పోలీసులపై ఆరోపణలు
సైదాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడటంతోపాటు హత్యచేసిన ఘటన యావత్ రాష్ట్రాన్ని కలవరానికి గురిచేసింది. నిందితుడి కోసం వేటసాగించిన పోలీసులు సైతం ఆరోపణలకు గురిచేసేలా చేసింది.
తీరా నిందితుడు వరంగల్ పరిధిలోని ఘన్‌పూర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకోవడం సినిమా క్‌లైమాక్స్‌ను తలపించింది. ఇకపోతే యాదాద్రి జిల్లా అడ్డగూడూర్ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున దుమారం రేపింది. దొంగతనం కేసులో మరియమ్మను పోలీస్ విచారణ పేరుతో హింసించి చంపారన్న ఆరోపణ ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను తీవ్ర ఒత్తిడికి గురిచేసింది.
దీనిపై విచారణ జరిపిన పోలీస్ శాఖ మరియమ్మ మృతిని లాకప్‌డెత్‌గా ధ్రువీకరించి అధికారులను సస్పెండ్ చేసింది. ఒక సందర్భంలో మరియమ్మ వ్యవహారంపై సీబీఐ విచారణ అవసరమని హైకోర్టు ప్రస్తావించడం పోలీస్ శాఖను ఉక్కిరిబిక్కిరి చేసింది.
విచారణకు సెలబ్రిటీలు
హైదరాబాద్ బోయినపల్లికి చెందిన డ్రగ్ సరఫరాదారు కెల్విన్‌తో సంబంధాలు కల్గిఉన్నారన్న ఆరోపణలతో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం 2017లో సినీతారలను, ప్రముఖులను విచారించింది. అయితే ఈ వ్యవహారంలో భారీస్థాయిలో మనీలాండరింగ్ జరిగిందన్న అనుమానంతో ఈ ఏడాది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది.
సినీ తారలు, ప్రముఖులనూ విచారించింది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్, చార్మి, రవితేజ, రానా, రవితేజ, రకుల్ ప్రీత్‌సింగ్, తరుణ్, సుబ్బరాజు, తనీష్, నందు, ముమైత్‌ఖాన్ ఇలా వరుసపెట్టి విచారించడం దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్ అయింది. ఎక్సైజ్ విచారణ జాబితాలో లేని దుగ్గబాటి రానా, రకుల్ ప్రీత్‌సింగ్‌లు ఈడీ విచారణ ఎదుర్కోవడం మరింత సంచలనం రేపింది.
చుక్కలు చూస్తున్న పోలీసులు
శంషాబాద్‌లో జరిగిన దిశ హత్యాచార ఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్ వ్యవహారం పోలీస్ శాఖను నిద్రపోనివ్వలేదు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్ ఏర్పాటుచేసింది. ఈ కమిషన్ అప్పటి సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్‌తోపాటు డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, షాద్‌నగర్ ఏసీపీ, ఇన్‌స్పెక్టర్, సబ్‌ఇన్‌స్పెక్టర్... ఇలా పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బందిని విచారిస్తోంది.
ఈ విచారణలో అనేక తప్పులను, లోపాలను కమిషన్ గుర్తించి ప్రశ్నించడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎవరు ఎప్పుడు కమిషన్ ముందు విచారణ ఎదుర్కొంటారో అన్న అంశాలు అధికారులను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టినట్టు తెలుస్తోంది.
చిట్టీలు.. చీటింగ్‌లు
కలర్‌ఫుల్ సెట్టింగ్‌లు.. దానికి మించి లగ్జరీ కలరింగ్.. కిట్టీ పార్టీల పేరుతో కోట్లాది రూపాయలను తీసుకొని మోసం చేసిన వ్యవహారం తెలుగు రాష్ట్రాలను షేక్ చేసింది. సైబరాబాద్ పరిధిలో జరిగిన ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి శిల్పాచౌదరి సినిమా ప్రొడ్యూసర్‌గా పేరుగడించి సినీ ప్రముఖులతోపాటు రాజకీయ ప్రముఖులనూ బురిడీ కొట్టించింది. ఈ వ్యవహారంలో సినీ హీరో కృష్ణ కుమార్తెతోపాటు అనేకమంది బాధితులయ్యారు.
కిట్టీ పార్టీల పేరుతో పార్టీలు నిర్వహించడం, డబ్బున్న వారిని టార్గెట్ చేసి అడ్జెస్ట్‌మెంట్ పేరుతో రూ.100 కోట్లకుపైగా బురిడీ కొట్టించినట్టు సైబరాబాద్ పోలీసులు అంచనావేశారు. ఈ వ్యవహారం ఒకవైపు సైబరాబాద్‌లో హీట్ పుట్టిస్తుంటే మరోవైపు సంధ్య బిల్డర్డ్స్ యాజమాని శ్రీధర్‌రావు వ్యవహారం మరింత కాక రేపింది.
భవన నిర్మాణాల పేరుతో వందల కోట్ల రూపాయలు దండుకున్నారని, భవనాలు అప్పగించకుండా వేధిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసులు నమోదుచేశారు. ఈయనపై ఎనిమిది పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అంతటితో ఆగని శ్రీధర్‌రావు ఏకంగా తన బాడీగార్డుగా ఉన్న జిమ్ ట్రైనర్‌పై లైంగికదాడికి పాల్పడటం తీవ్ర సంచలనమైంది. ఈ వ్యవహారం బయటకు రాకుండా ఉండేందుకు బాధితుడితో చేసిన సెటిల్‌మెంట్ వ్యవహారం మరింత రచ్చ రేపింది.
మావోయిస్టులకు ఎదురుదెబ్బలు
తెలంగాణ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీకి ఈ ఏడాది కోలుకోలేని దెబ్బలు తగిలాయి. ఒకవైపు కరోనాతో కేంద్ర కమిటీ నుంచి గెరిల్లా కమిటీ సభ్యుల వరకు అనారోగ్యంతో ఇబ్బంది పడగా.. పోలీసుల ఆపరేషన్లతో సీనియర్ నాయకులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. ఏవోబీకి పెద్దదిక్కుగా ఉన్న ఆర్కే (రామకృష్ణ) మృతి పార్టీకి తీరని లోటు తెచ్చిపెట్టింది.
అదేవిధంగా కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్ తేల్దుంబ్డే, డివిజన్ కార్యదర్శి, ఏసీఎం సభ్యులు సహా 26 మంది ఒకే ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ కోవిడ్‌తో మృత్యువాతపడటం రాష్ట్ర కమిటీని అఘాతంలోకి నెట్టింది. నేతల లొంగుబాట్లు ఒకవైపు జరుగుతుండగా వైద్య చికిత్స కోసం వచ్చిన కేంద్ర కమిటీ సీనియర్ సభ్యుడు ప్రశాంత్ బోసే అలియాస్ కిషన్ దా, అతడి భార్య మారండిని అరెస్టయ్యారు.
మొత్తంగా మావోయిస్టు పార్టీకి 2021 తీర్చలేని నాయకుల లోటును తెచ్చిపెట్టిందన్న చర్చ నడుస్తోంది. ఇకపోతే మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు జరపడం కలవరం రేపింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధా రంగా ఈ సోదాలు చేసినట్టు ఎన్‌ఐఏ చెప్పింది. మావో అనుబంధ సంఘాలపై ఉఫా చట్టం కింద కేసులు నమోదు చేయడంపై వామపక్ష సంఘాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తంచేశాయి.
ప్రభుత్వ సొమ్మును నొక్కేశారు...
తెలుగు అకాడమీకి చెందిన రూ.65 కోట్లకు పైగా ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లను అధికారులు, మధ్యవర్తులు, బ్యాంక్ ఉద్యోగులు కలిసి నొక్కేసిన వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలను కలవరానికి గురిచేసింది. నకిలీ ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్లను తయారుచేసి అకాడమీ అధికారులను బురిడీ కొట్టించిన మధ్యవర్తులు.. బ్యాంక్ అధికారులతో దోచేసిన వ్యవహారం పెను దుమారం రేపింది.
దీనిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులతోపాటు ఈడీ విచారణ జరిపి మధ్యవర్తులు భారీస్థాయిలో ఆస్తులు మళ్లించినట్టు నిరూపించారు. ఈ కేసులో అకాడమీలోని తాత్కాలిక ఉద్యోగులతోపాటు రెండు ప్రధాన బ్యాంకుల మేనేజర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యవర్తులకు వెళ్లిన డబ్బును స్వాధీనం చేసుకునేందుకు ఈడీ విచారణను వేగవంతం చేసింది.
ఈజీ లోన్స్.. దుమ్మురేపిన ఈడీ
ఈజీ లోన్స్ పేరుతో మొబైల్ యాప్‌ల ద్వారా రుణాలు ఇచ్చి అధిక వడ్డీలతో వేధించిన వ్యవహారంలో ఇటు రాష్ట్ర పోలీసులు, అటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జరిపిన విచారణలో అనేక సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. చైనా, హాంకాంగ్ తదితర దేశాలకు చెందిన కంపెనీలు దేశంలోని కూడోస్ ఎన్‌బీఎఫ్‌సీ వేదిక ద్వారా రూ.2,600 కోట్లకు పైగా వసూలు చేసినట్టు ఈడీ గుర్తించింది. ఈ కుంభకోణానికి సహకరించిన కూడోస్ ఎన్‌బీఎఫ్‌సీ వ్యవస్థాపకుడు పవిత్రా ప్రదీప్ వాల్వేకర్‌ను అరెస్ట్ చేసి కటాకటాల్లోకి నెట్టింది.
