సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకుల విద్యా సంస్థల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) నిర్వహించిన అర్హత పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. ఈనెల 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మొత్తం 19 రోజుల పాటు ఈ పరీక్షలు జరిగాయి. 6,52,413 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా.. 4,93,727 మంది హాజరయ్యారు. పరీక్షలకు సగటున హాజరైన అభ్యర్థుల శాతం 75.68గా నమోదైంది.
గురుకుల బోర్డు ఏకకాలంలో తొమ్మిది నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా దాదాపు 56 విభాగాల్లోని ఉద్యోగాల భర్తీకి సంబంధించి కేవలం 19 రోజుల్లో అత్యంత ప్రణాళికా బద్ధంగా పరీక్షలు నిర్వహించిన టీఆర్‌ఈఐఆర్‌బీ సరికొత్త రికార్డు సృష్టించింది. రోజుకు మూడు షిఫ్టుల్లో పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో ఈ పరీక్షలను టీఆర్‌ఈఐఆర్‌బీ విజయవంతంగా పూర్తి చేసింది. ఇప్పటివరకు గురుకుల బోర్డు నిర్వహించినవన్నీ కంప్యూటర్ ఆధారిత పరీక్షలే కావడంతో మూల్యాంకన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసే వీలుంటుంది.
ముందుగా అభ్యర్థుల జవాబు పత్రాల నకళ్లు, ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాల స్వీకరణ, తుది కీ ఖరారు చేసిన తర్వాత ఫలితాలను విడుదల చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా టీఆర్‌ఈఐఆర్‌బీ నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని సొసైటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. కాగా, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ ఉద్యోగ కేటగిరీలకు సంబంధించి మాస్టర్ క్వశ్చన్ పేపర్లు, కీలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచలేదు. వీటికి సంబంధించి కోర్టులో కేసు ఉండటంతో వెబ్‌సైట్‌లో పెట్టలేదని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ప్రాథమిక కీ పట్ల అభ్యంతరాలుంటే ఈనెల 26వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో సమర్పించాలని గురుకుల బోర్డు కన్వీనర్ మల్లయ్య భట్టు తెలిపారు. ఈ నెలాఖరులోగా తుది కీలు తయారయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తుది కీ విడుదల చేసిన రోజునే అభ్యర్థులు సంబంధిత పరీక్షల్లో సాధించిన మార్కులు సైతం విడుదలవుతాయి. గురుకుల విద్యా సంస్థల్లో టాప్ పోస్టులుగా డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో లైబ్రేరియన్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లకు డెమో పరీక్షలుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment