కోత కోసి.. కొల్లగొట్టి!
ఉస్మానియాలో అవినీతి కంపు
పీఎఫ్ పేరుతో కార్మికుల వేతనాల్లో కోత
వ్యక్తిగత ఖాతాలు తెరవని ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ
సిటీబ్యూరో: ఉస్మానియా జనరల్ ఆస్పత్రి పారిశుద్ధ్య విభాగం ‘అవినీతి కంపు’ కొడుతోంది. ఆస్పత్రి అధికారులు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు కుమ్మక్కై 270 మంది నిరుపేద కార్మికుల పొట్ట కొడుతున్నారు. పీఎఫ్ పేరుతో కార్మికుల వేతనం నుంచి సేకరించిన మొత్తాన్ని తమ ఖాతాల్లో జమ చేసుకుంటున్నారు. రెండు ఏజెన్సీలు కలిసి ఇప్పటి వరకు రూ.కోటిన్నరకు పైగా స్వాహా చేశా యి. ఈ విషయం తెలిసి కార్మికులు లబోదిబోమంటున్నారు. నిబంధనల ప్రకారం కార్మికుల పేరుతో బ్యాంక్ ఖాతాలు తెరిచి.. వేతనాలు జమ చేయాల్సి ఉన్నా... ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. ఇదేమని ప్రశ్నించే వారిని విధుల నుంచి తొలగిస్తున్నారు. ఆస్పత్రి నిర్వహణతో పాటు కార్మికుల బాగోగులను చూసుకోవాల్సిన అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా బిల్లు మంజూరు చేయాలంటే ముందు హెల్త్ ఇన్‌స్పెక్టర్, వార్డుల్లోని ఇన్‌చార్జి సిస్టర్ల ఆమోదం పొందాలి. ఆ తర్వాతే ఆర్‌ఎంఓలు సంతకం చేయాలి. ఇవేవీ పట్టించుకోకుండా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ సమర్పించిన బిల్లులపై అధికారులు సంతకాలు చేసి బిల్లులు మంజూరు చేస్తుండటంపై సర ్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కార్డులూ లేవు.. ఖాతా లేదు
ఉస్మానియా ఆస్పత్రి పారిశుద్ధ్య పనులను 2010లో ఆల్ గ్లోబల్ సర్వీసెస్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ దక్కించుకుంది. 250 మంది కార్మికులకు వేతనాలకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.17 లక్షలు చెల్లించేది. పారిశుద్ధ్యం మెరుగు పడకపోవడంతో 2013లో ఆ ఏజెన్సీని తప్పించి గౌరీ మహిళా మండలి ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించింది. కార్మికులకు కనీస వేతన చట్టం అమల్లోకి రావడంతో ప్రభుత్వం ఆ మేరకు నిధులు పెంచింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి రూ.29 లక్షలకు పెంచుతూ జీఓ విడుదల చేసింది. గౌరీ మహిళా మండలి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ప్రస్తుతం ఆస్పత్రిలో 270 మంది పని చేస్తున్నట్లు లెక్క చూపుతోంది. నిజానికి 150 మంది కార్మికులు కూడా పని చేయడం లేదు. వీరిలో ఒక్కరికీ ఇప్పటి వరకు బ్యాంక్ ఖాతా కానీ, పీఎఫ్ ఖాతా కానీ తెరవలే దు. పెరిగిన వేతనాల ప్రకారం ప్రతి కార్మికునికి నెలకు రూ.7000 వంతున చెల్లిస్తున్నట్లు ఏజెన్సీ చెబుతోంది. పీఎఫ్, ఈఎస్‌ఐ పేరుతో ప్రతి నెలా రూ.970 వంతున కోత విధిస్తున్నారు. ఈ మొత్తాన్నిఇప్పటి వరకు వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయలేదు.
తొలగించి.. మళ్లీ అప్పగించి
పారిశుద్ధ్య నిర్వహణకు ప్రభుత్వం ఏటా రూ.3.48 కోట్లు ఖర్చు చేస్తోంది. అయినా మార్పు లేదు. ఇదే కారణంతో ఇటీవల గౌరీ మహిళా మండలి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ కాంట్రాక్ట్‌ను రద్దు చేశారు. ఆ మేరకు నోటీసులు ఇచ్చారు. టెండర్ పిలువకుండానే మళ్లీ అదే ఏజెన్సీకి కాంట్రాక్ట్ కట్టబెట్టడం గమనార్హం.
బ్యాంక్ ఖాతాలు తెరిపిస్తున్నాం
ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో 270 మంది పని చేస్తున్నారు. ఇప్పటి వరకు వీరికి బ్యాంక్ ఖాతాలు లేవు. బ్యాంకులో కాకుండా నేరుగా తమ చేతికే వేతనం అందజేయాలని కార్మికులు కోరారు. వారి విజ్ఞప్తి మేరకే ఇప్పటి వరకు చెల్లించాం. ఈ అంశంపై ఇప్పటికే ఆస్పత్రి సూపరింటెండెంట్ బ్యాంక్ అధికారులతో మాట్లాడారు. కార్మికుల పేరుతో ఖాతా తెరిచేందుకు వారు కూడా అంగీకరించారు. ఫొటోలు, ఆధార్ కార్డు, తదితర వివరాలు ఇవ్వడం లేదు. కార్మికుల హాజరు శాతాన్ని పెంచేందుకు ఆస్పత్రిలో బయోమెట్రిక్ అటెండెన్స్ సిష్టం ఏర్పాటు చేస్తున్నాం. వారి వేతనం నుంచి కోత విధిస్తున్న మొత్తాన్ని పీఎఫ్, ఈఎస్‌ఐ ఖాతాల్లో విధిగా నమోదు చేస్తున్నాం.
-గాయత్రి, గౌరీ మహిళా మండలి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకురాలు