బయోడీజిల్ వాడకాన్ని తోసిపుచ్చిన బెంజ్
బెంగళూరు : భారత్ లో విక్రయించే కార్లు, ఇతర వాహనాల్లో బయోడీజిల్ వాడకాన్ని జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తోసిపుచ్చింది. తమ వెహికిల్స్ లో బయోడీజిల్ వాడాలనుకోవడం లేదని తెలిపింది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీకి ఈ విషయంపై జర్మన్ లగ్జరీ కారు మేకర్ క్లారిటీ ఇచ్చింది. అటువంటి అవకాశానికి కంపెనీ కట్టుబడి లేదని పేర్కొంది. బయోడీజిల్ తో బెంజ్ కార్లు రూపొందించాలనుకుంటున్నట్టు తాము ఎప్పుడూ రవాణా మంత్రికి చెప్పలేదని మెర్సిడెస్ బెంజ్ టాప్ ఎగ్జిక్యూటివ్ రోనాల్డ్ ఫోల్గర్ స్పష్టంచేశారు.
అనేక సందర్భాల్లో తాము కలుసుకున్నామని, భారత్ స్టేజ్-VI వంద శాతం లభ్యత గురించే చర్చించినట్టు.. బయో డీజిల్ వెహికిల్స్ ప్రవేశం గురించి తాము ఎప్పుడూ చర్చించలేదని ఆయన తెలిపారు. 'మై మెర్సిడెస్, మై సర్వీస్' ప్రోగ్రామ్ ను భారత్ లో ఆవిష్కరిస్తున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 100 శాతం బయోడీజిల్ ను మెర్సిడెస్ తన కార్లలో, ట్రక్కులో వాడేందుకు కమిట్ అయినట్టు, కంపెనీ తనకు లేఖ పంపినట్టు నితిన్ గడ్కారీ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. తమ కార్లలో 100 శాతం బయోడీజిల్ ను వాడుకుంటామని తెలుపుతూ కంపెనీకి లేఖ రాసినట్టు మంత్రి తెలిపారు.