Osmania General Hospital
-
ఉస్మానియా ఆస్పత్రి ఖాళీ
అఫ్జల్‌గంజ్: పేదల పెద్దాసుపత్రిగా పేరుగాంచిన ఉస్మానియా జనరల్ ఆస్పత్రి పాత భవనానికి తాళం వేసి నేటికి నాలుగేళ్లు పూర్తవుతాయి. పాత భవనం మూసివేయడంతో ఆస్పత్రిలో స్థలాభావంతో అందుబాటులో ఉన్న స్థలంలోనే బెడ్లు సర్దుబాటు చేసి రోగులకు నాణ్యమైన వైద్య చికిత్సలు అందిస్తున్న ఉస్మానియా ఆస్పత్రికి ఇటీవల జరిగిన వైద్యుల బదిలీలు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. నాలుగేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఉస్మానియా ఆస్పత్రి పాత భవనంలోకి నీరు రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో అప్పటి ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ పాండూ నాయక్ నేతృత్వంలోని పరిపాలన విభాగం అధికారులు పాత భవనానికి 2020, జూలై 27న తాళం వేశారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ కులీకుతుబ్‌షా భవనంలో నూతన షెడ్డును ఏర్పాటు చేసి రోగులకు సర్దుబాటు చేశారు. కాగా.. తాజాగా వైద్య శాఖలో జరిగిన బదిలీల్లో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్‌తో పాటు నిష్టాతులైన దాదాపు 22 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో కలిపి దాదాపు 60 మంది వైద్యులను ఒకేసారి బదిలీ చేయడంతో ఆస్పత్రి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఉస్మానియా జనరల్ ఆస్పత్రి నిర్మాణంలో ఊగిసలాటలు
మహా నగరంతో పాటు పరిసర జిల్లాల ప్రజలకు వందల ఏళ్ల నుంచి ప్రాణ ప్రదాయిని. లక్షలాది మంది పేద రోగులకు ప్రాణభిక్ష పెట్టిన ఘన చరిత్ర. అద్భుతమైన భవన నిర్మాణ శైలికి ప్రతీక.. అడుగడుగునా ఉట్టిపడే కళా సౌందర్యం. కానీ.. కాలం రివ్వున తిరిగింది. అన్నింటికీ ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టే ఆ కళాఖండం కూడా చరమాంక దశకు చేరుకుంది.. అదే నగర నడి»ొడ్డున శతాబ్దం క్రితం నిర్మించిన ఉస్మానియా జనరల్ ఆస్పత్రి. శిథిలావస్థకు చేరిన ఉస్మానియా పాత భవనం స్థానంలో కొత్తది నిర్మించి రోగులకు మెరుగైన వసతులు కల్పించాలని కొందరు.. చారిత్రక కట్టడాలను కూల్చవద్దని మరికొందరు వాదిస్తుండటంతో ఈ వివాదం కోర్టుకు చేరింది. ప్రభుత్వం కూడా ఎటూ తేల్చకుండా సందిగ్ధావస్థలో పడింది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి, సిటీబ్యూరో/అఫ్జల్‌గంజ్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని 1910లో రూ.50 వేల వ్యయంతో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో నిర్మితమైంది. డంగు సున్నం, గచ్చుతో రెండంతస్తుల్లో దీనిని నిర్మించారు. అప్పట్లో 200 మంది రోగులు చికిత్స పొందేవారు. పెరుగుతున్న రోగుల తాకిడితో పాత భవనం ప్రాంగణంలోనే 1971లో ఓపీ బ్లాకును నిర్మించారు. 1992లో కులీ కుతుబ్‌షా బ్లాక్‌ను నిర్మించారు. ప్రస్తుతం రోజూ సుమారు 2 వేల మంది అవుట్ పేషెంట్లు, మరో 200 మంది రోగులు ఇన్పేòÙంట్లుగా చికిత్స పొందుతున్నారు. దేశంలోని అత్యున్నత బోధనాసుపత్రుల్లో ఉస్మానియా ఆస్పత్రి ఒకటి. ప్రమాదకారిగా మారి.. ఎంతో మందికి ఎనలేని సేవలందిస్తూ వచి్చన ఉస్మానియా ఆస్పత్రి భవనం ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. పెచ్చులూడిపోయి.. ఎప్పుడు కూలిపోతుందో తెలియని దుస్థితికి చేరుకుంది. జులై 2020లో భారీ వర్షాల కారణంగా వరద నీరు ఆస్పత్రి ప్రాంగణంలోకి చేరుకుంది. దీంతో చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యుద్ధ ప్రాతిపదికన ఉస్మానియా ఆస్పత్రి పాత భవనాన్ని ఖాళీ చేయించారు. రోగులను వేరే భవనాల్లోని ఇతర వార్డుల్లో సర్దుబాటు చేశారు. పరిపాలనా విభాగంతో పాటు శస్త్రచికిత్సల విభాగాలను కూడా ఖాళీ చేయించారు. ఇప్పుడు ఉన్న భవనాల్లో కొత్త పేషెంట్లను చేర్చుకోవడం, రోగులకు సేవలందించడం చాలా కష్టంగా మారిపోయింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూపులు.. ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనం కోసం వేల మంది రోగులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. కాకపోతే ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఆస్పత్రి భవనం నిర్మాణానికి సవాలక్ష సవాళ్లు ఎదురవుతున్నాయి. చిక్కుముడుల వలలో చిక్కుకుపోతోంది. వందేళ్ల కింద నిర్మించిన భవనం కావడం.. హెరిటేజ్ భవనాల జాబితాలో ఉండటంతో దీన్ని కూల్చడం కష్ట సాధ్యంగా మారింది. దీన్ని ఇలాగే ఉంచి మిగిలిన ప్రాంతంలో కొత్త భవనం నిర్మించాలని కొందరు అంటున్నారు. అయితే.. పాత భవనాన్ని కూల్చేసి పూర్తిగా కొత్త భవనం నిర్మిస్తే పూర్తి స్థాయిలో రోగులకు అన్ని రకాల వసతులు అందుబాటులోకి తీసుకురావొచ్చని చెబుతున్నారు. గత ప్రభుత్వం కూడా పాత భవనాన్ని కూల్చి కొత్త భవనం నిర్మాణం చేపట్టాలని భావించింది. కొందరు దీనిపై కోర్టుకెళ్లారు. దీంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. కమిటీ ఇలా చెప్పింది.. ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం స్థితిగతులు, కొత్త భవనం నిర్మాణం సాధ్యాసాధ్యాలపై అప్పటి ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. పాత భవనం ఉపయోగించేందుకు పూర్తిగా పనికి రాదని తేలి్చంది. భవనానికి మరమ్మతులు చేయొచ్చని, ఆస్పత్రి కోసం కాకుండా వేరే వాటి కోసం వాడుకోవచ్చని సూచించింది. ఇలా చేస్తే ఆస్పత్రికి కొత్త భవనాన్ని నిర్మించే స్థలం తక్కువ అవుతుందని పలువురు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది.25 ఎకరాల్లో పది అంతస్తుల్లో.. పాత భవనాన్ని కూల్చేసి కొత్త భవన సముదాయాన్ని దాదాపు 25 ఎకరాల్లో నిర్మించాలని ఆస్పత్రి పరిపాలనా విభాగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఒక్కో టవర్‌లో సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు పది అంతస్తుల్లో భవనం నిర్మించాలని సూచించింది. ఒక్కో టవర్‌ను 6 లక్షల చదరపు అడుగుల స్థలంలో నిర్మించాలని పేర్కొంది. దీంతో రోగులతో పాటు, వైద్య విద్యార్థులు, డాక్టర్లకు అన్ని రకాల సదుపాయాలు అందించవచ్చని తెలిపింది. నర్సింగ్ కాలేజీ కూడా నిర్మించే అవకాశం ఉంటుందని వివరించింది. ఇలా మొత్తం 35,75,747 చదరపు అడుగుల స్థలం అవసరం ఉంది. అక్కడ నిర్మించాలని ప్రతిపాదన.. పాత భవనం హెరిటేజ్ జాబితా కిందకు రావడంతో దాన్ని కూల్చకుండా మధ్య మార్గంలో వేరే ప్రాంతంలో ఉస్మానియా ఆస్పత్రిని నిర్మిస్తే ఎలా ఉంటుందని కొందరు అంటున్నారు. చంచల్‌గూడ, కొత్తపేట మార్కెట్, గోషామహల్‌లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ప్రాంతాలను పరిశీలించారు. కానీ.. అందుకు కొందరు అంగీకరించట్లేదు. ఇప్పుడున్న ప్రాంతంలోనే భవనం నిర్మించాలని పట్టుబడుతున్నారు.చిక్కుముడులు విప్పేందుకు కృషి.. కొత్త భవనం నిర్మించేందుకు కృషి చేస్తున్నాం. ఒక అడుగు ముందుకు పడితే రెండడుగులు వెనక్కి అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కూడా ఎంతో నిబద్ధతతో ముందుకు వెళ్తోంది. కానీ.. చిక్కుముడులు మాత్రం వీడట్లేదు. ఎలాగైనా కొత్త భవనం నిర్మించి రోగులకు మేలైన సేవలు అందించాలనేదే నా కోరిక. – డాక్టర్ బి.నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా ఆస్పత్రిపాత భవనంతో ప్రయోజనం లేదు.. పాత భవనం అలాగే ఉంచితే అసాంఘిక కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది. ఆ భవనాన్ని కూల్చేసి కొత్త భవనం నిర్మిస్తే పేద రోగులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. పాత భవనాన్ని చూసుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది. ఎప్పుడు కూలిపోతుందో.. ఎప్పుడేం అవుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాం. – వి.నర్సింగ్ రావు, జియాగూడ -
హాఫ్ నాలెడ్జ్‌తో మాట్లాడుతున్నారు: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని సందర్శించి.. తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. కొందరు హాఫ్ నాలెడ్జ్‌తో మాట్లాడుతున్నారంటూ చురకలంటించారాయన. రాజ్యాంగ పదవిలో ఉండి కొందరు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ వచ్చాక నిమ్స్‌లో సౌకర్యాలు పెరిగాయ్. కొందరు కళ్లు ఉండి మంచి చూడలేరు.. చెవులు ఉండి మంచి వినలేరు.. మంచి మాటలు మాట్లాడలేరు అంటూ వ్యాఖ్యానించారాయన. ఉస్మానియా కొత్త బిల్డింగ్ నిర్మాణానికి లీగల్ సమస్యలు ఉన్నాయని హరీష్ రావు తెలిపారు. అవగాహన లేకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు. నిమ్స్‌లో గొప్ప గొప్ప డాక్టర్లు పని చేస్తున్నారని, నిమ్స్‌కు ప్రత్యేకంగా కేసీఆర్ ప్రత్యేకంగా రూ. 150 కోట్లు రిలీజ్ చేశారు. ఆస్పత్రిలో 900 నుంచి 1500కి పడక గదులు పెంచాం అని తెలిపారాయన. కొత్త భవనం నిర్మాణానికి సంబంధించి ఏకాభిప్రాయం అవసరం ఉందని, ఆ సేకరణ నివేదికను హైకోర్టుకు అందిస్తామని, హైకోర్టు నుంచి అనుమతులు రాగానే కొత్త భవనం నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారాయన. ఇదీ చదవండి: నాది రాజకీయం కాదు -
ఇంత అధ్వానమా? ఉస్మానియా ఆస్పత్రి వసతులపై గవర్నర్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ సోమవారం సందర్శించారు. బిల్డింగ్ పరిస్థితిని, అక్కడి వసతులను స్వయంగా సమీక్షించిన ఆమె.. రోగులకు అందుతున్న వైద్యం పైనా ఆరా తీశారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రి మెయింటెనెన్స్ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారామె. ఉస్మానియా లో కనీసం 3000 నుంచి 4000 బెడ్స్ ఉండాలి. కానీ, ఒక్క భవనంలోని మూడు బిల్డింగ్‌లకు సరిపడా రోగులు ఉంచుతున్నారు. ప్రభుత్వ ఇనిస్టిట్యూట్ల మీద నాకు అవగాహన ఉంది. కానీ, ఇంత ఇరుకుగా ఉన్న చోట మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందికి నా అభినందనలు. మొదట్లో లేఖ అందింది.. 2019 లో గవర్నర్ అయ్యాక మొదటి సారి నన్ను ఓజిహెచ్ వైద్యులు వచ్చి కలిసి, లేఖ అందించారు.ఆస్పత్రి భవంతి విస్తరించాలని, రోగులకి చోటు చాలడం లేదని అనేక మార్లు ప్రభుత్వానికి చెప్పాము. ఒక్కో బెడ్ మీద ఇద్దరు ముగురిని ఉంచి సేవలు అందించాల్సిన పరిస్థితి ఇక్కడుంది. ఆఖరికి టాయిలెట్లకు సరైన డోర్ లు కూడా లేకపోవడం బాధాకరం. భారీగా పెరిగిన రోగులతో ఆసుపత్రి కిక్కిరిసి , ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి. అటెండర్ లకు కూడా ఉండేందుకు సరైన స్థలం లేదన్నారామె. రాజకీయ నేతలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతారు. మరి పేద వాళ్ల పరిస్థితి ఏంటి?.. 7.5 ఎకరాల్లో ఎక్కువ ఫ్లోర్ లు వేసి ఆసుపత్రి భవనం కట్టవచ్చా?. ఉస్మానియా ఆస్పత్రి కోసం కొత్త భవంతి కచ్చితంగా కట్టాలి అని ఉద్ఘాటించారామె. అది రాజకీయం ఎలా అవుతుంది? దశాబ్దాల నాటి భవంతి ఇది. ఆసుపత్రిలో కావాల్సినంత చోటు లేదు. రోగులకి ఇచ్చే సేవలతో కాంప్రమైజ్ అవ్వకూడదు. త్వరగా భవంతి కట్టాలని చెప్పడం కూడా రాజకీయం అనిపిస్తే ఏం చెప్పగలం?. అలాంటి విషయాలను సుహృద్భావంతో తీసుకోవాలి. కానీ నేను రాజకీయ నేతలా మాట్లాడుతున్నాను అనడం సరికాదు. సరైన స్థలం లేక బాధపడుతున్నప్పుడు గవర్నర్ గా వారికి సమస్యలను చూడటం నా బాధ్యత. నాకు సమస్యల గురించి చెప్పే హక్కు లేదా?. ఇప్పుడు కూడా ఒకే పడకపై ముగ్గురు పిల్లలు ఉన్న దృశ్యాలను నేను చూసాను ,అది బాధాకరం. పేద ప్రజలకు మెరుగైన సేవలు అందలి అన్నదే నా లక్ష్యం. నన్ను ప్రశ్నించడానికి బదులుగా సమస్యకు పరిష్కారం చూపితే బావుంటుంది అని పేర్కొన్నారామె. ప్రభుత్వం లీగల్ ఇష్యూ అని చెప్పి చేతులు దులువుకోవడం సరికాదని.. ఉస్మానియా పై మంత్రి నిర్వహిస్తున్న సమీక్ష ద్వారా మంచి పరిష్కారం అందాలని కోరుతున్నట్లు తెలిపారామె. ఈ పర్యటనలో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని మరోమారు స్పష్టం చేసిన ఆమె.. రోగులకు మంచి జరగాలి అనేదే తన ఉద్దేశమని చివర్లో పేర్కొన్నారు. -
ఈ డాక్టర్లకు ఆల్ ది బెస్ట్
హైదరాబాద్‌లో ఇద్దరు డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో నియామకం పొందారు. అదేం పెద్ద విశేషం? విశేషమే. ఎందుకంటే వీరిద్దరూ ట్రాన్స్జెండర్లు. గత కొంతకాలంగా దేశంలో తమ ఆత్మగౌరవం కోసం, ఉపాధి కోసం, హక్కుల కోసం పోరాడుతున్న ‘ఎల్జిబిటి’ సమూహాలకు ఈ నియామకం ఒక గొప్ప గెలుపు. అందుకే వీరికి ఆల్ ది బెస్ట్ చెప్పాలి. గత వారం ప్రాచీ రాథోడ్ (30), రూత్ జాన్ పాల్ (28) ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో హెచ్.ఐ.వి రోగులకు చికిత్స అందించే ఏ.ఆర్.టి విభాగంలో వైద్యాధికారులుగా నియమితులయ్యారు. వీరు రాష్ట్రంలో డాక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన తొలి ట్రాన్స్జెండర్లు కావడం విశేషం. కొత్త చరిత్రకు నాంది పలికిన వీరు ‘సాక్షి’ తో తమ అనుభవాలు పంచుకున్నారు. మా కమ్యూనిటీకి విజయమిది... ఈ ఇద్దరిలో డాక్టర్ రూత్‌ది ఖమ్మం. డాక్టర్ ప్రాచీ రాథోడ్‌ది ఆదిలాబాద్ జిల్లా. చిన్న వయసులోనే డాక్టర్లు కావాలని కలలు కన్నప్పటికీ, కుటుంబ సభ్యుల మద్దతు కరువై, స్కూల్లో తోటి విద్యార్థుల వేధింపులు, సమాజంలో చిన్నచూపు వంటివి ఎదుర్కొంటూనే లక్ష్యాన్ని సాధించగలిగారు. తమలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ప్రభుత్వ రంగంలో భాగస్వామ్యం కోసం పోరాడుతున్న ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి ఇదొక చారిత్రాత్మక విజయం అని వీరు అంటున్నారు. అర్హత ఉన్నా... తిరస్కరించారు... ‘మల్లారెడ్డి వైద్య విజ్ఞాన సంస్థలో 2018లో వైద్యవిద్య పూర్తి చేసినప్పటి నుంచి ఉద్యోగం కోసం విఫలయత్నాలు ఎన్నో చేశా. సిటీలో కనీసం 15–20 ఆసుపత్రులు ఉద్యోగ దరఖాస్తులను తిరస్కరించాయి. దీనికి కారణం మా జెండర్ అని ముఖం మీద చెప్పలేదు. కానీ అది మాకు అర్ధమైంది’ అన్నారు డా.రూత్.. తొలుత ఓ ఆసుపత్రిలో ఇన్ టర్న్షిప్ చేస్తున్నప్పుడు తనకు ఏ సమస్యా రాలేదనీ ∙లింగ మార్పిడి విషయం బయటపెట్టిన తర్వాతే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారామె. తన అర్హతలను కాకుండా జెండర్‌నే చూశారన్నారు. తెలిశాక... వద్దన్నారు... డాక్టర్ ప్రాచీ రాథోడ్ రిమ్స్ నుంచి డిగ్రీ పూర్తి చేసి ప్రైవేట్‌రంగంలో పనిచేస్తూ కెరీర్ ప్రారంభించారు. సిటీలో ఓ ఆస్పత్రిలో పని చేస్తూనే ఎమర్జెన్సీ మెడిసిన్ లో డిప్లొమా చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మూడేళ్లపాటు పని చేశారు. తన మార్పిడి గురించి తెలిశాక.. రోగులరాకకు ఇబ్బంది అవుతుందని ఆసుపత్రి భావించడంతో ఉద్యోగం పోగొట్టుకున్నారు. ఏపీలో పెన్షన్ భేష్ ‘ఉస్మానియాలో సహ వైద్యులు, రోగులు బాగా సహకరిస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులూ లేకపోవడం సంతోషంగా ఉంది’ అని వీరు చెప్పారు. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ట్రాన్స్జెండర్లకు పింఛనుగా ఏటా రూ.10 వేలు ఇస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ అలాంటి ప్రత్యేక సహాయ సహకారాలు అన్ని చోట్లా మొదలు కావాలని ఆశిస్తున్నామన్నారు. ‘మేమిద్దరం ట్రాన్స్ఉమెన్ గా నీట్ పీజీ పరీక్షలను రాశాము, అయితే థర్డ్ జెండర్‌ను గుర్తించి అడ్మిషన్ ను మంజూరు చేసేందుకు వీలు కల్పించిన 2014 నాటి సుప్రీం కోర్ట్‡ తీర్పుకు అనుగుణంగా రిజర్వ్డ్ సీట్లు పొందలేదు’ అని చెప్పారు. తమ కమ్యూనిటీకి జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తుతామని, సమాజంలో సమాన హక్కులకై పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేస్తున్నారు. దేశంలోనూ అక్కడక్కడ వైద్య రంగంలో కెరీర్ ఎంచుకుంటున్న ట్రాన్స్‌జెండర్స్ దేశంలో మరికొన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తున్నారు. కర్ణాటకలో త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు ట్రాన్స్ డాక్టర్‌గా, యాక్టివిస్ట్‌గా జాతీయస్థాయిలో పేరొందారు. అలాగే కేరళకు చెందిన వి.ఎస్.ప్రియ కూడా లింగమార్పిడి చేయించుకున్న తొలి వైద్యురాలిగా రాణిస్తున్నారు. ఇప్పటికే రెండు ట్రాన్స్‌జెండర్ క్లినిక్స్ ప్రారంభించిన తొలి నగరంగా సిటీ నిలిచింది. ఇద్దరు ట్రాన్స్ డాక్లర్లకు చిరునామాగా నిలిచిన ఘనతను కూడా తన సొంతం చేసుకుంది. ఒకే తరహా కష్టం కలిపింది స్నేహం అనేకానేక బాధాకరమైన అనుభవాల తర్వాత బతుకుదెరువు వేటలో భాగంగా వీరు ఇద్దరూ వేర్వేరుగా గత ఏడాది నారాయణగూడలో ఎన్.జి.ఓ ఆధ్వర్యంలో ప్రారంభమైన ట్రాన్స్‌జెండర్ క్లినిక్ ‘మిత్ర్’లో చేరారు. మంచి స్నేహితులయ్యారు. ఒకే తరహా సమస్యల మధ్య ఏర్పడిన తమ స్నేహం వేగంగా దృఢమైన బంధంగా బలపడిందనీ ఒకరి కొకరు తోడుగా, తోడబుట్టిన అక్కచెల్లెళ్లను మించి సాగుతోందని వీరు చెప్పారు. ప్రతీ సందర్భంలోనూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతున్నామంటున్నారు. – ఎస్.సత్యబాబు సాక్షి, సిటీబ్యూరో -
ఉస్మానియా ఆస్పత్రిలో మహిళపై దాడి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో ఓ మహిళపై దాడి చేసిన ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్ ఆరీఫ్‌ను అఫ్జల్‌గంజ్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లు ఆస్పత్రి ప్రధాన గేటు ఎదుట, మార్చురీ వద్ద తిష్టవేసి రోగులను ముక్కుపిండి మరీ అధిక డబ్బులు వసూలు చేస్తుంటారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఆస్పత్రి ఆవరణలో ఫరీనా (45) అనే మహిళతో డ్రైవర్‌కు స్వల్ప వివాదం చోటు చేసుకుంది. దీంతో అతను ఆమెపై దాడి చేసి, పక్కనే ఉన్న సెక్యురిటీతో కర్ర తీసుకొని కొట్టాడు. ఈ సంఘటనను గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. అఫ్జల్‌గంజ్ పోలీసులు ఆరీఫ్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో తిష్టవేసి రోగులకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు. చదవండి: ‘చీకోటి’ కేసులో ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు? వాట్సాప్ చాట్లు వెలుగులోకి -
Hyderabad: ఉస్మానియా.. ఆస్పత్రికి పనికిరాదు
సాక్షి, హైదరాబాద్: ‘హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి భవనం ప్రమాదకరంగా ఉంది. ఇప్పడున్న పరిస్థితుల్లో ఆస్పత్రి కొనసాగింపునకు పనికిరాదు. పునరుద్ధరణ, మరమ్మతులు చేస్తే భవన జీవితకాలం కొన్నేళ్లు పెంచొచ్చు. ఆ తర్వాత ఆస్పత్రి కాకుండా ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు. వారసత్వ భవన జాబితాలో ఉన్న నేపథ్యంలో నిపుణుల పర్యవేక్షణలో రక్షణ చర్యలు తీసుకోవచ్చు. ఆక్సిజన్ పైప్లైన్లు, గ్యాస్ లైన్లు, ఏసీలు, వాటర్ పైప్లైన్ల లాంటివి ఏర్పాటు చేస్తే దాని భవన ధృడత్వం మరింత దెబ్బతింటుంది’.. ఇదీ ఉస్మానియా ఆస్పత్రి భవన ధృడత్వంపై ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదిక. కాగా, ఉస్మానియా ఆసుపత్రిని అదే భవనంలో కొనసాగించాలని కొందరు.. ఆ భవనంలో వద్దని మరికొందరు కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు(పిల్లు) దాఖలు చేశారు. వీటిపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సూరేపల్లి నందా ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. గతంలో హైకోర్టు.. ఉస్మానియా ఆస్పత్రి భవనం ఎంత బలంగా ఉందో తేల్చేందుకు నిపుణుల కమిటీని నియమించింది. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్ ఈఎన్సీలు, జీహెచ్ఎంసీ సిటీ ప్లానర్లతో కమిటీ వేసింది. వరంగల్ ఎన్ఐటీ నిపుణుల సాయంతో ఆస్పత్రి భవనాన్ని గత మార్చి 19న పరిశీలన, పరీక్షలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో కమిటీలో అందరూ స్టేట్ ఆఫీషియల్స్ ఉండటంతో హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్, ఆర్కెయాలజీ ఆఫ్ ఇండియా ఎస్ఈ, స్టెడ్రంట్ టెక్నోకక్లినిక్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు కమిటీలో స్థానం కల్పించింది. ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదికను సమర్పించినట్లు ఏజీ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు నివేదించారు. నివేదిక అధ్యయనానికి గడువు కావాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సమ్మతించిన ధర్మాసనం.. నివేదిక ప్రతులను పిటిషనర్లకు, ప్రతివాదులందరికీ అందజేయాలని సూచించింది. దానిపై అధ్యయనం చేసి.. ఆగస్టు 25కు న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. -
Hyderabad: ఉస్మానియాలో శవాల తారుమారు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిలో అపరాధం జరిగింది. ఒకరికి చెందిన మృతదేహాన్ని మరొకరికి అప్పగించిన ఘటన చోటుచేసుంది. దీంతో మృతుడి బంధువులు నిరసనకు దిగారు. పోలీసులు తమ తప్పు తెలుసుకుని.. అంత్యక్రియలు నిర్వహించిన శవానికి గురువారం రీ పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియ ఆస్పత్రి మార్చురీకి తరలించిన ఘటన ఇది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శివరాంపల్లికి చెందిన పాండురంగాచారి (70) కట్టెల మిల్లులో దినసరి కూలీ. ఈ నెల 10న మైలార్‌దేవ్‌పల్లిలో స్పృహ తప్పి పడిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చికిత్స నిమిత్తం అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పాండురంగాచారి ఈ నెల 12న మృతి చెందాడు. పని నిమిత్తం వెళ్లి ఇంటికి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు యజమానిని సంప్రదించారు. అతను పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి ఉస్మానియా మార్చురీలో ఉన్న గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించాల్సిందిగా సూచించారు. ఈ క్రమంలో సంజీవరెడ్డి నగర్‌కు చెందిన ఇతరులు పొరపాటున పాండురంగాచారి మృతదేహం తమకు చెందినదేనని అంగీకరించడంతో ఎస్సార్‌నగర్ పోలీసులు పాండురంగాచారి మృతదేహాన్ని అప్పగించారు. మృతదేహానికి వారు అంత్యక్రియలు నిర్వహించారు. గురువారం పాండురంగాచారి కుటుంబీకులు మార్చురీకి వచ్చారు. అదేరోజు మిస్సింగ్ కేసు నమోదైన మరో వ్యక్తి మృతదేహాన్ని వారికి చూపించారు. అది పాండురంగాచారి శవం కాదని వారు నిర్ధారించారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న పోలీసులు తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో.. అప్పటికే అంత్యక్రియలు నిర్వహించిన పాండురంగాచారి మృతదేహాన్ని రీ పోస్టుమార్టం చేసేందుకు మార్చురీకి తరలించారు. పోలీసుల నిర్వాకంతో రెండు కుటుంబాల సభ్యులు మనోవేదనకు గురయ్యారు. -
డ్యూటీలో ఉన్న డాక్టర్‌పై ఊడిపడిన ఫ్యాన్.. హెల్మెట్ డాక్టర్స్!
సాక్షి, అప్జల్‌గంజ్: రోగులకు ప్రాణం పోసే వైద్యులు వారు. కానీ.. తమ ప్రాణాలకే దిక్కులేకుండా పోయిందని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు తమ తలలకు హెల్మెట్లు ధరించి విధులకు హాజరయ్యారు. అంతకు ముందు అవుట్ పేషెంట్ బ్లాకు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో విధులు నిర్వర్తించాలంటే భయంగా ఉందని, తమ ప్రాణాలకు రక్షణ లేదంటూ ఆవేదన చెందారు. చదవండి: ఆరుగురు కూతుళ్లు అందరూ డాక్టర్లు సోమవారం డెర్మటాలజీ విభాగంలో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ భువనశ్రీ తలపై ఫ్యాన్ ఊడి పడడంతో ఆమె గాయాల పాలయ్యారు. ఈ నేపథ్యంలో తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని జూనియర్ డాక్టర్లు నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే నూతన భవన నిర్మాణ దిశగా అడుగులు వేయాలని కోరారు. చదవండి: హుజురాబాద్ ఉప పోరు: ఈ కొన్ని గంటలే కీలకం! -
ఉస్మానియా జనరల్ ఆసుపత్రి: నకిలీ డాక్టర్ ఆరెస్టు
సాక్షి, అఫ్జల్‌గంజ్: ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో నకిలీ డాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను ప్రభుత్వ వైద్యుడినని చెప్పుకుంటూ రోగులకు వేద్యసేవలు చేస్తున్న వైద్యుడిని డ్యూటీ సీఎంఓ డాక్టర్ ప్రణీత గుర్తించి వెంటనే ఆర్ఎంఓకు సమాచారం ఇచ్చారు. ఆర్ఎంఓ సిద్ధీఖీ అతడిని విచారించగా పొంతన లేని సమాధానం చెప్పడంతో అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నకిలీ డాక్టర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా చంద్రాయణగుట్ట, బండ్లగూడ ప్రాంతానికి చెందిన మార్వాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్‌గా (27) గుర్తించారు. ఇతను గతంలోనూ ఉస్మానియా ఆస్పత్రిలో నకిలీ వైద్యుడిగా చలామణి అయినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్సై బాలస్వామి దర్యాప్తు చేపట్టారు. -
ఒకప్పటి గోల్సావాడీ బస్తీ.. ఇప్పుడు ఉస్మానియా
తెలంగాణ నలుదిక్కుల నుంచి వచ్చే పేద రోగుల పాలిట అది పెద్దాస్పత్రి... పూర్తిగా కోలుకొని ఆరోగ్యవంతులుగా బయటకు వెళతామనే ఓ నమ్మకం.. వైద్యంలో ఎన్నో ప్రయోగాలకు ఇదో వేదిక...అదే ఉస్మానియా ఆస్పత్రి. కానీ ప్రస్తుత ఉస్మానియా ఆస్పత్రి భవనాలను చూస్తే...శిథిల చిత్రాలేకనిపిస్తున్నాయి. పెచ్చులూడిన పై కప్పులు, కూలిపోయిన గోడలు, ఎక్కడపడితే అక్కడ పగుళ్లు...చిన్నపాటి వర్షానికే ఉరుస్తున్న వైనం..వైద్యం సంగతిమాటేమిటోగానీ...ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం నీడన ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని రోగులు, వారి సహాయకులు, డాక్టర్లు, సిబ్బంది అనేకఇబ్బందులు పడుతున్నారు. అయితే పదేళ్ల క్రితం నుంచే ఉస్మానియా ఆస్పత్రి భవనాల మరమ్మతులకు ప్రణాళికలు రూపొందిస్తూ వస్తున్నారు. కొత్త భవనాల నిర్మాణానికి ప్రస్తుత ప్రభుత్వం సిద్ధంకాగా, హెరిటేజ్కట్టడాలను కాపాడాలని కొన్ని సంస్థలు, ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలోఒక్క అడుగూ ముందుకు పడలేదు. అయితే ప్రస్తుతం ఉన్న భవనాలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేసినా, మరో పాతికేళ్లు అందుబాటులో ఉంటుందని నిపుణులు అంటున్నారు. సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పటి ప్రాణదాత..లక్షలాది రోగుల ఆరోగ్య ప్రదాయిని, అక్కడికి వెళితే చాలు ప్రాణాలతో బయటపడవచ్చు అనే భరోసా..ఎన్నో ప్రయోగాలకు...మరెన్నో అద్భుతాలకు వేదికగా నిలిచిన ప్రతిష్టాత్మాక ఉస్మానియా జనరల్ ఆస్పత్రి భవనం ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఒక వైపు గోడల పగుళ్లు.. మరో వైపు కుప్పకూలుతున్న పెచ్చులు...ఇంకో వైపు ముంచెత్తుతున్న మురుగు నీరు వెరసి..కనీస వైద్యాన్ని అందించలేని దుస్థితి. ఆస్పత్రికి వెళ్లితే రోగాలు తగ్గుతాయో లేదో కానీ..కొత్త రోగాలు ఖాయం అంటున్నారు వైద్య నిపుణులు. కనీస భద్రత లేని ఈ పాత భవనంలో వైద్య సేవలు అందించలేమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతుండగా...పడకల మధ్యలో మోకాల లోతులో నిల్వ ఉన్న మురుగు నీటి మధ్య ఉండలేమని రోగులు, వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పటి గోల్సావాడీ బస్తీ..ఇప్పుడు ఆస్పత్రి గోల్సావాడి..వెండి వెన్నెల వెలుగుల్లో తళతళలాడే మూసీనది ఒడ్డున వెలసిన ఓ బస్తీ. పాశ్చాత్య ప్రపంచంలో అప్పటికే బాగా ప్రాచుర్యం పొందిన వైద్యాన్ని హైదరాబాద్‌కు పరిచయం చేసింది ఈ బస్తీయే. యునానీ, ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్యపద్ధతులు మాత్రమే అందుబాటులో ఉన్న రోజుల్లో నాలుగో నిజాం ప్రభువు నసీరుద్దౌలా బ్రిటీష్ వైద్య చికిత్సలు చేసే ఆస్పత్రిని ఈ బస్తీలో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. వైద్యంతో పాటు బోధనా పద్ధతులను, పాఠ్యగ్రంథాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. ఆస్పత్రి నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించారు. ఐదో నవాబు అప్జలుద్దౌలా హయాంలో ఆస్పత్రి నిర్మాణం పూర్తి అయింది. 1866 నాటికి అది అఫ్జల్‌గంజ్ ఆస్పత్రిగా వైద్య సేవలు ప్రారంభించింది. ఫలితంగా అప్పటి వరకు కంటోన్మెంట్‌లోని బ్రిటీష్ సైనికులకు మాత్రమే అందిన ఈ వైద్యసేవలు అప్పటి నుంచి సామాన్యులకు కూడా చేరువయ్యాయి. కానీ ఆ ఆస్పత్రి ఎంతో కాలం మనుగడ సాగించ లేదు. 1908లో వచ్చిన మూసీ వరదల్లో నేలమట్టమైంది. ఆరోనిజాం మీర్‌మహబూబ్ ఆలీఖాన్ పాలనా కాలంలో చోటు చేసుకున్న మహా విషాదం అది! ఆ తర్వాత కొంతకాలానికే ఆయన కూడా కాలధర్మం చేశారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ పగ్గాలు చేపట్టారు. అఫ్జల్‌గంజ్ ఆస్పత్రి స్పూర్తిని బతికించాలని భావించిన ఆయన..సుమారు 27 ఎకరాల విస్తీ ర్ణంలో ప్రస్తుతం ఉన్న ఈ భవనాన్ని నిర్మించారు. అలనాటి ప్రముఖ ఆర్కిటెక్ట్ విన్సెంట్ మార్గదర్శకత్వంలో ఈ మహాసౌధం వెలిసింది. ఇండో పర్షియన్ శైలి..రూ.50 వేల ఖర్చు 1918–20లో ఆస్పత్రి భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నల్లగ్రానైట్, సున్నం కలిపి కట్టించిన ఈ పటిష్టమైన భవనం ఇండో పర్షియన్ శైలిలో రూపుదిద్దుకుంది. అప్పట్లో ప్రసిద్ధి చెందిన రాజస్థానీ, గ్రీకు, రోమన్, శైలి నిర్మాణ పద్ధతులను జత చేశారు. సుమారు తొమ్మిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకేసారి 450 మంది రోగులకు చికిత్స అందించేలా దీన్ని నిర్మించారు. ఎలాంటి యంత్రాలు వాడకుండా కేవలం కూలీలతో ఐదేళ్ల పాటు శ్రమించికట్టారు. నిర్మాణానికి ఆ రోజుల్లోనే రూ.50 వేల వరకు ఖర్చు చేసినట్లు అంచనా. 1925లో ఈ భవనం అందుబాటులోకి వచ్చింది. ఇండో పర్షియన్ శైలిలో రూపుదిద్దుకున్న 110 అడుగుల ఎత్తైన విశాలమైన డోమ్‌లు ఆస్పత్రికి ప్రత్యేక ఆకర్షణ. ఎత్తైన గోడలకు పై భాగంలో నిజాం ప్రభువుల తలపాగాలను ప్రతిబింబించే ఆకతులను చిత్రీకరించారు. చార్మినార్‌లోని మినార్లను పోలిన నిర్మాణాలను ఆస్పత్రి భవనంపై కట్టారు. డోమ్‌లను కేవలం కళాత్మకత దష్టితోనే కాకుండా భవనంలోని గాలి, వెలుతురు ప్రసరించేలా నిర్మించారు. రాత్రి వేళ్లలో విద్యుత్ అందుబాటులో లేని సమయాల్లో కూడా వైద్యసేవలకు ఇబ్బంది లేకుండా ఎక్కువగాలి, వెలుతురు వచ్చేలా వీటి నిర్మాణం ఉంది. తొలి క్లోరోఫామ్ చికిత్స ఇక్కడే ఆస్పత్రి అనేక అద్భుతాలు ఆవిష్కరణలకు వేదికైంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎడ్వర్డ్ లారీ నేతత్వంలోని వైద్యబందం ప్రపంచంలోనే తొలిసారిగా క్లోరోఫామ్‌ను మత్తుమందుగా ఉపయోగించి రోగులకు చికిత్సలు చేశారు. ఈ అద్భుతాన్ని అధ్యయనం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులంతా ఇక్కడికే వచ్చేవారు. అంతేకాదు 1982లో దేశంలోనే తొలి కిడ్నీ మార్పిడి చికిత్స కూడా ఇక్కడే జరిగింది. డాక్టర్ ఆరస్తు అఫ్జల్‌గంజ్ ఆసుపత్రిలో తొలి చికిత్స చేశారు. ప్రఖ్యాత వైద్య నిపుణులు డాక్టర్ ఎడ్వర్డ్ లారీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా వ్యవహరించారు. ఆయన తన జీతభత్యాలు, పెన్షన్ మొత్తాన్ని ఆస్పత్రికే ఖర్చు చేశారు. తర్వాత డాక్టర్ గోవిందరాజులు నాయుడు, డాక్టర్ సత్యవంత్ మల్లన్న, డాక్టర్ హార్డికర్, డాక్టర్ సర్ రోనాల్డ్ రాస్, వంటి ప్రముఖ వైద్యులు ఆస్పత్రిలో సేవలు అందించారు. ప్రతిపాదించి పదేళ్లు దాటింది.. ఇప్పటికీ పునాది రాయి పడలే చారిత్రక ఈ భవనంలో వైద్యసేవలు ఇటు రోగులకు..అటు వైద్యులకు ఏమాత్రం శ్రేయస్కరం కాదని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి భావించారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఏడంతస్తుల భవనాన్ని నిర్మించాలని భావించి ఆ మేరకు 2009లో రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఆయన మరణం తర్వాత అధికారం లోకి వచ్చిన రోశయ్య 2010 బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన రాజీనామా తర్వాత సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కిరణ్ కుమార్‌రెడ్డి ఇందుకు రూ.50 కోట్లు కేటాయించారు. శంకుస్థాపన కోసం ఓ పైలాన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఏడంతస్తుల భవనానికి ఆర్కియాలజీ విభాగం అ«భ్యంతరం చెప్పడంతో నాలుగు అంతస్తులకు కుదించారు. 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ తొలిసారిగా ఆస్పత్రిని సందర్శించారు. వారం రోజుల్లో పాత భవనాన్ని ఖాళీ చేసి, దాని స్థానంలో కొత్త భవనం నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆమేరకు తెలంగాణ తొలి బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. పాతభవనం కూల్చివేతకు ఇటు ఆర్కియాలజీ..అటు ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఇదే ఆస్పత్రి ప్రాంగణంలో ఖాళీగా ఉన్న స్థలంలో మరో రెండు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు పునాది రాయికూడా వేయలేదు. రక్షణ లేని ఈ పాత భవనంలో వైద్య సేవలు అందించలేక పోతున్నామని ఆస్పత్రి వైద్య సిబ్బంది 2018లో వంద రోజుల పాటు ఆందోళన చేపట్టింది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పటికే ఒకటి, రెండో అంతస్తులను ఖాళీ చేశారు. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్‌లోనే చికిత్సలు అందిస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షానికి మురుగు నీరు వార్డుల్లోకి చేరింది. ఒక వైపు ఊడిపడుతున్న పైకప్పు పెచ్చు లు...మరో వైపు వార్డుల్లో నిలిచిన మోకాలి లోతు మురుగు నీటి దుర్వాసన మధ్య రోగులు భయంతో బెంబేలెత్తిపోతున్నారు. ఇదీ పాత భవనం దుస్థితి ప్రస్తుతం ఉస్మానియా పాత భవనంలో జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాలు కొనసాగుతున్నాయి. 670 పడకల సామర్థ్యం..నాలుగు ఆపరేషన్ థియేటర్లు, 20 వార్డులు ఉండే ఈ భవనంలో పెచ్చులూడి పడుతుండటంతో ఇప్పటికే రెండో అంతస్తును ఖాళీ చేసి, కొన్ని పడకలను క్యాజువాలిటీ బ్లాక్‌కు, మరికొన్ని కులికుతుబ్‌షా బిల్డింగ్‌లోకి తరలించారు. మరో 350 పడకలను పాతభవనం గ్రౌండ్ ఫ్లోర్ సహా ఫస్ట్ ఫ్లోర్లలో సర్దుబాటు చేశారు. చారిత్రక ఈ భవనం నిర్వహణ లోపం వల్ల ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. స్లాబ్ సహా గోడలపై చెట్లు మొలకెత్తడంతో గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. వర్షం కురిసినప్పుడు స్లాబ్ నుంచి వాటర్ లీకవుతోంది. దెబ్బతిన్న డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించక పోవడం, గోడలకు ఏర్పడిన పగుళ్లను అలాగే వదిలేయడం వల్ల వర్షానికి పూర్తిగా తడిసి కూలేందుకు సిద్ధంగా ఉంది. భవనం పునరుద్ధరణ పనులను వదిలేసి..ఇటీవల అంతర్గత రోడ్లు ఏర్పాటు చేశారు. పాతభవనం గ్రౌండ్ ఫ్లోర్ కంటే ఈ రోడ్లు ఎత్తుగా ఉన్నాయి. దీనికి తోడు బేగంబజార్ నుంచి వచ్చే మురుగునీటి వ్య వస్థ ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణం నుంచి మూసిలో కలుస్తుంటుంది. అయితే ఈ డ్రైనేజీ లైన్లు ఇటీవల మట్టితో పూడిపోవడం, వాటిని గుర్తించి క్లీన్ చేయక పోవడంతో బయటి నుంచి వచ్చిన వరద డోమ్గేటు వెనుక భాగంలోని ఆస్పత్రి ఆవరణలో పొంగిపొర్లి పాతభవనంలోని ఎంఎం2, ఎంఎం3 సహా సూపరింటిండెంట్ ఆఫీసు తదితర వార్డులకు చేరుతుంది. ఒక్కోవార్డులో వంద మంది వరకు చికిత్స పొందుతుంటారు. హటాత్తుగా ఆయా వార్డులను వరద నీరు ముంచెత్తడం తో రోగులను ఫస్ట్ ఫ్లోర్‌కు తరలించాల్సి వచ్చింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో కొంత మంది కిందే నీళ్లలో గడపాల్సి వచ్చింది. పేగు బంధం ఉందన్న వాళ్లే నాశనం చేస్తున్నారు ఇప్పటి వరకు హైదరాబాద్‌తో పేగు బంధం లేనివారే ఉస్మానియా ఆస్పత్రి శిథిలావస్థకు కారణమైనట్లు చెప్పుకున్నాం. కానీ ప్రస్తుతం ఈ నగరంతో అనుబంధం ఉన్నట్లు చెప్పు కుంటున్న వారే పరోక్షంగా ఆస్పత్రిని ఉస్మాన్సాగర్ను తలపింపజేశారు. వందేళ్లలో ఎప్పుడు రానీ డ్రైనేజీ వాటర్ ఇప్పుడే ఆస్పత్రిలోకి ఎలా వచ్చింది? ప్రభుత్వ నిర్వహణ లోపమే ఇందుకు కారణం. రోగులను బతి కుండగానే తోడేళ్లకు, రాబంధులకు అప్ప జెప్పుతుంది. కొత్త భవనాల పేరుతో చారిత్రక భవనాలను కూల్చి వేస్తుంది. తెలంగాణ సంపదను కాంట్రాక్టర్లకు కట్టబెడుతోంది. – పాశం యాదగిరి, సీనియర్ జర్నలిస్టు ఆ సూచనలు పట్టించుకోలేదు పురావస్తు కట్టడాల జాబితాలో చోటు దక్కించుకున్న ఉస్మానియా పాత భవనం నాణ్యతను పరిశీలించేందుకు 2014లో ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ హెరిటేజ్(ఇంటాక్) బందం సందర్శించింది. నిర్వహణ లోపం వల్లే భవనం శిథిలావస్థకు చేరుకున్నట్లు ప్రకటించింది. 27 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్పత్రి ప్రాంగణంలో 2.5 ఎకరాల విస్తీర్ణంలోనే పాతభవనం విస్తరించి ఉంది. రోగుల అవసరాల దష్ట్యా కొత్త భవనం కట్టాలని ప్రభుత్వం భావిస్తే...ఆ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో కట్టొచ్చని సూచించింది. లేదంటే పాతభవనానికి మరమ్మతులు నిర్వహిస్తే మరో పాతికేళ్ల వరకు భవనాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకోవచ్చని సూచించింది. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఆఘాఖాన్ ట్రస్ట్‌తో మరమ్మతులు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత దాన్ని కూడా వదిలేశారు. – అనురాధారెడ్డి, కో కన్వీనర్, ఇంటాక్ తెలంగాణ కొత్తది కట్టాల్సిందే ప్రస్తుతం భవనం పూర్తిగా శిథిలాస్థకు చేరింది. తరచూ పెచ్చులూడి పడుతున్నాయి. ఇలాంటి భవనంలో చికిత్సలు అందించలేమని పేర్కొంటూ ఉస్మానియా ఆస్పత్రి వైద్య సిబ్బంది వంద రోజుల పాటు ఆందోళనలు నిర్వహించాం. అయినా ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పటికే ఫస్ట్ సహా సెకండ్ ఫ్లోర్లను ఖాళీ చేశాం. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్‌లోనే రోగులకు చికిత్స అందిస్తున్నాం. వార్డుల్లోకి మోకాల్లోతు మురుగునీరు చేరింది. పడకలపై ఉన్న రోగుల వద్దకు వైద్యులు వెళ్లలేని దుస్థితి. ఈ భవనాన్ని వెంటనే కూల్చివేయాలి. ఖాళీగా ఉన్న ఏడు ఎకరాల నాలుగు గుంటల స్థలంలో కొత్త భవనం కట్టాలి. – డాక్టర్ బొంగు రమేష్, చైర్మన్, తెలంగాణ మెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ తాజా కామెంట్లు ♦ ఖాళీగా ఉన్న ఏడు ఎకరాల నాలుగు గుంటల స్థలంలో కొత్త భవనాలు నిర్మించాలి. ♦ వందేళ్లలో ఎప్పుడూ రాని డ్రైనేజీ వాటర్ ఇప్పుడే ఆస్పత్రిలోకి ఎలా వచ్చింది ? ♦ రోగులు బతికుండగానే తోడేళ్లు, రాబందులకు అప్పజెప్పినట్టుంది..! ♦ ఉన్న భవనాలను ఖాళీ చేసి కొత్త బిల్డింగులు కట్టాల్సిందే. ♦ పాత భవనాలకు మరమ్మతులు చేస్తే.. మరో పాతికేళ్ల వరకు భవనాన్నిచెక్కు చెదరకుండా కాపాడుకోవచ్చు. -
ఉస్మానియాలో అధ్వాన్నంగా పరిస్ధితులు
-
హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రిని ముంచెత్తిన వరద నీరు
-
లక్షణాల్లేని వారి నుంచే సంక్రమణ..
భసాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ సోకినా, దీనికి సంబంధించిన దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు లేనివారి నుంచే 74 శాతం మేర ఇతరులకు సంక్రమించే అవకాశాలున్నాయని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కొండల్ రెడ్డి తెలిపారు. కొందరు మాత్రమే మాస్కులు ధరించడం వల్ల ప్రయోజనం లేదని, ఈ లక్షణాలున్నా లేకపోయినా అందరూ మాస్క్‌లు వాడితేనే ఈ వైరస్ సోకకుండా, వ్యాప్తి చెందకుండా నివారించొచ్చని చెప్పారు. ఈ విధంగా 80 శాతం మంది మాస్కులు ధరిస్తే కరోనాను పూర్తిగా అరికట్టవచ్చునన్నారు. బుధవారం ఐ అండ్ పీఆర్ కార్యాలయంలో పల్మనాలజిస్ట్ దివ్యేష్ వ్యాఘ్రేతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా నోటి తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతోందని, బయటికి వెలువడ్డాక గాలిలో 3 గంటలు మాత్రమే ఉంటుందని తెలిపారు. ఇది చేతులకు తగిలి నోటికి, ముక్కు, కళ్ల ద్వారా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుందన్నారు. అరవై ఏళ్లు పైబడిన వారు, గుండె, ఆస్తమా, కిడ్నీ, డయాబెటీస్, బీపీ ఉన్నవారు ఇళ్లలోంచి బయటకు రాకపోవడమే మంచిదని స్పష్టంచేశారు. షుగర్, బీపీ పేషెంట్లు అవి కంట్రోల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, గుండె, కిడ్నీ, శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా సమస్యలున్నవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పల్మనాలజిస్ట్ దివ్యేష్ వ్యాఘ్రే తెలిపారు. -
ఉస్మానయా..
సాక్షి, సిటీబ్యూరో: డెంగీ జ్వరాలతో బాధపడుతూ చికిత్స కోసం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి చేరుకునే రోగులకు శుభవార్త. ఇకపై అత్యవసర పరిస్థితుల్లో ప్లేట్లెట్ల కోసం ప్రైవేట్ రక్తనిధి కేంద్రాల వెంట పరుగులు తీయాల్సిన అవసరం లేదు. ఇందుకు పెద్ద మొత్తంలో చెల్లింపు చేయాల్సిన అవసరం కూడా లేదు. తెలంగాణలో డెంగీ జ్వరాల తీవ్రత, ఆస్పత్రికి చేరుకుంటున్న రోగుల అవసరాల దృష్ట్యా ఇకపై ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలోనే సింగిల్ డోనర్ ప్లేట్లెట్ మెషీన్ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఆ మేరకు అత్యాధునిక ఎస్డీపీ మెషీన్‌ను దిగుమతి చేసుకుని ట్రయల్ రన్ నిర్వహిస్తోంది. ప్రస్తుతం టెక్నీషియన్లకు శిక్షణ ఇస్తోంది. త్వరలోనే ఈ సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానుంది. అత్యాధునిక ఈ ఎస్డీపీ మిషన్ అందుబాటులోకి రావడం వల్ల డోనర్ నుంచి రక్తం బయటికి తీయకుండా నేరుగా ప్రాసెస్ చేసే అవకాశం ఉంది. రోగికి 350 ఎంఎల్ ప్లేట్లెట్స్ ఎక్కించడం వల్ల వాటి సంఖ్యను ఏకకాలంలో 30 వేలకుపైగా పెంచొచ్చు. ఆర్డీపీ ద్వారా సేకరించిన ప్లేట్‌లెట్స్‌తో పోలిస్తే.. ఎస్డీపీ నుంచి ప్రాసెస్ చేసిన ప్లేట్లెట్స్ ఎక్కించడం వల్ల రోగి కోల్పోయిన ప్లేట్లెట్ల సంఖ్యను త్వరగా పునరుద్ధరించే అవకాశం ఉంది. అంతేకాదు ఇకపై పేద రోగులు ప్లేట్లెట్ల కోసం ప్రైవేటు రక్తనిధి కేంద్రాల వెంట పరుగెత్తాల్సిన అవ సరం కూడా లేదు. అవగాహన లేమి.. చికిత్సల్లో నిర్లక్ష్యం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది డెంగీ జ్వరాలు పెద్ద మొత్తంలో నమోదయ్యాయి. జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటలాడాయి. ఒకానొక దశలో ఆయా ఆస్పత్రుల్లో అడ్మిషన్లు కూడా దొరకని దుస్థితి తలెత్తింది. గాంధీ, నిమ్స్, నిలోఫర్ ఆస్పత్రుల్లో ఈ సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ మిష న్లు ఉన్నప్పటికీ...వాటిలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్లేట్లెట్స్ కోసం రోగుల బంధువులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా ఉస్మానియాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్న రోగుల్లో చాలా వరకు మూడు, నాలుగో స్టేజ్‌లో వస్తున్న వారే అధికం. పేద ప్రజల్లో డెంగీ జ్వరాలపై సరైన అవగాహాన లేకపోవడం, సాధారణ జ్వరంగా భావించి చికిత్సలను నిర్లక్ష్యం చేయడం వల్ల రక్తంలో ప్లేట్లె ట్స్ కౌంట్ పడిపోయి రోగనిరోధక శక్తి తగ్గుతోంది. 40 వేలలోపు బాధితులే అధికం నిజానికి మనిషి రక్తంలో 1.50 లక్షల నుంచి 4.50 లక్షల వరకు ప్లేట్లెట్స్ ఉంటాయి. జ్వర పీడితుల్లో ఈ కౌంట్ తగ్గుతుంది. ప్రస్తుతం ఆస్పత్రులకు వస్తున్న చాలామంది రోగుల్లో ప్లేట్లెట్ కౌంట్ 40వేల లోపే ఉంటోంది. వాస్తవానికి 25వేల వరకున్న పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు. ఒకవేళ కౌంట్ 20 వేలకు పడిపోయి నోరు, ముక్కు నుంచి బ్లీడింగ్ అయితే వెంటనే ప్లేట్లెట్స్ పునరుద్ధరించాలి. లేదంటే షాక్‌కు గురై కోమాలోకి వెళ్లి చనిపోయే ప్రమాదం ఉంది. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని తొలుత గ్రూపులుగా విభజించి, ఆ తర్వాత ర్యాండమ్ పద్ధతిలో ప్రాసెస్ చేస్తున్నారు. ప్రస్తుతం దీని నుంచి ప్లాస్మా, పీఆర్పీ, ఎస్డీపీ, ఆర్బీసీ వంటి సెల్స్‌ను వేరుచేసి ప్యాకెట్లో నిల్వ చేస్తున్నారు. అదే సింగిల్ డోనర్ మెషీన్లో ఇంత పెద్ద ప్రాసెస్ అవసరం ఉండదు. దాతను నేరుగా మెషీన్‌కు అనుసంధానం చేసి, అవసరమైన ప్లేట్‌లెట్స్‌ను మాత్రమే సేకరించే అవకాశం ఉంది. ఒకే సమయంలో 2000 ఎంఎల్ రక్తాన్ని ప్రాసెస్ చేస్తుంది. చాలా తక్కువ సమయంలోనే ముప్పైవేలకుపైగా ప్లేట్‌లెట్స్‌ను పునరుద్ధరించే అవకాశం ఉంది. -
క్యాథ్‌ల్యాబ్, ఎంఆర్‌ఐలకు సుస్తీ
సాక్షి, హైదరాబాద్: ‘చిత్రంలో కన్పిస్తున్న ఈమె పేరు తస్లిభాను. ఇటీవల ఈమె మెదడులో రక్తం గడ్డకట్టింది. చికిత్స కోసం ఉస్మానియాకు వచ్చింది. మెదడులో ఏర్పడ్డ రక్తం గడ్డలు ఏ మేరకు ఉన్నాయో నిర్ధారించేందుకు ఎంఆర్ఐ తీయించాల్సిందిగా సూచించారు. ఆస్పత్రిలో ఎంఆర్ఐ పని చేయడంలేదని, బయట చేయించుకుందామంటే తన వద్ద డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేసింది. ఎంఆర్ఐ రిపోర్టు వచ్చే వరకు మందులు రాయనని వైద్యుడు చెప్పడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉంది’. ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో 20 రోజులుగా ఎం ఆర్ఐ మిషన్ పనిచేయడం లేదు. 2007లో దీన్ని ఏర్పాటు చేశారు. రోజంతా విరామం లేకుండా పనిచేయడంతో మిషన్‌లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. గతంలో ఆయా ఆస్పత్రులే వార్షిక నిర్వహణ కింద మరమ్మతులు చేయించుకునేవి. 6 మాసాల క్రితం టీఎస్ఎంఐడీసీ.. చెన్నైకి చెందిన ఓ సంస్థకు ఈ పనులను అప్పగించింది. పాత బకాయిలు చెల్లిస్తే కానీ యంత్రాలకు మరమ్మతులు చేయమని సదరు సంస్థ భీష్మించుకుని కూర్చుంది. చేసేది లేక చాలామంది రోగులు ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఒక్కో టెస్టుకు రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు చెల్లించుకోవాల్సి వస్తుంది. క్యాథ్‌ల్యాబ్ అంతే..: ఎంఆర్ఐతో పాటు హృద్రోగ విభాగంలో కీలకమైన క్యాథ్ ల్యాబ్ వారం రోజులుగా పని చేయడం లేదు. హృద్రోగ సమస్యతో బాధపడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరుకుంటున్న రోగులకు కనీస వైద్యసేవలు అందడం లేదు. రోజుకు సగటున 10 మందికి యాంజియోగ్రామ్ నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం ఇక్కడ క్యాథ్‌ల్యాబ్ పనిచేయకపోవడంతో రోగులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎం ఆర్ఐ సహా క్యాథ్‌ల్యాబ్ నిర్వహణ బాధ్యత కూడా సదరు సంస్థదే. నిజానికి క్యాథ్‌ల్యాబ్‌పై ఎలాంటి బకాయిలు లేవు. కానీ సదరు సంస్థ రిపేరు చేసేందుకు నిరాకరిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఇతర ఆస్పత్రులకు సిఫార్సు చేసి చేతులు దులుపుకుంటున్నారు. -
హతవిధీ..ఇది ధర్మాసుపత్రి
ఉస్మానియా ఆస్పత్రిలో బెడ్లు కరువు కటిక నేలపై రోగుల అవస్థలు అఫ్జల్‌గంజ్: అనారోగ్యంతో బాధపడుతూ ప్రాణాలు కాపాడుకోవాలని ప్రభుత్వ ధర్మాసుపత్రికి వచ్చే రోగులను వైద్య సేవలు నేలకీడుతున్నాయి. మందులు, సేవల విషయం దేవుడెరుగు.. కనీసం పడుకోవడానికి బెడ్లు కూడా కరువయ్యాయి. నాణ్యమైన ఉచిత వైద్యమంటూ గొప్పలు చెప్పుకునే ప్రభత్వం కళ్లకు ఉస్మానియా ఆస్పత్రిలో తాండవిస్తోన్న సమస్యలు మాత్రం కనిపిండం లేదు. ఈ ఆస్పత్రికి వచ్చే రోగులంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారే. ఇక్కడ చాలినన్ని బెడ్లు లేక రోగులు కటిక నేలపైనే వైద్యం పొందుతూ అవస్థలు పడుతున్నారు. ఇక అర్ధరాత్రిళ్లు వచ్చే అత్యవసర రోగుల పరిస్థితీ మరీ దారుణంగా ఉంటోంది. నేలపైనే వైద్య సేవలు.. బెడ్లు లేక నేలపైనే పడుకున్న రోగులకు ఆస్పత్రి సిబ్బంది సైతం అక్కడే వైద్యం చేస్తున్నారు. రోగికి ఇబ్బందిగా ఉంది బెట్టు ఇప్పించాలని కోరితే.. తమ చేతుల్లో ఏమీ లేదని చేతులెత్తేస్తున్నారు. నేలపై రోగులు పగుతున్న అవస్థలను ఉన్నతాధికారులు చూస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. ఉస్మానియా ఆస్పత్రికి రోగుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. వందల మంది నిత్యం ఇన్ పేషెంట్లుగా చేరుతున్నారు. అయితే, ప్రభుత్వం వీరికి కావాల్సినన్ని ఏర్పాట్లు చేయకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఉన్నకొద్ది పాటి బెడ్లు చిరిగిపోయి పడుకోలేని స్థితి. ఈ చిత్రంలో నేలపై పడుకొని కనిపిస్తున్న వ్యక్తి పేరు హనుమంతరావు. ఇతడిది కూకట్‌పల్లిలోని వెంకటేశ్వర్‌నగర్ కాలనీ. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు తీవ్ర అస్వస్థతతో ఉస్మానియా ఆస్పత్రికి వచ్చాడు. బెడ్లు ఖాళీ లేక అతడిని నేలపైనే పడుకోబెట్టి వైద్యం చేస్తున్నారు. -
గాంధీ, ఉస్మానియాల్లో హుండీలు
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్లను కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో హుండీలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది. పెద్ద మొత్తంలో నగదు, నల్ల ధనం ఉన్నవారు హుండీలో డబ్బులేయొచ్చని, ఆ వివరాలు గోప్యంగా ఉంచుతామని, సొమ్మును పేదల వైద్యానికి ఖర్చు చేస్తామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. పెద్ద మొత్తంలో నగదు ఉన్న వారు బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆదాయపు పన్ను శాఖ నుంచి ఇబ్బందులు తప్పవని భావించే అవకాశముండటంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపారుు. -
నీళ్లు లేక ఉస్మానియాలో ఆగిన ఆపరేషన్లు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో నీరు లేకపోవడంతో శనివారం పలు శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. శస్త్రచికిత్స సమయంలో చేతులు శుభ్రం చేసుకునేందుకు నీరు లేక ఏకంగా నాలుగు ఆపరేషన్ థియేటర్లకు తాళాలు బిగించారు. ఫలితంగా 50కి పైగా శస్త్రచికిత్సలు వాయిదా పడ్డాయి. దీంతో తెల్లవారుజామునే ఆపరేషన్ థియేటర్ల వద్దకు చేరుకున్న రోగులకు తీవ్ర నిరాశే మిగిలింది. అంతేకాదు మూత్రశాలలు, మరుగుదొడ్లకు గత మూడు రోజుల నుంచి నీరు సరఫరా కావడం లేదు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు, ఇతర రోగులు, వారికి సహాయంగా వచ్చిన బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసన భరించలేక వైద్యులు కూడా అటువైపు వెళ్లడానికి భయపడుతున్నారు. రోజుకు 50 లక్షల లీటర్లు అవసరం: ఆస్పత్రి ఔట్‌పేషంట్ విభాగానికి ప్రతిరోజూ 2,000-2,500 మంది రోగులు వస్తుంటారు. ఇన్‌పేషంట్ విభాగాల్లో నిత్యం 1,500 మంది చికిత్స పొందుతుంటారు. వైద్యులు మరో 200 ఉంటారు. ప్రతి రోజు 150-200 శస్త్రచికి త్సలు జరుగుతుంటాయి. రోజుకు 50 లక్షల లీటర్ల నీరు అవసరం కాగా 29.47 లక్షల లీటర్లు సరఫరా అవుతోంది. వీటిని 14 ట్యాంకుల్లో నిల్వ చేస్తున్నారు. ట్యాంకులకు మూతల్లేక పావురాల మలవిసర్జన నీటిపై తేలియాడుతోంది. ట్యాంకుల్ని 15 రోజులకోసారి శుభ్రం చేయాల్సి ఉన్నా నెలకోసారీ చేయడం లేదు. పది మంది ఆర్ఎంవోలున్నా..: పంపింగ్ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఎప్పటికప్పుడు ట్యాంకులను క్లీన్ చేయడంతో పాటు నీటి సరఫరా, నిల్వలను పరిశీలించాలి. కానీ వీరెవరూ కూర్చున్న కుర్చీలో నుంచి కదలడం లేదు. పది మంది ఆర్ఎంవోలు పని చేస్తున్నా.. వీరు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకున్నా కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు పుచ్చుకుని వంద శాతం మార్కులు వేస్తుండటం కొసమెరుపు. -
ఇక్కడ ఇదే ఎక్స్‌రే
- ఉస్మానియా ఆస్పత్రిలో సెల్ఫోన్లోకి ఎక్స్‌రే చిత్రాలు - బకాయి చెల్లించక పోవడంతో ఫిల్మ్‌ల సరఫరా నిలిపివేసిన కాంట్రాక్టర్ - బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తనిఖీ.. అధికారులపై ఆగ్రహం సాక్షి, హైదరాబాద్ : పేదలకు పెద్దదిక్కుగా నిలిచిన ఉస్మానియా ఆస్పత్రిలో ఎక్స్‌రే ఫిల్మ్‌ల కొరత వేధిస్తుంది. ఆస్పత్రిలో ఎక్స్‌రే ఫిల్మ్‌లు లేకపోవడంతో ఎక్స్‌రే మిషన్‌లోని రోగి ఎముకల చిత్రాలను వారి సెల్ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఫోన్లో సరిగా కనిపించకపోవడంతో రోగులు ప్రైవేట్ డయాగ్నో స్టిక్స్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. ఉస్మానియా ఆస్పత్రి అవుట్ పేషంట్ విభాగానికి రోజూ 2000-2500 మంది రోగులు వస్తుంటారు. ఆస్పత్రిలో నిత్యం 1500 మంది చికిత్స పొందుతుంటారు. అత్యవసర విభాగానికి 150 మంది వరకూ వస్తుంటారు. ప్రభుత్వం బకాయి చెల్లించకపోవడంతో సదరు గుత్తేదారు ఇటీవల ఎక్స్‌రే ఫిల్మ్‌ల సరఫరాను నిలిపివేశాడు. దీంతో వారం రోజుల నుంచి రోగులు ఎక్స్‌రే కోసం ప్రైవేట్ డయాగ్నోస్టిక్స్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. వైద్యాధికారులపై కిషన్‌రెడ్డి ఆగ్రహం... ఇదిలా ఉంటే బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సోమవారం ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ విషయం తెలుసుకుని.. అధికారుల తీరుపై మండిపడ్డారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి ఫోన్ చేసి, సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, ఫిల్మ్‌లను పంపేందుకు ఆయన అంగీకరించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఫాంహౌస్‌లో కూర్చొని మాట్లాడుతున్నారని, అక్కడ కూర్చొని మాట్లాడితే ఆస్పత్రుల్లోని రోగుల సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. -
రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ ఆర్.లాలియానాయక్ తెలిపిన వివరాల ప్రకారం... ఆర్ట్స్ కాలేజీ - సీతాఫల్మండి రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి (50) పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందాడు. మృతుని ఒంటిపైన లైట్ వాయిలేట్ కలర్ గీతల ఫుల్‌షర్టు, వంకాయ కలర్ ఫ్యాంట్ ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘కాలేయ మార్పిడి’లో తెలంగాణ ఆదర్శం
- ఉస్మానియా ఆస్పత్రిలో తక్కువ ఖర్చుకు చేయడంపై దేశవ్యాప్త చర్చ - ఈ నెల 24-26 తేదీల్లో జరిగే బెంగళూరు జాతీయ సదస్సులో ప్రజెంటేషన్ సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యంత తక్కువ ఖర్చుతో ఉస్మానియా ఆస్పత్రిలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయడం ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు బెంగళూరులో జరిగే జాతీయ కాలేయ సదస్సులో ఈ అంశం ప్రముఖంగా చర్చకు రానుంది. చెన్నైకి చెందిన ప్రముఖ స్టాన్లీ మెడికల్ కాలేజీకి చెందిన వైద్యులు తెలంగాణలో తక్కువ ఖర్చుతో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయడాన్ని ఆదర్శంగా తీసుకున్నారు. అదెలా సాధ్యమైందో అధ్యయనం చేశారు. దీనిపై ప్రత్యేకంగా ఒక డాక్యుమెంట్‌ను రూపొందించారు. స్టాన్లీ మెడికల్ కాలేజీ వైద్యులు బెంగళూరులో జరిగే కాలేయ సంబంధిత సదస్సులో ‘ఉస్మానియా ఆస్పత్రిలో తక్కువ ఖర్చుతో కాలేయ మార్పిడి’ అనే అంశంపై ప్రత్యేకంగా ప్రజెంటేషన్ చేయనున్నారు. ఉస్మానియాలో ఇప్పటివరకు నాలుగు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. ఒక్కోదానికి రూ. 10.50 లక్షలు మాత్రమే ఖర్చు అయింది. సహజంగా కాలేయ మార్పిడి చికిత్స చేయాలంటే రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షలు కానుంది. నాలుగో వంతు ఖర్చుకే దీన్ని చేయడం ఎలా సాధ్యపడిందన్నది ఇప్పుడు చర్చగా మారింది. ‘ఇది దేశంలోనే ఆదర్శం. ఇంత తక్కువ ఖర్చుకు కాలేయ మార్పిడి చేయడం అమోఘం’ అని స్టాన్లీ వైద్యులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన స్ఫూర్తితో ఉస్మానియా వైద్యులు కాలేయ మార్పిడిని విజయవంతంగా పూర్తిచేసిన సంగతి విదితమే. -
34 ఏళ్ల క్రితం కిడ్నీ మార్పిడి
♦ ఇప్పటికీ ఆరోగ్యంగా కిడ్నీ దాత, స్వీకర్త ♦1982 మే 16న ఉస్మానియా ఆస్పత్రిలో తొలిసారి శస్త్రచికిత్స హైదరాబాద్: వైద్య చరిత్రలో ఇదో మైలురాయి. 34 ఏళ్ల క్రితం కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తి, ఆయనకు అవయవాన్ని దానం చేసిన దాత ఇప్పటికీ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో తొలిసారిగా చేసిన కిడ్నీ మార్పిడి ఆపరేషన్ ఇదే కావడం గమనార్హం. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్ రెడ్డి పర్యవేక్షణలో డాక్టర్ గోపాలకృష్ణ, యూరాలజిస్ట్ డాక్టర్ రంగనాథ్రావుల నేతృత్వంలోని వైద్య బృందం 1982 మే 16న నగరంలోని డబీర్‌పురాకు చెందిన మహ్మద్ ఇబ్రహీం(67)కు తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా చేసింది. ఇబ్రహీం సోదరుడు ఇషాక్ ఆయనకు కిడ్నీ దానం చేశారు. వీరికి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేసి ఇప్పటికి 34 ఏళ్లు పూర్తవుతుండగా.. వీరిద్దరూ ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నట్లు ఇబ్రహీంకు శస్త్రచికిత్స చేసిన డాక్టర్ గోపాలకృష్ణ వెల్లడించారు. ఈ శస్త్రచికిత్సకు అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. కాగా, కిడ్నీ మార్పిడి చేయించుకుని ఎక్కువ కాలం జీవించిన వారి జాబితాలో ఇబ్రహీం నాలుగో వ్యక్తి అని వైద్యులు చెపుతున్నారు. ఇది ఉస్మానియా వైద్యుల చలవే అప్పట్లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స ఎక్కడా చేసేవారు కాదు. ఉస్మానియాలో పరీక్షలు చేయిస్తే కిడ్నీలు చెడిపోయాయని డాక్టర్లు చెప్పారు. మొట్టమొదటిసారిగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేసేందుకు వైద్యులు ముందుకు రావడంతో మా తమ్ముడు తన కిడ్నీని దానం చేశాడు. అప్పట్లో రక్త పరీక్షలకు బొంబాయికి పంపేవారు. నెలకు రూ.వెయ్యి ఖర్చయ్యేది. మాకు ప్రభుత్వ ఖర్చులతోనే చేశారు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నామంటే అది ఉస్మానియా వైద్యుల చలువే. - ఇబ్రహీం, తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగిన వ్యక్తి ఎంతో ఆనందంగా ఉంది మా అన్న ఇబ్రహీంకు రెండు కిడ్నీలు చెడిపోయాయి. దాత కోసం చూసినా.. ఎవరూ ముందుకు రాలేదు. దీంతో నా కిడ్నీలు ఆయనకు మ్యాచ్ అవుతాయని వైద్యులు చెప్పడంతో ఇవ్వడానికి అంగీకరించా. అప్పుడు నా వయసు 22 ఏళ్లు. అప్పటికి మా ఇద్దరికీ పెళ్లి కాలేదు. చికిత్స చేయించుకున్న రెండేళ్ల తర్వాత మా అన్న వివాహమైంది. ఆ తర్వాత నాదైంది. ప్రస్తుతం మా ఇద్దరికీ ముగ్గురు, ముగ్గురు పిల్లలున్నారు. మేం ప్రస్తుతం ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాం. - ఇషాక్, కిడ్నీ దాత -
సిట్ కస్టడీలో ‘ఐసిస్ త్రయం’
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)లో చేరేందుకు వెళుతూ మహారాష్ట్రలోని నాగ్‌పూర్ విమానాశ్రయంలో చిక్కిన ముగ్గురు యువకులు అబ్దుల్లా బాసిత్, సయ్యద్ ఒమర్ ఫారూఖ్ హుస్సేనీ, మాజ్ హసన్ ఫారూఖ్‌లను సీసీఎస్ అధీనంలోని సిట్ అధికారులు మంగళవారం కస్టడీలోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఈ ముగ్గురినీ వారం రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. దీంతో సిట్ బృందం చంచల్‌గూడ జైలులో ఉన్న ముగ్గురినీ కస్టడీలోకి తీసుకుని, ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆపై తమ కార్యాలయానికి తీసుకువెళ్లి విచారణ ప్రారంభించారు. వారం రోజుల విచారణలో భాగంగా వీరిని ఆదిలాబాద్‌తో పాటు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు తీసుకువెళ్లనున్నారు. కాశ్మీర్‌కు చెందిన వివాదాస్పద నాయకురాలు అంద్రాబీతో వీరికి సంబంధాలు ఉన్నాయా అనే అంశంపై ఆరా తీయాలని సిట్ నిర్ణయించింది. -
చలికి తట్టుకోలేక ముగ్గురి మృతి
హైదరాబాద్/బచ్చన్నపేట/మంగపేట: చలి తీవ్రతకు తట్టుకోలేక వృద్ధులు పండుటాకుల్లా రాలిపోతున్నారు. నాలుగు రోజులుగా వీస్తున్న చలి గాలుల ప్రభావంతో వరంగల్ జిల్లాలో మంగళవారం ఇద్దరు మృతి చెందారు. హైదరాబాద్‌లో గుర్తు తెలియని వ్యక్తి చనిపోయారు. వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలం లక్ష్మాపూర్‌కు చెందిన శివరాత్రి మల్లమ్మ(68), మంగపేట మం డలం బోరునర్సాపురం గ్రామానికి చెందిన కోగిల వెంకటమ్మ(80) మృత్యువాత పడ్డారు. వెంకటమ్మకు కుమారుడు పోశయ్య అప్పులు తీర్చలేక నెల రోజుల క్రితం ఊరిడిచి వెళ్లాడు. దీంతో ఆమె గ్రామంలోనే ఉంటున్న తన కుమార్తె పుల్లూరి నాగమణి వద్ద నివసిస్తోంది. హైదరాబాద్ నాంపల్లిలోని దర్గా యూసుఫియన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి(55) సోమవారం ఫుట్‌పాత్‌పై పడి మృతి చెందాడు. హబీబ్‌నగర్ పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించి భద్రపరిచారు. అతడి ఒంటిపై గ్రే కలర్ చొక్కా, గ్రే కలర్ టీ షర్టు, క్రీమ్ కలర్ ప్యాంటు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
అమ్మా.. తలుపు తీయమ్మా..!
ఐదేళ్ల కుమారుడిని షాపునకు పంపి తల్లి ఆత్మహత్య గచ్చిబౌలి: చిన్నా.. పాలప్యాకెట్ తీసుకురా అని ఆ తల్లి ఐదేళ్ల కుమారుడిని షాపునకు పంపింది.. పాలప్యాకెట్ తెచ్చిన ఆ చిన్నారి.. తలుపు వేసి ఉండటంతో అమ్మా.. అని పిలిచాడు. స్పందన లేదు. మళ్లీ పిలిచాడు.. అయినా ప్రయోజనం లేదు.. ఎన్నిసార్లు పిలిచినా అమ్మ పిలుపు వినపడలేదు.. దీంతో ఏడవడం మొదలుపెట్టాడు.. బాలుడి ఏడుపు గమనించిన స్థానికులు కూడా పిలిచారు..లోపలినుంచి ఎటువంటి ప్రతిస్పందన లేకపోవడంతో తలుపులు బద్దలుకొట్టి చూసేసరికి షాక్‌కు గురయ్యారు.. ఫ్యాన్‌కు ఉరివేసుకొని నిర్జీవంగా వేలాడుతోంది ఆ చిన్నారి తల్లి.. ఈ హృదయవిదారక సంఘటన గురువారం గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీరాంనగర్‌లో జరిగింది. ఎస్ఐ భూపతి తెలిపిన మేరకు.. ఖమ్మం జిల్లాకు( చందుగొండ) చెందిన దంపతులు పి.కృష్ణవేణి(27), నాగరాజు కొండాపూర్ శ్రీరాంనగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ప్రణయ్ (3), అఖిల్(5)కుమారులు. కృష్ణవేణి ఇళ్లలో చిన్న పిల్లలకు కేర్‌టేకర్‌గా పని చేస్తుండగా, నాగరాజు గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. చిన్న కుమారుడిని అక్కడే వదిలి బుధవారం భర్త, పెద్ద కొడుకు అఖిల్ తో కలిసి శ్రీరాంనగర్‌కు వచ్చింది. గురువారం ఉదయం 7.30 గంటలకే వంట చేసి భర్తను ఆఫీస్‌కు పంపించింది. అదే సమయంలో మరిది సతీష్ కోచింగ్ కోసం వెళ్లాడు. 8 గంటల సమయంలో కొడుకు అఖిల్‌ను షాపుకు వెళ్లి పాలు తీసుకురమ్మని పంపించింది. బాలుడు షాపు నుంచి తిరిగి వచ్చి పిలిచినా తలుపులు తెరవకపోవడంతో ఏడవడం మొదలుపెట్టాడు. దీంతో అఖిల్ ఏడుస్తూ ఉండిపోయాడు. పక్కనే ఉండే వెంకటయ్య, రాజవర్థన్‌రెడ్డి గమనించి తలుపులు విరగ్గొట్టి చూడగా ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే వారు పోలీసులకు, భర్తకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రెండేళ్లుగా మానసిక పరిస్థితి బాగాలేదని, హిస్టీరియాతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదన్నారు. -
కోత కోసి.. కొల్లగొట్టి!
ఉస్మానియాలో అవినీతి కంపు పీఎఫ్ పేరుతో కార్మికుల వేతనాల్లో కోత వ్యక్తిగత ఖాతాలు తెరవని ఔట్సోర్సింగ్ ఏజెన్సీ సిటీబ్యూరో: ఉస్మానియా జనరల్ ఆస్పత్రి పారిశుద్ధ్య విభాగం ‘అవినీతి కంపు’ కొడుతోంది. ఆస్పత్రి అధికారులు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు కుమ్మక్కై 270 మంది నిరుపేద కార్మికుల పొట్ట కొడుతున్నారు. పీఎఫ్ పేరుతో కార్మికుల వేతనం నుంచి సేకరించిన మొత్తాన్ని తమ ఖాతాల్లో జమ చేసుకుంటున్నారు. రెండు ఏజెన్సీలు కలిసి ఇప్పటి వరకు రూ.కోటిన్నరకు పైగా స్వాహా చేశా యి. ఈ విషయం తెలిసి కార్మికులు లబోదిబోమంటున్నారు. నిబంధనల ప్రకారం కార్మికుల పేరుతో బ్యాంక్ ఖాతాలు తెరిచి.. వేతనాలు జమ చేయాల్సి ఉన్నా... ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. ఇదేమని ప్రశ్నించే వారిని విధుల నుంచి తొలగిస్తున్నారు. ఆస్పత్రి నిర్వహణతో పాటు కార్మికుల బాగోగులను చూసుకోవాల్సిన అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా బిల్లు మంజూరు చేయాలంటే ముందు హెల్త్ ఇన్స్పెక్టర్, వార్డుల్లోని ఇన్చార్జి సిస్టర్ల ఆమోదం పొందాలి. ఆ తర్వాతే ఆర్‌ఎంఓలు సంతకం చేయాలి. ఇవేవీ పట్టించుకోకుండా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ సమర్పించిన బిల్లులపై అధికారులు సంతకాలు చేసి బిల్లులు మంజూరు చేస్తుండటంపై సర ్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్డులూ లేవు.. ఖాతా లేదు ఉస్మానియా ఆస్పత్రి పారిశుద్ధ్య పనులను 2010లో ఆల్ గ్లోబల్ సర్వీసెస్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ దక్కించుకుంది. 250 మంది కార్మికులకు వేతనాలకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.17 లక్షలు చెల్లించేది. పారిశుద్ధ్యం మెరుగు పడకపోవడంతో 2013లో ఆ ఏజెన్సీని తప్పించి గౌరీ మహిళా మండలి ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించింది. కార్మికులకు కనీస వేతన చట్టం అమల్లోకి రావడంతో ప్రభుత్వం ఆ మేరకు నిధులు పెంచింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి రూ.29 లక్షలకు పెంచుతూ జీఓ విడుదల చేసింది. గౌరీ మహిళా మండలి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ప్రస్తుతం ఆస్పత్రిలో 270 మంది పని చేస్తున్నట్లు లెక్క చూపుతోంది. నిజానికి 150 మంది కార్మికులు కూడా పని చేయడం లేదు. వీరిలో ఒక్కరికీ ఇప్పటి వరకు బ్యాంక్ ఖాతా కానీ, పీఎఫ్ ఖాతా కానీ తెరవలే దు. పెరిగిన వేతనాల ప్రకారం ప్రతి కార్మికునికి నెలకు రూ.7000 వంతున చెల్లిస్తున్నట్లు ఏజెన్సీ చెబుతోంది. పీఎఫ్, ఈఎస్ఐ పేరుతో ప్రతి నెలా రూ.970 వంతున కోత విధిస్తున్నారు. ఈ మొత్తాన్నిఇప్పటి వరకు వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయలేదు. తొలగించి.. మళ్లీ అప్పగించి పారిశుద్ధ్య నిర్వహణకు ప్రభుత్వం ఏటా రూ.3.48 కోట్లు ఖర్చు చేస్తోంది. అయినా మార్పు లేదు. ఇదే కారణంతో ఇటీవల గౌరీ మహిళా మండలి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ కాంట్రాక్ట్‌ను రద్దు చేశారు. ఆ మేరకు నోటీసులు ఇచ్చారు. టెండర్ పిలువకుండానే మళ్లీ అదే ఏజెన్సీకి కాంట్రాక్ట్ కట్టబెట్టడం గమనార్హం. బ్యాంక్ ఖాతాలు తెరిపిస్తున్నాం ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో 270 మంది పని చేస్తున్నారు. ఇప్పటి వరకు వీరికి బ్యాంక్ ఖాతాలు లేవు. బ్యాంకులో కాకుండా నేరుగా తమ చేతికే వేతనం అందజేయాలని కార్మికులు కోరారు. వారి విజ్ఞప్తి మేరకే ఇప్పటి వరకు చెల్లించాం. ఈ అంశంపై ఇప్పటికే ఆస్పత్రి సూపరింటెండెంట్ బ్యాంక్ అధికారులతో మాట్లాడారు. కార్మికుల పేరుతో ఖాతా తెరిచేందుకు వారు కూడా అంగీకరించారు. ఫొటోలు, ఆధార్ కార్డు, తదితర వివరాలు ఇవ్వడం లేదు. కార్మికుల హాజరు శాతాన్ని పెంచేందుకు ఆస్పత్రిలో బయోమెట్రిక్ అటెండెన్స్ సిష్టం ఏర్పాటు చేస్తున్నాం. వారి వేతనం నుంచి కోత విధిస్తున్న మొత్తాన్ని పీఎఫ్, ఈఎస్ఐ ఖాతాల్లో విధిగా నమోదు చేస్తున్నాం. -గాయత్రి, గౌరీ మహిళా మండలి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకురాలు -
అవినీతి ‘కంపు’!
పారిశుద్ధ్యం పేరుతో రూ.కోట్లు కొల్లగొడుతున్న వైనం మచ్చుకైనా కన్పించని ఫినాయిల్, డెటాల్ కేవలం బ్లీచింగ్ పౌడర్‌తోనే సరి దుర్గంధం వెదజల్లుతున్న వార్డులు, టాయిలెట్లు రోగుల అవస్థలు ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో రోగుల ముక్కుపుటాలు అదురుతున్నాయి. వార్డులకు.. మరుగుదొడ్లకు పెద్ద తేడా కన్పించడం లేదు. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేయక తీవ్ర దుర్వానస వెదజల్లుతున్నాయి. ఈగలు, దోమలు వ్యాప్తి చెంది రోగులకు కొత్త రోగాలను అంటగడుతున్నాయి. ఆస్పత్రిలో పారిశుధ్యం కోసం ప్రభుత్వం ఏటా రూ.3.48 కోట్లు ఖర్చు చేస్తున్నా...పరిస్థితి దారుణంగా ఉంది. దీనికి కారణమేంటని ఆరా తీస్తే... కాంట్రాక్టర్ల అవినీతి, అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపమేనని తెలుస్తోంది. కాంట్రాక్టర్ల అవినీతి, అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉదాసీనత, పర్యవేక్షణ లోపం వెరసి ఉస్మానియా రోగుల పాలిట శాపంగా మారుతుంది. ఆస్పత్రి పారిశుద్ధ్య నిర్వహణ పనులను తొలుత ఆల్ సర్వీసు సంస్థ ఔట్ సోర్సింగ్ దక్కించుకుంది. అప్పట్లో సదరు సంస్థకు నెలకు రూ.17 లక్షలు చెల్లించారు. పారిశుద్ధ వ్యవస్థ మెరుగు పడకపోవడంతో ఆల్ సర్వీసు కాంట్రాక్ట్‌ను 20013లో రద్దు చేసి,‘గౌరి మహిళా మండలి’ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఆ పనులను అప్పగించారు. కార్మికులకు కనీస వేతనాలు అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం నెలసరి ఖర్చులను రూ.17 లక్షల నుంచి రూ.29 లక్షలకు పెంచింది. ఇలా ఏడాదికి రూ.3.48 కోట్లు ఖర్చు చేస్తుంది. ఔట్ సోర్సి ంగ్ ఏజెన్సీ కింద 270 మంది వర్కర్లు పని చేయిస్తున్నట్లు సదరు కాంట్రాక్టర్ లెక్క చూపుతున్నారు. నిజానికి 150 మందికి మించి లేరు. వీరిలో చాలా మందికి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం లేదు. వీరిపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో చాలా మంది కార్మికులు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రోజుల తరబడి విధులకు డుమ్మా కొడుతున్నారు. ఇక కాంట్రాక్టర్లు వీరికి పనిచేసిన దినాలకే వేతనం చెల్లిస్తూ పూర్తిస్థాయి బిల్లులు పొందుతున్నారు. ఇదిలా ఉంటే ఏ వార్డులో ఎవరెవరు పని చేస్తున్నారో ఆస్పత్రి హెల్త్ ఇన్స్పెక్టర్కు తెలియజేయాలి. షిప్ట్ ముగిసిన తర్వాత వార్డు ఇన్చార్జి నర్సు పారిశుధ్య పనుల పట్ల సంతృప్తి చెందినట్లు రిజిస్టర్లో సంతకం చేయించాలి. ఆ తర్వాత హెల్త్ఇన్స్పెక్టర్తో సంతకం చేయించాలి. కానీ ఇవేవీ జరగడం లేదు. సివిల్ సర్జన్ ఆర్ఎంఓ, డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓలు సదరు కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై అన్నీ తామై వ్యవ హరిస్తున్నారని ఆరోపణలు విన్పిస్తున్నాయి. కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్లకు కక్తుర్కిపడి సదరు ఆర్‌ఎంఓలు ఏమీ పట్టించుకోకుండానే బిల్లుల మంజూరుకు సంబంధించిన ఫైలుపై సంతకం చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ముక్కు మూసుకోవాల్సిందే... ఓపీతో పాటు ఇన్‌పేషంట్ వార్డుల్లో తీవ్ర దుర్వాసన వెలువడుతోంది. కీలకమైన ఎఐసీయూ ప్రవేశ ద్వారానికి రెండు వైపులా ఉన్న మూత్ర శాలల నుంచి దుర్వాసన వస్తోంది. ఇక పాత భవనం రెండు, మూడు అంతస్థుల్లోని ఆపరేషన్ థియేటర్ల వద్ద ఉన్న మ రుగుదొడ్లు కంపు కొడుతున్నాయి. చికిత్స పొందుతున్న రోగులు సహా వారి సంరక్షకులు సైతం ముక్కు మూసుకోవాల్సి వస్తోంది. కారిడార్లు, మెట్లను శుభ్రం చేయక పోవడంతో వాటిపై నడిచినవారు జారిపడుతున్నారు. అవుట్ పేషంట్ వార్డుతో పాటు కులీకుతుబ్‌షా భవన ంలో డ్రైనేజ్ లీకవుతోంది. వార్డుల్లో చుట్టూ మురుగునీరు ప్రవహిస్తుండటంతో డెంగీ, మలేరియా దోమలు వ్యాప్తి చెంది నర్సింగ్ విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. వాటర్ ట్యాంక్‌లను రోజుల తరబడి శుభ్రం చేయకపోవడంతో నీటిని తాగిన రోగులు మరింత అనారోగ్యాల పాలవుతున్నారు. సిరెంజ్లు, బ్లేడ్స్, సీజర్స్ తదితర క్లినికల్ వ్యర్థాలను వార్డుల్లోనే వదిలేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన రోగులు ఇక్కడి పారిశుద్ధ్య లోపం వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నట్లు స్వయంగా వైద్యనిపుణులే అభిప్రాయపడుతున్నారు. నిబంధనల ప్రకారం శుభ్రం చేయాలి ఇలా... ఆస్పత్రి పరిసరాలను రోజుకు ఒకసారి శుభ్రం చేయాలి.అవుట్ పేషంట్ విభాగాన్ని రోజుకు రెండుసార్లు, జనరల్ వార్డులను మూడుసార్లు, ఆపరేషన్ థియేటర్లను ఐదుసార్లు, ఎన్ఐసీయూ, ఇతర అత్యవసర విభాగాలను రోజుకు ఏడుసార్లు శుభ్రం చేయాలి. {పతి పదిహేను రోజులకు ఒకసారి గోడలు, కిటీకీలు, మంచాలు, తలుపులు శుభ్రం చేయాలి. నెలకోసారైనా వాటర్ ట్యాంకులను క్లీన్ చేయాలి. మరుగుదొడ్లు, మూత్ర శాలల్లో రోజుకోసారి బ్లీచింగ్ చల్లాలనే నిబంధన ఉన్నా కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదు. వార్డులను తడిగుడ్డతో ఊడ్చుతున్నారే కానీ కనీసం ఫినాయిల్ కూడా వాడటం లేదు. వార్డుల్లో డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలనే నిబంధన ఉన్నా..పట్టించుకోవడం లేదు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది హాజరు నమోదుకు గాంధీ ఆస్పత్రిలో ఉన్నట్లుగా ఇక్కడ బయోమెట్రిక్ పద్ధతి లేదు. -
తెలంగాణవైపే ఏపీ వైద్యుల మొగ్గు
తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన వారు 70 శాతం మంది రాష్ట్రానికి మరింత భారం కానున్న స్పెషలిస్టుల కొరత హైదరాబాద్: హైదరాబాద్‌లోని వివిధ బోధనాసుపత్రులు, స్పెషాలిటీ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మెజారిటీ వైద్యులు తెలంగాణకే ఆప్షన్ ఇచ్చినట్టు తెలిసింది. గత రెండు మూడు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో పనిచేస్తూ, ఇక్కడే ప్రైవేట్ నర్సింగ్‌హోంలు, క్లినిక్‌లు ఏర్పాటు చేసుకుని స్థిరపడిన నేపథ్యంలో రెండేళ్ల అదనపు సర్వీసును(60 ఏళ్లకు పదవీ విరమణ) కాదనుకుని తెలంగాణకే ప్రాధాన్యత నిచ్చారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ బోధనాసుపత్రులతో పాటు సరోజిని, ఛాతీ ఆస్పత్రి, మానసిక వైద్యశాల, కోటి మెటర్నిటీ, నయాపూల్ మెటర్నిటీ, ఫీవర్ ఆస్పత్రి, ఎంఎన్‌జే కేన్సర్ వంటి పలు ఆస్పత్రుల్లో స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు సుమారు వందమందికిపైగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైద్యులున్నట్టు తేలింది. వీరిలో 70 శాతం మంది తెలంగాణలో పనిచేసేందుకే మొగ్గు చూపి ఆప్షన్లు ఇచ్చినట్లు సమాచారం. స్థానికత ఆధారంగా వీరిని ఏపీకే ఇవ్వాల్సి ఉంది. అయితే కొంతమంది తెలంగాణలో వివాహం చేసుకోవడం, ఆరోగ్య సమస్యలు ఇలా పలు కారణాలను చూపించారు. దీంతో ఇప్పటికే స్పెషలిస్టుల కొరత ఎదుర్కొంటున్న ఏపీలోని బోధనాసుపత్రులకు ఇకపై మరిన్ని ఇబ్బందులు తలెత్తనున్నాయి. నెఫ్రాలజీ (కిడ్నీ), గ్యాస్ట్రో ఎంటరాలజీ, ఆంకాలజీ (కేన్సర్) తదితర విభాగాలకు స్పెషలిస్ట్‌లు లేరు. మరో నెల రోజుల్లో ఆప్షన్లపై నిర్ణయం వెలువడనుంది. -
ప్రశ్నించే స్థితిలో ప్రజలు
రైతు ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ హైదరాబాద్: ప్రజలు ప్రశ్నించే స్థితికి వచ్చారని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ఉస్మానియా భూములు తీసుకుంటానన్నప్పుడు, ఉస్మానియా ఆసుపత్రి, సెక్రటేరియట్ తరలిస్తానన్నప్పుడు ప్రజలు, మేధావులు ఊరుకోలేదని, దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేధావుల సలహాలు తీసుకుని ముందుకు పోవాలని ఆయన సూచించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంశంపై మహారాష్ట్ర, తెలంగాణ చర్చల నేపథ్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు విషయమై ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రతో చర్చిస్తాననడం ఆహ్వానించదగ్గ విషయమని అన్నారు. చర్చలు ప్రజల ఒత్తిడి మేరకే జరిపేందుకు సిద్ధమయ్యారని అన్నారు. ప్రాజెక్టు కాళేశ్వరం వద్ద నిర్మిస్తామని ప్రకటించిన తర్వాత వచ్చిన ఒత్తిళ్లు, నిరసనల వల్లే చర్చలకు సిద్ధమయ్యారని అన్నారు. ఇదే వ్యాప్కోస్ సంస్థ గతంలో ఒక రిపోర్ట్ ఇచ్చిందని.. తిరిగి అదే సంస్థ మరో రిపోర్ట్ ఇచ్చిందంటే ఎవరి ఒత్తిళ్లకు లొంగి ఇస్తుందో అర్థంకావడం లేదని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రారంభించిన అనంతరం అక్కడ పెద్దపెద్ద కాలువలు తవ్వారని, వేల కోట్ల ప్రజాధనం ఖర్చుపెట్టారని అన్నారు. ప్రాజెక్టులలో అవినీతి లేకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. ఇప్పటికే ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఒక్క ప్రాజెక్టులో అవినీతి ఆపితే రైతాంగ సమస్యలు తీర్చవచ్చునని అన్నారు. కాంగ్రెస్ పార్టి సీనియర్ నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. ప్రాణహిత చేవెళ్ల తెలంగాణ ప్రజలకు సంజీవని వంటిదని అప్పడు ప్రారంభించారని, ప్రస్తుతం దాని డిజైన్ మారుస్తాననడం దారుణమని అన్నారు. మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్చడం సరికాదన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎండల శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. కొంతమంది ఇంజనీర్లు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ తెలంగాణ ఇరిగేషన్ వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నారని అన్నారు. ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం 1975లో మహారాష్ట్రతో ఒప్పందం కుదిరిందన్నారు. ముఖ్యమంత్రి ఇప్పుడు డిజైన్ మారుస్తామని ఎందుకు అంటున్నారో, ఎవరి ప్రయోజనాలకోసం అంటున్నారో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రైతు సంక్షేమ సమితి ఉపాధ్యక్షుడు నైనాల గోవర్దన్, ప్రాణహిత చేవెళ్ల పరిరక్షణ కమిటీ ప్రతినిధి ప్రతాప్, తెలంగాణ లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు మన్నారం నాగరాజు, అడ్వొకేట్ శారదాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కడుపు నిండా డ్రగ్స్ ప్యాకెట్లే!
సాక్షి, హైదరాబాద్: సినీఫక్కీలో మాదకద్రవ్యాలు తరలిస్తూ పట్టుబడిన దక్షిణాఫ్రికా మహిళ మూసా కడుపు నుంచి మొత్తం 40 డ్రగ్స్ ప్యాకెట్లను బయటికి తీశారు. ఎనిమా ఇచ్చి ఇప్పటికే 18 ప్యాకెట్లు వెలికితీసిన వైద్యులు సోమవారం మరో 22 ప్యాకెట్లను తీశారు. రూ.50 లక్షల విలువ చేసే డ్రగ్స్‌ను పొత్తికడుపులోకి చొప్పించుకొని వస్తున్న మూసా(32).. ఆదివారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ అధికారులకు చిక్కిన సంగతి తెలిసిందే. అధికారులు ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తీసుకురాగా ఆదివారం రాత్రి 18 డ్రగ్ ప్యాకెట్లను తీశారు. సోమవారం ఆమెకు మళ్లీ అల్ట్రాసౌండ్, సిటిస్కాన్ చేశారు. మరికొన్ని ప్యాకెట్లు లోపలే ఉన్నట్లు నిర్ధారించి, మరోసారి ఎనిమా ఇచ్చారు. దీంతో 22 ప్యాకెట్లు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరోసారి స్కాన్ చేస్తామని, కడుపులో ప్యాకెట్లు లేకపోతే డిశ్చార్జి చేస్తామని వెల్లడించాయి. పరీక్షల కోసం ల్యాబ్‌కు.. మూసా కడుపు నుంచి బయటికి తీసిన డ్రగ్స్ ప్యా కెట్లను నార్కొటిక్స్ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు. చిన్న పరిమాణంలో ప్యాకెట్లు చేయడంతో అది కొకైన్ అయి ఉంటుం దని అనుమానిస్తున్నారు. ఈ డ్రగ్స్‌ను మహిళ ఎక్కడికి తరలిస్తోందన్న కోణంలో అధికారులు విచారణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
ఉస్మానియా కూల్చివేతపై నిర్ణయం తీసుకోలేదు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆసుపత్రిని కూల్చివేసే విషయంలో తాము ఇప్పటి వరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదని టీ సర్కార్ మంగళవారం ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు చేసిన ఈ ప్రకటనను హైకోర్టు ధర్మాసనం రికార్డు చేసుకుంది. ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణ అవసరం లేదంటూ దానిని పరిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ ఉస్మానియా కూల్చివేతకు నిర్ణయం తీసుకుంటే ప్రజలకు తెలియచేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేసి, అందులో టవర్లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని, దీనిని అడ్డుకోవాలంటూ న్యాయవాది బి.ఎం.స్వామిదాస్ హైకోర్టులో దాఖలుచేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఆసుపత్రి కూల్చివేతకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందుకే అక్కడి నుంచి రోగులను తరలిస్తోందంటూ, పత్రికల్లో వచ్చిన కథనాలను ధర్మాసనం ముందుంచారు. ధర్మాసనం వాటిని పరిశీలించింది.ఉస్మానియా కూల్చివేతపై నిర్ణయం తీసుకోలేదు -
చారిత్రక వైభవం కళావిహీనం
శిథిలమవుతున్న వారసత్వ భవనాలు కాపాడుకోవాలంటున్న నిపుణులు ఒక మట్టికోట మహానగరమైంది. నాలుగు వందల ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలు. మరెన్నో కళాత్మక, సృజనాత్మక నిర్మాణాలు కాలగమనానికి తార్కాణాలుగా నిలిచాయి. హైదరాబాద్ చారిత్రక సౌందర్యాన్ని రెట్టింపు చేశాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇండో అరబిక్, ఇండో యూరోపియన్, ఇండో సర్‌సానిక్ శిల్ప రీతుల్లో గొప్ప భవనాలు వెలిశాయి. అప్పట్లో నిజాం నవాబులు కట్టించిన ప్యాలెస్ నుంచి.. బడి, మసీదు, ఆసుపత్రి, ఏదైనా సరే అద్భుత కళాఖండాలై విలసిల్లాయి. అలాంటి ఘన చరితకు నిదర్శనమైన సౌధరాజాలపై ఇప్పుడు నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. శతాబ్ద కాలానికి చేరువైన ఉస్మానియా ఆసుపత్రి మూడు దశాబ్దాలకు పైగా ఎలాంటి ఆలనా, పాలనకు నోచుకోక శిథిలావస్థకు చేరుకుంది. ఇలాగే నగరంలోని అనేక వారసత్వ భవనాలు అలాంటి స్థితికి చేరువయ్యాయి. దేవిడీలు, ప్యాలెస్‌లు, మహళ్లు, పరిపాలన భవనాలు, నివాస సముదాయాలు, ఆసుపత్రులు, విద్యా మందిరాలు వంటి చారిత్రక, వారసత్వ కట్టడాలను పరిరక్షించుకోవలసిన తరుణం ఇది. దీనిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. - సాక్షి,సిటీబ్యూరో వెలుగు జిలుగుల వైభవాలు.. కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖలు భాగ్యనగరంలో గుర్తించిన చారిత్రక కట్టడాలతో పాటు హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ సుమారు 170 భవనాలను చారిత్రక, వారసత్వ నిర్మాణాలుగా గుర్తించింది.వాటిలో కొన్ని బాగానే ఉన్నా, మరికొన్ని పెచ్చులు ఊడిపోతూ శిథిలమవుతున్నాయి. ఈ దశలోనే వాటిని పరిరక్షించుకోకపోతే మరికొన్నేళ్లలో పూర్తిగా శిథిలం కావచ్చు. ఉస్మాన్ అలీఖాన్ 1919 నుంచి 1925 మధ్య కాలంలో మూసీనది ఒడ్డున పటిష్టమైన భవనాలను కట్టించారు. పటిష్టమైన డంగు సున్నంతో, ఎంతో కళాత్మకంగా చెక్కిన రాళ్లతో నిర్మించిన నిలువెత్తు కట్టడాలివి. హైకోర్టు, సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి వంటి పెద్ద భవనాలు అలా ఏర్పాటైనవే. ఈ భవనాలన్నీ చారిత్రక సౌందర్యాన్ని సంతరించుకున్నవే. పెద్ద పెద్ద మినార్లు, అందమైన ఆనియన్ డోమ్‌లు, గుమ్మటాలు, గోడలపై అదంగా చెక్కిన లతలు హైదరాబాద్ అందాన్ని ఇనుమడింపజేశాయి. ఒకనాటి ‘న్యూ జెనీవా’ నేటి మహబూబియా పాఠశాల నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్ బాలికల కోసం ఒక పాఠశాల ఉండాలని సూచించారు. ఆయన ఆదేశాల మేరకు గన్‌ఫౌండ్రిలో పూర్తిగా రాయి ఉపయోగించి ఓ భవనం నిర్మితమైంది. ఇది 1907లో అందుబాటులోకి వచ్చింది. ఇండో యురోపియన్ శైలిలో ఇది నిర్మితమైంది. మొదట్లో ఈ పాఠశాలకు ‘న్యూ జెనివా’ అని నామకరణం చేశారు. తన పేరు పెట్టేందుకు నిజాం అంగీకరించడంతో ఆ తరువాత ‘మహబూబియా’ పాఠశాలగా మారింది. ప్రస్తుతం శిథిలమవుతున్న ఈ భవనంలో కొన్ని తరగతి గదులను ఖాళీ చేశారు. అక్కడక్కడ రాళ్లు కూలిపోయాయి. గోడలు కూలిపోతున్నాయి. నాటి ప్యాట్రిక్ రెసిడెన్సీ.. నేటి కోఠి ఉమెన్స్ కాలేజీ ఇప్పటి ‘కోఠి ఉమెన్స్ కాలేజీ’ ఒకప్పటి బ్రిటిష్ రెసిడెంట్ కిర్క్ ప్యాట్రిక్ నివాసం. మూసీనదికి ఉత్తరాన 34 ఎకరాల క్షేత్రంలో కట్టించిన అద్భుతమైన భవనం. ైహైదరాబాద్ మధ్య యుగ సంస్కృతిపై ఆధునిక పాశ్చ్యాత్య రీతిని ప్రతిబింబించిన కట్టడం ఇది. పలాడియన్ జార్జియన్ నిర్మాణ శైలిలో నిర్మితమైంది. ఎంతో హుందాగా కనిపించే ఈ భవనం పైకప్పు శిథిలమైంది. ఇండో సర్‌సానిక్ శైలిలో సిటీ కాలేజ్.. మహబూబ్ అలీఖాన్ హయాం (1865)లో కట్టించిన ‘దార్-ఉల్-ఉలుమ్’ మదరస్సా (పాఠశాల) ఉస్మాన్ అలీఖాన్ కాలంలో 1924 నాటికి సిటీ హైస్కూల్‌గా మారింది. ఆ తరువాత ‘సిటీ కాలేజ్’గా అభివృద్ధి చెందింది. సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలమైన తరగతి గదులు, వరండాలు, నిలువెత్తు ఆర్చ్‌లు, ఆనియన్ డోమ్లతో అద్భుత నిర్మాణం ఈ భవనం. ఎండాకాలంలోనూ చల్లగా ఉండే ఈ భవనం ఇండో సర్‌సానిక్ వాస్తుశైలిలో రూపుదిద్దుకుంది. అప్పట్లో దీనికి రూ. 8 లక్షలు ఖర్చయినట్లు అంచనా. ఈ భవనం ఇప్పుడు రంగు వెలసి కళావిహీనంగా మారింది. పైకప్పులో వర్షపు నీరు చేరుతోంది. పెచ్చులూడుతోంది. గోడలకు నిమ్ము చేరి కూలిపోయే స్థితికి చేరుకున్నాయి. ‘ఫిస్తోంజీ అండ్ కంపెనీ బిల్డింగ్’ నేటి ఈఎన్టీ ఆసుపత్రి కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో ఎంతో అందంగా కనిపించే ప్రస్తుత ఈఎన్టీ ఆసుపత్రి ఇండో యురోపియన్ శైలికి నిలువుటద్దం. హైదరాబాద్ నగరానికి పరిచయమైన పాత తరం పార్శీల్లో ఫిస్తోంజీ కుటుంబం ఒకటి. ఫిస్తోంజీ, విక్కాజీ ఇద్దరు సోదరులు బ్యాంకింగ్ వ్యాపారంతో పాటు, వస్త్ర వ్యాపారాలు చేసేవారు. వారు కట్టించిన భవనమే ‘ఫిస్తోంజీ అండ్ కంపెనీ బిల్డింగ్’. ఇప్పటి ఈఎన్టీ ఆసుపత్రి. అప్పట్లో అది ఒక బ్యాంకింగ్ కంపెనీ. 1839-1845 ప్రాంతంలో బీదర్ రాజ్య ఆదాయ వ్యవహారాలను పర్యవేక్షించేది. భవనంలోని అనేక నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. గోడలు కూలిపోతున్న పరిస్థితి. పైకప్పు పెచ్చులూడిపోతోంది. బయటి గోడల్లో రావి మొక్కలు పైకి లేచాయి. ఇంకా మరెన్నో... నగరంలో ఉన్న చారిత్రక భవనాల్లో ఇవి కొన్ని మాత్రమే. ఇంకా ఎన్నో చారిత్రక కట్టడాలు శిథిలావస్థలో ఉన్నాయి. వాటిలో నిజామియా ఆబ్జర్వేటరీ, చెత్తాబజార్లోని దివాన్ దేవిడీ, చార్‌కమాన్, ఆలియాబాద్ సరాయి, అత్తాపూర్‌లోని ముష్క్ మహల్, ఝామ్సింగ్ ప్రాంతంలోని ఝాంసింగ్ టెంపుల్ గేటు, కింగ్‌కోఠి ఆసుపత్రి, మలక్‌పేట్‌లోని మహబూబ్ మాన్షన్, సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ అనాథాశ్రమం, మొహంజాహీ మార్కెట్, మహల్ వనపర్తి, మోతిగల్లీలోని ఇవాన్-ఈ-అలీ, మహబూబ్ చౌక్‌లోని హోమియోపతిక్ హాస్పిటల్, సనత్‌నగర్‌లోని ఫకృల్ముల్క్ టూంబ్, బహదూర్‌పురాలోని కిషన్‌బాగ్ టెంపుల్, ఆదర్శనగర్ రిట్జ్ హోటల్, శాలిబండ శామ్రాజ్ భవనం గేటు, రాజ్‌భవన్ రోడ్డులోని నర్సింగ్ కాలేజ్, లక్డీకాపూల్ ఆస్మాన్ మహల్, పబ్లిక్‌గార్డెన్ మినీ బాలభవన్, గ్రీన్లాండ్స్ గెస్ట్‌హౌస్, బోయిగూడ కమాన్, నాంపల్లి సరాయ్, పాన్‌మండి గోడీకాఖబర్ తదితర భవనాలు శిథిలమవుతున్న జాబితాలో ఉన్నట్లు ఆర్కిటెక్ట్ నిపుణులు, చారిత్రక ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఉస్మానియా ఆస్పత్రికి సర్కారీ వైద్యం!
-
భవనం చెక్కుచెదరలేదు
ఇంటాక్ బృందం అఫ్జల్‌గంజ్: ఉస్మానియా ఆసుపత్రి పాత భవనానికి మరమ్మత్తులు నిర్వహిస్తే మరికొన్ని దశాబ్ధాల పాటు భవనం చెక్కు చెదరకుండా ఉంటుందని డిల్లీకి చెందిన ఇన్‌ట్యాక్ (ప్రాచీన కట్టడాల) పరిరక్షణ బృందం పేర్కొంది. సోమవారం ఉస్మానియా పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు గోపాలకిషన్ ఆధ్వర్యంలో ఇన్‌ట్యాక్ బృందం సభ్యులు ఉస్మానియా ఆసుపత్రి పాత భవనాన్ని సందర్శించారు. ఉస్మానియా పాత భవనంలోని శిథిలావస్తకు చేరిన ఛాయాచిత్రాలను, నమూనాలను సేకరించారు. ఇన్‌ట్యాక్ జాతీయ ఆర్కిటెక్చ్వల్ హెరిటేజ్ కన్వీనర్ దివ్వగుప్త మాట్లాడుతూ ఉస్మానియా ఆసుపత్రి పాత భవనం పెచ్చులూడి పడడానికి ప్రధాన కారణం సరైన నిర్వహణ చేయకపోవడమే అన్నారు. దీని నిర్వహణను సక్రమంగా నిర్వహించి ఉంటే భవనం మరో వందేళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండేదన్నారు. ఇప్పటికైనా భనానికి మరమ్మతులు చేపడితే మరి దశాబ్ధాలపాటు పటిష్టంగా ఉంటుందన్నారు. దీని నిర్మాణ పునాదుల్లో చాలా గట్టితనం ఉందన్నారు. ఇన్‌ట్యాక్ తెలంగాణ కన్వీనర్ అనురాధారెడ్డి మాట్లాడుతూ... వారసత్వ సంపదను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వపై ఉందన్నారు. ఉస్మానియా ఆసుపత్రి పాత భవనం అంత ప్రమాదకరంగా ఏమీలేదన్నారు. దీనికి మరమ్మతులు చేపడితే మరింత కాలం ఉంటుందన్నారు. ఈ స్థితికి రావడానికి సరైన నిర్వహణ చేయకపోవడమే ప్రధాన కారణమన్నారు. ఉస్మానియా ఆస్పత్రిని కూల్చివేతకయ్యే ఖర్చుకంటే మరమ్మత్తులకు చాలా తక్కువ ఖర్చవుతుందని పేర్కొన్నారు. ఉస్మానియా ఆసుపత్రి పాత భవన నమూనాలను సేకరించామని 3 రోజుల్లో పూర్తి నివేదికను అందజేస్తామని ఆమె తెలిపారు. ఈ బృందంలో ఇన్‌ట్యాక్ సభ్యులు సాజిద్, సంజయ్తోర్వీ, శంకర్నారాయన్, శ్రీనివాస్‌మూర్తి, వేణుగోపాల్, ఎస్పీ అన్చూరి, ఎల్ఎన్, ప్రవీన్, త్రివిక్రమ్, అనురిమా, రంగారావు, అశోక్బైరి ఉన్నారు -
‘ఉస్మానియా’పై అయోమయం!
తరలింపు, కూల్చివేతపై భిన్నాభిప్రాయాలు ఎటూ తేల్చుకోలేకపోతున్న ప్రభుత్వం ఆస్పత్రిని సందర్శించిన టీజేఏసీ, రిటైర్డ్ న్యాయమూర్తి, ఇంటాక్ బృంద ం కూల్చివేత అవసరం లేదని పలువురి అభిప్రాయం సిటీబ్యూరో: ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం కూల్చివేత వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరినందున, దీన్ని నేలమట్టం చేసి ఇదే చోట మరో రెండు బహుళ అంతస్థుల భవనాలు నిర్మిస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తుండగా, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సహా బీజేపీ, వామపక్షాలు, ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్, తెలంగాణ ఉద్యమ వేదిక, పూర్వ విద్యార్థుల సంఘం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా సోమవారం ఢిల్లీ నుంచి ఆస్పత్రిని సందర్శించేందుకు వచ్చిన ఇంటాక్ బృందం సహా రిటైర్డ్ న్యాయమూర్తి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ప్రతిపక్షాలకు మరింత బలం చూకూర్చినట్లైంది. భవనాన్ని కూల్చాలనే వారి కంటే..పరిరక్షించాలనే వారికే మద్దతు రోజు రోజుకు పెరుగుతుండటంతో ఈ అంశంపై ఏ ం చేయాలో తెలియక ప్రభుత్వం కొంత అయోమయంలో పడింది. రోగుల భద్రతే ముఖ్యం ఎప్పుడు కూలుతుందో తెలియని ఈ భవనంలో రోగులకు చికిత్సలు అందించడం ఏమాత్రం సురక్షితం కాదు. వైద్యుల విజ్ఞప్తి మేరకు ఇటీవల ఆస్పత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్ ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. శిథిలావస్థకు చెందిన వారసత్వ కట్టడాల కంటే ప్రభుత్వానికి రోగుల ప్రాణాలే ముఖ్యం. వారిని కాపాడేందుకు ఎంత రిస్కైనా తీసుకుంటాం. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు, ప్రభుత్వమంటే గిట్టని కొంత మంది పనిగట్టుకుని ఈ విషయంపై దుష్ర్పచారం చేస్తున్నారు. అత్యవసర చికిత్సలు సహా, ఇన్‌పేషంట్లు సర్వీసులు, ఓపీ సేవలు అన్ని ఇక్కడే అందిస్తాం. శస్త్రచికిత్స తర్వాత స్టేబుల్‌గా ఉన్న రోగులను మాత్రమే ప్రత్యామ్నాయంగా ఏరా్పాటు చేసిన ఆస్పత్రుల్లో సర్దుబాటు చేస్తాం. పాత భవనం కూల్చాలా? లేదా అనే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. - లక్ష్మారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి -
ఒక్క రోజే హడావుడి
తాత్కాలికంగా రోగుల తరలింపు ప్రక్రియ నిలిపివేత అడ్మిట్ అయిన రోగులను నేరుగా కింగ్‌కోఠికి సగానికి పైగా తగ్గిన అడ్మిషన్లు అఫ్జల్‌గంజ్: ఉస్మానియా ఆసుపత్రి తరలింపు ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. బుధవారం ఆగమేఘాలపై 24 మంది ఆర్థోపెడిక్ రోగులను తరలించిన ప్రభుత్వం గురువారం ఒక్క రోగిని కూడా తరలించలేదు. దశల వారిగా రోగులను తరలిస్తామని చెప్పిన వైద్యులు తమకు ఆరోగ్యశాఖ నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని పేర్కొన్నారు. ఆర్థో విభాగంలోని రోగులను తరలించాలన్నా వారి ఆరోగ్య పరిస్థితిని, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతలను బేరీజు వేసుకుని గురువారం తరలింపు ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిసింది. ఓపీ నుంచి నేరుగా కింగ్‌కోఠికి... ఉస్మానియా ఆసుపత్రి ఓపీ బ్లాక్‌లో చికిత్సలు నిర్వహించిన వైద్యులు ఆర్థోపెడిక్ ఇన్పేషెంట్లను నేరుగా కింగ్‌కోఠి ఆసుపత్రికి తరలిస్తున్నారు. గురువారం 6 గురు రోగులను కింగ్‌కోఠికి తరలించారు. ఉస్మానియాలో చికిత్స పొందుతున్న రోగులకు పూర్తి వైద్యసేవలు అందించి ఇక్కడి నుంచే డిశ్చార్జ్ చేయాలని నిర్ణయించనట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వైద్యసేవలు ఇక్కడే.... ఉస్మానియా ఆసుపత్రి పాత భవనంలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారికి ఇక్కడే పూర్తిగా కోలుకునే వరకు వైద్యం అందించి డిశ్చార్జ్ చేయాలని, కొత్త అడ్మిషన్లను నేరుగా కింగ్‌కోఠికి తరలించేలా చర్యలు తీసుకున్నాట్లు సమాచారం. తగ్గిన రోగుల సంఖ్య... ఉస్మానియా ఆసుపత్రిని తరలిస్తున్నారన్న వార్తలతో ఉస్మానియా ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఓపీ బ్లాక్‌లో రోజు సగటున 150 నుంచి 200 మంది అడ్మిట్ అవుతుండగా, ప్రస్తుత వారి సంఖ్య 70 నుంచి 80 వరకు ఉంది. ఇక ఔట్ పేషెంట్ల సంఖ్య రోజుకు సగటున 1500 నుంచి 1800ల వరకు ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 800 నుంచి 900 పడిపోయింది. ఉస్మానియాను తరలిస్తున్నారని తెలియడంతో రోగులు ఆస్పత్రికి రావడంలేదని వైద్యులు తెలిపారు. -
మెరుగుపెడితే ‘ఉస్మానియా’ మరో చౌమొహల్లా
ఆస్పత్రి భవనం పటుత్వంపై సందేహాలొద్దు కన్జర్వేషన్ ఇంజనీరింగ్‌తో వందల ఏళ్లు కాపాడొచ్చు చారిత్రక అద్భుతాన్ని నేలకూల్చొద్దు రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ హనుమంతరావు హైదరాబాద్: శిథిలావస్థకు చేరిన చారిత్రక, వారసత్వ కట్టడమైన ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని తొలగించి ఆ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనాల (ట్విన్ టవర్స్) ఆస్పత్రి నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రముఖ ఇంజనీరింగ్ నిపుణులు, రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్, ఐరాస కన్సల్టెంట్ ఇ.ఎన్.సి హనుమంతరావు తప్పుబట్టారు. ఆ భవనాన్ని కొన్ని వందల ఏళ్లపాటు కళ్లముందు నిలిపే అవకాశం ఉన్నందున దాన్ని కూల్చొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ భవనం పటుత్వంపై సందేహాలొద్దన్నారు. ‘అదో అద్భుత నిర్మాణం.. అలనాటి నిర్మాణ శైలికి దర్పణం.. ప్రపంచవ్యాప్తంగా వారసత్వ కట్టడాలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. మనం దానికి భిన్నంగా వ్యవహరించటం సరికాదు.. వందల ఏళ్లపాటు చెక్కుచెదరకుండా మనగలిగేలా మలిచి ఆ నిర్మాణాన్ని భావితరాలకు అందివ్వాల్సి ఉంది. నిరంతరం నిర్వహణ పనులు కొనసాగిస్తే మరో 400 ఏళ్లయినా ఇంతే ఠీవిగా నిలబడే సత్తువ దానికుంది. ఉస్మానియా వర్సిటీ, హైకోర్టు భవనం సరసన నిలిచిన ఈ భవనం జీవితకాలాన్ని మనం సులభంగా నిర్ధారించలేం. అప్పట్లో అత్యంత పటుత్వంగా ఉండేలా వాటిని నిర్మించారు. అయితే కాలక్రమంలో గోడల పొరలు కొంత బలహీనపడి ఊడిపోవటం కద్దు. నిర్మాణంలో వినియోగించిన డంగు సున్నం వాతావరణ ప్రభావంతో బలహీనపడినంత మాత్రాన భవనమే పటుత్వం కోల్పోయిందని అనడం సరికాదు. పునాదులను బలహీనపడే పటుత్వం లేని భూమి కాదిది. గోడలు శిథిలమైన దాఖలాలేవీ లేవు. పైకప్పు జాక్ ఆర్చి రూఫ్ డిజైన్‌లో ఉంటే దాన్ని క్రాస్ గర్డర్‌లో సరిచేయొచ్చు, భారీ భూకంపాలు వస్తే తప్ప ఆ భవనం కూలే అవకాశమే లేదు’ అని పేర్కొన్నారు. సంరక్షణ చర్యలే కీలకం... గతంలో రాజ్‌భవన్ పైకప్పు నుంచి పెచ్చులూడి కిందపడటంతో ఆ భవనం శిథిలావస్థకు చేరుకుందనే భావన వ్యక్తమైందని, కానీ శాస్త్రీయ పద్ధతిలో దానికి సంరక్షణ చర్యలు చేపట్టడంతో అది ఠీవిగా కొనసాగుతోందని హనుమంతరావు గుర్తుచేశారు. అలాగే కొన్నేళ్లక్రితం వరకు కాలం తీరిన భవనాల జాబితాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించిన చౌమొహల్లా ప్యాలెస్ ఇప్పుడు విదేశీ పర్యాటకులను గొప్పగా ఆకట్టుకుంటోందని...అందుకు సంరక్షణ చర్యలే కారణమన్నారు. ఇటలీలో ఓ పక్కకు ఒరిగిన ప్రపంచ ప్రఖ్యాత ‘లీనింగ్ టవర్ ఆఫ్ పీసా’ను కన్జర్వేషన్ ఇంజనీరింగ్ ద్వారానే కాపాడుతున్నారన్నారు. కన్జర్వేషన్ ఇంజనీరింగ్ పద్ధతులను అవలంబించి మరమ్మతు చర్యలు చేపడితే ఉస్మానియా ఆస్పత్రి భవనం మరో చౌమొహల్లా ప్యాలెస్‌గా వెలుగొందుతుందన్నారు. ఆస్పత్రి భవనం పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లేదా జేఎన్టీయూ నుంచి నివేదిక తెప్పించుకోవచ్చన్నారు. -
సుల్తాన్‌బజార్ ఆస్పత్రికి ఉస్మానియా యూనిట్లు
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి హైదరాబాద్: నేటి నుంచి ఉస్మానియా ఆస్పత్రిలో నాలుగు వైద్య విభాగాలు, రోగుల తరలింపు ప్రక్రియ మొదలుకానుంది. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రో, మెడికల్గ్యాస్ట్రో విభాగాలను సుమారు 400 పడకలున్న సుల్తాన్ బజార్ ప్రసూతి ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించారు. ఉస్మానియా ఆసుపత్రిలోని పాత భవనంలో ఉన్న 18 యూనిట్లను సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి, ప్రసూతి యూనిట్‌ను పేట్లబురుజుకు తరలించనున్నట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం టీజీడీఏ నాయకులు డాక్టర్ రమేశ్, వీరేశం, పుట్ల శ్రీనివాస్ ఇతర అధికారులతో కలసి మంత్రి సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని సందర్శించారు. ఉస్మానియా ఆసుపత్రి నుంచి వచ్చే యూనిట్లకు వార్డులు అనువుగా ఉన్నాయా, లేవా అనే విషయాలను డీఎంఈ డాక్టర్ రమణి, ఆసుపత్రి సూపరిండెంటెంట్‌లను అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ నిపుణుల సలహాల మేరకు 105 సంవత్సరాల ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని పునర్నిర్మించనున్నట్లు చెప్పారు. ఉస్మానియా నుంచి వచ్చే యూనిట్లు ఇవే.. ఉస్మానియా ఆసుపత్రి నుండి సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రికి రానున్న యూనిట్లు జనరల్ మెడిసన్-8, జనరల్ సర్జరీ-8, మెడిక ల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ , సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ యూనిట్లను తరలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మొత్తం 740 పడకలు సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రిలో కొనసాగుతాయని చెప్పారు. ఇవి కేవలం ఏడాదే అక్కడ కొనసాగుతాయని తెలిపారు. ఇతర 5 ఆసుపత్రులలో.. ఉస్మానియా ఆసుపత్రిలో అవుట్‌పేషెంట్(ఓపీ)తోపాటు ఎమర్జెన్సీ విభాగాలు యథావిధిగా కొనసాగుతాయని మంత్రి తెలిపారు. నాంపల్లి, మలక్‌పేట్, గోల్కొండ, వనస్థలిపురం, కొండాపూర్ ఏరియా ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్కేర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బుధవారం కింగ్‌కోఠి ఆసుపత్రికి ఆర్థోపెడిక్ రోగులను వైద్యుల పర్యవేక్షణలో తరలించనున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర వైద్యం అందించేందుకు పటిష్టమైన రవాణా ఏర్పాటు సైతం చేస్తున్నట్లు చెప్పారు. మార్చురీ ఉస్మానియా ఆసుపత్రిలో కొనసాగుతుందని తెలిపారు. -
ఏం చేద్దాం?
ఉస్మానియా రోగుల తరలింపుపై తర్జన భర్జన ఏరియా ఆస్పత్రులపై పునరాలోచన ప్రసూతి సేవలన్నీ ఒకే చోట అందించాలని ప్రతిపాదన సిటీబ్యూరో: ఉస్మానియా ఆస్పత్రి పాత భవనంలోని రోగుల తరలింపు అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. జనరల్ మెడిసిన్ వి భాగాన్ని ఫీవర్ ఆస్పత్రికి, ఆర్థోపెడిక్ విభాగాన్ని కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు కానీ... మిగతా విభాగాల తరలింపు అంశాన్ని ఎటూ తేల్చలేకపోవడంతో వాటి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. సర్జికల్ గ్యాస్ట్రో, న్యూరాలజీ వ ంటి కీలక విభాగాలను మెడికల్ కళాశాలకు దూరంగా ఏరియా ఆస్పత్రులకు తరలిస్తే శస్త్ర చికిత్సలకు ఇబ్బందులు తప్పవు. అంతే కాదు... మెడికో లీగల్ (ఎంఎల్సీ) కేసుల విషయం వైద్యుల మధ్య ఘర్షణ సృష్టించే అవకాశం ఉంది. ఎంసీఐ మెడికల్ సీట్లను రద్దు చేసే ప్రమాదం ఉంది. ఆయా ఆస్పత్రుల్లోని ఆపరేషన్ థియేటర్లు శస్త్రచికిత్సలకు పనికిరావనే అభిప్రాయం వ్యక్తమవుతుండడంతో దీనిపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. రోగులందరినీ రెండు మూడు చోట్ల సర్దుబాటు చేస్తే ఎలాంటి సమస్యలూ ఉండవు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి మంగళవారం మరోసారి వైద్యులు, అధికారులతో చర్చించి, ఆ తర్వాత తుదినిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. పేట్లబురుజుకు సుల్తాన్‌బజార్ ఉస్మానియా రోగులను పేట్లబురుజుకు తరలిస్తే... గర్భిణులు, బాలింతలు, ఇతర మహిళలు ఉండే చోట పురుషులను ఉంచాల్సి వస్తుంది. దీనివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఉస్మానియా వైద్య కళాశాలకు అనుబంధంగా పని చేస్తున్న సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రిలోని రోగులను పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రికి తరలించడం వల్ల సాంకేతికంగా సమస్యలు తలెత్తవు. అంతేకాకుండా మెడికల్ కాలేజీకి సమీపంలో 360 పడకలను సర్దుబాటు చేయవచ్చు. దీని వల్ల రోగులకే కాదు... వైద్యులు, వైద్య విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ఇక నిలోఫర్ నవజాత శిశువుల కేంద్రంలో తగినన్ని పడకలు లేకపోవడంతో ఒకే పడకపై ముగ్గురు నలుగురు రోగులను ఉంచి చికిత్స చేస్తున్నారు. 400 పడకల సామర్థ్యం ఉన్న కొత్త భవనాన్ని ఇచ్చేందుకు ఎన్ఆర్హెచ్ఎం అంగీకరించకపోవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇందుకు అంగీకరిస్తే ఎలాంటి సమస్యా ఉండదు. ఒక వేళ నిరాకరిస్తే ఏం చేయాలనేది ప్రశ్నార్థకంగా మారింది. నర్సింగ్ విద్యార్థుల తరలింపుపై విస్త్రృత చర్చ ఓ వైపు పాత భవనంలోని పడకల తరలింపు అంశంపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతుండగా... మరోవైపు నర్సింగ్ కాలేజీ విద్యా ర్థులు, నర్సులు తమ భవితవ్యంపై విస్త్రృతంగా చర్చించుకుంటున్నారు. ‘రోగులను తరలిస్తారు సరే.. మా సంగతేమిటి?’ అని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు సోమవారం ఆస్పత్రిలో ఏపీ నర్సింగ్ అసోసియేషన్‌లోని నర్సులంతా సమావేశమయ్యారు. తమకు ఎక్కడ ఆశ్రయం కల్పిస్తారో స్పష్టం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పడకల తరలింపు, సర్దుబాటు అంశంపై తమ అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని... ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. నర్సులంతా విధులను బహిష్కరించి సమావేశం కావడంతో సకాలంలో వైద్యసేవలు అందక రోగులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. -
నిలోఫర్, పేట్లబురుజు వైపే మొగ్గు!
ఉస్మానియా ఆస్పత్రి పడకల సర్దుబాటుపై వైద్యుల సమాలోచనలు ఏరియా ఆస్పత్రుల్లో ఎంఎల్సీ కేసుల అంశంలో సమస్యలు వ చ్చే అవకాశం ఎన్ఆర్హెచ్ఎం, పేట్లబురుజు మూడు, నాలుగో అంతస్తులు ఉత్తమం విభాగాలన్నీ ఒకే చోట ఉంటాయని భావన సిటీబ్యూరో: శిథిలావస్థకు చేరిన ఉస్మానియా పాతభవనంలోని 857 పడకల సర్ధుబాటుపై ప్రభుత్వం తర్జన భర్జనలో పడుతోండగా, వైద్యులు మాత్రం నిలోఫర్, పేట్లబురుజు ఆస్పత్రుల వైపే మొగ్గుచూపుతున్నారు. అధికారులు ప్రతిపాదించిన కింగ్‌కోఠి, వనస్థలిపురం, నాంపల్లి, మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రులకు బదులు వీటిని ఎంపిక చేస్తే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదని వారు భావిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రి పాత భవనాన్ని కూల్చివేసి దాని స్థానంలో మరో రెండు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలని నిర్ణయించిన నేపథ్యంలో గురువారం ముఖ్యమంత్రి స్వయంగా ఆస్పత్రిని పరిశీలించారు. వారం రోజుల్లో పాతభవనాన్ని ఖాళీ చేయించి,ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించడంతో వారు కింగ్‌కోఠి, నాంపల్లి, మలక్‌పేట్, ఫీవర్, నిలోఫర్, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రుల ను ప్రతిపాదించారు. ప్రతిపాదిత ఆస్పత్రుల్లో మంత్రి తనిఖీలు క్యాజువాలిటీ బిల్డింగ్‌లోని రేడియాలజీతో పాటు అన్ని విభాగాలకు సంబంధించిన అవుట్‌పేషెంట్ విభాగాలు, ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. కులికుతుబ్‌షా భవనంలో ఎంఆర్ఐ, సీటీస్కాన్ విభాగాలతో పాటు కార్డియాలజీ, సీటీసర్జరీ, నెఫ్రాలజీ, పాథాలజీ లేబోరే టరీ కొనసాగుతోంది. పాతభవనంలో ప్రస్తుతం జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, న్యూరాల జీ, డెర్మటాలజీ, సుఖవ్యాధులు, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఇన్‌పేషంటు వార్డుల్లో 857 పడకలు ఉన్నాయి. వీటిలో జనరల్ మెడిసిన్, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, డీవీఎల్ జైల్ వార్డుల్లోని 316 పడకలను ఫీవర్ఆస్పత్రికి, జనరల్ సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట రాలజీ, పోస్టు ఓపీవార్డుల్లోని 356 పడకలను నిలోఫర్, మలక్‌పేట్, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రులకు, ఆర్థోపెడిక్స్లోని 120 పడకలను కింగ్‌కోఠి ఆస్పత్రికి, న్యూరాలజీ వార్డులోని 46 పడకలను ఫీవర్, గాంధీ ఆస్పత్రులకు తరలించాలని భావించారు. ఆరోగ్యశ్రీవార్డులోని 19 పడకలను ఏరియా ఆస్పత్రికి, న ర్సింగ్ స్కూల్‌ను వెంగల్రావునగర్లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌కు, డెంటల్ కాలేజీని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి శుక్రవారం ఆయా ఆస్పత్రులను సందర్శించి పరిస్థితులను అంచనా వేశారు. ఒకేచోట 450 పడకలు సర్దుబాటు.. ఇదిలా ఉండగా ఉస్మానియా వైద్యులు, సిబ్బంది, అధికారులు సమావేశమై ప్రత్యామ్నాయాలపై విస్త్రృతంగా చర్చించారు. కీలకమైన ఆర్థో, గ్యాస్ట్రో విభాగాలను ఏరియా ఆస్పత్రుల కు తరలించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని అభిప్రాయపడుతున్నారు. ఏరియా ఆస్పత్రుల్లో ఆపరేషన్ థియేటర్లు చిన్నగా ఉండటంతో పాటు మెడికో లీగల్ కేసులు వస్తే ఏరియా ఆస్పత్రి వైద్యులు అటెండ్ కావాలా? ఉస్మానియా వైద్యులు అటెండ్ కావాలా? అంశంపై సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీటికి పరిషా ్కరంగా నిలోఫర్ ఆస్పత్రి సమీపంలో 400 పడకల సామర్థ్యంతో ప్రస్తుతం సిద్ధంగా ఉన్న ఎన్ఆర్హెచ్ఎం బిల్డింగ్ వాటిని తరలిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. అంతేకాకుండా ఒకేచోట ఎనిమిది ఆపరేషన్ థియేటర్లు ఉండటం అనుకూలంగా ఉంటుందన్నారు. పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రి మూడు, నాలుగో అంతస్థులు ఖాళీగా ఉన్నందున మిగిలిన పడకలను ఇక్కడ సర్దుబాటు చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదనే వారు పేర్కొన్నారు. జనరల్ మెడిసిన్ సేవలకు అవసరమైతే ఫీవర్ ఆస్పత్రిని కూడా వినియోగించు కోవచ్చు. ఇదిలా ఉండగా పడకల సర్ధుబాటు అంశాన్ని ప్రభుత్వం కూడా వైద్యుల అభీష్టానికే వదిలేయడం కొసమెరుపు. కింగ్ కోఠికి ఆర్థోపెడిక్ విభాగం సుల్తాన్‌బజార్, వనస్థలిపురం: ఉస్మానియా ఆసుపత్రి అర్థోపెడిక్ విభాగంలోని 99 పడకలను కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రికి తరలించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. శుక్రవారం కింగ్‌కోఠి ఆసుపత్రిని సందర్శించిన ఆయన ఆసుపత్రిలోని వార్డులు, ఓపి విభాగం ఇతర సౌకర్యాలను పరిశీలించారు. వారం రోజుల్లో ఆర్థోపెడిక్ విభాగాన్ని తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని టిఎస్‌ఎంఐడీసీ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట డీఎంఈ డాక్టర్ రమణి, వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ వీణాకుమారి, ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘురామ్, ఉషాబాల, సుజాత, శివప్రసాద్, ఆర్ఎంవో సరోజ తదితరులు ఉన్నారు. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో: కమిషనర్ వీణాకుమారి, డీఎంఈ రమణి, తదితరులు శుక్రవారం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిని సందర్శించి వసతులపై ఆరా తీశారు. ఆసుపత్రిలో పేషెంట్ల తాకిడి, ఇన్‌పెషెంట్ బెడ్స్, ఆపరేషన్ థియేటర్లు, అదనపు గదులు తదితర అంశాలపై మంత్రి తదితర అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. నిలోఫర్‌లో... ముఖ్యమంత్రి సూచన మేరకు ఉస్మానియా వైద్యులు నిలోఫర్ ఆస్పత్రిని సందర్శించారు. కొత్తగా నిర్మించిన ఎన్ఆర్హెచ్ంఎం భవనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్ బొంగు రమేష్, డాక్టర్ నాగేందర్ ఉన్నారు. -
ఆస్పత్రుల్లో నిఘా నేత్రం!
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఆస్పత్రుల ప్రక్షాళనపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద రోగులకు వైద్య సేవలు అందకపోవడం, అనేకచోట్ల అక్రమాలు, అవినీతి రాజ్యమేలుతోన్న నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని సర్కారు యోచిస్తోంది. ఇందుకోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ) మొదలుకొని.. ఉస్మానియా ఆస్పత్రి వరకు అన్ని ఆస్పత్రుల్లో విడతలవారీగా సీసీ కెమెరాలు నెలకొల్పాలని భావిస్తోంది. వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ప్రధాన కార్యాలయాల్లోనూ వీటి ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఆ శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌చందా స్వయంగా తన చాంబర్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. అత్యాధునిక కెమెరాల కొనుగోలు.. 360 డిగ్రీల కోణంలో చిత్రీకరించే, ఐపీ అడ్రస్ కలిగిన అత్యంత అధునాతన సీసీ కెమెరాలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఆయా కార్యాలయాల్లో జరిగే అన్ని వ్యవహారాలను ఇంటర్నెట్ ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. ఆయా కార్యాలయాల నుంచి సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి చాంబర్లకు అనుసంధానం చేసి పర్యవేక్షించాలని యోచిస్తోంది. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా విమర్శలు రావడంతో పకడ్బందీగా వీటిని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా వరంగల్ ఎంజీఎంలో ప్రయోగాత్మకంగా 80 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. త్వరలో వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా వీటిని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వెద్య సేవలు.. పారిశుద్ధ్యం పర్యవేక్షణకే.. వైద్యులు సకాలంలో రావడంలేదని.. వచ్చినా రోగులకు సేవలు అందడం లేదని.. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని.. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ వైద్య సేవలపై విమర్శలున్నాయి. కిందిస్థాయి ఉద్యోగి నుంచి పెద్దస్థాయి అధికారి వరకు కొందరిపై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. దీన్ని నివారించేందుకే సీసీ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ యోచన. ఈ సీసీ కెమెరాలన్నీ ఇంటర్నెట్ ప్రొటోకాల్(ఐపీ) అడ్రస్ కలిగి ఇంటర్నెట్తో అనుసంధానమై ఉంటాయి. వీటిని సెల్‌ఫోన్.. కంప్యూటర్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే.. వాటి ఐపీ అడ్రస్‌ను నమోదు చేయడం ద్వారా ఏ ఆస్పత్రినైనా సచివాలయంలోని నిర్ణీత చాంబర్ల నుంచి నేరుగా పర్యవేక్షించవచ్చు. ప్రత్యేక సాఫ్ట్వేర్ సాయంతో మొబైల్లో నుంచి కూడా పర్యవేక్షించవచ్చు. దీనివల్ల సిబ్బంది క్రమశిక్షణతో వైద్య సేవలు అందిస్తారన్నది సర్కారు ఆలోచన. సీసీ కెమెరాలపై నిరంతర పర్యవేక్షణకు ప్రత్యేక కంట్రోల్‌రూం లాంటిది ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నట్లు తెలుస్తోంది. -
అమ్మాయి కోసం వివాదం: ముగ్గురికి కత్తిపోట్లు
చాంద్రాయణగుట్ట: వివాహ విందులో నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారి ముగ్గురి కత్తిపోట్లకు దారి తీసింది. ఛత్రినాక పోలీసుల కథనం ప్రకారం.. చాంద్రాయణగుట్టకు చెందిన అబ్రార్, ఇర్ఫాన్ సమీప బంధువులు. ఇద్దరూ తమ స్నేహితులతో కలిసి ఈనెల 4న బండ్లగూడలో జరిగిన బంధువుల పెళ్లి విందుకు వెళ్లారు. ఆ సమయంలో ఒక అమ్మాయి విషయమై అబ్రార్, ఇర్ఫాన్ గొడవ పడ్డారు. పెద్దలు ఇద్దరినీ సముదాయించి పంపేశారు. ఇదిలా ఉండగా... రాజీ కుదుర్చుకుందామని అబ్రార్ ఆరుగురితో, ఇర్ఫాన్ ఐదుగురితో మంగళవారం రాత్రి జంగమ్మెట్‌లోని బుడగ జంగాల బస్తీకి వచ్చారు. ఆ సమయంలో మాటా మాటా పెరగడంతో ఇర్ఫాన్కత్తితో అబ్రార్‌పై కత్తితో దాడి చేశాడు. దీంతో ఇర్ఫాన్‌తో పాటు వచ్చిన ఫయీం, నదీంలపై అబ్రార్ బృందం కత్తితో దాడి చేసింది. సమాచారం అందుకున్న ఛత్రినాక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హైకోర్టులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా, గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 32లోని స్థలానికి సంబంధించి అధికారులు తనకు పట్టా ఇవ్వడం లేదని, ఏళ్ల తరబడి వారి చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ శేరిలింగంపల్లికి చెందిన శంకర్ హైకోర్టులో శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. వీపు, ఛాతీ భాగంలో మంటలు అంటుకొని గాయాలు కావడంతో అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కిరోసిన్‌తో శంకర్ హై కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించాడు. కిరోసిన్‌ను ఒంటిపై చల్లుకుని 8వ నంబర్ కోర్టు హాలు వద్దకు చేరుకున్నాడు. తనకు న్యాయం చేయడంలేదని అరుస్తూ.. శరీరానికి నిప్పంటించుకుని కోర్టులోనికి వెళ్లాడు. వీపు, ఛాతీ భాగంలో మంటలతో కోర్టులోకి వచ్చిన శంకర్‌ను చూసి న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్టీ, న్యాయవాదులు నిర్ఘాంతపోయా రు. కె.చిదంబరం అనే న్యాయవాది తేరుకుని శంకర్ చొక్కాను చించేశారు. మిగిలిన న్యాయవాదులు కూడా సహకరించడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన లో శంకర్ శరీరంపై 15 శాతం మేర గాయాలయ్యాయి. న్యాయమూర్తి ఆదేశంతో పోలీసులు శంకర్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 32లో ఉన్న స్థలంలో రెవిన్యూ అధికారులు తనకు పట్టా ఇవ్వడం లేదని, ఎన్ని సార్లు కోరినా కూడా పట్టించుకోవడం లేదన్న ఆవేదనతో శంకర్ ఆత్మహత్యాయత్నం చేశాడని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటం, అది విచారణకు నోచుకోకపోవడంతోనే ఇలా చేశారంటూ ఆరోపణలు రావడంతో ఆ దిశగా అధికారులు విచారణ జరిపారు. అయితే హైకోర్టులో శంకర్‌కు సంబంధించి ఎలాంటి కేసు లేదని తేలడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో ఇదే విషయంలో శంకర్ రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా హైకోర్టు భద్రతా అధికారుల వివరణ కోరినట్లు తెలిసింది. కాగా కోర్టు విధులకు భంగం కలిగించాడంటూ శంకర్‌పై చార్మినార్ పోలీసులు ఐపీసీ 186, 226 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
హైదరాబాద్: నగరంలోని యాకుత్‌పూర సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. గురువారం ఉదయం రైల్వే ట్రాక్‌పై మృతదేహం ఉండటంతో స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. -
ఉస్మానియా ఆసుపత్రికి కొత్త హంగులు
-
ఉస్మానియా ఆసుపత్రికి కొత్త హంగులు
రెండు టవర్లు.. 24 అంతస్తులు.. 2,500 పడకలు వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయం హైదరాబాద్: రాజధానిలోని ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలో 24 అంతస్తులతో రెండు టవర్లతో భారీ భవనాల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. అందులో అత్యాధునిక సదుపాయాలు కల్పించి 2,500 పడకలతో రోగులకు విస్తృత సేవలు అందించాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతమున్న ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య సేవలను కొనసాగిస్తూనే ఈ కొత్త భవనాలను నిర్మించాలని చెప్పారు. బుధవారం సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై దాదాపు ఏడు గంటలపాటు సీఎం సుదీర్ఘంగా సమీక్షించారు. ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్చందాతోపాటు ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలను మెరుగుపరచడం, ఆసుపత్రుల అభివృద్ధిపై చర్చించారు. నిలోఫర్ ఆసుపత్రికి కొత్త భవనాన్ని సమకూర్చాలని, గాంధీ ఆసుపత్రిలోనూ అవసరమైన మరమ్మతులు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతి జిల్లాలో వెయ్యి పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 20 వేల నుంచి 25 వేల జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలని, ప్రతీ నియోజకవర్గంలో వంద గ్రామాలకు ఉపయోగపడే విధంగా ఏరియా ఆసుపత్రి ఉండాలని సీఎం నిర్దేశించారు. రెవెన్యూ జిల్లాల ప్రాతిపదికన కాకుండా భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఆరోగ్య జిల్లాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ పేర్కొన్నారు. పీహెచ్‌సీలను 30 పడకల ఆసుపత్రులుగా, ఏరియా ఆసుపత్రులను 100 పడకల ఆసుపత్రులుగా, జిల్లా ఆసుపత్రులను సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులుగా మార్చాలని చెప్పారు. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆసుపత్రులను రెండు వేల పడకల ఆసుపత్రులుగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి సిబ్బంది, పరికరాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆసుపత్రుల్లో సౌకర్యాలపై దృష్టి ఆసుపత్రుల్లో సాంకేతిక పరికరాలను నిర్వహించడానికి బయో మెడికల్ ఇంజనీర్లను నియమించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇన్, ఔట్ పేషంట్లు వివరాలపై సరైన అంచనాలు ఉండాలన్నారు. వరంగల్ ఎంజీఎంను కూడా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పనకు కేంద్ర సాయం తీసుకోవాలని సూచించారు. త్వరలో వైద్యులతో కూడా సమావేశమై రాష్ట్రానికి అవసరమయ్యే సరైన వైద్య విధానాన్ని రూపొందిస్తానని వెల్లడిం చారు. ప్రభుత్వ వైద్యాన్నంతా ఒకే గొడుగు కిందకు తీసుకురావాల్సిన అవసరముందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రాథమిక వైద్యశాలలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల ఏర్పాటు, నిర్వహణలో ఆచరణాత్మక విధానం రావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రభుత్వాసుపత్రులను పూర్తిస్థాయిలో అభివృద్ధిపరిచి వాటిపట్ల ప్రజల్లో నమ్మకం కలిగించాలని హితవు పలికారు. మౌలిక వసతులన్నీ కల్పించాక అందుకు తగ్గట్లు పనిచేయని అధికారులపై తగు చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. రాష్ట్రంలో వైద్య పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని కూడా ఆయన చెప్పినట్లు సమాచారం. ఇక గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపరచడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. దీనిపై అధ్యయనం చేసి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని వైద్యాధికారులను సీఎం ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి వైద్యులు ముందుకు రాకపోవడాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకమిచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. 104, 108 సేవలు కూడా ప్రభుత్వ వైద్యంతో కలిసే ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. వైద్య ఆరోగ్యశాఖలో అవినీతి అక్రమాలకు పాల్పడితే తీవ్ర చర్యలుంటాయని ఈ సందర్భంగా అధికారులను హెచ్చరించారు. వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థలో అవినీతి రాజ్యమేలుతుందని ఆ శాఖ ఈడీ రాజేందర్‌పై కేసీఆర్ మండిపడినట్లు తెలిసింది. ఆ విభాగంలోని అధికారాలను అవసరమైతే బదిలీ చేయాలని సూచించారు. బోధనాసుపత్రుల్లో వైద్య సేవలు సరిగా లేవని వెద్య విద్యాశాఖ సంచాలకులు పుట్టా శ్రీనివాస్‌ను మందలించినట్లు సమాచారం. విధులకు గైర్హాజరయ్యే వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. -
స్వైన్‌ఫ్లూతో మరో ముగ్గురి మృతి
సాక్షి, హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ చికిత్సపొందుతున్న కిషన్‌బాగ్‌కు చెందిన సఫియాబి(60) బుధవారం ఉస్మానియా ఆస్పత్రిలో మృతి చెందింది. గాంధీ జనరల్ ఆస్పత్రిలో గత రెండు రోజుల నుంచి చికిత్స పొందుతున్న నార్త్లాలాగూడకు చెందిన ఐలమ్మ(80) మంగళవారం రాత్రి మృతి చెందింది. అలాగే నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం ఎర్రచెర్వుతండాకు చెందిన రమావత్ అనసూర్య(33) స్వైన్‌ఫ్లూతో గాంధీలో చేరి బుధవారం మృతిచెందింది. దీంతో కే వ లం నెల రోజుల్లో ఫ్లూతో చనిపోయిన వారి సంఖ్య 28కు చేరింది. కాగా, గాంధీ అవుట్‌పేషెంట్ విభాగంలో స్వైన్‌ఫ్లూ వార్డును ఆస్పత్రి సూపరింటెండెంట్ దెర్యవాన్ బుధవారం ప్రారంభించారు. -
ఆ‘పరేషాన్!’
ఉస్మానియా ఆపరేషన్ గదులకు తాళం చికిత్సలకు అంతరాయం ఆందోళనలో రోగులు... పట్టించుకోని అధికారులు సిటీబ్యూరో: ప్రతిష్ఠాత్మక ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. రోగుల నిష్పత్తికి తగినంత మంది స్టాఫ్ నర్సులు, వార్డు బాయ్స్ లేకపోవడంతో ఓపీ గదులే కాదు... ఆపరేషన్ థియేటర్లు సైతం మూతపడుతున్నాయి. వైద్యులు లేకపోవడంతో న్యూరోఫిజీషియన్ ఓపీ గదికి ఇప్పటికే తాళాలు పడ్డాయి. నర్సులు, వార్డు బాయ్స్ లేమితో తాజాగా జనరల్ సర్జరీ విభాగంలోని ఆపరేషన్ థియేటర్-3 గదికి తాళాలు పడ్డాయి. దీంతో ఆ విభాగంలో శస్త్రచికిత్సలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇక్కడి రోగుల అవసరాలు పూర్తిగా తీర్చాలంటే కనీసం 835 మంది స్టాఫ్ నర్సులు ఉండాలి. ప్రస్తుతం 309 మంది మాత్రమే ఉన్నారు. వైద్యులు లేక కొన్ని విభాగాలు... వైద్య పరికరాలు, స్టాఫ్ నర్సులు లేక మరికొన్ని విభాగాలు మూత పడుతున్నాయి. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పేరుకే బయోమెట్రిక్ హాజరు సుమారు 1100 పడకల సామర్థ్యం ఉన్న ఉస్మానియా ఆస్పత్రి ఓపీకి నిత్యం 1400 నుంచి 1600 మంది రోగులు వస్తుంటారు. ఇక్క డ నిత్యం 1200 మంది చికిత్స పొందుతుంటారు. 12 ఆపరేషన్ థియేటర్లు ఉండగా... వీటిలో ఇప్పటికే రెండు మూతపడ్డాయి. ఆరు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఉన్న వాటిలో చిన్నాపెద్ద కలిపి నిత్యం సుమారు 150 సర్జరీలు జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం 22 విభాగాలుంటే, 200పైగా వైద్యులు పని చేస్తున్నారు. వీరిలో సగం మంది అసలు ఆస్పత్రికే రావడం లేదు. ఒక వేళ వచ్చినా...ఓపీకి వెళ్లకుండా గదులకే పరిమితమవుతున్నారు. కొంతమంది దంపతులూ ఇక్కడ వైద్యులుగా విధులు నిర్వహిస్తున్నారు. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు ఆస్పత్రికి వచ్చి ఇద్దరి సంతకాలు పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగుల హాజరు శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఇటీవల బయోమెట్రిక్ హాజరు వ్యవస్థను అమలు చేశారు. దీన్ని ఉపయోగించేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. స్టాఫ్‌నర్సుల కొరత వల్ల రోగి బంధువులే సంరక్షకులుగా మారుతున్నారు. వార్డులకు తరలించడం మొదలు సెలైన్లు ఎక్కించడం, ఇంజక్షన్లు ఇవ్వడం వంటి కీలక పనులన్నీ వారే చేయాల్సి వస్తోంది. ఎంఆర్డీ సెక్షన్లో సిబ్బంది కొరత వల్ల మెడికో లీగల్ కేసుల రికార్డులను పోలీసులే వెతుక్కోవాల్సి వస్తోంది. మరోవైపు కీలకమైన రికార్డులు మాయమవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మొరాయిస్తున్న యంత్రాలు రేడియాలజీ విభాగంలో పది ఎక్సరే యంత్రాలు ఉండగా.. వీటిలో ఇప్పటికే సగం మూలకు చేరాయి. సిటీస్కాన్ గడువు ముగియడంతో మిషన్‌లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. సాధారణ రోగులు ఆస్పత్రిలో ఎంఆర్ఐ స్కాన్ తీయించుకోవాలంటే కనీసం నెల రోజుల ముందు పేరు నమోదు చేసుకోవాల్సి వస్తోంది. రోగుల కోసం కేటాయించిన పేయింగ్ రూమ్‌ల్లో పరిపాలనాపరమైన పనులు నిర్వహిస్తున్నారు. రోగులను ఆఫరేషన్ థియేటర్లకు తరలించే లిఫ్ట్‌లు పని చేయకపోవ డంతో ఇటీవల ఏకంగా సర్జరీలనే వాయిదా వేయాల్సి వచ్చింది. -
జానకిరామ్‌కు కన్నీటి వీడ్కోలు
హైదరాబాద్ శివారులోని హరికృష్ణ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు చితికి నిప్పంటించిన పెద్ద కుమారుడు తారక రామారావు శోకసంద్రంలో నందమూరి కుటుంబం.. బోరున విలపించిన హరికృష్ణ జానకిరామ్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి హరికృష్ణ నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో రాజకీయ, సినీ ప్రముఖుల రాక హైదరాబాద్/ మొయినాబాద్ రూరల్: నందమూరి జానకిరామ్‌కు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు అశ్రునయనాలతో ఆదివారం తుది వీడ్కోలు పలికారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని ముర్తుజాగూడ సమీపంలో ఉన్న హరికృష్ణ వ్యవసాయ క్షేత్రంలో జానకిరామ్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. నల్లగొండ జిల్లా ఆకుపాముల గ్రామ శివారులో 65వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జానకిరామ్ (42) మృతి చెందిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి జానకిరామ్ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించి.. శనివారం రాత్రే ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మసాబ్‌ట్యాంక్ ప్రాంతంలోని హరికృష్ణ నివాసానికి పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు. జానకిరామ్ మృతి వార్త తెలిసిన నందమూరి బంధుగణంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక కన్నీటిలో మునిగిపోయిన హరికృష్ణను, మా నాన్నకేమైందంటూ రోదిస్తున్న జానకిరామ్ కుమారుడు తారకరామారావును, సోదరులు కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లను బంధుమిత్రులు, ఆప్తులు ఓదార్చారు. హీరో నందమూరి బాలకృష్ణ, నంద మూరి బంధువులు హరికృష్ణ ఇంటి వద్దకు చేరుకొని జానకిరామ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బంధువులు, అభిమానుల సందర్శనార్థం జానకిరామ్ పార్థివ దేహాన్ని ఇంటి ఆవరణలో ఉంచారు. ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్, దగ్గుబాటి వెంకటే శ్వరరావు తదితరులు అంతిమ సంస్కారాలకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియల కోసం ఒకటిన్నర గంటల సమయంలో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ముర్తుజాగూడ గ్రామ సమీపంలోని హరికృష్ణ ఫామ్‌హౌస్‌కు పార్థివ దేహాన్ని తరలించారు. వాహనం ముందు సీట్లో హీరో కల్యాణ్‌రామ్, జానకిరామ్ పెద్ద కుమారుడు తారకరామారావు కూర్చున్నారు. ఆ వాహనం వెనుక నారా లోకేశ్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు తదితరులు వారి వాహనాల్లో వెళ్లారు. ఫామ్‌హౌస్‌లో జానకిరామ్ కుమారుడు తారక రామారావుతో అంత్యక్రియలు నిర్వహింపజేశారు. ఈ సమయంలో కుమారుడిని గుర్తుచేసుకుంటూ హరికృష్ణ బోరున విలపించారు. పరామర్శించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇతర ప్రముఖులు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 9.30 గంటలకు నందమూరి హరికృష్ణ నివాసానికి వెళ్లి జానకిరామ్ కుటుంబసభ్యులను ఓదార్చారు. వారితో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు పరిటాల సునీత, చిన రాజప్ప కొల్లు రవీంద్ర, ఎంపీలు చిరంజీవి, కె.నారాయణ, మాజీ ఎంపీలు మధుయాష్కీగౌడ్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ మంత్రులు కె.విజయరామారావు, పెద్దిరెడ్డి, కాసు కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే బాబూమోహన్, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యేలు అడుసుమిల్లి జయప్రకాశ్, కృష్ణయాదవ్, ఎమ్మెల్సీ వర్ల రామయ్య, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తదితరులు హరికృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. కాగా సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు, డి.సురేష్‌బాబు, ఆదిశేషగిరిరావు, బోయపాటి శ్రీనివాస్, పూరీ జగన్నాథ్, జగపతిబాబు, బండ్ల గణేశ్, శ్రీను వైట్ల, చలపతిరావు, అల్లు అర్జున్, నారా రోహిత్, మంచు విష్ణు, అల్లరి నరేష్, జీవిత, వందేమాతరం శ్రీనివాసరావు, గీతాంజలి, పృథ్విరాజ్, జయవాణి, అఖిల్ తదితరులు హరికృష్ణ కుటుంబాన్ని ఓదార్చారు. ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు మునగాల: జానకిరామ్ రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు నల్లగొండ జిల్లా మునగాల ఎస్ఐ ఎస్.రమేశ్ తెలిపారు. ఎస్ఐ వెల్లడించిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం కోనాయిగూడానికి చెందిన రైతు వెంకన్న ఆకుపాముల జాతీయ రహదారి పక్కన సాగు చేసిన వరినారును తీసుకెళ్లడానికి సొంత ట్రాక్టర్‌తో వచ్చాడు. వరినారు తీసుకొని స్వగ్రామానికి వెళ్లేందుకు ఆకుపాముల శివారులో రాంగ్రూట్లో వచ్చి.. ట్రాక్టర్‌ను యూ టర్న్ తీసుకుంటుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళుతున్న జానకిరామ్ టాటా సఫారీ వాహనం ఢీకొట్టింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్‌ను డ్రైవర్ నడుపుతున్నాడా..? యజమాని నడిపాడా? అన్నది ఇంకా తేలాల్సి ఉందని ఎస్ఐ చెప్పారు. ప్రస్తుతానికి పరారీలో ఉన్న డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని, అతని పేరు కూడా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ‘ఎన్టీఆర్ కుటుంబంతో నా అనుబంధం ప్రత్యేకమైనది. జానకిరామ్ మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కానీ నా మోకాలి గాయం కారణంగా.. వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించలేకపోయాను. ఈ విషాదం నుంచి కోలుకునే స్థైర్యాన్ని నందమూరి కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.’’ - కైకాల సత్యనారాయణ ‘‘అన్నగారు ఎన్టీఆర్‌తో నాకున్న అనుబంధం గురించి తెలిసిందే. చెన్నైలో ఉన్నప్పట్నుంచీ హరికృష్ణ కుటుంబంతో స్నేహబంధం ఉంది. హైదరాబాద్ వచ్చిన తర్వాత తన తాత పేరు మీద జానకిరామ్ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్‌ను ఆరంభించారు. అప్పుడు నిర్మాతల మండలిలో సభ్యత్వం కోసం వేరే నిర్మాత సంతకం అడిగితే.. తను నా దగ్గరికే వచ్చాడు. మా కుటుంబంతో అంత చనువుగా ఉండేవాడు. అలాంటి జానకిరామ్ ఇప్పుడు లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. దేవుడు హరికృష్ణ కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.’’ - మోహన్‌బాబు ‘జానకిరామ్ మరణవార్త చాలా బాధ కలిగించింది. ‘గోపాల గోపాల’ షూటింగ్ నిమిత్తం వారణాసిలో ఉన్నందున రాలేకపోయాను. హరికృష్ణ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాను. జానకిరామ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.’’ - పవన్ కల్యాణ్ -
సేవారామం రామ్‌నాథ్ ఆశ్రమం
ఉస్మానియా ఆస్పత్రి.. నిరంతరం రోగులు, వారితో వచ్చిపోయే బంధువులతో కిటకిటలాడుతుంటుంది. రోజూ కనీసం నాలుగు వేల మంది రోగులు వస్తుంటారు. చికిత్స కోసం కొందరు రోజుల తరబడి ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుంది. ఆస్పత్రిలో చికిత్స కోసం చేరే రోగుల సంగతి సరే, మరి వారికి తోడుగా వచ్చిన వారి కుటుంబ సభ్యులు, బంధువుల మాటేమిటి? ఎక్కువగా ఇక్కడకు వచ్చేది పేదరోగులే! వారికి తోడుగా వచ్చేవారు నిలువనీడ లేకుండా అల్లాడుతుండటం ఇక్కడ నిత్యకృత్యం. బయట హోటళ్లు, లాడ్జింగుల్లో గదులు తీసుకునే స్తోమత లేనివారు గత్యంతరం లేక చెట్లనీడనే విశ్రమిస్తుంటారు. ఈ పరిస్థితి ఈనాటిది కాదు. ఉస్మానియా ఆస్పత్రి కట్టించినప్పటి నుంచీ ఇదే పరిస్థితి. 1951లో కొందరు వదాన్యులు ఉస్మానియా ఆస్పత్రి వెనుకనే శ్రీరామ్నాథ్ ఆశ్రమాన్ని నిర్మించారు. రోగులకు, వారి సహాయకులకు ఇక్కడ కారుచౌకగా గదులను అద్దెకు ఇస్తారు. దశాబ్దాల తరబడి ఇది కొనసాగుతున్నా, నేటికీ దీని గురించి ఎక్కువ మందికి తెలియదు. ఆస్పత్రి వెనుకనే, చౌకగా గదులు దొరికే వీలుందనే విషయం తెలియక చాలామంది ఆరుబయట చెట్ల నీడనే తలదాచుకుంటున్నారు. సేవాదృక్పథంతో ప్రారంభమైన శ్రీరామ్నాథ్ ఆశ్రమం ప్రస్తుతం దేవాదాయ శాఖ అధీనంలో పనిచేస్తోంది. రోగులకు, వారి సహాయకులకు నిలువనీడనిచ్చే ఉద్దేశంతో ఏర్పడిన ఈ ఆశ్రమం గురించి ‘సిటీప్లస్’ కథనం.. పాతిక రూపాయలకే గది.. నగరంలో కనీస స్థాయి హోటళ్లు, లాడ్జింగుల్లో సైతం గది అద్దె దాదాపు రోజుకు ఐదువందల వరకు ఉంటుంది. అలాంటిది, శ్రీరామ్నాథ్ ఆశ్రమంలో మాత్రం రోజుకు పాతిక రూపాయలకే గది దొరుకుతుంది. పాతిక రూపాయలకు దొరికే గదిలో మంచం, మంచినీళ్ల బిందె మాత్రమే ఉంటాయి. ఫ్యాన్ ఉండదు. ఇదే ఆశ్రమంలో కాస్త మెరుగైన గది నలభై రూపాయలకు దొరుకుతుంది. నలభై రూపాయలకు దొరికే గదుల్లో ఫ్యాన్, వంటగది, మంచం, మంచినీళ్ల బిందె ఉంటాయి. ఉస్మానియా ఆస్పత్రి చుట్టుపక్కల ఈ ఆశ్రమానికి సంబంధించిన పోస్టర్లు కనిపిస్తాయి. అయితే, ఆస్పత్రికి వచ్చేవారిలో ఎక్కువమంది నిరక్షరాస్యులే కావడంతో, దీని గురించి తెలుసుకోలేక, చెట్ల కిందే అవస్థలు పడుతున్నారు. ఈ ఆశ్రమంలో మొత్తం 51 గదులు ఉన్నాయి. ..:: శిరీష చల్లపల్లి ముప్పయి గదులు ఖాళీగానే ఉంటాయి మా నాన్న ఇదే ఆశ్రమంలో వాచ్‌మెన్‌గా చేసేవారు. ఉద్యోగంలో ఉండగానే ఆయన మరణించడంతో, ఈ ఉద్యోగం నాకు దొరికింది. ముప్పయ్యేళ్లుగా ఇక్కడే చేస్తున్నాను. నా జీతం రూ.2,257 మాత్రమే. నా భార్య ఇక్కడి వాళ్లకు వంటలు చేస్తుంటుంది. ఆమెకు నెలకు రెండువేలు జీతం వస్తుంది. ఇంత చౌకగా ఇక్కడ గదులు దొరుకుతున్నా, ఈ ఆశ్రమంలో ఎప్పుడూ కనీసం ముప్పయి గదులు ఖాళీగానే ఉంటాయి. ఉస్మానియా ఆస్పత్రికి వచ్చే రోగులు ఎక్కువమంది చదువుకోని వారే. సమాచారం లేకపోవడంతోనే వారు ఇక్కడకు రాలేకపోవచ్చు. ఉస్మానియాలోని డాక్టర్లను, పోలీసులను రోగులు ఎవరైనా అడిగితే, ఈ ఆశ్రమం గురించి చెబుతున్నారు. అలా కొందరు ఇక్కడకు వస్తున్నారు. ఇలాంటి ఆశ్రమాలు ప్రతి ధర్మాసుపత్రి దగ్గర ఉంటే రోగులకు కాస్త ధైర్యంగా ఉంటుంది. - బాలాజీ, వాచ్మెన్ బస్టాండే గతి అయ్యేది.. మాది ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల. నేను పదో తరగతి చదువుతున్నాను. మా అమ్మకు గర్భసంచిలో గడ్డలు ఉన్నాయని ఈరోజే చెప్పారు. వేరే కేన్సర్ ఆస్పత్రికి వెళ్లమని రాసిచ్చారు. ఈ రాత్రికి ఎక్కడకు వెళ్లాలో తెలియక రోడ్డు మీదే కూర్చుండిపోయాం. మా అమ్మ నడవలేదు. ఎక్కడకు వెళ్లాలన్నా నేనే మోసుకుంటూ తీసుకువెళ్లాలి. రోడ్డు మీద కూర్చున్న మమ్మల్ని గమనించిన ఉస్మానియా సిబ్బంది డాక్టరుగారికి చెప్పారు. ఆయన ఈ ఆశ్రమం దారి చూపారు. ఆయన సాయం లేకపోతే మాకు బస్టాండే గతి అయ్యేది. - సిద్ధం రవి పోలీసు సారు చెప్పాడు.. మాది నల్లగొండ జిల్లా. చేనేత కార్మికులం. నా భర్త లక్ష్మీనారాయణ కిడ్నీ పేషెంట్. ఆయనకు నెలకు పదిసార్లు డయాలిసిస్ చేయించాలి. ఐదునెలలుగా ఇక్కడే ఉంటున్నాం. ఇదివరకు ఎప్పుడూ సిటీకి రాలేదు. అద్దెకు గదుల కోసం గల్లీగల్లీ తిరిగి పరేషాన్ అయ్యాను. లాడ్జిలో అడిగితే రోజుకు రూ.800 అడిగారు. ఉస్మానియా ఆస్పత్రి దగ్గర పోలీసు సారుని అడిగితే, ఈ ఆశ్రమం గురించి చెప్పారు. ఇక్కడకు వచ్చాక కాస్త ఊపిరి పీల్చుకున్నాం. - మల్లమ్మ డాక్టరుగారు సాయం చేశారు.. మాది వరంగల్. నేను మిల్లులో పనిచేసి రిటైరయ్యా. నా కొడుకు దివాకర్ లాయర్. ఓ యాక్సిడెంట్లో అతడి కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. ఆరు నెలలుగా కోమాలోనే ఉన్నాడు. ఉస్మానియాకి వచ్చిన మొదట్లో వారం పాటు చెట్ల కిందనే పడుకున్నాను. అప్పుడు డాక్టరుగారు రూ.వెయ్యి ఇచ్చి, ఈ ఆశ్రమంలో ఉండమని చెప్పారు. - జి.సనిమయ్య -
కూలిన మెట్రోపొలిస్ స్వాగత ద్వారం
యువకుడి దుర్మరణం మరో ఇద్దరికి తీవ్రగాయాలు హైదరాబాద్: మెట్రోపొలిస్ సదస్సు కోసం ఏర్పాటు చేసిన స్వాగత ద్వారం యువకుడిని బలి తీసుకుంది. ఎంతో అట్టహాసంగా మెట్రోపొలిస్ సదస్సు కోసం నగరంలో పలు ప్రాంతాల్లో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. అందులో రాయదుర్గంలోని సర్వే నంబర్ 83 వద్ద ఏర్పాటు చేసిన ద్వారం ఆదివారం కూలిపోయింది. అదే సమయంలో అటుగా వాహనంపై వస్తున్న పృథ్వీసేనారెడ్డిపై పడింది. తీవ్రంగా గాయపడ్డ అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళుతున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం, నూతంకి గ్రామానికి చెందిన బి.పృథ్వీసేనారెడ్డి (29) నిజాంపేటలో నివాసముంటున్నాడు. నానక్‌రాంగూడలోని హిటాచీ కంపెనీలో హౌస్‌కీపింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం విధులు ముగించుకుని కోకాపేటలోని స్నేహితుని ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం కంపెనీకి వచ్చాడు. విధుల్లో ఉన్న సూపర్వైజర్ శేఖర్‌కు చెందిన బైక్‌పై ఉదయం 11 గంటల సమయంలో ఇంటికి బయలుదేరాడు. అదేసవుయుంలో రాయదుర్గం సర్వేనంబర్ 83లోని ఎం హోటల్ సమీపంలో జీహెచ్ఎంసీ మెట్రోపొలిస్ సదస్సు కోసం ఏర్పాటు చేసిన స్వాగత ద్వారం కుప్పకూలి పృథ్వీసేనారెడ్డిపై పడింది. దీంతో అతని తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే అటుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న వెంకటేశ్వరరావు (30), రవిప్రసాద్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరు మాదాపూర్‌లోని ఇన్ఫోటెక్లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళుతున్నారు. ప్రస్తుతం కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా పృథ్వీసేనారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన రాయదుర్గం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఉస్మానియా’ పనులు 4 ఏళ్లు పెండింగా?
ఎంఎస్ఐడీసీ అధికారులపై డిప్యూటీ సీఎం ఆగ్రహం హైదరాబాద్: రాష్ట్ర వైద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఎంఎస్ఐడీసీ) పనితీరుపై ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణం కోసం నిధులు మంజూరై నాలుగేళ్లు గడిచినా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడాన్ని తప్పుపట్టారు. సోమవారం సచివాలయంలో వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా, ఎంఎస్ఐడీసీ ఎండీ రవిచంద్ర, వైద్యవిద్య సంచాలకుడు పుట్టా శ్రీనివాస్ తదితరులతో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి నాలుగేళ్ల క్రితం 200 కోట్లు మంజూరైనా నేటికీ పైసా కూడా ఖర్చు చేయని అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. స్థలం సమస్య సాకు చూపి మంజూరైన నిధులు ఖర్చు చేయకపోతే ఎలా అని రాజయ్య ప్రశ్నించారు. ఏటా 50 కోట్లు ఖర్చు చేసినా ఈపాటికే ఉస్మానియా నూతన భవన నిర్మాణం పూర్తయి కార్యకలాపాలు ప్రారంభమయ్యేవని అభిప్రాయపడ్డారు. ఆంధ్రపాలకుల నిర్లక్ష్యం, సంస్థలోని కొందరు అధికారుల అవినీతి, అలసత్వంవల్ల పనులు ఆగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఎంఎస్ఐడీసీ పనులేవీ పెండింగ్‌లో ఉండడానికి వీల్లేదని, ఉన్న నిధులన్నీ కచ్చితంగా వాడుకోవాలని ఆదేశించారు. చంచల్‌గూడ వద్దనున్న స్థలంలో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనాన్ని సాధ్యమైనంత తొందర్లో నిర్మించేలా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అవినీతి, వసూళ్ల కేంద్రంగా ఎంఎస్ఐడీసీ మారుతున్నాయనే ఆరోపణలను సమావేశంలో ప్రస్తావించారు. ఒక ఉన్నతాధికారి, ఫార్మాసిస్టు కలసి సంస్థను అవినీతి కూపంగా మార్చారని ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఎంఎస్ఐడీసీని విభజించినప్పటికీ సాంకేతిక కారణాలవల్ల అధికారులను నియమించలేదు. తొందర్లోనే తెలంగాణ ఎంఎస్‌ఐడీసీకి పూర్తిస్థాయి యంత్రాంగాన్ని సమకూర్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. -
అఫ్జల్ పార్కును పునరుద్ధరిస్తాం
మూసీ నది ప్రక్షాళనకు సహకరించండి గ్రేటర్ కమిషనర్ సోమేష్ కుమార్ దత్తాత్రేయనగర్: ఉస్మానియా ఆస్పత్రి వెనుక గేటు వద్ద గల అఫ్జల్ పార్కును పునరుద్ధరించి సుందరంగా తీర్చి దిద్దుతామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ తెలిపారు. మూసీ ఒడ్డున గల చింతచెట్టు 150 మందిని రక్షించి సెప్టెంబర్ 28 నాటికి 106 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం సెంటర్ ఫర్ డెక్కన్ స్టడీస్, ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఇండియాలో తనకు బాగా నచ్చిన చారిత్రక నగరం హైదరాబాద్ అన్నారు. నవాబుల కాలం నాటి ఈ పార్కు గత వైభవాన్ని తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఇందుకోసం వెంటనే కార్యాచరణ ప్రారంభిస్తామన్నారు. అదే విధంగా మూసీ నది ప్రక్షాళనకు అన్ని విభాగాల అధికారులతో పాటు ప్రజల సహకారం అవసరమన్నారు. ముఖ్యంగా ప్రజలు మూసీలో చెత్త వేయకుండా సహకరించాలన్నారు. అనంతరం ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం.వేదకుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్ చరిత్రను మలుపు తిప్పిన 1908 మూసీ నదికి వచ్చిన వరదతో నాటి పాలనా యంత్రాంగం వివిధ రంగాల నిపుణులతో కలిసి పలు పథకాలు చేపట్టిందన్నారు. దీంతో హైదరాబాద్ ఆధునిక సిటీ ప్లానింగ్‌కు ఒక ఉదాహరణగా మారిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రణాళికా రహిత వృద్ధి కారణంగా సమస్యలు పెరుగుతున్నాయన్నా రు. ఈ నేపథ్యంలోనే సెంటర్ ఫర్ డెక్కన్ స్టడీస్, ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్‌లు నగర సమస్యలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ డెక్కన్ స్టడీస్ కార్యదర్శి సజ్జద్ షాహిద్, ఏకే హైమద్, జగన్ రెడ్డి, అన్వర్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
సుధాకర్‌రావుకు జీవిత సాఫల్య పురస్కారం
తొర్రూరు : ఐమెడికా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో పాలకుర్తి టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.సుధాకర్‌రావు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. సుధాకర్‌రావు వరంగల్ కేఎంసీలో ఎంబీబీఎస్, ఉస్మానియా మెడికల్ కళాశాలల్లో ఇంటర్నల్ మెడిసన్‌లో ఎండీ పూర్తి చేశారు. పీజీఐ చండీగఢ్‌లో డీఎం (ఎండోక్రినోలజీ ) పూర్తి చేశారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రిలో ఎండోక్రినోలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రిలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా, యశోద, కామినేని ఆస్పత్రుల్లో కన్సల్టెం ట్‌గా, హైదరాబాద్ సొసైటీఆఫ్ ఎండోక్రినోలజీకి అధ్యక్షుడిగా, ఏఐఏఏఆర్ఓకు ఉపాధ్యక్షుడితోపాటు రెండు దశాబ్దాలపాటు వైద్య, విద్య, బోధన రంగంలో ప్రజలకు చేసిన సేవలు, పరిశోధనలకు గుర్తిం పుగా ఈ అవార్డును అందజేశారు. నిమ్స్ వైద్యులు శాంతరావు, బీఫిన్, ఆర్కే. సాయో, వసంతకుమార్ చేతుల మీదుగా డాక్టర్ సుధాకర్‌రావు పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా సుధాకర్‌రావు మాట్లాడుతూ దేశంలోనే ఐదుగురు డాక్టర్లకు జీవిత సాఫల్య పురస్కారం దక్కిందన్నారు. ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. -
వేర్వేరు కారణాలతో ముగ్గురి బలవన్మరణం
చౌటుప్పల్ :స్కూల్‌కు వెళ్లలేదని తండ్రి మందలించడంతో మనస్తాపం చెంది, కూతురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కుంట్లగూడెంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోగ సత్యనారాయణ చేనేత కార్మికుడు. ఈయనకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. కుమార్తె బోగ పూజ(13) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. సోమవారం పాఠశాలకు వెళ్లకపోవడంతో తండ్రి ఆమెను మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఓ గదిలోకి వెళ్లి, తలుపులు వేసుకొని, కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. కుటుంబ సభ్యులు చూసి, మంటలను ఆర్పి వేశారు.అప్పటికే బాగా కాలిపోయింది. చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసు ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జమ్మాపురంలో.. జమ్మాపురం (భువనగిరి అర్బన్) : పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని జమ్మాపురంలో గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివారల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్నాబత్తిని రవికుమార్(30)కు మూడు సంవత్సరాల క్రితం మూటకొండూరు గ్రామంలోని సికిందర్‌నగర్‌కు చెందిన స్వాతితో వివాహం జరిగింది. రెండు సంవత్సరాల క్రితం తర్వాత వారి మధ్య విభేదాలు వచ్చి కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి రవికుమార్ ఒంటరిగానే ఉంటూ మద్యానికి బానిసయ్యాడు. దీంతో అతను మద్యం డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధించసాగాడు.నెల రోజుల నుంచి ఇంట్లో తగాదాలు ఎక్కువ య్యాయి. రవికుమార్ మనస్తాపానికి గురై ఆదివారం సాయంత్రం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు అతడిని భువనగిరి పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఈ మేరకు కేసునమోదు చేసుకున్ని దర్యాప్తు చేస్తున ట్లు రూరల్ ఏఎస్ఐ నర్సింగరావు తెలిపారు. రైలుకిందపడి.. యాదగిరిగుట్ట : రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మండలంలోని రామాజీపేట రైల్వేగేటు సమీపంలో జరిగింది. భువనగిరి రైల్వే హెడ్ కానిస్టేబుల్ బాలాగౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.రంగారెడ్డి జిల్లా హయాత్‌నగర్‌కు చెందిన కళ్యాణ్‌కుమార్ (27 )అదే ప్రాంతంలో ఓ బిస్కెట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతడికి నాలుగు నెలల క్రితం వివాహమైంది. పుట్టుకతోనే మూగవాడు. పెళ్లి జరిగిన తర్వాత కంపెనీలో పనికి సరిగ్గా వెళ్లడం లేదు. దీంతో పెద్దలు మందలించారు. దీంతో అతడు మనస్తాపానికి గురై సోమవారం తెల్లవారుజామున రామాజీపేట రైల్వే గేటు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ మేరకు భువనగిరి రైల్వే హెడ్ కానిస్టేబుల్ బాలాగౌడ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చీకట్లో 'ఉస్మానియా’
- రెండు దఫాలు కరెంట్ కట్ - నిలిచిన శస్త్రచికిత్సలు, వైద్య పరీక్షలు అఫ్జల్‌గంజ్: రాష్ట్రంలోనే పెద్దాస్పత్రిగా ఖ్యాతిగాంచిన ఉస్మానియాకూ విద్యుత్ కోతలు తప్పడం లేదు. సోమవారం ఉదయం 8:30 నుంచి 11:30 గంటల వరకు ఉస్మానియా ఆస్పత్రిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో రోగ నిర్ధారణ పరీక్షలు, శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి. దీంతో రోగులు, వారి సహాయకులు ఆందోళనకు గురయ్యారు. తిరిగి సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వార్డుల్లో చికిత్సలు పొందుతున్న రోగులు, సేవలందిస్తున్న వైద్య సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. దీంతో పాటు వివిధ విభాగాల్లో పని చేసే సిబ్బంది అత్యవసరమైన ఫైళ్లను క్లియర్ చేసేందుకు నానాపాట్లు పడ్డారు. సెల్‌ఫోన్ వెలుగులో ఫైళ్లను క్లియర్ చేశారు. అదే విధంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సీజీ రఘురామ్ సైతం ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన ఫైళ్లను సెల్‌ఫోన్ వెలుగులో పరిశీలించి క్లియర్ చేయాల్సి వచ్చింది. -
ఉస్మానియాలో తెగిన లిఫ్టు వైర్
15 మంది చిక్కుకుపోయిన వైనం ఆపరేటర్ చాకచక్యంతో తప్పిన ప్రమాదం తొలగించి రక్షించిన పోలీసులు అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: ఉస్మానియా ఆసుపత్రి పాత భవనంలోని లిఫ్టు హఠాత్తుగా మధ్యలో నిలిచిపోయింది. అందులో చిక్కుకుపోయిన రోగులు, వారి సహాయకులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సుమారు రెండు గంటల పాటు లిఫ్టులో ఊపిరాడక నరకయాతన అనుభవించారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఈ సంఘటన జరిగింది. రెండో అంతస్తు నుంచి కిందకు వస్తున్న ఈ లిఫ్టులో ఆసుపత్రి వైద్యులు సాంబిరెడ్డి, హెల్త్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, ఆయా లక్ష్మీ, లిఫ్టు ఆపరేటర్ సత్యనారాయణలతో పాటు నిలోఫర్ ఆసుపత్రి నుంచి వచ్చిన గర్భిణి శ్రీదేవి, అత్తాపూర్‌కు చెందిన సురేష్ కేతాన్, రమేష్ కేతాన్లతో పాటు మొత్తం 15 మంది ఉన్నారు. లిఫ్టు కిందకు వస్తున్న క్రమంలో హఠాత్తుగా లిఫ్టు వైరు తెగిపోయింది. ఇది గమనించిన లిఫ్టు ఆపరేటర్ సత్యనారాయణ అప్రమత్తమై సమయ స్ఫూర్తిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినప్పటికీ మధ్యలో నిలిచిపోయింది. లిఫ్టు ఒక వైపు కొంచెం ఒరిగి ఉండటంతో అందులో చిక్కుకున్న రోగులు, వారి సహాయకులు పెద్ద పెట్టున అరుపులు, కేకలు పెట్టారు. సుమారు అరగంటసేపు ఎవరూ వీరిని పట్టించుకోకపోవడంతో తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. లిఫ్టు నుంచి సెల్ఫోన్లకు సిగ్నళ్లు అందకపోవడంతో ఈ సమాచారాన్ని చేరవేసేందుకు అష్టకష్టాలు పడ్డారు. చివరకు రమేష్ కేతాన్ సెల్‌ఫోన్ నుంచి అతని స్నేహితుడైన జిఎల్ బిరానియాకు మెసేజ్ అందడంతో.. విషయం పోలీసులకు, ఫైర్ సిబ్బందికి తెలిపి ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నాడు. పోలీసులు, లిఫ్టు మెకానిక్‌లు గ్రిల్స్ తొలగించి అందులో చిక్కుకుపోయిన వారిని నిచ్చెన సహాయంతో కిందకు దింపడంతో రోగుల సహాయకులు, వారి బంధువులు ఆసుపత్రి వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన సంభవించిందని రమేష్ కేతాన్ ఆవేదన వ్యక్తంచేశారు. -
'బాగా పడిపోయిన జగన్ షుగర్ లెవల్స్'
-
'బాగా పడిపోయిన జగన్ షుగర్ లెవల్స్'
హైదరాబాద్ : మూడు ప్రాంతాలకూ సమ న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉస్మానియా ఆస్పత్రిలోనూ కొనసాగుతోంది. ఆయనకు రక్తస్థాయి సాధారణంగా ఉన్నా, షుగర్ లెవల్స్ బాగా పడిపోయాయని ఉస్మానియా వైద్యులు తెలిపారు. ఎనిమిదిమంది వైద్యుల బృందం జగన్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. మంచినీళ్లలోనైనా గ్లూకోజ్ కలిపి తీసుకోవాలని వైద్యులు సూచించినా ఆయన నిరాకరించినట్లు సమాచారం. పరిస్థితి ఇలాగా కొనసాగితే ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని ఆర్ఎంవో డా.రఫీ తెలిపారు. ప్రాణం పోయినా జగన్ దీక్షను కొనసాగిస్తానన్నారని వెల్లడించారు. శుక్రవారం ఉదయం డా.రఫీ మీడియాతో మాట్లాడారు. పల్స్ రేట్ తగ్గిపోతోందని, కీటోన్స్ పెరడటం ప్రమాదకరమన్నారు. జగన్‌కు మరిన్ని పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. నివేదికలు అందిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని రఫీ పేర్కొన్నారు. కాగా వైఎస్ జగన్మోహహన్ రెడ్డి ఆగస్టు 24వ తేదీ సాయంత్రం నుంచి 126 గంటలుగా చంచల్‌గూడ జైల్లో చేస్తున్న దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు గురువారం ప్రయత్నించారు. రాత్రి 11.45 గంటలకు ఆయనను బలవంతంగా ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలోనే జగన్ తన దీక్షను కొనసాగిస్తున్నారు. ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి వైద్యులు ప్రయత్నించగా ఆయన నిరాకరించారు. మరోవైపు జగన్‌ను ఆస్పత్రికి తరలిస్తున్నట్లు తెలుసుకున్న ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ...అప్పటికే ఉస్మానియాకు తరలి వచ్చారు. జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే కార్యకర్తలు, అభిమానులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.