Biodiesel
-
నూనె మళ్లీ మళ్లీ మరిగించొద్దు.. చెడు కొలెస్ట్రాల్‌తో గుండెకు ముప్పు.. ఇంకా..
సాక్షి, అమరావతి: వంద లీటర్ల నూనెను వినియోగించి వంట చేస్తే 25 లీటర్లు మిగులుతుంది. సాధారణంగా మిగిలిన నూనెను మళ్లీ మళ్లీ మరిగించి వంటకు వాడుతుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి ఎంతో హానికరం. ఈ అంశంపై హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులకు అవగాహన కల్పిస్తూ.. వాడిన వంట నూనెను బయోడీజిల్ తయారీ సంస్థలకు విక్రయించేలా రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం చర్యలు తీసుకుంటోంది. ఇలా గత ఏడాదిలో 1,00,257 లీటర్ల వాడిన వంట నూనెను బయో డీజిల్ తయారీ ఏజెన్సీలకు సరఫరా అయ్యేలా చేశారు. రోజుకు 50 లీటర్లకు మించి వంట నూనెను వినియోగించే హోటళ్లు, రెస్టారెంట్లు, తినుబండారాల తయారీ సంస్థలు జాతీయ ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ)లో రిజిస్టరై ఉన్నాయి. ఇలా రిజిస్టరైన సంస్థలన్నీ ఒకసారి వాడిన నూనెను బయోడీజిల్ తయారీ సంస్థలకు విక్రయించాలని గతంలోనే ఉత్తర్వులు జారీ చేశారు. టీపీసీ 25 శాతానికి మించితే ఆరోగ్యం హుష్ మార్కెట్లో నూనెలు ఎక్కువగా వాడే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇతర ఆహార పదార్థాలకు అధిక డిమాండ్ ఉంటోంది. సాధారణంగా కంపెనీ నుంచి తయారై వచ్చిన నూనెలో టోటల్ పోలార్ కౌంట్ (టీపీసీ) 5 నుంచి 7 శాతం ఉంటుంది. ఆయిల్‌ను మరిగించే కొద్దీ టీపీసీ పెరుగుతూ ఉంటుంది. టీపీసీ మోతాదు 25 శాతానికి మించితే ఆరోగ్యానికి చాలా హానికరం. టీపీసీ మోతాదు పెరిగేకొద్దీ శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి. దీనివల్ల రక్తనాళాలు గట్టిపడటం, అల్జీమర్స్, కాలేయ సంబంధ వ్యాధులు, హైపర్‌టెన్షన్ తదితర అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తోంది. ఇలా వాడటం వల్ల స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏజెన్సీలే సేకరిస్తాయి రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్ (రూకో) విభాగంలో బయోడీజిల్‌ను తయారు చేసే అనుమతులు ఉన్న ఏజెన్సీలు గుంటూరు, విశాఖ, కాకినాడ నగరాల్లో ఐదు ఉన్నాయి. ఈ ఏజెన్సీలు రాష్ట్రవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో వాడిన వంట నూనెను సేకరిస్తున్నాయి. ఏజెన్సీల నిర్వాహకులే హోటళ్లు, రెస్టారెంట్ల వద్ద ఖాళీ డబ్బాలను అందుబాటులో ఉంచుతారు. ఆ డబ్బాల్లోకి వాడిన నూనెను నింపి సమాచారం ఇస్తే తీసుకునివెళతారు. మార్కెట్లో నూనె ధరలకు అనుగుణంగా సేకరించే వాడిన నూనెకు ఏజెన్సీలు డబ్బు చెల్లిస్తాయి. ప్రస్తుతం లీటర్‌కు రూ.40 నుంచి రూ.50 వరకూ చెల్లిస్తున్నారు. రెండోసారి వాడితే చెడు కొలెస్ట్రాల్ తప్పదు నూనెను ఒకసారి ఉపయోగిస్తే అందులోని పోషకాలు మొత్తం మనం వాడుకున్నట్టే. తిరిగి ఆ నూనెను వేడి చేస్తే అది చెడు కొలెస్ట్రాల్‌గా మారుతుంది. చెడు కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యానికి హాని చేస్తుంది. నూనెల్ని రెండోసారి వాడితే గుండె జబ్బులే కాకుండా ఉదరకోశ, అన్నవాహిక క్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఒకసారి వాడిన నూనెను తిరిగి ఉపయోగిస్తే.. ఆహారం విషతుల్యమవుతుంది. దీనిని భుజిస్తే కడుపులో మంట, కడుపులో నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. -
Used Cooking Oil: పదే పదే మరిగించి వాడటం ప్రమాదకరం
హోటళ్లు, ఇళ్లల్లో వంట నూనెలను ఒకటి, రెండు సార్లు మాత్రమే వినియోగించాలి. పదే పదే మరిగించి వాడడం ప్రమాదకరం. అధిక ఉష్ణోగ్రత వద్ద తరచూ వంట నూనెలను వినియోగించడంతో మానవ జీర్ణ ప్రక్రియపై ప్రభావం పడుతుంది. డీజిల్ ధరలు పెట్రోలు ధరలతో పోటీ పడుతున్నాయి. పెరుగుతున్న డీజిల్ ధరలతో వాహనచోదకులు కుదేలవుతున్నారు. ఈ సమస్యకు ఒకే ఒక పరిష్కారం.. వాడిన వంట నూనెల నుంచి బయో డీజిల్ ఉత్పత్తి చేయడం. ఈ నేపథ్యంలో నగరంలో అధిక పరిమాణంలో వంట నూనె వాడే హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార ఉత్పత్తి తయారీదారుల నుంచి వినియోగించిన వంట నూనెను పెద్దాపురానికి చెందిన ఓ కంపెనీ సేకరిస్తోంది. సాధారణంగా మిగిలిపోయిన వంటనూనెను బయట పారబోయడం, తోపుడుబండి వ్యాపారులకు విక్రయించడం చేస్తుంటారు. కొంతమంది అక్రమార్కులు ఈ నూనెను ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు కూడా. కల్తీ నూనెను విక్రయించకుండా నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మిగులు వంట నూనెను బయోడీజిల్ తయారీ కంపెనీలకు విక్రయించేలా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. పెదవాల్తేరు(విశాఖ తూర్పు): హోటల్ వ్యాపారులు ప్రతి నెలా వంటనూనె వాడకం, మిగిలిన నూనె వినియోగం వివరాలను పెదవాల్తేరులోని ఆహార భద్రత శాఖ కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. వంటనూనె అధిక పరిమాణంలో వినియోగించే హోటళ్లు ముందుగా ఆహార భద్రతా శాఖ నుంచి లైసెన్సులు తీసుకోవాలి. తద్వారా కల్తీనూనెకు చెక్ పెట్టవచ్చని అధికారుల ఆలోచన. రాష్ట్రంలో ఐదు కంపెనీలు బయోడీజిల్‌ను తయారు చేస్తున్నాయి. ఒకసారి వాడిన వంట నూనెను పదే పదే వినియోగించడం ఆరోగ్యానికి హానికరం. ఇటువంటి ఆయిల్‌తో చేసిన ఆహారాన్ని తింటే క్యాన్సర్, రక్తపోటు, కాలేయ సంబంధ వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బయో డీజిల్ ఉత్పత్తి కోసం పెద్దాపురం ప్రాంతానికి చెందిన ఓ కంపెనీ నగరంలోని పెద్ద హోటళ్ల నుంచి వినియోగించిన నూనెను సేకరిస్తోంది. రిజిస్ట్రేషన్ తప్పనిసరి వంట నూనెలో నాణ్యత ప్రమాణం 25 శాతానికి మించరాదు. దీనిని టోటల్ పోలార్ కాంపౌండ్(టీపీసీ) అంటారు. ఇది తాజా వంట నూనెలో 7 శాతం, రెండోసారి వాడితే 15 నుంచి 18 శాతం, మూడో సారి 24 శాతంగా ఉంటుంది. టీపీఏ 25 శాతం దాటితే వినియోగించరాదని నిబంధనలు ఉన్నాయి. రోజుకు 50 లీటర్ల కన్నా అధిక పరిమాణంలో నూనె వినియోగించే హోటళ్లు, రెస్టారెంట్లు, మిఠాయి దుకాణాలు, ఆహార తయారీ సంస్థలు ఆహార భద్రత శాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి నెలా ఎంత నూనె కొనుగోలు చేశారు? ఎంత వాడారు? ఎంత మిగిలింది? వంటి వివరాలను అధికారులకు అందజేయాలి. అనంతరం ఆహార భద్రత శాఖ అధికారులు ఆడిట్ నిర్వహిస్తారు. సాధారణంగా 100 లీటర్ల వంట నూనె వినియోగిస్తే 25 లీటర్ల వరకు మిగులుతుందని నిపుణులు చెబుతున్నారు. బయోడీజిల్‌తో కల్తీ నూనెకు చెక్ అధిక పరిమాణంలో నూనె వినియోగించే హోటళ్లు, ఇతర సంస్థలు మిగులు నూనెను బయోడీజిల్ తయారీ కంపెనీలకు విక్రయించాలి. ఫలితంగా కల్తీ నూనెకు చెక్ పెట్టవచ్చు. వాడిన నూనెను పదే పదే వినియోగిస్తే క్యాన్సర్ వంటి వ్యాధులు సోకుతాయి. పెద్దాపురం ప్రాంతానికి చెందిన ఓ కంపెనీ ఇప్పటికే నగరంలోని హోటళ్ల నుంచి వినియోగించిన నూనెను సేకరిస్తోంది. – జి.ఎ.వి.నందాజీ, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, ఆహార భద్రత శాఖ, పెదవాల్తేరు -
బయో డీజిల్ పేరుతో ఇంధన దందా
సాక్షి, యాదాద్రి: బయో డీజిల్ పేరుతో సాగుతున్న కృత్రిమ డీజిల్ దందాను సోమవారం స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొండమడుగు పారిశ్రామిక వాడ కేంద్రంగా కొంతమంది వ్యక్తులు గుజరాత్‌లోని ప్రైవేట్ రీఫైనరీల నుంచి ద్రవపదార్థాలను తీసుకొచ్చి వాటికి కొన్ని రసాయనాలు కలిపి కృత్రిమ డీజిల్ తయారు చేసి వినియోగదారులకు అమ్ముతున్నారు. పెట్రోల్ బంక్‌లలో లభించే డీజిల్ మాదిరిగానే ఈ కృత్రిమ డీజిల్‌తో వాహనాలు నడుస్తుండటంతో, వాహనాలకు మైలేజీ కూడా అధికంగా వస్తుండటంతో అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. పెట్రోల్ బంకుల్లో లభించే డీజిల్ రేట్లు ఆకాశన్నంటుతుండటం, ఈ కృత్రిమ డీజిల్ లీటరు రూ.85 నుంచి రూ.90లకే లభిస్తుండటంతో ప్రైవేటు ట్రావెల్స్, భారీ వాహనాల వినియోగదారులు ఈ డీజిల్‌నే ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ్నుంచే హైదరాబాద్, గుంటూరు, తిరుపతి తదితర పట్టణాలకు ఈ కృత్రిమ డీజిల్‌ను సరఫరా చేస్తున్నారు. గత మూడు నెలలుగా ఆయిల్ ట్యాంకర్లలో డీజీల్ తీసుకువచ్చి బీబీనగర్ మండలం కొండమడుగు వద్ద గోదాంలో నిల్వ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాహనాలను సిద్ధం చేసుకున్నారు. ఇక్కడి నుంచి వాహనదారులకు, కొన్ని పెట్రోల్ బంక్‌లకు తమ వాహనాల ద్వారా సరఫరా చేస్తున్నారు. కొనుగోలు దారులను డీజిల్ అని నమ్మించేందుకు తెల్లని ద్రవ ప్రదార్థంలో పసుపు రంగు పౌడర్‌ను కలుపుతున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున రంగుప్యాకెట్లను సైతం నిల్వ ఉంచారు. విషయం తెలుసుకున్న ఎస్వోటీ పోలీసులు కొండమడుగు పారిశ్రామిక వాడలోని గోదాంపై సోమవారం దాడులు చేసి కృత్రిమ డీజిల్ ట్యాంకర్లను పట్టుకున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మేనేజర్ చిరాగ్‌పటేల్, ఈ డీజిల్‌ను కొనుగోలుచేస్తున్న సీఎంఆర్ ట్రావెల్స్ యజమాని, మరికొందరిపై కేసు నమోదు చేశారు. విచారణ జరుపుతున్నాం: ఎస్ఓటీ కృత్రిమ డీజిల్ ఘటనపై విచారణ జరుపుతున్నామని భువనగిరి జోన్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ ఎ. రాములు తెలిపారు. డీజిల్ లాగానే ఉన్న ఈ ద్రవ పదార్థాన్ని నిర్ధారణ పరీక్షల కోసం ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌కు పంపించినట్లు చెప్పారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం వాస్తవాలు విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. -
‘బయో’ బస్సులు భేష్
సాక్షి, సిటీబ్యూరో : నగరంలో ‘బయో’ బస్సులు పరుగులు తీస్తున్నాయి. ప్రస్తుతం 19 డిపోల్లో బయోడీజిల్‌ను వినియోగిస్తున్నారు. గ్రేటర్‌లోని 29 డిపోల్లో ఉన్న 3572 బస్సులను సైతం ఈ ఇంధనం పరిధిలోకి తెచ్చేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. పర్యావరణ ప్రమాణాలను కాపాడడం, కాలుష్య కారకాల నియంత్రణ లక్ష్యంతో ఇప్పటికే సీఎన్జీ బస్సులు నడుపుతున్న గ్రేటర్ ఆర్టీసీ....ఆ దిశగా బయో ఇంధనానికి శ్రీకారం చుట్టింది. సాధారణ హైస్పీడ్ డీజిల్‌కు 10 శాతం చొప్పున బయో డీజిల్‌ను వినియోగిస్తున్నారు. దీనివల్ల ఇంధనం పూర్తిగా మండి కాలుష్యకారకాలు తగ్గుతాయి. ప్రతి రోజు 250 కిలోమీటర్ల చొప్పున తిరిగే ఒక బస్సు సాధారణంగా 55 లీటర్ల హైస్పీడ్ డీజిల్‌ను వినియోగిస్తుండగా దానికి 10 శాతం చొప్పున బయోడీజిల్‌ను వినియోగిస్తున్నారు. అంటే 49.5 లీటర్ల హైస్పీడ్ డీజిల్‌కు 5.5 లీటర్ల బయోడీజిల్‌ను వినియోగిస్తున్నారు. ఈ లెక్కన నగరంలో ప్రస్తుతం 23,569 లీటర్ల బయోడీజిల్‌ను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇంధనానికి అయ్యే ఖర్చులో రోజుకు రూ.94,276 చొప్పున ఏటా రూ.3.40 కోట్ల ఇంధన వ్యయం ఆదా అవుతోంది. ప్రయోగాత్మకంగా అమలు... ప్రజారవాణా వాహనాలకు సహజ ఇంధనాలను వినియోగించాలన్న భూరేలాల్ కమిటీ సిఫార్సుల మేరకు ఆర్టీసీ ప్రత్యేక కార్యాచరణకు దిగింది. మేడ్చల్, హకీంపేట్, కంటోన్మెంట్ డిపోలలో సీఎన్జీ బస్సులను ప్రవేశపెట్టింది. దశలవారీగా అన్ని డిపోలను సీఎన్జీ పరిధిలోకి తేవాలని భావించినప్పటికీ డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడంతో 138 బస్సులకే పరిమితమయ్యారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా బయో ఇంధనంపై దృష్టి సారించారు. అప్పట్లో దిల్సుఖ్నగర్–పటాన్చెరు మధ్య కొన్ని ‘బయో’బస్సులను నడిపారు. హైస్పీడ్ డీజిల్‌కు 5 శాతం, 10 శాతం, 20 శాతం చొప్పున మూడు కేటగిరీల్లో బయో ఇంధన వినియోగాన్ని పరీక్షించారు. 20 శాతం వినియోగించిన బస్సుల్లో ఇంజన్‌తో పాటు, కొన్ని విడిభాగాలు పాడైపోయాయి. అలాగే 5 శాతం వినియోగించిన బస్సుల్లో ఇంధనం పూర్తిస్థాయిలో మండకపోవడం వల్ల సల్ఫర్ వంటి హానికారకాలు అలాగే ఉండిì పోయాయి. 10 శాతం బయోడీజిల్ వినియోగించిన బస్సుల్లో ఇంధనం పూర్తిగా మండిపోయి సల్ఫర్ వంటి కాలుష్యకారకాలను నియంత్రించగలిగినట్లు ఆర్టీసీ ఇంజనీరింగ్ నిపుణులు అంచనాకు వచ్చారు. పైగా బయోడీజిల్‌లో ఇమిడి ఉండే 11 శాతం ఆక్సీజన్ కాలుష్యకారకాలను పూర్తిగా మండించేందుకు దోహదం చేస్తున్నట్లు గుర్తించారు. అప్పట్లో సదరన్ బయో డీజిల్ సంస్థతో ధరల విషయంలో ఒక అంగీకారం కుదకరపోవడంతో సరఫరా నిలిచిపోయింది. తిరిగి 2016 నుంచి వినియోగిస్తున్నారు. బయోడీజిల్ వినియోగం వల్ల వాతావరణ కాలుష్యానికి కళ్లెం పడడమే కాకుండా ఆర్టీసీకి డీజిల్ ఖర్చు బాగా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో బయో డీజిల్ వినియోగం చేపట్టాలి. ఇదీ లెక్క ... ఆర్టీసీలో మొత్తం బస్సులు : 35720 బయోడీజిల్ బస్సులు : ప్రస్తుతం 2550 సీఎన్జీ బస్సులు : 138 ఒక లీటర్ హైస్పీడ్ డీజిల్ పైన దూరం: 4.5 కిలోమీటర్లు బయోడీజిల్ వల్ల : 4.7 కిలోమీటర్లు సీఎన్జీ వల్ల : 5 కిలోమీటర్లు గ్రేటర్ హైదరాబాద్‌లో సిటీ బస్సులు ప్రతి రోజు 10.09 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. ప్రతిరోజు 42,275 ట్రిప్పులలో 33 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. -
ఆర్టీసీ బస్సుల్లో బయోడీజిల్ ప్రయోగం
– ప్రయోగాత్మకంగా నాలుగు డిపోల్లో అమలు – ప్రతి తొమ్మిది లీటర్ల డీజిల్‌లో ఒక లీటర్ కలిపి వినియోగం – ప్రయోగాత్మకంగా నాలుగు డిపోల్లో అమలు ఆళ్లగడ్డ: పర్యావరణానికి అనుకూలమైన జీవ ఇంధనం (బయోడీజిల్) వినియోగంపై ఏపీఎస్ ఆర్టీసీ దష్టి సారించింది. బయోడీజిల్ వినియోగంతో లాభనష్టాలను పరిశీలించేందుకు ప్రయోగాత్మకంగా అడుగులు వేసింది. పర్యావరణం పరిరక్షణతో పాటు సంస్థపై ఆర్థిక భారం కూడా కొంత తగ్గుతుందనే ఆలోచనతో అధికారులు ప్రయోగాన్ని ప్రారంభించారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బయోడీజిల్ వాడకాన్ని కొంత కాలంగా వినియోగిస్తోంది. అక్కడ ఇప్పటికే 20 శాతం బయోడీజిల్, 80 శాతం డీజిల్‌తో బస్సులను నడుపుతుండగా ఇటీవల పూర్తిగా బయో డీజిల్ నడిచే బస్సులనూ కూడా ప్రవేశ పెట్టింది. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ బయోడీజిల్ వినియోగంపై దష్టి సారించారు. ప్రస్తుతం ఇక్కడ 10 శాతం బయోడీజిల్, 90 శాతం డీజిల్ వాడుతూ బస్సులను నడుపుతున్నారు. దీని ఫలితాలు ఎలా ఉంటాయనే అంశంపై పరిశీలించేందుకు మొదటగా జిల్లాలోని ఆళ్లగడ్డ, ఆత్మకూరు, కోవెలకుంట్ల, ఆదోని –2 డిపోల్లో బయో డీజిల్ ప్రారంభించారు. డీజిల్ రూ. 57.60 కాగా బయో డీజిల్ రూ 55.53 (ప్రస్తుతానికి) కావడంతో ప్రతి లీటర్‌కు రూ 2.7 ఆదా అవుతోంది. ఈ లెక్కన ప్రతి వంద లీటర్లకు రూ.207 మిగులుతుందని అధికారులు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో పరిశీలన ఆర్టీసీ బస్సులకు బయోడీజిల్ వినియోగం విషయంలో పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్నారు. దాదాపు ఐదు నెలలుగా వినియోగిస్తు ఎటువంటి ప్రయోజనం ఉంది. కేఎంపీఎల్ తగ్గిందా.. పెరుగుతోందా.. ఇతర సాంకేతిక ఇబ్బందులు ఏమైనా వస్తున్నాయా... అన్నది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీని ఆధారంగా జిల్లాలోని మిగిలిన డిపోల్లో అమలు చేయడం, బయోడీజిల్ వినియోగ శాతం పెంచడం తదితర చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపోలో 82 బస్సులు ఉంగా. వీటిలో 79 బస్సులు షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయి. ఇందులో అద్దె బస్సులు పోను 52 బస్సులకు బయోడీజిల్ వినియోగిస్తున్నారు. వీటికి రోజుకు సగటున 3000 నుంచి 3500 లీటర్ల వరకు డీజిల్ వినియోగిస్తున్నారు. ఈ లెక్కన నెలకు 1.05 లక్షల లీటర్ల డీజిల్ వాడుతుండగా ఇందులో సుమారు 10 వేల లీటర్లు బయో డీజిల్‌ను వినియోగిస్తున్నారు. ప్రస్తుతానికి ఇబ్బందులు లేవు: కిరణ్‌కుమార్, డిపో మేనేజర్ ఐదు నెలలుగా బయోడీజిల్ వాడకంతో పెద్దగా ఎటువంటి ఇబ్బందులు లేవు. ప్రస్తుతానికి సంస్థ బస్సులకు మాత్రమే వినియోగిస్తున్నాం. అద్దె బస్సులకు వినియోగించడం లేదు. ఇంకా కొన్ని రోజులు పూర్తిగా పరిశీలించాల్సి ఉంది. -
బయోడీజిల్ వాడకాన్ని తోసిపుచ్చిన బెంజ్
బెంగళూరు : భారత్ లో విక్రయించే కార్లు, ఇతర వాహనాల్లో బయోడీజిల్ వాడకాన్ని జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తోసిపుచ్చింది. తమ వెహికిల్స్ లో బయోడీజిల్ వాడాలనుకోవడం లేదని తెలిపింది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీకి ఈ విషయంపై జర్మన్ లగ్జరీ కారు మేకర్ క్లారిటీ ఇచ్చింది. అటువంటి అవకాశానికి కంపెనీ కట్టుబడి లేదని పేర్కొంది. బయోడీజిల్ తో బెంజ్ కార్లు రూపొందించాలనుకుంటున్నట్టు తాము ఎప్పుడూ రవాణా మంత్రికి చెప్పలేదని మెర్సిడెస్ బెంజ్ టాప్ ఎగ్జిక్యూటివ్ రోనాల్డ్ ఫోల్గర్ స్పష్టంచేశారు. అనేక సందర్భాల్లో తాము కలుసుకున్నామని, భారత్ స్టేజ్-VI వంద శాతం లభ్యత గురించే చర్చించినట్టు.. బయో డీజిల్ వెహికిల్స్ ప్రవేశం గురించి తాము ఎప్పుడూ చర్చించలేదని ఆయన తెలిపారు. 'మై మెర్సిడెస్, మై సర్వీస్' ప్రోగ్రామ్ ను భారత్ లో ఆవిష్కరిస్తున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 100 శాతం బయోడీజిల్ ను మెర్సిడెస్ తన కార్లలో, ట్రక్కులో వాడేందుకు కమిట్ అయినట్టు, కంపెనీ తనకు లేఖ పంపినట్టు నితిన్ గడ్కారీ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. తమ కార్లలో 100 శాతం బయోడీజిల్ ను వాడుకుంటామని తెలుపుతూ కంపెనీకి లేఖ రాసినట్టు మంత్రి తెలిపారు. -
వాడిన నూనెతో బయోడీజిల్
పదే పదే మరగించిన నూనె వాడటం వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతందని శాస్త్రం చెబుతుంది. బోలెడంత డబ్బు పోసి కొంటున్న నూనెను ఒకసారి మాత్రమే ఎలా వాడి పడేయగలమన్నది హోటళ్లు, ఆహార పరిశ్రమ వర్గాల బాధ. ఈ సమస్యకు ఓ చక్కటి పరిష్కారాన్ని కనుక్కున్నారు ఢిల్లీ ఐఐటీ విద్యార్థులు. వాడేసిన వంటనూనెను బయోడీజిల్‌గా మార్చే ఓ యంత్రాన్ని అభివృద్ధి చేశారు. నిజానికి ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ అనే ప్రక్రియ ద్వారా ఏ నూనెనైనా బయోడీజిల్‌గా మార్చవచ్చునని చాలాకాలంగా తెలుసు. కాకపోతే ఎవరికి వారు వాడుకునే రీతిలో పరికరం మాత్రం లేకపోయింది. అభిషేక్ శర్మ, హర్షిత్ అగర్వాల్, మోహిత్ సోని అనే ముగ్గురు ఐఐటీ విద్యార్థులు ఈ కొరతను తీర్చారు. వాషింగ్ మెషీన్ సైజులో ఉండే ఈ యంత్రంతో బయోడీజిల్ తయారు చేసుకోవడం చాలా సులువని వారు అంటున్నారు.