సాక్షి, అమరావతి: వంద లీటర్ల నూనెను వినియోగించి వంట చేస్తే 25 లీటర్లు మిగులుతుంది. సాధారణంగా మిగిలిన నూనెను మళ్లీ మళ్లీ మరిగించి వంటకు వాడుతుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి ఎంతో హానికరం. ఈ అంశంపై హోటళ్లు, రెస్టారెంట్‌ల యజమానులకు అవగాహన కల్పిస్తూ.. వాడిన వంట నూనెను బయోడీజిల్ తయారీ సంస్థలకు విక్రయించేలా రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం చర్యలు తీసుకుంటోంది.
ఇలా గత ఏడాదిలో 1,00,257 లీటర్ల వాడిన వంట నూనెను బయో డీజిల్ తయారీ ఏజెన్సీలకు సరఫరా అయ్యేలా చేశారు. రోజుకు 50 లీటర్‌లకు మించి వంట నూనెను వినియోగించే హోటళ్లు, రెస్టారెంట్‌లు, తినుబండారాల తయారీ సంస్థలు జాతీయ ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)లో రిజిస్టరై ఉన్నాయి. ఇలా రిజిస్టరైన సంస్థలన్నీ ఒకసారి వాడిన నూనెను బయోడీజిల్ తయారీ సంస్థలకు విక్రయించాలని గతంలోనే ఉత్తర్వులు జారీ చేశారు.
టీపీసీ 25 శాతానికి మించితే ఆరోగ్యం హుష్
మార్కెట్‌లో నూనెలు ఎక్కువగా వాడే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇతర ఆహార పదార్థాలకు అధిక డిమాండ్ ఉంటోంది. సాధారణంగా కంపెనీ నుంచి తయారై వచ్చిన నూనెలో టోటల్ పోలార్ కౌంట్ (టీపీసీ) 5 నుంచి 7 శాతం ఉంటుంది. ఆయిల్‌ను మరిగించే కొద్దీ టీపీసీ పెరుగుతూ ఉంటుంది. టీపీసీ మోతాదు 25 శాతానికి మించితే ఆరోగ్యానికి చాలా హానికరం.
టీపీసీ మోతాదు పెరిగేకొద్దీ శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి. దీనివల్ల రక్తనాళాలు గట్టిపడటం, అల్జీమర్స్, కాలేయ సంబంధ వ్యాధులు, హైపర్‌టెన్షన్ తదితర అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తోంది. ఇలా వాడటం వల్ల స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఏజెన్సీలే సేకరిస్తాయి
రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్ (రూకో) విభాగంలో బయోడీజిల్‌ను తయారు చేసే అనుమతులు ఉన్న ఏజెన్సీలు గుంటూరు, విశాఖ, కాకినాడ నగరాల్లో ఐదు ఉన్నాయి. ఈ ఏజెన్సీలు రాష్ట్రవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో వాడిన వంట నూనెను సేకరిస్తున్నాయి. ఏజెన్సీల నిర్వాహకులే హోటళ్లు, రెస్టారెంట్‌ల వద్ద ఖాళీ డబ్బాలను అందుబాటులో ఉంచుతారు. ఆ డబ్బాల్లోకి వాడిన నూనెను నింపి సమాచారం ఇస్తే తీసుకునివెళతారు. మార్కెట్‌లో నూనె ధరలకు అనుగుణంగా సేకరించే వాడిన నూనెకు ఏజెన్సీలు డబ్బు చెల్లిస్తాయి. ప్రస్తుతం లీటర్‌కు రూ.40 నుంచి రూ.50 వరకూ చెల్లిస్తున్నారు.
రెండోసారి వాడితే చెడు కొలెస్ట్రాల్ తప్పదు
నూనెను ఒకసారి ఉపయోగిస్తే అందులోని పోషకాలు మొత్తం మనం వాడుకున్నట్టే. తిరిగి ఆ నూనెను వేడి చేస్తే అది చెడు కొలెస్ట్రాల్‌గా మారుతుంది. చెడు కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యానికి హాని చేస్తుంది. నూనెల్ని రెండోసారి వాడితే గుండె జబ్బులే కాకుండా ఉదరకోశ, అన్నవాహిక క్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఒకసారి వాడిన నూనెను తిరిగి ఉపయోగిస్తే.. ఆహారం విషతుల్యమవుతుంది. దీనిని భుజిస్తే కడుపులో మంట, కడుపులో నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment