సాక్షి, అమరావతి: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఐఐటీ అకాడమీల్లోని విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్యనందిస్తోంది. ఐఐటీ, నీట్ వంటి వృత్తి విద్యపై మక్కువతో అకాడమీ కాలేజీల్లో చేరిన విద్యార్థులకు ప్రయివేట్ కాలేజీల్లో ఇస్తున్న కోచింగ్ కంటే ఉన్నతమైన ప్రమాణాలతో శిక్షణనిస్తోంది. కరోనా నేపథ్యంలో ఇళ్లలోనే ఉన్న విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా రోజూ గురుకుల అధ్యాపకులు పాఠాలు చెబుతున్నారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు స్మార్ట్ ఫోన్‌లు కొనివ్వడంతో విద్యార్థులందరూ ఆన్‌లైన్ తరగతులను అనుసరిస్తున్నారు. నిత్యం అధ్యాపకులతో మాట్లాడుతూ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. విద్యార్థులకు కావాల్సిన మెటీరియల్‌ను అధ్యాపకులు ఆన్‌లైన్‌లోనే పంపుతున్నారు. దూరదర్శన్, రేడియోతో పాటు పలు యాప్‌ల ద్వారా గురుకుల సొసైటీ కోచింగ్ ఇస్తోంది.
3 అకాడమీలు.. 1300 మంది విద్యార్థులు
► ప్రస్తుతం 3 చోట్ల ఐఐటీ అకాడమీలున్నాయి. కృష్ణా జిల్లా ఈడుపుగల్లులోని ఐఐటీ అకాడమీలో 580 మంది, కర్నూలు జిల్లా చిన్న టేకూరు ఐఐటీలో 480, గుంటూరు జిల్లా గోరంట్ల గురుకుల ఐఐటీలో 250 మంది విద్యార్థులు ఇంటర్ చదువుతూ ఐఐటీ, నీట్ కోచింగ్ తీసుకుంటున్నారు.
► స్కూలు భవనాల సామర్థ్యాన్ని బట్టి ప్రభుత్వం సీట్లు కేటాయిస్తోంది. కనీస సౌకర్యాల్లేకుండా ఎక్కువ మందిని చేర్చుకుంటే ఇబ్బందులుంటాయని మొదట్నుంచీ భావిస్తున్న గురుకుల సొసైటీ.. అవసరం మేరకే విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది.
► ఈ అకాడమీలను నిర్వహిస్తున్న కాలేజీలకు మెరికల్లాంటి విద్యార్థులను గురుకుల సొసైటీ ఎంపిక చేసుకుంటోంది. ఏటా ప్రత్యేక పరీక్ష నిర్వహించి అత్యంత ప్రతిభావంతులను తీసుకుంటోంది.
మరో 5 అకాడమీల ఏర్పాటుకు ప్రతిపాదనలు
గురుకుల విద్యాలయాల సంస్థ ద్వారా కొత్తగా మరో ఐదు ఐఐటీ అకాడమీల ఏర్పాటుకు గురుకుల సొసైటీ ప్రతిపాదనలు రూపొందించింది. విశాఖలో బాలురకు ఒకటి, బాలికలకు ఒకటి, రాజమహేంద్రవరంలో బాలురకు, నెల్లూరు, తిరుపతిలో బాలికలకు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఐదు ఐఐటీల ద్వారా సుమారు 3,000 మందికి ఐఐటీ, నీట్‌లలో కోచింగ్ ఇవ్వాలని గురుకుల సొసైటీ నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
కొత్త ఐఐటీ అకాడమీలకు అనుమతొస్తే మరింత మందికి చాన్స్
ఇటీవల జరిగిన సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పాలక మండలి సమావేశంలో కొత్తగా ఐదు ఐఐటీ అకాడమీల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. అనుమతులు వస్తే మరింత మంది విద్యార్థులు సాంకేతిక విద్యను అభ్యసించేందుకు అవకాశం కలుగుతుంది.
– కల్నల్ వి.రాములు, గురుకుల కార్యదర్శి
ఐఐటీ అకాడమీల్లో నాణ్యమైన విద్య
Published Sun, Jul 12 2020 3:20 AM | Last Updated on Sun, Jul 12 2020 3:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment