Teacher unions
-
ఉపాధ్యాయ సంఘాలతో భేటీ.. మంత్రి బొత్స ఏమన్నారంటే?
సాక్షి, విజయవాడ: ఫేస్ రికగ్నేషన్ యాప్‌పై ప్రభుత్వం ఒక విధానం తీసుకుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం.. మంత్రి బొత్సతో ఉపాధ్యాయ సంఘాలు భేటీ అయ్యాయి. అనంతరం సమావేశంలో చర్చించిన అంశాలను మీడియాకు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ పాలసీ, స్కూళ్లలో నూతన విధానాలపై వివరణ ఇచ్చారు. చదవండి: మీరు తింటున్న చికెన్ బిర్యానీలో ఏముందో తెలుసా?.. భయంకర వాస్తవాలు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఇది త్వరలో అమలవుతుందన్నారు. తొలుత ఉపాధ్యాయులకు అమలు చేయాలని చెప్పామని, సమన్వయ లోపం వల్ల దీని పై కొంత గందరగోళం ఏర్పడిందన్నారు. ఉపాధ్యాయుల సందేహాలకు సమాధానం ఇచ్చామని, నెలాఖరు నాటికి అందరూ అవగాహన పెంచుకోవాలని చెప్పామన్నారు. ఇప్పటికే లక్షా 90 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నిమిషం ఆలస్యమైన ఎవరికీ మేము మెమో ఇవ్వలేదు. ఫేస్ రికగ్నేషన్ ప్రభుత్వ నిబంధనల్లో ఎప్పటి నుంచో ఉంది. 3 సార్లు దాటి నాలుగోసారి ఆలస్యంగా వస్తే హాఫ్ డే లీవ్. ఉద్యోగ రీత్యా ఎలాంటి ఇబ్బంది వచ్చినా అండగా ఉంటాం. ఏమైనా లోటుపాట్లు ఉంటే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. -
వివాదాలు పరిష్కరించి.. పదోన్నతులు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ సంఘాల మధ్య ఏకాభిప్రాయం తెచ్చిన తర్వాతే టీచర్ల పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా అన్ని యూనియన్లతో రెండు రోజుల్లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి భావిస్తున్నారు. సోమవారం తనను కలిసిన పలు ఉపాధ్యాయ సంఘాల నేతలతో ఆమె ఇదే విషయాన్ని చెప్పారు. భిన్నాభిప్రాయాలపై చర్చించి, వివాదాలను పరిష్కరిద్దామని ఆమె పేర్కొన్నట్టు సంఘాల నేతలు వెల్లడించారు. అంతా ఒప్పుకుంటే 10 రోజుల్లో పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వారికి మంత్రి వెల్లడించినట్లు తెలిసింది. ఇప్పటికే 2 దఫాలుగా మంత్రి సమక్షంలో చర్చలు జరిగినా పెద్దగా ప్రయోజనం కన్పించలేదు. పర్యవేక్షణ పోస్టులైన ఎంఈవో, డిప్యూటీ డీఈవో వంటి పోస్టులపై ఉపాధ్యాయ సంఘాలు భిన్నవాదనలతో పట్టుబడుతున్నాయి. మరోవైపు కోర్టు సమస్యలూ పదోన్నతులకు అడ్డంకిగా ఉన్నాయి. ముందు షెడ్యూల్ ఇవ్వాలి పదోన్నతులు, బదిలీల విషయంలో ప్రభుత్వమే చొరవ చూపాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) పట్టుబడుతోంది. ఇదే అభిప్రాయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావా రవి తెలిపారు. పంచాయతీ రాజ్ వ్యవస్థలో పనిచేస్తున్న 80 వేల మంది ఉపాధ్యాయుల అభిప్రాయాలను ప్రామాణికంగా తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. తక్షణమే షెడ్యూల్ ఇవ్వాలని, ఆ తర్వాత సమస్యలుంటే పరిష్కరించుకోవాలని సూచించారు. పదోన్నతులు ఇవ్వకపోతే ఆందోళనకు కార్యాచరణ సిద్ధం చేస్తామని చెప్పారు. అర్హత ప్రకారమే పదోన్నతులు ప్రభుత్వం నేరుగా నియమించిన ఉపాధ్యాయ సంఘం సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసింది. ఆ సంఘం అధ్యక్షుడు కాసం ప్రభాకర్ రావు, ప్రధాన కార్యదర్శి మేరోజు బ్రహ్మచారి, అసోసియేట్ అధ్యక్షుడు కె.దశరథ్ తదితరులు మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పర్యవేక్షణ పోస్టుల భర్తీపై తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. వీటిని అర్హత, నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకే ఇవ్వాలన్న అంశాన్ని మంత్రి ముందు ప్రస్తావించారు. స్థానిక సంస్థల ఉపాధ్యాయులకు మాతృ సంస్థల్లోనే పదోన్నతులు ఇవ్వాలని సూచించారు. అధికారులతో మంత్రి సంప్రదింపులు రాష్ట్రవ్యాప్తంగా 8,500 మంది ఎస్జీటీలు, 2 వేలకు పైగా స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు ఇవ్వాలి. అదేమాదిరి ఎంఈవో, డిప్యూటీ డీఈవో, డీఈవో పోస్టులను భర్తీ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయితేనే విద్యావ్యవస్థ బలోపేతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఉపాధ్యాయ సంఘాల మధ్య ఉన్న వైరుధ్యాల నేపథ్యంలో సమస్యను ఎలా పరిష్కరించాలని అధికారులను మంత్రి అడిగినట్టు తెలిసింది. అందరినీ ఏకతాటిపైకి తెచ్చిన తర్వాతే షెడ్యూల్ ఇవ్వాలని అధికారులు సూచించినట్లు సమాచారం. -
మాకు ఇదేం ‘శిక్ష’ణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆంగ్ల బోధనపై శిక్షణ మొదలైంది. జిల్లా, మండల స్థాయిల్లో కొద్దినెలల పాటు కొనసాగే ఈ కార్యక్రమానికి.. అన్ని స్థాయిల ఉపాధ్యాయులు విధిగా హాజరుకావాలని విద్యా శాఖ ఆదేశించింది. ఈ శిక్షణ బాధ్యతలను అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి అప్పగించారు. యూనివర్సిటీ ప్రతినిధులు ఇప్పటికే రాష్ట్రంలో 20వేల మంది రిసోర్స్ పర్సన్లకు ట్రైనింగ్ ఇచ్చారు. వారు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. ఆదిలోనే అనాసక్తి.. శిక్షణ మొదలైన రోజే ఉపాధ్యాయుల నుంచి అసంతృప్తి కనిపిస్తోంది. మండు వేసవిలో శిక్షణ ఇవ్వడం సరికాదని, సరిగా శిక్షణ పొందే అవకాశం లేదని ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ అధికారులపై ఒత్తిడి చేస్తున్నాయి. అంతేకాదు శిక్షణ కోసం అవసరమైన కొద్దిపాటి ఖర్చు పెట్టుకోవ డానికి కూడా టీచర్లు అనాసక్తత కనబరుస్తున్నారని అధికారవర్గాలు చెప్తున్నాయి. లాంగ్ నోట్‌బుక్, పెన్ను, లంచ్ బాక్స్, మంచినీళ్లు వెంట తెచ్చు కోవాలని చెప్తే తప్పుపడుతున్నారని అంటున్నాయి. ఇక శిక్షణ కేంద్రాల్లో కొన్నిచోట్ల ఫ్యాన్లు లేవని, మంచినీటి వసతి కూడా కల్పించలేదని డీటీఎఫ్ అధ్యక్షుడు ఎం.రఘుశంకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి పేర్కొన్నారు. వేసవి ఎండలు పెరిగిపోతున్నందున ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకే శిక్షణ ఇవ్వాలని టీపీటీఎఫ్ నేతలు రమణ, మైస శ్రీనివాస్‌లు డిమాండ్ చేశారు. 60 వేల మందికి.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 8 తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు దాదాపు 60 వేల మంది టీచర్లకు ఇంగ్లిష్‌లో బోధనపై శిక్షణ ఇస్తున్నారు. మండల, జిల్లా కేంద్రాల్లోని ఒక్కో కేంద్రంలో దాదాపు 40 మందికి శిక్షణ ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఈ కార్యక్రమం ఉంటుందని, తొలి విడతగా ఐదు రోజులు కొనసాగుతుందని వివరించారు. కొద్దిరోజుల విరామం తర్వాత మళ్లీ శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తంగా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా శిక్షణ పూర్తి చేసి, టీచర్లను బోధనకు సిద్ధం చేయాలని భావిస్తున్నారు. -
ఎస్సీఈఆర్టీ సిలబస్‌కు సర్కారు స్వస్తి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) పాఠ్యాంశాల బోధనకు అధికారులు మంగళం పాడుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లలో ప్రభుత్వం ఎస్సీఈఆర్టీ ద్వారా నిపుణులతో రూపొందించిన సిలబస్‌ను, పాఠ్యప్రణాళికను అనుసరించాల్సి ఉంటుంది. దీన్ని కచ్చితంగా అమలు చేయించాల్సిన అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఏకంగా ప్రభుత్వ స్కూళ్లలోనే ఎస్సీఈఆర్టీ సిలబస్‌కు స్వస్తి పలుకుతున్నారు. పలు జిల్లాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రైవేటు సంస్థల పాఠ్యాంశాల బోధనను గత కొంతకాలంగా కొనసాగిస్తుండడమే దీనికి నిదర్శనం. ఆనందలహరి, ఈషా ఫౌండేషన్ తదితర సంస్థలకు ఈ బోధన ప్రక్రియను ప్రభుత్వం అప్పగించింది. ఇందుకోసం ఆయా సంస్థలకు ఏటా కోట్లాది రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తోంది. ఆయా పాఠశాలల టీచర్లు తప్పనిసరిగా ఆయా సంస్థలు చెప్పినట్లు వినాలని, వారి శిక్షణ కార్యక్రమాలకు హాజరై వారి పద్ధతుల్లోనే బోధన సాగించాలని, వారి సిలబస్‌నే అనుసరించాలని పాఠశాల విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేస్తుండడం గమనార్హం. ‘అల’కు ఈ ఏడాది మరో 1,450 స్కూళ్లు అప్పగింత టీడీపీ అధికారం చేపట్టిన వెంటనే చిత్తూరు జిల్లాలోని రిషివ్యాలీకి సంబంధించిన స్వచ్ఛంద సంస్థకు ‘ఆనందలహరి’ పేరిట ప్రాథమిక పాఠశాలల్లో బోధన చేపట్టేందుకు అవకాశం కల్పించింది. ఈ సంస్థకు ముందుగా చిత్తూరు జిల్లాలోని కొన్ని స్కూళ్లు మాత్రమే అప్పగించారు. తర్వాత మరికొన్ని జిల్లాల్లోని స్కూళ్లను కూడా దీని పరిధిలో చేర్చారు. గతేడాది నాటికి ఆ సంస్థకు 1,700 స్కూళ్లు, ఈ ఏడాది మరో 1,450 స్కూళ్లను అప్పగించారు. ముందుగా 1, 2 తరగతుల్లోని విద్యార్థులకు మాత్రమే ఈ సంస్థ బోధన సాగించేది. ఇప్పుడు 3, 4, 5 తరగతుల్లో కూడా ఈ సంస్థ విధానాలనే పాటించాలని ఆయా జిల్లాల అధికారులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. ఈ సంస్థ కేవలం తన బోధన పద్ధతులను ప్రభుత్వ టీచర్లకు నేర్పించి బోధన సాగించేలా చేస్తోంది. దీనికోసం ఇప్పటివరకు ఈ సంస్థకు రూ.50 కోట్ల వరకు చెల్లించడం గమనార్హం. ఎస్సీఈఆర్టీ పాఠ్య ప్రణాళికను అటకెక్కించి ఈ సంస్థ తన సొంత సిలబస్‌ను, పాఠ్యప్రణాళికను అమలు చేయిస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలోని టీచర్లు ఈ సంస్థ ఇచ్చే శిక్షణకు హాజరుకావడంతోపాటు సంస్థ సిబ్బంది చెప్పే పనులు చేయాల్సి వస్తోంది. దీన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నా ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. చిత్తూరు జిల్లా మొత్తం ఈషా ఫౌండేషన్‌కు అప్పగింత కాగా, ఈషా ఫౌండేషన్‌కు ఇంతకుముందు సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోని స్కూళ్లను మాత్రమే అప్పగించారు. తాజాగా ఆ జిల్లాలోని రిషివ్యాలీ స్వచ్ఛంద సంస్థకు ఇచ్చిన స్కూళ్లు మినహా మొత్తం అన్ని స్కూళ్లనూ ఈషా ఫౌండేషన్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ జిల్లా ప్రభుత్వ టీచర్లపై ఈ సంస్థ సిబ్బంది పెత్తనం పెరిగిపోయింది. ఈ సంస్థకు కూడా ప్రభుత్వ సొమ్మును వందల కోట్లలో ముట్టచెబుతున్నారు. ఈ సంస్థ చంద్రబాబుకు అత్యంత ప్రీతిపాత్రమైనది కావడంతో సంస్థ ప్రతినిధులు అధికారుల మాటలు కూడా లెక్కచేయడం లేదు. వారు అడిగిన మేరకు నిధులు మంజూరు చేయడం ఒక్కటే తమ పని అని అధికారవర్గాలే పేర్కొంటున్నాయి. డ్యాన్సుల పేరిట కోట్లు దోపిడీ కాగా, ప్రభుత్వ స్కూళ్లలో కంప్యూటర్ ద్వారా డ్యాన్సులు నేర్పేందుకు గతేడాది టిపా, సిలాజిస్ట్ అనే సంస్థలకు విద్యా శాఖ అనుమతి ఇచ్చింది. విశాఖ జిల్లాలోని కొన్ని స్కూళ్లలో కంప్యూటర్ ద్వారా డ్యాన్సులు నేర్చుకునేందుకు విద్యార్థులకు అవసరమైన ఉపకరణాలు ఈ సంస్థలు సమకూరుస్తాయి. వాస్తవానికి ఈ సంస్థలకు డ్యాన్సులు నేర్పించేందుకు ఎలాంటి నిపుణులు లేరు. కేవలం కంప్యూటర్ సీడీల్లో కొన్ని కార్యక్రమాలను అప్లోడ్ చేయించి వాటిని స్కూళ్లలోని పిల్లలకు నేర్పించడం చేస్తుంటారని, దీనికోసం ఏకంగా ఈ సంస్థలకు రూ.5 కోట్లు చెల్లించారని విద్యా శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర మంత్రికి బంధువులు కావడంతో విద్యా శాఖ అధికారులు అనుమతులు ఇచ్చారు. ఈ ఏడాది మరో మూడు జిల్లాల్లో డ్యాన్సులు నేర్పడానికి సదరు సంస్థ ప్రతిపాదనలను పాఠశాల విద్యాశాఖకు అందించింది. దీనికి రూ.40 కోట్ల వరకు ఆ సంస్థకు చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ సంస్థ డ్యాన్సులు నేర్చుకోవడం వల్ల విద్యార్థుల్లో అభ్యసనం ఎంతో మెరుగుపడిందని అధికారులు తప్పుడు నివేదికలను సిద్ధం చేయిస్తున్నారని పేర్కొంటున్నారు. గతేడాది పరీక్షల్లో ఆయా స్కూళ్లలో విద్యార్థులు అత్యధికంగా ఉత్తీర్ణులవ్వడానికి కారణం ఈ కంప్యూటర్ డ్యాన్సులేనని నివేదికలు రూపొందించి, వాటి ఆధారంగా మరో మూడు జిల్లాల్లో కార్యక్రమాల అమలుకు అనుమతులు ఇచ్చేలా సదరు మంత్రి అధికారుల ద్వారా వ్యవహారాన్ని నడిపిస్తున్నారని పేర్కొంటున్నారు. -
ప్రస్తుతానికి బదిలీలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు మార్గం సుగమమైంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే బదిలీలు చేపట్టనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో జరిగిన బదిలీల ఉత్తర్వుల్లోని నిబంధనల ఆధారంగా.. స్వల్ప సవరణలతో తాజా బదిలీల ప్రక్రియ చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. టీచర్ల బదిలీలు, పదోన్నతుల అంశంపై బుధవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, విద్యా శాఖ అధికారులు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. బదిలీల కంటే ముందే పదోన్నతులు ఇవ్వాలని ఈ భేటీలో ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. అయితే పదోన్నతుల అంశం సర్వీసు నిబంధనలతో ముడిపడి ఉందని, అది తేలనిదే పదోన్నతులివ్వడం కష్టమని, దీనిపై కోర్టు కేసులు కూడా ఉన్న నేపథ్యంలో పదోన్నతుల కౌన్సెలింగ్ వీలుకాదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. అనంతరం బదిలీల అంశంపై చర్చించారు. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోలు 12, 86లలోని నిబంధనల్లో స్వల్ప మార్పులు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరగా.. అధికారులు సానుకూలంగా స్పందించారు. టీచర్లకు ఎనిమిదేళ్లు.. : ఉపాధ్యాయుల తప్పనిసరి బదిలీ సమయాన్ని కూడా సమావేశంలో నిర్ధారించారు. ఐదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులను బదిలీ చేయాలని నిర్ణయించారు. అదే స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ), సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీల)కు మాత్రం ఎనిమిదేళ్ల పరిమితి నిర్ధారించారు. పాత జిల్లాల ప్రకారమే బదిలీలు చేపడుతున్నందున ఒక్కో జిల్లాకు అదనపు డైరెక్టర్ స్థాయి అధికారిని పరిశీలకుడిగా నియమించాలని.. యాజమాన్యాల వారీగా బదిలీలు నిర్వహించాలని.. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. ఇక ఏకీకృత సర్వీసు నిబంధనలకు సంబంధించి ప్రత్యేక న్యాయవాదిని నియమించాలని ఉప ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశాయి. ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లలో ఏకాభిప్రాయం వచ్చిన వాటికి పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. మిగతా అంశాలపై అంతర్గత సమావేశం నిర్వహించి చర్చిస్తామని స్పష్టం చేసింది. బదిలీలకు సంబంధించి సంఘాలు చేసిన సూచనలతో ప్రతిపాదనలు రూపొందించి.. ప్రభుత్వానికి అందజేసినట్టు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో బదిలీల మార్గదర్శకాలు వెలువడనున్నట్లు సమాచారం. -
ఉద్యోగ సంఘాల డిమాండ్లపై కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేబినెట్ సబ్ కమిటీ ఉద్యోగుల 18 డిమాండ్లు, ఉపాధ్యాయులకు సంబంధించి 34 డిమాండ్లపై ఈ సమావేశంలో చర్చించారు. సీపీఎస్ రద్దు, పీఆర్సీ అమలు, బదిలీలు, ప్రమోషన్ల, ఫిట్మెంట్, ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగుల రప్పించటం వంటి ప్రధాన డిమాండ్లు మినహా మిగిలిన వాటికి ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం. పది మందికే అనుమతి ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశానికి ఉద్యోగ సంఘాల నాయకులు, జిల్లాల నుంచి భారీ సంఖ్యలో జనం రావడంతో అందరీని లోపలికి పంపించడం కుదరలేదు. కేవలం పది మందికి మాత్రమే లోపలికి అనుమతించడంతో మిగతా ఉద్యోగులు ప్రగతిభవన్ వెలుపలే ఉండిపోయారు. దీంతో కొంత మంది ఉద్యోగులు ఇలాంటి ప్రభుత్వాన్ని తాము ఎప్పుడు చూడలేదని, ముందుగానే మాకు సమాచారం అందించి ఉంటే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మిగతా ఉద్యోగులు ప్రగతి భవన్ ముందు పుట్‌పాత్‌పై పడికాపులు కాశారు. -
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్ : ముఖ్య మంత్రి కె. చంద్రశేఖర్ రావు నేడు మధ్యాహ్నం 03 గంటలకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ప్రగతిభవన్‌లో భేటి కానున్నారు. ఈ సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం నివేధికలపై సంఘాలతో చర్చించనున్నారు. అంతేకాక ఆర్టీసీ ఉద్యోగులతో కూడా చర్చించి వారి డిమాండ్లతో రిపోర్టు ఇవ్వాలని గతవారంలో సీఎం కెబినెట్ సబ్ కమిటీని ఆదేశించిన విషయం తెలిసిందే. గత ఆదివారం ఆర్టీసీ కార్మికులతో చర్చించి సీఎంకు ఉపసంఘం రిపోర్టు అందించింది. మంగళవారం ఆర్టీసీ డిమాండ్లపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. అప్పులో ఉన్నా.. ఇతర రాష్ట్రాలకంటే ఎక్కువ జీతాలు ఇస్తున్నామని సీఎం అన్నారు. అంతేకాక గతంలో 44% ఫిట్మెంట్ కూడా ఇచ్చామని తెలిపారు. సంస్థను కాపాడేందుకు ప్రభుత్వం సహకరిస్తున్న గొంతెమ్మ కోరికలు కోరుతారా అంటూ కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నేడు ప్రగతిభవన్‌లో జరుగుతున్న మీటింగ్‌కు ఆర్టీసీ కార్మికులు అవసరం లేదని సీఎం అన్నారు. సచివాలయంలో ఆర్టీసీ కార్మికులతో కెబినెట్ సబ్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. -
సమయం వృథా చేయొద్దు
- ఉపాధ్యాయులకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సూచన - రవీంద్రభారతిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం - 60 మంది టీచర్లు, రెండు ఉత్తమ పాఠశాలలకు అవార్డులు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ సంఘాల పేరుతో టీచర్లు సమయం వృథా చేయవద్దని, ఆ సమయాన్ని పాఠశాలల అభివృద్ధికి వెచ్చించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల ల్లో సమస్యలపై సంఘాలమీద ప్రభుత్వం, ప్రభుత్వం మీద సంఘాలు విమర్శలు చేసుకోవడం సరికాదని ఆయన అన్నారు. సంఘాలు, ప్రభుత్వం పరస్పరం చర్చించుకుని పాఠశాలల అభివృద్ధికి కృషిచేయాలని సూచించారు. తెలంగాణలో విద్యాభివృద్ధి బాగుందని ఇటీవల వివిధ రాష్ట్రాల మంత్రుల సమావేశంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రశంసించారని తెలిపారు. ఈ నేçపథ్యంలో టీచర్లు ఇంకా ఎక్కువ పని చేయాల్సిన బాధ్యత ఏర్పడిందన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవా ర్డులు కూడా బాధ్యతను మరింత పెంచాయని, టీచర్లంతా తమ శక్తికి మించి పని చేయాలని కోరారు. శుక్రవా రం రవీంద్ర భారతిలో ఉపాధ్యాయ దినోత్సవ కార్య క్రమాన్ని నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన 60 మంది టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లను, రెండు ఉత్తమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున నగదు బహుమతి తోపాటు ప్రశంసాపత్రం అందజేశారు. అలాగే రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛ విద్యాలయ అవార్డులకు ఎంపికైన 37 పాఠ శాలలకు పురస్కారాలను, రూ. 10 వేల చొప్పున నగదు బహుమతిని అంద జేశారు. అంతకు ముందు కడియం శ్రీహరి ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల విద్యారంగం నిర్వీర్యం అయిందన్నారు. గాడి తప్పిన విద్యా రంగాన్ని గత మూడున్నరేళ్లుగా దారిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అవార్డులు వచ్చిన వారే కాకుండా మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఉపాధ్యా యులు కూడా బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. అయితే కొంత మంది టీచర్లు సరిగా పనిచేయక పోవడం వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తోం దని, వారు కూడా బాగా పని చేసేలా ప్రోత్సహిం చాలన్నారు. మంచి టీచర్లను గుర్తించి అవార్డులు ఇచ్చాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తు చేసుకోని మంచి టీచర్లను గుర్తించి ప్రత్యేక అవార్డులు ఇచ్చామని కడియం ఈ సందర్భంగా తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మారుమూల మండలం అయిన నర్వలో ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్ది, విద్యార్థుల నమోదును పెంచిన ప్రధానోపా ధ్యాయుడు విజయ భాస్కర్‌రెడ్డికి ప్రత్యేక అవార్డు ఇచ్చామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేణుగోపాల్ అనే స్కూల్ అసిస్టెంట్ విధుల్లో చేరిన ప్పటి నుంచి ఇప్పటివరకు ఐదేళ్లలో ఒక్క సెలవు కూడా తీసుకోకుండా పనిచేస్తున్నారని తెలి పారు. ఓ పత్రికలో వచ్చిన ఆ కథనాన్ని చూసి ఆయనకు ప్రత్యేక అవార్డు ఇచ్చామన్నారు. వారిలాగే అనేక మంది ఉపాధ్యాయులు కూడా పనిచేస్తున్నారని, వారందరి కృషి వల్లే ప్రభుత్వ విద్య పట్ల ప్రజల్లో నమ్మకం పెరుగుతోందన్నారు. అన్నింటికీ మూలం విద్య: ఈటల అన్ని రంగాల్లోకెల్లా విద్యా రంగం చాలా ముఖ్యమైం దని, అన్నింటికీ ఇదే మూలమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గతంలో ఉపాధ్యా యుడు అంటే ఎంతో గౌరవం ఉండేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత గత 50 ఏళ్లుగా ఉన్న రుగ్మతలను రూపుమాపే ప్రయ త్నం చేస్తున్నామని, అయితే ఇది ఒక్కరోజులో జరిగే పనికాదని పేర్కొన్నారు. కొంత సమయం తీసుకున్నా.. అనుకున్న పని కచ్చితంగా చేస్తామన్నారు. గురువుగా పనిచేసిన కడియం శ్రీహరి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉండడం విద్యాభివృద్ధికి ఎంతో దోహద పడుతోం దని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణలో విద్యాభివృద్ధికి కేంద్రం వద్ద తన శాయశక్తులా కృషి చేసి నిధులు వచ్చేలా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చీఫ్ విప్ సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీం దర్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్య కమిషనర్ వాణీ ప్రసాద్, పాఠశాల విద్య కమిషనర్ కిషన్, ఉస్మానియా వర్సిటీ వీసీ రామచంద్రం, తెలుగు వర్సిటీ వీసీ సత్యనారాయణ, జేఎన్టీయూ వీసీ వేణుగోపాల్ రెడ్డి, ఓపెన్ యూనివర్సిటీ వీసీ సీతారామారావు, పలువురు టీచర్లు పాల్గొన్నారు. తేదీలు ఇప్పుడే చెప్పను! త్వరలోనే టీచర్ల భర్తీకి చర్యలు: కడియం సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ ఖాళీల భర్తీ విష యంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి జాగ్రత్త తీసు కుంటున్నారు. శుక్రవారం జరిగిన ఉపాధ్యాయదినో త్సవ కార్యక్రమంలో.. ఇప్పుడే తేదీలను ప్రకటించనని పేర్కొన్నారు. ఇపుడు తేదీలు చెబితే.. అనుకోని పరిస్థి తుల్లో అది అమలు చేయలేకపోతే ఆ విషయం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తుందన్నారు. త్వర లోనే పక్కా విషయాన్ని తెలియజేస్తానని వెల్లడిం చారు. ఈ సందర్భంగా కడియం చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. ‘వర్సిటీల్లో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాం. జూనియర్ కాలేజీల్లోనూ 1,133 పోస్టులను మంజూరు చేశాం. పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీల్లోనూ పోస్టులను మంజూరు చేసుకుంటాం. కాంట్రాక్టు లెక్చరర్లకు ఇబ్బం ది కాకుండా వాటిని టీఎస్పీఎస్సీ డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీకి చర్యలు చేపడతాం. విద్యాశాఖలో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోని నిరుద్యోగులు, ఉపాధ్యాయ అభ్యర్థులకు త్వరలోనే శుభవార్త చెబుతాం. ఇపుడొక తేదీ చెబితే.. తరువాత దానిని సోషల్ మీడియాలో ప్రతిసారి ప్రకటి స్తున్నారు.. అని చర్చ పెడతారు. దానికంటే కచ్చితంగా విషయాన్ని త్వరలోనే తెలియజేస్తాం’. -
1.2 లక్షల ఉద్యోగుల ఆందోళన బాట!
- కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దుకోసం డిమాండ్ - నేటి నుంచి వరుసగా నిరసనలు, ఆందోళనలు - పాల్గొననున్న అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను (సీపీఎస్) రద్దు చేయాలని, పాత పెన్షన్ స్కీంను పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కలిపి దాదాపు 1.2 లక్షల ఉద్యోగులతో పోరుబాటకు సిద్ధం అయ్యాయి. నేటినుంచి సెప్టెంబర్ 1వ తేదీవరకు వరుసగా ర్యాలీలు, ప్రదర్శనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించాయి. టీజీవో, టీఎన్జీవో, టీటీజేఏసీ, టీఈజేఏసీ వంటి సంఘాలు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించగా, జాక్టో, సీపీఎస్ ఉద్యోగ సంఘాలు ఆందోళన కార్యక్రమాలతోపాటు సెప్టెంబర్ 1వ తేదీని విద్రోహ దినంగా పాటించాలని నిర్ణయించాయి. అంతేకాదు ఆ రోజున ఉద్యోగ, ఉపాధ్యాయులంతా సామూహిక క్యాజువల్ లీవ్ పెట్టాలని పిలుపునిచ్చాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పదవీ విరమణ తరువాత వారి భరోసా, భద్రతకు విఘాతంగా ఉన్న సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమల్లోకి తేవాలన్న ప్రధాన డిమాండ్‌తో రాష్ట్రంలోని దాదాపు అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఈ ఆందోళనకు సిద్ధం అయ్యాయి. ఇందులో భాగంగా ఉద్యమ రూపంలో సీసీఎస్ రద్దుకోసం పోరాటం చేసేందుకు సిద్ధం అయ్యాయి. ఈనెల 28న నిరసన ప్రదర్శనలు నిర్వహించి, జిల్లా కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు అందజేయాలని జాక్టో ఆందోళనకు సిద్ధమైంది. ఈనెల 29వ తేదీన టీఎన్జీవో హైదరాబాద్ జిల్లాలో సభను నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది. అలాగే 30, 31 తేదీల్లో అన్ని డివిజన్ కేంద్రాలు, జిల్లా కలెక్టరేట్ల వద్ద, డివిజన్ కేంద్రాల్లో భోజన విరామ సమయాలలో ధర్నాలు నిర్వహించాలని టీజీవో, టీఎన్జీవో సంఘాలు నిర్ణయించాయి. వీటితోపాటు ఇతర ఉద్యోగ సంఘాల భాగస్వామ్యంతో కూడిన తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ (టీఈజేఏసీ), ఈనెల 30వ తేదీన మండల, డివిజన్, జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని, సెప్టెంబర్ 1న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఇటీవల తీర్మానించాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు ఇప్పటికే విజ్ఞాపన పత్రాన్ని అందజేసింది. మరోవైపు సెప్టెంబర్ 1వ తేదీన మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులంతా మండల విద్యాధికారి కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని టీటీజేఏసీ నిర్ణయించగా, అదే రోజు పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ టీచర్లంతా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయాలని, జిల్లా కేంద్రాల్లో సామూహిక ధర్నాలు నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ తీర్మానించింది. -
అంత ఈజీ కాదు!
సాక్షి ప్రతినిధి – నెల్లూరు : తూర్పు రాయలసీమ పరిధిలోని ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను సునాయాసంగా గెలుచుకోగలమనుకున్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. పట్టభద్రుల స్థానం అభ్యర్థి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిపై పార్టీ నేతల్లో అంతర్గతంగా గూడుకట్టుకున్న అసంతృప్తి ఆరడం లేదు. ఉపాధ్యాయ స్థానం అభ్యర్థి వాసుదేవనాయుడుకు పోటీగా టీడీపీకి చెందిన చదలవాడ సుచరిత రెబల్‌గా బరిలో నిలిచారు. ఈ పరిణామాలన్నింటి వల్ల అభ్యర్థుల విజయం సులువు కాదనే నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణను నేరుగా రంగంలోకి దించారు. ఊహించని పరిణామాలు రెండు స్థానాల్లో విజయంపై ధీమాగా ఉన్న తెలుగుదేశం పార్టీకి పట్టభద్రుల అభ్యర్థి ఎంపికలోనే తీవ్ర అసంతృప్తిని ఎదుర్కోవాల్సి వచ్చింది. మంత్రి నారాయణ ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటింపచేయడంతో మూడు జిల్లాల్లో పార్టీ ముఖ్య నాయకులు అసంతృప్తి చెందారు. ఒకరిద్దరు పెద్ద నేతలు తమ అసంతృప్తి బహిరంగంగానే వ్యక్తం చేశారు. చాలా మంది నాయకులు తమ అసంతృప్తిని మనసులోనే పెట్టుకుని పైకి నటిస్తున్నారు. మంత్రి నారాయణను సమర్థిస్తున్న కొందరు నేతలు అభ్యర్థుల విజయానికి ప్రచారం చేస్తున్నారు. పట్టాభి ఎంపికపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఉపాధ్యాయ స్థానానికి అభ్యర్థి ఎంపికపై ఆచి తూచి అడుగు వేయాలనుకున్న పార్టీ హై కమాండ్ తీవ్ర జాప్యం చేసింది. ఈ మధ్యలోనే ఉపాధ్యాయ స్థానానికి అభ్యర్థిత్వం కోసం గట్టిగా ప్రయత్నించిన టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి భార్య సుచరిత పలు ఉపాధ్యాయ సంఘాల మద్దతు కూడగట్టారు. చివరి నిమిషంలో వాసుదేవ నాయుడును ప్రకటించడంతో సుచరిత రెబల్‌గా బరిలో నిలిచారు. ఆమెను బుజ్జగించి నామినేషన్ ఉపసంహరింప చేయాలని చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, ఆమె భర్త చదలవాడ కృష్ణమూర్తి గట్టిగా ప్రయత్నించినా ఆమె ససేమిరా అన్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడానికి రెండు రోజుల ముందు నుంచి ఆమె అందుబాటులో లేకుండా పోయారు. దీంతో సుచరిత రెబల్‌గా బరిలో నిలిచారు. ఆమె ప్రచారం ముమ్మరం చేస్తే టీడీపీకి వచ్చే ఓట్లకు గండిపడుతుందనే భయంతో ఇప్పటికైనా ఆమె బయటకు రాకుండా కట్టడి చేయాలని టీడీపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. బరి నుంచి తప్పుకోవాలని తన భర్త ఒత్తిడి చేసినా సుచరిత ససేమిరా అంటున్నారు. ఇదే సందర్భంలో పట్టభద్రుల స్థానానికి సంబంధించి సుమారు 15వేల ఓట్లు, ఉపాధ్యాయ స్థానంలోని సుమారు 2 వేల ఓట్లు బోగస్విగా తేలడం టీడీపీకి శరాఘాతమైంది. బాబు ఆదేశంతో రంగంలోకి నారాయణ తూర్పు రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో నెలకొన్న పరిణామాలతో సీఎం చంద్రబాబు నాయుడు అసహనానికి గురయ్యారని సమాచారం. ఈ ఎన్నికల బాధ్యత తన భుజస్కంధాల మీద వేసుకున్న నారాయణ సీఎం చంద్రబాబు ఆదేశంతో శుక్రవారం నుంచి నేరుగా రంగంలోకి దిగారు. పట్టభద్రుల ఓట్లను నేరుగా ప్రభావితం చేయగలిగిన పార్టీ నేతల్లో పట్టాభి ఎంపికపై ఉన్న అసంతృప్తిని తొలగించడానికి సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరులో ఆయన సమావేశాలు ఏర్పాటు చేశారు. ఓటరుగా నమోదైన ఉపాధ్యాయులను పార్టీ నేతలు నేరుగా కలసి వారి మద్దతు కోరడం, నయానో, భయానో వారి ఓటు సంపాదించే వ్యూహం అమలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉండటంతో మంత్రి నారాయణ ఆ జిల్లా నాయకులతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రకాశం జిల్లా నాయకులు, ఉపాధ్యాయ సంఘాలతో కూడా సమన్వయం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తెలుగుదేశం నాయకులు ఉపాధ్యాయులను కలసి తమకు ఓటు వేయక పోతే ఇబ్బందులు ఎదురవుతాయనే రీతిలో పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరి మధ్య సహకారానికి రాయబారాలు టీడీపీ రెబల్‌గా బరిలో నిలిచిన చదలవాడ సుచరిత, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పట్టభద్రుల స్థానానికి పోటీకి దిగిన ప్రకాశం జిల్లాకు చెందిన రామచంద్రారెడ్డి పరస్పరం ఓట్లు మార్చిడి చేసుకునేలా రాయబారాలు సాగుతున్నాయి. తిరుపతికి చెందిన యువజన కాంగ్రెస్ మాజీ నాయకుడు ఒకరు ఇద్దరి మధ్య చర్చలకు తెర లేపారు. ఇదే జరిగితే టీడీపీకి అటు ఉపాధ్యాయ స్థానంతో పాటు ఇటు పట్టభద్రుల స్థానంలో కూడా గండిపడే ప్రమాదం కనిపిస్తోంది. -
కొత్త ఓటు.. తీర్పు ఎటు?
