హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టాల్సిందేనని 40 ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. రెండేళ్లుగా రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టలేదని, ఈసారి బదిలీలు చేయాల్సిందేనని పట్టుబట్టాయి. గురువారం పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు అన్ని ఉపాధ్యాయ సంఘాలతో చర్చించారు. మొదట పీఆర్‌టీయూ-టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డితో చర్చించారు. చర్చించేందుకు ఒక్కో సంఘానికి 10 నిమిషాల పాటు సమయం కేటాయించారు. వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలను రెండు మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంపాలని నిర్ణయించారు.
చిరంజీవులుతో సమావేశమైన వారిలో టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్సిరెడ్డి, చావ రవి, ఎస్టీయూ నేతలు రాజిరెడ్డి, భుజంగరావు, టీటీయూ నేతలు మణిపాల్‌రెడ్డి, వేణుగోపాలస్వామి, పీఆర్‌టీయూ తెలంగాణ నేతలు హర్షవర్దన్‌రెడ్డి, చెన్నయ్య, టీఆర్‌టీఎఫ్ నేతలు మల్లయ్య, లక్ష్మారెడ్డి, టీటీఎఫ్ నేతలు రామచంద్రం, రఘునందన్, హెచ్‌ఎంల సంఘం నేత మల్లికార్జునశర్మ, టీఎస్‌టీఎన్‌యూఎస్ నేత ధమనేశ్వర్‌రావు, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నేతలు రాజన్న, వెంకట్రావ్, తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్ నేతలు రహమాన్, ఆడమ్స్, టీపీటీఏ నేతలు షౌకత్‌అలీ, శర్మ ఉన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే జూన్ 2లోగా ఉపాధ్యాయులు రేషనలైజేషన్, పదోన్నతులు, బదిలీలు పూర్తి చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు సంఘాల నేతలు వెల్లడించారు.
ఇవీ ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లు
విద్యాహక్కు చట్టం ప్రకారం హేతుబద్ధీకరణ చేపట్టాలి. పాఠశాలల మూసివేత ఉపసంహరిస్తూ జీవో నంబరు 6కు సవరణ చేయాలి. అన్ని పాఠశాలలకు సరిపడ పోస్టులను మంజూరు చేయాలి. ఉన్నత పాఠశాలల్లో తెలుగు, హిందీ గ్రేడ్-2 పండిట్లు, పీఈటీల స్థానంలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ, ఫిజికల్ డెరైక్టర్ పోస్టులు మంజూరు చేయాలి. 2013లో బదిలీ అయిన టీచర్లను రిలీవ్ చేయాలి. ఈసారి కౌన్సెలింగ్‌లో పాల్గొంటే వారికి అదనపు పాయింట్లు కేటాయించాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో నియామకాలు, పదోన్నతుల జీవో 3లో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించి ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్‌లో కౌన్సెలింగ్ నిర్వహించాలి. ప్రాథమిక పాఠశాలల్లో 60 మంది విద్యార్థులకు ముగ్గురు టీచర్లను ఇవ్వాలి. గిరిజన ప్రాంతాల్లో 10 మంది విద్యార్థులు ఉన్నా పాఠశాలలను కొనసాగించాలి. ఇంగ్లిష్ మీడియం స్కూళ్లను ప్రారంభించాలి.
బదిలీలు చేపట్టాల్సిందే!
Published Fri, May 8 2015 1:30 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM
Advertisement
Advertisement