తెలుగు రాష్ట్రాల హైకోర్టుల్లో 4,94,907 పెండింగ్ కేసులు
తెలంగాణలో ఒక్కో న్యాయమూర్తిపై 9,144, ఏపీలో 8,576 కేసుల భారం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని న్యాయస్థానాలన్నీ కేసుల భారం, విపరీతమైన పని ఒత్తిడితో సతమతమవుతున్నాయి. పెరుగుతున్న కేసుల కొండను కరిగించేంత స్థాయి పరిమాణంలో న్యాయమూర్తులు లేరు. క్రింది స్థాయి కోర్టులు మొదలు హైకోర్టు దాకా చాలా జడ్జీ పోస్టులు ఖాళీలున్నాయి. దీంతో ఉన్న కొద్దిమంది న్యాయమూర్తుల మీదనే విపరీతమైన పని భారం పడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 4,94,907 కేసులు న్యాయస్థానాల్లో పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి.
తెలంగాణలో ఒక్కో న్యాయమూర్తిపై 9,144, ఆంధ్ర ప్రదేశ్‌లో 8,576 కేసుల భారం ఉందని నివేదికలు చెబుతున్నాయి. దేశంలో మొత్తం 4,54,55,345 పెండింగ్ కేసులు ఉండగా.. వాటిలో 57 శాతం సివిల్ కేసులు, 62 శాతం క్రిమినల్ కేసులు ఉన్నాయి. నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ నివేదిక ప్రకారం సుప్రీంకోర్టులో 83,410 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కేసులతో పెండింగ్ భారం విపరీతంగా పెరిగిపోతోందని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రస్తుత పరిస్థితులపై విచారం వ్యక్తం చేసింది.
‘2005 నాటికి ట్రయల్ కోర్టుల్లోని న్యాయమూర్తుల సంఖ్య ప్రతి 10లక్షల జనాభాకు 50 మంది జడ్జిలుగా ఉండాలని 2002లో ఉత్తర్వులు జారీ చేశాం. ఉత్తర్వులు జారీ చేసి 22 సంవత్సరాలు గడిచినా ఈ నిష్పత్తి 2024 ఏడాదిలో ప్రతి 10 లక్షల జనాభాకు కేవలం 25 మంది న్యాయమూర్తులకు చేరుకోలేదు’అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.. ఢిల్లీకి చెందిన ఓ సెషన్స్ జడ్జికి ఉపశమనం కలి్పస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్య చేసింది. సెషన్స్ జడ్జికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ఒక్కో న్యాయమూర్తికి సగటున 2 వేలకు పైగా కేసుల భారం ఉంది.
మూడు హైకోర్టుల్లోని జడ్జీలపైనే అత్యధిక పనిభారం
రాజస్థాన్, మధ్యప్రదేశ్, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులపై దేశంలోనే అత్యధిక పనిభారం ఉందని తెలుస్తోంది. 25 హైకోర్టుల్లో 61,09,862 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దేశంలో పెండింగ్‌లో ఉన్న కేసుల విషయంలో ప్రస్తుతం రాజస్థాన్ హైకోర్టు అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉందని నివేదిక చూపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ 6,56,141 కేసులు పెండింగ్‌లో ఉండగా కేవలం 32 మంది న్యాయమూర్తులు మాత్రమే ఈ కేసుల పరిష్కారానికి బాధ్యత వహిస్తున్నారు. ఇక్కడ సగటున ప్రతి న్యాయమూర్తి 20,504 కేసుల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మొత్తం పాతిక హైకోర్టులలో ఇదే అత్యధికం. దీని తర్వాత మధ్యప్రదేశ్ హైకోర్టు రెండో స్థానంలో నిలిచింది. 4,69,462 కేసుల పరిష్కారం బాధ్యత 35 మంది న్యాయమూర్తులపై ఉంది. ఇక్కడి న్యాయమూర్తిపై సగటున 13 వేల 414 కేసుల భారం ఉంది. అలాగే అలహాబాద్ హైకోర్టు దేశంలోనే మూడో స్థానంలో ఉంది. 10,67,614 కేసులను పరిష్కరించే బాధ్యత 82 మంది న్యాయమూర్తులపై ఉంది.
Comments
Please login to add a commentAdd a comment