వైద్య పోస్టుల భర్తీలో పారదర్శకతకు కూటమి ప్రభుత్వం పాతర
ఏఆర్‌టీ సెంటర్స్‌లో ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా భర్తీ చేస్తున్న వైద్య శాఖ
నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేయాలని చెప్పిన న్యాకో
నిబంధనలకు విరుద్ధమైన నియామకాలను సమర్ధించుకుంటున్న వైద్య శాఖ
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం పారదర్శక పాలనకు పాతరేసింది. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల నియామకాల్లో కనీస నిబంధనలు పాటించడంలేదు. గోప్యంగా ప్రైవేట్ అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా కావాల్సిన వారికి పోస్టులు కట్టబెడుతోంది. తాజాగా ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (శాక్స్)లో వైద్య పోస్టులను ప్రైవేట్ అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా వైద్య శాఖ భర్తీ చేయడం విమర్శలకు దారితీసింది. ఎయిడ్స్ రోగులకు చికిత్స అందించే యాంటి రెట్రోవైరల్ థెరఫీ (ఏఆర్‌టీ) సెంటర్స్‌లో మెడికల్ ఆఫీసర్(ఎంవో) పోస్టులను బహిరంగ నోటిఫికేషన్ ఇవ్వకుండానే హార్మోని కన్సల్టెన్సీ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇదే విధానంలో మంగళవారం ముగ్గురు వైద్యులను నియమించారు. ఈ వ్యవహారంపై ‘నోటిఫికేషన్ ఇవ్వకుండా వైద్యుల నియామకమా?’ శీర్షికతో బుధవారం “సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో న్యాకో మార్గదర్శకాలను అనుసరించే ఔట్‌సోర్సింగ్‌లో వైద్యులను నియమిస్తున్నామని శాక్స్ అధికారులు సమర్ధించుకున్నారు.
వాస్తవానికి ఏఆర్‌టీ సెంటర్స్‌లో వైద్య, ఇతర సిబ్బంది పోస్టులను బహిరంగ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని జాతీయ ఏఆర్‌టీ సేవల నిర్వహణ మార్గదర్శకాలు–2021లోనే న్యాకో స్పష్టంగా చెప్పింది. ఒక పోస్టుకు ఐదు దరఖాస్తులు దాటితే రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ప్రతిభ కలిగిన వారిని నియమించాలని న్యాకో నిబంధనలు చెబుతున్నాయి. ఈ నిబంధనలను అనుసరిస్తూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో శాక్స్ పోస్టులను డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా భర్తీ చేశారు. తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిస్సా వంటి రాష్ట్రాల్లో శాక్స్‌లో సమన్వయకర్తలు, వైద్యులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఇతర సిబ్బంది పోస్టులన్నింటినీ బహిరంగ నోటిఫికేషన్ ఇచ్చి, దరఖాస్తులు ఆహ్వనించి, ఆర్‌ఓఆర్ పాటిస్తూ ప్రతిభ కలిగిన, అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేస్తున్నారు.
రూ. లక్షల్లో వసూళ్లు
కూటమి ప్రభుత్వం మాత్రం న్యాకో నిబంధనలంటూ ఔట్‌సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తోంది. ప్రస్తుతం భర్తీ చేస్తున్న వైద్యులకు నెలకు రూ.72 వేల వేతనం ఉంటుంది. ఎన్‌హెచ్‌ఎం పరిధిలో ఇంతకంటే తక్కువ వేతనం ఇస్తున్నారు. దీంతో ఏఆర్‌టీ సెంటర్లలో వేతనం కొంత ఎక్కువ, పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది. వీటికి బహిరంగ నోటిఫికేషన్ ఇస్తే ఎక్కువ మంది యువ వైద్యులు ముందుకు వస్తారని వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయినా, అర్హులకు అన్యాయం చేస్తూ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా పోస్టులు భర్తీ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఇందుకోసం అవుట్‌సోర్సింగ్ రూ. లక్షల్లో ముడుపులు చేతులు మారినట్టు ఆరోపణలున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక శాక్స్‌లో ఇదే తరహాలో క్లస్టర్ ప్రివెన్షన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేశారు. అప్పట్లో ఓ కీలక అధికారి బంధువుకు గుంటూరు జిల్లాలో ఓ పోస్టును కట్టబెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment