technical education
-
ఇష్టారాజ్యంగా 'సర్దుబాటు'
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యలో ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో ఇష్టానుసారంగా బదిలీలు చేపట్టి బోధనను నిర్వీర్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు ఇదే విధానాన్ని సాంకేతిక విద్యలోనూ అమలు చేసింది. సర్దుబాటు బదిలీల పేరుతో లెక్చరర్లను ఏకంగా రీజియన్లు దాటించేసింది. దీంతో దాదాపు 20 రోజులైనా లెక్చరర్లు.. తాము బదిలీ అయిన స్థానాలకు వెళ్లకపోవడంతో పాలిటెక్నిక్ కాలేజీల్లో బోధన కుంటుబడింది. జోన్ స్థాయిలో చేపట్టాల్సిన సర్దుబాటు బదిలీలను ఏకంగా రీజియన్లను దాటించేయడంతో పలువురు లెక్చరర్లు సాంకేతిక విద్య ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేయగా.. మరికొందరు హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది.అక్టోబర్‌లో చేపట్టాల్సిన సర్దుబాటు ప్రక్రియను డిసెంబర్లో చేపట్టడమే కాకుండా.. సాంకేతిక విద్య డైరెక్టరేట్ చేపట్టిన సర్దుబాటు బదిలీలు సైతం సక్రమంగా లేకపోవడంతో లెక్చరర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 200 మంది లెక్చరర్లను బదిలీ చేయగా.. సగం మందికి పైగా పోస్టుల్లో చేరకపోవడం గమనార్హం. ఫిర్యాదు చేసిన వారికి బెదిరింపులు! పాలిటెక్నికల్ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్ల కాలపరిమితి అక్టోబర్‌తో ముగిసింది. అలాగే గతంలో ఇచి్చన డిప్యుటేషన్లు కూడా పూర్తయ్యాయి. నవంబర్‌లో తరగతులు ప్రారంభమయ్యేలోగా సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలి. అంటే సర్దుబాటు బదిలీలు అక్టోబర్‌లోనే చేపట్టాలి. కానీ సాంకేతిక విద్య డైరెక్టరేట్ అధికారులు ఈ నెల మొదట్లో పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపాల్స్పై తాము చెప్పిన విధంగా వర్క్‌లోడ్ నివేదిక తెప్పించుకున్నారు.వెంటనే 2వ తేదీన ఆఘమేఘాలపై దాదాపు 200 మందిని సర్దుబాటు బదిలీ చేశారు. ఈ పోస్టులను జోన్ స్థాయిలోనే సర్దుబాటు చేయాలి. కానీ రీజియన్లను మార్చేయడంపై లెక్చరర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర వర్సిటీ రీజియన్‌లోని తిరుపతి జిల్లా చంద్రగిరి పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్న ఓ లెక్చరర్‌ను.. ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్‌లోని విజయనగరం జిల్లా చీపురుపల్లి పాలిటెక్నిక్ కాలేజీకి, మరొకరిని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కాలేజీకి బదిలీ చేశారు. వెంటనే విధుల్లో చేరాలని వారిని ఆదేశించారు. అయితే, 60 కి.మీ పరిధిలో చేపట్టాల్సిన సర్దుబాటును ఏకంగా 900 కి.మీ దూరానికి చేయడంతో బాధితులు తమ పోస్టుల్లో చేరకుండా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసిన సాంకేతిక విద్య డైరెక్టరేట్ సిబ్బంది.. ఫిర్యాదు చేసిన వారిని బెదిరించినట్లు సమాచారం. దీంతో కొందరు బాధిత లెక్చరర్లు హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది. కాంట్రాక్టు లెక్చరర్ల పరిస్థితి మరీ ఘోరంప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల పరిస్థితిని మరీ దారుణంగా మార్చేశారు. వీరికి వారంలో రెండు, మూడు రోజులు ఒక కాలేజీ చొప్పున విధులు వేస్తుండడం గమనార్హం. ఇలా వారంలో రెండు, మూడు కాలేజీలు మారుస్తుండడంతో వారు ఏ కాలేజీలో పనిచేస్తున్నారో తెలియని దుస్థితి నెలకొంది. వీరిని కూడా గుంటూరు నుంచి పాడేరుకు, చీపురుపల్లికి బదిలీ చేయడం విమర్శలకు దారి తీసింది. ఈ ప్రక్రియతో అకడమిక్ పరంగా తీవ్ర ఇబ్బందులు తలెత్తాయని లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైలెవల్ కమిటీ చేపట్టాల్సిన సర్దుబాటు బదిలీలను.. కిందిస్థాయి సిబ్బందే నివేదిక తయారు చేయడం, దాన్నే డైరెక్టర్ ఆమోదించడంతో సమస్యలు వచ్చాయని సమాచారం. -
కోర్ గ్రూపులకు కష్టకాలం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో సివిల్, మెకాని కల్, ఎలక్ట్రికల్ బ్రాంచీలకు ఆదరణ కరువవుతోంది. గత నాలుగేళ్లలో ఈ గ్రూపుల్లో 10 వేల సీట్లు తగ్గిపోగా, ఈ ఏడాది (2024–25) మరో 6 వేల సీట్లు కనుమరుగయ్యాయి. డిమాండ్ లేని బ్రాంచీల్లో సీట్లు తగ్గించి, ఆదరణ ఉన్న బ్రాంచీల్లో పెంచుకునేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతించడంతో అన్ని కాలేజీలూ ఇదే బాట పడుతున్నాయి. కోర్ గ్రూపుల్లో సీట్లు తగ్గించుకుని కంప్యూటర్ కోర్సు ల్లో పెంచుకుంటున్నాయి. కేవలం నాలుగేళ్లలోనే కంప్యూటర్ కోర్సుల్లో 11 వేల సీట్లు పెరిగాయి. ఈ పరిస్థితి జిల్లాల్లోని ఇంజనీరింగ్ కాలే జీల మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. కంప్యూటర్ కోర్సుల నిర్వహణ ఆ కాలేజీలకు కష్టమ వుతోంది. మౌలిక వసతుల కల్ప న, నాణ్యమైన ఫ్యాకల్టీ సమకూర్చుకోవడం కత్తిమీద సాములా మారింది. దీంతో పలు జిల్లాల్లో 2014–24 మధ్య 90కిపైగా కాలేజీలు మూతపడ్డాయి. ఒక్క వరంగల్ జిల్లాలోనే నాలుగేళ్లలో 8 కాలేజీలు కనుమ రుగయ్యాయి. ఆదిలాబా ద్లో మూడు కాలేజీలుంటే ఇప్పుడు ఒక్కటీ లేదు. నిజామాబాద్‌లో గతంలో ఆరు ఉంటే ఇప్పుడు నాలుగున్నాయి. ఎక్కువ మంది విద్యార్థులు ఇంజనీ రింగ్ విద్య కోసం రాజధానినే ఎంచుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 ఇంజనీరింగ్ కాలేజీలుంటే, 109 కాలేజీలు మేడ్చల్–మల్కా జిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మేడ్చల్‌లో 45, రంగారెడ్డిలో 44, హైదరాబాద్‌లో 20 కాలేజీలున్నాయి. మార్చేస్తున్న పోటీ ఇంజనీరింగ్ తర్వాత కన్పించేవన్నీ సాఫ్ట్వేర్ ఉద్యో గాలే. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కోర్సులు చేసినా ఉపాధి కోసం వెతుక్కోవాల్సింది ఐటీ సెక్టార్లోనే. దీనివల్లే విద్యార్థులు కంప్యూటర్ కోర్సుల్లో చేరేందుకే ఇష్టపడుతున్నారు. రాష్ట్రంలో ఏటా లక్ష మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు తయారవుతుండగా, 70 శాతం కంప్యూటర్ సైన్స్ నేపథ్యంతోనే వస్తున్నారు. వీరిలో కేవలం 10 శాతం మందికి కూడా స్కిల్స్ ఉద్యోగాలు దొరకట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో సీఎస్ఈ చేసినా బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండటం లేదని పారిశ్రామిక వేత్తలు అంటున్నారు. ఇంజనీరింగ్‌తోపాటు ఏదో ఒక కొత్త కోర్సు నేర్చుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుతూనే పార్ట్‌టైం ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ అవకాశాలన్నీ హైదరాబాద్‌లో ఉంటేనే సాధ్యమని విద్యార్థులు భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు లేకపోవడంతో ఇంటర్న్‌షిప్, ప్రాజెక్టు వర్క్ లాంటివీ సాధ్యం కావట్లేదు. ఆ కోర్సుల జాడెక్కడ?గత ఐదేళ్లల్లో సివిల్, మెకానికల్, ఈఈఈ వంటి కోర్ గ్రూపుల్లో ప్రవేశాలు భారీగా తగ్గాయి. ఈ బ్రాంచీల్లో సీట్లను కాలేజీలు తగ్గిస్తున్నాయి. 2020 సంవత్సరంలో ఈ గ్రూపుల్లో కన్వీనర్ కోటా కింద 40,355 సీట్లుంటే, 2024 నాటికి ఇవి 30,900కు పడిపోయాయి. ఉన్న సీట్లలోనూ ప్రవేశాలు 50 శాతం మించడం లేదు. కానీ సీఎస్ఈ, ఐటీ సహా కంప్యూటర్ బ్రాంచీల్లో చేరేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు. కాలేజీలు కూడా ఈ గ్రూపుల్లో సీట్లు పెంచుకునేందుకు బారులు తీరుతున్నాయి. 2020లో కంప్యూటర్ బ్రాంచీల్లో 58,633 సీట్లుంటే, 2024 నాటికి 67,248 సీట్లయ్యాయి. 65.13 శాతం నుంచి 76.46 శాతం సీట్లు ఈ గ్రూపుల్లో పెరిగాయి. ఇతర కోర్ గ్రూపుల్లో మాత్రం 2020–24 మధ్య 37.87 శాతం ఉన్న సీట్లు 23.54 శాతానికి పడిపోయాయి. -
21, 22 తేదీల్లో ఇంజనీరింగ్ సీట్ల మార్పిడి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీ సీట్ల మార్పిడి (స్లైడింగ్)కి ఈ నెల 21, 22 తేదీల్లో అవకా శం కల్పించాలని సాంకేతిక విద్య విభాగం నిర్ణయించింది. స్లైడింగ్ ప్రక్రియను ప్రతీ ఏటా కాలేజీలే చేపట్టేవి. ఈసారి సాంకేతిక విద్య కమిషనరేట్ దీన్ని నిర్వహిస్తోంది.స్లైడింగ్ పేరుతో ప్రైవేటు కాలేజీలు కొన్నేళ్ళుగా సాగిస్తున్న సీట్ల వ్యాపారానికి చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తుది విడత సీట్లను సోమవారం కేటాయించారు. ఇంకా 5,039 సీట్లు మిగిలిపోయాయి. స్లైడింగ్ తర్వాత మిగిలిపోయే సీట్లను కలుపుకుని స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని నిర్ణయించారు. మొత్తం మీద ఈ నెలాఖరుకు కౌన్సెలింగ్ ముగించుకుని ఇంజనీరింగ్ క్లాసులు మొదలు పెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.స్లైడింగ్‌కు 3 వేల సీట్లుజాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు వచ్చిన వాళ్ళు రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు వదులుకుంటారు. అలాగే తుది దశ కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటా కింద ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు వచ్చిన విద్యార్థులు ప్రైవేటు కాలేజీల్లో సీట్లు వదులుకుంటారు. ఈ రకంగా తుది దశ కౌన్సెలింగ్ నాటికి ప్రతీ ఏటా దాదాపు 3 వేల మంది స్లైడింగ్ ద్వారా సీట్లు మారుతుంటారు. కాలేజీలో తుది దశ కౌన్సెలింగ్‌లో సీట్లు వచ్చిన వాళ్ళు ఈ నెల 17 నాటికి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఇలా చేయని పక్షంలో ఆ సీటును ఖాళీ అయినట్టుగా ప్రకటిస్తారు. విద్యార్థులు సీట్లు రద్దు చేసుకున్నా వాటినీ ప్రకటించాల్సి ఉంటుంది. అప్పటికే ఆ కాలేజీలో చేరిన విద్యార్థులు నచ్చిన బ్రాంచీలో ఖాళీలుంటే స్లైడింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ప్రైవేటు కాలేజీలు ర్యాంకర్ల చేత తొలి దశలోనే కౌన్సెలింగ్‌లో పాల్గొనేలా చేసేవి. తుది దశ ముగిసిన తర్వాత సీటు రద్దు చేసుకునేలా చేసేవి. ఈ సీటును స్లైడింగ్ ప్రక్రియలో ఎక్కువ రేటు పెట్టి ఇతర బ్రాంచీల్లో ఉన్నవారికి అమ్ముకునేవి. ఇప్పుడు ప్రభుత్వమే స్లైడింగ్ చేపట్టడం వల్ల ఆ అవకాశం ఉండే వీల్లేదు.స్పాట్లో కంప్యూటర్ సీట్లు కష్టమేఈ ఏడాది కంప్యూటర్, అనుబంధ బ్రాంచీల్లో సీట్లు పెద్ద ఎత్తున భర్తీ అయ్యాయి. స్పాట్ అడ్మి షన్లలో ఈ సీట్లు పొందే అవకాశాలు తక్కువనే అధికారులు అంటున్నారు. గత ఏడాది సీట్లు పెద్ద ఎత్తున మిగిలిపోయాయి. జేఈఈ కౌన్సెలింగ్ ఇప్పటికే ముగిసింది. దీంతో జాతీయ కాలేజీ ల్లో సీట్లు వచ్చిన విద్యార్థులు రాష్ట్ర కాలేజీల్లో మొదటి, రెండో దశ కౌన్సెలింగ్ తర్వాత మళ్ళీ రాష్ట్ర కాలేజీలకు దరఖాస్తు చేయలేదు. గత ఏడాది అన్ని బ్రాంచీల్లో కలిపి తుది దశ కౌన్సెలింగ్ తర్వాత 19,154 సీట్లు మిగిలిపోయాయి. ఈ ఏడాది మాత్రం 5,039 సీట్లు మాత్రమే మిగిలా యి. కంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లో 2023లో తుది దశ కౌన్సెలింగ్‌లో 5,723 సీట్లు మిగిలితే... ఈ ఏడాది తుది దశ కౌన్సెలింగ్ నాటికి కేవలం 1,225 సీట్లు మిగిలాయి. ఇవి కూడా మారు మూల ప్రాంతాల కాలేజీల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎక్కువగా ఆశించే కంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లో స్పాట్ అడ్మిషన్లలో పెద్దగా సీట్లు వచ్చే అవకాశం కన్పించడం లేదు. -
కంప్యూటర్ కోర్సుల్లో 98 శాతం భర్తీ
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ మూడో విడత సీట్ల కేటాయింపును సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన సోమవారం విడుదల చేశారు. కొత్తగా 9,881 మందికి సీట్లు కేటాయించారు. బ్రాంచీలు, కాలేజీలు మార్పు కోరిన 16,981 మందికి సీట్లు కేటాయించారు. కౌన్సెలింగ్‌లో 175 కాలేజీలు పాల్గొన్నాయి. కన్వినర్ కోటా కింద మొత్తం 86,943 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మూడో దశతో కలిపి 81,904 (92.40 శాతం) సీట్లు కేటాయించారు. ఇంకా 5,039 సీట్లు మిగిలిపోయాయి. గతంలో సీట్లు పొందిన విద్యార్థులు బ్రాంచీలు, కాలేజీల మార్పిడి కోసం ఆప్షన్లు ఇచ్చారు. కొత్తగా మరికొంతమంది ఇచ్చినవి కలుపుకుని మొత్తం 23,98,863 ఆప్షన్లు అందినట్టు అధికారులు వెల్లడించారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 6,460 సీట్లు కేటాయించారు. ఆరు యూనివర్సిటీలు, 84 ప్రైవేటు కాలేజీలు కలిపి మొత్తం 90 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 15లోగా ఫీజు చెల్లించాలని, సంబంధిత కాలేజీల్లో 13 నుంచి 17వ తేదీ వరకూ సెల్ఫ్ రిపోరి్టంగ్ చేయాలని అధికారులు సూచించారు. ఈ నెలాఖరులోగా క్లాసులు మొదలు వాస్తవానికి మూడోదశ సీట్ల కేటాయింపు ఈ నెల 13న చేపట్టాలని నిర్ణయించారు. కానీ సీట్ల పెంపు, అదనపు సీట్ల కేటాయింపు, సీట్ల మదింపునకు సంబంధించిన ప్రైవేటు కాలేజీల పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో కొత్త సీట్లు రావని తెలియడంతో, త్వరగా కౌన్సెలింగ్ ప్రక్రియను ముగించి, ఇంజనీరింగ్ క్లాసులను ఈ నెలాఖరులో మొదలు పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు యాజమాన్య కోటా సీట్ల భర్తీని ఆయా కాలేజీలు వెల్లడించాలని ఆదేశించారు. దీంతో కన్వీనర్ కోటా కింద సీట్లు రాని విద్యార్థులు మిగిలిపోయే యాజమాన్య కోటా సీట్లకు ప్రయత్నించే వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు. 98 శాతం కంప్యూటర్ కోర్సుల్లోనే.. ఇప్పటి వరకూ జరిగిన కౌన్సెలింగ్‌లో ఎక్కువ శాతం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇతర అనుబంధ కోర్సుల్లోనే అత్యధికంగా సీట్లు భర్తీ అయ్యాయి. ప్రైవేటు కాలేజీలు సివిల్, మెకానికల్, ఎలక్రి్టకల్ వంటి బ్రాంచీల్లో సీట్లు తగ్గించాయి. దీంతో ఈ బ్రాంచీల్లో సీట్లు తగ్గాయి. ఐటీ, ఐవోటీ బ్రాంచీల్లో మార్పిడికి అనుమతించారు. దీనికి తోడు కొన్ని సీఎస్ఈ, అనుబంధ కోర్సుల్లో స్వల్పంగా సీట్లు పెరిగాయి. ఈ బ్రాంచీల్లో 61,587 సీట్లు అందుబాటులో ఉంటే, 60,362 సీట్లు భర్తీ అయ్యాయి. కేవలం 1,225 సీట్లు మాత్రమే మిగిలిపోయాయి. 98.01 శాతం సీట్లు కంప్యూటర్ కోర్సుల్లో భర్తీ అయినట్టు అధికారులు ప్రకటించారు. ఈసీఈలో 94.38 శాతం, ఈఈఈలో 76.38 శాతం, సివిల్ ఇంజనీరింగ్‌లో 80.16 శాతం, మెకానికల్ ఇంజనీరింగ్‌లో 72.38 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్, మెకానికల్ సహా అనుబంధ కోర్సుల్లో 7,458 సీట్లు ఉంటే, 5,782 సీట్లు భర్తీ అయ్యాయి. 1,676 సీట్లు మిగిలిపోయాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్రి్టకల్ కోర్సుల్లో 16,692 సీట్లు ఉంటే, 14,907 సీట్లు భర్తీ అయ్యాయి. 1,785 సీట్లు మిగిలిపోయాయి. -
జేఈఈ మెయిన్‌కు రికార్డు స్థాయిలో హాజరు
సాక్షి, అమరావతి: జాతీయ సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షకు రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరయ్యారు. జనవరి 24 నుంచి ఈ నెల 1 వరకు జరిగిన జేఈఈ తొలి సెషన్ పేపర్–1 (బీఈ/బీటెక్) పరీక్ష 95.80 శాతం, పేపర్–2 (బీఆర్క్/బీప్లానింగ్) పరీక్ష 75 శాతం మంది రాయడం విశేషం. చరిత్రలో ఎన్నడూ లేనంతంగా ఈసారి జేఈఈ మెయిన్‌కు 12,31,874 మంది దరఖాస్తు చేశారు. ఇందులో 8,24,945 మంది పురుషులు, 4,06,920 మంది మహిళలు, 9 మంది థర్డ్ జెండర్ ఉన్నారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈ సంఖ్య 27 శాతం ఎక్కువ. తాజాగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అత్యధికంగా 12,25,529 మంది పరీక్షకు హాజరయ్యారు. 291 ప్రాంతాల్లో 544 పరీక్ష కేంద్రాలు.. ఈ ఏడాది జేఈఈ మెయిన్‌కు అత్యధికంగా దరఖాస్తులు రావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్ష కేంద్రాలు పెంచింది. సెషన్–1 కోసం 291 ప్రాంతాల్లో 544 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో 21 పరీక్ష కేంద్రాలు విదేశాల్లో ఉండటం విశేషం. దోహా, దుబాయ్, ఖాట్మండు, మస్కట్, రియాద్, షార్జా, సింగపూర్, కువైట్ సిటీ, కౌలాలంపూర్, లాగోస్/అబుజా, కొలంబో, జకార్తా, మాస్కో, ఒట్టావా, పోర్ట్లూయిస్, బ్యాంకాక్, వాషింగ్టన్ డీసీతో పాటు ఈ ఏడాది తొలిసారిగా అబుదాబి, హాంకాంగ్, ఓస్లో నగరాల్లో జేఈఈ మెయిన్ పరీక్షను నిర్వహించారు. రెండో సెషన్ తేదీల్లో మార్పు.. జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షల షెడ్యూల్‌ను ఎన్టీఏ మార్పు చేసింది. తొలుత ఏప్రిల్ 1 నుంచి 15 మధ్యలో పరీక్షలు నిర్వహించాలని భావించినప్పటికీ వాటిని ఏప్రిల్ 4 నుంచి 15 మధ్యలోకి మార్చింది. మార్చి 2 అర్దరాత్రి 11.50 గంటల వరకు సెషన్–2 కోసం దరఖాస్తులు స్వీకరించనుంది. గతంలోనే రెండు సెషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు రెండో సెషన్‌కు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అభ్యర్థి సెషన్లో ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్టీఏ హెచ్చరించింది. రెండు సెషన్లలో రాస్తే.. ఎందులో అత్యధిక స్కోర్ వస్తుందో దాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. జేఈఈ మెయిన్‌లో ప్రతిభ, రిజర్వేషన్లు ఆధారంగా టాప్ 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు. వీరు పోగా మిగిలిన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్‌ఐటీ (ప్రభుత్వ నిధులతో పనిచేసే సాంకేతిక విద్యా సంస్థలు)ల్లో సీట్లను భర్తీ చేస్తారు. -
వారెక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు!
ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థలో జరిగిన ఆర్థిక అవకతవ కలు జాతీయ స్థాయి వార్తల్లో చర్చనీయాంశం అయ్యింది. ఈ సంస్థ పనిలో లొసుగుల విషయం అటుంచితే, దీని స్థాపనకు ముందు మూడు దశాబ్దాల కాలం పాటు కుంటుకుంటూ సాగి... గిడసబారిన బడుగు బలహీన నిమ్న వర్గాల యువత ఉపాధి దీన చరిత్రను చూడాల్సి ఉంది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో 1985లో ఇండియాలో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఏర్పడింది. ఇది జరిగాక, విద్యను ఉపాధి కేంద్రిత దృష్టితో చూడడం మొదలయింది. అంతకు ముందు అది– ‘జ్ఞానం’ కేంద్రంగా ఉండేది. ఈ శాఖ ఏర్పడిన తర్వాత మానవీయ శాస్త్రాల నుండి వాణిజ్య, శాస్త్ర– సాంకేతిక విద్య వరకు అన్నింటినీ ఒక గొడుగు కింది చేర్చి చూడడం మొదలయింది. అలా తొలి మానవ వనరుల శాఖ మంత్రి పీవీ నర సింహారావు ఆ తర్వాత ప్రధానమంత్రి అయ్యాక, 1991లో మొదలైన ఆర్థిక సంస్కరణలలో మన– ‘మానవ వనరుల’ దృష్టికి ద్రవరూపం ఏర్పడి, అది అన్ని అభివృద్ధి – సంక్షేమ పార్శ్వాల్లోకి ప్రవహించడం మొదలయింది. చివరిగా అప్పటి ప్రధాని మన్మోహన్ ‘సీఐఐ’ వంటి వేదికల మీద ఉపాధి అవ కాశాల కల్పన పెంచమని పారిశ్రామిక వేత్తలను కోరడం ఈ మొత్తం పరిణామాలకు ముగింపుగా చూడాల్సి ఉంటుంది. ఈ కాలంలోనే పట్టణాభివృద్ధి, విద్యుత్తు, కమ్యూని కేషన్స్, పారిశ్రామిక, ఇరిగేషన్ రంగాల్లో ‘ఇంజనీరింగ్’ విద్య అవసరం బాగా పెరిగింది. దాంతో మానవ వనరుల అవసరాన్ని ‘డిమాండ్ – సప్లయ్’ దృష్టితో చూడడం మొదలయింది. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు, వనరుల సహకారంతో ప్రయివేట్ రంగంలో ఇంజనీరింగ్ కాలేజీలు మొదలై అవి లాభసాటి వ్యాపారంగా మారడంతో మన (ఉమ్మడి) రాష్ట్రంలో ఆ కోర్సుల్లోకి ప్రవేశం ఖరీదు అయ్యింది. దాంతో 2000 నాటికి ఇంజనీరింగ్ కాలేజీల ‘గ్రేడింగ్’ను బట్టి ఎంపిక చేసుకున్న వాటిలో తల్లితండ్రులు తమ పిల్లల్ని చేర్చడం మొదలయింది. ఆ దశలో స్థోమతు లేని పిల్లలకు 2004 తర్వాత వైఎస్సార్ ప్రభుత్వంలో– ‘ఫీజ్ రీయింబర్స్మెంట్’ పథకం అందు బాటులోకి వచ్చాక; పెద్ద ఎత్తున అన్ని ఆర్థిక స్థాయుల్లోని పిల్లలు వీటిలో చదివి దేశ విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు పొందారు. ఎప్పుడైతే సాంకేతిక విద్య ‘మార్కెట్’ ప్రతిపాదికగా మారిందో, అప్పుడు వీరి ఉపాధి అవకాశాలు ‘ఫస్ట్–కమ్ –ఫస్ట్’ వడ్డనగా తయారైంది. అప్పటికే ఇంజనీరింగ్ డిగ్రీ మాత్రమే చాలదు ఎంబీఏ ఉండాలనీ, ఎమ్‌టెక్ తప్పనిసరి అనీ, కాదు అమెరికాలో ఎమ్ఎస్ ఉండాలి అనే భిన్న ధోర ణులు సాంకేతిక విద్య మార్కెట్లో వ్యాపించాయి. చివరికి ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నప్పటికీ పలు స్థాయుల్లో జరిగే ‘ఎలిజిబి లిటీ టెస్ట్’ పాసైతేనే ఉద్యోగం అనే పరిస్థితి దాపురించింది. ఫలితంగా ఆలస్యంగా ఇందులోకి వచ్చిన అంతంత మాత్రపు చదువులున్న తల్లిదండ్రులకు వారి పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. అప్పటికే ‘హ్యుమానిటీస్’ డిగ్రీలకు ఉద్యోగ మార్గాలు మూసుకు పోయాయి. ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియం చదువు పునాది లేకపోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ కరవు కావడం, గ్రామీణ నేపథ్యం,వంటివి వీరి ఉపాధికి అవరోధాలు అయ్యాయి. 2007లో శేఖర్ కమ్ముల తీసిన ‘హేపీ డేస్’ సినిమాలో ‘కేంపస్ సెల క్షన్స్’లో ఉత్తరాంధ్ర గ్రామీణ విద్యార్థి పడిన పాట్లు ఈ పరిస్థితికి అద్దం పట్టాయి. డిగ్రీ ‘సర్టిఫికెట్’ ఉండికూడా కేవలం ‘స్కిల్స్’ లేక కుటుంబ పోషణార్థం‘మార్కెటింగ్ ఎగిక్యూటివ్’, ’రియల్ ఎస్టేట్ ప్రమోటర్’ వంటి దుఃస్థితిలో వీరు ఉండిపోయారు. ఇటువంటి ఉపాధి దుఃస్థితి నేపథ్యంలో 2014లో రాష్ట్ర విభ జన జరిగాక, టీడీపీ ఏపీలో తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటువంటి చర్యను సంక్షేమం అనుకుందో లేదా అభి వృద్ధి అనుకుందో తెలియదు గానీ; పైన చెప్పుకున్న దయ నీయ స్థితిలో ఉంటూ ఉపాధి వెతుక్కుంటున్న యువత కోసం ‘ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ ఏర్పాటు చేసింది. చివరికి 2014–19 మధ్య ఈ కార్పొరేషన్ నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలు వచ్చాయి. అయితే కాలం ఎవరి కోసం ఆగదు కనుక ‘ఫస్ట్–కమ్–ఫస్ట్’ అనేది అన్ని కాలాల్లోనూ ఉంటుంది. ఈ జూలై రెండో వారంలో జరిగిన యూనివర్సిటీ వైస్–ఛాన్సలర్ల సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ – సాంకేతిక విద్యా రంగంలో నూతన పోకడలతో (ఎమర్జింగ్ టెక్నాల జీస్) సిలబస్‌లను రూపొందించాలని కోరారు. ప్రపంచం ఇలా ముందుకు పోతుంటే, కేవలం ‘స్కిల్స్’ లేక మిగిలిపోతున్న పిల్లలు భవిష్యత్తు ఒక జీవిత కాలం లేటు కావడం అనేది, ఇప్పటికైనా ఈ ‘స్కిల్’ కుంభకోణం ఉదంతంలో మనకు కనిపిస్తుందా? జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
దివ్యాంగ విద్యార్థులకు సాంకేతిక బోధన నైపుణ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులకు సాంకేతిక విద్యా బోధన అందించేందుకు దేశంలోనే తొలిసారిగా ఫస్ట్ ఇన్‌క్లూజివ్ డిజిటల్ ఫెస్టివల్ నిర్వహిస్తుందని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు అన్నారు. పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు సకల సౌకర్యాలతో డిజిటల్ విద్యను అందిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర సమగ్ర శిక్ష, రూరల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ (ఆర్డీటీ అనంతపురం) సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం అనంతపురం ఆర్డీటీ ఆడిటోరియంలో జరిగిన ‘ఫస్ట్ ఇన్‌క్లూజివ్ డిజిటల్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమలోని ఆరు జిల్లాల (అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, కడప) నుంచి 300 మంది దివ్యాంగ, సాధారణ విద్యార్థులతో కలిపి విజువల్ కోడింగ్, ఆక్సిస్బల్ కోడింగ్, రోబోటిక్, వెబ్ డిజైన్, యానిమేషన్ గేమ్స్ డెవలప్మెంట్ వంటి 100 డిజిటల్ నైపుణ్యాల ప్రాజెక్టులను ప్రదర్శించి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు సాధించడం అభినందనీయమన్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫె సర్ ఎం.రామకృష్ణారెడ్డి, ఆర్డీటీ డైరెక్టర్ దశరథ్, చక్షుమతి ఫౌండేషన్ ప్రతినిధి రామ్‌కమల్, సైబర్ స్క్వేర్ సీఈవో ఎన్.పి.హరిష్, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఏపీ ప్రతినిధి పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు అర్హుల జాబితా విడుదల
సాక్షి, అమరావతి/నూజివీడు/వేంపల్లె: ట్రిపుల్ ఐటీల్లో అత్యున్నత ప్రమాణాలతో సాంకేతిక విద్యను అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో నూజివీడు, ఆర్కే వ్యాలీ(ఇడుపులపాయ), ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో ఉన్న 4,400 సీట్లకు ఈ ఏడాది 38,355 మంది దరఖాస్తు చేశారన్నారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల నుంచి 23,628(83శాతం) మంది, ప్రైవేటు పాఠశాలల నుంచి 14,727(17 శాతం) మంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా కౌన్సెలింగ్‌కు ఎంపిక చేశామన్నారు. 2023–24 విద్యా సంవత్సరానికి ఆర్జీయూకేటీలో కౌన్సెలింగ్‌కు అర్హత సాధించినవారి జాబితాను గురువారం మంత్రి బొత్స విజయవాడలో విడుదల చేశారు. కౌన్సెలింగ్‌కు ఎంపికైన టాప్–20లో ప్రభుత్వ విద్యార్థులే ఉన్నారని వెల్లడించారు. పదో తరగతిలో 600కి 599 మార్కులు వచ్చిన విద్యార్థి సైతం ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడం గర్వకారణమన్నారు. కౌన్సెలింగ్‌కు ఎంపికైన జనరల్ విద్యార్థుల కటాఫ్ మార్కులు 583గా ఉన్నట్టు చెప్పారు. ట్రిపుల్ ఐటీల్లో ఇప్పటికే పీజీ కోర్సులను అందుబాటులోకి తెచ్చామని గుర్తుచేశారు. వచ్చే ఏడాది నుంచి పీహెచ్డీ కోర్సులనూ ప్రవేశ పెడుతున్నామని వెల్లడించారు. కాగా, ఈ నెల 20, 21 తేదీల్లో నూజివీడు క్యాంపస్‌లో, 21, 22 తేదీల్లో ఆర్కే వ్యాలీ (ఇడుపులపాయ)లో, ఒంగోలు క్యాంపస్‌కు సంబంధించి 24, 25 తేదీల్లో ఆర్కే వ్యాలీలో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. శ్రీకాకుళం క్యాంపస్‌లో 24, 25 తేదీల్లో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. మొత్తం అర్హుల్లో 3,345 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, 695 మంది ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులున్నారని చెప్పారు. ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభమవుతాయన్నారు. కార్య క్రమంలో చాన్సలర్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి, వైస్ చాన్స లర్ ప్రొఫెసర్ ఎం.విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
దేశాభివృద్ధిలో సాంకేతిక విద్య కీలకం
సాక్షి, అమరావతి: దేశాభివృద్ధిలో సాంకేతిక విద్య కీలక భూమిక పోషిస్తోందని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చైర్మన్ టీజీ సీతారామ్ అన్నారు. ఈ క్రమంలోనే సాంకేతికతతో కూడిన పరిపాలన అందించడం ద్వారా ప్రజల జీవన శైలిలో సమూల మార్పులు తీసుకురావచ్చన్నారు. ప్రైవేటు ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్ కళాశాలల యాజమాన్యాల సంఘం(అపెక్మా) సమావేశం శుక్రవారం విజయవాడలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీతారామ్ మాట్లాడుతూ.. 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతోందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వచ్చే 25 ఏళ్లను అమృత కాలంగా పరిగణించి కీలక సంస్కరణల దిశగా ప్రణాళిక రూపొందించిందన్నారు. 50 కోట్లకు పైగా యువ శక్తితో భారత్ ప్రపంచంలో బలమైన దేశంగా ఉందన్నారు. కళాశాలల యాజమాన్యాలు సాంకేతిక విద్యలో విద్యార్థులకు లెర్నింగ్ ఔట్‌కమ్స్‌ను మెరుగుపర్చాలని కోరారు. ఇందుకు నైపుణ్యాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా సమీకృత, మల్టీడిసిప్లినరీ కోర్సులను కచ్చితంగా ప్రవేశపెట్టాలని సూచించారు. ఇప్పటికే ఏఐసీటీఈ గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం మాతృభాషలోనూ సాంకేతిక విద్యను అందిస్తోందని గుర్తు చేశారు. కళాశాలల్లో ఇన్‌టేక్, అక్రెడిటేషన్ల జారీల విషయంలో రాధాకృష్ణన్ కమిటీ సమగ్ర అధ్యయనం చేస్తోందన్నారు. కళాశాలలకు అనుమతుల ప్రక్రియను సైతం సులభతరం చేస్తున్నామని తెలిపారు. ఏటా నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)లో ప్రతి కళాశాల భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఏపీలో యువతకు మెండుగా ఉపాధి అవకాశాలు.. సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ గతిశక్తి కార్యక్రమంలో కీలకంగా మారనుందని సీతారామ్ తెలిపారు. ఇక్కడ లాజిస్టిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రొడక్షన్ తదితర రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో అత్యధికంగా ఏపీ విద్యార్థులే ఉండటం తెలుగు వారి విద్యా ప్రతిభకు నిదర్శనమన్నారు. కంప్యూటర్ సైన్స్ ఒక్కటే సాంకేతిక విద్య కాదని తెలిపారు. అనేక కోర్ బ్రాంచ్‌లు, ఇతర రంగాల్లోని అవకాశాల గురించి విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. త్వరలో 1,500కు పైగా కంపెనీలతో కలిసి ప్లేస్మెంట్ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు సైతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గత మూడేళ్లలో ఉన్నత విద్యలో ఏపీ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. విద్యార్థులకు ప్రపంచ స్థాయి కంపెనీల్లో సర్టిఫికేషన్లు అందించడం ద్వారా నైపుణ్య సామర్థ్యాలను పెంపొందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్య డైరెక్టర్ నాగరాణి, అపెక్మా చైర్మన్ చొప్పా గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీ చేస్తే జాక్‌పాట్.. ఐటీ కంపెనీల క్యూ...
సాక్షి, హైదరాబాద్: డిగ్రీనా... అనే చులకన భావం ఇక నుంచి ఉండదంతే. దేశవ్యాప్తంగా డిగ్రీ కోర్సులకు భవిష్యత్‌లో డిమాండ్ పెరగబోతోంది. ఇంతకాలం కొనసాగిన సంప్రదాయ కోర్సుల్లో అనేక మార్పులు తెస్తున్నారు. సాంకేతిక విద్యకు తీసిపోని రీతిలో సాన పడుతున్నారు. దేశ, విదేశాల్లో ఉపాధి అవకాశాలుండేలా తీర్చి దిద్దుతున్నారు. అనేక కొత్త కోర్సుల మేళవింపు, కంప్యూటర్ అప్లికేషన్ల గుభాళింపు డిగ్రీ కోర్సుల తీరు తెన్నులనే మార్చబోతోంది. హానర్స్ కోర్సులకు ప్రాధాన్యం తెలంగాణ సహా దేశంలో అన్ని రాష్ట్రాలూ మూడేళ్ళ డిగ్రీ కోర్సుల స్థానంలో నాలుగేళ్ళ హానర్స్ కోర్సులకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) రూపొందించింది. ఈ ఏడాది నుంచే తెలంగాణలో నాలుగేళ్ళ బీఎస్సీ (హానర్స్) కంప్యూటర్స్‌ను 50కి పైగా కాలేజీల్లో అందుబాటులోకి తెస్తున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి అతి ముఖ్యమైన అంశాలు హానర్స్‌లో చోటు చేసుకోబోతున్నాయి. నూతన జాతీయ విద్యావిధానం–2020కి అనుగుణంగా ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. నాలుగేళ్ళు చదివితే హానర్స్ డిగ్రీ ఇస్తారు. మూడేళ్ళకే మానుకుంటే సాధారణ డిగ్రీ సర్టిఫికెట్ ఇస్తారు. దీంతో పాటు ఏ తరహా డిగ్రీ చేసినా, ఇష్టమైన ఓ సబ్జెక్టును చేసే సరికొత్త విధానం అందుబాటులోకి తెచ్చారు. అంటే బీఏ కోర్సు చేస్తున్న విద్యార్థి కూడా కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన ఓ సబ్జెక్టు చేసే వీలుంది. వాణిజ్య విప్లవంలో డిగ్రీకి ప్రాధాన్యత గత దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఈ–కామర్స్ రాజ్యమేలుతోంది. దీంతో కామర్స్ డిగ్రీ నేపథ్యం ఉన్న వారికి మంచి డిమాండ్ వచ్చింది. కంప్యూటర్స్ పరిజ్ఞానంతో కూడిన అనలిస్టులు, అకౌంటెంట్లకు మంచి వేతనాలతో కూడిన ఉపాధి లభిస్తోంది. ఈ కారణంగా డిగ్రీ కోర్సుల్లో కామర్స్‌ను ఎంచుకునే వారి సంఖ్య 36 శాతం నుంచి 41 శాతానికి పెరిగింది. బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ)లో చేరికలు కూడా ఆరేళ్ళల్లోనే ఏడు రెట్లు పెరిగాయి. బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ)లో ప్రవేశాలు 9 రెట్లు పెరిగాయి. దీంతో బీకాం కోర్సులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. బీకాం జనరల్‌తో పాటు, కంప్యూటర్స్, టాక్సేషన్, హానర్స్, బిజినెస్ అనలిటిక్స్ వంటి కొత్త స్పెషలైజేషన్‌ను తీసుకొచ్చారు. బీమా, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెరగడం, జీఎస్టీ తీసుకురావడంతో టాక్స్ నిపుణుల అవసరం రెట్టింపయింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఈ–కామర్స్, రిటైల్ సంస్థల పెరుగుదల కూడా కలిసివచ్చింది. పెరుగుతున్న క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కేవలం ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళే ఐటీ కంపెనీలు ఇప్పుడు నాణ్యమైన విద్యను అందించే డిగ్రీ కాలేజీల్లోనూ నియామకాలు చేపడుతున్నాయి. నాన్–ఇంజనీరింగ్‌గా పిలిచే డిగ్రీ విద్యార్థులను గత రెండేళ్ళుగా పెద్ద ఎత్తున తమ కంపెనీల్లో చేర్చుకుంటున్నాయి. రాష్ట్రంలో 110 వరకూ ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలున్నాయి. ఇందులో హైదరాబాద్‌లోనే దాదాపు 300 కాలేజీలున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు వంద కాలేజీల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. ఫార్మా, బ్యాంకింగ్, రిటైల్, మార్కెటింగ్ కంపెనీలతో పాటు టీసీఎస్, కాగ్నిజెంట్, విప్రో, సీజీఎల్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్ కోసం వస్తున్నాయి. ప్రతీ ఏటా ఈ కంపెనీలు 10 నుంచి 20 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకూ వార్షిక వేతనం ఇస్తున్నాయి. -
పేద పిల్లలకు ట్యాబ్‌లిస్తే భరించలేరా? ‘ఈనాడుకు ఎందుకీ కడుపుమంటా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న పేద విద్యార్థులకు అందిస్తున్న ట్యాబ్‌లపై ‘ఈనాడు’, తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారంపై పాఠశాల విద్యాశాఖ తీవ్రంగా మండిపడింది. పేద పిల్లలకు కార్పొరేట్ పాఠశాలలతో సమానంగా సాంకేతిక విద్యను ట్యాబ్‌ల ద్వారా అందిస్తుంటే భరించలేక అవి అడ్డుకుంటున్నాయని ఆక్షేపించింది. వాళ్లు సాంకేతిక విద్య ద్వారా రాణిస్తే మీకు కడుపుమంటా అని ప్రశ్నించింది. వాస్తవాలను కప్పిపుచ్చి అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా కథనాలు రాయడం, ఆరోపణలు చేయడాన్ని ఖండించింది. పనికిమాలిన తప్పుడు అంశాలతో దుష్ప్రచారం చేస్తున్నారంటూ వాస్తవాలు ఏమిటో ప్రజల ముందుంచింది. విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబ్‌లకు సంబంధించి ‘8.7 అంగుళాల తెరపై వివాదాలు’ అంటూ ‘ఈనాడు’లో వచ్చిన కథనం, ‘సీఎం జగన్‌కు రూ.221 కోట్ల కానుక’ అంటూ తెలుగుదేశం చేసిన ఆరోపణలను కొట్టిపారేసింది. అంతేకాక.. టెండర్ల ప్రక్రియలో ఎవరైనా పాల్గొనే అవకాశమున్నప్పటికీ మీరెందుకు పాల్గొనలేదని విద్యాశాఖ వాటిని సూటిగా ప్రశ్నించింది. నిజానికి.. ప్రభుత్వం ఇస్తున్న ట్యాబ్‌లకు మూడేళ్ల వారంటీతోపాటు పలు ఫీచర్లు ఉన్నాయని తెలిపింది. అలాగే, టెండర్లలో శాంసంగ్ పాల్గొని ఎల్–1గా నిలిచింది కాబట్టి టెండర్‌ను ఆ సంస్థకు అప్పగించామని స్పష్టంచేసింది. ఇక వచ్చే ఏడాది కూడా ఐదు లక్షలకు పైగా ట్యాబ్‌లు అవసరమవుతాయని.. ఇవే స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఉన్న ట్యాబ్‌లను మూడేళ్ల వారంటీతో రూ.12వేలకు ఈనాడు, తెలుగుదేశం పార్టీలు ఇస్తే కాంట్రాక్టును వారికే ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున విద్యాశాఖ సవాల్ చేసింది. రివర్స్ టెండరింగ్‌తో రూ.187 కోట్లు ఆదా ఇక ట్యాబ్‌లకు నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో నాలుగు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పాల్గొన్నాయి. రివర్స్ టెండరింగ్‌తో ప్రభుత్వం రూ.187 కోట్లు ఆదా చేసింది. నిజానికి.. ప్రభుత్వం కొనుగోలు చేసిన ట్యాబ్‌లలోని స్పెసిఫికేషన్లు, అదనపు సదుపాయాలు అమెజాన్ లాంటి సంస్థలు అందించే ట్యాబ్‌లలో లేవు. రూ.12,843 ధరతో ప్రభుత్వం కొనుగోలు చేసిన ఈ ట్యాబ్‌లలోని స్పెసిఫికేషన్లు, అదనపు సదుపాయాలతో అమెజాన్ లాంటి సంస్థలు ఇచ్చే ట్యాబ్ ధర రూ.3,603 ఎక్కువగా (22 శాతం) ఉంది. అలాగే, ప్రభుత్వం కొనుగోలు చేసిన ధరలోనే మండల పాయింట్ల వరకు వాటిని చేర్చేందుకు అయ్యే ఖర్చు కూడా కలిపి ఉంది. ఆరోపణ–1: 8వ తరగతి విద్యార్థులకు అందించిన పీసీ ట్యాబ్ ఖరీదు రూ.11,999. ఆన్లైన్లో ఇదే పరికరాన్ని బల్క్‌గా కొనుగోలుచేస్తే రూ.9వేలే. ఈ లెక్కన ట్యాబ్‌ల పంపిణీలో రూ.221 కోట్లు స్వాహా చేశారు. వాస్తవం ఇదీ: ఈ ఆరోపణ నిజం కాదు. ఆన్లైన్ పోర్టళ్లు కూడా బల్క్‌లో నేరుగా ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్ (ఓఈఎం) నుంచి కొనుగోలుచేసి తక్కువ మార్జిన్‌కు అమ్ముతుంటాయి. అందువల్ల ఆన్లైన్ ధరలు తక్కువగా ఉంటాయనడం నిజంకాదు. అంతేకాక.. రాష్ట్ర ప్రభుత్వం ఈ పీసీ ట్యాబ్‌లను అదనపు ఫీచర్లు ఇతర ఐటెమ్‌లతో కలిపి కొనుగోలు చేసింది. ఇవేవీ ఆన్లైన్ కొనుగోళ్లలో కవర్ కావు. ఆయా వస్తువులు మార్కెట్ ధరకన్నా ఎంతో తక్కువకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ వివరాలు.. ఆరోపణ–2: ట్యాబ్ డిస్ప్లే సైజు శ్యామ్‌సంగ్ కంపెనీకి తగ్గట్లుగా 8.7 అంగుళాల సైజును టెండర్లలో పెట్టారు. 8 అంగుళాలు ఆపైన డిస్ప్లే సైజు ఉండాలనేలా నిబంధనను మార్పు చేయాలని ఇతర కంపెనీలు కోరినా పట్టించుకోలేదు. వారిని పోటీ నుంచి తప్పించేందుకే ఇలా చేశారు. వాస్తవం ఇదీ: ఈ ఆరోపణ కూడా నిజం కాదు. టెండర్ డాక్యుమెంటు పత్రాల్లో స్పెసిఫికేషన్లలో డిస్ప్లే సైజు 8.7 అంగుళాలు లేదా ఆపై, 1,280 800 రిజల్యూషన్‌లో, టచ్‌స్క్రీన్ ఉండాలని పేర్కొన్నారు. ఏ ట్యాబ్ అయినా 8.7 అంగుళాల స్క్రీన్‌సైజు లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నవి ఆమోదయోగ్యమని స్పష్టంగా ఉంది. ఒరిజినల్ ఎక్విప్మెంటు మాన్యుఫాక్చరర్ల నుంచి 10 అంగుళాల పీసీ ట్యాబ్‌కు కూడా బిడ్లు స్వీకరించారు. బిడ్ల ఇవాల్యుయేషన్‌లో టెండర్ కండిషన్లను అనుసరించి ఉన్న వాటిని ఆమోదించారు.. అని పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది. -
Natural Skills: సహజ నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలి
ఈ మధ్యన ఒకటి–రెండు సందర్భాలలో మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న ఒకరిద్దరు చురుకైన విద్యార్థులను కలవడం సంభవించింది. వాళ్లతో మాటా–మాటా కలిపి, వారి–వారి ప్రొఫెషనల్ విద్యాభ్యాసంలో భాగంగా ఏం నేర్చుకుంటున్నారూ, అధ్యాపకులు ఏం నేర్పిస్తున్నారనీ ప్రశ్నిస్తే, వారిదగ్గర నుండి ఆశించిన సమాధానం రాలేదు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి అయిన తరువాత ఏరకమైన మెషిన్లమీద పనిచేస్తావని ప్రశ్నిస్తే తెలియదని అమాయకంగా వచ్చింది జవాబు. కంప్యూటర్ ఇంజనీరింగ్ తరువాత సరాసరి ఏదైనా ప్రోగ్రామింగ్ చేయగలరా అంటే దానికీ జవాబు లేదు. సివిల్ ఇంజనీరింగ్ తరువాత ఎలాంటి ప్రాజెక్టులలో పనిచేయాలని అనుకుంటున్నావని అడిగితే అసలే అర్థం కాలేదు. అందరూ విద్యార్థులూ ఇలాగేనా అంటే కావచ్చు, కాకపోవచ్చు. స్వతహాగా తెలివైన కొందరి విషయంలో మినహాయింపు ఉండవచ్చు. ఇంజనీరింగ్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులన్నీ ఇటీవల కాలంలో ‘నాలెడ్జ్ బేస్డ్’ (అంతంత మాత్రమే) తప్ప ‘స్కిల్ బేస్డ్’ కాకపోవడమే బహుశా దీనికి కారణం కావచ్చు. ఇదిలా ఉంటే ఎలాంటి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకుండా రకరకాల వృత్తి నిపుణులు మన దేశంలో, రాష్ట్రంలో కోకొల్లలు. వారంతా స్వయంశక్తితో వారి వారి వృత్తుల్లో ఎలా ప్రావీణ్యం సంపాందించుకున్నారో అనేది కోటి రూకల ప్రశ్న. వారిలో గ్రామీణ వృత్తులు మొదలుకుని, పట్టణాలలో, నగరాలలో పనిచేస్తున్న వాహనాలు, ఎయిర్ కండీషన్లు వంటి వాటిని బాగుచేసే మెకానిక్కులు చాలామందే ఉన్నారు. వీరు రిపేర్లు చేయడానికి వచ్చేటప్పుడు తమ వెంట ఒక జూనియర్ కుర్రవాడిని తీసుకు వస్తారు. అతడు కొంతకాలానికి సీనియర్ అయిపోతాడు. అందుకే ఇటువంటివారు నేర్చుకున్న విద్య భావితరాలవారికి అందుబాటులోకి తీసుకువచ్చే విధానం ప్రవేశపెట్టాలి. వీరికి సంబంధిత విద్యార్హతలు లేకపోయినా ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు ప్రాక్టికల్స్ చెప్పేటప్పుడు ఉపయోగించుకునే విధానం రూపొందిస్తే మంచిదేమో! యాభై, అరవై ఏళ్ల అనుభవంతో చేస్తున్న సూచన ఇది. చేతి గడియారం పనిచేయకపోతే, కంపెనీ షోరూమ్‌కు పోయి ఇస్తే బాగుచేసి ఇవ్వడానికి సమయం పట్టే అవకాశాలున్నాయి కాబట్టి, ఎప్పటిలాగే, ఆలవాటున్న ఒక రిపేర్ షాప్‌కు పోయాను ఇటీవల. ఆ చిన్న షాప్‌లో ఎప్పటిలాగే ఇద్దరు నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ కూర్చున్నారు. ఆ ఇద్దరిలో సీనియర్ వ్యక్తి (బహుశా) బ్యాటరీ కొత్తది వేయాలని చెప్పి రూ. 220 అవుతుందన్నాడు. నేను సరే అనగానే ఐదు నిమిషాలలో ఆ పని కానిచ్చి నా చేతిలో పెట్టాడు. గత ఏభై ఏళ్లుగా... తన తండ్రి కాలం నుంచి అక్కడే రిపేర్లు చేస్తున్నామనీ, గడియారాలు రిపేరు చేసే విద్య ఎప్పటినుంచో తనకు వచ్చనీ, ఎలా అబ్బిందో తెలియదనీ, ఎక్కడా నేర్చుకున్నది కాదనీ అన్నాడు. ఇటీవల మనం వాడుకునే వస్తువులు చెడిపోయినప్పుడు ఎక్కువగా కంపెనీల సర్వీసింగ్ మెకానిక్‌లను పిలవకుండా స్వంతంగా నేర్చుకున్న పనితనంతో తక్కువ ధరకు సర్వీసు చేసి పోతున్న లోకల్ టాలెంట్లనే వినియోగదారులు ఆశ్రయించడం వీరికి ఉన్న విశ్వసనీయతను తెలియ జేస్తోంది. ఇటువంటి నేచురల్ టాలెంట్ ఉన్న వారు అన్ని రంగాల్లోనూ ఉన్నారు. మా చిన్నతనంలో ఖమ్మం పట్టణంలో మేమున్న మామిళ్ళ గూడెం బజారులో (లంబాడి) రాము అని ఆర్టీసీలో మెకానిక్‌గా పని చేస్తున్న వ్యక్తి ఉండేవాడు. అతడు ఏ మెకానికల్ ఇంజనీరింగ్ చదువు కోలేదు. కాని అద్భుతమైన రీతిలో మెకానిజం తెలిసిన వ్యక్తి. ఆ రోజుల్లో ఖమ్మంలో కార్లు, జీపులు బహుశా చాలా తక్కువ. వాటికి కానీ, లారీలకు కానీ ఏ విధమైన రిపేర్ కావాలన్నా రామునే దిక్కు. రాముకు సహజ సిద్ధంగా అబ్బిన విద్య అది. అప్పట్లో హైదరాబాద్‌లో మా బంధువు లబ్బాయి ఒకడిది అద్భుతమైన మెకానికల్ బ్రెయిన్. ఇంకా కంప్యూటర్లు ప్రాముఖ్యం చెందని రోజుల్లో సాఫ్ట్వేర్, హార్డ్వేర్లలో నైపుణ్యం సంపాదించాడు. ఎట్లా నేర్చుకున్నాడో, ఎవరికీ తెలియదు. ఇంటర్మీడియేట్ చదవడానికి ప్రయత్నం చేశాడు. కుదరలేదు. స్నేహితుల సహాయంతో అమెరికా చేరుకున్నాడు. చిన్నగా హార్డ్‌వేర్ మెకానిజంలో పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో కంపెనీలు అప్పట్లో అతడి మీద ఆధారపడేవి. అంచెలంచెలుగా ఎదిగి ఫార్మల్ డిగ్రీలు లేకపోయినా నైపుణ్యం ప్రాతిపదికగా అక్కడ స్థిరపడిపోయాడు. అతడా విద్య ఎలా నేర్చుకున్నాడు? చాలా కాలం క్రితం ఆంధ్రాబ్యాంక్‌లో కొఠారి చలపతి రావు అనే ఆయన పనిచేసేవారు. అక్కడ చేరడానికి ముందర కొన్ని చిన్నచిన్న ఉద్యోగాలు కూడా చేశాడు. ఇంకా అప్పటికి కంప్యూటర్లు పూర్తి స్థాయిలో వాడకంలోకి రాలేదు. కేవలం మామూలు గ్రాడ్యుయేట్ మాత్రమే అయిన కొఠారి చలపతిరావు స్వయంగా నేర్చుకుని ఆంధ్రా బ్యాంక్ కంప్యూటర్ సిస్టం ఏర్పాటు చేశాడు. ఆయన్ని అంతా కంప్యూటర్ భీష్మ పితామహుడు అని పిల్చేవారు. ఆయన ఆ విద్య ఎలా నేర్చుకున్నాడు? వీరిలాంటి అనేకమంది సహజ నైపుణ్యం ఉన్నవారిని ప్రొఫెషనల్ కోర్సుల కాలేజీలలో క్వాలిఫికేషన్ లేకపోయినా అయినా ఉపయోగించుకోవాలి. అప్పుడే సాంకేతిక విద్య అభ్యసించే విద్యార్థులకు మంచి నైపుణ్యం అందుబాటులోకి వస్తుంది. (క్లిక్ చేయండి: గట్టివాళ్లే చట్టానికి గౌరవం) - వనం జ్వాలా నరసింహారావు చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, తెలంగాణ ప్రభుత్వం -
సాంకేతిక విద్యలోనూ మిర్రర్ ఇమేజీ పుస్తకాలు
అనంతపురం విద్య: సాంకేతిక విద్యలోనూ మిర్రర్ ఇమేజీ పుస్తకాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఒకే పుస్తకంలో ఒక పేజీలో ఇంగ్లిష్, మరొక పేజీలో తెలుగు కంటెంట్ ఉంటుంది. ఇవి తెలుగు మీడియం విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉండనున్నాయి. నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం సాంకేతిక విద్యా కోర్సులైన ఇంజినీరింగ్, డిప్లొమా పాఠ్య పుస్తకాలను ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలి. ఈ మేరకు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) నిర్దేశించింది. ఇంజినీరింగ్, డిప్లొమా పుస్తకాలను తెలుగు భాషలోకి అనువదించే బాధ్యతను జేఎన్టీయూ(అనంతపురం)కు అప్పగించింది. దీంతో ఇప్పటికే మొదటి సంవత్సరం డిప్లొమా పుస్తకాలు 11, బీటెక్‌లో తొమ్మిది పుస్తకాలు ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి తర్జుమా చేశారు. తెలుగు మీడియం విద్యార్థులకు ఇబ్బంది లేకుండా.. తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంలోకి వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 1 నుంచి 10వ తరగతి వరకు మిర్రర్ ఇమేజీ పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. ఇదే తరహాలోనే బీటెక్, డిప్లొమాలోనూ మిర్రర్ ఇమేజీ పుస్తకాలకు రూపకల్పన చేశారు. దీనివల్ల తెలుగు మీడియం విద్యార్థులు విషయాన్ని త్వరగా అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది. ఆత్మన్యూనతా భావం తగ్గించేలా.. తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంలోకి అడుగుపెట్టే విద్యార్థుల్లో ఆత్మన్యూనతా భావం ఎక్కువగా ఉంటోంది. విషయ పరిజ్ఞానంలో ఇంగ్లిష్ మీడియం వారితో పోటీపడలేమని చాలామంది అనుకుంటుంటారు. అలాంటి వారిలో ధైర్యాన్ని నింపేలా మిర్రర్ ఇమేజీ పుస్తకాలు రూపొందించాం. 2022–23 విద్యా సంవత్సరం నుంచి బీటెక్, డిప్లొమా రెండో సంవత్సరం విద్యార్థులకు సైతం తెలుగు భాషలో కంటెంట్ అందుబాటులోకి తెస్తాం. – డాక్టర్ కె.శేషమహేశ్వరమ్మ, ఏఐసీటీఈ టెక్నికల్ బుక్స్ రైటింగ్ కోఆర్డినేటర్ (రీజినల్ లాంగ్వేజెస్) (చదవండి: పల్లె జనం.. పట్టణ జపం) -
ఎంటెక్ చేశావా.. టీచింగ్ చేస్తావా?
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక విద్యలో మాస్టర్ డిగ్రీ (ఎంటెక్) పూర్తి చేసిన అభ్యర్థులకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. ముఖ్యంగా బీటెక్ కంప్యూటర్ సైన్స్ సహా దాని అనుబంధ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి ఉజ్వల భవిష్యత్ ఉండబోతోంది. రాష్ట్రంలో కొత్త వర్సిటీలు, సాంకేతిక కోర్సుల్లో సీట్లు పెరుగుతుండటం.. మరోవైపు కొన్నేళ్లుగా ఎంటెక్‌లో ప్రవేశాలు తగ్గుతుండటంతో ఇప్పటికే ఎంటెక్ చేసిన వారికి బోధన రంగంలో మున్ముందు డిమాండ్ పెరగనుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగంలో మరో రెండేళ్లలో వేతనాలు రెట్టింపయ్యే అవకాశముందని అంటున్నారు. కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న కొరత రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ సీట్లు గత మూడేళ్లుగా పెరుగుతున్నాయి. అదనపు సెక్షన్లు వస్తున్నాయి. దీనికి తోడు కొత్తగా ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవల అనుమతిచ్చింది. ఇవి కూడా ఎక్కువగా మార్కెట్లో డిమాండ్ ఉండే కోర్సులకే ప్రాధాన్యమిస్తున్నాయి. ఇవన్నీ ఎంటెక్ అభ్యర్థులకు కలిసి వస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే కంప్యూటర్ సైన్స్ సీట్లు పెరిగినా అధ్యాపకుల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ వర్సిటీల్లోనే దాదాపు 3 వేలకుపైగా ఖాళీలున్నట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. చాలా కాలేజీలు ఇతర రాష్ట్రాల నుంచి ఫ్యాకల్టీని ఆహ్వానిస్తున్నా వేతనాలు ఎక్కువగా ఇవ్వాల్సి వస్తోందని భావిస్తున్నాయి. స్థానికంగా ఎంటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు రూ. 50 వేల లోపే వేతనాలు ఇవ్వడానికి ప్రైవేటు కాలేజీలు సిద్ధపడుతున్నాయి. ఇతర రాష్ట్రాల వాళ్లు రూ. లక్షకు పైగా డిమాండ్ చేస్తున్నారు. రెండేళ్లలో భారీగా అవసరం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీసీ) మార్గదర్శకాల ప్రకారం బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఇతర కంప్యూటర్ కోర్సులు బోధించేందుకు ప్రతి 20 మంది విద్యార్థులకు ఓ అధ్యాపకుడు ఉండాలి. రాష్ట్రంలో కన్వీనర్ కోటా కిందే దాదాపు 80 వేలకు పైగా బీటెక్ సీట్లున్నాయి. ఇందులో 75 శాతం కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐవోటీ, మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి కోర్సులున్నాయి. మిగతా కోర్సుల్లో (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) సీట్లు చాలా వరకు మిగులుతున్నాయి. కంప్యూటర్ సైన్స్ కోర్సులకు బోధించడానికి 3 వేల మంది సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్లు అవసరం. ప్రస్తుతం 2 వేల మందే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో 60 మందితో సెక్షన్లు నిర్వహిస్తున్నారు. 2024–25 నాటికి పెరిగే సీట్లను బట్టి కనీసం 10 వేల మంది కంప్యూటర్ సైన్స్, కొత్త కోర్సులు బోధించే వాళ్లు కావాలి. కొత్త వర్సిటీలు వస్తే ఈ సంఖ్య మరింత పెరగనుంది. కొరత ఎందుకు? సాధారణంగా విద్యార్థులు బీటెక్ కంప్యూటర్ సైన్స్, కొత్త కోర్సులు పూర్తి చేసిన తర్వాత ఉపాధి వైపే వెళ్తున్నారు. క్యాంపస్ రిక్రూట్మెంట్లో కొంతమంది ఎంపికవుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ప్రారంభంలోనే రూ. 40 వేల నెలసరి వేతనం పొందే వీలుంది. దీంతో ఎంటెక్ చేయాలని విద్యార్థులు ఆలోచించట్లేదు. మరికొంత మంది విదేశాల్లో ఎంఎస్ కోసం వెళ్తున్నారు. ఫలితంగా ఏటా ఎంసెట్‌లో సీట్లు భారీగా మిగులుతున్నాయి. ప్రైవేటు కాలేజీల్లో ఫ్యాకల్టీ ఎలా ఉందో.. గుర్తింపునిచ్చే వర్సిటీలూ పట్టించుకోవట్లేదు. నాణ్యమైన అధ్యాపకులు లేరని గుర్తించినా విధిలేక అఫిలియేషన్ ఇస్తున్నారు. దీంతో ప్రైవేటు కాలేజీలు అధ్యాపకులకు వేతనాలు అరకొరగా ఇస్తున్నాయనే ఆరోపణలున్నాయి. సాఫ్ట్‌వేర్‌తో సమానంగా వేతనం ఉంటే తప్ప బోధన వైపు మళ్లే అవకాశం కనిపించట్లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మున్ముందు కొరతను ఎలా అడ్డుకుంటారనేది ప్రశ్నార్థకమే. జీతాలు పెంచితే కొంత మార్పు రావొచ్చు ఓవైపు కంప్యూటర్ కోర్సులు పెరుగుతున్నాయి. మరోవైపు సంబంధిత విభాగాల్లో ఎంటెక్ చేసేవారి సంఖ్య తక్కువగా ఉంది. ఈ తేడాను పూడ్చాలి. బీటెక్‌తోనే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తున్నాయి. ఎంఎస్‌కు విదేశాలకు వెళ్తున్నారు. బోధించేందుకు వారు ఎందుకు ఇష్టపడట్లేదో తెలుసుకోవాలి. ఆకర్షణీయమైన వేతనాలు ఇస్తే కొంత మార్పు రావొచ్చు. – ప్రొఫెసర్ వి వెంకటరమణ (ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్) -
జర్మనీతో జట్టు కట్టేలా..!
సాక్షి, అమరావతి: సాంకేతిక విద్యారంగంలో యూరప్ దేశాల్లో.. మరీముఖ్యంగా జర్మనీలోని అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఉన్నత విద్యామండలి ద్వారా ఏర్పాట్లు చేయిస్తోంది. ఇప్పటికే జర్మన్ యూనివర్సిటీతో ఉన్నత విద్యామండలి రెండు విడతల రౌండ్‌టేబుల్ సమావేశాలను పూర్తి చేయించింది. ‘ఇండో–యూరో సింక్రనైజేషన్’లో భాగంగా జర్మన్ వర్సిటీ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్, ఏపీ ఉన్నత విద్యామండలి సంయుక్త ఆధ్వర్యంలో ‘జర్మన్–ఏపీ ఫోరమ్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్’ పేరుతో వర్చువల్‌గా సమావేశాలు నిర్వహించిన ఉన్నత విద్యామండలి అధికారులు జర్మనీ ప్రతినిధులతో వివిధ అంశాలపై వివిధ వర్సిటీల ఉప కులపతులు, నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ అధికారులు చర్చలు జరిపించింది. తద్వారా జర్మనీలో విద్య, ఉద్యోగ అవకాశాలను మన రాష్ట్ర విద్యార్థులు దక్కించుకునేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఉద్యోగాలు దక్కించుకునేలా.. ‘ప్రీ–మాస్టర్ ఇండియా’ పేరుతో మన దేశంలో జర్మనీ ప్రారంభించనున్న కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఆ దేశంలోని అవకాశాలను దక్కించుకోవడానికి వీలుపడుతుంది. ఇక్కడి విద్యార్థులు బీటెక్ ప్రోగ్రామ్‌లను పూర్తిచేశాక జర్మనీలో మాస్టర్ డిగ్రీని అభ్యసించడంతోపాటు నేరుగా అక్కడి కంపెనీల్లో పని చేసేందుకు వీలు కల్పిస్తారు. దీనిని ఆరు దశల్లో నిర్వహిస్తారు. జర్మనీ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు దక్కించుకోవాలంటే మన విద్యార్థులకు మంచి నైపుణ్యాలు, జర్మన్ సంస్కృతి, భాషపై కూడా అవగాహన అవసరం. ఆసక్తి గల విద్యార్థులకు ఆరు దశల కార్యక్రమంలో వీటిని నేర్పిస్తారు. ఇటువంటి అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం డ్యూయెల్ డిగ్రీ కార్యక్రమాలు నిర్వహించనుంది. కాగా, ఉన్నత విద్యామండలి అనుమతితో క్రెడిట్ ఆధారిత కోర్సుల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ (ఏపీఐటీఏ) చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా విద్యార్థులకు మల్టీ స్కిల్లింగ్ మెథడాలజీలో వివిధ నైపుణ్యాలను అలవర్చనున్నారు. కోర్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ ద్వారా విద్యార్థులు అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకొనేలా తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని వివిధ వర్సిటీల్లో ఆన్లైన్ కోర్సులను జర్మనీ వర్సిటీ అమలు చేయనుంది. అంతర్జాతీయంగా ఉద్యోగాల వెల్లువ ఆధునిక సాంకేతిక అంశాల్లో రానున్న కాలంలో 1.1 బిలియన్ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్న నేపథ్యంలో ఆయా అంశాల్లో విద్యార్థులను తీర్చిదిద్దేలా ప్రణాళికలను అమలు చేయనున్నారు. కాలేజీల్లో పాఠ్యాంశాల్లోని నైపుణ్యాలను క్షేత్రస్థాయిలో వాస్తవికంగా విద్యార్థులు అలవర్చుకునేలా ప్రభుత్వం జిల్లాల వారీగా 47 వేలకు పైగా సూక్ష్మ, మధ్య, భారీ పరిశ్రమలు, వాణిజ్య సంస్థలతో కాలేజీలను అనుసంధానించే కార్యక్రమం చేపట్టింది. ఆయా సంస్థల్లో ఇంటర్న్‌షిప్ అమలు చేయిస్తోంది. ఉపాధి ఆధారిత శిక్షణ కార్యక్రమాలు చేపట్టింది. బ్లెండెడ్ స్కిల్లింగ్ కోర్సులకు శ్రీకారం చుట్టింది. 55వేల మందికి శిక్షణ మరోవైపు ఆధునిక సాంకేతిక అంశాల్లో విద్యార్థులకు క్షేత్రస్థాయి పారిశ్రామిక అనుసంధానం ద్వారా నైపుణ్య శిక్షణ ఇప్పించడానికి ఏపీఐటీఏ ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలకు చెందిన దాదాపు 55 వేల మంది విద్యార్థులు ఏపీఐటీఏలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరికి వివిధ పారిశ్రామిక, ఐటీ సంస్థల ద్వారా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను అమలు చేయనున్నారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు జర్మనీ ప్రతినిధుల రౌండ్‌టేబుల్ సమావేశాల్లో చర్చకు వచ్చిన ముఖ్యమైన అంశాల్లో అంతర్జాతీయంగా నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠ్యాంశాల్లో చేపట్టాల్సిన మార్పులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇప్పటికే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు, ప్రణాళికలు ఉండేలా చర్యలు తీసుకుంది. అంతేకాకుండా సంక్లిష్ట సమస్యల పరిష్కారంలో విద్యార్థులకు వాస్తవిక ప్రయోగాలకు అనువుగా పరిశ్రమ ఆధారిత ప్రాజెక్టులకు రూపకల్పన చేయించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్, రోబోటిక్స్, ఆటోమేషన్ తదితర ఆధునిక సాంకేతిక అంశాల్లో విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీ ఎస్డీసీ) ద్వారా పెద్దఎత్తున శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయించింది. ఇవి నిరంతరం కొనసాగేలా ప్రతి డివిజన్లో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలతోపాటు ప్రత్యేకంగా స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పుతోంది. 2,400 మందికి స్కిల్ డెవలప్మెంటు కార్పొరేషన్ ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేయించింది. విద్యార్థులకు ఫలితాల ఆధారిత అభ్యాసం (అవుట్‌కమ్ బేస్డ్ లెర్నింగ్) ద్వారా బీటెక్ రెండో ఏడాది నుంచే ప్రభుత్వం క్రెడిట్లతో కూడిన నైపుణ్య కోర్సులను కూడా ఏర్పాటు చేయించింది. ఇందులో భాగంగా ఇంజనీరింగ్‌తో పాటు ఇతర కోర్సుల్లోనూ ప్రభుత్వం ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేయించింది. -
పాలిసెట్‌లో 37,978 సీట్లు భర్తీ
సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పాలిసెట్–2021 తొలివిడత అడ్మిషన్లలో 37,978 మందికి సీట్లు కేటాయించినట్లు సెట్ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ పోలా భాస్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం పాలిసెట్ సీట్ల కేటాయింపు వివరాలను విడుదల చేశారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 18లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. అదే రోజు నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి 312 మంది అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి.. మెరిట్ జాబితాను శాప్‌కు పంపాల్సి ఉందన్నారు. అందువల్ల వారికి సీట్లు కేటాయించలేదని తెలిపారు. 259 కాలేజీలు.. 69,810 సీట్లు పాలిసెట్‌లో 64,188 మంది అర్హత సాధించగా 42,910 మంది కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. వీరిలో 41,978 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. 41,036 మంది వెబ్ ఆప్షన్లను నమోదు చేశారు. రాష్ట్రంలో 259 కాలేజీలు ఉండగా వాటిలో 69,810 సీట్లు ఉన్నాయి. తొలి విడతలో 37,978 సీట్లు భర్తీ కాగా 31,832 సీట్లు మిగిలాయి. అత్యధికంగా ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయి. సీట్ల భర్తీ ఇలా.. -
వచ్చే పదేళ్లు ‘ఇండియాస్ టెకేడ్’: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: మారుతున్న పరిస్థితుల్లో ఏర్పడే కొత్త సవాళ్లను అధిగమించేలా ఉన్నత, సాంకేతిక విద్యలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. వచ్చే దశాబ్ద కాలంలో సాంకేతిక రంగంలో పరిశోధన, అభివృద్ధికే పెద్ద పీట వేయాలన్నారు. అందుకే రానున్న పదేళ్ల కాలాన్ని ‘ఇండియాస్ టెకేడ్’ అని పిలుచుకోవచ్చునని మోదీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో పనిచేసే వందకుపైగా ఐఐటీల డైరెక్టర్లలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ మాట్లాడారు. విద్యారంగంలో పెట్టే ప్రతీ పైసా సామాజిక పెట్టుబడి అని అన్న ప్రధాని స్తోమత, సమానత్వం, నాణ్యత, అనుసంధానం అన్నవే ఉన్నత విద్యను ముందుకు నడిపిస్తాయన్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, రక్షణ, సైబర్ టెక్నాలజీ రంగాల్లో భవిష్యత్‌లో ఎదురయ్యే సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేలా దృష్టి సారించాలని ప్రధాని పిలుపునిచ్చారు. కోవిడ్ విసిరిన సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ టెక్నాలజీ సంస్థలు చేసిన పరిశోధన, అభివృద్ధిని ప్రధాని కొనియాడారు. యువ టెక్కీలు అత్యంత వేగంగా సాంకేతికంగా పరిష్కార మార్గాలు సూచించడంతో ఈ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు. కృత్రిమ మేధ, స్మార్ట్ వేరబుల్స్, డిజిటల్ అసిస్టెంట్లు సామాన్య మానవుడికి చేరాలా ఉన్నత విద్యలో సాంకేతికను ప్రవేశపెట్టాలన్నారు. కృత్రిమ మేధతో కూడిన విద్యపైనే ప్రధానంగా దృష్టి సారించాలని అన్నారు. సమావేశానంతరం ప్రధాని వాటి వివరాలను ట్వీట్ చేశారు. ముప్పు తొలగిపోలేదు: ప్రధాని మోదీ కరోనా ముప్పు తొలగిపోలేదని ప్రధాని అన్నారు. కరోనా నిబంధనలు పాటించకుండా ప్రజలు గుంపులుగా తిరుగుతుండడంపై ఆందోళన వెలిబుచ్చారు. వ్యాక్సినేషన్‌తో పాటు కరోనాపై పోరు సాగుతోందని, ఈ సమయంలో చిన్న పొరపాటుకు పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. మంత్రివర్గ సహచరులతో సమావేశం సందర్భంగా ప్రజలు గుంపులుగా ఉన్న ఫొటోలు, వీడియోలను ఆయన ప్రస్తావించారు. చాలామంది మాస్క్‌ల్లేకుండా, భౌతిక దూరం పాటించకుండా కనిపిస్తున్నారని ఆ సమావేశంలో వ్యాఖ్యానించారు. సమయానికి కార్యాలయాలకు రావాలని, ప్రజలకు సేవ చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని మంత్రులకు ప్రధాని ఉద్బోధించారు. గతంలో ఆయా శాఖలు నిర్వహించిన మంత్రులను కలుసుకుని వారి అనుభవాలను తెలుసుకోవాలన్నారు. పనే ముఖ్యమని, మీడియా దృష్టిని ఆకర్షించాలనే విషవలయంలో పడవద్దని, అనవసర ప్రకటనలు చేయవద్దని మంత్రులకు సూచించారు. -
ప్రభుత్వ డిగ్రీ సీట్లూ వెలవెల!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ కాలేజీలతోపాటు వివిధ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనూ ఈసారి భారీగా సీట్లు మిగిలిపోయాయి. ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించిన ప్రవేశాల కౌన్సెలింగ్ తరువాత 114 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 24,178 సీట్లను విద్యార్థులెవరూ తీసుకోలేదు. అలాగే ప్రభుత్వ అటానమస్ కాలేజీల్లో 1,268 సీట్లు, ప్రముఖ ఎయిడెడ్, ఎయిడెడ్ అటానమస్ కాలేజీల్లోనూ 5,655 సీట్లు మిగిలిపోయాయి. మరోవైపు యూనివర్సిటీ, యూనివర్సిటీ అటానమస్ కాలేజీల్లోనూ 396 సీట్లు మిగిలిపోగా ప్రైవేటు, ప్రైవేటు అటానమస్ కాలేజీల్లో ఏకంగా 1,61,469 సీట్లు మిగిలిపోయాయి. ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులు, విద్యార్థులు ఆన్లైన్లో ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) సీట్లను కేటాయించింది. అయితే అనేక మంది విద్యార్థులు తమకు వచ్చిన మార్కుల ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోకపోవడంతో వారికి సీట్లు లభించలేదు. పలు దశల్లో నిర్వహించిన కౌన్సెలింగ్‌లోనూ అదే జరిగింది. దీంతో ప్రైవేటు కాలేజీలే కాదు ప్రభుత్వ కాలేజీల్లోనూ సీట్లు మిగిలిపోయాయి. స్పందించని ప్రభుత్వం.. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో వేల సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నా కళాశాల విద్యా శాఖ స్పందించడం లేదు. ప్రైవేటు కాలేజీల్లో కౌన్సెలింగ్ తరువాత మిగిలిపోయే సీట్లలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించేందుకు అనుమతి ఇస్తున్న ప్రభుత్వం... ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో మిగిలిపోయే సీట్ల భర్తీకి అనుమతించడం లేదు. దీంతో పేద విద్యార్థులు తాము కోరుకున్న డిగ్రీ కాలేజీల్లో, కోర్సుల్లో సీట్లు లభించక ఇష్టం లేకపోయినా ఏదో ఒక డిగ్రీ కాలేజీలో చేరాల్సిన పరిస్థితి వస్తోంది. సీట్లు ఖాళీగా ఉంటున్నా వాటిని విద్యార్థులకు ఇవ్వలేని దుస్థితి నెలకొంటోంది. వృత్తి, సాంకేతిక విద్యలో ఎక్కువ పోటీ... రాష్ట్రంలో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. మేనేజ్మెంట్ కోటా సీట్లను లక్షల రూపాయలు వెచ్చించి కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే సాంకేతిక విద్యా కోర్సుల్లోనూ ప్రైవేటు కాలేజీల్లో మిగిలిపోయిన సీట్లను యాజమాన్యాలు స్పాట్ అడ్మిషన్ల కింద భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తోంది తప్ప ప్రభుత్వ, యూనివర్సిటీ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి అనుమతించడం లేదు. దీంతో 14 యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏటా వందల సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నాయి. ఈ విద్యా సంవత్సరం ప్రవేశాల్లోనూ ఎంతో డిమాండ్ కలిగిన 300 వరకు సీట్లు మిగిలిపోయాయి. విమర్శలొస్తాయనే ‘స్పాట్’ నిర్వహించట్లేదు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలతోపాటు వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లోనూ మెరిట్ ప్రాతిపదికన సీట్లను భర్తీ చేస్తున్నందున స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తే మెరిట్ లేని వారు వచ్చే అవకాశం ఉంది. అది విద్యార్థుల మధ్య సమస్యగా మారొచ్చు. అందుకే ప్రభుత్వ కాలేజీల్లో స్పాట్‌కు అనుమతించడం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. – దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి చదవండి: (పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం మండలానికో స్టడీ సెంటర్!) -
డిసెంబర్ 1 నుంచి ఇంజనీరింగ్ ఫ్రెషర్లకు కొత్త విద్యా సంవత్సరం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలలు, సాంకేతిక విద్యా సంస్థల్లో చేరే కొత్తగా చేరే విద్యార్థులకు విద్యా సంవత్సరం ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కోవిడ్ నేపథ్యంలో ప్రవేశాల డెడ్‌లైన్‌ను పొడిగించినట్లు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఇంజనీరింగ్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల తుది గడువును నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించామని ఏఐసీటీఈ కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. కోవిడ్ మార్గదర్శకాలను అమలు చేస్తూ ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా తరగతులను ప్రారంభించవచ్చని సూచిం చారు. కరోనా విజృంభణ కారణంగా మార్చి 16 నుంచి యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూళ్లు మూతపడిన సంగతి తెలిసిందే. వర్సిటీలు, కాలేజీల్లో ఫ్రెషర్లకు నూతన విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేందుకు యూజీసీ ఇటీవల అనుమతినిచ్చింది. తరగతులు ఆలస్యంగా ప్రారంభం అవుతున్న కారణంగా 2021లో వేసవి సెలవులను భారీగా కుదిస్తామని యూజీసీ పేర్కొంది. -
‘నిట్’ ప్రవేశాలకు 75% మార్కులు అక్కర్లేదు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్), ఇతర కేంద్ర టెక్నికల్ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన అర్హత నిబంధనల్లో కొంత వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆయా విద్యా సంస్థల్లో ప్రవేశం పొందేందుకు కనీస అర్హతగా ఉన్న 12వ తరగతి బోర్డు పరీక్షలో కనీసం 75% మార్కులు పొంది ఉండాలన్న ప్రధాన నిబంధనను తొలగించింది. కరోనా మహమ్మారి కారణంగా పలు బోర్డులు పరీక్షలను పాక్షికంగా రద్దు చేసిన నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. ‘జేఈఈ మెయిన్స్ 2020లో అర్హత సాధించిన విద్యార్థులు క్లాస్ 12 బోర్డు పరీక్షలో ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది’ అని హెచ్చార్డీ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ ట్వీట్ చేశారు. ఈ మేరకు సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నిట్ తదితర ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశం పొందేందుకు ఇప్పటివరకు విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణులు కావడంతో పాటు, 12వ తరగతి బోర్డ్ పరీక్షలో కనీసం 75% మార్కులు కానీ, అర్హత పరీక్షలో టాప్ 20 పర్సంటైల్ ర్యాంక్ కానీ సాధించాల్సి ఉండేది. ఇప్పటివరకు రెండు సార్లు వాయిదా పడిన ఈ సంవత్సరం జేఈఈ మెయిన్స్ పరీక్షను సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. -
ఐఐటీ అకాడమీల్లో నాణ్యమైన విద్య
సాక్షి, అమరావతి: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఐఐటీ అకాడమీల్లోని విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్యనందిస్తోంది. ఐఐటీ, నీట్ వంటి వృత్తి విద్యపై మక్కువతో అకాడమీ కాలేజీల్లో చేరిన విద్యార్థులకు ప్రయివేట్ కాలేజీల్లో ఇస్తున్న కోచింగ్ కంటే ఉన్నతమైన ప్రమాణాలతో శిక్షణనిస్తోంది. కరోనా నేపథ్యంలో ఇళ్లలోనే ఉన్న విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా రోజూ గురుకుల అధ్యాపకులు పాఠాలు చెబుతున్నారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు కొనివ్వడంతో విద్యార్థులందరూ ఆన్లైన్ తరగతులను అనుసరిస్తున్నారు. నిత్యం అధ్యాపకులతో మాట్లాడుతూ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. విద్యార్థులకు కావాల్సిన మెటీరియల్‌ను అధ్యాపకులు ఆన్లైన్లోనే పంపుతున్నారు. దూరదర్శన్, రేడియోతో పాటు పలు యాప్‌ల ద్వారా గురుకుల సొసైటీ కోచింగ్ ఇస్తోంది. 3 అకాడమీలు.. 1300 మంది విద్యార్థులు ► ప్రస్తుతం 3 చోట్ల ఐఐటీ అకాడమీలున్నాయి. కృష్ణా జిల్లా ఈడుపుగల్లులోని ఐఐటీ అకాడమీలో 580 మంది, కర్నూలు జిల్లా చిన్న టేకూరు ఐఐటీలో 480, గుంటూరు జిల్లా గోరంట్ల గురుకుల ఐఐటీలో 250 మంది విద్యార్థులు ఇంటర్ చదువుతూ ఐఐటీ, నీట్ కోచింగ్ తీసుకుంటున్నారు. ► స్కూలు భవనాల సామర్థ్యాన్ని బట్టి ప్రభుత్వం సీట్లు కేటాయిస్తోంది. కనీస సౌకర్యాల్లేకుండా ఎక్కువ మందిని చేర్చుకుంటే ఇబ్బందులుంటాయని మొదట్నుంచీ భావిస్తున్న గురుకుల సొసైటీ.. అవసరం మేరకే విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది. ► ఈ అకాడమీలను నిర్వహిస్తున్న కాలేజీలకు మెరికల్లాంటి విద్యార్థులను గురుకుల సొసైటీ ఎంపిక చేసుకుంటోంది. ఏటా ప్రత్యేక పరీక్ష నిర్వహించి అత్యంత ప్రతిభావంతులను తీసుకుంటోంది. మరో 5 అకాడమీల ఏర్పాటుకు ప్రతిపాదనలు గురుకుల విద్యాలయాల సంస్థ ద్వారా కొత్తగా మరో ఐదు ఐఐటీ అకాడమీల ఏర్పాటుకు గురుకుల సొసైటీ ప్రతిపాదనలు రూపొందించింది. విశాఖలో బాలురకు ఒకటి, బాలికలకు ఒకటి, రాజమహేంద్రవరంలో బాలురకు, నెల్లూరు, తిరుపతిలో బాలికలకు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఐదు ఐఐటీల ద్వారా సుమారు 3,000 మందికి ఐఐటీ, నీట్‌లలో కోచింగ్ ఇవ్వాలని గురుకుల సొసైటీ నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త ఐఐటీ అకాడమీలకు అనుమతొస్తే మరింత మందికి చాన్స్ ఇటీవల జరిగిన సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పాలక మండలి సమావేశంలో కొత్తగా ఐదు ఐఐటీ అకాడమీల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. అనుమతులు వస్తే మరింత మంది విద్యార్థులు సాంకేతిక విద్యను అభ్యసించేందుకు అవకాశం కలుగుతుంది. – కల్నల్ వి.రాములు, గురుకుల కార్యదర్శి -
కొత్త కళాశాలలకు మరో రెండేళ్లపాటు నో
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా ఇంజనీరింగ్ 40 శాతానికి పైగా సీట్లు భర్తీ కావడం లేదని, అందుకే వచ్చే రెండేళ్లు కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రైవేటు రంగంలో అనుమతి ఇచ్చేది లేదని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి స్పష్టం చేసింది. 2020–21 విద్యా సంవత్సరంతోపాటు 2021–22, 2022–23 విద్యా సంవత్సరం వరకు కొత్త కాలేజీల లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోఐ) కూడా ఇవ్వబోమని తెలిపింది. గతంలో ఎల్వోఐ ఇచ్చిన వారికి మాత్రం లెటర్ ఆఫ్ అప్రూవల్ (ఎల్వోఏ) ఇస్తామంది. మరోవైపు ప్రభుత్వ రంగంలో కొత్త కళాశాలల ఏర్పాటుకు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ప్రభుత్వంతోపాటు ప్రైవేటు రంగంలో నూ కొత్త కాలేజీల ఏర్పాటుకు ఎల్వోఐ ఇస్తామని, మిగతా వాటికి ఇవ్వబోమని తేల్చేసింది. 2020–21 విద్యా సంవత్సరం కోసం జారీ చేసిన సాంకేతిక విద్యా సంస్థల అప్రూవల్ హ్యాండ్‌బుక్‌లో మార్పులు చేర్పులపై ఇటీవల ఢిల్లీ, చెన్నైలో జరిగిన కన్సల్టేషన్ సమావేశాల్లో ఈ నిర్ణయాలు తీసుకుంది. కొత్త ఫార్మసీ కాలేజీలకు కూడా వచ్చే రెండేళ్లు అనుమతి ఇవ్వమని చెప్పిం ది. 2019–20 విద్యా ఏడాదిలో దేశంలోని విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ సీట్లు 27 లక్షలు ఉంటే అందులో 14 సీట్లు మిగిలిపోయాయని, 13 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని పేర్కొంది. రాష్ట్రంలోనూ 217 కాలేజీల్లో 1,12,090 సీట్లకు ఏఐసీటీఈ ఆమోదం తెలుపగా, రాష్ట్రంలోని వర్సిటీలు 187 కాలేజీల్లో 93,790 సీట్ల భర్తీకి అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. అందులో 62,744 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే 55.97% సీట్లు భర్తీకాగా 44.03% సీట్లు ఖాళీగానే ఉండిపోయాయి. ఫార్మసీలోనూ ఇలాంటి పరిస్థి తే నెలకొంది. మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే స్థితి ఉండటంతో ఇంజనీరింగ్, ఫార్మసీలో వచ్చే రెండేళ్లపాటు కొత్తగా ప్రైవేటు కాలేజీలకు అనుమతించబోమని స్పష్టం చేసింది. డిమాండ్ ఉండే కోర్సులకు ఓకే... మార్కెట్లో డిమాండ్ ఉన్న కొత్త కోర్సులను మాత్రం ప్రస్తుతం ఉన్న కాలేజీల్లో ప్రారంభించేందుకు అనుమతి ఇస్తామని (అదనపు ఇంటేక్) వెల్లడించింది. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించే, మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్, మిషన్ లెర్నింగ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, త్రీడీ ప్రింటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులను ప్రారంభించేందుకు అదనపు ఇంటేక్‌ను మంజూరు చేస్తామని చెప్పింది. -
డిజిటల్ దోపిడీ
రూ.2.75 లక్షల విలువ చేసే యూనిట్లకు రూ.4.5 లక్షల బిల్లు.. రూ.3–3.5 లక్షల విలువ చేసే యూనిట్లకు రూ.6 లక్షలకు పైగా బిల్లు.. వర్చ్యువల్ క్లాస్ రూమ్, అడ్వాన్స్డ్ డిజిటల్ క్లాస్ రూమ్ పేరుతో గత ప్రభుత్వ మాయాజాలం.. జిల్లాలో 257 పాఠశాలల్లో వర్చ్యువల్ క్లాస్ రూమ్ ఎక్విప్మెంట్ యూనిట్ల సరఫరా.. ఫైబర్ నెట్ కనెక్షన్ లేక 131 పాఠశాలల్లో మాత్రమే ఇన్స్టాలైన ఎక్విప్మెంట్.. వాటిలో 92 పాఠశాలల్లోనే వర్కింగ్.. ఎక్విప్మెంట్ మొరాయింపుతో 39 పాఠశాలల్లో పనిచేయని పరిస్థితి.. అడ్వాన్స్డ్ డిజిటల్ క్లాస్ రూమ్ కింద 154 పాఠశాలలకు ఎక్విప్మెంట్ సరఫరా.. జూలైలో హడావుడిగా పాఠశాలలకు చేరవేత.. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వ ఒప్పందం.. స్టేట్ ప్రాజెక్టు ఆఫీసర్ వద్దని చెప్పినా పంపిణీ చేసిన ప్రైవేటు ఏజెన్సీ.. కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని కాజేసేందుకు ఎన్నికల ముందు.. తర్వాత కొను‘గోల్మాల్’ ఎలా సాగిందో చూశారా! ముడుపులు, కమిషన్లకు కక్కుర్తిపడి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే కార్యక్రమాలు చేపట్టారు. కార్యరూపంలోకి వచ్చేసరికి వాటి డొల్లతనంతోపాటు అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సంస్కరణల పేరుతో గత ప్రభుత్వం చేపట్టిన చర్యల వెనక అవినీతి దాగుందని స్పష్టమవుతున్నది. శాశ్వత ప్రయోజనాలిచ్చే మౌలిక సదుపాయాల వైపు దృష్టి పెట్టకుండా సాంకేతిక బోధనాభివృద్ధి పేరుతో కాంట్రాక్టర్ల జేబులు నింపే కార్యక్రమం చేపట్టారు. వర్చ్యువల్ తరగతుల బోధన, డిజిటల్ తరగతుల బోధన పేరుతో ప్రభుత్వ నిధులను పెద్ద ఎత్తున స్వాహా చేశారు. ఒక్క జిల్లాలోనే రూ.10 కోట్ల మేర కుంభకోణం చోటు చేసుకుంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వర్చ్యువల్ తరగతి బోధన పేరుతో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసింది. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వర్చ్యువల్ క్లాస్ రూమ్ స్టూడియో నుంచి ఉపాధ్యాయుడు అందించే బోధనను ప్రత్యక్ష ప్రసారం చేసేందు కు పాఠశాలలకు ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేసింది. వర్చ్యువల్ క్లాస్ రూమ్ బోధన కార్యక్రమాన్ని 2018 ఏప్రిల్‌లో తొలి విడతగా 70 పాఠశాలల్లో, 2018 ఆగస్టులో రెండో విడతగా 99 పాఠశాలల్లో, 2019 ఫిబ్రవరిలో మూడో విడతగా 88 పాఠశాలల్లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి ఒక్కొక్క పాఠశాలకు రూ.4.5 లక్షల విలువైన ఎక్విప్మెం ట్ యూనిట్‌ను సరఫరా చేశారు. ఒక్కొక్క యూ నిట్‌లో ఒక పోడియం, ఒక యూపీఎస్, ఆరు యూపీఎస్ ఎక్స్టర్నల్ బ్యాటరీలు, ఒక ల్యాప్ టాప్, ఒక ప్రొజెక్టర్, ఒక టాబ్లెట్ (కార్బన్), ఒక వెబ్ కెమెరా, ఒక ఇంట్రాక్టివ్ పెన్, 40 క్లిక్కర్స్, ఒక క్లిక్కర్ రిసీవర్, ఒక 4.1 ఆడియో సిస్టమ్, ఒక ఏసీ (ఇన్వెర్టర్) ఉంటాయి. ఇవన్నీ పాఠశాలలో అమర్చి, ఇన్స్టాల్ చేస్తేనే జిల్లా కేంద్రంలో ఉన్న వరŠుచ్యవల్ కాస్ రూమ్ స్టూడియో నుంచి ఉపాధ్యాయుల బోధనలు ప్రత్యక్ష ప్రసారమవుతాయి. ఈ ఎక్విప్మెంట్ యూనిట్ సరఫరా, నిర్వహణ ఒక ప్రైవేటు ఏజెన్సీకి గత ప్రభుత్వం అప్పగించింది. ఆ ఏజెన్సీ ప్రతినిధికి గత ప్ర భుత్వ పెద్దలతో సత్సంబంధాలున్నాయి. ఫైబర్ నెట్ లేకుండానే... నాసిరకం ఎక్విప్మెంట్తో... పరికరాలన్నీ అమర్చి, ఇన్స్టాల్ కావాలంటే ఆ పాఠశాలలకు ఫైబర్ నెట్ కనెక్షన్ ఉండాలి. కళ్లెం ఇచ్చి గుర్రం ఇవ్వనట్టుగా ఫైబర్ నెట్ కనెక్షన్ ఇవ్వకుండా ఎక్విప్మెంట్ సరఫరా చేసిన ఘనత గత ప్రభుత్వానికి దక్కింది. తొలి విడత 70 పాఠశాలల్లో 51 పాఠశాలలకు ఫెబర్ నెట్ కనెక్షన్‌లుండటంతో ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేశారు. మిగతా 19 పాఠశాలల్లో గత ఏడాది కాలంగా ఎక్విప్మెంట్ నిరుపయోగంగా ఉంది. ఇన్స్టాల్ చేసిన వా టిలో 19 పాఠశాలల్లో కొన్ని రోజుల్లోనే ఎక్విప్మెంట్ మొరాయించింది. అలాగే, రెండో విడత 99 పాఠశాలల్లో కేవలం 36 పాఠశాలలకు ఫైబర్ నెట్ కనెక్షన్ ఉండటంతో ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేశారు. మిగతా 63 పాఠశాలల్లో సంబంధిత ఎక్విప్మెంట్ నిరుపయోగంగానే ఉంది. ఇన్స్టాల్ చేసినవాటిలోని ఏడు పాఠశాలల్లో కొన్ని రోజులకే ఎక్విప్ మెంట్ పనిచేయడం మానేసింది. మూడో విడతలో 88 పాఠశాలలకు ఎక్విప్మెంట్ యూనిట్లను సరఫరా చేయగా, వాటిలో 44 పాఠశాలలకు మాత్రమే ఫైబర్ నెట్ కనెక్షన్ ఉండటంతో ఇన్స్టాల్ చేశారు. ఇందులో 13 పాఠశాలల్లో కొన్ని రోజులకే పనిచేయడం మానేశాయి. ఇలా మొత్తం 257 పాఠశాలల్లో 131 పాఠశాలలు మాత్రమే ఇన్స్టాల్కు నోచుకోగా, వాటిలో 92 మాత్రమే యాక్టివ్‌గా ఉ న్నాయి. 39 పాఠశాలల్లో పనిచేయడం లేదు. ఇక, 126 పాఠశాలలకు ఎక్విప్మెంట్ వచ్చి నా ఫైబర్ నెట్ కనెక్షన్ లేక ఇన్స్టాల్ కాలేదు. దీంతో అక్కడికొచ్చిన ఎక్విప్మెంట్ నిరుపయోగంగా ఉండిపోయింది. ఇందులో చెప్పాల్సిన విషయమేంటంటే పాఠశాలలకు వచ్చి న ఎక్విప్మెంట్ ఆశించిన క్వాలిటీలో లేవని తెలుస్తున్నది. దీనికి తోడు ఎక్విప్మెంట్ యూనిట్ విలువ రూ.4.5 లక్షల మేర చూపించినట్టు తెలిసింది. కానీ వాస్తవంగా దాని విలువ బహిరంగ మార్కెట్లో రూ.2.75 లక్షల మేర ఉంది. దాదాపు లక్షా 50 వేల వరకు తేడా ఉన్నట్టుగా తెలుస్తున్నది. సాధారణంగా బల్క్‌లో తీసుకుంటే తగ్గాలి. కానీ ఇక్కడ ఎక్కువగా ఉంది. దీని వెనక పెద్ద గోల్మాల్ నడిచింది. ముడుపుల బాగోతం నడవడంతో కాంట్రాక్టర్ చెప్పిందే వేదం అన్నట్టుగా సాగిపోయింది. ఇదొక్క జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా సాగింది. ఇదొక పెద్ద కుంభకోణం. ఇదీ వర్చ్యువల్ క్లాస్ రూమ్ బాగోతం. అడ్వాన్స్డ్ డిజిటల్ మాయ... అడ్వాన్స్డ్ డిజిటల్ క్లాస్ రూమ్ పేరుతో కూడా మరో కథ నడిచింది. ప్రాథమిక పాఠశాలలో అధునాతన డిజిటల్ క్లాస్రూమ్ బోధనా కార్యక్రమాన్ని అమలు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఇదంతా ఎన్నికలకు ముందు చేసిన ఆలోచన. అదే సందర్భంగా యుద్ధప్రాతిపదికన ఒక ఏజెన్సీతో ఒప్పందం చేసుకుం ది. ఎన్నికలకు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం అడ్వాన్స్డ్ డిజిటల్ క్లాస్ రూమ్ పేరుతో 154 ప్రాథమిక పాఠశాలలకు ఎక్విప్మెంట్ యూనిట్లను సరఫరా చేశారు. 65 ఇంచెస్ ఇంట్రాక్టివ్ ప్లాట్ పేనల్, ఐఎఫ్‌పీ మౌంటెడ్ బ్రాకెట్, 1కేవీఎ ఆన్లైన్ యూపీఎస్, వైర్లెస్ కీ బోర్డు, మౌస్ వంటి పరికరాలతో కూడిన ఎక్విప్మెంట్ యూనిట్‌ను కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సరఫరా చేశారు. గత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఏజెన్సీ జూలై 7వ తేదీ తర్వాత హడావుడిగా యూనిట్ల ను పాఠశాలలకు చేరవేసింది. ఒక్కొక్క యూని ట్ విలువ రూ.6 లక్షల మేర చూపించినట్టుగా ప్రస్తుత ప్రభుత్వ అధికారులు గుర్తించారు. వాస్తవానికైతే మార్కెట్ ప్రకారం దాని విలువ రూ.3 లక్షల నుంచి 3.5 లక్షల మేర ఉంటుంద ని అంచనా. దాదాపు 2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు అదనంగా లాగేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తించారేమో పాఠశాలలకు యూనిట్లు సరఫరా చేయవద్దని, తక్షణం నిలిపివేయాలని సర్వశిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ సంబంధిత సరఫరా ఏజెన్సీని జూలై 3వ తేదీన ఆదేశించారు. కానీ సద రు ఏజెన్సీ పట్టించుకోకుండా యుద్ధప్రాతిపది కన పాఠశాలలకు ఎక్విప్మెంట్ యూనిట్లను సరఫరా చేసేసింది. ఈ విషయం తెలుసుకున్న స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ తక్షణమే సర్వశిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్‌కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. వచ్చిన యూనిట్లను తీసుకోవద్దని, అప్పటికే వచ్చేస్తే వాటిని తెరవొద్దని, ఇన్స్టాల్ చేయవద్దని ఆదేశించారు. దీంతో ప్రాజెక్టు ఆఫీసర్ సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తగు ఆదేశాలు ఇచ్చారు. ఫలితంగా సంబంధిత యూనిట్లు ఎక్కడికక్కడ అక్కరకు రాకుండా ఉన్నాయి. వీటిలో కూడా నాసిరకం పరికరాలు ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఎక్విప్మెంట్ యూనిట్లను తెరవద్దని ఆదేశాలిచ్చాం.. అడ్వాన్స్డ్ డిజిటల్ క్లాస్ రూమ్ పేరుతో 154 పాఠశాలలకు సరఫరా చేసిన ఎక్విప్ మెంట్ యూనిట్లను తెరవద్దని సంబంధిత పాఠశాలల ప్ర«ధానోపాధ్యాయులకు ఆదేశాలిచ్చాం. స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేర కు తక్షణ ఆదేశాలిచ్చాను. ఎక్కడైనా తెరిచినట్టయితే సంబంధిత ప్రధానోపాధ్యాయులే బాధ్యత వహించాలి. – బి.శ్రీనివాసరావు, పీఓ, సర్వశిక్షా అభియాన్ -
నూతన ఆవిష్కరణ కేంద్రాలుగా తరగతి గదులు...!
సాంకేతిక రంగంలో నేడు వస్తోన్న విప్లవాత్మకమైన మార్పులు ప్రపంచం రూపు రేఖల్ని మార్చేస్తున్నాయి. 21వ శతాబ్దంలో మనిషి మేధస్సుతోపాటే అభివృద్ధి చెందిన నూతన సాంకేతిక విప్లవంలో మరమనిషి ఆవిష్కరణ ఓ మహాద్భుతం. మనిషి మేధో వికాసాన్నుంచి ఉద్భవించిన ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏకారణం చేతైనా మనిషే అందిపుచ్చుకోలేని పరిస్థితి వస్తే వాళ్ళు తరాలపాటు వెనకబడిపోవాల్సిందే. అందుకే ప్రతి ఒక్కరూ టెక్నా లజీతో అనుసంధానం కాక తప్పని పరిస్థితులు కల్పిం చింది. అభివృద్ధి చెందిన దేశాల్లో, మానవ వనరుల కొరత ఉన్న దేశాల్లో ఇప్పటికే చాట్ బోట్స్ పేరిట రోబోల వినియోగం పెరిగిపోయింది. ఇది ఒక్క కమ్యూనికేషన్ రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. విద్య, వైద్యం, జర్నలిజం, హోటల్ మేనేజ్ మెంట్ ఇలా ప్రతి రంగంలోనూ మరమనిషి ప్రమే యం పెరుగుతోంది. ఈ సవాల్‌ను దీటుగా ఎదు ర్కొని మనిషి మనగలగాలంటే నిరంతర జ్ఞాన సము పార్జన, దాని ఆచరణ తప్పనిసరి. ఈ ప్రక్రియ బాల్య దశ నుంచే మొదలు కావాలి. పాఠశాల స్థాయి నుంచే ఆ ప్రయత్నం ప్రారంభించాలి. బడి చదువే అందుకు వేదిక కావాలి. సాంకేతిక విజ్ఞాన బోధనకు తొలి అడుగు పాఠశాలలోనే మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పక తప్పదు. 21వ శతాబ్దంలో సామాజిక, ఆర్థిక, సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులు మిగతా రంగాలతో పాటు విద్యారంగాన్నీ తీవ్రంగా కుదిపేస్తున్నాయి. పోస్ట్‌కార్డులు అంతరించి వాట్సాప్, టెలిగ్రామ్‌ల రాకతో సమాచార బట్వాడా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్టుగా విద్యారంగం లోనూ నేడు అలాంటి మార్పులే రావాల్సిన తప్పని సరి పరిస్థితి. అభివృద్ధి చెందిన దేశాలు కాలానుగు ణంగా తమ విద్యాబోధనా ప్రమాణాలను ఎప్పటిక ప్పుడు విశ్లేషించుకుంటూ ముందుకెళుతున్నాయి. గతంలో విద్యారంగానికి ఉపా«ధ్యాయుడే కేంద్ర బిందువు. కానీ నేడు విద్యార్థి కేంద్రంగా విద్యాబో ధన జరుగుతోంది. పుస్తకంలో ఉన్న జ్ఞానాన్ని విద్యార్థి మెదడులోకి ఎక్కించడమే నాడు ప్రధాన లక్ష్యం. ఎంత సమర్థంగా విద్యార్థి ఆ సమాచారాన్ని గుర్తుపెట్టుకుంటే అంత గొప్పగా భావించేవారు. అదే ఓ గొప్ప విద్యగా పరిగణించేవారు ఆనాడు. కానీ నేటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇన్ఫర్మేష న్కన్నా ఇన్నోవేషన్ ప్రధానమైంది. కొత్త ఆవిష్కర ణలు చేసే విద్యార్థులను తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా మారింది. విద్యార్థిలో సమాచారం గుర్తు పెట్టుకొనే సామర్థ్యం కన్నా, ఆ సమాచారం ఎంత మేరకు అవగతం చేసుకొనే శక్తి, విశ్లేషించే నైపుణ్యం ఉందో చూస్తున్నారు. అందుబాటులో ఉన్న సమాచా రాన్ని నేటి సామాజిక పరిస్థితులతో అన్వయించు కొనే సామర్థ్యంతో నూతన ఆవిష్కరణలు చేసే విద్యార్థులకే నేడు పెద్దపీట వేస్తున్నారు. అందువల్ల ఈ రోజు విద్యారంగంలో ఉపాధ్యాయుడు సర్వాంత ర్యామి కానేకాదు. తరగతి గదిలో విద్యార్థి నైపుణ్యాభి వృద్ధికి, మేథో వికాసానికి అవసరమైన మెళకువలను బోధించడమే ఉపాధ్యాయుడి ప్రథమ కర్తవ్యంగా మారింది. విద్యార్థిలో అవగాహన ఎంతగా పెరిగితే అన్ని కొత్త ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉంటుంది. టెక్నాలజీ నేడు అన్ని రంగాలనూ శాసిస్తోంది. ఎవరైతే సాంకేతిక నైపుణ్యాన్ని కలిగి ఉంటారో వారికే అవకాశాలు విరివిగా లభిస్తాయి. ఈ నేపథ్యంలో టెక్నాలజీలో వచ్చే మార్పులు విద్యారంగంలో రాక పోయినట్టయితే ఆ విద్య వచ్చే శతాబ్దానికి పనికి రాదు. పిల్లలు పుట్టి పెరుగుతున్న క్రమంలో పలకా బలపం పట్టుకుంటేనే మురిసిపోయేరోజులు పోయి పుట్టడంతోనే సెల్‌ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్‌లను అవలీలగా ఆపరేట్ చేయగలిగిన డిజిటల్ యుగంలో మనమున్నాం. ఈరోజు సెల్‌ఫోన్ ఓ నిత్యావస రంగా మారిపోయింది. దేశంలో సెల్‌ఫోన్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఈ రోజు తరగతి గదిలో విద్యార్థి చేతిలో ఉన్న సెల్‌ఫోన్ తీసుకుంటే వాళ్ళకు కోపం వస్తుంది. టెక్నాలజీలో అనునిత్యం వస్తోన్న మార్పుల వల్ల విద్యార్థులు తమను తాము నిత్యం అప్డేట్ చేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఈ సాంకేతిక మార్పులను గమనించి విద్యారంగానికి వాటిని అన్వయించుకోవడంలో విఫలమైతే మాత్రం విద్యార్థులు తరగతి గదులకు దూరమయ్యే ప్రమా దం లేకపోలేదు. విద్యార్థి ఆసక్తిని గమనించి విద్యా వ్యవస్థకు సాంకేతిక సొబగులు అద్దాలి. సమాచార రంగం, డిజిటల్ టెక్నాలజీలో వస్తున్న మార్పులు చాలా వేగంగా మారుతున్నాయి. ఈ రోజు విద్యార్థి అవగాహన పెంచే అంశంపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఏ విద్యార్థీ పుట్టుక తోనే మేధావి కాడు. పిల్లవాడికి తగిన వాతావరణ కల్పిస్తేనే రాణించగలరు. అందువల్ల పిల్లల్లో కొత్త ఆలోచనలను రేకెత్తించడమే నేటి ఉపాధాయుడి ప్రధాన కర్తవ్యం. ఆలోచించే వ్యక్తి దేశానికి వరం. ఒకప్పుడు తరగతిగదిలో పాఠం బోధించిన వెంటనే పిల్లవాడిని ప్రశ్నించేవాళ్ళం. దీంతో పిల్లవాడు అదే సమాచారాన్ని గుర్తుంచుకొని చెప్పగలిగితే మేధావి అని కీర్తించే వాళ్ళం. విద్యార్థి ప్రదర్శించే ఆ నైపు ణ్యంతో ఉపాధ్యాయుడు సంతృప్తి చెందేవాడు. కానీ అది అవగాహన కాదు. అది కేవలం రీకాల్ మాత్రమే. అలాంటి చదువులో విద్యార్థి పాత్రధారి కాలేదు. గురువు బోధించిన పాఠంలో విద్యార్థి శ్రమ లేకపోతే అది కేవలం ఉపరితల జ్ఞానంగానే మిగిలి పోతుంది. అందువల్ల విద్యార్థిని బోధనలో పాత్ర ధారి చేయాలి. అందుకు విద్యార్థి ఉపయోగించే సెల్ ఫోన్‌నే సాధనంగా ఎంచుకొని ఆ టెక్నాలజీతో అతడి ఆలోచనను పెంచేలా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి. అలాకాకుండా మనం మడికట్టు కొని కూర్చుంటే ఛాదస్తులమవుతాం. దినదినం మారుతున్న టెక్నాలజీని ఉపయోగించి విద్యార్థి అవ గాహనను, ఆలోచనను పెంచేలా కృషి చేయాలి. ఉపాధ్యాయుడి బోధనలు విద్యార్థికి ఆసక్తికరంగా ఉంటే మెదడులో కవాటాలు తెరుచుకుంటాయి. అవి తెరచుకుంటేనే విద్యార్థి ఆలోచనలు మొదలు పెడ తాడు. ఆ ఆలోచనలతోనే కొత్త జ్ఞానం ఉత్పత్తి అవు తుంది. అదే నూతన ఆవిష్కరణలకు కారణమౌ తుంది. క్లాస్రూంలు కొత్త ఆవిష్కరణలకు కేంద్రాల యినప్పుడే విద్యారంగంలో మరో విప్లవం సాధ్యమ వుతుంది. నేటి తరగతి గది ఆవిష్కరణల సృష్టిగానీ, పాత జ్ఞానాన్ని వల్లించే కేంద్రం కారాదు. మర మనిషి విసురుతున్న చాలెంజ్‌లను తరగతి గదులు స్వీకరిం చాలి. 21వ శతాబ్దంలో వచ్చిన సమాచార, సాంకేతిక విప్లవాలకు విద్యారంగాన్ని జోడిస్తే వచ్చే మరో విప్ల వంతో సామాజిక పరివర్తన సాధ్యమవుతుంది. -వ్యాసకర్త : ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు డాక్టర్ చుక్కారామయ్య -
నేటి నుంచి పాలిటెక్నిక్ ప్రవేశాల కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌లలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సాంకేతిక విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈనెల 14 నుంచి రిజిస్ట్రేషన్లను ప్రారంభించనున్నట్లు పాలిసెట్–2018 కన్వీనర్ నవీన్ మిట్టల్, ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై, పాలిసెట్‌లో ర్యాంకు సాధించిన విద్యార్థులు ప్రవేశాలకు అర్హులని చెప్పారు. సీబీఎస్ఈ/ఐసీఎస్ఈ విద్యార్థుల ప్రవేశాలు మాత్రం వారి పదో తరగతి ఉత్తీర్ణతను బట్టి ఉంటాయని వెల్లడించారు. విద్యార్థులు 14 నుంచి 18వ తేదీ వరకు ఆన్లైన్లో ((https://tspolycet. nic.in)) రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే రూ.300, ఇతరులు రూ.600 ప్రాసెసింగ్ ఫీజు ఆన్లైన్ (క్రెడిట్/డెబిట్‌కార్డు/నెట్ బ్యాంకింగ్) ద్వారా చెల్లించాలని వివరించారు. ఫీజు చెల్లించేటప్పుడు విద్యార్థి తన మొబైల్ నంబరు, ఈ–మెయిల్ ఐడీ, ఆధార్ నంబరు ఇవ్వాలని, ఆదాయ ధ్రువీకరణ పత్రం (వర్తించే వారు) నంబరు ఇవ్వాలని సూచించారు. ఆ తర్వాత హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని పేర్కొన్నారు. తగ్గిన కాలేజీలు, సీట్లు ఈసారి పాలిటెక్నిక్ కాలేజీలతోపాటు సీట్లు తగ్గిపోయాయి. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 181 కాలేజీల్లో 43,082 సీట్లు అందుబాటులో ఉండగా, ఈసారి 13 కాలేజీలు తగ్గిపోయాయి. 4,470 సీట్లకు కోత పడింది. రాష్ట్రవ్యాప్తంగా 168 కాలేజీల్లో 38,612 సీట్ల భర్తీకి సాంకేతిక విద్యాశాఖ చర్యలు చేపట్టింది. గతేడాది 55 ప్రభుత్వ కాలేజీల్లో 11,752 సీట్లు ఉండగా.. ఈసారి అవే కాలేజీల్లో 11,512 సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. 2 ఎయిడెడ్ కాలేజీల్లో గతేడాది 420 సీట్లు ఉండగా, ఈసారి 360 సీట్లు ఉన్నట్లు తెలిపింది. గతేడాది 122 ప్రైవేటు కాలేజీల్లో 30,190 సీట్లు ఉండగా, ఈసారి 111 ప్రైవేటు కాలేజీల్లో 26,740 సీట్లు అందుబాటులో ఉన్నట్లు వివరించింది. వెబ్సైట్లో సమగ్ర వివరాలు ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించి తేదీల వారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సిన విద్యార్థుల ర్యాంకుల వివరాలను సాంకేతిక విద్యాశాఖ తమ వెబ్సైట్లో పొందుపరిచింది. ఏ ర్యాంకుల వారికి ఏయే కాలేజీల్లో సీట్లు వచ్చాయనే వివరాలను విద్యార్థుల అవగాహన కోసం వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. విద్యార్థులు పాలిసెట్ ర్యాంకు కార్డు, ఆధార్ కార్డు, టెన్త్ మెమో, రాష్ట్ర ఎస్సెస్సీ బోర్డు కాకుండా ఇతర బోర్డుల వారు హాల్‌టికెట్, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, 2018 జనవరి 1 తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలని వెల్లడించింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయబోయే విద్యార్థులు ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వారికి రెండో దశలో మిగిలిపోయే సీట్లను కేటాయిస్తారు. వారు టెన్త్ ఉత్తీర్ణులైతేనే ఆ సీటు ఇస్తారు. ఇదీ ప్రవేశాల షెడ్యూలు 14–5–2018 నుంచి 18–5–2018: ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు 15–5–2018 నుంచి 19–5–2018: సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 15–5–2018 నుంచి 21–5–2018: వెరిఫికేషన్ పూర్తయిన వారికి వెబ్ ఆప్షన్లు 23–5–2018: మొదటి దశ సీట్లు కేటాయింపు 23–5–2018 నుంచి 27–5–2018 వరకు: ట్యూషన్ ఫీజు చెల్లించడంతోపాటు కాలేజీలో చేరేందుకు ఆన్లైన్లో అంగీకారం తెలపాలి. సీట్లు పొంది ఫీజు చెల్లించకుండా, అంగీకారం తెలుపకపోతే రెండో దశలో అవకాశం ఉండదు. మొదటి దశలో సీటు వస్తే అంగీకారం తెలిపి, ఫీజు చెల్లించాలి. వారి పాత ఆప్షన్ల ప్రకారం కాలేజీలు, సీటును మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. 24–5–2018 నుంచి 27–5–2018: సీట్లు రాని వారు ఆప్షన్లను మార్చుకోవచ్చు. ఒకవేళ మార్చుకోకపోతే ముందుగా వారు ఇచ్చిన ఆప్షన్లనే పరిగణనలోకి తీసుకుంటారు. 30–5–2018: సీట్లు మెరుగుపరుచుకోవాలని అంగీకారం తెలిపిన వారికి, మొదటి దశలో సీట్లు రాని వారికి రెండో దశ సీట్లు కేటాయిస్తారు. మిగిలిన సీట్లను టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాయబోయే వారికి కేటాయిస్తారు. 30–5–2018 నుంచి 1–6–2018 వరకు: ట్యూషన్ ఫీజు చెల్లింపు, కాలేజీల్లో చేరికలు 1–6–2018 నుంచి: తరగతులు ప్రారంభం