Judge posts
-
జడ్జీలపై పెండింగ్ కేసుల కొండ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని న్యాయస్థానాలన్నీ కేసుల భారం, విపరీతమైన పని ఒత్తిడితో సతమతమవుతున్నాయి. పెరుగుతున్న కేసుల కొండను కరిగించేంత స్థాయి పరిమాణంలో న్యాయమూర్తులు లేరు. క్రింది స్థాయి కోర్టులు మొదలు హైకోర్టు దాకా చాలా జడ్జీ పోస్టులు ఖాళీలున్నాయి. దీంతో ఉన్న కొద్దిమంది న్యాయమూర్తుల మీదనే విపరీతమైన పని భారం పడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 4,94,907 కేసులు న్యాయస్థానాల్లో పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. తెలంగాణలో ఒక్కో న్యాయమూర్తిపై 9,144, ఆంధ్ర ప్రదేశ్‌లో 8,576 కేసుల భారం ఉందని నివేదికలు చెబుతున్నాయి. దేశంలో మొత్తం 4,54,55,345 పెండింగ్ కేసులు ఉండగా.. వాటిలో 57 శాతం సివిల్ కేసులు, 62 శాతం క్రిమినల్ కేసులు ఉన్నాయి. నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ నివేదిక ప్రకారం సుప్రీంకోర్టులో 83,410 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కేసులతో పెండింగ్ భారం విపరీతంగా పెరిగిపోతోందని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ల సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రస్తుత పరిస్థితులపై విచారం వ్యక్తం చేసింది. ‘2005 నాటికి ట్రయల్ కోర్టుల్లోని న్యాయమూర్తుల సంఖ్య ప్రతి 10లక్షల జనాభాకు 50 మంది జడ్జిలుగా ఉండాలని 2002లో ఉత్తర్వులు జారీ చేశాం. ఉత్తర్వులు జారీ చేసి 22 సంవత్సరాలు గడిచినా ఈ నిష్పత్తి 2024 ఏడాదిలో ప్రతి 10 లక్షల జనాభాకు కేవలం 25 మంది న్యాయమూర్తులకు చేరుకోలేదు’అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.. ఢిల్లీకి చెందిన ఓ సెషన్స్ జడ్జికి ఉపశమనం కలి్పస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్య చేసింది. సెషన్స్ జడ్జికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ఒక్కో న్యాయమూర్తికి సగటున 2 వేలకు పైగా కేసుల భారం ఉంది. మూడు హైకోర్టుల్లోని జడ్జీలపైనే అత్యధిక పనిభారం రాజస్థాన్, మధ్యప్రదేశ్, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులపై దేశంలోనే అత్యధిక పనిభారం ఉందని తెలుస్తోంది. 25 హైకోర్టుల్లో 61,09,862 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దేశంలో పెండింగ్‌లో ఉన్న కేసుల విషయంలో ప్రస్తుతం రాజస్థాన్ హైకోర్టు అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉందని నివేదిక చూపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ 6,56,141 కేసులు పెండింగ్‌లో ఉండగా కేవలం 32 మంది న్యాయమూర్తులు మాత్రమే ఈ కేసుల పరిష్కారానికి బాధ్యత వహిస్తున్నారు. ఇక్కడ సగటున ప్రతి న్యాయమూర్తి 20,504 కేసుల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మొత్తం పాతిక హైకోర్టులలో ఇదే అత్యధికం. దీని తర్వాత మధ్యప్రదేశ్ హైకోర్టు రెండో స్థానంలో నిలిచింది. 4,69,462 కేసుల పరిష్కారం బాధ్యత 35 మంది న్యాయమూర్తులపై ఉంది. ఇక్కడి న్యాయమూర్తిపై సగటున 13 వేల 414 కేసుల భారం ఉంది. అలాగే అలహాబాద్ హైకోర్టు దేశంలోనే మూడో స్థానంలో ఉంది. 10,67,614 కేసులను పరిష్కరించే బాధ్యత 82 మంది న్యాయమూర్తులపై ఉంది. -
హైకోర్టుల్లో 331 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీలు
సాక్షి, అమరావతి: దేశంలోని వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 331 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే రాష్ట్రాల్లోని జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 5,432 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. సుప్రీం కోర్టుతో పాటు వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపింది.న్యాయమూర్తులు పదవీ విరమణ, రాజీనామాలు, పదోన్నతుల ద్వారా ఖాళీ అయిన న్యాయమూర్తుల పదవులను వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో న్యాయమూర్తుల ఎంపిక, నియామకాల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపింది. అలహాబాద్ హైకోర్టులో అత్యధికంగా 70 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆ తరువాత పంజాబ్, హరియాణ హైకోర్టులో 29 న్యాయమూర్తుల పోస్టులు, బాంబే హైకోర్టులో 25 న్యాయమూర్తుల పోస్టులు, కోల్కత్తా, గుజరాత్ హైకోర్టుల్లో 21 చొప్పున న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది. తెలంగాణలో 16, ఏపీలో 7 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయంది.ఉత్తరప్రదేశ్‌లో జిల్లాలు, సబార్డినేట్ కోర్టుల్లో 1,250 జడ్జిల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, గుజరాత్లో జిల్లాలు, సబార్డినేట్ కోర్టుల్లో 535 న్యాయమూర్తుల పదవులు, బిహార్‌లో జిల్లాలు, సబార్డినేట్ కోర్టుల్లో 467 జడ్జిల పోస్టులు, తమిళనాడులో జిల్లాలు, సబార్డినేట్ కోర్టుల్లో 334 న్యాయమూర్తుల పోస్టులు, రాజస్థాన్‌లో జిల్లాలు, సబార్డినేట్ కోర్టుల్లో 300 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయంది. ఏపీలో జిల్లాలు, సబారి్టనేట్ కోర్టుల్లో 84, తెలంగాణలో 115 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది. -
జిల్లా జడ్జి నియామకాల్లో వర్టికల్ రిజర్వేషన్లు !
సాక్షి, హైదరాబాద్: జిల్లా జడ్జి పోస్టుల నియా మకాల్లో హారిజాంటల్ రిజర్వేషన్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడింది. 9 జిల్లా జడ్డి పోస్టు (ఎంట్రీ లెవల్)లను వర్టికల్ పద్ధతిలో నియమించేందుకు చర్యలు మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఇటీవల నోటిఫికేషన్ ఇవ్వగా, పూర్తిస్థాయి(డిటెయిల్డ్) నోటిఫికేషన్ ఈనెల 14వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంచ నున్నట్టు అధికారులు వెల్లడించారు.ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 9 ఉద్యో గాలకు సంబంధించి రోస్టర్ పాయింట్లను ప్రకటించింది. అయితే ఈ రోస్టర్ వర్టికల్ రిజర్వేషన్ల పద్ధతిలో ఉండడం గమనార్హం. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా జిల్లాజడ్జి పోస్టుల భర్తీలో వర్టికల్ రిజర్వేషన్ విధానం ఉండడంతో అయోమయం నెలకొంది.జిల్లా జడ్జి పోస్టుల భర్తీలో భాగంగా ఈనెల 14వ తేదీ నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించనున్నట్టు అందులో వివరించారు. మే 13వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ పూర్తవుతుందని, ఈ ఏడాది ఆగస్టు 24, 25 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రాథమికంగా ప్రకటించారు. అయితే 9 జిల్లా జడ్జి పోస్టుల్లో మహిళలకు నాలుగు పోస్టులు రిజర్వు చేసింది. ఖాళీ పోస్టులు, రోస్టర్ పాయింట్ల వారీగా ఎలా ఉంటుందో ప్రభుత్వం వెల్లడించింది. -
Hyderabad: తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య పెంపు
-
తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య 75 శాతం పెంచుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆమోద ముద్ర వేశారు. జడ్జిల సంఖ్యను 24 నుంచి 42కు పెంచారు. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫైల్‌కు సీజేఐ ఆమోదం తెలిపారు. న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని హైకోర్టు రెండు సంవత్సరాలుగా సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి మేరకు సీజేఐ కీలక నిర్ణయం తీసుకున్నారు. జడ్జిల సంఖ్యను పెంచటం పట్ల తెలంగాణ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. న్యాయశాఖకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు.. తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య పెంపుపై న్యాయశాఖకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. న్యాయ ప్రక్రియ మరింత వేగవంతమవుతుందన్నారు. చదవండి: లాక్డౌన్: హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు Telangana: పోలీసులకు తీపికబురు -
ఏపీ హైకోర్టులో 18 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 18, తెలంగాణ హైకోర్టులో 10 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీచేయాల్సి ఉందని కేంద్రం తెలిపింది. ఏపీ హైకోర్టుకు 37 మంది న్యాయమూర్తులు మంజూరు కాగా 19 మంది విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపింది. కాంగ్రెస్ సభ్యురాలు జోత్య్స చంద్రస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం లోక్‌సభలో ఈ సమాధానమిచ్చారు. వైఎస్సార్ సీపీ సభ్యుడు అయోధ్యరామిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పురి లిఖితపూర్వక సమాధానమిస్తూ.. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్సీఏపీ)లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 13 పట్టణాలను చేర్చినట్టు వివరించారు. వైఎస్సార్సీపీ సభ్యుడు పరిమళ్ నత్వానీ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధా నంగా.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కింద ఏపీకి 20,28,899 ఇళ్లు మంజూరు చేసినట్టు కేంద్రం తెలిపింది. వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాష్ లోక్‌సభలో సమాధానమిస్తూ.. విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు సంబంధించి విశాఖపట్నం నోడ్ మాస్టర్ ప్లాన్ పనులను రాష్ట్రం ప్రారంభించిందని తెలిపారు. వలస కార్మికుల కోసం అద్దె ఇళ్ల సముదాయాలు వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి లిఖితపూర్వక సమాధానమిస్తూ.. వలస కార్మికులు, అల్పాదాయ వర్గాలు, నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం అద్దె ఇళ్ల సముదాయాలు నిర్మించే పథకాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ సమాధానమిస్తూ.. దేశంలో ఎంఆర్వో సేవలను విస్తృత పరిచేందుకు ఎయిర్ బస్, బోయింగ్ సంయుక్తంగా జీఎంఆర్, ఎయిర్ వర్క్స్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలిపారు. -
పది లక్షల మందికి 19 మంది జడ్జీలు
న్యూఢిల్లీ: దేశంలో ప్రతి పది లక్షల మందికి సరాసరిన 19 మంది చొప్పున జడ్జీలున్నారని కేంద్ర న్యాయ శాఖ వెల్లడించింది. దిగువ కోర్టుల్లోని ఐదు వేల మందితోపాటు దేశవ్యాప్తంగా మొత్తం 6వేల మంది జడ్జీల కొరత ఉందని స్పష్టం చేసింది. పార్లమెంట్లో చర్చ కోసం రూపొందించిన ఈ నివేదికను న్యాయ శాఖ ఈ ఏడాది మార్చిలో తయారు చేసింది. దీని ప్రకారం దేశంలో జడ్జీలు– ప్రజల నిష్పత్తి 10,00,000:19.49గా ఉంది. దిగువ కోర్టుల్లో 5,748, హైకోర్టుల్లో 406 జడ్జీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దిగువ కోర్టుల్లో ఆమోదిత సిబ్బంది సంఖ్య 22,474 కాగా ప్రస్తుతం 16,726 మందే పనిచేస్తున్నారు. అలాగే, హైకోర్టుల్లో 1079 గాను ప్రస్తుతం 673 మంది సిబ్బందే ఉన్నారు. సుప్రీంకోర్టులో 31 మంది న్యాయమూర్తులకు గాను 25 మంది ఉన్నారు. ప్రతి పది లక్షల మంది ప్రజలకు 50 మంది జడ్జీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని 1987లోనే న్యాయ కమిషన్ ప్రతిపాదించగా ఇప్పటికీ ఆ పరిస్థితి మారలేదని 2016లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఆందోళన వ్యక్తం చేశారు. జడ్జీల పోస్టుల్లో ఖాళీల కారణంగా దేశ వ్యాప్తంగా జిల్లా, దిగువ స్థాయి కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య 2.76 కోట్లకు చేరిందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఇటీవల తెలిపారు. -
న్యాయమూర్తుల ఖాళీలు భర్తీ చేయండి
సాక్షి, హైదరాబాద్: పూర్తి స్థాయి సీజేను నియమించాలని, న్యాయమూర్తులను ఖాళీలను భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాద సంఘాలు కోరాయి. గురువారం ఢిల్లీలో జస్టిస్ మిశ్రాతో న్యాయవాద సంఘాల ప్రతినిధులు భేటీ అయ్యారు. ఉమ్మడి హైకోర్టుకు పూర్తి స్థాయి ప్రధాన న్యాయమూర్తిని నియమించాలని కోరుతూ ఇటీవల రెండు సంఘాల ఆధ్వర్యంలో న్యాయవాదులు రెండ్రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. దీనిపై చర్చించేందుకు ఇరు సంఘాల ప్రతినిధుల ను సీజేఐ ఆహ్వానించడంతో వారు ఢిల్లీకి వెళ్లారు. జస్టిస్ మిశ్రాను శాలువాతో సన్మానించారు. పూర్తి స్థాయి సీజేను నియమించే విషయంలో తాము తీసుకున్న చర్యల గురిం చి సీజేఐ వారికి చెప్పారు. హైకోర్టులో తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడం వల్ల కక్షిదారులు, న్యాయవాదులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారు సీజేఐ దృష్టికి తీసుకొచ్చారు. పెండింగ్ కేసుల గురించి వివరించా రు. సమస్యల పరిష్కారానికి వీలైనంత త్వరగా తగిన నిర్ణ యం తీసుకుంటామని సీజేఐ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. సీజేఐని కలసిన వారిలో తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జెల్లి కనకయ్య, ఉపాధ్యక్షుడు ఎస్.సురేందర్‌రెడ్డి, కార్యదర్శి పి.సుజాత, సంయుక్త కార్యదర్శి ఎస్.చంద్రమోహన్‌రెడ్డి, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సీహెచ్.ధనంజయ, ఉపాధ్యక్షుడు పి.ఆనంద్ శేషు, కార్యదర్శులు జ్యోతి ప్రసాద్, బాచిన హనుమంతరావు, సంయుక్త కార్యదర్శి రూపేశ్‌కుమార్‌రెడ్డి తదితరులున్నారు. -
విధులు బహిష్కరించిన న్యాయవాదులు
సాక్షి, హైదరాబాద్: న్యాయమూర్తుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ ఉమ్మడి హైకోర్టు న్యాయవాదులు గురువారం విధులను బహిష్కరించారు. హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, సీఆర్పీసీ సెక్షన్ 41ఏ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉదయం 11 గంటల సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల న్యాయవాదుల సంఘాల అధ్యక్షులు జల్లి కనకయ్య, సీహెచ్ ధనంజయల నేతృత్వంలో న్యాయవాదులంతా హైకోర్టు బార్ కౌన్సిల్ నుంచి చార్మినార్ గుల్జార్‌హౌస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నిలిచిపోయిన విచారణలు.. తొలుత హైకోర్టు పనివేళలు ప్రారంభం కాగానే న్యాయమూర్తులంతా కేసులను విచారించేందుకు కోర్టు హాళ్లలోకి వచ్చారు. కానీ న్యాయవాదులెవరూ హాజరుకాలేదు. కొందరు న్యాయవాదులు కోర్టు హాళ్లకు వెళ్లి.. తమ విధుల బహిష్కరణ విషయాన్ని న్యాయమూర్తుల దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు సహకరించాలని కోరారు. దీనిపై స్పందించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం.. వాదనలు వినిపించేందుకు హాజరుకాని న్యాయవాదుల కేసులను కొట్టివేయబోమని, వాదనలు వినిపించేందుకు న్యాయవాదులు వస్తే విచారణలు జరుపుతామని స్పష్టం చేసింది. అయితే న్యాయవాదులెవరూ వాదనలు వినిపించేందుకు కోర్టు హాళ్లకు వెళ్లలేదు. దాంతో కొద్దిసేపటి తర్వాత న్యాయమూర్తులు బెంచ్‌లు దిగి చాంబర్లలోకి వెళ్లిపోయారు. ఇక కొన్ని అత్యవసర కేసులపై మాత్రం ఒకరిద్దరు న్యాయమూర్తులు విచారణను కొనసాగించారు. న్యాయవాద సంఘాల తీర్మానంతో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల న్యాయవాద సంఘాల సర్వ సభ్య సమావేశం ఫిబ్రవరి 27న జరిగింది. ఈ సందర్భంగా.. హైకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి, పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిని నియమించేందుకు కేంద్రం, సుప్రీంకోర్టు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. అలాగే 2012లోపు దాఖలైన కేసులను నిర్దిష్ట కాల పరిమితిలోగా పరిష్కరించాలంటూ జారీ చేసిన సర్క్యులర్‌ను సుప్రీంకోర్టు ఉపసంహరించుకోవాలని, సీఆర్పీసీ సెక్షన్ 41ఏ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఈ డిమాండ్ల సాధన కోసం మార్చి 1, 2 తేదీల్లో విధులను బహిష్కరించాలని నిర్ణయించారు. దాని ప్రకారం తాజాగా విధుల బహిష్కరణ చేపట్టారు. భారీగా ర్యాలీ.. ఆందోళన విధులు బహిష్కరించిన న్యాయవాదులంతా బార్ కౌన్సిల్ గేటు నుంచి గుల్జార్‌హౌస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మదీనా చౌరస్తా వద్ద కొంతసేపు బైఠాయించారు. గుల్జార్‌హౌస్ వద్ద పెద్దపెట్టున నినాదాలు చేస్తూ కొంతసేపు ఆందోళన నిర్వహించారు. కాగా న్యాయవాదుల ఆందోళన నేపథ్యంలో హైకోర్టు, పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం కూడా విధుల బహిష్కరణ కొనసాగనుంది. -
మా నిబంధనలతోనే ‘జడ్జి’ పోస్టుల భర్తీ
♦ హైకోర్టుకు నివేదించిన తెలంగాణ ఏజీ ♦ లోతుగా విచారణ జరుపుతామన్న ధర్మాసనం ♦ విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా సాక్షి, హైదరాబాద్: జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) పోస్టులను తెలంగాణ జ్యుడీషియల్ సర్వీసు నిబంధనలను అనుసరించి భర్తీ చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. రాష్ట్ర విభజన తరవాత కూడా ఏపీ నిబంధనల ప్రకారం వాటిని భర్తీ చేయడం సరికాదని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ‘‘ఏపీ నిబంధనల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడితే తెలంగాణ అభ్యర్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. జేసీజే పోస్టుల భర్తీ కోసం 2014, 2015ల్లో జారీ చేసిన నోటిఫికేషన్లను రద్దు చేసి తెలంగాణ జ్యుడీషియల్ సర్వీసు నిబంధనల ఆధారంగా మళ్లీ పరీక్షలు నిర్వహించాలి’’ అని ఆయన కోర్టును కోరారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ హైకోర్టు హైదరాబాద్ హైకోర్టుగా నామాంతరం చెందిందని, ఏపీకి హైకోర్టు ఏర్పాటయ్యేదాకా ఉమ్మడి హైకోర్టు ఉంటుందని పునర్విభజన చట్టం చెబుతోందని కోర్టు దృష్టికి తెచ్చారు. కాబట్టి హైదరాబాద్ హైకోర్టు పరిధిలోని పోస్టులను ఏపీ నిబంధనలతో భర్తీచేయడం న్యాయ సమ్మతం కాదన్నారు. ఈ విషయాలన్నింటిపై లోతుగా విచారణ చేపట్టాల్సిన అవసరముందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో కోర్టుకు సహాయపడేందుకు సీనియర్ న్యాయవాదిని అమికస్ క్యూరీ (కోర్టు సహాయకారి)గా నియమిస్తామని పేర్కొంటూ తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. విభజన నేపథ్యంలో కిందిస్థాయి న్యాయవ్యవస్థలో విభజన పూర్తయేదాకా జేసీజే పోస్టులను భర్తీ చేయరాదంటూ సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి, మరికొందరు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ధర్మాసనం బుధవారం తుది విచారణ ప్రారంభించింది. తాము చట్టం చెబుతున్న దాన్నే అమలు చేయాలంటున్నామని కె.రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా వాదించారు. ‘‘తెలంగాణకు ప్రత్యేక సర్వీసు నిబంధనలున్నాయి. వాటి ప్రకారం పోస్టులను భర్తీ చేయాలని చెబుతున్న ప్రభుత్వం, రేపు జేసీజే రాతపరీక్ష, ఇంటర్వ్యూల్లో అర్హత సాధించిన వారికి నియామక పత్రాలివ్వబోమంటే చాలా సమస్యలు ఎదురవుతాయి’’ అని పిటిషనర్ సత్యంరెడ్డి వాదించారు. తామిప్పటికే కిందిస్థాయి విభజన ప్రక్రియను ప్రారంభించామని ధర్మాసనం పేర్కొంది. ‘‘న్యాయాధికారులందరినీ ఆప్షన్లు కోరాం. ఫిబ్రవరి 10 కల్లా అవి అందుతాయి. ఆ తరవాత విభజన కమిటీ తగిన నిర్ణయం తీసుకుంటుంది’’ అని స్పష్టం చేసింది. తెలంగాణ సర్వీసు నిబంధనల ప్రకారమే పోస్టులను భర్తీ చేయాలంటే 2014, 2015ల్లో జారీ చేసిన జేసీజే నోటిఫికేషన్లను రద్దు చేయాల్సి ఉంటుం దని వ్యాఖ్యానించింది. అలాగే రద్దు చేసి తెలంగాణ సర్వీసు నిబంధనల ప్రకారం తిరిగి పరీక్షలు నిర్వహించాలని సత్యంరెడ్డి కోరారు. జేసీజే పోస్టుల రాతపరీక్షకు తెలంగాణ అభ్యర్థులే అధికంగా హాజరయ్యారని, నోటిఫికేషన్లను రద్దు చేస్తే వారంతా ఇబ్బంది పడతారని ధర్మాసనం అభిప్రాయపడింది. జేసీజే అభ్యర్థులను వారి స్థానికత అధారంగా విభజిస్తే సమస్య కొంతవరకు పరిష్కారమవుతుందని సత్యంరెడ్డి ప్రతిపాదించారు. వీటిపై లోతుగా విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది. ఇదే సమయంలో ఏపీ అడ్వకేట్ జనరల్ పి.వేణుగోపాల్ హైకోర్టు తరఫు న్యాయవాది హోదాలో వాదనలు వినిపిస్తుండటంపై సత్యంరెడ్డి, రామకృష్ణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేసు నుంచి ఆయనను పక్కన పెడుతున్నట్టు ధర్మాసనం పేర్కొంది.