సాంకేతిక విద్యలో నిబంధనలు కాలరాస్తూ లెక్చరర్ల బదిలీలు
జోన్లు, రీజియన్లు మార్చేసి 200 మందిని బదిలీ చేసిన ప్రభుత్వం
తిరుపతి జిల్లా వారికి విజయనగరంలో పోస్టింగ్
ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కోర్టును ఆశ్రయించిన పలువురు లెక్చరర్లు!
పాలిటెక్నిక్ కాలేజీల్లో కుంటుబడిన బోధన
పాఠశాల విద్యలాగే సాంకేతిక విద్యలోనూ ప్రమాణాలను దిగజారుస్తున్న కూటమి ప్రభుత్వం
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యలో ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో ఇష్టానుసారంగా బదిలీలు చేపట్టి బోధనను నిర్వీర్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు ఇదే విధానాన్ని సాంకేతిక విద్యలోనూ అమలు చేసింది. సర్దుబాటు బదిలీల పేరుతో లెక్చరర్లను ఏకంగా రీజియన్లు దాటించేసింది. దీంతో దాదాపు 20 రోజులైనా లెక్చరర్లు.. తాము బదిలీ అయిన స్థానాలకు వెళ్లకపోవడంతో పాలిటెక్నిక్ కాలేజీల్లో బోధన కుంటుబడింది.
జోన్ స్థాయిలో చేపట్టాల్సిన సర్దుబాటు బదిలీలను ఏకంగా రీజియన్లను దాటించేయడంతో పలువురు లెక్చరర్లు సాంకేతిక విద్య ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేయగా.. మరికొందరు హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది.
అక్టోబర్‌లో చేపట్టాల్సిన సర్దుబాటు ప్రక్రియను డిసెంబర్‌లో చేపట్టడమే కాకుండా.. సాంకేతిక విద్య డైరెక్టరేట్ చేపట్టిన సర్దుబాటు బదిలీలు సైతం సక్రమంగా లేకపోవడంతో లెక్చరర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 200 మంది లెక్చరర్లను బదిలీ చేయగా.. సగం మందికి పైగా పోస్టుల్లో చేరకపోవడం గమనార్హం.
ఫిర్యాదు చేసిన వారికి బెదిరింపులు!
పాలిటెక్నికల్ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్ల కాలపరిమితి అక్టోబర్‌తో ముగిసింది. అలాగే గతంలో ఇచి్చన డిప్యుటేషన్లు కూడా పూర్తయ్యాయి. నవంబర్‌లో తరగతులు ప్రారంభమయ్యేలోగా సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలి. అంటే సర్దుబాటు బదిలీలు అక్టోబర్‌లోనే చేపట్టాలి. కానీ సాంకేతిక విద్య డైరెక్టరేట్ అధికారులు ఈ నెల మొదట్లో పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌పై తాము చెప్పిన విధంగా వర్క్‌లోడ్ నివేదిక తెప్పించుకున్నారు.
వెంటనే 2వ తేదీన ఆఘమేఘాలపై దాదాపు 200 మందిని సర్దుబాటు బదిలీ చేశారు. ఈ పోస్టులను జోన్ స్థాయిలోనే సర్దుబాటు చేయాలి. కానీ రీజియన్లను మార్చేయడంపై లెక్చరర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర వర్సిటీ రీజియన్‌లోని తిరుపతి జిల్లా చంద్రగిరి పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్న ఓ లెక్చరర్‌ను.. ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్‌లోని విజయనగరం జిల్లా చీపురుపల్లి పాలిటెక్నిక్ కాలేజీకి, మరొకరిని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కాలేజీకి బదిలీ చేశారు.
వెంటనే విధుల్లో చేరాలని వారిని ఆదేశించారు. అయితే, 60 కి.మీ పరిధిలో చేపట్టాల్సిన సర్దుబాటును ఏకంగా 900 కి.మీ దూరానికి చేయడంతో బాధితులు తమ పోస్టుల్లో చేరకుండా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసిన సాంకేతిక విద్య డైరెక్టరేట్ సిబ్బంది.. ఫిర్యాదు చేసిన వారిని బెదిరించినట్లు సమాచారం. దీంతో కొందరు బాధిత లెక్చరర్లు హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది.
కాంట్రాక్టు లెక్చరర్ల పరిస్థితి మరీ ఘోరం
ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల పరిస్థితిని మరీ దారుణంగా మార్చేశారు. వీరికి వారంలో రెండు, మూడు రోజులు ఒక కాలేజీ చొప్పున విధులు వేస్తుండడం గమనార్హం. ఇలా వారంలో రెండు, మూడు కాలేజీలు మారుస్తుండడంతో వారు ఏ కాలేజీలో పనిచేస్తున్నారో తెలియని దుస్థితి నెలకొంది. వీరిని కూడా గుంటూరు నుంచి పాడేరుకు, చీపురుపల్లికి బదిలీ చేయడం విమర్శలకు దారి తీసింది.
ఈ ప్రక్రియతో అకడమిక్ పరంగా తీవ్ర ఇబ్బందులు తలెత్తాయని లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైలెవల్ కమిటీ చేపట్టాల్సిన సర్దుబాటు బదిలీలను.. కిందిస్థాయి సిబ్బందే నివేదిక తయారు చేయడం, దాన్నే డైరెక్టర్ ఆమోదించడంతో సమస్యలు వచ్చాయని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment