హోటళ్లు, ఇళ్లల్లో వంట నూనెలను ఒకటి, రెండు సార్లు మాత్రమే వినియోగించాలి. పదే పదే మరిగించి వాడడం ప్రమాదకరం. అధిక ఉష్ణోగ్రత వద్ద తరచూ వంట నూనెలను వినియోగించడంతో మానవ జీర్ణ ప్రక్రియపై ప్రభావం పడుతుంది. డీజిల్ ధరలు పెట్రోలు ధరలతో పోటీ పడుతున్నాయి. పెరుగుతున్న డీజిల్ ధరలతో వాహనచోదకులు కుదేలవుతున్నారు. ఈ సమస్యకు ఒకే ఒక పరిష్కారం.. వాడిన వంట నూనెల నుంచి బయో డీజిల్ ఉత్పత్తి చేయడం. ఈ నేపథ్యంలో నగరంలో అధిక పరిమాణంలో వంట నూనె వాడే హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార ఉత్పత్తి తయారీదారుల నుంచి వినియోగించిన వంట నూనెను పెద్దాపురానికి చెందిన ఓ కంపెనీ సేకరిస్తోంది.
సాధారణంగా మిగిలిపోయిన వంటనూనెను బయట పారబోయడం, తోపుడుబండి వ్యాపారులకు విక్రయించడం చేస్తుంటారు. కొంతమంది అక్రమార్కులు ఈ నూనెను ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు కూడా. కల్తీ నూనెను విక్రయించకుండా నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మిగులు వంట నూనెను బయోడీజిల్ తయారీ కంపెనీలకు విక్రయించేలా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు.
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): హోటల్ వ్యాపారులు ప్రతి నెలా వంటనూనె వాడకం, మిగిలిన నూనె వినియోగం వివరాలను పెదవాల్తేరులోని ఆహార భద్రత శాఖ కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. వంటనూనె అధిక పరిమాణంలో వినియోగించే హోటళ్లు ముందుగా ఆహార భద్రతా శాఖ నుంచి లైసెన్సులు తీసుకోవాలి. తద్వారా కల్తీనూనెకు చెక్ పెట్టవచ్చని అధికారుల ఆలోచన. రాష్ట్రంలో ఐదు కంపెనీలు బయోడీజిల్‌ను తయారు చేస్తున్నాయి. ఒకసారి వాడిన వంట నూనెను పదే పదే వినియోగించడం ఆరోగ్యానికి హానికరం. ఇటువంటి ఆయిల్‌తో చేసిన ఆహారాన్ని తింటే క్యాన్సర్, రక్తపోటు, కాలేయ సంబంధ వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బయో డీజిల్ ఉత్పత్తి కోసం పెద్దాపురం ప్రాంతానికి చెందిన ఓ కంపెనీ నగరంలోని పెద్ద హోటళ్ల నుంచి వినియోగించిన నూనెను సేకరిస్తోంది.
రిజిస్ట్రేషన్ తప్పనిసరి
వంట నూనెలో నాణ్యత ప్రమాణం 25 శాతానికి మించరాదు. దీనిని టోటల్ పోలార్ కాంపౌండ్(టీపీసీ) అంటారు. ఇది తాజా వంట నూనెలో 7 శాతం, రెండోసారి వాడితే 15 నుంచి 18 శాతం, మూడో సారి 24 శాతంగా ఉంటుంది. టీపీఏ 25 శాతం దాటితే వినియోగించరాదని నిబంధనలు ఉన్నాయి. రోజుకు 50 లీటర్ల కన్నా అధిక పరిమాణంలో నూనె వినియోగించే హోటళ్లు, రెస్టారెంట్లు, మిఠాయి దుకాణాలు, ఆహార తయారీ సంస్థలు ఆహార భద్రత శాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి నెలా ఎంత నూనె కొనుగోలు చేశారు? ఎంత వాడారు? ఎంత మిగిలింది? వంటి వివరాలను అధికారులకు అందజేయాలి. అనంతరం ఆహార భద్రత శాఖ అధికారులు ఆడిట్ నిర్వహిస్తారు. సాధారణంగా 100 లీటర్ల వంట నూనె వినియోగిస్తే 25 లీటర్ల వరకు మిగులుతుందని నిపుణులు చెబుతున్నారు.
బయోడీజిల్‌తో కల్తీ నూనెకు చెక్
అధిక పరిమాణంలో నూనె వినియోగించే హోటళ్లు, ఇతర సంస్థలు మిగులు నూనెను బయోడీజిల్ తయారీ కంపెనీలకు విక్రయించాలి. ఫలితంగా కల్తీ నూనెకు చెక్ పెట్టవచ్చు. వాడిన నూనెను పదే పదే వినియోగిస్తే క్యాన్సర్ వంటి వ్యాధులు సోకుతాయి. పెద్దాపురం ప్రాంతానికి చెందిన ఓ కంపెనీ ఇప్పటికే నగరంలోని హోటళ్ల నుంచి వినియోగించిన నూనెను సేకరిస్తోంది.
– జి.ఎ.వి.నందాజీ, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, ఆహార భద్రత శాఖ, పెదవాల్తేరు
Comments
Please login to add a commentAdd a comment