సేవారామం రామ్‌నాథ్ ఆశ్రమం | Ramnath Ashram helos to patients | Sakshi
Sakshi News home page

సేవారామం రామ్‌నాథ్ ఆశ్రమం

Published Mon, Nov 10 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM

సేవారామం రామ్‌నాథ్ ఆశ్రమం

సేవారామం రామ్‌నాథ్ ఆశ్రమం

ఉస్మానియా ఆస్పత్రి.. నిరంతరం రోగులు, వారితో వచ్చిపోయే బంధువులతో కిటకిటలాడుతుంటుంది. రోజూ కనీసం నాలుగు వేల మంది రోగులు వస్తుంటారు. చికిత్స కోసం కొందరు రోజుల తరబడి ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుంది. ఆస్పత్రిలో చికిత్స కోసం చేరే రోగుల సంగతి సరే, మరి వారికి తోడుగా వచ్చిన వారి కుటుంబ సభ్యులు, బంధువుల మాటేమిటి? ఎక్కువగా ఇక్కడకు వచ్చేది పేదరోగులే! వారికి తోడుగా వచ్చేవారు నిలువనీడ లేకుండా అల్లాడుతుండటం ఇక్కడ నిత్యకృత్యం. బయట హోటళ్లు, లాడ్జింగుల్లో గదులు తీసుకునే స్తోమత లేనివారు గత్యంతరం లేక చెట్లనీడనే విశ్రమిస్తుంటారు. ఈ పరిస్థితి ఈనాటిది కాదు. ఉస్మానియా ఆస్పత్రి కట్టించినప్పటి నుంచీ ఇదే పరిస్థితి.
 
1951లో కొందరు వదాన్యులు ఉస్మానియా ఆస్పత్రి వెనుకనే శ్రీరామ్‌నాథ్ ఆశ్రమాన్ని నిర్మించారు. రోగులకు, వారి సహాయకులకు ఇక్కడ కారుచౌకగా గదులను అద్దెకు ఇస్తారు. దశాబ్దాల తరబడి ఇది కొనసాగుతున్నా, నేటికీ దీని గురించి ఎక్కువ మందికి తెలియదు. ఆస్పత్రి వెనుకనే, చౌకగా గదులు దొరికే వీలుందనే విషయం తెలియక చాలామంది ఆరుబయట చెట్ల నీడనే తలదాచుకుంటున్నారు. సేవాదృక్పథంతో ప్రారంభమైన శ్రీరామ్‌నాథ్ ఆశ్రమం ప్రస్తుతం దేవాదాయ శాఖ అధీనంలో పనిచేస్తోంది. రోగులకు, వారి సహాయకులకు నిలువనీడనిచ్చే ఉద్దేశంతో ఏర్పడిన ఈ ఆశ్రమం గురించి ‘సిటీప్లస్’ కథనం..

పాతిక రూపాయలకే గది..
నగరంలో కనీస స్థాయి హోటళ్లు, లాడ్జింగుల్లో సైతం గది అద్దె దాదాపు రోజుకు ఐదువందల వరకు ఉంటుంది. అలాంటిది, శ్రీరామ్‌నాథ్ ఆశ్రమంలో మాత్రం రోజుకు పాతిక రూపాయలకే గది దొరుకుతుంది. పాతిక రూపాయలకు దొరికే గదిలో మంచం, మంచినీళ్ల బిందె మాత్రమే ఉంటాయి. ఫ్యాన్ ఉండదు. ఇదే ఆశ్రమంలో కాస్త మెరుగైన గది నలభై రూపాయలకు దొరుకుతుంది.

నలభై రూపాయలకు దొరికే గదుల్లో ఫ్యాన్, వంటగది, మంచం, మంచినీళ్ల బిందె ఉంటాయి. ఉస్మానియా ఆస్పత్రి చుట్టుపక్కల ఈ ఆశ్రమానికి సంబంధించిన పోస్టర్లు కనిపిస్తాయి. అయితే, ఆస్పత్రికి వచ్చేవారిలో ఎక్కువమంది నిరక్షరాస్యులే కావడంతో, దీని గురించి తెలుసుకోలేక, చెట్ల కిందే అవస్థలు పడుతున్నారు. ఈ ఆశ్రమంలో మొత్తం 51 గదులు ఉన్నాయి.
 ..:: శిరీష చల్లపల్లి
 
ముప్పయి గదులు ఖాళీగానే ఉంటాయి
మా నాన్న ఇదే ఆశ్రమంలో వాచ్‌మెన్‌గా చేసేవారు. ఉద్యోగంలో ఉండగానే ఆయన మరణించడంతో, ఈ ఉద్యోగం నాకు దొరికింది. ముప్పయ్యేళ్లుగా ఇక్కడే చేస్తున్నాను. నా జీతం రూ.2,257 మాత్రమే. నా భార్య ఇక్కడి వాళ్లకు వంటలు చేస్తుంటుంది. ఆమెకు నెలకు రెండువేలు జీతం వస్తుంది. ఇంత చౌకగా ఇక్కడ గదులు దొరుకుతున్నా, ఈ ఆశ్రమంలో ఎప్పుడూ కనీసం ముప్పయి గదులు ఖాళీగానే ఉంటాయి.
 
ఉస్మానియా ఆస్పత్రికి వచ్చే రోగులు ఎక్కువమంది చదువుకోని వారే. సమాచారం లేకపోవడంతోనే వారు ఇక్కడకు రాలేకపోవచ్చు. ఉస్మానియాలోని డాక్టర్లను, పోలీసులను రోగులు ఎవరైనా అడిగితే, ఈ ఆశ్రమం గురించి చెబుతున్నారు. అలా కొందరు ఇక్కడకు వస్తున్నారు. ఇలాంటి ఆశ్రమాలు ప్రతి ధర్మాసుపత్రి దగ్గర ఉంటే రోగులకు కాస్త ధైర్యంగా ఉంటుంది.
- బాలాజీ, వాచ్‌మెన్
 
బస్టాండే గతి అయ్యేది..
మాది ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల. నేను పదో తరగతి చదువుతున్నాను. మా అమ్మకు గర్భసంచిలో గడ్డలు ఉన్నాయని ఈరోజే చెప్పారు. వేరే కేన్సర్ ఆస్పత్రికి వెళ్లమని రాసిచ్చారు. ఈ రాత్రికి ఎక్కడకు వెళ్లాలో తెలియక రోడ్డు మీదే కూర్చుండిపోయాం. మా అమ్మ నడవలేదు. ఎక్కడకు వెళ్లాలన్నా నేనే మోసుకుంటూ తీసుకువెళ్లాలి. రోడ్డు మీద కూర్చున్న మమ్మల్ని గమనించిన ఉస్మానియా సిబ్బంది డాక్టరుగారికి చెప్పారు. ఆయన ఈ ఆశ్రమం దారి చూపారు. ఆయన సాయం లేకపోతే మాకు బస్టాండే గతి అయ్యేది.
 - సిద్ధం రవి
 
పోలీసు సారు చెప్పాడు..
మాది నల్లగొండ జిల్లా. చేనేత కార్మికులం. నా భర్త లక్ష్మీనారాయణ కిడ్నీ పేషెంట్. ఆయనకు నెలకు పదిసార్లు డయాలిసిస్ చేయించాలి. ఐదునెలలుగా ఇక్కడే ఉంటున్నాం. ఇదివరకు ఎప్పుడూ సిటీకి రాలేదు. అద్దెకు గదుల కోసం గల్లీగల్లీ తిరిగి పరేషాన్ అయ్యాను. లాడ్జిలో అడిగితే రోజుకు రూ.800 అడిగారు. ఉస్మానియా ఆస్పత్రి దగ్గర పోలీసు సారుని అడిగితే, ఈ ఆశ్రమం గురించి చెప్పారు. ఇక్కడకు వచ్చాక కాస్త ఊపిరి పీల్చుకున్నాం.
- మల్లమ్మ
 
డాక్టరుగారు సాయం చేశారు..
మాది వరంగల్. నేను మిల్లులో పనిచేసి రిటైరయ్యా. నా కొడుకు దివాకర్ లాయర్. ఓ యాక్సిడెంట్‌లో అతడి కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. ఆరు నెలలుగా కోమాలోనే ఉన్నాడు. ఉస్మానియాకి వచ్చిన మొదట్లో వారం పాటు చెట్ల కిందనే పడుకున్నాను. అప్పుడు డాక్టరుగారు రూ.వెయ్యి ఇచ్చి, ఈ ఆశ్రమంలో ఉండమని చెప్పారు.
- జి.సనిమయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement