Outsourcing agency
-
ఔట్‌సోర్సింగ్‌లో నియమించుకోమని న్యాకోనే చెప్పిందట!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం పారదర్శక పాలనకు పాతరేసింది. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల నియామకాల్లో కనీస నిబంధనలు పాటించడంలేదు. గోప్యంగా ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా కావాల్సిన వారికి పోస్టులు కట్టబెడుతోంది. తాజాగా ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (శాక్స్)లో వైద్య పోస్టులను ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా వైద్య శాఖ భర్తీ చేయడం విమర్శలకు దారితీసింది. ఎయిడ్స్ రోగులకు చికిత్స అందించే యాంటి రెట్రోవైరల్ థెరఫీ (ఏఆర్టీ) సెంటర్స్‌లో మెడికల్ ఆఫీసర్(ఎంవో) పోస్టులను బహిరంగ నోటిఫికేషన్ ఇవ్వకుండానే హార్మోని కన్సల్టెన్సీ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇదే విధానంలో మంగళవారం ముగ్గురు వైద్యులను నియమించారు. ఈ వ్యవహారంపై ‘నోటిఫికేషన్ ఇవ్వకుండా వైద్యుల నియామకమా?’ శీర్షికతో బుధవారం “సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో న్యాకో మార్గదర్శకాలను అనుసరించే ఔట్‌సోర్సింగ్‌లో వైద్యులను నియమిస్తున్నామని శాక్స్ అధికారులు సమర్ధించుకున్నారు.వాస్తవానికి ఏఆర్టీ సెంటర్స్‌లో వైద్య, ఇతర సిబ్బంది పోస్టులను బహిరంగ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని జాతీయ ఏఆర్టీ సేవల నిర్వహణ మార్గదర్శకాలు–2021లోనే న్యాకో స్పష్టంగా చెప్పింది. ఒక పోస్టుకు ఐదు దరఖాస్తులు దాటితే రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ప్రతిభ కలిగిన వారిని నియమించాలని న్యాకో నిబంధనలు చెబుతున్నాయి. ఈ నిబంధనలను అనుసరిస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో శాక్స్ పోస్టులను డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా భర్తీ చేశారు. తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిస్సా వంటి రాష్ట్రాల్లో శాక్స్‌లో సమన్వయకర్తలు, వైద్యులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఇతర సిబ్బంది పోస్టులన్నింటినీ బహిరంగ నోటిఫికేషన్ ఇచ్చి, దరఖాస్తులు ఆహ్వనించి, ఆర్ఓఆర్ పాటిస్తూ ప్రతిభ కలిగిన, అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేస్తున్నారు. రూ. లక్షల్లో వసూళ్లుకూటమి ప్రభుత్వం మాత్రం న్యాకో నిబంధనలంటూ ఔట్సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తోంది. ప్రస్తుతం భర్తీ చేస్తున్న వైద్యులకు నెలకు రూ.72 వేల వేతనం ఉంటుంది. ఎన్హెచ్ఎం పరిధిలో ఇంతకంటే తక్కువ వేతనం ఇస్తున్నారు. దీంతో ఏఆర్టీ సెంటర్లలో వేతనం కొంత ఎక్కువ, పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది. వీటికి బహిరంగ నోటిఫికేషన్ ఇస్తే ఎక్కువ మంది యువ వైద్యులు ముందుకు వస్తారని వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయినా, అర్హులకు అన్యాయం చేస్తూ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా పోస్టులు భర్తీ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఇందుకోసం అవుట్సోర్సింగ్ రూ. లక్షల్లో ముడుపులు చేతులు మారినట్టు ఆరోపణలున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక శాక్స్‌లో ఇదే తరహాలో క్లస్టర్ ప్రివెన్షన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేశారు. అప్పట్లో ఓ కీలక అధికారి బంధువుకు గుంటూరు జిల్లాలో ఓ పోస్టును కట్టబెట్టారు. -
అడిగినంత ఇచ్చుకో.. అడ్డగోలుగా చేసుకో
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలోని ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యవహారం అటు అధికారులకు, ఇటు కాంట్రాక్టర్లకు ఇబ్బందికరంగా మారింది. కాంట్రాక్టు పనుల్లో తన కమీషన్‌తో పాటు అధికారుల వాటా తనకే ఇవ్వాలంటూ కాంట్రాక్టర్లకు తెగేసి చెబుతున్నారు. తనకు కమీషన్లు ఇవ్వకపోతే పనులు మొదలుపెట్టనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఎవరైనా టెండర్లో పనులు దక్కించుకుంటే.. సదరు కాంట్రాక్టర్ తనను కలిసేదాకా పనులు మొదలుపెట్టకుండా చూడాలని అధికారులకు సైతం హుకుం జారీచేస్తున్నారు. ఫలితంగా అటు కాంట్రాక్టర్లు, ఇటు అధికారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. సదరు ఎమ్మెల్యేకు దగ్గరగా ఉన్న కాంట్రాక్టర్లు మాత్రం కమీషన్ ఇచ్చామనే ధైర్యంతో పనులు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. వారిని అధికారులు సైతం ఏమీ అనలేని పరిస్థితి. టెండర్ దక్కించుకున్న ‘సాధారణ’ కాంట్రాక్టర్లు పనులు మొదలుపెడదామనుకుంటే.. ఎమ్మెల్యేను కలిసిన తర్వాతే ముందుకు సాగాలని నేరుగా అధికారులే చెబుతుండడంతో ఏమి చేయాలో వారికి పాలుపోవడం లేదు. సదరు ఎమ్మెల్యేను కలిస్తే.. అధికారుల వాటా కూడా కలిపి మొత్తం తనకే ఇవ్వాలని తేల్చిచెబుతుండడంతో కాంట్రాక్టర్లు నోరెళ్లబెడుతున్నారు. ఒకవేళ ఇచ్చేందుకు నిరాకరిస్తే నెలల తరబడి పనులు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని కాంట్రాక్టర్లతో పాటు అధికారులు వాపోతున్నారు. కక్కలేక..మింగలేక.. వాస్తవానికి ప్రభుత్వ శాఖలో ఏ పని చేయాలన్నా అధికారులకు అంతో ఇంతో కమీషన్ ఇచ్చుకోవడం రివాజుగా మారింది. ఇక అధికార పార్టీ నేతలకు కమీషన్ల వ్యవహారానికి వస్తే స్థానిక నేత వ్యవహారశైలిని బట్టి ఉంటుంది. అయితే, జిల్లాలో మాత్రం ఒక అధికారపార్టీ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటోంది. ఏ పనికి టెండర్ పిలిచినా.. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఆయన్ను కలిసిన తర్వాతే ముందుకు వెళ్లే పరిస్థితి. గతంలో కర్నూలు సర్వజన ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకులు ఆయన్ను కలిసి.. ఆయన చెప్పినట్టుగా ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతే ముందుకు వెళ్లారు. రోడ్డు పనులతో పాటు వివిధ బిల్డింగ్‌ల నిర్మాణం విషయంలోనూ ఇదే పరిస్థితి. మునిసిపాలిటీలో చేపడుతున్న కాంట్రాక్టు పనులు కూడా ఇతరులకు ఎవ్వరికీ దక్కకుండా చేస్తున్నారు. ఒకవేళ ఇతరులకు దక్కినా.. సబ్ కాంట్రాక్టు కింద తాము చెప్పిన వారికే ఇవ్వాలని అంటున్నారని తెలుస్తోంది. పైగా సదరు సబ్ కాంట్రాక్టర్ల నుంచి ముందుగానే కమీషన్లు దండుకుంటున్నట్టు సమాచారం. వారు ఎటువంటి నాణ్యత లేకుండా పనిచేసినప్పటికీ అధికారులు మాత్రం చూసీచూడనట్టు వ్యవహరించాల్సి వస్తోంది. అటువైపు వెళితే ఒట్టు! అధికార పార్టీ ఎమ్మెల్యే సిఫారసుతో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కనీస నాణ్యత లేకుండానే పనులు కానిస్తున్నారు. అయినప్పటికీ అధికారులు కనీసం అటువైపుగా చూడడం లేదు. వాస్తవానికి అధికారులు పనులు జరుగుతున్న ప్రాంతంలోకి వెళ్లి.. టెండర్ నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్నాయా, లేదా అనేది చూడాలి. ఒకవేళ నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే నోటీసు జారీచేయాలి. అయితే, సదరు ఎమ్మెల్యే నియోజకవర్గంలో జరుగుతున్న ఏ పనులనూ అధికారులు పరిశీలించే సాహసం చేయడం లేదు. -
కోత కోసి.. కొల్లగొట్టి!
ఉస్మానియాలో అవినీతి కంపు పీఎఫ్ పేరుతో కార్మికుల వేతనాల్లో కోత వ్యక్తిగత ఖాతాలు తెరవని ఔట్సోర్సింగ్ ఏజెన్సీ సిటీబ్యూరో: ఉస్మానియా జనరల్ ఆస్పత్రి పారిశుద్ధ్య విభాగం ‘అవినీతి కంపు’ కొడుతోంది. ఆస్పత్రి అధికారులు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు కుమ్మక్కై 270 మంది నిరుపేద కార్మికుల పొట్ట కొడుతున్నారు. పీఎఫ్ పేరుతో కార్మికుల వేతనం నుంచి సేకరించిన మొత్తాన్ని తమ ఖాతాల్లో జమ చేసుకుంటున్నారు. రెండు ఏజెన్సీలు కలిసి ఇప్పటి వరకు రూ.కోటిన్నరకు పైగా స్వాహా చేశా యి. ఈ విషయం తెలిసి కార్మికులు లబోదిబోమంటున్నారు. నిబంధనల ప్రకారం కార్మికుల పేరుతో బ్యాంక్ ఖాతాలు తెరిచి.. వేతనాలు జమ చేయాల్సి ఉన్నా... ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. ఇదేమని ప్రశ్నించే వారిని విధుల నుంచి తొలగిస్తున్నారు. ఆస్పత్రి నిర్వహణతో పాటు కార్మికుల బాగోగులను చూసుకోవాల్సిన అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా బిల్లు మంజూరు చేయాలంటే ముందు హెల్త్ ఇన్స్పెక్టర్, వార్డుల్లోని ఇన్చార్జి సిస్టర్ల ఆమోదం పొందాలి. ఆ తర్వాతే ఆర్‌ఎంఓలు సంతకం చేయాలి. ఇవేవీ పట్టించుకోకుండా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ సమర్పించిన బిల్లులపై అధికారులు సంతకాలు చేసి బిల్లులు మంజూరు చేస్తుండటంపై సర ్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్డులూ లేవు.. ఖాతా లేదు ఉస్మానియా ఆస్పత్రి పారిశుద్ధ్య పనులను 2010లో ఆల్ గ్లోబల్ సర్వీసెస్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ దక్కించుకుంది. 250 మంది కార్మికులకు వేతనాలకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.17 లక్షలు చెల్లించేది. పారిశుద్ధ్యం మెరుగు పడకపోవడంతో 2013లో ఆ ఏజెన్సీని తప్పించి గౌరీ మహిళా మండలి ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించింది. కార్మికులకు కనీస వేతన చట్టం అమల్లోకి రావడంతో ప్రభుత్వం ఆ మేరకు నిధులు పెంచింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి రూ.29 లక్షలకు పెంచుతూ జీఓ విడుదల చేసింది. గౌరీ మహిళా మండలి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ప్రస్తుతం ఆస్పత్రిలో 270 మంది పని చేస్తున్నట్లు లెక్క చూపుతోంది. నిజానికి 150 మంది కార్మికులు కూడా పని చేయడం లేదు. వీరిలో ఒక్కరికీ ఇప్పటి వరకు బ్యాంక్ ఖాతా కానీ, పీఎఫ్ ఖాతా కానీ తెరవలే దు. పెరిగిన వేతనాల ప్రకారం ప్రతి కార్మికునికి నెలకు రూ.7000 వంతున చెల్లిస్తున్నట్లు ఏజెన్సీ చెబుతోంది. పీఎఫ్, ఈఎస్ఐ పేరుతో ప్రతి నెలా రూ.970 వంతున కోత విధిస్తున్నారు. ఈ మొత్తాన్నిఇప్పటి వరకు వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయలేదు. తొలగించి.. మళ్లీ అప్పగించి పారిశుద్ధ్య నిర్వహణకు ప్రభుత్వం ఏటా రూ.3.48 కోట్లు ఖర్చు చేస్తోంది. అయినా మార్పు లేదు. ఇదే కారణంతో ఇటీవల గౌరీ మహిళా మండలి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ కాంట్రాక్ట్‌ను రద్దు చేశారు. ఆ మేరకు నోటీసులు ఇచ్చారు. టెండర్ పిలువకుండానే మళ్లీ అదే ఏజెన్సీకి కాంట్రాక్ట్ కట్టబెట్టడం గమనార్హం. బ్యాంక్ ఖాతాలు తెరిపిస్తున్నాం ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో 270 మంది పని చేస్తున్నారు. ఇప్పటి వరకు వీరికి బ్యాంక్ ఖాతాలు లేవు. బ్యాంకులో కాకుండా నేరుగా తమ చేతికే వేతనం అందజేయాలని కార్మికులు కోరారు. వారి విజ్ఞప్తి మేరకే ఇప్పటి వరకు చెల్లించాం. ఈ అంశంపై ఇప్పటికే ఆస్పత్రి సూపరింటెండెంట్ బ్యాంక్ అధికారులతో మాట్లాడారు. కార్మికుల పేరుతో ఖాతా తెరిచేందుకు వారు కూడా అంగీకరించారు. ఫొటోలు, ఆధార్ కార్డు, తదితర వివరాలు ఇవ్వడం లేదు. కార్మికుల హాజరు శాతాన్ని పెంచేందుకు ఆస్పత్రిలో బయోమెట్రిక్ అటెండెన్స్ సిష్టం ఏర్పాటు చేస్తున్నాం. వారి వేతనం నుంచి కోత విధిస్తున్న మొత్తాన్ని పీఎఫ్, ఈఎస్ఐ ఖాతాల్లో విధిగా నమోదు చేస్తున్నాం. -గాయత్రి, గౌరీ మహిళా మండలి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకురాలు -
పొరుగు ఉద్యోగుల అరణ్య రోదన
ఐదు నెలలుగా జీతాలు కరువు ఏజెన్సీ నిర్వాహకుల నిర్లక్ష్యం ఆర్థిక ఇబ్బందుల్లో పశుసంవర్ధకశాఖ అటెండర్లు కర్నూలు(అగ్రికల్చర్) : అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వల్ల పశుసంవర్ధక శాఖలో 47 మందికి ఐదు నెలలుగా జీతాలు లేకపోవడంతో సంబంధిత కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాయి. అధికారులు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఎప్పటికప్పుడు ఉద్యోగుల జీతాల బిల్లులు చెల్లిస్తున్నా ఈపీఎఫ్, ఈఎస్ఐ, సర్వీస్ టాక్స్ చెల్లింపులో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తున్నారు. రాయలసీమ అనిమల్ హజ్బెండరీ బ్రీడ్ డెవలప్మెంట్, సర్వీస్ వెల్ఫేర్ సొసైటీ పశుసంవర్ధక శాఖలోని వివిధ పశువైద్యశాలలకు అవుట్ సోర్సింగ్‌పై అటెండర్లను నియమించింది. అయితే ఈ ఏజెన్సీ నిర్వాకం కారణంగా ఉద్యోగులకు సకాలంలో జీతాలు అంద డంలేదు. ఈపీఎఫ్, ఈఎస్ఐ జమ కావడం లేదు. పశుసంవర్ధక శాఖ అధికారులు గత ఏడాది అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు 47 మంది అటెండర్ల జీతాల బిల్లుల కింద మార్చి మొదటి వారంలో 21 లక్షలు చెల్లించారు. ఈ మొత్తం నుంచి సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులు ఉద్యోగుల బ్యాంకు ఖాతాలకు జీతాలు జమ చేసి, అదే నెలలోనే ఈపీఎఫ్, ఈఎస్ఐ, సర్వీస్ ట్యాక్స్ చెల్లించి సంబంధిత బిల్లులు సమర్పించాలి. అయితే జీతాలు బ్యాంకు ఖాతాలకు జమ చేసినా ఈపీఎఫ్, ఈఎస్ఐ, సర్వీస్ ట్యాక్సులు చెల్లింపులో అలసత్వం వహించారు. ఉద్యోగుల ఒత్తిడి పెరగడంతో జులైలో జమ చేసినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని జమ చేసినా బిల్లులు ఇవ్వకపోవడంతో 47 మంది అటెండర్లు మార్చి నుంచి జీతాలకు దూరమయ్యారు. దీనిపై సంబంధిత ఏజెన్సీ నిర్వాహకుడిని ప్రశ్నిస్తే తనకు ఇలాంటి ఏజెన్సీలు చాలా ఉన్నాయి.. అన్ని చూసుకోవాలి కదా అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం గమనార్హం. ఆలస్యంగా ఈపీఎఫ్, ఈఎస్ఐ, సర్వీస్ ట్యాక్స్ చెల్లించినా బిల్లులు ఇవ్వకుండా ఆన్లైన్లో పెట్టాము చూసుకొమ్మని నిర్లక్ష్యంగా చెప్పినట్లు తెలుస్తోంది. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్లక్ష్యాన్ని గుర్తించిన పశుసంవర్థక శాఖ అధికారులు ఏజెన్సీని మార్చాలని కొద్ది రోజుల క్రితమే జిల్లా ఉపాధి కల్పనా సంస్థ అధికారికి లేఖ రాశారు. ఇలాంటి పరిస్థితి ఇతర శాఖల్లో కూడా ఉన్నట్లు సమాచారం. కుటుంబ పోషనకు అప్పులు చేస్తున్నాం ఫిబ్రవరి నుంచి జీతాలు లేకపోవడంతో అనేక కష్టాలు పడుతున్నాం. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుని సంసారాలను నెట్టుకొస్తున్నాం. ఈ ఏజెన్సీ కారణంగానే ఇప్పుడు జీతాలకు దూరమయ్యాం. అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. - ఎం.ప్రసాద్, అటెండర్, క్ష్మీపురం గ్రామీణ పశువైద్యశాల జీతాలిప్పించండి.. ఐదు నెలలుగా జీతాలు లేకపోతే ఎలా బతకాలి. ఎప్పటికప్పుడు ఈఎస్ఐ, ఈపీఎఫ్ చె ల్లించాలని ఏజెన్సీ నిర్వాహకుడిని కోరుతున్నాం. కానీ ఫలి తం లేదు. ఇందువల్ల మాకు జీతాలు ఆలస్యం అవుతున్నాయి. అధికారులే కాస్త చొరవ తీసుకుని మా ఇబ్బందులు తీర్చాలి. -సలాం బాషా, అటెండర్, అల్లూరు పశువైద్యశాల -
మంత్రి మాట ‘అవుట్’ !
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ‘అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల కొత్త నియామకాలా...అటువంటిదేమి లేదే. విధి విధానాలు ఖరారయ్యేంత వరకు కొత్త నియామకాలుండవు. ఇప్పటికే ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి సీఎం ఆదేశించారు. అవి వచ్చిన తర్వాతే కొత్త ఏజెన్సీల నియామకాలుంటాయి. అంతవరకు పాత ఏజెన్సీలే కొనసాగుతాయి.’ ఇవీ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని శుక్రవారం విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు. కానీ మంత్రి ప్రకటన చేసి 24 గంటలు గడవక ముందే, అందుకు భిన్నమైన ఉత్తర్వులొచ్చాయి. 16 కొత్త అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నియామకాల్ని ఖరారు చేసి, శాఖల వారీగా ఉద్యోగాలను కేటాయింపు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలల 10 రోజుల కాల పరిమితి నిర్ధేశిస్తూ శనివారం ఆ ఏజెన్సీలకు ఉత్తర్వులు అందాయి. దీన్ని బట్టి మంత్రి, అధికారుల మధ్య సమన్వయ లోపం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. శుక్రవారం విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతానికైతే కొత్త ఏజెన్సీల నియామకాల్లేవని, కలెక్టర్ కూడా నియామకాలు చేసి ఉండరని చెప్పిన 24 గంటల్లోనే ప్రతికూల పరిస్థితి ఎదురైంది. ఆమె వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం మరింత ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. ఇదొక్కటి చాలు పాలనా వ్యవహారాలపైనా, అధికారులపైనా మంత్రికి ఉన్న పట్టు ఏంటో అర్థం చేసుకోడానికని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయిఅన్నింటా చుక్కెదురే... ఒక్క అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నియామకాల విషయంలోనే కాదు... అనేక విషయాల్లో ఆమె మాట చెల్లుబాటు కాలేదు. అటు ప్రభుత్వ స్థాయిలోనూ, ఇటు జిల్లా స్థాయిలోనూ ఆమె ఆదేశాలు అమలు కావడం లేదు. డీసీఎంఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు ఐసీడీఎస్ సరుకుల సరఫరాలో అక్రమాలు జరుగుతున్నాయని, నాణ్యతా లోపాలు, నాసిరకం సరుకులు సరఫరా చేస్తున్నారని ఆ మధ్య మంత్రి మృణాళిని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికంతటికీ డీసీఎంఎస్‌కు సబ్ కాంట్రాక్ట్‌గా ఉన్న వ్యాపారస్తుల పనేనని చెప్పారు. తక్షణమే ఆ సబ్ కాంట్రాక్టర్లను తీసేసి కొత్తగా టెండర్లు పిలిచి, అర్హులైన ఏజెన్సీలను ఖరారు చేయాలని ఆదేశించారు. కానీ ఇంతవరకు ఆ ఆదేశాలు అమలుకు నోచుకోలేదు సరికదా, మంత్రి ఆరోపణలు చేసిన వ్యాపారులే ఇప్పటికీ సరుకులు సరఫరా చేస్తున్నారు. ఇటీవల ఒక కేజీబీవీ(కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం)ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు నాసిరకం ఆహారం అందిస్తున్నారని గుర్తించారు. సంబంధిత అధికారులపైనా, సరుకులు సరఫరా చేస్తున్న వ్యక్తులపైనా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కానీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. బెల్ట్‌షాపులు, ఎంఆర్పీకి మించి మద్యం విక్రయాల విషయంలోనూ ఆమె ఆదేశాలు అమలు కావడం లేదు. ఇవన్నీ పక్కన పెడితే తన శాఖ పరిధిలో గల డీఆర్డీఎ పీడీ, డ్వామా పీడీలను బదిలీ చేసి నెలలు కావస్తున్నా ఇంతవరకు ఆ పోస్టుల్లో కొత్తవారు చేరలేదు. తానే చొరవ తీసుకుని పోస్టింగ్స్ వేయించినా, గుంటూరు నుంచి ఇక్కడికి రావల్సిన ఢిల్లీరావు, ప్రశాం తిలకు గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారుల చేత రిలీవింగ్ ఆర్డర్స్ ఇప్పించినా ఇంతవరకు అక్కడి కలెక్టర్ రిలీవ్ చేయలేదు. దీంతో గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి సొంత జిల్లాలో కీలకమైన డ్వామా, డీఆర్డీఎ పీడీ పోస్టులు ఇన్‌చార్జ్‌ల పాలనలో నడుస్తున్న పరిస్థితి నెలకొంది. అలాగే, ప్రభుత్వ మెడికల్ కళాశాల కోసం మంత్రి హోదాలో వ్యక్తిగతంగా విజ్ఞాపన పత్రం అందజేసినా ప్రభుత్వం స్పందించలేదు. సరికదా ప్రైవేటు కళాశాల ఇస్తామంటూ ఆమె లేఖను పక్కన పెట్టేసింది. ఇక జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మంత్రి లేని సమయంలో నిర్వహించారంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. కేబినెట్ సమావేశం ఎప్పుడుంటుందో అందరికీ తెలిసిందే. కానీ ఆ విషయాన్ని పక్కన పెట్టేశారో, మంత్రి లేకపోయినా ఫర్వాలేదనుకున్నారో తెలియదు గానీ జెడ్పీ యంత్రాంగం జిల్లా మంత్రి లేని సమయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించింది. అలాగే, ఆమె పీఏ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేసి ప్రభుత్వ కార్యాలయాల్లో తనిఖీలు, సమీక్షలు చేయడమే కాకుండా ఆదేశాలు,హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక పార్టీ ఎమ్మెల్యేల విషయం చెప్పనక్కర్లేదు. కనీసం పట్టించుకోవడం లేదు. తలోదారి అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఒక్కొక్కసారి ఆమెను టార్గెట్ చేసి వ్యాఖ్యలు, రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె సిఫార్సు చేసినా ఉన్నత స్థాయిలో సదరు ఎమ్మెల్యేలు ఆపేస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. దీంతో ఆమెకున్న పట్టు, ప్రాధాన్యం ఏంటో స్పష్టమవుతోంది. -
అంత.. ప్రేమెందుకో?
నల్లగొండ: జిల్లాలో జౌట్ సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక వ్యవహారం గందరగోళంగా మారుతోంది. ఏజెన్సీల ఎంపిక, ఉద్యోగాల నియామకానికి సంబంధించి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు కాలరాస్తూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం ఇందుకు మూలకారణమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం పలు శాఖల్లో ఖాళీలను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీచేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. కానీ ఉద్యోగ నియామకాలు, ఏజెన్సీల ఎంపికకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయలేదు. దీన్నే అదునుగా భావించిన ఏజెన్సీలు, అధికారులు కుమ్మకై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉద్యోగాలను అమ్ముకుంటు న్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో 90 వరకు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఉపాధి కల్పన కార్యాలయంలో రిజిష్టరై ఉన్నాయి. ఈ ఏజెన్సీలకు అవకాశం ఇవ్వకుండా కేవలం నాలుగైదు ఏజెన్సీలకు మాత్రమే గుట్టుచప్పుడు కాకుండా కాంట్రాక్టు అప్పగిస్తూ అధికారులు సొమ్ముచేసుకుంటున్నారు. ఈ గుత్తాధిపత్యాన్ని జీర్ణించుకోలేని కొన్ని ఏజెన్సీలు హైకోర్టు వరకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తున్నాయి. ఉమ్మడి ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 4271 ప్రకార ం ఉద్యోగాల నియామకం, ఏజెన్సీల ఎంపిక చే సినట్లయితే నిరుద్యోగులకు మేలు జరిగే అవకాశం ఉంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది చివరి మాసాల్లో విద్యాశాఖ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 47 పోస్టులను ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు, ఏజెన్సీలు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. వివాదాస్పదంగా మారుతున్న ఉద్యోగాల భర్తీ మోడల్ స్కూళ్లలో 33 పీఈటీ పోస్టులు ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాలి. ఏజెన్సీల ఎంపికకు టెండర్లు ఆహాన్వించి అర్హత ఉన్న వాటిని జిల్లా సెలక్షన్ కమిటీ ఎంపిక చేయాలి. అయితే సమైక్య రాష్ట్రంలో కూడా మోడల్ స్కూల్స్‌లో కొన్ని పోస్టులను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారానే భర్తీ చేశారు. దీంతో కొత్తగా మంజూరైన పీఈటీ పోస్టులకు కొత్త ఏజెన్సీలు ఎంపిక చేయకుండా పాత ఏజెన్సీలకే కాంట్రాక్టు క ట్టబెట్టారు. అప్పట్లో ఆ ఏజెన్సీల నిర్వాకం వల్ల పోస్టుల భర్తీ వివాదస్పదంగా మారింది. కాగా మళ్లీ ఇప్పుడు పాత ఏజెన్సీలకే ఉద్యోగాల నియాకమం, రాత పరీక్ష వగైరా బాధ్యతలు అప్పగించడం విమర్శలకు దారితీస్తోంది. నిబంధనల ప్రకారం అయితే ఔట్సోర్సింగ్ పోస్టుల నోటిఫికేషన్లు జారీ అయిన ప్రతిసారి ఏజెన్సీల ఎంపికకు టెండర్లు పిలవాలి. కానీ అలా చేయడంలేదు. నకిరేకల్, చండూరు, మునుగోడు, ఆలేరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో మంజూరైన 14 పోస్టుల భర్తీకి సంబంధించి ఏజెన్సీలు వ్యవహరించిన తీరు పట్ల నిరుద్యోగులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. టెండర్ లేకుండానే జిల్లా సెలక్షన్ కమిటీ విచక్షాణా ధికారంతో మూడు ఏజెన్సీలకు కాంట్రాక్టు అప్పజెప్పింది. దీంతో ఆ ఏజెన్సీల నిర్వాహకులు లక్షల రూపాయాలకు ఉద్యోగాలను బేరంపెట్టారు. దీనికి రాజకీయ ఒత్తిళ్లు కూడా తోడు కావడంతో ఈ నియామకాల పై సందిగ్ధత ఏర్పడింది. ఇక, బీబీనగర్‌లో నిర్మిస్తున్న నిమ్స్ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ద్వారా పోస్టులు భర్తీ అయితే కోర్టు మెట్లెక్కింది. ఇందుకోసం జిల్లా నుంచి ఒక ఏజెన్సీని ఎంపిక చేయాలని కోరుతూ జిల్లా ఉపాధి కల్పన శాఖకు వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు లేఖ రాశారు. దీనిని కూడా జిల్లా సెలక్షన్ కమిటీ టెండరు లేకుండానే తాము మెచ్చిన ఏజెన్సీని ఎంపిక చేసి పంపించారు. టెండరు లేకుండా ఏజెన్సీ ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని ఏజెన్సీలు హైకోర్టును ఆశ్రయించాయి. పోస్టుల నోటిఫికేషన్ జారీ కాకముందే ఏజెన్సీల ఎంపిక వివాదస్పదంగా మారడం గమనా ర్హం. నిబంధనలు ఇవీ... ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 4271 ప్రకారం ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక.. టెండర్ల ద్వారా జరగాలి. టెండర్లు దాఖలు చేసిన ఏజెన్సీలను జిల్లా సెలక్షన్ కమి టీ ఎంపిక చేస్తుంది. ఈ కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్ వ్యవహరిస్తారు. కన్వీనర్‌గా జిల్లా ఉపాధి కల్పన అధికారి, సభ్యులుగా డిప్యూటీ డెరైక్టర్ (డీటీఓ), జిల్లా కార్మిక శాఖ అధికారి ఉంటారు. ఏజెన్సీల ఎంపిక పూర్తయిన తర్వాత ఉద్యోగాల భర్తీకి ఓ నిబంధన ఉంది. దీనికి కూడా కలెక్టర్ స్థాయిలో ప్రత్యేకమైన కమిటీ ఉంది. జిల్లా ఉపాధి కల్పన శాఖలో నమోదు చేసుకున్న నిరుద్యోగ యువకులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. అట్టి జాబితాలో సీనియారిటీ ఉన్న అభ్యర్థుల అర్హతలు, రిజర్వేషన్లు, రోస్టర్‌పాయింట్లు అమలు చేస్తూ ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటుంది. గతంలో జిల్లాలో ఈ పద్ధతిలోనే కాంట్రాక్టు ఉద్యోగ నియామకాల భర్తీ జరిగింది. కానీ ఇప్పుడు ఆ ప్రక్రియ అటకెక్కడం, కాసులిచ్చిన వారికే కొలువులు కట్టబెడుతుండడం గమనార్హం. ఇంకో విచిత్రమేమిటంటే... అనేక అధికారిక వ్యవహారాల్లో బిజీగా ఉండే కలెక్టర్ దృష్టికి వెళ్లకుండానే కిందిస్థాయి అధికారులు ఈ వ్యవహారాలు నడుపుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సెలక్షన్ కమిటీదే బాధ్యత - అక్బర్ హబీబ్ , జిల్లా ఉపాధి కల్పన అధికారి పాత ఏజెన్సీలకే మోడల్ స్కూల్స్‌లో పోస్టులు భర్తీ చేసే కాంట్రాక్టు అప్పగించారు. దాంతో మాకు ఎలాంటి సంబంధం లేదు. కొనసాగుతున్న పాత ఏజెన్సీలకే కొత్త పోస్టుల భర్తీ కాంట్రాక్టు ఇవ్వాలనే నిబంధన లేదు. దానికి సంబంధించిన జీఓ కూడా మావద్ద లేదు. నిమ్స్ ఆసుపత్రి ఏజెన్సీ ఎంపికకు టెండరు పిలవకపోవడంతో కొందరు హైకోర్టును ఆశ్రయించిన మాట వాస్తవం. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పోస్టుల భర్తీకి ఏజెన్సీల ఎంపిక కోసం కూడా టెండరు పిలవలేదు . జిల్లా సెలక్షన్ కమిటీ ఆదేశం మేరకు ఆ ఏజెన్సీలను ఎంపిక చేశాం. -
కుమ్మక్కు కుట్రకు...కొత్త ఏజెన్సీలు అవుట్!
సాక్షి ప్రతినిధి, విజయనగరం ః నాకు దక్కనిది మరొకరికి దక్కకూడదన్న తీరులో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉండే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను ఖరారు చేయలేదన్న అక్కసుతో ఒత్తిళ్లకు దిగారు. ఎన్ని ఎత్తులు వేసినా ప్రయోజనం లేకపోవడంతో పాత ఏజెన్సీల(కాంగ్రెస్ మద్దతుదారులు)తో చేతులు కలిపారు. లోపాయికారీ డీల్ కుదుర్చుకుని వ్యూహాత్మకంగా పావులు కదిపారు. కొత్త ఏజెన్సీలకు ఉద్యోగాల కేటాయింపులు చేయకుండా గాలిలో వదిలేసి, పాత వారినే కొనసాగించేలా కుట్ర పన్నారు. దీంతో కలెక్టర్ ఇచ్చిన నియామక ఉత్తర్వులు ఆచరణకు నోచుకోలేదు. ఫలితంగా రూ.3 లక్షలు డిపాజిట్ చేసిన కొత్త ఏజెన్సీలకు న్యాయం జరగకపోగా, వడ్డీని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. వారంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. అధికారులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని యోచిస్తున్నారు. వివరాలివి.... జిల్లాలో 40 ప్రభుత్వ శాఖల్లో రెగ్యులర్ ఉద్యోగుల్లేక అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలిక ఉద్యోగులను నియమిస్తున్నారు. వీరిని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా సమకూర్చుకుంటున్నారు. ఈ మేరకు ఆయా ఉద్యోగులకిచ్చే జీతాల్లో కొంత మొత్తాన్ని కమీషన్‌గా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు తీసుకుంటున్నాయి. తాత్కాలిక సమకూర్చే బాధ్యత చేపట్టే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను టెండర్ల ద్వారా ఖరారు చేస్తారు. ఈక్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను కొత్తగా ఖరారు చేసేందుకు జిల్లా కమిటీ టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు 28 షెడ్యూళ్లు దాఖలయ్యాయి. కాకపోతే, ఇందులో అత్యధికం టీడీపీ నేతలకు చెందిన వారివే. దాఖలు చేసినవన్నీ ఖరారు అయ్యేలా తెరవెనుక పావులు కదిపారు. ఇదే విషయమై సెప్టెంబర్ 20వ తేదీన ’అవుట్ సోర్సింగ్‌లో సిండికేట్లు’ అనే శీర్షికతో సాక్షిలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీంతో అర్హతలుండి రాజకీయేతరంగా షెడ్యూల్ దాఖలు చేసిన వారు అప్రమత్తమయ్యారు. అడ్డగోలుగా ఖరారైతే కోర్టుకైనా వెళ్తామంటూ వారంతా సంకేతాలు పంపించారు. దీంతో అధికారులు అప్రమత్తమై అధికార పార్టీ నేతలు సూచించిన వాటిలో అర్హత గల ఏజెన్సీలను ఎంపిక చేయడంతో పాటు రాజకీయేతరంగా దాఖలై అర్హత ఉన్న వాటినీ ఎంపిక చేశారు. ఆమేరకు మూడు నెలల కాల పరిమితితో అక్టోబర్ 10వ తేదీన 16 ఏజెన్సీలను అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా సమాన ప్రాతిపదికన శాఖల వారీ ఉద్యోగాలు కేటాయించారు. ఇక్కడే ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు అసంతృప్తికి లోనయ్యారు. తాము సిఫారసు చేసిన ఏజెన్సీలన్నింటినీ ఎంపిక చేయలేదని అక్కసు వెళ్లగక్కారు . తమకు అనుకూల ఏజెన్సీలన్నీ ఎం పిక చేయకపోగా, ఎంపిక చేసిన ఏజెన్సీలకు ఎక్కువ ఉద్యోగాలు కేటాయింపు లు చేయలేదని, అందరిలాగే సమానంగా కేటాయించారని, సిఫారసులకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకేముంది ఒకవైపు అధికారులపై ఒత్తిళ్లు చేస్తూనే మరోవైపు కొత్త ఎంపికైన ఏజెన్సీలను వెనక్కి తగ్గిపోవాలని పరోక్షంగా బెదిరించారు. కానీ రెండు వైపులా సానుకూలత రాలేదు. దీంతో ఆ ఎమ్మెల్యేలు వ్యూహం మార్చారు. సత్సంబంధాలున్న పాత ఏజెన్సీల(కాంగ్రెస్ మద్దతుదారులు)తో చేతులు కలిపారు. లోపాయికారీ ఒప్పందం చేసుకుని కొత్త నియామకాలు అమలుకు నోచుకోకుండా పాత వారినే కొనసాగించేలా తెరవెనుక పావులు కదిపారు. ఓ మంత్రి చేత ఒత్తిడి చేయించి, కొత్త ఏజెన్సీలను గాలిలో ఉంచేలా సఫలీకృతులయ్యారు. ఈ నేపథ్యంలో వాళ్ల అనుకున్నవి జరగడమే కాకుండా ఆర్థిక పరమైన లబ్ధి కూడా పొందుతున్నట్టు తెలుస్తోంది. కొత్త ఏజెన్సీల కాలపరిమితి(మూడు నెలలు) జనవరి పదో తేదీతో ముగియబోతోంది. అంటే కలెక్టర్ ఇచ్చిన నియామక ఉత్తర్వులు ఆచరణకు నోచుకోకుండానే గడువు ముగిసిపోతోంది. లబోదిబోమంటున్న కొత్త ఏజెన్సీ నిర్వాహకులు గతంలో ఏజెన్సీలు రూ.50వేలు డిపాజిట్ చేస్తే సరిపోయేది. కానీ ఈసారి రూ.3లక్షలకు డిపాజిట్ మొత్తాన్ని పెంచారు. మూడు నెలలు(అక్టోబర్, నవంబర్, డిసెంబర్)కే కాంట్రాక్ట్ అని షరతు పెట్టారు. ఈ మూడు నెలలైనా ఎంతో కొంత సంపాధించుకోవచ్చన్న ఆశతో పలు ఏజెన్సీలు షెడ్యూల్ దాఖలు చేశాయి. అర్హతలతో ఎంపికయ్యాయి. కానీ, టీడీపీ ఎమ్మెల్యేల జోక్యంతో నిలిచిపోయిన ప్రక్రియతో ఈ ఏజెన్సీల నిర్వాహకులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు లబోదిబోమంటున్నారు. తమకు జరిగిన అన్యాయంపై కోర్టుకు వెళతామని వారు చెబుతున్నారు. -
కొత్త జీతాల్లేవు!
శ్రీకాకుళం: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం సూచించిన మేరకు కొత్త జీతాలు అందడం లేదు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీని నియమించకపోవడమే దీనికి కారణమని తెలిసింది.ఈ విద్యాలయాల బోధన, బోధనేతర సిబ్బంది జీతాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మే నెలలోనే ఉత్తర్వులు జారీ చేసింది. రాతపరీక్ష ద్వారా నియమితులైన బోధనా సిబ్బందికి జూన్ నెల నుంచి కొత్త జీతాలు అందజేస్తున్నారు. బోధనేతర సిబ్బంది నేరుగా నియమితులు కావడంతో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నియామకాలు జరిగినట్టు పరిగణించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మే నెలలోనే ఆర్వీఎం అధికారులు ఔట్సోర్సింగ్ ఏజెన్సీ నియామకానికి ప్రయత్నించారు. ఇందుకు అవసరమైన నోటిఫికేషన్ కూడా జారీ చేయగా ఒకరిద్దరు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అప్పట్లో జాతీయస్థాయిలో చక్రం తిప్పిన ఓ ప్రజాప్రతినిధి తన అనుయాయునికే ఏజెన్సీ బాధ్యతలు అప్పగించాలని పట్టుబట్టారు. దీనికి అధికారులు తలొగ్గి, ఆయన్నేనియమించినప్పటికీ, అతనిపై తీవ్ర ఆరోపణలు రావడంతో తర్వాత రద్దు చేశారు. మరో ఏజెన్సీని నియమించేందుకు ప్రయత్నాలు జరిగినా అవాంతరాలు సృష్టించడం ద్వారా కొందరు అది జరగకుండా చేశారు. ఇంతలో ఎన్నికలు రావడం కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా ఏజెన్సీ నియామకంలో అధికారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నట్టు సమాచారం. ఇద్దరు ప్రజాప్రతినిధులు తమ వారికే ఏజెన్సీ కట్టబెట్టాలని ఉన్నతాధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్టు భోగట్టా. ఈ కారణంగా రెండు నెలలుగా ఈ ప్రక్రియ పెండింగ్‌లో పడింది. ఫలితంగా కేజీబీవీల్లోని బోధనేతర సిబ్బంది కొత్త జీతాలకు నోచుకోలేక పోతున్నారు. మిగిలిన జిల్లాల్లో జూన్ నెల నుంచే కొత్త జీతాలు అందుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని బోధనేతర సిబ్బంది మాత్రం పాత జీతాలతోనే పనిచేయాల్సి వస్తోంది. ఇప్పటికే ఐదు నెలల కొత్త జీతాలను వీరు నష్టపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఏజెన్సీని నియమించడం ద్వారా అందరికీ కొత్త జీతాలు అందేలా చూడాలని బోధనేతర సిబ్బంది కోరుతున్నారు. ఈ విషయాన్ని ఆర్వీఎం పీవో గణపతిరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తమపైన ఎవరూ ఒత్తిడి తీసుకురావడం లేదన్నారు. ఉన్నతాధికారులపై కూడా ఎటువంటి ఒత్తిడి లేదని, త్వరలోనే ఏజెన్సీ నియామకం పూర్తవుతుందని చెప్పారు. ఏజెన్సీ పరిధిలోకి బోధనేతర సిబ్బందిని తీసుకువచ్చిన తరువాత కొత్త జీతాలను మంజూరు చేస్తామన్నారు. -
‘అవుట్ సోర్సింగ్’కు రాజకీయ గ్రహణం?
- ఏజెన్సీ ఎంపిక టెండరు ప్రక్రియకు తాత్కాలిక బ్రేకు - పని ఒత్తిడే కారణ మంటున్న అధికారులు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల కార్యాలయాల్లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక ప్రక్రియ తాత్కాలికంగా నిలిచింది. ఈ ఏజెన్సీల నియామకం కోసం చేపట్టిన టెండరు ప్రక్రియకు ప్రస్తుతానికి బ్రేకు పడింది. ఇందుకు రాజకీయ ఒత్తిళ్లే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమకు అనుకూలమైన ఏజెన్సీలకు ఈ కాంట్రాక్టు దక్కేలా కొందరు నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 2014- 15 ఆర్థిక సంవత్సరంలో అవుట్సోర్సింగ్ పద్ధతిపై ఉద్యోగులను సరఫరా చేసే ఏజెన్సీ ఎంపిక నిమిత్తం జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆగస్టు 8న టెండరు నోటిఫికేషన్ జారీ చేసింది. టెండర్లు దాఖలు చేసేందుకు ఆగస్టు 20 వరకు గడువిచ్చారు. సుమారు 25 ఏజెన్సీలు ఈ టెండరు ప్రక్రియలో పాల్గొన్నాయి. ఈ టెండర్లను అదేరోజు తెరవాల్సి ఉండగా, అధికారులు ఈ ప్రక్రియను వాయిదా వేశారు. సమగ్ర కుటుంబ సర్వే తదితర ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో ఈ టెండర్లను తెరువలేకపోయాని అధికారులు చెబుతున్నారు. కానీ రాజకీయ ఒత్తిళ్లే ఇందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రూ.కోట్ల టర్నోవర్ జిల్లాలోని అన్ని కార్యాలయాలు, 104 వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో సుమారు వెయ్యికి పైగా ఉద్యోగులు, సిబ్బంది అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా పనిచేస్తున్నారు. కం ప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు, జూనియర్ అసిసెం ట్లు వంటి పోస్టుల్లో ఉన్నారు. వీరికి ఎంపిక చేసిన అవు ట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ప్రభుత్వం జీతభత్యాలు చెల్లిస్తుంది. ఈ ఏజెన్సీ ఎంపిక కోసం కలెక్టర్ జగన్మోహన్ జిల్లా అవుట్ సోర్సింగ్ కమిటీని నియమించారు. అదనపు జాయింట్ కలెక్టర్ ఈ కమిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, జిల్లా ఉపాధి కల్పనాధికారి మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. కార్మిక శాఖ జిల్లా ఉన్నతాధికారి, డీటీవో వంటి అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ టెండర్లు వేసిన ఏజెన్సీల అర్హతలను పరిశీలించి ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే ప్రతినెలా ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అలవెన్సుల రూపంలో రూ.కోట్లలో టర్నోవర్ ఉండటంతో నేతల కన్ను ఈ ఏజెన్సీలపై పడుతోంది. ఏజెన్సీల ఆగడాలు ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు గతంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డాయి. ఆయా ఏజెన్సీల నిర్వాహకులు కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రతినెలా చెల్లించాల్సిన వేతనాల్లో కోత పెట్టేవారు. నిరుద్యోగ యువత నెలం తా పనిచేస్తే వచ్చే చాలీ చాలని వేతనంలో ఇలా కోత వి దించడంతో ఉద్యోగులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఎక్కడ తమ ఉద్యోగం పోతుందోననే భయంతో కాం ట్రాక్టు ఉద్యోగులు ఏజెన్సీ నిర్వాహకులను గట్టిగా ప్ర శ్నించలేక పోయారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఆయా ఏజెన్సీల నిర్వాహకులు ప్రతినెలా లక్షలు దండుకున్నా రు. అలాగే ఉద్యోగుల భవిష్య నిధి(ప్రావిడెంట్ ఫండ్) విషయంలోనూ చేతివాటం ప్రదర్శించారు. ఉద్యోగుల వేతనాల్లోంచి కోత విధించిన పీఎఫ్ మొత్తంలో కొంత మొత్తాన్ని జేబులో వేసుకున్నారు. దీంతో ఆయా ఉద్యోగులకు పీఎఫ్ ఖాతాలో జమ కావాల్సిన మొత్తం తగ్గిపోవడంతో చిరు ఉద్యోగులు ఆవేదనకు లోనయ్యారు. అలాగే కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రతినెలా చెల్లించే వేతనాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాల్సి ఉండగా, కొన్ని ఏజెన్సీలు అలా చేయకుండా ఉద్యోగికి ఇచ్చి అందులో చేతివాటం ప్రదర్శించారు. ఇప్పుడు కొత్తగా నియామకమైన అవుట్సోర్సింగ్ కమిటీ అధికారులు ఆయా ఏజెన్సీల ట్రాక్ రికార్డును క్షుణ్ణంగా పరిశీలించి ఎంపిక చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం ఈ చిరుద్యోగుల నుంచి వ్యక్తమవుతోంది. పని ఒత్తిడే కారణం - ఎం.ఏ.గఫార్, జిల్లా ఉపాధి కల్పనాధికారి పని ఒత్తిడి కారణంగానే టెండర్లు తెరువలేకపోయాము. నోటిఫికేషన్లో పేర్కొన్నట్లుగా ఆగస్టు 20నే ఈ టెండర్లు తెరవాల్సి ఉండగా, సమగ్ర కుటుంబసర్వే, ఇతర పని ఒత్తిడి కారణంగా ఈ టెండర్లను తెరువలేక పోయాము. అంతేకానీ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు. త్వరలోనే తేదిని ప్రకటించి ఈ టెండర్లను తెరిచేందుకు చర్యలు తీసుకుంటాము.