ప్రక్రియ పై ఉపాధ్యాయ సంఘాలు, అధికారులతో పూర్తిగా చర్చించామని, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రతిపక్షాలు మాట్లాడటం సబబు కాదని మంత్రి సురేష్ హితవు పలికారు. (చదవండి: ‘జూమ్‌లో చంద్రబాబు.. ట్విట్టర్లో లోకేష్’) -
బలవంతపు బదిలీలు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ కొందరికి చిక్కులు తెచ్చింది. ఆన్లైన్ బదిలీల్లో భాగంగా కోరిన చోట పోస్టింగ్ వచ్చినప్పటికీ విధానపరమైన అంశాలతో అక్కడ పనిచేసే పరిస్థితి లేకుండా పోయింది. పోస్టింగ్ వచ్చిన చోట కాకుండా ఉపాధ్యాయులు లేరంటూ ఖాళీగా ఉన్న పాఠశాలల్లో పనిచేయాలని విద్యాశాఖ ఆదేశించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 442 మంది టీచర్లు కేటాయించిన చోట కాకుండా కొత్త స్థానాల్లో విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా 74,734 మంది టీచర్లు బదిలీలకోసం దరఖాస్తు చేసుకోగా, వీరిలో 44,361 మందికి స్థాన చలనం కలిగింది. ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలకు టీచర్లు బదిలీ అయ్యారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని స్కూళ్లలో పూర్తిస్థాయి టీచర్లకు స్థానచలనం కలగడంతో అవి ఖాళీ అయ్యాయి. దీంతో అక్కడ బోధన అయోమయంలో పడింది. ఈక్రమంలో విద్యార్థులు, టీచర్ల నిష్పత్తి సంతృప్తికర స్థాయికంటే ఎక్కువ ఉన్న పాఠశాలల్లోని ఒకరిద్దరు ఉపాధ్యాయులను ఖాళీగా ఉన్న పాఠశాలలకు డిప్యుటేషన్‌పై పంపించారు. విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆయా టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోరిన చోట్ల పోస్టింగ్ వచ్చినప్పటికీ విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంతో దూర ప్రయాణం తప్పడం లేదంటూ వారినుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. జూనియారిటీ తెచ్చిన తంటా... ఉపాధ్యాయుల డిప్యుటేషన్లలో విద్యాశాఖ సీనియార్టీపై దయచూపింది. పాఠశాలలో జూనియర్‌గా ఉన్న టీచర్‌ను సమీప పాఠశాలలో డిప్యూట్ చేసింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 442 పాఠశాలల్లో ఒక్కో టీచర్ చొప్పున డిప్యుటేషన్‌పై పంపింది. అక్కడ రెగ్యులర్ టీచర్ లేదా మంజూరైన విద్యావలంటీర్లు వచ్చేవరకు అక్కడ పనిచేయాలని స్పష్టం చేసింది. తాజాగా బదిలీల ప్రక్రియలో పలువురు టీచర్లు కొత్త స్థానాల్లో చేరారు. టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నచోట నుంచి టీచర్లను డిప్యుటేషన్‌పై పంపారు. ఈక్రమంలో జూనియర్‌గా ఉన్న వారినే ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో కొత్తగా బదిలీ అయిన వారినే డిప్యుటేషన్‌పై పంపడంతో వారంతా ఉసూరుమంటున్నారు. దీర్ఘకాలంగా ఎక్కువ దూరం ప్రయాణం చేసిన తమను మళ్లీ డిప్యుటేషన్‌పై పంపడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా, రాష్ట్రవ్యాప్తంగా 15వేల విద్యావలంటీర్లను ప్రభుత్వం మంజూరు చేయగా, దరఖాస్తులు స్వీకరించిన అధికారులు 14వేల మందిని అర్హులుగా గుర్తించారు. వీరిని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఆమోదించాల్సి ఉంది. కానీ ఎస్ఎంసీ సమావేశాలు నిర్వహించడంలో జాప్యం జరగడంతో వీవీల నియామక ప్రక్రియ పూర్తికాలేదు. ఈ ప్రక్రియ పూర్తయితే కొందరికైనా ఉపశమనం కలిగే అవకాశం ఉంది. -
ముగిసిన సవరణ గడువు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి వెబ్ ఆప్షన్ల సవరణ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. సాంకేతిక సమస్యలతో టీచర్లు ఎంపిక చేసుకున్న ఆప్షన్ల ప్రాధాన్యతా క్రమం ఒక్కసారిగా అస్తవ్యస్తమవడంతో క్షేత్రస్థాయిలో ఆందో ళన వ్యక్తమైంది. దీంతో వెబ్ ఆప్షన్లను సవరించుకునేందుకు ప్రభుత్వం రెండ్రోజులపాటు అవకాశం కల్పించింది. మంగళవారం గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లకు అవకాశం ఇవ్వగా 11,749 మంది తమ ఆప్షన్లను సవరించుకున్నారు. బుధవారం సెకండరీ గ్రేడ్ టీచర్లు, భాషా పండితులకు ఎడిట్ సౌకర్యం కల్పించింది. రాత్రి 11.59 గంటల వరకు కొనసాగిన ఈ ప్రక్రియలో 10 వేల మందికిపైగా టీచర్లు తమ ఆప్షన్లను సవరించుకున్నారు. ఎడిట్ అవకాశం ముగియడం తో బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను విద్యా శాఖ జారీ చేయాల్సి ఉంది. ఉత్తర్వులను ఒకేసారి ఇవ్వాలా లేక కేటగిరీల వారీగా ఇవ్వాలా అనే అంశంపై విద్యాశాఖ తర్జనభర్జన పడుతోంది. ఈ క్రమంలో గురు లేదా శుక్రవారాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా ఈ నెల 10లోగా బదిలీల ప్రక్రియకు ముగింపు పలకాలని ఆ శాఖ నిర్ణయించింది. నేటితో ముగియనున్న ఐసెట్ వెబ్ ఆప్షన్లు సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా విద్యార్థులు గురువారం రాత్రి 11:59 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రవేశాల కమిటీ ఒక ప్రకటనలో తెలి పింది. బుధవారం వరకు 24,975 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారని, అందులో 7,548 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారని పేర్కొంది. మిగతావారు గడువులోగా ఆప్ష న్లు ఇచ్చుకోవాలని సూచించింది. -
విద్యావలంటీర్ల నియామకాలకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యావలంటీర్ల (వీవీ) నియామకాలకు బ్రేక్ పడింది. ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటం, బదిలీలపై కొం దరు కోర్టును ఆశ్రయించడంతో తుదితీర్పు వచ్చే వరకు బదిలీల కేటాయింపులు చేయొద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోర్టు తీర్పునకు లోబడే బదిలీల ప్రక్రియ పూర్తి చేయనుంది. ఈ ప్రక్రియలో ఏర్పడే ఖాళీలపై స్పష్టత వచ్చిన తర్వాతే విద్యావలంటీర్ల (వీవీ)ను నియమిస్తే ఫలితం ఉంటుందని విద్యాశాఖ అంచనాకొచ్చింది. బదిలీలకు సంబం ధించి కోర్టు తీర్పు ఒకట్రెండు రోజుల్లో రానుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ తీర్పు వెలువడటం ఆలస్యమైతే వీవీల నియామకాలు సైతం జాప్యం కానున్నాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో బోధన మరింత ప్రమాదంలో పడనుంది. విద్యాశాఖ పట్టించుకోకపోవడంతో... ఉపాధ్యాయ ఖాళీలను విద్యావలంటీర్లతో నెట్టుకు రావాలని భావించిన సర్కారుఆ మేరకు వీవీలను మంజూరు చేసి జూన్ నుంచే నియామకాలు చేపట్టా లని విద్యాశాఖకు సూచించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో 16,781 వీవీ లను నియమించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ తక్షణమే పూర్తి చేయాలని స్పష్టం చేసింది. తాజాగా మంజూరు చేసిన వీవీ పోస్టుల్లో 15,473 మందిని ఉపాధ్యాయ ఖాళీలు, సెలవులతో ఏర్పడిన ఖాళీ స్థానాల్లో భర్తీ చేస్తారు. మరో 1,308 మందిని తెలుగు, ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు బోధకులుగా నియమిస్తారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా నియమిస్తున్న విద్యావలంటీర్లకు నెలవారీ గౌరవ వేతనంగా రూ. 12 వేలు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ మేరకు జూన్ నెలకు సంబంధించి వీవీల వేతన నిధులను కూడా విడుదల చేస్తూ ఆర్థికశాఖకు ఆదేశాలు జారీ చేసింది. కానీ అదే సమయంలో ఉపాధ్యాయుల బదిలీల అంశం తెరపైకి రావడంతో వీవీల నియామకాల ప్రక్రియ అటకెక్కింది. టీచర్ల బదిలీల కౌన్సెలింగ్‌లో నిమగ్నమైన విద్యాశాఖ వీవీల నియామకాలను పట్టించుకోలేదు. జూన్ ముగిసినప్పటికీ వీవీల ఊసెత్తలేదు. -
వెబ్ కౌన్సెలింగ్ అయోమయం!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియలో భాగంగా ప్రారంభమైన వెబ్ కౌన్సెలింగ్ తొలి రోజే గందరగోళానికి దారితీసింది. వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు, దానికి తోడు స్పౌజ్ పాయింట్లు ఉన్న టీచర్లకు అతి తక్కువ ఆప్షన్లు, ఒకే పోస్టును రెండుసార్లు చూపడం మొదలైనవి టీచర్లను తీవ్ర అయోమయానికి గురిచేశాయి. బదిలీ ప్రక్రియలో భాగంగా శనివారం గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల(జీహెచ్ఎం)కు విద్యా శాఖ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంలు శనివారం ఉదయం నుంచే కంప్యూటర్ల ముందుకు చేరారు. రాష్ట్రవ్యాప్తంగా జీహెచ్ఎం కేటగిరీలో 2,209 మంది బదిలీల కోసం దరఖాస్తులు సమర్పించారు. వీరిలో 541 మందికి తప్పనిసరి బదిలీ కానుండగా.. 1,668 మంది ఒకేచోట రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ఉండటంతో బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. సతాయించిన సాంకేతిక సమస్యలు జీహెచ్‌ఎంల వెబ్ కౌన్సెలింగ్‌లో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. తక్కువ మంది టీచర్లే ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యతో టీచర్లు ఇబ్బంది పడ్డారు. ట్రెజరీ సంఖ్య, మొబైల్ నంబర్‌ను వెబ్సైట్లో నమోదు చేస్తే ఉద్యోగి మొబైల్‌కు ఓటీపీ(వన్ టైమ్ పాస్వర్డ్) వస్తుంది. దాన్ని నమోదు చేస్తే ఉద్యోగికి సంబంధించిన వెబ్ పేజీ తెరుచుకుంటుంది. కానీ వివరాలు నమోదు చేసిన వెంటనే ఓటీపీ రావడం లేదు. దీంతో పలుమార్లు వివరాలు నమోదు చేయాల్సి వచ్చింది. ఓటీపీ నమోదు తర్వాత ఉద్యోగి ఖాళీలను ఆప్ట్ చేసుకుంటూ ప్రాధాన్యతా క్రమంలో ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. సర్వర్ తెరుచుకోవడం.. ఆప్షన్లు ఇస్తున్న సమయంలో పేజీ రీడింగ్‌లో తీవ్ర జాప్యంతో ఆప్షన్లు ఇవ్వడానికి రెండు గంటలపాటు వేచి చూడాల్సి వస్తోందని జీహెచ్ఎంలు ఆందోళన వ్యక్తం చేశారు. లాగ్ అవుట్ కాకపోవడం, వెబ్ఆప్షన్లు సేవ్ కాకపోవడం లాంటి సమస్యలతో జీహెచ్ఎంలు ఇబ్బంది పడ్డారు. తప్పనిసరి అయితే అన్నీ ఎంచుకోవాలి.. ఒకేచోట ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేసిన టీచర్లకు తప్పనిసరి బదిలీ కానుంది. తప్పనిసరి బదిలీ కేటగిరీలో ఉన్న టీచర్లు వెబ్ కౌన్సెలింగ్‌లో చూపిన ఖాళీలన్నింటికి ఆప్షన్ ఇవ్వాలి. అలా అయితేనే వెబ్ కౌన్సెలింగ్ పేజీ పూర్తవుతుంది. కొన్నింటికే ఆప్షన్లు ఇస్తే.. సీనియార్టీ ఆధారంగా సదరు జీహెచ్‌ఎంకు అందులో పేర్కొన్న స్థానం దక్కకుంటే.. మిగతా ఖాళీ స్థానాన్ని సాఫ్ట్వేర్ ఆటోమేటిక్‌గా కేటాయిస్తుంది. దీంతో ప్రాధాన్యతా క్రమంలో ఉన్న ఖాళీలన్నీ చూపాలని విద్యాశాఖ ఇలా వెబ్‌సైట్‌ను అప్డేట్ చేసింది. ఈ ప్రక్రియతో టీచర్లు ఇబ్బంది పడ్డారు. ఇక స్పౌజ్ పాయింట్లున్న టీచర్ల పరిస్థితి విచిత్రంగా మారింది. స్పౌజ్ పని చేసే చోటు నుంచి జీహెచ్ఎం పనిచేస్తున్న చోటు మధ్య ఉన్న దూరాన్నే సాఫ్ట్వేర్ ప్రామాణికంగా తీసుకోవడంతో.. ఆ కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఖాళీలే వెబ్సైట్లో కనిపిస్తున్నాయి. దీంతో వాటిని మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి వస్తోంది. దూరం తక్కువగా ఉంటే తక్కువ ఖాళీలు చూపడంతో కొందరు టీచర్లకు నాలుగైదు స్థానాలకు మించి ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా పోయింది. అలాగే వెబ్సైట్లో ఖాళీ స్థానాలు కొన్ని రెండేసిసార్లు చూపించడంతో టీచర్లు తికమకపడ్డారు. -
నెలాఖరులోగా టీచర్ల బదిలీలు
ముందుగా రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి వెబ్‌కౌన్సెలింగ్‌పై సందేహాలు వ్యక్తం చేస్తున్నఉపాధ్యాయ సంఘాలు దీంతో ముందుగా నమూనా వెబ్‌కౌన్సెలింగ్ లోపాలు సరిదిద్దాక బదిలీల ప్రక్రియ హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని విద్యాశాఖ భావిస్తోంది. బదిలీల ప్రక్రియను ఆగస్టు 15 కల్లా పూర్తిచేయించాలని ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే. రేషనలైజేషన్‌తో బదిలీ ప్రక్రియ ముడిపడి ఉన్నందున ఆ తేదీ నాటికి టీచర్ల బదిలీలు పూర్తి చేయలేమని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. పాఠశాలలు, టీచర్ల రేషనలైజేషన్‌కు సీఎం ఆమోదం తెలిపినందున ఆ ప్రక్రియను ముందుగా పూర్తిచేయనున్నారు. ప్రాథమిక పాఠశాలల వరకే రేషనలైజేషన్‌ను చేయాలని భావిస్తున్న తరుణంలో కిలోమీటర్ పరిధిలో ఉండే పాఠశాలలు విలీనం కానున్నాయి. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాలు, జాతీయ రహదారులు, నదులు, వాగులు దాటాల్సి వచ్చే ప్రాంతాల ప్రాథమిక పాఠశాలలను ఇందులో నుంచి మినహాయించనున్నారు. పాఠశాలల జాబితా, ఖాళీల సంఖ్యపై తుది నిర్ణయానికి వచ్చాక వాటిని కౌన్సెలింగ్‌లో చేర్చనున్నారు. ఈసారి వెబ్ ఆధారితంగా చేయాలని నిర్ణయించారు. ఈ విధానంలో గందరగోళంగా మారుతుందని టీచర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాతపద్ధతిలో బదిలీపై వెళ్లే టీచర్ల ఖాళీ స్థానాలు ఎక్కడెక్కడున్నాయో కౌన్సెలింగ్ లో తెలుస్తుంది కనుక అర్హులకు అన్యాయం జరగదంటున్నారు. దీంతో ఉపాధ్యాయ సంఘాల సందేహాలను నివృత్తి చేసిన అనంతరం షెడ్యూల్‌ను ప్రకటిస్తామని అధికారులు చెబుతున్నారు. తొలుత నమూనా వెబ్‌కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఆర్పీ సిసోడియా ‘సాక్షి’తో పేర్కొన్నారు. లోపాలు కనిపిస్తే వాటిని సరిచేయించి ఆ తరువాతనే షెడ్యూల్ ప్రకటించి ఈ నెలాఖరునాటికి బదిలీల ప్రక్రియను పూర్తిచేయాలని భావిస్తున్నామని చెప్పారు.