Gurukul education system
-
గురుకుల బీసీ హాస్టల్లో చిన్నారి మృతి..
-
గురుకుల కొలువుల పరీక్షలు పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకుల విద్యా సంస్థల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) నిర్వహించిన అర్హత పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. ఈనెల 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మొత్తం 19 రోజుల పాటు ఈ పరీక్షలు జరిగాయి. 6,52,413 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా.. 4,93,727 మంది హాజరయ్యారు. పరీక్షలకు సగటున హాజరైన అభ్యర్థుల శాతం 75.68గా నమోదైంది. గురుకుల బోర్డు ఏకకాలంలో తొమ్మిది నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా దాదాపు 56 విభాగాల్లోని ఉద్యోగాల భర్తీకి సంబంధించి కేవలం 19 రోజుల్లో అత్యంత ప్రణాళికా బద్ధంగా పరీక్షలు నిర్వహించిన టీఆర్‌ఈఐఆర్‌బీ సరికొత్త రికార్డు సృష్టించింది. రోజుకు మూడు షిఫ్టుల్లో పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో ఈ పరీక్షలను టీఆర్‌ఈఐఆర్‌బీ విజయవంతంగా పూర్తి చేసింది. ఇప్పటివరకు గురుకుల బోర్డు నిర్వహించినవన్నీ కంప్యూటర్ ఆధారిత పరీక్షలే కావడంతో మూల్యాంకన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసే వీలుంటుంది. ముందుగా అభ్యర్థుల జవాబు పత్రాల నకళ్లు, ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాల స్వీకరణ, తుది కీ ఖరారు చేసిన తర్వాత ఫలితాలను విడుదల చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా టీఆర్‌ఈఐఆర్‌బీ నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని సొసైటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. కాగా, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ ఉద్యోగ కేటగిరీలకు సంబంధించి మాస్టర్ క్వశ్చన్ పేపర్లు, కీలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచలేదు. వీటికి సంబంధించి కోర్టులో కేసు ఉండటంతో వెబ్సైట్లో పెట్టలేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రాథమిక కీ పట్ల అభ్యంతరాలుంటే ఈనెల 26వ తేదీ వరకు ఆన్లైన్లో సమర్పించాలని గురుకుల బోర్డు కన్వీనర్ మల్లయ్య భట్టు తెలిపారు. ఈ నెలాఖరులోగా తుది కీలు తయారయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తుది కీ విడుదల చేసిన రోజునే అభ్యర్థులు సంబంధిత పరీక్షల్లో సాధించిన మార్కులు సైతం విడుదలవుతాయి. గురుకుల విద్యా సంస్థల్లో టాప్ పోస్టులుగా డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో లైబ్రేరియన్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లకు డెమో పరీక్షలుంటాయి. -
గురుకుల కొలువుల్లో ‘ఆమె’కు అందలం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మహిళా అభ్యర్థులకు అద్భుత అవకాశంలా పరిణమించింది. సాధారణంగా ఉద్యోగాల భర్తీలో మహిళలకు 33శాతం పోస్టులు రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. కానీ తాజాగా తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) ద్వారా భర్తీ చేస్తున్న గురుకుల విద్యా సంస్థల్లో మహిళలకు అత్యంత ప్రాధాన్యత దక్కింది. నూతన జోనల్ విధానం అమలు తర్వాత రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో ఏకంగా 9,231 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిం ది. ఇందులో భాగంగా టీఆర్‌ఈఐఆర్‌బీ ఈనెల 5వ తేదీన ఒకేసారి 9 నోటిఫికేషన్లను వెబ్‌నోట్ ద్వారా విడుదల చేసింది. తాజాగా పూర్తిస్థాయి నోటిఫికేషన్లను కూడా గురుకుల నియామకాల బోర్డు వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చిం ది. ప్రకటించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ల ద్వారా 9,210 పోస్టులు మాత్రమే భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగ ఖాళీల్లో మహిళలకు ఏకంగా 77.62శాతం పోస్టులు రిజర్వ్ కావడం గమనార్హం. ఆర్ట్ టీచర్ కేటగిరీలో 2 పోస్టులు తగ్గగా... క్రాఫ్ట్ టీచర్ కేటగిరీలో 4 పోస్టులు, టీజీటీ కేటగిరీలో 14 పోస్టులు తగ్గాయి. అక్కడా ఇక్కడా అత్యధికమే... గురుకుల విద్యా సంస్థల్లో బాలుర గురుకులాలు, బాలికల గురుకులాలు విడివిడిగా ఉన్నాయి. రెండు కేటగిరీల్లో ఉన్న విద్యా సంస్థల్లోనూ మహిళలకు అత్యధిక పోస్టులు రిజర్వ్ అయ్యాయి. బాలికల విద్యా సంస్థల్లో ఉన్న ఉద్యోగాలన్నీ పూర్తిగా మహిళలతోనే భర్తీ చేయాలనే నిబంధన ఉంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బాలికల గురుకుల విద్యా సంస్థల్లో 4,647 ఉద్యోగాల భర్తీకి టీఆర్‌ఈఐఆర్‌బీ నోటిఫికేషన్లో ప్రకటించింది. ఇక బాలుర విద్యా సంస్థల్లో 4,563 ఉద్యోగ ఖాళీలను చూపగా... ఇందులో జనరల్ కేటగిరీకి కేవలం 2,061 పోస్టులు మాత్రమే రిజర్వ్ కాగా... మిగతా 2,502 పోస్టులు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. ఈ లెక్కన జనరల్ కేటగిరీకి 45.17శాతం పోస్టులు, మహిళలకు 54.83శాతం పోస్టులు దక్కాయి. నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో రాష్ట్రంలో నియామకాల ప్రక్రియ రోస్టర్ పాయింట్ మొదటి నుంచి ప్రారంభమైంది. దీనికి తోడు మహిళలకు హారిజాంటల్ విధానంలో పోస్టుల కేటాయింపు జరగడంతో మహిళలకు ఎక్కువ పోస్టులు కేటాయించినట్లయింది. గురుకుల విద్యా సంస్థల్లో మొత్తం 9,210 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల కాగా.. ఇందులో మహిళలకు 7,149 పోస్టులు రిజర్వ్ కాగా... జనరల్ కేటగిరీలో 2,061 పోస్టులు మాత్రమే రిజర్వ్ అయ్యాయి. ప్రకటించిన మొత్తం పోస్టుల్లో జనరల్ కేటగిరీకి కేవలం 22.38శాతం పోస్టులు దక్కగా... మహిళలకు మాత్రం 77.62శాతం ఉద్యోగాలకు దక్కనున్నాయి. ఇక అర్హత పరీక్షల్లో మెరిట్ సాధించిన వారిలో మహిళలుంటే జనరల్ కేటగిరీలోని పోస్టులు సైతం వారికి దక్కే అవకాశం ఉంది. ఈలెక్కన ప్రస్తుతం రిజర్వ్ అయిన పోస్టులకంటే మరిన్ని ఎక్కువ ఉద్యోగాలు మహిళలకు దక్కే అవకాశం ఉంది. -
గురుకులాల్లో కొలువులు 12,000.. అతి త్వరలో నోటిఫికేషన్లు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరిన్ని ప్రభు త్వ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే పోలీసు, గ్రూప్స్ కొలువులకు నోటిఫికేషన్లు జారీకాగా.. తాజాగా గురుకులాల్లో 12 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) చర్యలు చేపట్టింది. ఈ నెల మూడో వారంలోగా నోటిఫికేషన్లు విడుదల కానున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 17వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి నియామకాల ప్రక్రియను వేగంగా కొనసాగిస్తోంది. గ్రూప్–1, గ్రూప్–4 పోస్టులతో పాటు పలు శాఖల్లో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్లు ఇచ్చింది. ఇప్పుడు గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వరుసగా నోటిఫికేషన్లు వస్తుండటం, భారీగా ఉద్యోగాల భర్తీ చేపడుతుండటంతో నిరుద్యోగుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. పెరిగిన కొలువులు.. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్)ల పరిధిలో 9,096 పోస్టుల భర్తీకి గతంలోనే ఆమోదం వచ్చింది. వాటికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే గురుకుల నియామకాల బోర్డుకు చేరాయి. తాజాగా మరో 3వేల పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. వీటికి ఆర్థిక శాఖ అనుమతులు జారీచేసిన వెంటనే భర్తీ ప్రక్రియ మొదలుకానుంది. దీనితో మొత్తంగా ఉద్యోగ ఖాళీలు 12 వేలకు పెరిగాయి. 12వేలకు పెరిగిన కొలువులు సీఎం ప్రస్తుతం ఆమోదించిన పోస్టులన్నీ కొత్త విద్యా సంస్థల్లోనివే. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను ప్రారంభించింది. మరోవైపు 119 బీసీ గురుకుల పాఠశాలలు, మైనార్టీ సొసైటీ పరిధిలో 97 పాఠశాలలు జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. ఇలా కొత్తగా ప్రారంభించిన, అప్‌గ్రేడ్ చేసిన పాఠశాలల్లో బోధన కేటగిరీలో 3వేల కొలువుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఏకకాలంలో నోటిఫికేషన్లు గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగ ఖాళీలకు ఏకకాలంలో నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి అంతర్గత పరిశీలన దాదాపు పూర్తి కావచ్చింది. 9,096 పోస్టులకు సంబంధించి గురుకుల సొసైటీలు ఇప్పటికే టీఆర్‌ఈఐఆర్‌బీ (ట్రిబ్)కు సమర్పించగా.. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు, ఇతర అంశాలపై లోతుగా పరిశీలన చేపట్టింది. దీనికితోడు ఇప్పుడు మరో 3వేల పోస్టుల భర్తీకి ఆమోదం వచ్చింది. వీటికి ఆర్థికశాఖ ఓకే చెప్పగానే అన్నిపోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్లు ఇస్తే నియామకాల ప్రక్రియ సులభతరం అవుతుందని ట్రిబ్ అధికారులు భావిస్తున్నారు. కాస్త ఆలస్యమైనా పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీతో నిరుద్యోగులకు సైతం ఉత్సాహం వస్తుందని అంటున్నారు. చాలా వరకు బోధన పోస్టులే.. గురుకులాల్లో భర్తీ చేయనున్న 12వేల పోస్టుల్లో చాలా వరకు టీజీటీ (ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్), పీజీటీ (పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్) పోస్టులే ఉన్నాయి. ఈ రెండు కేటగిరీల్లో పోస్టుల భర్తీకి ఏకకాలంలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. వీటితోపాటు ప్రిన్సిపల్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, పీఈటీ, ఫిజికల్ డైరెక్టర్ తదితర కేటగిరీలకు వరుసగా ప్రకటనలు జారీ చేయనున్నట్టు అధికారులు చెప్తుతున్నారు. మొత్తంగా ఈనెల మూడో వారం నాటికి నోటిఫికేషన్ల జారీ మొదలయ్యే అవకాశం ఉందని వివరిస్తున్నారు. -
గురుకుల సీటు... వెరీ హాటు..!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. పూర్తిస్థాయిలో అడ్మిషన్లు చేపట్టినట్లు సొసైటీలు ప్రకటిస్తున్నా... ‘ఒక్క సీటు’ కావాలంటూ ప్రవేశాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కార్యాలయాలు కిక్కిరిసి పోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకుల సొసైటీ పాఠశాలల్లో ఐదోతరగతిలో నూతన అడ్మిషన్ల ప్రక్రియ, బ్యాక్లాగ్ ఖాళీ సీట్ల భర్తీ ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు ఆయా సొసైటీలు బహిరంగంగా ప్రకటించాయి. అర్హత పరీక్షల ద్వారా విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించి మెరిట్ ప్రకారం గురుకుల సొసైటీలు అడ్మిషన్లు చేపట్టాయి. కౌన్సెలింగ్ నిర్వహించి అడ్మిషన్లు చేపట్టాయి. అడ్మిషన్లు పూర్తయ్యాయని, సీట్లు లేవని బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ సీట్లు కావాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు సొసైటీ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఫిజికల్ రిపోర్టింగే మిగిలింది... రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ గురుకుల సొసైటీలు, విద్యాశాఖకు చెందిన జనరల్ గురుకుల సొసైటీల పరిధిలో 750 గురుకుల పాఠశాలలున్నాయి. వీటిలో ప్రతి సంవత్సరం ఐదో తరగతిలో దాదాపు 50 వేల మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. నాల్గోతరగతి చదివే విద్యార్థులకు రాత పరీక్ష నిర్వహించి, మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. రిజర్వేషన్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఆన్లైన్ పద్ధతిలో ప్రక్రియ పూర్తి చేస్తారు. 2022–23 విద్యా సంవత్సరంలో ఇదే తరహాలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, మహాత్మా జ్యోతిభాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీలు ఉమ్మడిగా అర్హత పరీక్ష నిర్వహించాయి. దాదాపు 1.6 లక్షల మంది విద్యార్థులు ఈ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోగా.. ఒక్కో సీటుకు సగటున ముగ్గురు పోటీపడ్డారు. పరీక్ష అనంతరం మెరిట్ ఆధారంగా సొసైటీలు సీట్లు కేటాయించారు. మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ప్రత్యేకంగా అర్హత పరీక్ష నిర్వహించి ఆమేరకు అడ్మిషన్లు చేపట్టింది. 6, 7, 8, 9 తరగతుల్లోని బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి సైతం సొసైటీల వారీగా పరీక్షలు నిర్వహించారు. అర్హులైన విద్యార్థులకు సీట్లు కేటాయించారు. అన్ని గురుకుల సొసైటీల్లో సీట్ల కేటాయింపులు పూర్తయ్యాయి. ఈ వారాంతంలోగా పాఠశాలల్లో ఆయా విద్యార్థులు ఫిజికల్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రవేశాల ప్రక్రియ దాదాపు ముగిసినట్లే. సీట్లు లేవు... దయచేసి రావొద్దు... ఐదు గురుకుల సొసైటీల పరిధిలో సీట్ల కేటాయింపులు పూర్తయినప్పటికీ విద్యార్థులు, తల్లిదండ్రులు అడ్మిషన్ల కోసం గురుకుల సొసైటీ కార్యదర్శి కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. దీంతో సీట్లు లేవంటూ సొసైటీలు ఇప్పటికే ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశాయి. గిరిజన గురుకుల సొసైటీ, జనరల్ గురుకుల సొసైటీలు కార్యాలయాల వద్ద సూచనలు చేస్తూ పోస్టర్లు అంటించాయి. అయినప్పటికీ సీట్ల కోసం దూరప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్య తగ్గడం లేదు. సీట్ల కోసం వచ్చే వారిని కార్యాలయాల్లోకి అనుమతించకుండా, వారిని నిలువరించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. -
తడ‘బడి’.. 2021లో విద్యారంగంలో ఎత్తుపల్లాలు
కరోనా కరాళ నృత్యం విద్యారంగాన్ని అతలాకుతలం చేసింది. ఎక్కువ కాలం మూతపడ్డ విద్యాసంస్థలు.. ఆన్లైన్ బోధన హడావుడి.. అరకొరగా ప్రత్యక్ష బోధన.. ఉపాధి కోల్పోయిన ప్రైవేటు విద్యాసంస్థల ఉద్యోగులు..ఏ పరిణామం ఎలా ఉన్నా అన్ని కోర్సుల్లో ఇబ్బంది లేకుండా ప్రవేశ పరీక్షలు దిగ్విజయంగా నిర్వహించామన్న ప్రభుత్వ సంతృప్తి... ఇవీ 2021 సంవత్సరంలో విద్యారంగం స్థూలంగా ఎదుర్కొన్న ఎత్తుపల్లాలు. – సాక్షి, హైదరాబాద్ సంవత్సర ఆరంభం నుంచీ విద్యారంగాన్ని కరోనా చీకట్లు ముసిరాయి. జూన్‌లో మొదలవ్వాల్సిన విద్యా సంవత్సరం అక్టోబర్‌కు చేరుకుంది. అప్పటిదాకా ఆన్లైన్ బోధనే విద్యార్థులకు శరణ్యమైంది. ఈ తరహా బోధన పల్లెకు చేరలేదనే విమర్శలు పెద్దఎత్తున వచ్చాయి. ఆన్లైన్ బోధన వల్ల విద్యా ప్రమాణాలు దారుణంగా దెబ్బతిన్నాయని, చిన్న తరగతుల విద్యార్థుల్లో రాయడంతోపాటు చదివే సామర్థ్యం కూడా పూర్తిగా తగ్గినట్లు పలు సర్వేలు తేటతెల్లం చేశాయి. కరోనా తీవ్రత తగ్గడంతో అక్టోబర్ నుంచి ప్రత్యక్ష బోధన మొదలైనా.. చాలాకాలం భయం వెంటాడింది. ఆన్లైన్ వ్యవస్థకే విద్యార్థులు మొగ్గు చూపారు. ఉన్నత విద్యలో ఒరవడి ♦ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి స్థానంలో దళిత సామాజికవర్గానికి చెందిన ప్రొఫెసర్ ఆర్.లింబాద్రిని నియమించారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ఈ నియామకం జరగడం గమనార్హం. ఈ పదవిలో సరికొత్త మార్పులకు లింబాద్రి శ్రీకారం చుట్టారు. ♦చాలా విశ్వవిద్యాలయాలకు 2021లోనే కొత్త ఉపకులపతులు వచ్చారు. వీళ్లంతా సంస్కరణలతో సాగిపోవడం విశేషం. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్ విప్లవాత్మక మార్పులకు ప్రణాళిక సిద్ధం చేశారు. అన్ని యూనివర్సిటీల్లోనూ ఉమ్మడి పాఠ్య ప్రణాళిక దిశగా అడుగులు పడ్డాయి. ♦కరోనా కాలమైనా అన్ని ప్రవేశపరీక్షలను పూర్తి చేయడంలో ఉన్నత విద్యామండలి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఎంసెట్ సకాలంలో పూర్తి చేసి ఇంజనీరింగ్ సీట్లు కేటాయించింది. అలాగే, ఎడ్‌సెట్, లాసెట్, పీజీసెట్, ఫిజికల్ సెట్ అన్నీ అనుకున్న సమయంలో పూర్తి చేయడం ఈ ఏడాది ప్రత్యేకత. ఈ ఏడాది కొత్తగా బీఏ ఆనర్స్ కోర్సులు ప్రవేశపెట్టడం విశేషం. ఈ కోర్సుల ద్వారా ఆర్థిక, రాజకీయ శాస్త్రాలను లోతుగా అధ్యయనం చేసే అవకాశం కల్పించారు. ఈ కోర్సులను అనుభవజ్ఞులైన రాజకీయ, ఆర్థికవేత్తలతో బోధించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇంటర్ గలాబా రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ విద్యాబోధన ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. టెన్త్‌లో పరీక్షలు లేకుండా అందర్నీ పాస్‌చేయడంతో పెద్దఎత్తున ఇంటర్లో ప్రవేశాలు పొందారు. రెండేళ్లుగా సాగిన ఈ ప్రహసనం ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై పెనుప్రభావం చూపింది. ఉత్తీర్ణత 49 శాతం దాటకపోవడంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దీనికి రాజకీయం కూడా తోడవడంతో పెను దుమారం రేగింది. ఆన్లైన్ బోధన చేరని గ్రామీణ ప్రాంతాల్లోనే ఫెయిలైన విద్యార్థులున్నారని, పట్టణప్రాంతాల్లో కార్పొరేట్ విద్యా సంస్థలు ఉండటం వల్ల ఉత్తీర్ణత పెరిగిందనే విమర్శలు ఇంటర్మీడియెట్ బోర్డును ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీంతో చివరకు ప్రభుత్వం దిగిరాక తప్పనిపరిస్థితి నెలకొంది. ఫెయిలైన 2.35 లక్షల మంది విద్యార్థులను కనీస మార్కులతో పాస్ చేయడం ఈ ఏడాది విద్యారంగంలో జరిగిన పరిణామాల్లో ముఖ్య ఘట్టం. విస్తరించిన గురుకుల విద్య రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యక్రమంలో మరో అడుగు ముందుకు పడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేసిన ప్రభుత్వం.. కాలేజీ విద్యను సైతం నిర్బంధ ఉచిత పద్ధతిలో అమలుకు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా ఈ ఏడాది మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్) పరిధిలో గురుకుల జూనియర్ కాలేజీలను ప్రారంభించింది. తొలుత పాఠశాలలుగా ప్రారంభించిన వీటిలో కొన్నింటిని జూనియర్ కాలేజీ స్థాయికి అప్‌గ్రేడ్ చేసింది. ఈ క్రమంలో ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ పరిధిలో 119 జూనియర్ కాలేజీలు, టీఎంఆర్ఈఐఎస్ పరిధిలో 60 జూనియర్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. కోవిడ్–19 పరిస్థితుల్లో వీటిని ప్రారంభించినప్పటికీ... క్షేత్రస్థాయి నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ గురుకుల జూనియర్ కాలేజీల్లో దాదాపు నూరుశాతం సీట్లు నిండిపోయాయి. -
ఐఐటీ అకాడమీల్లో నాణ్యమైన విద్య
సాక్షి, అమరావతి: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఐఐటీ అకాడమీల్లోని విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్యనందిస్తోంది. ఐఐటీ, నీట్ వంటి వృత్తి విద్యపై మక్కువతో అకాడమీ కాలేజీల్లో చేరిన విద్యార్థులకు ప్రయివేట్ కాలేజీల్లో ఇస్తున్న కోచింగ్ కంటే ఉన్నతమైన ప్రమాణాలతో శిక్షణనిస్తోంది. కరోనా నేపథ్యంలో ఇళ్లలోనే ఉన్న విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా రోజూ గురుకుల అధ్యాపకులు పాఠాలు చెబుతున్నారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు కొనివ్వడంతో విద్యార్థులందరూ ఆన్లైన్ తరగతులను అనుసరిస్తున్నారు. నిత్యం అధ్యాపకులతో మాట్లాడుతూ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. విద్యార్థులకు కావాల్సిన మెటీరియల్‌ను అధ్యాపకులు ఆన్లైన్లోనే పంపుతున్నారు. దూరదర్శన్, రేడియోతో పాటు పలు యాప్‌ల ద్వారా గురుకుల సొసైటీ కోచింగ్ ఇస్తోంది. 3 అకాడమీలు.. 1300 మంది విద్యార్థులు ► ప్రస్తుతం 3 చోట్ల ఐఐటీ అకాడమీలున్నాయి. కృష్ణా జిల్లా ఈడుపుగల్లులోని ఐఐటీ అకాడమీలో 580 మంది, కర్నూలు జిల్లా చిన్న టేకూరు ఐఐటీలో 480, గుంటూరు జిల్లా గోరంట్ల గురుకుల ఐఐటీలో 250 మంది విద్యార్థులు ఇంటర్ చదువుతూ ఐఐటీ, నీట్ కోచింగ్ తీసుకుంటున్నారు. ► స్కూలు భవనాల సామర్థ్యాన్ని బట్టి ప్రభుత్వం సీట్లు కేటాయిస్తోంది. కనీస సౌకర్యాల్లేకుండా ఎక్కువ మందిని చేర్చుకుంటే ఇబ్బందులుంటాయని మొదట్నుంచీ భావిస్తున్న గురుకుల సొసైటీ.. అవసరం మేరకే విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది. ► ఈ అకాడమీలను నిర్వహిస్తున్న కాలేజీలకు మెరికల్లాంటి విద్యార్థులను గురుకుల సొసైటీ ఎంపిక చేసుకుంటోంది. ఏటా ప్రత్యేక పరీక్ష నిర్వహించి అత్యంత ప్రతిభావంతులను తీసుకుంటోంది. మరో 5 అకాడమీల ఏర్పాటుకు ప్రతిపాదనలు గురుకుల విద్యాలయాల సంస్థ ద్వారా కొత్తగా మరో ఐదు ఐఐటీ అకాడమీల ఏర్పాటుకు గురుకుల సొసైటీ ప్రతిపాదనలు రూపొందించింది. విశాఖలో బాలురకు ఒకటి, బాలికలకు ఒకటి, రాజమహేంద్రవరంలో బాలురకు, నెల్లూరు, తిరుపతిలో బాలికలకు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఐదు ఐఐటీల ద్వారా సుమారు 3,000 మందికి ఐఐటీ, నీట్‌లలో కోచింగ్ ఇవ్వాలని గురుకుల సొసైటీ నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త ఐఐటీ అకాడమీలకు అనుమతొస్తే మరింత మందికి చాన్స్ ఇటీవల జరిగిన సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పాలక మండలి సమావేశంలో కొత్తగా ఐదు ఐఐటీ అకాడమీల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. అనుమతులు వస్తే మరింత మంది విద్యార్థులు సాంకేతిక విద్యను అభ్యసించేందుకు అవకాశం కలుగుతుంది. – కల్నల్ వి.రాములు, గురుకుల కార్యదర్శి -
ఇష్టం మీది...పుస్తకం మాది!
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచేందుకు మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎప్పుడూ పాఠ్యపుస్తకాలతో కుస్తీ పట్టడమే కాకుండా సామాజిక అంశాలు, చరిత్ర, కరెంట్ అఫైర్స్ తదితరాలు తెలుసుకునే వీలుగా ప్రతి గురుకులంలో గ్రంథాలయ అభివృద్ధికి ఉపక్రమించింది. విద్యార్థులు ఇష్టపడే పుస్తకాలను తెప్పించేందుకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ ట్రస్ట్‌తో అవగాహన కుదుర్చుకుంది. సొసైటీ పరిధిలో 251 గురుకుల పాఠశాలలు, 29 జూనియర్ కళాశాలలతో పాటు మరో డిగ్రీ కాలేజీ ఉంది. వీటి పరిధిలో 1.15లక్షల మంది విద్యార్థులున్నారు. ఏ పుస్తకం అడిగినా ఓకే... గురుకుల విద్యాలయాల లైబ్రరీల్లో ప్రస్తుతం ఉన్న పుస్తకాలతో పాటు అదనంగా తెప్పించేందుకు ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ ప్రిన్స్‌పాళ్లకు అవకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యా సంస్థల్లో హైదరాబాద్ బుక్‌ఫెయిర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రదర్శన చేపట్టారు. వీటిలో నచ్చిన పుస్తకాల జాబితాలను ఆయా ప్రిన్స్‌పాళ్లకు అందించారు. విద్యార్థుల ఆసక్తి, అభిరుచికి తగిన పుస్తకాల జాబితాలను వారే సొసైటీకి అందించాలి. అక్కడ అనుమతి తీసుకున్న తర్వాత కొనుగోలు చేయొచ్చు. సంస్కృతి, చరిత్ర, ప్రస్తుత అంశాలతో పాటు పోటీ పరీక్షలు, సివిల్ సర్వీసెస్ తదితర రంగాలకు చెందిన అన్ని పుస్తకాలు గ్రంథాలయంలో ఉంచుతున్నట్లు సొసైటీ వర్గాలు చెబుతున్నాయి. అవసరాలకు తగ్గ కొనుగోలు ప్రతి గురుకుల విద్యా సంస్థలో ఒక గ్రంథాలయం ఉంది. ప్రస్తుతం కొన్ని పుస్తకాలు అందుబాటులో ఉండగా.. విద్యార్థుల ఆసక్తికి తగిన పుస్తకాలు కొనుగోలు చేసే వీలు కల్పిస్తుంది. విద్యార్థులు ఏయే పుస్తకాలు కోరారో.. వాటిని హైదరాబాద్ బుక్‌ఫెయిర్ సొసైటీకి జాబితా ఇస్తాం. గరిష్టంగా 50% రాయితీపై వారు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. పుస్తకాల కొనుగోలుకు గురుకుల విద్యా సంస్థకు రాష్ట్ర కార్యాలయం నుంచే అనుమతులిస్తున్నాం.– మల్లయ్య భట్టు,కార్యదర్శి, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ -
ఫొటో తర్వాతే భోజనం!!
సాక్షి, అమరావతి: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో విద్యార్థులను ఖైదీల్లా చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులు భోజనం ప్లేట్లో పెట్టుకున్న వెంటనే తినడానికి వీల్లేదు. సిబ్బంది అందరినీ నిలబెట్టి ఫొటో తీస్తారు. ఫొటోలో విద్యార్థులందరూ వచ్చారని, ఆహార పదార్థాలాన్నీ స్పష్టంగా కనపడుతున్నాయని నిర్ధారించుకున్న తర్వాతే తినాలి. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్, రాత్రి భోజన సమయంలో విధిగా ఫొటోలు తీస్తారు. ఎప్పుడు ఏమి పెట్టారు, ఎంతమందికి పెట్టారనేది ఫొటోలో స్పష్టంగా కనిపించాలి. భోజన సమయంలో ఫొటో తీస్తే కూరలు, అన్నం స్పష్టంగా కన్పించాలన్నమాట. ఈ విధంగా విద్యార్థుల్ని లెక్కించి బిల్లులు చెల్లిస్తున్నారు. ఒకవేళ లెక్క సరిగా లేకపోతే కుకింగ్ ఏజెన్సీ బిల్లుల్లో ఆ మేరకు కోత విధిస్తున్నారు. ఆ భారం కాస్తా ప్రిన్సిపాళ్లపై పడుతుండటంతో వారు లబోదిబోమంటున్నారు. విద్యార్థుల విషయంలో ఈ పద్ధతి సరికాదనే విమర్శలు తీవ్రంగా విన్పిస్తున్నాయి. ప్రిన్సిపాల్స్పైనే భారం ఫొటోల్లో విద్యార్థులను లెక్కించి ఆ మేరకే కుకింగ్ ఏజెన్సీలకు బిల్లులు చెల్లిస్తున్నారు. వాస్తవానికి ప్రిన్స్‌పాల్ చెప్పిన లెక్క ప్రకారమే కుకింగ్ ఏజెన్సీ వారు భోజనాలు తయారు చేస్తారు. బిల్లులు చెల్లించే సమయంలో ప్రిన్స్‌పాల్ చెప్పిన హాజరు ప్రకారం ఫొటోల్లో విద్యార్థులు కన్పించకుంటే ఆ మేరకు కోత విధిస్తున్నారు. అయితే మీరు చెప్పిన సంఖ్య ప్రకారమే మేము భోజనం తయారు చేస్తున్నామంటూ కుకింగ్ ఏజెన్సీ వారు ప్రిన్స్పాళ్లను నిలదీస్తున్నారు. మీరు చెప్పిన పిల్లల హాజరు ప్రకారమే భోజనాలు, ప్రత్యేక వంటకాలు తయారు చేయించామని, అలాంటప్పుడు మాకు ఇచ్చే బిల్లుల్లో కోత ఎలా పెడతారని ప్రశ్నిస్తుండటంతో ప్రిన్స్‌పాళ్లకు దిక్కు తోచడం లేదు. ఈ నేపథ్యంలో తాము వేల రూపాయల్లో కుకింగ్ ఏజెన్సీకి తమ సొంత డబ్బులు చెల్లించాల్సి వస్తున్నదని ప్రిన్సిపాళ్లు వాపోతున్నారు. కోతేసి మిగుల్చుకుంటున్నారు.. రాష్ట్రంలో మొత్తం 188 సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు ఉన్నాయి. ఇందులో సుమారు 1.5 లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరికి నెలకు ప్రభుత్వం మెస్ చార్జీల కింద సుమారు రూ.12.50 కోట్లకు పైగా వెచ్చిస్తుండగా ప్రతినెలా రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు ఈ విధంగా కోత విధిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. 2018 ఆగస్టులో రూ.12,61,19,074 ఖర్చుపెట్టాల్సి ఉండగా.. విద్యార్థులు లేరని, ప్రత్యేక వంటకాలు సరిగా పెట్ట లేదని, ఫొటోల్లోని విద్యార్థులతో వాస్తవ సంఖ్య సరిపోలడం లేదనే నెపంతో ఏజెన్సీ బిల్లుల్లో రూ.42,29,166 కోత విధించారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి ఆగస్టు నెలలో మిగులుగా అధికారులు చూపించారు. ఫొటోలో కన్పించకపోతే కోతే..! సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థ అన్నపూర్ణ అనే యాప్‌ను తయారు చేయించింది. ఈ యాప్‌లో విద్యార్థుల ఏరోజు భోజనం ఖర్చుల వివరాలు ఆరోజు కాలేజీ ప్రిన్స్‌పాళ్ల ద్వారా అప్లోడ్ చేయాలి. ప్రతి విద్యార్థి, ఉద్యోగి బయోమెట్రిక్ ఉపయోగించాలి. దీనివల్ల ఎవరు హాజరయ్యారు, కాలేదనే వివరాలు నమోదవుతాయి. ఆ సంఖ్యను బట్టే భోజనం తయారు చేస్తారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. భోజనం వడ్డించేటప్పుడు ఫొటోలు తీస్తున్నారు. స్కూల్లో వెయ్యి మంది విద్యార్థులు ఉంటే అందరూ పూర్తిగా ఫొటోలో కనిపించాలని ప్రిన్స్‌పాళ్లకు గురుకుల కార్యదర్శి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అలాగే కోడిగుడ్డు, అరటి పళ్ళు, ప్రత్యేక వంటకాలు పెట్టినప్పుడు ఫొటోల్లో స్పష్టంగా కనిపించాలని కూడా గురుకుల సొసైటీ నుంచి ఆదేశాలు ఉన్నట్లు ఆయా స్కూళ్ళ ప్రిన్స్పాళ్లు చెబుతున్నారు. అయితే ఒక్కోసారి ఫొటోలో అందరూ కనిపించకపోవచ్చునని, ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు ఈ సమస్య ఏర్పడుతోందని వారు వాపోతున్నారు. -
ఈ ఏడాది లక్ష ఉద్యోగాల భర్తీ: కడియం
గజ్వేల్: ఈ ఏడాది లక్ష ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. విద్యాశాఖతోపాటు ఇతర శాఖల్లో ఉన్న సుమారు లక్షకు పైగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గమైన మెదక్‌జిల్లా గజ్వేల్‌లో బుధవారం ఆయన పర్యటించారు. నగరపంచాయతీ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఎడ్యుకేషన్ హబ్‌కు సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కడియం విలేకరులతో మాట్లాడారు. విద్యారంగ అభివృద్ధిపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. బడ్జెట్లో ఇప్పటికే రూ.11 వేల కోట్లను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. గురుకుల విద్యా వ్యవస్థను కూడా పటిష్టం చేయనున్నట్టు చెప్పారు.