పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్ట్‌లకు డిమాండ్
క్యాంప్ టెంట్లకు ఆదరణ
మూడు నెలల ముందే గదుల బుకింగ్
డిసెంబర్ 31, జనవరి 1తో పర్యాటకుల కిక్
అరకు, వంజంగి, లంబసింగికి పోటెత్తుతున్న పర్యాటకులు
విద్యుత్ వెలుగులతో అతిథి గృహాలు కళకళ
సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు సంవత్సరాంత వేడుకల జోష్‌ను పులుముకున్నాయి. డిసెంబర్ 31తో పాటు ఆంగ్ల సంవత్సరాది జనవరి 1 వేడుకలను సంతోషంగా చేసుకునేందుకు పర్యాటకులు మన్యంలోని పర్యాటక ప్రాంతాలను ఎంచుకున్నారు. జిల్లాలోని అనంతగిరి, అరకులోయ, పాడేరు, వంజంగి, చింతపల్లి, లంబసింగి, మోతుగూడెం, మారేడుమిల్లి, రంపచోడవరం ప్రాంతాల్లోని అతిథి గృహాలను పర్యాటకులు, వివిధ వర్గాల ప్రజలంతా మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకున్నారు.
అతిథి గృహాలన్నీ హౌస్‌పుల్
పర్యాటక శాఖకు చెందిన అన్ని అతిథి గృహాలు, రిసార్ట్‌లు ఆన్‌లైన్‌లోనే హౌస్‌పుల్ అయ్యాయి. అనంతగిరిలోని టైడా జంగిల్ బెల్స్‌లో 24, అనంతగిరి హరితలో 28, అరకులోయ మయూరిలో 85, హరితలో 58, లంబసింగిలో 15 గదులు రెండు రోజుల పాటు బుక్ అయ్యాయి. టూరిజం శాఖకు చెందిన అన్ని రిసార్ట్‌లలో రెస్టారెంట్ల సౌకర్యం ఉండడంతో ఈ గదులకు అధిక డిమాండ్ ఉంది.
ప్రైవేట్ హోటళ్లు, రిసార్ట్‌లకూ ఆదరణ
అనంతగిరి, అరకులోయ, వంజంగి, కొత్తపల్లి, లంబసింగి టూరిజం కారిడార్‌గా పర్యాటకుల ఆదరణ మూడేళ్లలో అధికమైంది. దీంతో పర్యాటకుల సంఖ్యకు తగ్గట్టుగానే హోటళ్లు, రిసార్ట్‌ల నిర్మాణాలు భారీగానే జరగ్గా.. వాటికీ ఆదరణ పెరిగింది. టెంట్ సౌకర్యాలు కూడా పెద్దఎత్తున అందుబాటులోకి వచ్చాయి. అనంతగిరి మండలంలో 200, అరకులోయలో 1,200, పాడేరు 100, వంజంగి 100, లంబసింగిలో 200 వరకు అతిథి గృహాలు ఉన్నాయి. అంతే స్థాయిలో టెంట్‌లను కూడా వేస్తున్నారు. సంవత్సరాంత వేడుకలతో అతిథి గృహాలు, రిసార్ట్‌లు, టెంట్ ప్రాంతాలని్నంటినీ నిర్వాహకులు ముస్తాబు చేశారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా విద్యుత్ దీపాల అలంకరణలో కళకళలాడుతున్నాయి.
గోదారి తీరంలోనూ..
కోనసీమ జిల్లాలోని ఓ ప్రైవేట్ రిసార్ట్స్
సాక్షి, అమలాపురం: మెట్రోపాలిటన్ నగరాల నుంచి సంక్రాంతికి మాత్రమే గోదావరి జిల్లాలకు వచ్చే ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు, ప్రజలు ఈసారి ముందుగానే గోదావరి తీరంలో.. ప్రకృతి ఒడిలో.. ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు తరలివస్తున్నారు. వీరందరి రాకతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ రిసార్టులు నిండిపోయాయి. స్థానిక రిసార్టుల్లోని రూములన్నీ డిసెంబర్ 31 నుంచి జనవరి 2వ తేదీ వరకు రెండు నెలల క్రితమే బుకింగ్ అయ్యాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని దిండి రిసార్ట్స్‌తో పాటు ప్రైవేటు సంస్థలకు చెందిన సరోవర్ పోర్టికో, సముద్రా రిసార్ట్‌లు, కాకినాడ జిల్లా గోవలంక వద్ద ఉన్న యానాం రిసార్టు, గోదావరి నదిని, సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న ఫామ్‌హౌస్‌లు, గెస్ట్‌హౌస్‌లు పూర్తిగా నిండిపోయాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం తదితర ప్రధాన ప్రాంతాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి, సిద్ధాంతం తదితర ప్రాంతాల్లోని రిసార్ట్‌లు, ప్రధాన హోటళ్లు పర్యాటకులతో సందడిగా మారాయి.
న్యూ ఇయర్ ఇక్కడే
పర్యాటక ప్రాంతం అరకులోయ, వంజంగి హిల్స్ ప్రాంతాల్లో న్యూ ఇయర్ వేడుకల కోసం ముందుగానే చేరుకున్నాం. గతంలోనే అరకులోయలో ప్రైవేట్ అతిథి గృహాన్ని బుక్ చేసుకున్నాం. కుటుంబ సభ్యులతో వచ్చాం. రెండు రోజులు ఇక్కడే ఉంటాం. ఇక్కడ పర్యాటక ప్రాంతాలు ఎంతో అబ్బురపరుస్తున్నాయి. – అర్ణబ్, పర్యాటకుడు, కోల్‌కతా
Comments
Please login to add a commentAdd a comment