సాక్షి, ఖమ్మం: ఆహార ప్రియులకు, బిర్యానీ లవర్స్‌కు అలెర్ట్. వారం మొత్తం కష్టపడి వీకెండ్‌లో ఫ్యామిలితో రెస్టారెంట్లకు,హోటళ్ళకు వెళ్ళి తింటున్నారా.. ఐతే కొంచెం జాగర్తండోయ్.. కొందరికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టం. మరికొందరికి చికెన్ కబాబ్స్ అంటే మరీ లొట్టలేసుకుంటూ లాగించేస్తుంటారు. కానీ అవే ఆహార పదార్ధాలు వారాల కొద్దీ నిల్వ ఉంచి మీకు పెడుతున్నారంటే నమ్ముతారా.. ఇది ముమ్మాటికీ నమ్మలేని నిజమే అని చెప్పాలి. కావాలంటే ఒక్కసారి ఖమ్మం జిల్లాకు వెళ్ళి చూసొద్దాం రండి.
రెస్టారెంటుకు వెళ్ళి డిమ్ లైటింగ్‌లో కూర్చుని వేడి వేడి బిర్యాని, దానికి తగ్గట్టుగా చికెన్ లాలిపప్స్.. చికెన్ 65, చికెన్ కబాబ్స్ తింటుంటే ఉంటుంది. చెబుతుంటేనే నోరూరిపోతుంది కదా. చికెన్, మటన్, ప్రాన్స్, ఇలా ఎన్నోరకాల వంటలు రెస్టారెంట్లలో,హోటళ్ళలో దొరుకుతాయి. కానీ తస్మాత్ జాగ్రత్త.. అదే ఆహారం విషంగా మారితే మీ పరిస్థితి ఏంటి?.
ఇంటికి ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ వచ్చినా మనం ఏం చేస్తుంటా అలా రెస్టారెంటుకు వెళ్ళి బిర్యానీ తినాలి అనుకుంటాం అలాంటప్పుడు ఎక్కువగా ఫేమస్ రెస్టారెంట్లవైపే మొగ్గు చూపుతుంటాం. ఎందుకంటే పది రూపాయలు ఎక్కువైన సరే ఫుడ్ రుచితో పాటు శుభ్రత, నాణ్యతా ప్రమాణాలు కూడా పాటిస్తారని.. అందులో తింటే ఆరోగ్యానికి పెద్దగా ప్రమాదం ఉండదన్న గట్టి నమ్మకం
అయితే ఆ గట్టి నమ్మకం కాస్త ఇప్పుడు గుడ్డి నమ్మకమని ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో తేలిపోయింది. రుచికి, శుభ్రతకు పెట్టింది పేరు అంటూ ఊదరగొట్టే పెద్ద పెద్ద పేరు మోసిన హోటళ్లు, రెస్టారెంట్ల బండారాలు బయటపడుతున్నాయి. కుళ్లిపోయిన మాంసం, ఎక్స్‌పైరీ డేట్ దాటిన ప్రొడక్ట్స్, కల్తీ మసాలాలు, ఏమాత్రం నాణ్యత లేని పదార్థాలను వాడటమే కాక.. అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని సిద్ధం చేస్తున్నట్టు సోదాల్లో అధికారులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ రూల్స్ కూడా సరిగా పాటించడం లేదని అధికారులు వెల్లడించారు. అయితే ఇలాంటి పరిస్థితులు ఒకటో రెండో రెస్టారెంట్లలో కాదండోయ్. నగరంలో ఫేమస్ అయిన చాలా రెస్టారెంట్లలో ఇదే సీన్ కనిపించటం ఆందోళనకరం.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పేరున్న రెస్టారెంట్లు, హోటళ్లలో ఫ్రీజర్లో దాచిన చికెన్ కబాబ్స్, ప్లాస్టిక్ బకెట్లలో మ్యారినేట్ చేసిన చికెన్, బ్యాచ్ నంబర్ లేని మసాలా ప్యాకెట్లు, మ్యానిఫ్యాక్చరింగ్ గడువు లేని పసుపు, ఎక్స్పైరీ డేట్ దాటిన సరుకులు, రూల్స్ అతిక్రమించి పామాయిల్ వినియోగం...ఇలా పలు లోపాలను, మోసాలను గుర్తించారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల ఫుడ్సేఫ్టీ కంట్రోల్ ఆఫీసర్ జ్యోతిర్మయి టాస్క్‌ఫోర్స్ టీమ్‌తో కలిసి ఉమ్మడి
ఖమ్మం జిల్లాలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు.
హోటల్లో తనిఖీల సందర్భంగా సిబ్బంది ఎవరికీ హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేవని తెలుసుకున్నారు .నాణ్యత లేని ఆహార పదార్థాలు సీజ్ చేశారు. శాంపిల్స్ను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. ఓ హోటల్లో ఫ్రీజర్లో నిల్వ చేసిన 12 కిలోల చికెన్ కబాబ్స్‌ను గుర్తించిన అధికారులు, వాటిని రూల్స్ ప్రకారం మున్సిపల్ సిబ్బందికి అప్పగించాల్సి ఉండగా.. అక్కడే డ్రైనేజీలో పారబోయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిర్వాహకులు చపాతి, పరోటా పిండిని కలిపి ప్లాస్టిక్ కవర్లలో పెట్టి ఫ్రిజ్లో నిల్వ ఉంచారు. చికెన్ ధమ్ బిర్యానీ కోసం మ్యారినేట్ చేసిన చికెన్‌ను ప్లాస్టిక్ బకెట్లో నిల్వ చేశారు. దీంతో మ్యారినేట్ చేసిన చికెన్‌ను కూడా బయటపడేయించారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉంచడంపై అధికారులు ఫైర్ అయ్యారు. స్టోరూమ్స్ ఎక్స్పైరీ అయిన జీలకర్ర, బ్రాండెడ్ కాని జీడిపప్పు, గోధుమ పిండిని గుర్తించి సీజ్ చేశారు.
ఫుడ్సేఫ్టీ నిబంధనలను పాటించకపోతే పర్మిషన్ రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆహార వస్తువులపై లేబుల్స్, బ్యాచ్ నంబర్లోకపోతే ఫైన్తో పాటు, జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 300 హోటళ్లు, 28 రెస్టారెంట్లు ఉండగా ఏడు నెలల్లో అధికారులు తనిఖీలు చేసి 14 కేసులు మాత్రమే నమోదు చేశారు. హైదరాబాద్ స్థాయిలో ఒత్తిళ్లు వస్తే తప్పా తనిఖీలు చేయరన్న విమర్శలున్నాయి. ఫిర్యాదులు వచ్చినప్పుడు తప్పించి రెగ్యులర్గా సోదాలు చేయరనే ఆరోపణలున్నాయి. మామూళ్ల వ్యవహారం కారణంగా చూసి చూడనట్టు వదిలేస్తారనే విమర్శలున్నాయి.
ఇప్పటికైనా ఆహార భధ్రత అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం నెలకో రెండు నెలలకో తనిఖీలు చేయడం కాకుండా నిత్యం రెస్టారెంట్లు హోటళ్ళపై నిఘా ఉంచాలని, ప్రజల ప్రాణాలకు హాని కలింగించే ఆహార పధార్దాలు ఇలాంటి రెస్టారెంట్లు,హోటళ్ళు వినియోగించకుండా తగు చర్యలు తీసుకోవాలని ఫుడ్ లవర్స్ కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment