గురువారం హైకోర్టు ఎదుట ఆందోళన నిర్వహిస్తున్న న్యాయవాదులు
సాక్షి, హైదరాబాద్: న్యాయమూర్తుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ ఉమ్మడి హైకోర్టు న్యాయవాదులు గురువారం విధులను బహిష్కరించారు. హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, సీఆర్పీసీ సెక్షన్ 41ఏ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉదయం 11 గంటల సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల న్యాయవాదుల సంఘాల అధ్యక్షులు జల్లి కనకయ్య, సీహెచ్ ధనంజయల నేతృత్వంలో న్యాయవాదులంతా హైకోర్టు బార్ కౌన్సిల్ నుంచి చార్మినార్ గుల్జార్‌హౌస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
నిలిచిపోయిన విచారణలు..
తొలుత హైకోర్టు పనివేళలు ప్రారంభం కాగానే న్యాయమూర్తులంతా కేసులను విచారించేందుకు కోర్టు హాళ్లలోకి వచ్చారు. కానీ న్యాయవాదులెవరూ హాజరుకాలేదు. కొందరు న్యాయవాదులు కోర్టు హాళ్లకు వెళ్లి.. తమ విధుల బహిష్కరణ విషయాన్ని న్యాయమూర్తుల దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు సహకరించాలని కోరారు. దీనిపై స్పందించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం.. వాదనలు వినిపించేందుకు హాజరుకాని న్యాయవాదుల కేసులను కొట్టివేయబోమని, వాదనలు వినిపించేందుకు న్యాయవాదులు వస్తే విచారణలు జరుపుతామని స్పష్టం చేసింది. అయితే న్యాయవాదులెవరూ వాదనలు వినిపించేందుకు కోర్టు హాళ్లకు వెళ్లలేదు. దాంతో కొద్దిసేపటి తర్వాత న్యాయమూర్తులు బెంచ్‌లు దిగి చాంబర్లలోకి వెళ్లిపోయారు. ఇక కొన్ని అత్యవసర కేసులపై మాత్రం ఒకరిద్దరు న్యాయమూర్తులు విచారణను కొనసాగించారు.
న్యాయవాద సంఘాల తీర్మానంతో..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల న్యాయవాద సంఘాల సర్వ సభ్య సమావేశం ఫిబ్రవరి 27న జరిగింది. ఈ సందర్భంగా.. హైకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి, పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిని నియమించేందుకు కేంద్రం, సుప్రీంకోర్టు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. అలాగే 2012లోపు దాఖలైన కేసులను నిర్దిష్ట కాల పరిమితిలోగా పరిష్కరించాలంటూ జారీ చేసిన సర్క్యులర్‌ను సుప్రీంకోర్టు ఉపసంహరించుకోవాలని, సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఈ డిమాండ్ల సాధన కోసం మార్చి 1, 2 తేదీల్లో విధులను బహిష్కరించాలని నిర్ణయించారు. దాని ప్రకారం తాజాగా విధుల బహిష్కరణ చేపట్టారు.
భారీగా ర్యాలీ.. ఆందోళన
విధులు బహిష్కరించిన న్యాయవాదులంతా బార్ కౌన్సిల్ గేటు నుంచి గుల్జార్‌హౌస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మదీనా చౌరస్తా వద్ద కొంతసేపు బైఠాయించారు. గుల్జార్‌హౌస్ వద్ద పెద్దపెట్టున నినాదాలు చేస్తూ కొంతసేపు ఆందోళన నిర్వహించారు. కాగా న్యాయవాదుల ఆందోళన నేపథ్యంలో హైకోర్టు, పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం కూడా విధుల బహిష్కరణ కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment