మా నిబంధనలతోనే ‘జడ్జి’ పోస్టుల భర్తీ
♦ హైకోర్టుకు నివేదించిన తెలంగాణ ఏజీ
♦ లోతుగా విచారణ జరుపుతామన్న ధర్మాసనం
♦ విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) పోస్టులను తెలంగాణ జ్యుడీషియల్ సర్వీసు నిబంధనలను అనుసరించి భర్తీ చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. రాష్ట్ర విభజన తరవాత కూడా ఏపీ నిబంధనల ప్రకారం వాటిని భర్తీ చేయడం సరికాదని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ‘‘ఏపీ నిబంధనల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడితే తెలంగాణ అభ్యర్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
జేసీజే పోస్టుల భర్తీ కోసం 2014, 2015ల్లో జారీ చేసిన నోటిఫికేషన్లను రద్దు చేసి తెలంగాణ జ్యుడీషియల్ సర్వీసు నిబంధనల ఆధారంగా మళ్లీ పరీక్షలు నిర్వహించాలి’’ అని ఆయన కోర్టును కోరారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ హైకోర్టు హైదరాబాద్ హైకోర్టుగా నామాంతరం చెందిందని, ఏపీకి హైకోర్టు ఏర్పాటయ్యేదాకా ఉమ్మడి హైకోర్టు ఉంటుందని పునర్విభజన చట్టం చెబుతోందని కోర్టు దృష్టికి తెచ్చారు. కాబట్టి హైదరాబాద్ హైకోర్టు పరిధిలోని పోస్టులను ఏపీ నిబంధనలతో భర్తీచేయడం న్యాయ సమ్మతం కాదన్నారు.
ఈ విషయాలన్నింటిపై లోతుగా విచారణ చేపట్టాల్సిన అవసరముందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో కోర్టుకు సహాయపడేందుకు సీనియర్ న్యాయవాదిని అమికస్ క్యూరీ (కోర్టు సహాయకారి)గా నియమిస్తామని పేర్కొంటూ తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
విభజన నేపథ్యంలో కిందిస్థాయి న్యాయవ్యవస్థలో విభజన పూర్తయేదాకా జేసీజే పోస్టులను భర్తీ చేయరాదంటూ సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి, మరికొందరు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ధర్మాసనం బుధవారం తుది విచారణ ప్రారంభించింది. తాము చట్టం చెబుతున్న దాన్నే అమలు చేయాలంటున్నామని కె.రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా వాదించారు.
‘‘తెలంగాణకు ప్రత్యేక సర్వీసు నిబంధనలున్నాయి. వాటి ప్రకారం పోస్టులను భర్తీ చేయాలని చెబుతున్న ప్రభుత్వం, రేపు జేసీజే రాతపరీక్ష, ఇంటర్వ్యూల్లో అర్హత సాధించిన వారికి నియామక పత్రాలివ్వబోమంటే చాలా సమస్యలు ఎదురవుతాయి’’ అని పిటిషనర్ సత్యంరెడ్డి వాదించారు. తామిప్పటికే కిందిస్థాయి విభజన ప్రక్రియను ప్రారంభించామని ధర్మాసనం పేర్కొంది. ‘‘న్యాయాధికారులందరినీ ఆప్షన్లు కోరాం. ఫిబ్రవరి 10 కల్లా అవి అందుతాయి. ఆ తరవాత విభజన కమిటీ తగిన నిర్ణయం తీసుకుంటుంది’’ అని స్పష్టం చేసింది. తెలంగాణ సర్వీసు నిబంధనల ప్రకారమే పోస్టులను భర్తీ చేయాలంటే 2014, 2015ల్లో జారీ చేసిన జేసీజే నోటిఫికేషన్లను రద్దు చేయాల్సి ఉంటుం దని వ్యాఖ్యానించింది.
అలాగే రద్దు చేసి తెలంగాణ సర్వీసు నిబంధనల ప్రకారం తిరిగి పరీక్షలు నిర్వహించాలని సత్యంరెడ్డి కోరారు. జేసీజే పోస్టుల రాతపరీక్షకు తెలంగాణ అభ్యర్థులే అధికంగా హాజరయ్యారని, నోటిఫికేషన్లను రద్దు చేస్తే వారంతా ఇబ్బంది పడతారని ధర్మాసనం అభిప్రాయపడింది. జేసీజే అభ్యర్థులను వారి స్థానికత అధారంగా విభజిస్తే సమస్య కొంతవరకు పరిష్కారమవుతుందని సత్యంరెడ్డి ప్రతిపాదించారు. వీటిపై లోతుగా విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది. ఇదే సమయంలో ఏపీ అడ్వకేట్ జనరల్ పి.వేణుగోపాల్ హైకోర్టు తరఫు న్యాయవాది హోదాలో వాదనలు వినిపిస్తుండటంపై సత్యంరెడ్డి, రామకృష్ణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేసు నుంచి ఆయనను పక్కన పెడుతున్నట్టు ధర్మాసనం పేర్కొంది.