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి కొత్తగా 6 వేలకుపైగా ఓట్లు మద్దతు కోసం టీచర్ల సంఘాలతో ఆశావహుల సంప్రదింపులు సిట్టింగ్ ఎమ్మెల్సీని గెలిపించుకునేందుకు టీఆర్ఎస్ యత్నాలు ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో హరీశ్ భేటీ సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘాలు బిజీ అయ్యాయి. ఇప్పటికే మద్దతు ప్రకటించిన తమ అభ్యర్థులతో సభలు, సమా వేశాల నిర్వహణలో పడ్డాయి. టీఆర్ఎస్ కూడా సిట్టింగ్ ఎమ్మెల్సీని గెలిపించుకునేందుకు దృష్టి సారించింది. గతంలో కంటే ఈసారి ఓట్ల సంఖ్య 6 వేలకు పైగా పెరగడంతో ఆశావహులు తమ ప్రయత్నాల్లో ముని గారు. ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రభుత్వ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చ రర్ల ఓట్లు ఈసారి కీలకం కానున్నాయి. దీంతో నోటి ఫికేషన్ జారీ కాకముందు నుంచే ఆయా సంఘాల సమావేశాల నిర్వహణలో ఆశావహులు తల మునకల య్యారు. ఈ నెల 13 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది. తమ అభ్యర్థులను పోటీలో నిలుపుతామని 5 సంఘాలు ప్రకటించాయి. అభ్యర్థులు ఎందరో...? ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారికంగా 8 మంది అభ్యర్థులను పోటీలో నిలుపుతామని వివిధ ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. అందులో కొందరు నామినేషన్లు వేసినా చివరిలో ఉపసంహ రించుకునే అవకాశం ఉంది. ప్రధానంగా పోటీలో ఉండే అభ్యర్థులు సంఘాల మద్దతు కూడగట్టడంతో పాటు ఈ అంశంపైనా ప్రత్యేక దృష్టి సారించారు. మొత్తానికి ప్రధాన పోటీ ఇద్దరి మ«ధ్యే ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం కూడా ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి తన ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఆయన ఇదివరకే టీఆర్ఎస్లో చేరారు. అయితే పార్టీ అధికారికంగా తమ అభ్యర్థి అని ప్రకటించకపోయినా ఆయన్ను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నియోజకవర్గంలోని మూడు జిల్లాలకు చెందిన మంత్రులను అప్రమత్తం చేసింది. ఇటీవలే మంత్రి హరీశ్‌రావు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమయ్యారు. శనివారం ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించారు. గతంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్ ఓటమికి ప్రధాన కారణం ఉపాధ్యాయులేనన్న భావన ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో గత పరిస్థితులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పెరిగిన ఓటర్లు మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2011లో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో 15,053 ఓట్లు ఉండగా అందులో 11,883 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య పెరిగింది. ఈ నెల 13 వరకు కూడా ఓటర్ల నమోదుకు అవకాశం ఉంది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల నుంచి అధిక సంఖ్యలో ఓటర్లు నమోదయ్యారు. ఓటర్ల సంఖ్య 21,520కి చేరింది. ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచుకునేందుకు ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సభలు, సమావే శాలు నిర్వహిస్తూ తమకు పడే ఓట్లపై బేరీజు వేసుకుంటున్నారు. పాత జిల్లాల ప్రకారం మహ బూబ్‌నగర్‌లో 6,510 మంది, రంగారెడ్డి జిల్లాలో 12 వేల మంది, హైదరా బాద్ జిల్లాలో 3,010 మంది ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. సంఘాల నుంచి ఎవరెవరు? 15 ఏళ్లు ప్రభుత్వ జూనియర్ లెక్చరర్‌గా పని చేసిన ఏవీఎన్ రెడ్డిని గెలిపించుకు నేందుకు ఎస్టీయూ, టీఎస్టీయూ, మరికొన్ని ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు తీవ్రంగా ప్రయత్నిస్తు న్నాయి. వివిధ ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల మద్దతు కూడగట్టుకోవడంతోపాటు ప్రైవేటు స్కూళ్లు కాలేజీల నుంచి భారీ మొత్తంలో ఓటర్ల నమోదుకు చర్యలు చేపట్టారు. ఇక పీఆర్టీయూ– తెలంగాణ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు హర్షవర్ధన్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టీచర్ పోస్టుకు రాజీనామా చేసి ఆయన పోటీకి సిద్ధమయ్యారు. పీఆర్టీయూ– టీఎస్పై వ్యతిరేకతే ప్రధాన అంశంగా ప్రచారం చేస్తున్నారు. టీఎస్–యూటీఎఫ్ అభ్యర్థిగా మాణిక్‌రెడ్డి, టీపీయూఎస్ అభ్యర్థి భూపతిరెడ్డి తమ ప్రచారాన్ని కొనసాగి స్తున్నారు. మరికొన్ని ఉపాధ్యాయ సంఘాల నుంచి అభ్యర్థులు పోటీలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. -
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
- ఢిల్లీలో భారీ ధర్నా చేపట్టిన ఉపాధ్యాయ సంఘాలు - తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైన15 వేల మంది ఉపాధ్యాయులు సాక్షి, న్యూఢిల్లీ: కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు మంగళవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారుు. ఈ ధర్నాలో 20 రాష్ట్రాలకు చెందిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్)కు చెందిన సుమారు 15 వేల మంది ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్టీఎఫ్ఐ జనరల్ సెక్రటరీ సీఎన్. భారతి మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పీఎఫ్ఆర్డీఏను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ ధర్నాలో ఆంధ్రప్రదేశ్ నుంచి పీడీఎఫ్ ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, వై. శ్రీనివాసులు రెడ్డి, డా.ఎం.గేయానంద్, ఎంవీఎస్ శర్మ, బొడ్డు నాగేశ్వరరావు పాల్గొని సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐ. వెంకటేశ్వరరావు, పి. బాబురెడ్డి ప్రసంగిస్తూ.. సీపీఎస్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ ఉపాధ్యాయుల జీవితాలతో ఆటలాడుతుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. పాత పెన్షన్ విధానం ప్రకారం ఉపాధ్యాయులకు ఉద్యోగ విరమణ చేసే సమయంలో ఎంత జీతం ఉందో.. అందులో సగం ఉద్యోగ విరమణ తరువాత పెన్షన్‌గా వచ్చేదన్నారు. అరుుతే సీపీఎస్ అమలు వల్ల ఆ పెన్షన్ రాకుండా పోతోందన్నారు. 12 ఏళ్లుగా అమలవుతున్న ఈ విధానం.. దేశంలో 40 లక్షల మంది ఉపాధ్యాయుల ప్రయోజనాలకు ప్రతిబంధకంగా మారిందని యూటీఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్. రవి పేర్కొన్నారు. ఈ ధర్నాలో ఎస్టీఎఫ్ఐ అధ్యక్షుడు అబిజిత్ ముఖర్జీ, సంఘం నేతలు ఎన్.నారాయణ, కేసీ. హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
డిప్యూటీ ఈవో పోస్టులు ఉన్నట్టా..? లేనట్టా?
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యా శాఖలో ప్రస్తుతం ఉన్న 56 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్(డి ప్యూటీ ఈవో) పోస్టులు రద్దయ్యాయా? ఈ ప్రశ్నకు విద్యా శాఖ మౌఖి కంగా లేదని సమాధానం చెబుతోంది. ప్రభుత్వానికి ఇటీవల విద్యా శాఖ ఇచ్చిన నివేదికలో మాత్రం ఈ పోస్టులను చూపించలేదు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రతి జిల్లాకు ఓ డీఈవోను నియమించేందుకు చర్యలు చేపట్టింది. దీనికి ప్రస్తుతమున్న 11 మంది డిప్యూటీ ఈవోలను ఇన్చార్జి డీఈవోలుగా నియమిస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అయితే ఇన్చార్జి డీఈవోలుగా వెళ్లిపోయాక ఖాళీ అయ్యే స్థానాలను ఎవరితో భర్తీ చేస్తారన్న అంశాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. వాటి భర్తీ ప్రస్తావన లేకుండానే కొత్త జిల్లాల్లో డీఈవో కార్యాలయాలు, విద్యా విభాగం వివరాలను పొందుపరిచింది. దీంతో ఆయా పోస్టులను రద్దు చేస్తోందన్న ఆందోళన ఉపాధ్యాయ వర్గా ల్లో నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 12 డీఈవో పోస్టులుం డగా, కొత్తగా వచ్చే డిప్యూటీ ఈవోలు 11 మందిని కలిపి 23 పోస్టులవుతున్నాయి. మరో 4 పోస్టుల్లో ఏడీ లేదా డైట్ లెక్చరర్లను ఇన్చార్జి డీఈవోలుగా నియమించడం ద్వారా మొత్తం 27 జిల్లాలకు 27 మందిని డీఈవోలుగా నియమించనున్నట్లు తెలిసింది. మరోవైపు ఏజెన్సీ డీఈవో పోస్టులను రద్దు చేయనున్నట్లు పేర్కొంది. దీంతో ఈ పోస్టులపై సందిగ్ధత నెలకొంది. ఉపాధ్యాయ సంఘాలు ఈ పోస్టులను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో 467 మండల విద్యాధికారి పోస్టులుండగా, 44 మంది పనిచేస్తున్నారు. మిగతా పోస్టుల్లో సీనియర్ హెడ్మాస్టర్లను ఇన్చార్జి ఎంఈవోలుగా నియమిస్తామని నివేదికలో పేర్కొంది. డిప్యూటీ ఈవో పోస్టులను రద్దు చేయొ ద్దని, ప్రస్తుత పాఠశాలల సంఖ్య పెరిగినందున ఈ పోస్టులను జిల్లాకు ఒకటి నియమించాలని పీఆర్టీయూ- తెలంగాణ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి కోరారు. -
మనమేమైనా అసెంబ్లీలో ఉన్నామా?
ఉపాధ్యాయ సంఘాల భేటీలో విద్యాశాఖ డెరైక్టర్ కిషన్ ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: రాబోయే విద్యావార్షిక క్యాలెండర్‌పై చర్చించేందుకు శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ డెరైక్టర్ కిషన్ ఏర్పాటుచేసిన సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో పాల్గొన్న కొన్ని సంఘాలు విద్యాశాఖ రూపొందించిన నూతన క్యాలెండర్‌ను స్వాగతిస్తున్నామని చెప్పగా, మరికొన్ని సంఘాలు ఈ క్యాలెండర్ అమలును వచ్చే ఏడాది జూన్‌కు వాయిదా వేయాలని పట్టుబట్టాయి. సమావేశపు ఎజెండాలోని పలు అంశాలపై కొన్ని సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండగా, మరికొన్ని సంఘాల ప్రతినిధులు నినాదాలు చేస్తూ తమ అభ్యంతరాలను ప్రకటించారు. అభిప్రాయాలు చెప్పేందుకు ప్రతి సంఘానికి ఎంతసేపైనా సమయమిస్తానని డెరైక్టర్ ప్రకటించినా, కొందరు ప్రతినిధులు పదేపదే లేచి నిలబడి వాదులాడుకోవడం పట్ల డెరైక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మనమేమైనా అసెంబ్లీలో ఉన్నామా.. మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకునేందుకు ఇక్కడ కెమెరాలు కూడా లేవే’..అన్నారు. వార్షిక కేలండర్పై ఎవరేమన్నారంటే.. రాష్ట్రంలో సీబీఎస్ఈ విద్యావిధానాన్ని అవలంభిస్తే ఇబ్బంది లేదుకానీ, సీబీఎస్ఈ అకడమిక్ క్యాలెండర్‌ను అమలు చేస్తే విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందని పీఆర్టీయూటీఎస్ అధ్యక్షుడు సరోత్తమ్‌రెడ్డి అన్నారు. సీబీఎస్ఈ క్యాలండర్ ప్రకారం మార్చి 21నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని, ఆ సమయంలో ఎంతోమంది ఉపాధ్యాయులు టెన్త్ పరీక్షల ఇన్విజిలేషన్ ఆపై మూల్యంకన విధులకు వెళతారని చెప్పారు. ఈ దృష్ట్యా నూతన విద్యాసంవత్సరాన్ని జూన్ నుంచే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్టీయూటీఎస్ ప్రధాన కార్యదర్శి భుజంగరావు మాట్లాడుతూ..ప్రస్తుత ఏడాది షెడ్యూల్ ముందుగానే ఖరారైనందున, కొత్త క్యాలండర్‌ను వచ్చే ఏడాది జూన్‌కు వాయిదా వేయాలని కోరారు. ఎస్జీటీ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు మధుసూదనరావు మాట్లాడుతూ.. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక గది, ఒక టీచర్ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ.. నూతన క్యాలండర్‌ను తాము స్వాగతిస్తున్నామన్నారు. మార్చి 21 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలా ప్రభుత్వం రూపొందించిన విద్యావార్షిక క్యాలండర్‌ను తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్(ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి స్వాగతించారు. -
నూతన విద్యా విధానంలో మరో 4 అంశాలు
♦ కేంద్రానికి ప్రతిపాదించాలని నిర్ణయించిన రాష్ట్రం ♦ రాష్ట్ర అవసరాలపై సూచనల కోసం రాజకీయ పార్టీలతో అఖిలపక్షం ♦ ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాల నుంచి అభిప్రాయాల సేకరణ ♦ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా సిఫారసులు: డిప్యూటీ సీఎం కడియం సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తేనున్న నూతన విద్యా విధానంలో మరో నాలుగు ప్రధాన అంశాలపై చర్చించి విధాన పరమైన నిర్ణయాలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసేందుకు రాష్ట్ర విద్యా శాఖ సిద్ధమైంది. విద్యా హక్కు చట్టం నిబంధనలు, అమలు, విద్యా రంగం బలోపేతానికి ఆర్థిక వనరుల కల్పన, నాణ్యమైన విద్యాబోధన, ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతం, పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం వంటి నాలుగు ప్రధా న అంశాలకు నూతన విద్యా విధానంలో చోటు కల్పించాలని, వాటిపై ప్రభుత్వానికి స్పష్టమైన వైఖరి ఉండాలని పేర్కొంది. ఈ మేరకు పాఠశాల స్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించిన సమావేశాల్లో వెల్లడైన అభిప్రాయాల ఆధారంగా ఈ సిఫారసులను సిద్ధం చేస్తోంది. విద్యాశాఖ ఇటీవల రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యా య సంఘాలు, ఎమ్మెల్సీలు, మేధావులతో సమావేశాలు నిర్వహించింది. ఇక సోమవారం పాఠశాల విద్యా డెరైక్టరేట్లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీల నేతల నుంచి అభిప్రాయాలు స్వీకరించింది. వీటన్నింటినీ క్రోడీకరించి ఈ నెల 31 లోగా కేంద్రానికి సిఫారసులను పంపించాలని నిర్ణయించింది. కనీస సామర్థ్యం కరువు: కడియం ప్రస్తుతం రాష్ట్రంతోపాటు దేశ వ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల్లో కనీస సామర్థ్యం ఉండ టం లేదని కడియం అన్నారు. తెలంగాణలోని పాఠశాలల్లో విద్యార్థుల నమోదు 98 శాతం ఉందని, అయితే వారంతా హైస్కూ లు చదువు పూర్తయ్యే వరకు పాఠశాలల్లో ఉండటం లేదన్నారు. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు, విద్యా ప్రమాణాల పెంపునకు అవసరమైన సూచనలు కోరారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. పార్టీల నేతలేమన్నారంటే... శ్రీనివాసరెడ్డి, సుధాకర్‌రెడ్డి(టీఆర్ఎస్): యూనివర్సిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వీసీలను నియమించాలి. అలాగే పర్యవేక్షణ బలోపేతం చేస్తే స్కూళ్లు బాగుపడతాయి. కమలాకర్‌రావు(కాంగ్రెస్): అనుభవ పూర్వక విద్య అవసరం. వ్యవసాయ ఆధారిత కోర్సులు ప్రవేశ పెట్టాలి. ప్రాథమిక విద్యనుంచే ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టాలి. ఉన్నత విద్యలో వృత్తి విద్యను ప్రవేశ పెట్టాలి. ఆర్.కృష్ణయ్య, రావుల చంద్రశేఖర్‌రెడ్డి (టీడీపీ): ఐదో తరగతి వరకు మాతృభాషలోనే విద్య ఉండాలి. ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తూనే ప్రైవేటు స్కూళ్లను నియంత్రించాలి. 50 శాతం మహిళా టీచర్లను నియమించాలి. నల్లా సూర్య ప్రకాశ్(వైఎస్సార్సీపీ): ఒకటో తరగతి నుంచే ఇంగ్లిషు మీడియం ప్రవేశ పెట్టాలి. పోటీని తట్టుకోవాలంటే ఇంగ్లిషు మీడియం అవసరం. అధికారులు, రాజకీయ నాయకులు, తమ పిల్లలను ఇంగ్లిషు మీడియంలో చదివిస్తూ ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం తెలుగు మీడియం ఉండాలంటున్నారు. ఈ ద్వంద్వ విధానాన్ని విడనాడాలి. టీచర్లు స్థానికంగా ఉండేలా చర్యలు చేపట్టాలి. మనోహర్‌రెడ్డి (బీజేపీ): స్కూళ్లలో ల్యాబ్‌ల నిర్వహణపై చర్యలు చేపట్టాలి. బయో మెట్రిక్ విధానం పక్కాగా అమలు చేయాలి. పల్లా వెంకట్‌రెడ్డి (సీపీఐ): సరిపడా నిధులు ఇవ్వాలి. టీచర్ల బదిలీలను సెలవుల్లోనే చేపట్టాలి. రాష్ట్రంలో కామన్ విధానం ఉండాలి. సాగర్(సీపీఎం): కేంద్రం కిందిస్థాయి నుంచి అభిప్రాయాలు తీసుకోకుండా, పైస్థాయి నుంచే నిర్దిష్ట అంశాలపై నిర్ణయాలు తీసుకోవాలి. టెట్ అవసరం లేదు. రాజారెడ్డి(లోక్‌సత్తా): ప్రభుత్వ విద్యారంగంలో ప్లే స్కూళ్లను ఏర్పాటు చేయాలి. ఆయేషా రుబినా (ఎంఐఎం): స్కూళ్లలో వసతులు కల్పించాలి. కంప్యూటర్ విద ్యను బలోపేతం చేయాలి. -
సర్కారీ బడులపై నమ్మకం కలిగించాలి
‘నూతన విద్యా విధానం’పై సదస్సులో కడియం * అది లేదు గనుకే ప్రైవేట్ స్కూళ్లకు పిల్లలు * ప్రభుత్వ విద్యావ్యవస్థను కాపాడాలని టీచర్లకు హితవు * పలు సలహాలిచ్చిన ఉపాధ్యాయ సంఘాలు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం లేకనే, మెరుగైన విద్య కోసం అప్పు లు చేసైనా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ‘‘రాష్ట్రంలో 60 లక్షల మంది పాఠశాల విద్యార్థుల్లో 29 లక్షలు ప్రభుత్వ, 31 లక్షలు ప్రైవేటు స్కూళ్లలో ఉన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచరు ఉం డాల్సి ఉంటే అధికారిక లెక్కల ప్రకారం 21 మందికి ఒకరున్నారు. ఉన్నత పాఠశాలల్లో ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక టీచరు ఉండాల్సి ఉంటే 19 మందికి ఒకరున్నారు. అయినా ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతుంటే ప్రభుత్వ స్కూళ్లలో తగ్గుతోంది’’ అని ఆవేదన వెలిబుచ్చారు. ‘నూతన విద్యా విధానం’పై గురువారం హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో ఆయన అతిథిగా పాల్గొని, 48 ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ స్కూళ్లను పటిష్టం చేయాల్సిన బాధ్యత టీచర్లదేనన్నారు. అందరికీ విద్య-అందరి బాధ్యత రాష్ట్రంలో విద్యారంగం అనేక సమస్యలను ఎదుర్కొటోందని, ప్రభుత్వ విద్యావ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత టీచర్లతో పాటు అందరిపైనా ఉందని కడియం అన్నారు. కేంద్రం సంకల్పించిన నూతన విద్యా విధానానికి రాష్ట్రం తరఫున నివేదిక పంపాల్సి ఉందని గుర్తు చేశారు. నిపుణులు, మేధావుల నుంచి సూచనలు స్వీకరించేందుకు త్వరలో వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో పాఠశాల విద్య డెరైక్టర్ కిషన్, ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, పాతూరి సుధాకర్‌రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఏమన్నాయంటే.. టోల్‌ఫ్రీతో అవమానించొద్దు: సరోత్తమ్ అన్ని వ్యవస్థల మాదిరిగానే విద్యావ్యవస్థ కూడా కలుషితమైందని పీఆర్టీయూటీఎస్ అధ్యక్షుడు సరోత్తమ్‌రెడ్డి అన్నారు. పాఠశాలలపై పర్యవేక్షణకు కాదని పోలీసు అధికారులను నియమించాలని ప్రభుత్వం యోచిస్తుం డడం సరికాదన్నారు. టీచర్లపై ఫిర్యాదుల స్వీకరణకు టోల్‌ఫ్రీ నంబరు ఇవ్వడం అవమానించడమేనన్నారు. పోలీసులను నియమించే యోచన లేదని కడియం స్పష్టం చేశారు. ‘‘సమాచార సేకరణ నిమిత్తమే టోల్ ఫ్రీ నంబరి చ్చాం’’అని అన్నారు. కంప్యూట ర్ విద్య అటకెక్కింది: మోహన్‌రెడ్డి సర్కారీ స్కూళ్లలో కంప్యూటర్ విద్య అటకెక్కిందని పీఆర్టీయూ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి అన్నారు. ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్, స్కూళ్లలో సదుపాయాలు కల్పించాలన్నారు. వీటిపై మార్చిలో ఉపాధ్యాయ సంఘాలతో మళ్లీ భేటీ అవుతామని కడియం చెప్పారు. వృత్తి విద్యకు ప్రాధాన్యం: హర్షవర్ధన్ వృత్తి విద్యపై ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు ఆసక్తిని పెంపొదిస్తే మేలని, నూతన విద్యా విధానంలో దీనికి ప్రాధాన్యమివ్వాలని పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. విధానపత్రం సరిగా లేదు: నర్సిరెడ్డి కేంద్రం రూపొందించిన నూతన విద్యా విధాన పత్రం సరిగా లేదని టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షుడు నర్సిరెడ్డి అన్నారు. హెచ్ఎంలకు పర్యవేక్షణ బాధ్యతలు: శర్మ ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల సంఖ్య పెరిగినందున కాంప్లెక్స్ స్కూల్ ప్రధానోపాధ్యాయులకు తమ పరిధిలోని స్కూళ్ల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని హెడ్మాస్టర్ల సంఘం అధ్యక్షుడు మల్లిఖార్జున శర్మ సూచించారు. పాఠశాల మాదనే భావన: రాజిరెడ్డి ప్రభుత్వ పాఠశాల తమదనే భావన సమాజంలో వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఎస్టీయూ అధ్యక్షుడు రాజిరెడ్డి సూచించారు. పనిచేసే టీచర్లను ప్రోత్సహించాలని.. పనిచేయని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. బాలికలకు రెసిడెన్షియల్ విద్య:కొండల్‌రెడ్డి బాలికలకు రెసిడెన్షియల్ విద్యా విధానాన్ని తప్పనిసరి చేయాలని టీపీటీఎఫ్ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి అన్నారు. -
రాస్కెల్.. యూజ్లెస్ ఫెలో
ఏకేటీపీ ఉపాధ్యాయులపై కమిషనర్ దూకుడు ఆందోళనకు దిగిన ఉపాధ్యాయ సంఘాలు సామూహిక సెలవుకు రంగం సిద్ధం విజయవాడ సెంట్రల్ : యూజ్లెస్ ఫెలో, రాస్కెల్.. ముప్పై మంది విద్యార్థుల భవిష్యత్ నాశనం చేస్తున్నావ్. వీడు కాలేజీలో ఉండగా చదివి ఉండడు. చదివితే పిల్లలకు చెప్పేవాడు. నువ్వు నేటివ్ తెలుగేనా? నార్త్ ఇండియానా? నీకు తెలుగు వచ్చా. 155 మందికి 12 మంది తప్పారు. సిగ్గుపడాలి. ఈవిడ యూజ్లెస్ ఫెలో. సస్పెండ్ చేయండి. మానిటరింగ్ చేయడమే రాదు. వీళ్లను నమ్ముకుంటే మీరు పాస్ కారు. మీ అంతట మీరే చదువుకోవాలి. ..అంటూ మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ ఏకేటీపీ స్కూల్ ఉపాధ్యాయుల్ని అవమానపరిచారంటూ నగరపాలక సంస్థ పాఠశాలల ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి సర్కిల్ 2 కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ మనోభావాలను దెబ్బతీసిన కమిషనర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘం ప్రతి నిధులు డిమాండ్ చేశారు. గురువారం నుంచి సామూహిక సెలవు పెట్టడం ద్వారా ఆందోళనను ఉధృతం చేయాలనే యోచనలో ఉన్నారు. ఏం జరిగిందంటే.. నగరపాలక సంస్థ పాఠశాలల్లో పదో తరగతి ఉత్తీర్ణత శాతాన్ని పర్యవేక్షించేందుకుగాను బుధవారం కమిషనర్ సత్యనారాయణపురం ఏకేటీపీ స్కూల్‌కు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం హెచ్ఎం రూంలో ఉపాధ్యాయులతో సమావేశం జరిపారు. త్రైమాసిక పరీక్షల్లో 30 మంది విద్యార్థులు ఫెయిలవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నూరుశాతం ఫలి తాలు లక్ష్యంగా ఎందుకు పనిచేయడం లేదని నిలదీ శారు. సరైన పద్ధతిలో బోధన చేయలేనివారు సర్వీసు వదిలి వెళ్లిపోవాల్సిందిగా క్లాస్ తీశారు. పర్యవేక్షణ లోపించిన కారణంగానే ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారన్నారు. ప్రధానోపాధ్యాయురాలు కె.నీలిమాదేవి, పీఎస్ ఉపాధ్యాయుడు కె.ఇ. పాల్‌ను సస్పెండ్ చేయాల్సిందిగా డీవైఈవో దుర్గాప్రసాద్‌ను ఆదేశించారు. హెచ్ఎం రూంలో కమిషనర్ అనుచిత వ్యాఖ్యలతో తమను అవమానించారన్నది ఉపాధ్యాయుల ఆరోపణ. కొనసాగుతున్న ఆందోళన కమిషర్ వచ్చి క్షమాపణ చెప్పే వరకు ధర్నాను విరమించేది లేదని ఉపాధ్యాయులు పట్టబట్టారు. సర్కిల్-2 కార్యాలయం ఎదురుగా రోడ్డుపై బైఠాయిం చారు. వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, ఫ్లోర్ లీడర్ బండినాగేంద్ర పుణ్యశీల, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాది విష్ణు, సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ సంఘీభావం తెలి పారు. ఉపాధ్యాయుల ఆందోళనకు మద్దతు పెరగడంతో కమిషనర్ కంగుతిన్నారు. కార్పొరేషన్ కార్యాలయానికి చర్చలకు రావాలని డీవైఈవోకు ఫోన్ చేశారు. ఈ ప్రతిపాదనను ఉపాధ్యాయవర్గాలు తిరస్కరించాయి. తమ వద్దకు వచ్చి క్షమాపణ కోరితేనే ఆందోళన విరమిస్తామని స్పష్టం చేశారు. మహిళా ఉపాధ్యాయులు సౌలభ్యం కోసం రాత్రి పది గంట లకు ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. గురువారం ఉదయం 8 గంటలకు తిరిగి ఆందోళన చేపడతామని ఉపాధ్యాయులు ప్రకటించారు. వారికి మద్దతుగా పదిమంది ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. దురదృష్టకరం ఉపాధ్యాయులపై కమిషనర్ వీరపాండియన్ అనుచిత వ్యాఖ్యలు దురదృష్టకరమని ఎమ్మెల్సీ ఏఎస్. రామకృష్ణ అన్నారు. ఉపాధ్యాయులకు సంఘీభావం ప్రకటించారు. ఉపాధ్యాయులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకోవాలే కానీ, నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఉపాధ్యాయుల ఆందోళనపై వివరణ కోరేందుకు ‘సాక్షి’ పలుమార్లు కమిషనర్‌కు ఫోన్ చేసినప్పటికీ ఆయన స్పందించలేదు. -
ఒకే పరిధిలోకి గురుకులాలు సాధ్యమేనా?
దీనిపై రెండున్నర నెలల కిందట సర్కారు ప్రకటన నేటికీ ముందుకు సాగని ప్రయత్నాలు వ్యతిరేకిస్తున్న కుల సంఘాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ సంక్షేమశాఖలు సహా జనరల్ రెసిడెన్షియల్, మోడల్, కేజీబీవీ, సర్వశిక్ష అభియాన్ పరిధిలోని గురుకుల విద్యాసంస్థలను ఒకే గొడుగు కిందకు తేవాలన్న ప్రభుత్వ ఆలోచన ఇంకా కార్యరూపం దాల్చడంలేదు. గురుకుల విద్యాసంస్థలన్నింటినీ ఒకే పరిధిలోకి తీసుకురావడంతోపాటు నియోజకవర్గానికి 10 చొప్పున గురుకులాలు ఏర్పాటు చేస్తామని సర్కారు ప్రకటించి రెండున్నర నెలలు గడిచినా నేటికీ ప్రాథమిక కసరత్తు సైతం మొదలు కాలేదు. ఈ విష యమై వివిధ కుల, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పరస్పర భిన్నంగా స్పందించడం, వేర్వేరు స్వభావాలు, నేపథ్యాలు, రిజర్వేషన్లు, ఇతర విధానాలున్న గురుకులాలను ఒక చోటు కు తీసుకురావడం ఆచరణలో ఎలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తడం ఇందుకు కారణాలుగా తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలను ఒక చోటకు చేర్చాలన్న ప్రభుత్వ ఆలోచనపై ఆయా విభాగాల అభిప్రాయాలను తెలుసుకున్న ఎస్సీ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెండు నెలల క్రితమే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అన్ని గురుకులాలను ఒక గొడుగు కిందకు తెస్తే తలెత్తే సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన, మెరుగైన వసతులు, ఉద్యోగుల సమస్యలు, ఇతరత్రా అంశాలను అందులో ప్రస్తావించారు. దీనిపై ఆయా శాఖల విభాగాధిపతులు, ఉద్యో గ, ఉపాధ్యాయ సంఘాలు, వివిధ కులసంఘాల ప్రతినిధులతోనూ ఆయన చర్చించారు. నియోజకవర్గానికి 10చొప్పున రాష్ర్టవ్యాప్తంగా 1,200 గురుకులాల ఏర్పాటుపై ఎస్సీ, ఎస్టీ, బీసీ కులసంఘాలు హర్షం వ్యక్తం చేసినా అన్నింటినీ కలిపి సంయుక్త డెరైక్టరేట్ ఏర్పాటు చేయాలనుకోవడాన్ని వ్యతిరేకించాయి. వాటిని వివిధ సంక్షేమ సొసైటీలుగానే కొనసాగించాలని, ఆయా వర్గాల వారీగా సొసైటీల సంఖ్యను పెంచి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశాయి. మరోవైపు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డెరైక్టరేట్ ఏర్పాటుపై సానుకూలంగా ఉన్నాయి. దీనివల్ల తమ జీతభత్యాలు, స్కేళ్లు, ఇతర అలవెన్సులు పెరుగుతాయని భావిస్తున్నాయి. ఉమ్మడి డెరైక్టరేట్ ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని గిరిజన విద్యార్థి సమాఖ్య (టీఎస్ఎఫ్), బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేశాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 889 రెసిడెన్షియల్ స్కూళ్లు ఉండగా అందులో 135 సాంఘిక సంక్షే మ గురుకులాలు, 27 ఎస్టీ గురుకులాలు, 51 జనరల్ రెసిడెన్షియల్ స్కూళ్లు, 23 బీసీ గురుకులాలు, 12 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు, 380 కస్తూర్భాగాంధీ బాలికా వికాస్ స్కూళ్లు, 192 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 3.16 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటుండగా, 18,510 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు వేర్వేరుగా నడుస్తుండగా వాటి బడ్జెట్‌ను కూడా వేటికవి విడిగా కేటాయిస్తున్నారు. ఈ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది సర్వీసు రూల్స్ వేర్వేరుగానే ఉన్నాయి. ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా విడివిడిగా బీసీ,ఎస్టీ,మైనారిటీ సంస్థలు 1976 నుంచి కొనసాగుతున్నాయి. సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీని 1984లో ప్రారంభించారు. ఎస్సీ గురుకులాల్లో ఒక ప్రిన్సిపల్ పోస్టు రాష్ట్రస్థాయిదికాగా మిగతా వాటిలో అవి జోనల్ పోస్టులుగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ గురుకులాలకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు ఉంటాయి. ఎస్సీ గురుకులాల్లో మౌలికసదుపాయాలు మెరుగ్గా ఉండగా ఇతర గురుకులాల్లో అంతంతమాత్రంగానే సౌకర్యాలున్నాయి. ఈ గురుకులాల్లో విద్యార్థుల ప్రవేశం, ఇతరత్రా అంశాలకు సంబంధించి అమలుచేసే రిజర్వేషన్ విధానం వేర్వేరుగా ఉంటుంది. ఒక్కో గురుకులంలో 640 మంది విద్యార్థులను చేర్చుకునే వీలుండగా దానినిబట్టి తరగతి గదులు, డార్మెటరీల ఏర్పాటు ఉంది. వీటిని ఒకే గొడుగు కిందకు తెస్తే ఆయా గురుకులాల పర్యవేక్షణ, ఆజమాయిషీ, మొత్తంగా చదువుసాగే తీరును సమీక్షించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
బదిలీల్లో ఇదేం పాయింటు..
పనితీరు పాయింట్ల కేటాయింపుపై వ్యక్తమతున్న భిన్నాభిప్రాయాలు ఇలాగైతే నష్టపోతామంటున్న టీచర్ సంఘాల ప్రతినిధులు మురళీనగర్(విశాఖ): ఉపాధ్యాయుల బదిలీలలకు సంబంధించి విడుదలైన షెడ్యూలుపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేసినప్పటికి పనితీరుకు సంబంధించి పాయింట్ల కేటాయింపుపై వీరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వెబ్ కౌన్సిలింగుపై ఏకాభిప్రాయం కుదిరినా పాయింట్ల కేటాయింపులో పారదర్శకత, స్పష్టతపై సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సంఘ ప్రతినిధులు లేవనెత్తుతున్న అభ్యంతరాలివీ! దాతల సాయంతో పాఠశాల అభివృద్ధికి నిధుల సేకరణ చేసిన వారికి పాయిట్ల కేటాయింపు అనేది బోధనకు ప్రాధాన్యతనిచ్చే ఉపాధాయునికి చేతకాకపోవచ్చు ఇలాంట ప్పుడు ఆ ఉపాధ్యాయుడు పాయింటుల నష్టపోతాడు. గ్రామీణ ప్రాంతాల్లో నిధుల సమీకరణ సాధ్యం కాదు. హాజరు శాతంకు సంబంధించి మహిళా ఉపాధ్యాయులు ప్రసూతి సెలవులు, పురుష ఉపాధ్యాయులు పెటర్నటీ లీవ్, ఉన్నత విద్యార్హతల కోసం లాంగ్ లీవ్ వాడుకునే వారు నష్టపోవాల్సిందేనా?పదోతరగతిలో ఫలితాల ఆధారంగా పాయింట్లు కేటాయింపు అనేది తక్కువ విద్యార్థులున్న పాఠశాలలకే న్యాయం జరుగుతుంది. వందమందికి పైగా పదోతరగతి పరీక్షలు రాసిన పాఠశాలలో ఒక్కరు పరీక్ష తప్పినా ఎక్కువ శాతం పడిపోతుంది. ఒక సబ్జెక్టులో విద్యార్థి పరీక్ష తప్పితే అది ఇతర సబ్జెక్టు ఉపాధాయులపై ప్రభావం పడుతుంది. పదోతరగతి బోధించని ఉపాధ్యాల మాటేమిటి? అవార్డులు పొందిన వారికి పాయింట్లు కేటాయించడం వల్ల జూనియర్లకు అన్యాయం జరుగుతుంది. గతంలో జాతీయ పురస్కారానికి 15పాయింట్లు, రాష్ట్ర అవార్డుకు 10మార్కులు కేటాయించేవారు. ఇప్పుడు అన్నిటికి ఒకే విధంగా 5పాయింట్లు ఇస్తామంటున్నారు. పిల్లల నమోదుపెరుగుదలకు సంబంధించి పాఠశాల వయసుగల పిల్లలు తగ్గిపోతున్న ఆవాసప్రాంతాల పరిస్థితి ఏమిటి?గతేడాది 3,5,8తరగతుల్లో ఎ, ఎ-ప్లస్, శ్రేణుల్లో 80శాతం ఉత్తీర్ణత సాదించిన పిల్లలు ఉంటే రెండు పాయింట్లు కేటాయిస్తామంటున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి ఉత్తీర్ణత శాతం ఆధారపడి ఉంటుంది. జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయకుండా పాయింట్లు నిర్ధారణ ఎలా చేస్తారనేది సందేహమే.ఉపాధాయుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుంటే అదనంగా పాయింట్లు ఇస్తామంటున్నారు. ప్రాథమిక/ప్రాథమికోన్నత/ఉన్నత పాఠశాల స్థాయిలో అభ్యసించడానికి పిల్లలు లేనివారు నష్టపోతారు. పాఠశాలల్లో పీఈటీలు, క్రీడా మైదానాలు లేకుండా ఈ విభాగంలో పాయింట్లు కేటాయింపు విషయంలో అన్యాయం జరిగే అవకాశం ఉంది.పాయింట్ల కేటాయింపులో సవరణ లు చేసి మరింత మెరుగైన విధానాన్ని ప్రవేశపెట్టి మెజార్టీ ఉపాధ్యాయులకు న్యాయం జరిగే విధంగా చూడాలని వైఎస్సార్ టిఎఫ్, ఏపీటిఎఫ్(1938) సంఘాల జిల్లా అధ్యక్షులు చిరికి శ్రీనివాసరావు,ఎం.జే.సేవియర్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై తాము విద్యాశాఖ కార్యదర్శికి నివేదించనున్నట్లు పేర్కొన్నారు. -
మళ్లీ మొదటికి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : స్థానికేతర ఉపాధ్యాయుల పదోన్నతుల వివాదం మళ్లీ మొదటికొచ్చింది. జిల్లాలో 610 జీఓ పరిధిలో ఉన్న టీచర్లకు పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో గతనెలలో జిల్లా విద్యాశాఖ అర్హుల జాబితా ప్రకటించి.. వారికి పదోన్నతులు ఇచ్చేందుకు ఉపక్రమించింది. ఇంతలో స్థానికేతర టీచర్లకు పదోన్నతి ఇస్తే స్థానికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తూ.. పదోన్నతుల ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈక్రమంలో గురువారం పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించగా.. తిరిగి సంఘాలు ఆందోళనకు దిగాయి. స్థానికులకు న్యాయం చేయకుండా పదోన్నతులు ఎలా ఇస్తారంటూ విద్యాశాఖను నిలదీశాయి. దీంతో కౌన్సెలింగ్ రసాభాసగా మారింది. స్థానికుల సంగతి తేల్చాలి.. పదోన్నతులిస్తే సదరు ఉద్యోగులు శాశ్వతంగా జిల్లాలోనే ఉంటారని, జిల్లాలో వందల సంఖ్యలో స్థానికులు నష్టపోతారని ఉపాధ్యాయ సంఘాలు ధ్వజమెత్తాయి. గురువారం నాటి కౌన్సెలింగ్ ప్రక్రియలో 21 మందికి పదోన్నతులు ఇవ్వాల్సి ఉంది. అయితే గందరగోళం చోటుచేసుకోవడంతో అధికారులు కౌన్సెలింగ్‌ను నిలిపివేశారు. జిల్లా వ్యాప్తంగా పదోన్నతులకు అర్హులైన స్థానికేతర టీచర్లు 168 మంది ఉన్నట్లు విద్యాశాఖ ప్రాథమికంగా గుర్తించింది. ఈక్రమంలో వీరికి పదోన్నతి ఇవ్వదలిస్తే.. ముందుగా సూపర్ న్యూమరీ పోస్టులు ఏర్పాటు చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని పట్టుబట్టాయి. ఈ వివాదాన్ని జిల్లాపరిషత్ చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె జెడ్పీకి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. సంఘాల డిమాండ్లు విన్న ఆమె.. విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. కొత్తగా సూపర్ న్యూమరీ పోస్టులు ఏర్పాటు చేయాలని కోరుతూ.. ఈమేరకు విద్యాశాఖ మంత్రికి లేఖ రాశారు. స్పందించిన తర్వాతే.. ప్రభుత్వానికి లేఖ రాసిన నేపథ్యంలో.. అక్కడినుంచి సమాధానం వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో పదోన్నతుల కౌన్సెలింగ్ తాత్కాలికంగా వాయిదాపడింది. అయితే గతనెలలో జరిగిన పదోన్నతుల సమయంలోనూ ఇదే తరహాలో విద్యాశాఖ వ్యవహరించింది. ప్రభుత్వానికి నివేదిస్తామని జెడ్పీ చైర్పర్సన్ సమక్షంలో పేర్కొన్నప్పటికీ.. అప్పట్లో ప్రభుత్వానికి లేఖ రాశారా, లేదా..? అనే అంశంపై సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. లేఖ రాస్తే.. ప్రభుత్వం స్పందించిన తీరు ఎలా ఉందనే విషయం కూడా వ్యక్తం చేయకుండా విద్యాశాఖ హడావుడిగా కౌన్సెలింగ్ నిర్వహించడం ఏమిటని ఉపాధ్యాయ సంఘాలు తప్పుబడుతున్నారు. న్యాయం జరిగేవరకు పోరాటం: ఉపాధ్యాయసంఘాలు జిల్లాలో స్థానిక, స్థానికేతర నిష్పత్తిలో సమతుల్యత చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి. జిల్లాలో ఉన్న స్థానికేతర టీచర్లను సొంత ప్రాంతాలకు పంపలేని పరిస్థితిలో సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డికి గురువారం జెడ్పీలో వినతిపత్రం అందజేశాయి. ఈ సందర్భంగా సంఘనాయకులు చెన్నకేశవరెడ్డి, ఆంజనేయులు, సధానంద్‌గౌడ్, విఠల్, అనంతరెడ్డి, మాణిక్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ స్థానికులకు న్యాయం జరిగేవరకు ఉద్యమిస్తామన్నారు. -
బదిలీలకు ‘పనితీరు’ ఆధారం!
25శాతం పరిగణనలోకి తీసుకుంటామంటున్న అధికారులు ప్రక్రియ జాప్యానికేనంటున్న ఉపాధ్యాయ సంఘాలు హైదరాబాద్: టీచర్ల బదిలీల వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఈ బదిలీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం రోజుకోరకమైన కొర్రీలు పెడుతుండడమే దీనికి కారణం. తాజాగా టీచర్ల పనితీరు ఆధారంగా బదిలీలు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. రేషనలైజేషన్ పూర్తయినందున ఇక బదిలీ జీఓ రావడమే తరువాయి అని ఎదురుచూస్తున్న టీచర్లకు తాజా నిర్ణయం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆదేశాలతో మెరిట్ ఆధారంగా బదిలీలు చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా విద్యార్థుల ఉత్తీర్ణత, పాఠశాలల నిర్వహణలో ఆయా ఉపాధ్యాయుల భాగస్వామ్యం, ప్రాజెక్టుల నిర్వహణ త దితర అంశాల ఆధారంగా ఉపాధ్యాయులకు పాయింట్లు కేటాయిస్తామని ఆ శాఖ కార్యదర్శి ఆర్పీ సిసోడియా ‘సాక్షి’తో పేర్కొన్నారు. బదిలీలకు నిర ్ణయించిన మొత్తం పాయింట్లలో 25శాతం ఈ మెరిట్ అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. మెరిట్‌కు ప్రామాణికమేమిటని, ఏ ప్రాతిపదికన గుర్తిస్తారని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. మాటిమాటికీ బదిలీలను వాయిదా వేస్తూ ప్రభుత్వం విశ్వసనీయతను కోల్పోతోందని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు బాలసుబ్రహ్మణ్యం, గేయానంద్, శ్రీనివాసులురెడ్డి, నాగేశ్వరరావు విమర్శించారు. లక్షలాది రూపాయలు చేతులు మారడంతో ప్రభుత్వ బదిలీలపై పైరవీలు నడుస్తున్నాయని, దీనివల్లనే సాధారణ బదిలీలు వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మెరిట్ పేరిట ప్రభుత్వం ఈ ఏడాది సాధారణ బదిలీలు వాయిదా వేయాలని చూస్తోందని వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ధ్వజమెత్తింది. మెరిట్ నిబంధన గందరగోళానికి దారితీసి బదలీల ప్రక్రియ జరగకుండా నిలిచిపోతుందని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాలిరెడ్డి, ఓబుళపతి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బదిలీల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్సీ శ్రీనివాసులునాయుడు మరో ప్రకటనలో కోరారు. -
నెలాఖరులోగా టీచర్ల బదిలీలు
ముందుగా రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి వెబ్‌కౌన్సెలింగ్‌పై సందేహాలు వ్యక్తం చేస్తున్నఉపాధ్యాయ సంఘాలు దీంతో ముందుగా నమూనా వెబ్‌కౌన్సెలింగ్ లోపాలు సరిదిద్దాక బదిలీల ప్రక్రియ హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని విద్యాశాఖ భావిస్తోంది. బదిలీల ప్రక్రియను ఆగస్టు 15 కల్లా పూర్తిచేయించాలని ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే. రేషనలైజేషన్‌తో బదిలీ ప్రక్రియ ముడిపడి ఉన్నందున ఆ తేదీ నాటికి టీచర్ల బదిలీలు పూర్తి చేయలేమని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. పాఠశాలలు, టీచర్ల రేషనలైజేషన్‌కు సీఎం ఆమోదం తెలిపినందున ఆ ప్రక్రియను ముందుగా పూర్తిచేయనున్నారు. ప్రాథమిక పాఠశాలల వరకే రేషనలైజేషన్‌ను చేయాలని భావిస్తున్న తరుణంలో కిలోమీటర్ పరిధిలో ఉండే పాఠశాలలు విలీనం కానున్నాయి. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాలు, జాతీయ రహదారులు, నదులు, వాగులు దాటాల్సి వచ్చే ప్రాంతాల ప్రాథమిక పాఠశాలలను ఇందులో నుంచి మినహాయించనున్నారు. పాఠశాలల జాబితా, ఖాళీల సంఖ్యపై తుది నిర్ణయానికి వచ్చాక వాటిని కౌన్సెలింగ్‌లో చేర్చనున్నారు. ఈసారి వెబ్ ఆధారితంగా చేయాలని నిర్ణయించారు. ఈ విధానంలో గందరగోళంగా మారుతుందని టీచర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాతపద్ధతిలో బదిలీపై వెళ్లే టీచర్ల ఖాళీ స్థానాలు ఎక్కడెక్కడున్నాయో కౌన్సెలింగ్ లో తెలుస్తుంది కనుక అర్హులకు అన్యాయం జరగదంటున్నారు. దీంతో ఉపాధ్యాయ సంఘాల సందేహాలను నివృత్తి చేసిన అనంతరం షెడ్యూల్‌ను ప్రకటిస్తామని అధికారులు చెబుతున్నారు. తొలుత నమూనా వెబ్‌కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఆర్పీ సిసోడియా ‘సాక్షి’తో పేర్కొన్నారు. లోపాలు కనిపిస్తే వాటిని సరిచేయించి ఆ తరువాతనే షెడ్యూల్ ప్రకటించి ఈ నెలాఖరునాటికి బదిలీల ప్రక్రియను పూర్తిచేయాలని భావిస్తున్నామని చెప్పారు. -
విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం
- పదోన్నతుల కౌన్సెలింగ్ సాయంత్రం 6గంటలకు ప్రారంభం - ఖాళీపోస్టుల లెక్కతేలక ఆలస్యం - తమ పోస్టులు తమకే కేటాయించాలని దళిత ఉపాధ్యాయ సంఘాల నిరసన మహబూబ్‌నగర్ విద్యావిభాగం : విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం వల్ల ఉదయం 9గంటలకు ప్రారంభం కావాల్సిన పదోన్నతుల కౌన్సెలింగ్ సాయంత్రం 6గంటలకు ప్రారంభమైంది. బుధవారం నిర్వహించిన జీహెచ్‌ఎంల బదిలీల కౌన్సెలింగ్‌లో నాట్‌విల్లింగ్ ఇచ్చిన వారు మళ్లీ వచ్చి పోస్టింగ్ తీసుకోవడం, కోరుకున్న పోస్టులను,ఖాళీ పోస్టులను గుర్తించడంలో డీఈఓ కార్యాలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ సమస్య తలెత్తింది. మొత్తం 53మంది స్కూల్ అసిస్టెంట్లకు జీహెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించేందుకు అధికారులు కౌన్సెలింగ్ ఏర్పాట్లు చేశారు. తీరా ప్రారంభించే ముందు 6పోస్టులు తక్కువగా లెక్క తేలుతున్నాయి. మొత్తం 53పోస్టులకు గాను 47మాత్రమే ఖాళీలు కనిపించాయి. మిగతా ఆరు పోస్టులు ఎక్కడ పోయాయనేది గుర్తించేందుకు విద్యాశాఖాధికారులకు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సమయం పట్టింది. దళిత ఉపాధ్యాయ సంఘాల ఆందోళన సాయంత్రం 6గంటలకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు వచ్చిన జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ, డీఈఓ ఎన్.రాజేష్, రాష్ట్ర పరిశీలకుడు నజీముద్దీన్‌తో ఉపాధ్యాయల సంఘాల నాయకులు జెట్టి రామస్వామి, జంగయ్య, బాలపీరు, సుదర్శన్, సతీష్‌కుమార్, ఎన్.వెంకటేష్, హన్మంతరావు ఆందోళనకు దిగారు. 484 జీహెచ్ఎం పోస్టులకుగాను జీఓ ప్రకారం 15శాతం అంటే 73పోస్టులు ఎస్సీలకు ఉండాలి. కానీ 62మంది మాత్రమే జీహెచ్ఎంలు ఉన్నారని, ఇంకా 11మందికి ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రస్తుత కౌన్సెలింగ్‌లో రోస్టర్ ప్రకారం 9మంది ఎస్సీలకు మాత్రమే జీహెచ్‌ఎంల పదోన్నతి ఇస్తామని చెప్పడం సరికాదని పేర్కొన్నారు. గతంలో 2009 నుంచి 2014 వరకు ఎస్సీ అడక్వేసి దాటిందని 27పోస్టులు ఇతరులకు కేటాయించారని తెలిపారు. ఎస్సీలకు సంబంధించిన పోస్టులను ఇతర వర్గాలకు కేటాయించడం వల్ల ఎస్సీలు నష్టపోతున్నారని పేర్కొన్నారు. తమకు రావల్సిన పోస్టులు ఇచ్చిన తర్వాతనే కౌన్సెలింగ్ నిర్వహించాలని అన్నారు. దీంతో సాయంత్రం జేసీ రాంకిషన్ కౌన్సిలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మాట్లాడారు. రోస్టర్ పాయింట్స్ లేనందును 9 పోస్టులను ప్రస్తుతం ఇస్తామని, తర్వాతా వచ్చే రోస్టర్‌లో కేటాయిస్తామని ఇప్పటి నుంచి రూల్స్ ఖచ్చితంగా పాటిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దీంతో కౌన్సెలింగ్ ప్రారంభమయ్యింది. రాత్రి 9.30కు 35వరకు పదోన్నతులు నిర్వహించారు. రాత్రి 11గంటలకు వరకు కౌన్సెలింగ్ జరగొచ్చని అధికారులు తెలిపారు. -
బదిలీలు చేపట్టాల్సిందే!
హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టాల్సిందేనని 40 ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. రెండేళ్లుగా రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టలేదని, ఈసారి బదిలీలు చేయాల్సిందేనని పట్టుబట్టాయి. గురువారం పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు అన్ని ఉపాధ్యాయ సంఘాలతో చర్చించారు. మొదట పీఆర్టీయూ-టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డితో చర్చించారు. చర్చించేందుకు ఒక్కో సంఘానికి 10 నిమిషాల పాటు సమయం కేటాయించారు. వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలను రెండు మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంపాలని నిర్ణయించారు. చిరంజీవులుతో సమావేశమైన వారిలో టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్సిరెడ్డి, చావ రవి, ఎస్టీయూ నేతలు రాజిరెడ్డి, భుజంగరావు, టీటీయూ నేతలు మణిపాల్‌రెడ్డి, వేణుగోపాలస్వామి, పీఆర్టీయూ తెలంగాణ నేతలు హర్షవర్దన్‌రెడ్డి, చెన్నయ్య, టీఆర్టీఎఫ్ నేతలు మల్లయ్య, లక్ష్మారెడ్డి, టీటీఎఫ్ నేతలు రామచంద్రం, రఘునందన్, హెచ్ఎంల సంఘం నేత మల్లికార్జునశర్మ, టీఎస్టీఎన్యూఎస్ నేత ధమనేశ్వర్‌రావు, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నేతలు రాజన్న, వెంకట్రావ్, తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్ నేతలు రహమాన్, ఆడమ్స్, టీపీటీఏ నేతలు షౌకత్‌అలీ, శర్మ ఉన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే జూన్ 2లోగా ఉపాధ్యాయులు రేషనలైజేషన్, పదోన్నతులు, బదిలీలు పూర్తి చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు సంఘాల నేతలు వెల్లడించారు. ఇవీ ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లు విద్యాహక్కు చట్టం ప్రకారం హేతుబద్ధీకరణ చేపట్టాలి. పాఠశాలల మూసివేత ఉపసంహరిస్తూ జీవో నంబరు 6కు సవరణ చేయాలి. అన్ని పాఠశాలలకు సరిపడ పోస్టులను మంజూరు చేయాలి. ఉన్నత పాఠశాలల్లో తెలుగు, హిందీ గ్రేడ్-2 పండిట్లు, పీఈటీల స్థానంలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ, ఫిజికల్ డెరైక్టర్ పోస్టులు మంజూరు చేయాలి. 2013లో బదిలీ అయిన టీచర్లను రిలీవ్ చేయాలి. ఈసారి కౌన్సెలింగ్‌లో పాల్గొంటే వారికి అదనపు పాయింట్లు కేటాయించాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో నియామకాలు, పదోన్నతుల జీవో 3లో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించి ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్‌లో కౌన్సెలింగ్ నిర్వహించాలి. ప్రాథమిక పాఠశాలల్లో 60 మంది విద్యార్థులకు ముగ్గురు టీచర్లను ఇవ్వాలి. గిరిజన ప్రాంతాల్లో 10 మంది విద్యార్థులు ఉన్నా పాఠశాలలను కొనసాగించాలి. ఇంగ్లిష్ మీడియం స్కూళ్లను ప్రారంభించాలి. -
ప్రతిభకు చోటేదీ!
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దక్కని ప్రతిభా అవార్డులు కార్పొరేట్ విద్యాసంస్థలకే పెద్దపీట ఎంపిక విధానంపై ఎన్నో అనుమానాలు రేపు తిరుపతిలో అవార్డుల ప్రదానం విజయవాడ : ప్రతిభ అవార్డుల ఎంపిక ప్రహసనంగా మారింది. పేదింటి విద్యా కుసుమాల కష్టానికి గుర్తింపు దక్కలేదు. ప్రతిభకు పురస్కారం లభించలేదు. అసలు ప్రతిభ అవార్డుల ఎంపిక విధానమే లోపభూయిష్టంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యను ప్రోత్సహించేందుకు పదో తరగతిలో నూరు శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభ అవార్డులు అందజేస్తుంది. ఈ మేరకు 2014 సంవత్సరానికి సంబంధించి మండలానికి ఆరుగురు చొప్పున జిల్లాలో 299 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఆ జాబితాను మంగళవారం విద్యాశాఖ విడుదల చేసింది. అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం తిరుపతిలో జరగనుంది. ఎంపికైన విద్యార్థులకు పతకం, జ్ఞాపికతో పాటు రూ.20 వేలు నగదు బహుమతిగా ఇస్తారు. ఈ నగదును నేరుగా విద్యార్థి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఎంపిక విధానంపై అనుమానాలు విద్యా శాఖ విడుదల చేసిన జాబితాపై ఉపాధ్యాయ సంఘాల నేతలు పలు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. ఏ ప్రాతిపదికన అవార్డులకు విద్యార్థులను ఎంపిక చేశారనే విషయంపై ప్రధానోపాధ్యాయుల వద్ద కూడా సరైన సమాధానం లేదు. కొన్ని పాఠశాలల వారు ప్రతిభ అవార్డులకు అర్హులైన తమ విద్యార్థుల జాబితాను సిద్ధం చేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం జాబితా ప్రకటించడంతో అందరూ నివ్వెరపోయారు. విజయవాడ పరిసర మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించి పదో తరగతి పరీక్షల్లో పదికి పది పాయింట్లు సాధించిన వారి పేర్లు ఈ జాబితాలో లేకపోవడం వెనుక కార్పొరేట్ పాఠశాల ఒత్తిళ్లు పనిచేశాయనే అనుమానాలను పలువురు వ్యక్తంచేస్తున్నారు. విజయవాడ అర్బన్, రూరల్, కంకిపాడు, పెనమలూరు మండలాలకు సంబంధించి విద్యా శాఖ ప్రకటించిన జాబితా వారి అనుమానాలకు బలం చేకూరుస్తోంది. విద్యార్థుల ఎంపిక తమ చేతుల్లో లేదని, ఈ ప్రక్రియను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారే చూస్తున్నారని డీఈవో నాగేశ్వరరావు తెలిపారు. కులం, ప్రతిభ, పాయింట్లను బట్టి అవార్డుల ఎంపిక చేస్తారని చెప్పారు. సమాచారం లేదు ప్రతిభ అవార్డులు ఎప్పుడు ప్రదానం చేస్తారు.. విద్యార్థులను ఎలా ఎంపిక చేస్తారు.. అనే విషయాలపై పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు నిర్దిష్టమైన సమాచారం లేదు. విద్యాశాఖ కూడా వీరికి ఎటువంటి సమాచారమూ ఇవ్వలేదు. దినపత్రికల్లో ప్రకటన చేయడం మినహా పాఠశాలలకు నేరుగా సమాచారం పంపలేదు. 95 శాతం ప్రైవేటు స్కూళ్ల వారికే ! రెండు సంవత్సరాలుగా ప్రతిభ అవార్డులు ప్రదానం చేయలేదు. గతంలో కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ అవార్డులు ఇచ్చారు. ఈ సంవత్సరం ఒక్కసారిగా అవార్డులు ప్రకటించడం, అందులోనూ 95 శాతం ప్రైవేట్ పాఠశాలల వారినే ఎంపిక చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో రాజకీయ ప్రమేయం ఉందనే అనుమానాలు పలువురు వ్యక్తంచేస్తున్నారు. ‘కల్యాణి’కి దక్కని అవార్డు విజయవాడ కృష్ణలంకకు చెందిన పొడుగు కళ్యాణి నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థి. ఆమె వీఎంఆర్‌ఆర్ మున్సిపల్ బాలికల పాఠశాలలో పదో తరగతి చదివింది. పరీక్షల్లో పదికి పది పాయింట్లు సాధించింది. ఆమెకూ ప్రతిభ అవార్డు దక్కలేదు. దీంతో తనకు అవార్డు వస్తుందని భావించిన కళ్యాణి నిరుత్సాహానికి గురైంది. మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులు కూడా ఈ జాబితా చూసి మండిపడుతున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ‘కార్పొరేషన్’ పాఠశాలల్లో బోధన చేస్తున్నామని, ఫలితాలు సాధిస్తున్నామని, అయితే ప్రభుత్వం ప్రకటించే అవార్డుల్లో తమ విద్యార్థులకు చోటుదక్కలేదని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎత్తుగడల్లో భాగమే విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు దూరం చేసే ఎత్తుగడల్లో భాగమే ఈ అవార్డుల ఎంపిక. కార్పొరేట్ పాఠశాలలపై మోజు పెంచేందుకు, అక్కడ విద్యా ప్రమాణాలు బాగుంటాయన్న సందేశాన్ని పంపడానికి ఈ అవార్డుల ఎంపికను వేదికగా తీసుకున్నారు. ప్రభుత్వం తీరు దారుణం. - పూర్ణచంద్రరావు, ఏపీటీఎఫ్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ పాపం ‘పావని’ విజయవాడ సత్యనారాయణపురంలోని ఏకేటీపీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 2014లో పదో తరగతి పూర్తిచేసిన పావని నిరుపేద విద్యార్థిని. ఆమె తండ్రి ఆటో కార్మికుడు. పావని కష్టపడి చదవి పదికి పది పాయింట్లు సాధించింది. ఆమెకు ప్రతిభ అవార్డు లభిస్తుందని, ప్రభుత్వం రూ.20 వేలు అందిస్తుందని అందరూ భావించారు. ఈ మొత్తం పావని చదువుకు ఉపయోగపడుతుందని ఆశించారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభ అవార్డుల జాబితాలో ఆమె పేరు లేదు. దీంతో పాఠశాల ఉపాధ్యాయులు విస్మయానికి గురయ్యారు.