అదేవిధంగా మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో ఇండస్ వీవా వసూలు చేసిన రూ.1,500 కోట్ల స్కాం కేసులో ఈడీ సహవ్యవస్థాపకుడితోపాటు కీలక సూత్రధారి అయిన సీఏ అంజర్, అభిలాష్ థామస్‌ను అరెస్ట్ చేసింది. ఈ కేసుల్లో రూ.360 కోట్ల ఆస్తులను ఈడీ జçప్తు చేసింది. అదేవిధంగా అగ్రిగోల్డ్ స్కాంలో రూ.4,141 కోట్ల ఆస్తులను ఈ ఏడాది వరకు దశల వారీగా జప్తు చేసినట్టు పేర్కొంది.
ఇకపోతే రాష్ట్రంలో సంచలనం రేపిన ఈఎస్‌ఐ స్కామ్‌లో కీలక సూత్రధారి దేవికారాణి బినామీల పేర్ల మీద కొనుగోలు చేసిన రూ.144 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు చేసిన అంశాల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది.
మృత్యు‘దారులు’..
రాష్ట్రంలో ఈ ఏడాది ప్రమాదాల్లో రహదారులు నెత్తురోడాయి. కామారెడ్డి జిల్లా బిచ్కుంద వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో బంధువుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. గచ్చిబౌలి పరిధిలోని హెచ్‌సీయూ బస్‌డిపో సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు స్నేహితులు మరణించారు.
ఈ ఘటన ఆ కుటుంబాల్లో విషాదాన్ని నిపంగా, ప్రమాదానికి గురైన కారు రెండు ముక్కలవడం ప్రమాద సమయంలో కారు స్పీడును చెప్పకనే చెబుతోంది. కీసరలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మరణించడం ఆందోళన కల్గించింది.
ఈ ఏడాది పబ్‌ల్లో పీకల దాకా మద్యం సేవించి యువతీ యువకులు వాహనాలు నడపడం వల్ల 14 రోడ్డు ప్రమాదాలు జరిగినట్టు పోలీస్ శాఖ గుర్తించింది. ఇందులో 11 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తంగా 15,600 ప్రమాదాలు జరగ్గా అందులో 4,600 మందికి పైగా మృతిచెందినట్టు పోలీస్ వర్గాల ద్వారా తెలిసింది. 12వేల మందికి పైగా క్షతగ్రాతులైనట్లు సమాచారం.
ఇంటి దొంగలపై సీబీ‘ఐ’
బ్యాంకుల్లో మేనేజర్లుగా పనిచేస్తూ అక్రమార్కులకు సహకరించిన వ్యవహారంలో సీబీఐ పదుల సంఖ్యలో కేసులు నమోదు చేసింది. ఇలా ఈ ఏడాదిలో 13 కేసులు నమోదు చేయగా అందులో 9 కేసుల్లో బ్యాంక్ అధికారుల పాత్ర కీలకంగా ఉందని సీబీఐ పేర్కొంది. మొత్తంగా రూ.600 కోట్లకు పైగా బ్యాంకు అధికారుల సహకారంతో నిందితులు కుచ్చుటోపీ పెట్టినట్టు ఎఫ్‌ఐఆర్‌లలో పేర్కొన్నారు.
పదోన్నతులు వచ్చినా పాతపోస్టుల్లోనే...
పండుగ వచ్చినా పాత పచ్చడేనా అన్న సామెత పోలీస్ శాఖకు ఈ ఏడాది సరిపోతుందన్న చర్చ జరుగుతోంది. పదోన్నతులు వచ్చి ఏళ్లు గడుస్తున్నా అనేక మంది అధికారులు జూనియర్ ర్యాంకు పోస్టుల్లోనే కొనసాగుతున్నారు.
గత ఏడాది పదోన్నతి వచ్చినా ఇంకా పాత పోస్టుల్లోనే కొనసాగగా, ఈ ఏడాది బదిలీ అవుతామని అనుకున్నా అది కూడా అందని ద్రాక్షగా మిగిలింది. ఇకపోతే ఏళ్లకేళ్లుగా ఒకే పోస్టులో కొనసాగుతున్న 40 మంది ఐపీఎస్, ఇతర నాన్‌కేడర్ అధికారులు ఈ ఏడాది బదిలీలు జరుగుతాయని భావించినా అది జరగలేదు. ఇలా ఏడాది నుంచి కలలు కన్నా అవి అడియాశలే అయ్యాయని వారు అసహనంలో మునిగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment