తడ‘బడి’.. 2021లో విద్యారంగంలో ఎత్తుపల్లాలు | Telangana Roundup Of Education In 2021 | Sakshi
Sakshi News home page

తడ‘బడి’.. 2021లో విద్యారంగంలో ఎత్తుపల్లాలు

Published Wed, Dec 29 2021 3:31 AM | Last Updated on Wed, Dec 29 2021 3:34 PM

Telangana Roundup Of Education In 2021 - Sakshi

కరోనా కరాళ నృత్యం విద్యారంగాన్ని అతలాకుతలం చేసింది. ఎక్కువ కాలం మూతపడ్డ విద్యాసంస్థలు.. ఆన్‌లైన్‌ బోధన హడావుడి.. అరకొరగా ప్రత్యక్ష బోధన.. ఉపాధి కోల్పోయిన ప్రైవేటు విద్యాసంస్థల ఉద్యోగులు..ఏ పరిణామం ఎలా ఉన్నా అన్ని కోర్సుల్లో ఇబ్బంది లేకుండా ప్రవేశ పరీక్షలు దిగ్విజయంగా నిర్వహించామన్న ప్రభుత్వ సంతృప్తి... ఇవీ 2021 సంవత్సరంలో విద్యారంగం స్థూలంగా ఎదుర్కొన్న ఎత్తుపల్లాలు.
– సాక్షి, హైదరాబాద్‌

సంవత్సర ఆరంభం నుంచీ విద్యారంగాన్ని కరోనా చీకట్లు ముసిరాయి. జూన్‌లో మొదలవ్వాల్సిన విద్యా సంవత్సరం అక్టోబర్‌కు చేరుకుంది. అప్పటిదాకా ఆన్‌లైన్‌ బోధనే విద్యార్థులకు శరణ్యమైంది. ఈ తరహా బోధన పల్లెకు చేరలేదనే విమర్శలు పెద్దఎత్తున వచ్చాయి. ఆన్‌లైన్‌ బోధన వల్ల విద్యా ప్రమాణాలు దారుణంగా దెబ్బతిన్నాయని, చిన్న తరగతుల విద్యార్థుల్లో రాయడంతోపాటు చదివే సామర్థ్యం కూడా పూర్తిగా తగ్గినట్లు పలు సర్వేలు తేటతెల్లం చేశాయి. కరోనా తీవ్రత తగ్గడంతో అక్టోబర్‌ నుంచి ప్రత్యక్ష బోధన మొదలైనా.. చాలాకాలం భయం వెంటాడింది. ఆన్‌లైన్‌ వ్యవస్థకే విద్యార్థులు మొగ్గు చూపారు. 

ఉన్నత విద్యలో ఒరవడి 
ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి స్థానంలో దళిత సామాజికవర్గానికి చెందిన ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రిని నియమించారు. హుజూరాబాద్‌ ఎన్నికల సమయంలో ఈ నియామకం జరగడం గమనార్హం. ఈ పదవిలో సరికొత్త మార్పులకు లింబాద్రి శ్రీకారం చుట్టారు. 

చాలా విశ్వవిద్యాలయాలకు 2021లోనే కొత్త ఉపకులపతులు వచ్చారు. వీళ్లంతా సంస్కరణలతో సాగిపోవడం విశేషం. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ రవీందర్‌ విప్లవాత్మక మార్పులకు ప్రణాళిక సిద్ధం చేశారు. అన్ని యూనివర్సిటీల్లోనూ ఉమ్మడి పాఠ్య ప్రణాళిక దిశగా అడుగులు పడ్డాయి.  

కరోనా కాలమైనా అన్ని ప్రవేశపరీక్షలను పూర్తి చేయడంలో ఉన్నత విద్యామండలి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఎంసెట్‌ సకాలంలో పూర్తి చేసి ఇంజనీరింగ్‌ సీట్లు కేటాయించింది. అలాగే, ఎడ్‌సెట్, లాసెట్, పీజీసెట్, ఫిజికల్‌ సెట్‌ అన్నీ అనుకున్న సమయంలో పూర్తి చేయడం ఈ ఏడాది ప్రత్యేకత.  

ఈ ఏడాది కొత్తగా బీఏ ఆనర్స్‌ కోర్సులు ప్రవేశపెట్టడం విశేషం. ఈ కోర్సుల ద్వారా ఆర్థిక, రాజకీయ శాస్త్రాలను లోతుగా అధ్యయనం చేసే అవకాశం కల్పించారు. ఈ కోర్సులను అనుభవజ్ఞులైన రాజకీయ, ఆర్థికవేత్తలతో బోధించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 

ఇంటర్‌ గలాబా 
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ విద్యాబోధన ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. టెన్త్‌లో పరీక్షలు లేకుండా అందర్నీ పాస్‌చేయడంతో పెద్దఎత్తున ఇంటర్‌లో ప్రవేశాలు పొందారు. రెండేళ్లుగా సాగిన ఈ ప్రహసనం ఈ ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలపై పెనుప్రభావం చూపింది. ఉత్తీర్ణత 49 శాతం దాటకపోవడంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దీనికి రాజకీయం కూడా తోడవడంతో పెను దుమారం రేగింది.

ఆన్‌లైన్‌ బోధన చేరని గ్రామీణ ప్రాంతాల్లోనే ఫెయిలైన విద్యార్థులున్నారని, పట్టణప్రాంతాల్లో కార్పొరేట్‌ విద్యా సంస్థలు ఉండటం వల్ల ఉత్తీర్ణత పెరిగిందనే విమర్శలు ఇంటర్మీడియెట్‌ బోర్డును ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీంతో చివరకు ప్రభుత్వం దిగిరాక తప్పనిపరిస్థితి నెలకొంది. ఫెయిలైన 2.35 లక్షల మంది విద్యార్థులను కనీస మార్కులతో పాస్‌ చేయడం ఈ ఏడాది విద్యారంగంలో జరిగిన పరిణామాల్లో ముఖ్య ఘట్టం.  

విస్తరించిన గురుకుల విద్య 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యక్రమంలో మరో అడుగు ముందుకు పడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేసిన ప్రభుత్వం.. కాలేజీ విద్యను సైతం నిర్బంధ ఉచిత పద్ధతిలో అమలుకు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా ఈ ఏడాది మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్‌ఈఐఎస్‌) పరిధిలో గురుకుల జూనియర్‌ కాలేజీలను ప్రారంభించింది.

తొలుత పాఠశాలలుగా ప్రారంభించిన వీటిలో కొన్నింటిని జూనియర్‌ కాలేజీ స్థాయికి అప్‌గ్రేడ్‌ చేసింది. ఈ క్రమంలో ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ పరిధిలో 119 జూనియర్‌ కాలేజీలు, టీఎంఆర్‌ఈఐఎస్‌ పరిధిలో 60 జూనియర్‌ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. కోవిడ్‌–19 పరిస్థితుల్లో వీటిని ప్రారంభించినప్పటికీ... క్షేత్రస్థాయి నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో దాదాపు నూరుశాతం సీట్లు నిండిపోయాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement