సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటుకు వీలుగా అన్ని వసతులు ఏర్పాటవుతున్న నేపథ్యంలో ఇక ఉమ్మడి హైకోర్టు విభజనకు వీలుగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జనవరి 1, 2019లోగా ఈ నోటిఫికేషన్ వెలువడుతుందని తాము ఆశిస్తున్నామని, తద్వారా రెండు రాష్ట్రాల్లో రెండు హైకోర్టులు వేర్వేరుగా విధులు నిర్వర్తిస్తాయని, ఏపీ హైకోర్టు నూతన భవనంలో త్వరగా తమ విధులు నిర్వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ హైకోర్టును ఆ రాష్ట్ర భూభాగంలో ఏర్పాటు చేయాలంటూ 2015లో ధన్‌గోపాల్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేంద్రప్రభుత్వం ఇటీవల స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు జారీచేసింది. విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తరపున సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ డిసెంబర్ 15లోగా హైకోర్టు తాత్కాలిక భవనం నిర్మాణం పూర్తవుతుందని. న్యాయమూర్తులకోసం తాత్కాలికంగా విల్లాలను అద్దెకు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెబుతూ ఆ మేరకు అఫిడవిట్ సమర్పించారు. అలాగే హైకోర్టు రిజిస్ట్రీ కూడా ఒక అఫిడవిట్ సమర్పించింది.
ప్రతిపాదిత తాత్కాలిక హైకోర్టు భవనాల నిర్మాణంపై తనిఖీకోసం ఏర్పాటు చేసిన ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ కూడా సంతృప్తి వ్యక్తం చేసిందని, అక్కడికి వెళ్లేందుకు న్యాయమూర్తులు సిద్ధంగా లేరన్న అభిప్రాయం సరికాదని ఈ అఫిడవిట్‌లో పేర్కొంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీచేస్తున్నట్టు పేర్కొంది. ‘‘డిసెంబర్ 15, 2018 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో తాత్కాలిక హైకోర్టు భవనం సిద్ధమవుతుంది. ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తులుగా వెళ్లనున్న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు ఈ భవనంలోని వసతులపై సంతృప్తి చెందారు. అమరావతిలో ‘జస్టిస్ సిటీ’పేరుతో భారీ కాంప్లెక్స్ నిర్మాణంలో ఉంది. హైకోర్టు, సబార్డినేట్ కోర్టులు, ట్రిబ్యునళ్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. న్యాయమూర్తులు, సబార్డినేట్ జ్యుడీషియల్ అధికారులకు వసతి కల్పించేందుకు రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మించుకునే వెసులుబాటు కూడా ఉంది. అందువల్ల జస్టిస్ సిటీ నిర్మాణం పూర్తయ్యేంతవరకు తాత్కాలిక భవనంలో హైకోర్టు విధులు నిర్వర్తించవచ్చు. అవసరమైన అన్ని వసతులు సమకూరినందున ఇక హైకోర్టును విభజించేందుకు నోటిఫికేషన్ ఇవ్వడంలో కేంద్రప్రభుత్వానికి ఎలాంటి ఆంక్షలూ లేవు. ఈ నోటిఫికేషన్ జనవరి 1, 2019లోగా వెలువడుతుందని ఆశిస్తున్నాం. తద్వారా రెండు హైకోర్టులు వేర్వేరుగా కార్యకలాపాలు నిర్వర్తిస్తాయని, ఏపీ హైకోర్టు కూడా నూతన భవనంలో వీలైనంత త్వరగా కార్యకలాపాలు నిర్వర్తిస్తుంద ని ఆశిస్తున్నాం’’అని ధర్మాసనం పేర్కొంది.
కోమటిరెడ్డి, సంపత్ కేసు తీర్పుపై స్టే పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్ కుమార్‌లను బహిష్కరించడం చెల్లదని సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పు అమలును నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన స్టేను మరో మూడు వారాలు పొడిగిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ/న్యాయ శాఖల కార్యదర్శులు దాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాలు సోమవారం మరోసారి విచారణకు వచ్చాయి. సింగిల్ జడ్జి తీర్పుపై స్టే గడువు ముగిసిందని, తిరిగి పొడిగిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ కోరారు. దీంతో ఉత్తర్వుల్ని మరో మూడు వారాలు పొడిగిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. అనంతరం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
జనవరి 1లోగా నోటిఫికేషన్ ఇస్తారని ఆశిస్తున్నాం
Published Tue, Nov 6 2018 1:56 AM | Last Updated on Tue, Nov 6 2018 1:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment