నైవేద్యం స్పెషల్
ఉగాది పండుగ అనగానే గుర్తొచ్చేది పచ్చడి. అటుకుల పాయసం, పూర్ణాలు, బొబ్బట్లు, నేతితో చేసిన హల్వా... అదనపు రుచి! పండుగకు ఒక్కరోజే సెలవు. చదువుల కోసమో, ఉద్యోగ రీత్యానో నగరంలో ఉండేవారు... ఒక్కరోజు పండుగకు ఊళ్లకు వెళ్లలేరు. పండుగను చేసుకోలేరు. అలాంటివారి కోసమే ఉగాదికి నైవేద్యం స్పెషల్ ఐటమ్స్‌ను మెనూలో చేర్చాయి సిటీలోని వివిధ హోటల్స్, రెస్టారెంట్స్.
అటుకుల పాయసం...
పాలతో చేసే పాయసం పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందులోనూ పండుగ స్పెషల్‌గా ఉండే అటుకుల పాయసం అంటే ఇష్టపడని వారుండరు. ఆవునెయ్యి, జీడిప్పు, బాదంపప్పు, సారపప్పులను చిక్కటి పాలను చేర్చి ప్రత్యేకంగా తయారు చేసిన ఈ అటుకుల పాయసానిది నైవేద్యం స్పెషల్‌లో ఫస్ట్ ప్లేస్!
పుత్తడి పూర్ణాలు...
బియ్యపు పిండి, బెల్లం, శనగపప్పు, జీడిపప్పునకు సోంపును చేర్చిన ముద్దను.. బంగారు రంగు వచ్చేవరకు నేతిలో వేయిస్తారు. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ పూర్ణాల రుచి అమోఘం!
బంగారు భక్షాలు...
తెలంగాణస్పెషల్ వంటకం భక్షాలు. వీటినే పోలాలు అని కూడా అంటారు. చపాతీ చేసి మధ్యలో శనగపప్పు, పాత బెల్లం కలిపిన ముద్దను కూర్చి చేసే భక్షాల వాసనకు అందరూ ఫిదా కావాల్సిందే. వీటిని నేతిలో అద్దుకుని తిని చూడండి ఇంకోటి అనక మానరు!
నేతి హల్వా...
ఉడికించిన క్యారెట్ తురుము, డ్రైఫ్రూట్స్‌ని నేతిలో వేయించి... చక్కెర, బెల్లం తురుము, పచ్చి కోవా కలిపి చేసేదే నేతి హల్వా! దీని రుచి చూస్తే వాహ్వా అనాల్సిందే!