నెలాఖరులోగా టీచర్ల బదిలీలు
ముందుగా రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి
వెబ్‌కౌన్సెలింగ్‌పై సందేహాలు వ్యక్తం చేస్తున్నఉపాధ్యాయ సంఘాలు
దీంతో ముందుగా నమూనా వెబ్‌కౌన్సెలింగ్
లోపాలు సరిదిద్దాక బదిలీల ప్రక్రియ
హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని విద్యాశాఖ భావిస్తోంది. బదిలీల ప్రక్రియను ఆగస్టు 15 కల్లా పూర్తిచేయించాలని ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే. రేషనలైజేషన్‌తో బదిలీ ప్రక్రియ ముడిపడి ఉన్నందున ఆ తేదీ నాటికి టీచర్ల బదిలీలు పూర్తి చేయలేమని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. పాఠశాలలు, టీచర్ల రేషనలైజేషన్‌కు సీఎం ఆమోదం తెలిపినందున ఆ ప్రక్రియను ముందుగా పూర్తిచేయనున్నారు. ప్రాథమిక పాఠశాలల వరకే రేషనలైజేషన్‌ను చేయాలని భావిస్తున్న తరుణంలో కిలోమీటర్ పరిధిలో ఉండే పాఠశాలలు విలీనం కానున్నాయి. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాలు, జాతీయ రహదారులు, నదులు, వాగులు దాటాల్సి వచ్చే ప్రాంతాల ప్రాథమిక పాఠశాలలను ఇందులో నుంచి మినహాయించనున్నారు. పాఠశాలల జాబితా, ఖాళీల సంఖ్యపై తుది నిర్ణయానికి వచ్చాక వాటిని కౌన్సెలింగ్‌లో చేర్చనున్నారు. ఈసారి వెబ్ ఆధారితంగా చేయాలని నిర్ణయించారు.
ఈ విధానంలో గందరగోళంగా మారుతుందని టీచర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాతపద్ధతిలో బదిలీపై వెళ్లే టీచర్ల ఖాళీ స్థానాలు ఎక్కడెక్కడున్నాయో కౌన్సెలింగ్ లో తెలుస్తుంది కనుక అర్హులకు అన్యాయం జరగదంటున్నారు. దీంతో ఉపాధ్యాయ సంఘాల సందేహాలను నివృత్తి చేసిన అనంతరం షెడ్యూల్‌ను ప్రకటిస్తామని అధికారులు చెబుతున్నారు. తొలుత నమూనా వెబ్‌కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఆర్పీ సిసోడియా ‘సాక్షి’తో పేర్కొన్నారు. లోపాలు కనిపిస్తే వాటిని సరిచేయించి ఆ తరువాతనే షెడ్యూల్ ప్రకటించి ఈ నెలాఖరునాటికి బదిలీల ప్రక్రియను పూర్తిచేయాలని భావిస్తున్నామని చెప్పారు.