వాడిన నూనెతో బయోడీజిల్
పదే పదే మరగించిన నూనె వాడటం వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతందని శాస్త్రం చెబుతుంది. బోలెడంత డబ్బు పోసి కొంటున్న నూనెను ఒకసారి మాత్రమే ఎలా వాడి పడేయగలమన్నది హోటళ్లు, ఆహార పరిశ్రమ వర్గాల బాధ. ఈ సమస్యకు ఓ చక్కటి పరిష్కారాన్ని కనుక్కున్నారు ఢిల్లీ ఐఐటీ విద్యార్థులు. వాడేసిన వంటనూనెను బయోడీజిల్‌గా మార్చే ఓ యంత్రాన్ని అభివృద్ధి చేశారు.
నిజానికి ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ అనే ప్రక్రియ ద్వారా ఏ నూనెనైనా బయోడీజిల్‌గా మార్చవచ్చునని చాలాకాలంగా తెలుసు. కాకపోతే ఎవరికి వారు వాడుకునే రీతిలో పరికరం మాత్రం లేకపోయింది. అభిషేక్ శర్మ, హర్షిత్ అగర్‌వాల్, మోహిత్ సోని అనే ముగ్గురు ఐఐటీ విద్యార్థులు ఈ కొరతను తీర్చారు. వాషింగ్ మెషీన్ సైజులో ఉండే ఈ యంత్రంతో బయోడీజిల్ తయారు చేసుకోవడం చాలా సులువని వారు అంటున్నారు.